MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
'సినీ' మధురాలు
ఎన్నో, ఎన్నెన్నో మధురానుభూతులు
మాధవపెద్ది సురేష్ గారి సంగీత స్వర్ణోత్సవం సందర్భంగా...
రావు బాలసరస్వతి & S. జానకి ల తో | K. విశ్వనాథ్ తో |
---|---|
బాలు గారితో | గాయని S. జానకి తో |
ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ తో | లతా మంగేష్కర్ తో |
మాధవపెద్ది సురేష్ చంద్ర
చలన చిత్ర సంగీత దర్శకులు
49 ఏళ్ల నా సంగీత ప్రయాణం లో ఎన్నో, ఎన్నెన్నో మధురానుభూతులు! 1967లో శ్రీ రామ నవమి నాడు ప్రారంభమైన నా స్వర జీవితం చాలా మలుపులు తిరిగింది. అన్నయ్య రమేష్ భావనా కళా సమితి (విజయ వాడ) లో పాటలు పాడే వాడు 1965 నుండీ. అప్పుడు సర్రాజు పాండు రంగా రావు గారు ఎకార్డియన్ వాయించే వారు. ఆయనకీ మద్రాసులో స్థిరపడదామని ఉండేది. మద్రాసు, విజయవాడ మధ్య మాటిమాటికీ తిరగడం చాలా ఇబ్బందిగా ఉండేది ఆయనకి. అన్నయ్య ఒక రోజు నాతో ‘నువ్వు హార్మోనియం వాయించడం నేర్చుకో, మా కచేరీ లలో వాయిద్దువు గాని’ అని చెప్పిన చల్లని వేళ నా జీవితంలో గొప్ప ముహూర్తం !! నాన్న గారు సిమెంట్ ఫేక్టరీ లో (విజయవాడ) ఇంజనీర్ గా పని చేసేవారు. ఆయన వాళ్ళ క్లబ్ నుండి ఒక చిన్న హార్మోనియం తెచ్చి, నాకిచ్చి వాయించమన్నారు. మెల్ల , మెల్లగా పాటలు వాయించడం, పాటల మధ్య బేక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయించడం అలవాటయింది. నాకు భగవంతుడే గురువు !!!. శ్రీ రామ నవమి నుండి భావనా కళా సమితిలో హార్మోనియం వాయిస్తూ మంచి పేరు సంపాదించాను. అన్నయ్య, చంద్ర కాంత (ఇప్పుడు హ్యూస్టన్ లో స్థిరపడింది), జాన్ బాబు ముఖ్య గాయకులు. నాన్న గారు (నాగేశ్వర రావు గారు) ఎకార్డియన్ కొనిచ్చారు. ఆ రోజుల్లో ఎకార్డియన్ కి చాలా క్రేజ్ ఉండేది. ఎకార్డియన్ వాయించడం లో నేను నెంబర్ 1 అని గొప్పగా చెప్పుకో వచ్చును.!!!. అమ్మకి (వసుంధరా దేవి) ఇష్టం ఉండేది కాదు. ఆవిడ సంగీత విద్వాంసురాలు. వీణ, గాత్రం, భరత నాట్యాలలో మూడు డిప్లమోలు చేసింది.
1973 అక్టోబర్ 31 న నాన్న నాలుగు నెలలు కేన్సర్ తో పోరాడి చనిపోయారు. అప్పటికే అన్నయ్య బి.యే. పూర్తి చేసి (కర్నాటక సంగీతం, హిందూస్థానీ సంగీతాల లో ప్రావీణ్యం సంపాదించాడు) 1971 నుండి మద్రాసు సినీ రంగం లో స్థిరపడ్డాడు. టి. చలపతి రావు గారి దగ్గర అసిస్టెంట్ గా ఉంటూ చిత్రాలలో పాటలు పాడుతూ ఉండే వాడు. అప్పటికి నేను కూడా బి.యే. పూర్తి చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండేవాణ్ని. 1973 డిశంబర్ 4 న మద్రాసుకు సుజాత (జి. ఆనంద్ గారి భార్య) గారి ప్రోగ్రాం కి వెళ్లాను. ఘంటసాల గారి జన్మదినోత్సవం.!!!.
అంతే, మద్రాసులో అన్నయ్య ప్రోద్బలంతో స్థిరపడ్డాను. టి.చలపతి రావు గారి వద్ద మొదటి పాట (వినిపించనా –ఎస్.పి. గారు పాడారు –పరివర్తన సినిమా) వాయించాను. ఆయన దయ వలన నేనూ, అన్నయ్య బాగా స్థిరపడ్డాము. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, తుళు, ఒరియా మొదలైన అన్ని భాషలలో ఎంతో మంది సంగీత దర్శకుల వద్ద 1974 నుండి 1990 వరకు సుమారు 1400 సినిమాలకి కీ బోర్డ్ ప్లేయర్ గా చాలా మంచి గుర్తింపు, పేరూ సంపాదించుకున్నాను---భగవంతుడి దయ వలన.
ఎస్.పి.బాల సుబ్రమణ్యం గారి ఆర్కెస్ట్రా లో 1975 నుండి 1986 వరకూ పని చేయడం నా జీవితంలో మరచి పోలేను. ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన 90% సినిమాలన్నింటికీ నేనే కీ బోర్డ్ ప్లేయర్ని. 1979 నుండి విదేశాలలో ప్రోగ్రాములకి ఆయనతో వెళ్ళేవాడిని.
ఎంతో మంది మహానుభావులతో పని చేసే సువర్ణావకాశాలు నాకు లభించాయి. ఎన్నో మరపు రాని అనుభూతులు.
ఒక సారి పెండ్యాల గారి రికార్డింగ్ కి పని చేస్తున్నప్పుడు నా పెద్ద పర్సు పోయింది. దాంట్లో 400 రూపాయలు, మర్నాడు ఎస్.పి. బాలు గారి కచేరీకి హైదరాబాద్ ఫ్లైట్ టిక్కట్టు ఉన్నాయి. వెతుకుతుంటే పెండ్యాల గారు నా వద్దకు వచ్చి “ఏమిటి నాయనా, పర్సు పోయిందిట కదా” అని బాధ పడి, ‘పోన్లే, సంగీతానికి సంబంధించిన వాళ్ళే ఎవరో తీసి ఉంటారు. పాపం , వాళ్ళకేం అవసరం వచ్చిందో” అన్నారు. అని, నాకు వద్దన్నా వినకుండా 500 రూపాయలు ఇచ్చి, ఫ్లైట్ టిక్కెట్టు కొనిచ్చారు. ఎంత ప్రేమో కదా ఆయనకి నేనంటే! జీవితంలో మర్చిపోలేను. ఏనాడూ ఎవర్నీ పల్లెత్తు మాట అనే వారు కాదు.
నా దృష్టి లో పెండ్యాల గారు ముత్తు స్వామి దీక్షితులు గారు, ఎస్. రాజేశ్వర రావు గారు శ్యామ శాస్త్రి గారు, ఘంటసాల గారు త్యాగరాజ స్వామి - అలా వారు ముగ్గురూ సినిమా పాటకి చాలా హుందాతనం, గొప్పదనం ఆపాదించి పెట్టారు.
ఎస్. రాజేశ్వర రావు గారి అబ్బాయిలు పూర్ణ చంద్ర రావు (గిటార్), వాసూ రావు (గిటార్) గార్లు 1969 నుండి బాగా తెలుసు. మా భావనా కళా సమితి లో వాయించేందుకు మద్రాసు నుంచి ప్రత్యేకం వచ్చే వారు. రాజేశ్వర రావు గారి ప్రోగ్రాములకీ, రికార్డింగులకీ వాయిస్తూ ఉండేవాడిని. నేనంటే ఆయనకీ చాలా ఇష్టం. ‘బృందావనం’ సినిమా (1992) ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా ఆయనని పిలిచాము. నా గురించి ఎంతో బాగా మాట్లాడారు నాన్న గారు. ఆయన్ని అందరం అలాగే పిలిచే వాళ్ళం. “భీం పలాస్, దుర్గా, మోహన రాగాల్లో విజయా సంస్థ ఆత్మని బాగా అర్థం చేసుకుని చాలా బాగా చేశారు. ఆయన దగ్గర మా సీనియర్ దర్శకుల స్టైల్ ఉంది. అందరి దగ్గరా పని చేశారు కదా“ అన్నారు. ఎంత గొప్ప కితాబు!! భైరవ ద్వీపం పాటలు ఆయన ఇంటికి వెళ్లి వినిపిస్తే ఎంతో సంతోషించి ఆనంద భాష్పాలతో, నిండు మనసుతో ఆశీర్వదించారు. ఇవన్నీ ఎలా మరచిపోగలను? అందుకే వీలున్నంత వరకు పెద్ద వాళ్ళ పేరు చెడగొట్టకుండా నా సంగీత యాత్ర కొనసాగిస్తున్నాను.
ప్రముఖ దర్శకులు బాపు గారి ఎన్నో సినిమాలకి (మన ఊరి పాండవులు నుండి) కీ బోర్డ్ ప్లేయర్ గా పని చేశాను. అయన , రమణ గారు చేసిన ఆఖరి టీవీ సీరియల్ ‘శ్రీ వెంకటేశ్వర కల్యాణం’ కి (SVBC చానెల్ వారికి 18 ఎపిసోడ్స్) సంగీత దర్శకత్వం వహించాను- బాపు గారు, రమణ గారి కోరిక మీద. నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది. ఆ సీరియల్ ఆఖరి పాట ‘వేంకటేశ్వర కళ్యాణం’ పాట. 22 రాగాల్లో ఒక రోజులో కంపోజ్ చేశాను. కంపోజింగ్ అయ్యాక బాపు గారు నన్ను గాఢంగా కావలించుకుని నుదిటి మీద ఒక తియ్యటి ముద్దు పెట్టారు. నాకు అది నేషనల్ అవార్డ్ కన్నా గొప్పది. ఆయన ఎందరికో ఆ పాట వినిపించారు. మళ్ళీ బాపు గారు, రమణ గారు పుడతారా? సంగీత దర్శకుడిగా నా 25 ఏళ్ల సిల్వర్ జూబిలీ ఫంక్షన్ కీ బాపు గారు ఛీఫ్ గెస్ట్ గా వచ్చి 25 నిముషాలు ఉన్నారు-ఆరోగ్యం బాగా లేక పోయినా. ఆయనకి మా ఇంట్లో భోజనం చాలా ఇష్టం. నేను ఒకసారి ఆయన కి చాలా ఇష్టమైన ‘పెసర పప్పు పప్పు పులుసు’ చేసి వడ్డించాను. ఎంత తృప్తిగా తిన్నారో! నా భార్యకి ‘మీ ఆయన మంచి సంగీత దర్శకుడు అవడానికి కారణం ఆయన చాలా మంచి వంట వాడు’ అని చెప్పారు. దిబ్బ రొట్టి, అల్లం పచ్చడి అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం.
టి.చలపతి రావు గారు నన్ను ఎకార్డియన్ ప్లేయర్ గా ‘పరివర్తన’ అనే సినిమా తో 1974 మార్చ్ లో సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. ‘వినిపించనా..’ అనే పల్లవితో ఆరంభం అయ్యే ఆ పాటని ఎస్. పి. బాలు గారు పాడారు. Rs. 75 ఇచ్చారు!! భావనా కళా సమితి వారు 1967 లో నా తొలి సంపాదనగా ఇచ్చింది Rs. 20…!!!
చలపతి రావు గారికి ‘అయూబ్ ఖాన్’ అనే ముద్దు పేరుండేది. నా సోదరుడు మాధవపెద్ది రమేష్ ని కూడా ఆయనే ‘దత్త పుత్రుడు’ సినిమా ద్వారా ప్లేబాక్ సింగర్ గా పరిచయం చేశారు. పంక్చువల్ గా ఉండే వారు అన్ని విషయాలలో... మహాను భావుడు! నన్నూ, అన్నయ్యనీ… ఆయనా, ఆయన కుటుంబ సభ్యులూ ఎంతో ఆదరించారు. అందరు ప్రముఖుల వద్దా, 9 భాషల్లో నేను చాలా బిజీ గా పని చేస్తూ ఉంటే ఎంత సంతోషపడేవారో.
కే.వి. మహదేవన్ గారి వద్ద 11 సంవత్సరాలు పని చేశాను. సోదరులు - ఎస్.పి. బాలు గారు నన్ను రికమండ్ చేశారు. మహాదేవన్ గారు, పుహళేంది గారి దగ్గర సంగీతం గురించి, కంపోజింగ్ గురించీ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అందుకే కుటుంబ గాధా చిత్రాలు (హై హై నాయకా, బృందావనం, పుట్టింటి గౌరవం, ఆవిడే శ్యామల మొదలైనవి), పౌరాణిక చిత్రాలు (శ్రీ కృష్ణ విజయం, బాల రామాయణం మొదలైనవి), జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’, మాస్ మసాలా సినిమా ‘మాతో పెట్టుకోకు’ ‘మేడమ్’ లాంటి చిత్రాలకి, ఎన్నో విభిన్నమైన టీవీ సీరియల్స్ కీ, ఎన్నో రకాల ప్రైవేట్ ఆల్బమ్స్ కీ, A.I.R లో చాలా వైవిధ్యమైన పాటలకీ సంగీతం సమకూర్చడం సులభం అయింది. ---కారణం ఆ మహానుభావుడి దగ్గర పని చేయడం !!!
ఒక రోజు కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటే నా దగ్గరకి వచ్చి ‘ఏరా, ఏమిటి డల్ గా ఉన్నావు? నీ భార్యతో ఏదైనా గొడవా? ఇద్దరు భార్యలు ఉన్న నాకే లేని టెన్షన్ నీకేంటిరా?’ అని నవ్వారు. నేనూ నవ్వు ఆపుకోలేక పోయాను.
అందరు మహానుభావులు నన్ను సొంత కొడుకు లాగా, తమ్ముడి లాగా ఆదరించారు. అది నా అదృష్టం. మహాదేవన్ గారు, పుహళేంది గారు నా దృష్టి లో శ్రీరాముడు, ఆంజనేయుడు... అలాగే బాపు గారు, రమణ గారు రామలక్ష్మణులు !!!
నేను ఎంత మంది దగ్గర పని చేసినా మరచిపోలేని మహానుభావులలో ముఖ్యుడు ఎస్.పి. బాలు గారు. 12 సంవత్సరాలు ఆయన ట్రూప్ లో ఎకార్డియన్ & కీ బోర్డ్ ప్లేయర్ గా పని చేసిన అనుభవం, పొందిన పాప్యులారిటీ, సంపాదించుకున్న పరిజ్ఞానం చాలా ఎక్కువ. He is a living legend. నా దృష్టి లో ఘంటసాల గారు సూర్యుడు, ఈయన చంద్రుడు. అందుకే భగవంతుడు డిశంబర్ 4 ఘంటసాల గారిని పుట్టించాడు. జూన్ 4 న బాలు గారిని పుట్టించాడు. ఇద్దరి భార్యల పేర్లు సావిత్రి!! భగవంతుడు సంగీత ప్రపంచానికి అద్భుతమైన సేవలు చేయడానికి దివి నుండి భువికి పంపించిన సంగీత మూర్తులు. ఆ ఇద్దరి మహానుభావులూ, వారి కుటుంబాలతో మాధవపెద్ది కుటుంబానికి (బాబాయిలు సత్యం గారు, గోఖలే గారు, అన్నయ్య రమేష్) ఉన్న అనుబంధం ఎంతో పవిత్రమైనది. ఆ భగవంతుడు ఏర్పరచినది. ఒకటో, రెండో తప్ప బాలు గారు సంగీత దర్శకులు గా పని చేసిన అన్ని సినిమాలకీ నేనే కీ బోర్డ్ ప్లేయర్ ని. నవరసాలకి చిరునామా ఎస్.పి. బాలు.
అలాగే జంధ్యాల ని ఎలా మరచిపోగలను? 1988, ఆగస్ట్ 21 నాడు ‘హై హై నాయకా’ చిత్రం ద్వారా నన్ను సంగీత దర్శకుడి గా పరిచయం చేశాడు. ఎంతో సుమనస్కుడు జంధ్యాల. గొప్ప రచయిత, దర్శకుడు, నిజమైన హాస్యానికి చిరునామా. ఎంతో మంది కళాకారుల్ని పరిచయం చేశాడు. ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టాడు. గ్రేట్!!!
ఒక సారి తనకి కారు ఏక్సిడెంట్ అయింది. అందరూ వచ్చారు. అల్లు అరవింద్ గారు తలకి తీసిన క్సీరాక్స్ జంధ్యాలకి చూపించి ‘ఏం లేదు సార్. నో ప్రాబ్లెమ్’ అని చెప్పారు. జంధ్యాల “ఏదో ఉందనే కదా మీ అందరూ నాకు సినిమాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు” అన్నారు. అందరూ నవ్వుకున్నారు. జంధ్యాలకి రమేష్ నాయుడు గారన్నా, బాలు గారన్నా ఎంతో అభిమానం. నా కన్నా 8 నెలలు పెద్దవాడు. ఇప్పటికీ నా లాంటి కోట్లాది జంధ్యాల అభిమానులు తనని రోజూ తలచుకుంటూనే ఉంటారు.
ఇలా ఎంతో మంది మహానుభావులతో పని చేసిన నేను ...I am grateful to my parents, brother & God!
నౌషాద్ గారు, M.S. విశ్వనాథన్ గారు, కే.వి, మహాదేవన్ గారు, T. చలపతి రావు గారు, ఎస్. రాజేశ్వర రావు గారు, పెండ్యాల గారు, హంస లేఖ గారు, SP బాల సుబ్రమణ్యం గారు, బాపు గారు, రమణ గారు, జె.వి. రాఘవులు గారు, రమేష్ నాయుడు గారు, కె. విశ్వనాథ్ గారు, జంధ్యాల, వేటూరి గారు, పి. సుశీల గారు, ఎస్. జానకి గారు,...ఇలా చెప్పుకుంటూ పొతే కనీసం 200 మంది పైగా మహానుభావులతో పనిచేయడమే కాకుండా వాళ్ళందరి ఆశీస్సులు నేనూ, నా కుటుంబమూ పొందడం మా అందరి అదృష్టం.
అలాగే దేశ విదేశాలలో ఎంతో పేరు సంపాదించిన ప్రముఖులెందరి తోనో నా అనుబంధం గొప్పది. నా మధురానుభూతుల నెమరు వేతకి నాకు ప్రేరణ కలిగించిన నా చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషి, “అమెరికా హాస్య బ్రహ్మ’ వంగూరి చిట్టెన్ రాజు గారికి ధన్యవాదాలు.
*****
మాధవపెద్ది సురేష్
మాధవపెద్ది సురేష్: ఈ సంవత్సరం... మాధవపెద్ది సురేష్ గారి సంగీత స్వర్ణోత్సవం. 1966 నుండి , హార్మోనియం, ఎకార్డియన్ వాద్యాలలో నిపుణుడిగా విజయవాడలో మంచి పేరు సంపాదించి, టి. చలపతి రావు గారి సంగీత దర్శకత్వంలో “పరివర్తన” సినిమాలో SP బాలు పాటకి ఎకార్డియన్ వాయించి సినీ రంగ ప్రవేశం చేశారు. అనేక భాషల, ఆనాటి సంగీత దర్శకులు అందరి దగ్గరా సుమారు 1500 సినిమాలకు కీ బోర్డ్ సహకారం అందించారు. సహాధ్యాయి అయిన జంధ్యాల ఆయన ప్రతిభ ని గుర్తించి తన తొలి చిత్రం “హాయ్ హాయ్ నాయకా” కి సంగీత దర్శకత్వ అవకాశం ఇచ్చారు. ఆ తరువాత భైరవ ద్వీపం, బృందావనం, మాతో పెట్టుకోకు మొదలైన సుమారు అరవై సినిమాలు, టెలివిజన్ లో బాపు –రమణల భాగవతం, అంతరంగాలు మొదలైన సుమారు 80 ధారావాహికలకీ సంగీత దర్శకత్వం వహించారు. నివాసం హైదరాబాదు.
.