MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
అధ్యాత్మిక వాణి
భక్తి మార్గము – జ్ఞాన మార్గము
నిర్వహణ: సుధేష్ పిల్లుట్ల | చిలుకూరి సత్యదేవ్
సుధేష్ పిల్లుట్ల
మానవ జన్మ సార్ధకత మోక్ష పురుషార్ధములోనే ఉన్నది. వేదాంత పరంగా చూస్తే “అహమస్మి” అనే అనుభవపూర్వకమైన జ్ఞానమే మోక్షం. ఈ గమ్యం చేరుకోడానికి సాధన మార్గములేవి? అని చూస్తే కర్మ యోగం, జ్ఞాన యోగం, సమాధి యోగం మరియు భక్తి యోగములని మనం విన్నాము. ఇక్కడ భక్తి అంటే సగుణ ఈశ్వర భక్తి అని అర్ధము. అన్ని నదులు సముద్రములో చేరినట్లు ఈ నాలుగు మార్గములలో ఏ మార్గమును తీసుకున్ననూ మనము మోక్షం పొందగలమని మనలో ఒక సాధారణ నమ్మకమున్నది.
కాని అద్వైత పరముగా చూస్తే “జ్ఞానాదేవతు కైవల్యం” అనేది ఉపనిషద్వాక్యం. అంటే జ్ఞానము తప్ప వేరొక మార్గములేదని అద్వైతము చెబుతున్నది. భగవద్గీతలో కర్మయోగం ద్వారా జ్ఞానయోగ్యత సంపాదించి, జ్ఞానయోగం ద్వారా జ్ఞాన ప్రాప్తిపొంది మోక్షమును పొందమని కృష్ణ భగవానుడు మనకిచ్చిన ఉపదేశం. జ్ఞానమే మోక్షసాధనకు దారి అని “సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే” అన్ని కర్మలు జ్ఞానంలో పరిసమాప్తమని కృష్ణుని బోధన.
ఆత్మ జ్ఞానమే మోక్షమునకు మార్గమనే దానికి వేదమే ప్రమాణము. పురుషసూక్తము విద్య తప్ప అన్య మార్గము లేదని అంటుంది.
ధాతా పురస్తాద్యముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చత స్రః
తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే
ఒకసారే చెబితే సరిపోదని మరొకసారి చెబుతున్నది.
వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్
తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతేయనాయ
ఇంతే కాక శ్వేతాస్వతర ఉపనిషత్తులో జ్ఞానమార్గము కాకుండా మరొక మార్గములో మోక్ష సాదన ఎంత కష్టమో తెలియచేయడానికి
యదా చర్మవదాకాశం వేష్టయిష్ట్యంతి మానవః
తదా దేవమవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి
అంటే జ్ఞానముతో కాక ఇతర మార్గములో సంసార దుఃఖమును పోగొట్టుకోవాలంటే ఆకాశాన్నంతా ఒక చర్మమును చుట్టినట్లు చుట్టగలగాలని అంటుంది. అంటే అది సాధ్యము కాదని అర్థము.
మరి భక్తి -మార్గము కానే కాదా అనే ప్రశ్న వస్తుంది.
కృష్ణద్వైపాయనుడు అందించిన శ్రీమద్భాగవతములో ఏకాదశ స్కంధములోని “ఉద్ధవ గీతలో” కృష్ణుడు కొంతమంది మహానుభావుల సగుణ భక్తి ద్వారానే మోక్షాన్ని పొందారని చెబుతాడు.
కేవలేన హి భావేన గోప్యో గావో నగా మృగా:
యేన్యే మృడధియో నాగా: సిద్దా మామీయురజ్జసా
యం న యోగేన సాంఖ్యేన దానవ్రతతపోధ్వరై:
వ్యాఖ్యా స్వాధ్యాయసంన్యాసై: ప్రాప్నుయాద్యత్నవానపి
గోవులు, గోపికలు, చెట్లు, జంతువులు మరియు పాములు కూడా తన మీద భక్తి ద్వారానే తనను పొందవచ్చునని, వీరు ఏ విధమైన వేద పఠనం గాని యోగములు కానీ చేయవలసిన పని లేదని అంటాడు
దీన్ని బట్టి చూస్తే ఉపనిషద్వాక్యం తప్పుగా తోస్తున్నది. వేదవ్యాసుడు వేద భావనకు విరుద్ధంగా వ్రాస్తారా అనే ప్రశ్న వస్తుంది. భాగవతములో చెప్పినట్లు సగుణభక్తి కూడా మోక్షమునకు ఒక సాధనమా లేక వేదములలో చెప్పినట్లు జ్ఞానమే మోక్షానికి మార్గమనే అనే ప్రశ్నను మనము మీమాంస ద్వారా విమర్శించి తెలుసుకోవాలి .
మీమాంసవాదనని అనుసరించి చూస్తే, ఎప్పుడైనా రెండు శాస్త్రములు ఒకదానికి భిన్నంగా ఒకటి చెబుతుంటే ప్రామాణికమైన శాస్త్రమునే మనము తీసుకోవాలి. మనకు వేదములు స్వతః ప్రమాణములు, భాగవతము స్మృతి శాస్త్రము కాబట్టి వేదము చెప్పిందే మనము ప్రమాణముగా తీసుకోవాలి. వేదములో చెప్పినదే చెప్పినంత వరకు స్మృతి శాస్త్రానికి ప్రమాణ స్థానమున్నది. ఇది కూడా సంప్రదాయమే చెప్పింది
శృతి స్మృత్యో పరంవాదే శృతిరేవ గరీయసి
వేదాంతము సంసారబంధనానికి కారణం అవిద్య అంటుంది.తర్కశాస్త్రము ప్రకారం చూస్తే ఎలాగయితే చీకటిని వెలుతురు తప్ప ఇంక ఏది పారదోయలేదో అదే విధంగా అజ్ఞానాన్ని జ్ఞానం తప్ప మరియొకటి తీయలేదు.
ఉద్దవ గీతలో భక్తి మార్గమును బోధించిన అదే కృష్ణుడు భగవద్గీతలో
జ్ఞానేన తు తదజ్ఞానం
యేషాం నాశిత మాత్మనః
జ్ఞానదీపం ద్వారానే అజ్ఞానమనే చీకటి పోతుంది అని బోధించాడు.
కాబట్టి తర్క మీమాంసముల బట్టి సగుణభక్తి మోక్షానికి మార్గము కాదని చెప్పవచ్చు.
పోనీ సగుణ భక్తి ద్వారా జ్ఞానం కలుగుతుందా? అది కూడా సరి అయినది కాదు. కేవలం శ్రవణ, మనన నిదిధ్యాసాలతోనే జ్ఞానం ప్రాప్తిస్తుంది. భౌతిక శాస్త్ర అజ్ఞానాన్ని ఆశాస్త్ర విద్యాభ్యాసము ద్వారానే తుడిపివేయగలము. అంతే కాని ఒక శాస్త్రజ్ఞుని పేరు జపం చేసిన లేక విద్యాలయం చుట్టూ ప్రదక్షిణం చేసిన ఆ అజ్ఞానం పోదు. అ శాస్త్రాన్ని సరియిన పద్దతిలో అభ్యసించాలి. ఆత్మజ్ఞానము కూడా అంతే. ఈశ్వర నామజపము వల్ల కాని, తీర్ధయాత్రలవల్ల కాని జ్ఞానము రాదు.
భగవంతుడు సర్వశక్తిమంతుడే అయినా, తనకు తానూ మనకు జ్ఞానాన్ని ఇవ్వలేడు. ప్రకృతిలో మనకు కావాల్సిన గమ్యంతో బాటు ఆ గమ్యం చేరుకోడానికి కావలసిన గమనాన్ని కూడా ప్రకృతిలోనే ఉంచాడు. ఎలాగయితే ఆకలి తీర్చుకోడానికి కావలసిన ఆహారాన్ని ప్రకృతిలోనే ఉంచి ఆ ఆహారాన్ని సంపాదిచడానికి కావలసిన వ్యవసాయాత్మికా బుద్ధిని, ఆ బుద్ధితో వాడుకోడానికి కరణములు మనకు ఇచ్చాడో అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని జగత్తులో తన శక్తిగా ఉంచి అది అందుకోడానికి బుద్ధిని ఇచ్చి జ్ఞానాన్నివేదముల రూపంగా మనకు ఇచ్చాడు. తెలుసుకోవాలన్న ఇచ్చాశక్తినిచ్చి గురుముఖతః ఆ జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు. అన్ని ఇచ్చి ఉద్దరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ అని మనలను మనమే ఉధ్ధరించుకోమన్నాడు. మన ప్రయత్నం లేకుండా మనకు జ్ఞాన ప్రాప్తి వస్తుందని ఎక్కడా అనలేదు.
కాబట్టి సగుణ భక్తి జ్ఞానాన్ని ఇవ్వలేదు. అధ్యాత్మిక సాధనే జ్ఞానాన్నిస్తుంది. అదికూడా కృష్ణుడే అన్నాడు
తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవాయా
ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన:
మరి రమణమహర్షి లాంటి జీవన్ముక్తులు ఎలాంటి జ్ఞానసాధన లేకుండానే, ఒక గురువుకూడా లేకుండా మోక్షమును పొందారని అంటారు కాదా? దానికికూడా కృష్ణుడు గీతలో సమాధానం ఇచ్చాడు
శుచీనాం శ్రీమతాం గేహే
యోగభ్రష్టోపజాయతే
పూర్వజన్మలో కర్మయోగ మరియు జ్ఞానయోగ సాధన చేసి అనుభవపూర్వకమైన జ్ఞానం పొందేలోపలే మరణిస్తే మరు జన్మలో యోగభ్రష్టులుగా జన్మించి జ్ఞానం పొందుతారు.
ఒకవేళ కర్మ జ్ఞానయోగాల మార్గముకాక సగుణ భక్తితో ఈశ్వర ప్రేమలోనే జీవితం గడిపితే ఇక ప్రయోజనం లేదా? దీనికి కూడా గీతలో సమాధానం కనబడుతుంది
అగ్నిర్జ్యోతి రహః శుక్లః షన్మాసా ఉత్తరాయణం
తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదోజనాః
అంటే సగుణభక్తితో అమితమైన ప్రేమతో భగవధ్యానంలో జీవితం గడిపి ఎలాంటి జ్ఞాన సముపార్జన లేకుండా మరణిస్తే మానవుడు శుక్ల గతిలో ప్రయాణించి మరుజన్మలో ఒక గురువు ద్వారా జ్ఞాని అవుతారు. దీనిని క్రమముక్తి అని అంటారు. ఉధ్ధవ గీతలో చెప్పిన భక్తి, ఈవిధంగా క్రమ ముక్తికి దారి తీస్తుంది.
ఈ విధంగా అద్వైత దృక్పధం తో అధ్యయనం చేస్తే సగుణ భక్తి అనేది ఒక మార్గంగా కనపడదు.
మరి భక్తి అనేది అసలులేదా? భక్తి ఒక మార్గము కాదు అనే కాని భక్తి లేదు అని చెప్పలేదు.
ఏదైనా ఒక మార్గంలో సాధన చేయాలంటే ఆ సాధన త్రికరణాలములలో ఏదో ఒకటి ఉపయోగించి చేయవలసినదే.
సాధన కర్మ రూపంలో చేస్తే అది కర్మయోగమవుతుంది. సాధన వాక్రూపేణ మరియు మానసంగా చేస్తే అది ఉపాసనయోగం అవుతున్నది. అదే సాధన బుద్ధి రూపేణ స్వాధ్యాయంగా చేస్తే అది జ్ఞానయోగమవుతుంది. ఈవిధంగా చూస్తే మనం భక్తి అనుకోని చేసే పూజపునస్కారాలు, జపములు, పారాయణములు, తపస్సు, భగవన్నామసంకీర్తన మొదలైనవి కర్మయోగము లేక ఉపాసనాయోగముల కిందికి వస్తాయి.
చేసిన కర్మ కర్మయోగమవ్వాలంటే ప్రతి కర్మ ఈశ్వరార్పణ భావంతో చేయాలి మరియు ప్రతి కర్మఫలము ఈశ్వర ప్రసాదముగా భావించాలి. అప్పుడు కర్మ చిత్తశుద్ధికి దోహదమౌతుంది. మనము చేసే ధ్యానము ఉపాసన యోగమవ్వాలంటే ఆ ధ్యానము చిత్త ఏకాగ్రత కోసం చేయాలి. మనము చేసే జ్ఞాన సముపార్జన కేవలం పుస్తక పరిజ్ఞానానికే కాక మోక్షదాయకం అవ్వాలంటే అది నిదిధ్యాసం ద్వారా ఆత్మ జ్ఞానమవ్వాలి.
ఈవిధంగా చూస్తే ఒక భావన లేకపోతే ఏ సాధన సాధ్యానికి దారి తీయదు. ఆ భావనే భక్తి.
భక్తి లేకపోతే ఏ సాధన మోక్షమివ్వదు. కానీ భక్తి ఒక సాధన మార్గం కాదు. భక్తి భౌతిక కర్మగా వ్యక్తమైతే అది కర్మయోగంగా, మానసిక కర్మగా వ్యక్తమైతే అది ఉపాసనాయోగంగా , అదే భక్తి స్వాధ్యాయంలో జ్ఞానయోగంగా సాధనమవుతుంది. ఆ భక్తి తీసివేస్తే ఏ పని సార్ధకమవదు.
భక్తి అంటే భజించుట అనే అక్షరార్ధము, అనగా విభజన కానిది. భక్తి అనగా కలుపుకోనడము. జీవేశ్వర కలయికే భక్తి. కాని ఈశ్వరుడంటే ఎవడో పూర్తిగా తెలుసుకుంటేనే ఆ పరిపూర్ణ కలయిక కుదురుతుంది. పరిపూర్ణ జ్ఞానంలోనే కలయిక ఉంది. ఆ స్థితిలో జ్ఞానం భక్తి రెండు ఏకమౌతాయి. అది నిర్గుణభక్తి. అదే ఆత్మజ్ఞానం కూడాను. ఇది తెలుసుకోక చాల మంది సగుణ భక్తి సాధన మార్గము అని అనుకుంటున్నారు. బ్రహ్మ విద్యను గురు ముఖతః శాస్త్రీయంగా అభ్యసించక పోవడమే దీనికి కారణం. అందుకే గీతలో కృష్ణుడు తస్మాచ్చాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అన్నాడు. శాస్త్రోక్తమైన జ్ఞానమార్గములోనే మానవుడికి మోక్షముంది.
యఃశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరంగతిం
తన కోర్కెల కారణంగా శాస్త్రాన్ని ఉల్లంగించినవారు కార్యసిద్ధి పొందరని సుఖాన్ని మోక్షాన్ని కూడా పొందరని కృష్ణ భగవానుడు మనలను మందలించాడు.
ఓం తత్ సత్
ఇది స్వామి పరమార్థానంద గారి ప్రవచనాస్ఫూర్తితో వ్రాసిన వ్యాసము
***