top of page

'అలనాటి' మధురాలు

వాహిని

స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు

52 సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికా ఖండం నుంచి వెలువడిన మొట్ట మొదటి తెలుగు కథ
ప్రచురణ: ఆంధ్ర సచిత్ర వార పత్రిక , ఏప్రిల్ 24, 1964
“వాహిని”
స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు (కలం పేరు ఆర్ఫియస్), ఆటవా, కెనడా
బొమ్మలు: బాపు

నిద్ర లేచాడు మూర్తి. ఆవలించాడు. వాచీ చూసుకున్నాడు. “పదకొండుంబావే!” అనుకున్నాడు.

కొంచెం తలనొప్పి ఇంకా మిగిలి ఉన్నట్లనిపించింది. కళ్ళు వాచి ఉన్నాయి.

“వెధవది-విస్కీ త్రాగకుండా ఉండాల్సింది” అనుకున్నాడు. రాత్రి రెండున్నర దాకా తన గదిలో జరిగిన కాండ తల్చుకున్నాడు. ఆలీ, బాబు, మైక్, చాంగ్, శర్మ, డాక్టర్ మిత్రా-తనూ .....రెండున్నర దాకా చిప్స్ తింటూ, జీడిపప్పు మింగుతూ, మధ్య మధ్య సాండ్ విచ్ లు –అందులో గ్రామఫోన్ మీద పాటలు! రవి శంకర్ ‘ఈవెనింగ్ మెలోడీ’ నుంచి   

బెతోఫెన్ ‘మూన్ లైట్ సొనాటా’ దాకా ఛలోక్తులు....ఎదురుగా టేబులు మీద ఖాళీ సీసాలు –కన్పించాయి.

లేచి నిల్చుని వాటిల్ని తీసి అవతల ఉంచాడు.

మరో సీసా,.. చిన్న బీర్ సీసా కన్పించింది. అడుగున కొంచెం మిగిలి ఉంది. అదీ అవతల పెట్టాడు. ఎలక్ట్రిక్ హీటర్ మీద కాఫీకి నీళ్లుంచాడు తర్వాత. దంత ధావనం, క్షురకర్మా, ముఖ ప్రక్షాళనం కానిచ్చాడు.

కాఫీ తాగుతూ కూచున్నాడు.

“మరో అరవయి గంటలు తరువాత “ అనుకున్నాడు.

తర్వాత –

లండన్-పారిస్-రోమ్-బొంబాయి-

సిగరెట్ వెలిగించాడు మూర్తి ఆలోచిస్తూనే.

తర్వాత-

హైద్రాబాదు ! భాగ్యనగరం !కోటీ ! చిక్కడపల్లి !  

పన్నెండు వేల మైళ్ళు ! సప్త సముద్రాల కవతల – భరత ఖండం-

డ్రాయర్లోంచి విమానం టిక్కెట్లు తీసుకుని చూశాడు. లండన్ లో ఇండియా దాకా టిక్కెట్లు తయారుగా ఉంటాయి. ‘హే’ మార్కెట్ లో.....కాఫీ తాగడం అయిపోగానే సూట్కేస్ లోకి సామాన్లు సద్దడం మొదలుపెట్టాడు. థీసిస్ కాపీలు రెండు.... మూడేండ్ల శ్రమ ఫలితం ---తన్ను ఒక్క సారిగా ‘మిస్టర్’ నుంచి ‘డాక్టర్ మూర్తి’ గా మార్చేసి విద్యాధికుల్లో అగ్రశ్రేణికి త్రోసిన పరికరం ఇది !

ఫోటో ఆల్బమ్ తీసుకున్నాడు... తను రోమ్ లో, తర్వాత ఇక్కడా తీసుకున్న ఫోటోలు – బోటులో డెక్ టెన్నిస్ ఆడుతూ మంచులో తడుస్తూ, ఎండాకాలంలో రంగు రంగుల షర్ట్ లో, వసంత ఋతువుతో ఎర్రబారిన మేపుల్ చెట్ల ఆకుల మధ్య ! స్నేహితులు.., న్యూయార్క్ లో – నయాగరా వద్ద –ఉన్నట్టుండి ఆగిపోయాడు మూర్తి.

        ఎదురుగా ఫోటో తన కేసి చూడసాగింది— చక్కటి పెదవులు తన్ను చూసి మందహాసం చేశాయి. ఇంద్ర ధనుస్సు లాంటి నుడుపాటి కనుబొమ్మల క్రింద వెన్నెల చిందుతూ –నీలి కళ్ళు తన్ను పలకరించాయి.

        ఆల్బమ్ ఒక్క సారిగా బరువయిపోయింది. అవతల ఉంచేశాడు మూర్తి. మోయ లేక... చేతులు రాక , మనసే బలహీనమయిపోయింది. తూలుతూ పోయి పడక మీద కూర్చున్నాడు. మాల... మాల... నవ వసంత సుమ లీల....

*       *      *

ఆ రోజు తనకింకా ఎంతో జ్ఞాపకం. .....ఇండియా –కెనడా సంఘం వారి దీపావళి పార్టీ జరుగుతోంది...తను ఒక వేపు నిలబడి అందరినీ చూస్తున్నాడు. హిందీ, బెంగాలీ, అరవం వినిపిస్తున్నాయి. తనకు కొత్త ఇంకా.

  • అని వినిపించింది పక్కన. తిరిగి చూశాను.

ఆరడుగుల ఎత్తున, స్ఫురద్రూపి, చేయిచాపి కరచాలనం చేశాడు.

“నా పేరు మూర్తి” అన్నాడు మూర్తి.

“నా పేరు రాయ్… మీది మద్రాసా?” అన్నాడతను.

“కాదు. హైద్రాబాద్ వాసిని”

“అది నిజాం సంస్థానం కదూ?”

ఒకప్పుడు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్... మాది అసలు కోస్తా ప్రాంతం”

నాకంత పరిచయం లేదు మన దేశంతో... నేనిక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. పది పన్నెండేళ్ళయిపోయింది.”

  • ...” అన్నాడు మూర్తి. ఎవరో పిలిచారతన్ని.

“క్షమించండి” అంటూ అతను అవతలికి పోయాడు.

పార్టీ అయిపోయింది. కార్లు బయలుదేరాయి. మూర్తి బయటకి నడిచి బస్ కోసం బయలు దేరాడు.

“హలో” అని విన్పించింది ఎవరో పిలవడం. కార్లోంచి ఎవరో పిలుస్తున్నారు. కారు దగ్గరకు పోయాడు. లోపల రాయ్ గారు ఉన్నారు. ఎవరో పక్కన కూర్చుని ఉన్నారు.

“మేము డౌన్ టౌన్ వెళ్తున్నాము. మీరెక్కడికి వెళ్ళాలి?”

మూర్తి చెప్పాడు.

“మరేం, రండి, అది మాకు దారే. సందేహించకండి.” అన్నాడు రాయ్.

మూర్తి లోపలకి చేరాడు. వెనక సీట్లో కూచున్నాడు. తలుపు మూసుకోగానే లోపల చీకటి నిండిపోయింది.

“ఆ, మరిచాను. ఈ అమ్మాయి నా కుమార్తె మాల. – “మాలా, ఇతను మిస్టర్ మూర్తి. “ పరిచయం చేశాడు. మూర్తి ఏదో అన్నాడు వినీ, వినిపించకుండా. ముందు సీట్లోంచి వెనుదిరిగి ఆ అమ్మాయి చేయి అందించింది. మూర్తి కరచాలనం చేశాడు… కొంచెం ఆశ్చర్యపోయి.

మన దేశం స్త్రీలు, ఇక్కడ కూడా, కరచాలనం చెయ్యరు పరిచయం చేస్తే. మరి ఈ మిస్ మాల--? కారు వేగంగా పోసాగింది. చక్కటి రోడ్డు మీద దార్లో తన గురించి ప్రశ్నలు వేశాడు రాయ్. ఎక్కడ చదువుతోందీ, పూర్తి పేరూ, - మాల నవ్వింది తన పేరు పేరు పూర్తిగా ఉచ్చరించబోయి, రాక... తన చిరునామా...

“ఇవన్నీ అడిగానని అనుకుంటున్నారా? అది నా అలవాటు… కొత్తగా వచ్చిన దేశవాసుల్ని మా ఇంటికి అతిథులుగా పిలుస్తాను నేనెప్పుడూ... అంటే కలుసుకున్న తర్వాత అన్న మాట ! మాలా – మరి మూర్తి గారిని ఎప్పుడు పిలుస్తావు? “ అన్నారు రాయ్, చాలా చనువుగా.

“మీరు రేపు సాయంత్రం ఏం చేస్తారు? డాన్సులకు పోతారా?” అంది మాల.

“నాకు చేత కాదు డాన్సు – నాకేం ప్రోగ్రాం లేదు” అన్నాడు మూర్తి.

“మరింకేం, రేపు సాయంత్రం ఆరున్నరకంతా రండి. భోంచేసి వెళ్ళండి.” అన్నాడు రాయ్. మూర్తి వప్పుకున్నాడు.

తనను ఇంటి దగ్గర దిగపెడుతూ రాయ్ గారు ఏ బస్సు ఎక్కాల్సిందీ, ఎక్కడ దిగాల్సిందీ, ఇల్లు ఎలా కనుక్కునేదీ చెప్పాడు. అంత సేపూ కారు తలుపు తీసే ఉండడం చేత మూర్తికి మాల వేపు చూసే అవకాశం లభించింది. తలుపు మూసుకుంది వెంటనే... చీకటి... మళ్ళీ…

“నమస్తే” అన్నాడు మూర్తి.

“గుడ్ నైట్” అన్నాడు రాయ్. మాల అద్దంలోనుండి చేయివూపింది. సగం కత్తిరించిన జుట్టొక్కటే గుర్తుంచుకో గలిగాడు మూర్తి. మరునాడు కానీ మూర్తికి మాలని పూర్తిగా పరీక్షగా చూడ్డం కాలేదు.

మంచి ఎర్రటి రంగు, నిడుపాటి కనుబొమలు...లలిత కోమలమైన వ్రేళ్ళు. చక్కటి నవ్వులొలికే పెదవులు... అన్నింటినీ మించి ఎప్పుడూ మెరిసే –నీలి కళ్ళు –ఆకాశం రంగువి !

“ఆమెకి నీలికళ్లెలా వచ్చాయి ? అనుకున్నాడు మూర్తి. తర్వాత కానీ తెలియలేదు తనకు.

మాల తండ్రి పద్దెనిమిదేండ్ల ముందు డాక్టరేట్ కోసం వచ్చిన రెండో సంవత్సరంలోనే మాల తల్లిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఫ్రెంచి వనిత-అక్కడ స్థిరపడిపోయారు ఆమె తల్లిదండ్రులు. ఆరేండ్ల తర్వాత రాయ్ తిరిగి కలకత్తా –స్వగ్రామం వెళ్ళారు. ఆయనకు అక్కడ ఉద్యోగం నచ్చక భార్యా, మాల తో తిరిగి కెనడాకు వచ్చేశాడు. మాలకప్పుడు ఐదేండ్లు... తర్వాత పదేండ్ల తర్వాత మాల తల్లి చనిపోయింది.

మాలకి హిందూ దేశం గూర్చి అంతగా తెలీదు. అందుకని మాలని రాయ్ గారు కెనడా పద్ధతుల్లో పెంచారు. మాలకు బొట్టు పెట్టుకోడం రాదు. ఆమె అలవాట్లు, భాష, తీరు, అంతా దాదాపు పాశ్చాత్య విధానంతో నిండి పోయాయి. ఒక్క పేరే కొంచెం హిందూ ఫక్కీ....

ఆ తర్వాత తను ఎన్నోసార్లు మాలతో చాటుగా మాట్లాడడం, తను కొంచెం డాన్సు నేర్చుకున్న తర్వాత, ఆమెతో డాన్సులకీ, సినిమాలకీ వెళ్ళడం జరిగింది. తను గడిపిన మూడేండ్లలో వారానికోసారయినా మాలని చూసేవాడు. రాను రాను చూడాలనే వాంఛ పెరిగింది. కొన్ని రోజులకి –ముఖ్యంగా –మూడు నెల్లకి ముందు –చూడ లేకుండా తను ఉండలేనన్న విషయం తనకి తెలిసి వచ్చింది. కాని –మాల కూడా తనతో మాట్లాడే సమయంలో, డాన్సుచేస్తున్నప్పుడూ, సినిమాలో ములిగి ఉన్నప్పుడూ- ఏ బేధమూ చూపేది కాదు. పైగా ఒక్కొక్కసారి తన్ని హేళన చేసేది చిలిపిగా.

“మీరు అచ్చు ఇండియన్ లు” అనేది. తను జవాబిచ్చేవాడు అంతకన్నా నేరుగా... “ఆ గౌరవం నాకు చాలు !” అని. నవ్వేది మాలసెలయేరు దుమికినట్లు, ....జలతరంగిణి మ్రోగినట్లు. వచ్చే మూడు నెల్లకి ముందు మాల తన్ను ప్రశ్నించింది “ఇండియాకు ఎప్పుడు వెళ్ళాలి?” అని. “మరో మూడు నెల్లు” అన్నాడు తను. అదోలా తల ఊపింది మాల. మూర్తికి అందులో అగుపించని అర్థం తోచింది.

“మళ్ళీ తిరిగి రారు కదూ?” అంది మాల.

“బహుశా అంతే కాబోలు... ఉద్యోగం చూసుకోవాలి... తర్వాత ..”

”తర్వాత – పెండ్లి... మీ నాన్న గారేనా మీకు పెండ్లి కుదిర్చేది?” మాల మాటల్లో వ్యంగ్యం గుర్తించాడు మూర్తి.

“అది మా సాంప్రదాయం, పద్దతి... సంతానం బాగోగులు తల్లిదండ్రుల చేతుల్లో ఉండడం తప్పా?” అన్నాడు తను.

“అలా అన్నానా నేను?” అంది మాల.

“మరి?” మాల మాట్లాడ లేదు. సంభాషణ ‘గొప్పగా ‘ సాగటం లేదని గుర్తించాడు మూర్తి.

  1. మీరు పెండ్లికి నన్ను పిలుస్తారా, వస్తాను !” అంది.

“పన్నెండు వేల మైళ్ళు – రాయ్ గారికి బేంక్ అకౌంటు చాలా ఉందిలా ఉంది. !”

“మీరు పిలిస్తే తప్పక వస్తాను” అంది మాల.

మాల మాటల్లో భావం అర్థం కాకపోలేదు మూర్తికి. కొన్ని రోజులుగా తన్నుతాను చాలా పరిశీలనగా ప్రశ్నించుకున్నాడు. తనూ, మాలా, రాయ్ గారు, ఇండియాలో తన తల్లిదండ్రులు అందరినీ మనసులో వుంచుకున్నాడు. కరకుగా అడిగాడు తన్నే. ‘మాలని వివాహం చేసుకోవాలని ఉంది – నీకు – సరే. కానీ మీ తల్లిదండ్రులకి తెలుపగలవా అది ? మీ నాన్న గారు ఏమంటారు? అది కాక మాల పాశ్చాత్య దేశ భావాలతో పెరిగింది. ఆమెకి స్త్రీ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ- గాలీ, నీరూ. మన దేశంలో అది సాగదు. కొంత వరకే ఏదైనా సాగినా... ఆలోచించుకుని నిర్ణయానికి రా!”

తను జవాబిచ్చుకున్నాడు కూడా ఈ ప్రశ్నలకి... మాల తన పక్కన ఉంటే ఈ ప్రపంచం స్వర్గమై పోతుంది. ఈ మూడేండ్లలోనూ ఆమె తన జీవితంలో ఒక్క సారిగా వెన్నెల నింపింది కానీ నాన్న గారు, కులం, మతం... సాంప్రదాయాలు...

“కులం, మతం ఎవరికీ కావాలి? మాలలో హైందవ రక్తం కలిపి లేదా?” అనుకునే వాడు. వెంటనే సగం కత్తిరించిన జుట్టు –అంత కన్నా నీలి కళ్లూ – పిలిచేవి. నీలి –నీలి కళ్ళు హిందూ దేశంలో కన్పించనివి !. పాశ్చాత్య రక్తపు చిహ్నాలు....

ఆ తర్వాత తను ఎంతగా పోవాలని అనిపించినా మాల ఇంటి వేపు పోలేదు. సాయంత్రం పూట పిచ్చిగా తోచేది. రిడో నది గట్ల మీద, పార్కుల్లో, సినిమా హాల్లో చీకట్లో గడిపే వాడు.

“నేను చాలా పిరికి వాణ్ని... నాకు మాల తగదు.” అనుకున్నాడు. ఆఖరికి తలనొప్పి ఎక్కువయింది. లేచాడు మూర్తి. ఇలా ఆలోచనలు వచ్చీ లాభం లేదు. బయలు దేరి మిత్రులందరినీ చూడ్డం ప్రారంభించాలి.  సాయంత్రం ప్రొఫెసర్ మాషీ తన గౌరవార్థం డిన్నర్ ఇస్తున్నాడు. నలుగురయిదుగురు విద్యార్థులూ, తనూ... రేపు రాత్రి శర్మా, బాబూ కలిసి తనకి “డ్రింక్స్” పార్టీ ఇస్తారు. ...ఎల్లుండి..పొద్దున్నే ప్రయాణం. మైక్, శర్మా వస్తారు తన వీడ్కోలుకి.

కస్టమ్స్ చెక్ అయిపోయింది. మూర్తి సామాన్లు వెళ్లిపోయాకా “మర్చిపోకూడదు సుమా....రోమ్ లో దిగు –తర్వాత త్రోవలో పిరమిడ్ ఫోటోలు పోస్ట్ చేయి. ఓ చక్కటి అమ్మాయికి అవి చాలా ఇష్టం – ఆ అమ్మాయంటే మనకిష్టం-“ అన్నాడు శర్మ నవ్వుతూ. ఇంగ్లీషు లో అన్న ఆ మాటలు విని మైక్ నవ్వాడు.

“మరేం లాభం లేదు. మెరియన్ కు నీవు లక్ష బహుమతులిచ్సినా లాభం లేదు’”

  • కాస్త ఆగి చూడరా నాన్నా... నీ కళ్ళ ముందే వచ్చే శుక్రవారం మేరియన్ తో ‘ ఫేకర్టీ డాన్సు’ కు రాకపోతే నీకు బెల్ ఎయిర్ హోటల్ లో పెద్ద కాంబినేషన్ ‘పీస్టా’ ఇచ్చుకుంటాను – కాచుకో”

ఫ్లయిట్ కి తయారయింది విమానం... చెవులు తూట్లు చేస్తూ ఆహ్వానించింది ప్రయాణీకుల్న. మూర్తి శర్మ చేతిలో వుత్తరం ఉంచాడు. 

“ఇది పోస్ట్ చేయి. మర్చిపోకు... చాలా ముఖ్యం...” అన్నాడు.

“నాకు తెల్సులే... ప్రేమ యాత్ర అంతం అయిందనేగా... అంతే నాన్నా పిచ్చి ! మంచి పని చేశావు! నిజం...అంతా మర్చిపో! పారిస్ లో నా పేరు చెప్పి గుక్కెడు షాంపేన్ ఆచమనం చేయి... సర్వపాప పరిహారార్థం! బై... గుడ్ లక్..." అన్నాడు శర్మ.

 

కరచాలనం చేశాడు మూర్తి, మైక్ మూర్తిని కౌగిలించుకుని చెంపల మీద ముద్దిడుకున్నాడు. "భగవంతుడు నీకు మేలు చేస్తాడు" అన్నాడు గ్రీక్ లో.

 

మూర్తి చేయి ఊపుతూ విమానం వైపు నడిచాడు.

విమానం మరింత విషాదంగా అరిచింది.

 

*      *      *

బాబు గడియారం చూచుకున్నాడు. రెండు యాభై. ఈ పాటికి పోస్టుమెన్ వచ్చి ఉండాలి. తనకేమయినా వచ్చాయో లేదో? ఒక్కసారి రూముకు పోటే బాగుంటుంది." అనుకున్నాడు.

 

ఎదురుగా ఆయిల్ పంపు శబ్ధం చేయసాగింది. మెర్క్యురీ డిఫ్యూజన్ పంపులో పాదరసం చిందులు తొక్కింది. అటూ ఇటూ చూచాడు బాబు. "సాయంత్రం దాకా ఇది కాదు. మరి- అంతే కాబోలు..." అనుకున్నాడు విసుగ్గా వి.పి.సి. వేపు చూస్తూ. రికార్డు గుర్రుమంది.

 

ప్రతిరోజూ ఇలాగే దినానికొకసారి ఆశ శిఖరాలందుకుంటుంది. మరుక్షణం అగాధం...లేదా అంతకు మించిన ఆకాశం. ఒక్క చిన్న కాగితం ముక్క, నాలుగు పంక్తులు ఎంత భేదం తెస్తాయి? తన పర్సు తెరిచి చూచుకున్నాడు. నాలుగు నెలల ముందు తీసిన ఫోటో, తన సూటుతో నీటుగా నిల్చున్నాడు. ప్రక్కన తలవంచుకుని, సిగ్గు దొంతరల మధ్య నుంచి చూస్తూ శారద... బుగ్గన చుక్క.

 

గాఢంగా నిట్టూర్చాడు. తల్చుకుంటే వెంటనే రెక్కలు కటుకుని ఎగిరిపోవాలనుంది. మళ్ళీ మూడేండ్లకి కాబోలు... తిరిగీ... ఆ క్షణాలు మళ్ళీ...

 

శారద జాబు వ్రాసి నెల కావస్తోంది! ఎందుకని వ్రాయలేదు? తను ఎంతగానో చెప్పాడు. పల్లెటూరు-యాభై అయిదు నయాపయిసా ఎయిర్ మెయిలు లెటర్లు దొరకవు... తనతో తీసుకుపొమ్మని... మర్చిపోయి ఉంటుంది. మొట్టమొదట తను వెళ్ళేరోజున తన అడ్రసు వ్రాసి ఇచ్చిన కవరు మీదే వ్రాసింది. తనకు కంఠతా వచ్చు.

 

"నాకు మీలాగ కవిత్వం వ్రాయడం రాదు... నా జాబులు మీకు సంతృప్తినివ్వలేకపోవచ్చు… మీ ప్రయాణం ఎలా జరిగింది? ఆ రోజు నేను చాలా వంటరిగా అయిపోయాను... మీ ఫోటో చూస్తూ కూర్చున్నాను. మరి, నా ఫోటో మీతో మాట్లాడుతుందా? ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరు జ్ఞప్తికి వస్తారు. ఏమిటేమిటో ఆలోచనలు వస్తాయి. అనుకోకుండా కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి... కానీ అశుభం అని నాకు తెలుసు. మీరు త్వరగా రండి... నాకు మళ్ళీ మీతో మాట్లాడాలని ఉంది అప్పటిలాగా. ప్రతిరోజూ రోజులు లెక్కవేస్తున్నాను కానీ తరగటం లేదు, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూచుకొమ్మని ప్రార్థిస్తూ... మీరు వ్రాసింది చదివి అన్నయ్య తెలుగులో చెప్పాడు. అంత చలిలో వాళ్ళందరూ ఎలా ఉంటారు?!.."

 

అమాయకత్వం, మమతా, ఆరాధనా- వందల వేల మైళ్ళు దూరం చేయలేని సాన్నిహిత్యం, తలపుల్లో చేరువయ్యే మనసు...

తనసలు పెండ్లి వద్దన్నాడు ఇక్కడికి వచ్చేముందు. అమ్మానాన్నారూ వప్పుకోలేదు... తను శారదనంతకు ముందెప్పుడో వోసారి చూచాడంతే. జూన్లో పెండ్లి చూపులూ, జులైలో వివాహం, ఆగస్టులో అజ్ఞాత వాసం...

 

వాటి మధ్య ఇరవై రోజులు గగన విహారం. మబ్బుల్లో తిరిగారిద్దరూ...శారదను ఆ కొద్ది రోజుల్లో తను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఆధునిక సమాజం ఇంకా మసిపూయని హృదయం... ఆప్యాయతా అనురాగమూ, సౌమ్యతా తప్ప మరేదీ చొరని మనస్సు...

ఆమె పుట్టి పెరిగిన పల్లెటూరి లాంటి స్వచ్చమైన శారద!

 

"మిస్టర్ బాబూ, లెటర్స్ ఫర్ యూ" అన్నాడు తోటి సహోధ్యాయి ఆలీ.

తను ఇంటి చిరునామా, కాలేజీ చిరునామా రెండూ ఇచ్చాడు. కానీ ఎప్పుడూ ఇంటికే వ్రాసేది శారద!

 

 

దాదాపు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూచాడు.

రెండు ఉత్తరాలు! ఒకటి నాన్నగారి అక్షరాల్లా ఉన్నాయి!

రెండోది! మరింకెవరు! చదువుకున్నాడు త్వర త్వరగా...

 

"...మీకు వ్రాయటంలో ఆలస్యం అయినందుకు క్షమించవలిసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చే రోజు ఈ జాబులు తెచ్చుకోటం మర్చిపోయాను. అవి వచ్చేసరికి ఇంత ఆలస్యం అయింది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాన్నగారూ, అమ్మా, అమ్మమ్మా మిమ్మల్ని అడిగారు..."

 

నెమ్మదిగా నడుచుకుంటూ తన రూమువేపు నడిచాడు బాబు. క్షణం పాటు కూడా దృష్టి జాబు నించి తీయకుండా... అతని అడుగులు తేలిగ్గా పడ్డాయి.

 

*       *      *

 

జాబు చదువుతూ బాబు నడిచిపోవటం చూసి శర్మ నవ్వుకున్నాడు.

 

"ఈ గృహస్థు"లకి జాబులు తప్ప మరోటి అక్కర్లేదు!" అన్నాడు ఫోన్ చేస్తూ.

 

"హలో, షార్మా, ఏమిటి విశేషాలు" అంది అవతలి కోమల కంఠం.

"మరేముంది... చిన్న వార్త ముందు చెప్పి, తర్వాత అసలు సంగతి చెప్తాను. నిన్న..."

"అసలు సంగతి చెప్పు ముందు."

"నీకు తెలీదేమిటీ! వారం రోజులు మనసూ, శరీరమూ కరిగేలా శ్రమించిన మా బోటి వారికి మరింకేం కావాలి! కంపెనీ, వైన్ కంపెనీ" అన్నాడు శర్మ.

"అదా! దానికేం... మీ ఇండియన్లెవరూ దొరకలేదా!"

ఇండియన్లా! భోజనానికైతే వెడతాను... కానీ, వారాంతంలో విహార సమయం మాత్రం స్వదేశీయులతో గడిపినంత ఘోరం హిట్లర్ కూడా చేసి ఉండడు!"

"అదుగో... నేను జెర్మన్ అనా, అలా అంటావు!" చిరుకోపం సంప్రదించింది.

"నో నో... కాకపోయినా నీవు ప్రపంచం మీద దండయాత్ర సాగిస్తే ఎదురు నిలిచే యోధుడెవరున్నారని! నేనే ఇండియాకు రాజునయి ఉంటే అది నీ చేతుల్లో ఉంచేసేవాడిని!"

 

చాల్చాలు... మరి అసలు సంగతి చెప్పవుగా!"

"విను...శుక్రవారం...ఎల్లుండి సాయంత్రం...వీలవుతుందా?"

 

ఇంత సానబెట్టాను. ఆఖరికి తెగదేమో?

 

"ఎల్లుండా? నాకు వీలు కాదేమోనని భయంగా ఉంది... మా బంధువులు ఆల్బర్టా నుంచి వస్తారు... నీవు ముందుగా నాతో చెప్పవలిసింది."

 

ఒక్క క్షణం మాట్లాడలేదు శర్మ.

 

"నెరజాణవి నీవు!" అన్నాడు తెలుగులో ఫోనులోకి.

"ఏమిటీ? నీ భాషలో మాట్లాడకు..."

"మరేం లేదు... ప్రయత్నించలేవా? అన్నాడు శర్మ వెంటనే.

"సారీ... మరోసారి..."

"నీ శ్రాధ్ధం... నీవు కాకపోతే..." అనుకున్నాడు.

"ఓకె. బై"... ఫోను ఉంచేశాడు.

ఆలోచించాడు, మారియన్ మధురంగా తప్పించుకుంది.

 

మరి, శుక్రవారం సాయంత్రం ఏం చేయాలి తను? ఫోను తీస్కున్నాడు.

 

"నెంబరు డయల్ చేశాడు."

"హల్లో... శర్మని... క్లారా? హలో..."

"అవును."

"నేను... జ్ఞాపకం ఉందా?"

“ఉండకేం...నా చేయి చూసి చెప్తానని తప్పించుకున్న ఇండియన్ వి”

"ఓ దానికేం...ఆఁ! ఎల్లుండి సాయంత్రం డాన్స్ ఉంది. నిన్ను అడుగుదామనుకున్నాను."

"చేయి చూస్తావా?"

"దానికేం అన్నానుగా... కాని దక్షిణ ఏం ఇచ్చుకుంటావు?"

"ఏం కావాలి?"

"ఎల్లుండి సాయంత్రం చెబుదాను... మరి సాయంత్రం ఏడు గంటలకి వస్తాను... ఓకే?!"

"ఓ.కే. బై."

"బై"

ఏదో ఒకటి... కొంచెం మళ్ళీ హస్త సాముద్రికం కొంచెం హిందూ మతం గురించీ, కొంచెం వర్ణాశ్రమ ధర్మాలూ, కాశీ నగరం, గాంధీ మహాత్ముడూ- చదువుకోటం మంచిది పోయేముందు...

 

ఈ తెల్లవాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసునని తను తెలుసుకున్నాడు మొదటి వారంలోనే. అందుకనే ఎక్కడయినా చిక్కుపడితే అది "ఆపద్ధర్మ సూత్రాల్లో వాక్రూచ్చారని” తప్పించుకోవచ్చని కూడా అర్థమయింది.

"అంటే" అనేవారు పాపం, వాళ్ళు.

"దాన్ని తర్జుమా చేయలేము. సంస్కృతం"

ఆ పేరే ఉచ్చరించటం రానివారికిది నిజంగానే తోచటంలో తప్పేముంది?

"ప్రపంచంలో దేన్ని గురించో ఓ దాన్ని గురించి తెలీని వాళ్ళుండబట్టే నాలాంటివాళ్ళు బ్రతికిపోతున్నారు!" అనుకున్నాడు శర్మ... గది వేపు నడుస్తూ.

 

"శర్మాజీ, లెటర్స్" అన్నాడు బాబు, ఆనందంగా.

"నీ ముఖం చూస్తే తెలీదూ... మీ ఆవిడేమంటుంది! ప్రాణేశా, వెంటనే తిరుగుటపాలో వచ్చేయి అందా!"

 

బాబు నవ్వాడు. జాబు అందిస్తూ శర్మకి.

శర్మ జాబు తీసుకున్నాడు. చిరునామా కోడి గీకినట్లుంది.

"ఇది ప్రేమలేఖే నాకు తెలుసు... తమ్ముడో, బావగారో, లేకపోతే ఖచ్చితంగా నాన్నగారో ఓ వంద రూపాయలు పంపమని వ్రాసి ఉంటారు" అనుకున్నాడు చదువబోతూ...

 

"వూ! తమ్ముడే... అయితే ఫర్వాలేదు... చిన్న డిమాండు!"

"మేమంతా క్రికెట్ టెస్ట్ మాచికి పోవాలనుకుంటున్నాము. ఇంకా నెల రోజులుంది నీవు నాకు ఇరవయి అయిదు రూపాయలు పంపించు. మా ఫ్రెండు దగ్గర తీసుకుంటాను సమయానికి రాకపోతే... అమ్మా నాన్న బాగా ఉన్నారు. అన్నయ్యకు మళ్ళీ ట్రాన్స్ ఫరు వచ్చేలా ఉందిట. నాన్నగారు అదే అన్నారు... మీవు పంపిన మంచు ఫోటోలు చాలా బావున్నాయి. స్టాంపులు పంపించు... నాన్నకు చెప్పకు.."

 

"క్రికెట్-స్టాంపులు-ఫోటోలు… ఫరవాలేదు... అయిదు డాలర్లతో సరిపుచ్చాడు..."

 

తనిక్కడ బంగారం పోగు చేస్తున్నాడని వాళ్ళ అభిప్రాయం... సగానికి సగం ఎగిరిపోతోంది తిండికి. తన వంట చేసుకోలేడు బాబు, ఆలీలాగా...

ఎవరు చేతులు కాల్చుకుంటారు? తలనొప్పి. తినడం ఫర్వాలేదు... అన్నీ కడుక్కుంటూ కూర్చోవాలి. తర్వాత...అంట్లు! గదిలో జర్నల్ మీద తలపెట్టుకు కూర్చున్నాడు. ఈ జాబులెప్పుడూ ఇంతే... అన్నయ్యకు బదిలీ... అంటే మళ్ళీ మొదలు... ఈ సారి తను ఉండడు… నాన్నగారి వందా పదిహేను రూపాయల్లో తమ్ముడూ, అమ్మా, నాన్నగారూ, చెల్లాయి, వచ్చే పోయే బంధు సముదాయం, ఇత్యాదులు.

 

"భగవాన్, త్వరగా నాలుగు రిజల్ట్సు వచ్చేలా చేయి! ఈ పనేదో ముగించుకుని వెళ్తాను అమెరికాకి... చేతిలో కొంత డబ్బన్నా మిగుల్తుంది అక్కడ... నాన్నగారికి నెలకో వందయినా పంపవచ్చు..." అనుకున్నాడు.

 

ఎన్ని డాన్సులు చేసినా, ఎంత బీరు నీళ్ళు త్రాగినా, ఈ బాధ్యత వదలదు. మరో విషయాన్ని అనుకుని బాధలు మర్చిపోవడం, నీడ నుంచి తప్పించుకోడం లాగా జన్మలో వీలుగాదు... ఇదిలా సాగాల్సిందే ప్రతి క్షణం...

 

తను వచ్చిన క్రొత్తలో ఎంతసేపూ ఇంటి పిచ్చే చుట్టుకునేది తనకి. ఈ క్రొత్త భోజనం, రుచీ పచీ లేని తిండి- సాయంత్రం ఆరుగంటలు కొట్టాక మునుపే డిన్నర్,-

అన్నిటికంటే ముఖ్యంగా స్నేహితులు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఏమీ తోచేది కాదు. ఎంతసేపని చదువుకుంటూ ఒంటరిగా కూర్చోడం? ఆ తర్వాత ఒకసారి ఇంటర్నేషనల్ హౌస్ కు పోయాడు తను. అక్కడా ప్రతివాడూ 'డాన్స్ ' చేయడం నేర్చుకుంటున్నాడు. ఎవర్తో మాట్లాడడం?!

తను ఓ మూలగా ఏ పత్రికో చేతపుచ్చుకుని మరింత వంటరిగా కూర్చోడం దినాలు గడిచేకొద్దీ తను ఈ పధ్ధతికి అలవాటు పడలేదని తెలిసివచ్చింది.

ఆ తర్వాత- తనూ డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు.

ప్రప్రథమంగా సిగ్గేసేది తనకే. ఎవరో తెలీని యువతుల్ని నృత్యానికాహ్వానించడం తనకు చాలా కష్టంగా ఉండేది. తర్వాత డాన్సు చేసేంతసేపూ ఎక్కడో చూచేవాడు. నెమ్మదిగా తన్ను తాను పరిచయం చేసుకోవడం, పేరూ వూరూ చెప్పుకోడం, ఆ తర్వాత మాట్లాడడం వచ్చాయి.

 

రెండు మూడు నెల్లయేసరికి తనలో మార్పు తనకే తెలిసివచ్చింది. తను డాన్సు బాగా చేయడమే కాక అత్యంత సహజంగా ఎదుటి యువతితో ఛలోక్తులాడడం, 'కాఫీ ' లకు ఆహ్వానించడం, ఆ తర్వాత టెలిఫోన్ లో గంటల కొద్దీ ఏదేదో వాగడం అలవాటయ్యాయి.

తనకి తెలిసిన కొంచెం హస్త సాముద్రికం వగైరాలు తన ‘పలుకుబడి’కి బాగా తోడ్పడ్డాయి.

ఇన్ని జరిగినా ఒక్క రోజు అనుకోకుండా ‘ఘోరంగా’ తయారయేది.

నాన్నగార్నించో, అన్నయ్యో, ఎవరో ఒకరు ‘ప్రేమ లేఖలు’ రాసే వారు. తనూ, అవసరం కాబట్టీ, మరోలా అనుకుంటారనీ, నెలకో ముక్క రాసి పడేసే వాడు. పోను పోనూ అదో అలవాటయింది. మొదటి వారంలో జాబు గీకి పడేయడం… పెద్ద వ్రాసేదేమీ లేక పోయినా...

తను ఇంటి బాధ్యతలు తప్పించుకుంటున్నాడా అంటే అదీ నిజం కాదు. తను ప్రతి నెలా, ఇరవయ్యో, ము ముప్పయ్యో డాలర్లు పంపించుతూనే ఉన్నాడు. ‘దేశ సేవ’ అనే వాడు తను ఎవరన్నా అడిగితే.....

తను రెండేళ్ళ లోనూ బాగా మారిపోయాడు. సిగరెట్లు తను వారానికో పాకెట్టు త్రాగేది, ఇప్పుడు దినానికొకటయింది. మద్యం ముఖం చూడని తను ప్రస్తుతం “యాభై సెంట్ల కోకో” – బీర్ కు మారు పేరు ప్రతీ రోజూ త్రాగకుండా ఉండలేక పోతున్నాడు. ఎంత పని ఉన్నా తన టెలిఫోను ద్వారా ఎవరో ఒక తెలిసిన ‘గర్ల్’ ని పార్టీకో, డాన్సు కో, “మూవీ” కో తీసుకుపోతున్నాడు పిలిచి.

“నేను ఇండియాకు తిరిగి పోగలనా?” అనుకునే వాడు.

ఆ ప్రశ్నే అతన్ని వేధించేది.

ఈ స్వేచ్ఛా, ఈ వాతావరణం తనకు నచ్చాయి. తన్నెవరూ అడిగే వాడు లేడిక్కడ. తనెవ్వరికీ జవాబులు చెప్పనక్కర లేదు. ----

తిరిగి ఇండియాకు పోతే ?

మళ్ళీ అదే ఇల్లు... అన్నయ్యా,  పిల్లలూ, నాన్న గారు , తమ్ముడు ..

బాధ్యత ! తను దేన్ని సహించ లేడో అవి – శర్మ లేచి నిల్చున్నాడు. – దాహంగా ఉంది. రూం పోయి కొంచెం గొంతు తడి చేయందే పని సాగదు.

దుస్తులన్నీ వేసుకుని నడిచాడు బయటకి..

బయట చల్లగా ఉంది. జోరుగా చలి గాలి ముఖం మీదకు కొట్టింది. ఇలా ఎన్నాళ్ళో సాగదు. ఈ కల అంతం కాక మానదు. ..

ఒక సారిగా దివి నుండి భువికి తనంతట తనే పడాల్సి వస్తుంది. తను ఎంత ప్రయత్నించినా, వద్దనుకున్నా వీలు కాదు.

చలి గాలికి చేతులు బిగుసుకు పోసాగాయి. చెవులు ఎర్రబారి నొప్పి పుట్టసాగాయి.

కళ్ళలో నీరు చేరింది. విదిలించుకున్నాడు వాటిని కోపంగా..

“చలి –చలి గాలికి నీరు కార్తోంది- అంతే” అనుకున్నాడు. వేగం హెచ్చింది –గాలి మరీ ఉధృతమయింది. ---

డాక్టర్ మిత్రా పైప్ పొగాకుతో నింపసాగాడు. ఎదురుగా టేబుల్ మీద పుస్తకాలు చిందర వందరగా పడి ఉన్నాయి. “వీటన్నిటినీ  సర్దాలి రేపు” అనుకున్నాడు పొగ పీల్చుతూ. ప్రతిరోజూ అంతే. ఒక క్షణం గది అంతా చెక్కు చెదరకుండా శుభ్రంగా ఉంటుంది. మళ్ళీ చూసే సరికి పుస్తకాలు, దుస్తులు, కాగితాలు, గది నిండా ఉంటాయి. వాటిని మళ్ళా యథాస్థానానికి చేర్చడం... మళ్ళీ మొదలు. ఈ పది సంవత్సరాలూ అలాగే కదూ గడిచింది? పదేండ్లు ! పంతొమ్మిది వందల యాభై రెండు! ఆగస్టు నెల! ఆ రోజు తను అనుకోలేదు. పదేండ్లు ఇలా పరదేశంలో నివసిస్తానని... మూడేండ్లు… మహా అయితే నాలుగేండ్లు అనుకున్నాడు అతను... తర్వాత ఏ బొంబాయిలోనో, మద్రాసులోనో, మంచి ఉద్యోగం దొరకగానే 'స్థిరపడి ' పోదామని అనుకున్నాడు.

 

డాక్టరేట్ చేతి కొచ్చేసరికి నాలుగయిదేండ్లయింది. ఆ తర్వాత సంవత్సరం పాటు లండన్... తర్వాత మూడేండ్లు  అమెరికా... ఈ లోగా పరిస్థితులు, తనూ చాలా మారిపోయారు... అరవయిలో తను ఓ నెలపాటు తిరిగి వచ్చాడు. దేశం అంతా మంచి ఉద్యోగం కోసం చూచాడు. బొంబాయి, మద్రాసు, కలకత్తా... ఎన్నో ఉద్యోగాలయితే ఉన్నాయి. గవర్నమెంటులో, కొన్ని పరిశ్రమల్లో చాలా... కాని తనకు నచ్చలేదు.  

 

తన కాళ్ళమీద నిలబడడం, తన అభిప్రాయాలూ, ఆశయాలు స్వేచ్చగా వెలిబుచ్చడం అక్కడ వీలు కాదని తెల్సుకున్నాడు. ప్రభుత్వోద్యోగాల్లో చిక్కులు తెలిసాయి. పై అధికారికి తను లోబడి వుండాలన్న విషయం రుచించలేదు. తనకి... అదీకాక దేశం వదిలి, ఉన్నత విధ్యాభ్యాసం కోసం వేలకొలదీ మైళ్ళు పోయి, వంటరిగా విచిత్ర వాతావరణంలొ సంవత్సరాల కొద్దీ గడిపిన వారికి స్వదేశంలొ గొప్ప సత్కారం ఏమీ లభించదని అర్థమైంది...

 

ఎక్కడ చూచినా కూపస్థ మండూక విన్యాసం. అంచేత తను తిరిగి పరదేశాల్లో ప్రవాసం మొదలెట్టాల్సి వచ్చింది.

 

ఇక్కడయితే  ఒక్క విషయం మంచిదిగా తోస్తుంది. సామర్ధ్యం వున్నంత వరకూ కులమత విచక్షణ లేకుండా పైకి రావచ్చు... తమ ఇష్టం వచ్చిన శాఖలో పరిశోధన చేయవచ్చు...

 

కానీ .......

 

ఎన్నాళ్ళిలా? మరో రెండేళ్ళు  జరిగిపోతే తమ ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సిన దినం రానే వస్తుంది.

పుట్టి పెరిగిన ప్రాంతం వదిలి మరో దేశవాసి కావటం  - పైప్ లో మంట చల్లారి పోయింది.

తనకు ముప్పయి అయిదేండ్లిప్పుడు... పాత ఫోటోలు తిరగేస్తే తప్ప తను పదేండ్ల ముందెలా వుండేవాడో జ్ఞాపకం రాదు.

కళ్ళల్లో కాంతి చచ్చిపోయింది... నీడలే మిగిలాయి... జుట్టు కూడా తన ఆశల్లాగే రాలిపోయి దువ్వెన అవసరం తీరిపోయింది.

చాలా రోజుల్నించి స్వదేశం గూర్చే ఆలోచనలు రావటం లేదు. 

 

“రేపు మాంట్రియాల్ పోవాలి... ఆ ఉద్యోగం దొరకాలి ------” అనుకున్నాడు.

 

ఈ విషయం తనకూ, మూర్తికి వాదన ప్రతి రోజూ జరిగేది.

 

“మనం నాలుగురోజులిక్కడ గడిపి, వెంటనే భారత రాజధానిలో కాలరెత్తుకు తిరగాలంటే వీలుకాదు. మనలాంటి వాళ్ళే, మనకన్న మంచి వాళ్ళే ఎందరో ఉన్నారు. అక్కడ. వారిని తోసి రాజని మనకు విమానం దిగక ముందే భారతీయులందరూ నెత్తిన కిరీటం ఉంచుతారనుకోవటం సబబు కాదు” అనేవాడు మూర్తి.

 

“మరి ఇన్నిరోజులు, ఇన్ని కష్టాలు పడి తల్లి తండ్రులకూ, ఆప్త మిత్రులకూ, భార్యా బిడ్డలకూ దూరం అయి సాధించినదానికి విలువే లేదంటావా? భారతీయుడు ఫలాని విధంగా అంతర్జాతీయ గౌరవం సంపాదించిన తర్వాత దానికి మనదేశం ఏ విధంగా ప్రతిఫలం ఇస్తుంది ! ముష్టి నాలుగు వందల రూపాయలు ! నీ నెత్తిన ఒకడు, వాడి పైన మరొకడు, వాడికి పైన మరో పెద్ద మనిషి ! ఇంతా చూస్తే వారికి తెలిసిందంతా న్యూటన్ పుట్టకముందున్న విషయాలు!”

 

“మరి నీకేం కావాలంటావు ? పోగానే యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావాలంటావా?

 

“అలా అనను - కాని పడిన శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వమంటాను. దేశానికి నేను సేవ చేయాలని అంటావు… కానీ దేశం నాకేమి ఇవ్వగలదో ఆలోచించు ! నా గౌరవానికీ, నా శక్తికీ, సామర్ధ్యానికీ తగిన పదవి ఆశించడం దేశ ద్రోహం కాదు కదా!” అనే వాడు తను.

 

“నువ్వు ఆ హోటల్ లో భోజనం ఎందుకు చేయవు? అక్కడ చాలా బాగుంటుంది” అని అడిగాడు మూర్తి, రావుని.

“నేను యింగ్లీషు ద్వేషిని... ఆ హోటలు బోర్డు ఆంగ్లంలో వుంటుంది” అన్నాడు.

నిజం కాని -ఒక్కటి మాత్రం చెప్పగలను.. మనం అదృష్టవంతులం... ఎలాగో ఇక్కడకు వచ్చి ఈ పశ్చిమ నాగరికతా ఫలాల్ని రుచి చూడగలిగాం.. ఇక్కడ సామర్ధ్యానికిచ్చిన ప్రతిఫలం మన దేశంలో దొరకదు. మనం అంత స్థాయి కింకా రాలేదు... మన తాహతు, శక్తీ, పెరిగినంతగా మన దేశమూ మొత్తం మీద పెరగలేదు. ఈ రెంటికీ స్వామ్యం కుదిరేదాకా ఇంతే…”

“అంటే నీ ఉద్దేశ్యంలో మనకూ, అక్కడే కూర్చున్న వాళ్ళకీ భేదం లేదు.”

“ఓ విధంగా అంతే… కానీ ఇలా చూడు... మనం మన దేశానికి ఎక్కువ సేవ చేయగలం... మనదేశానికి మనలాంటి వాళ్ళు కావాలి… పదవీ, అధికారం కాక ఆ తృప్తి ఉంటే చాలు మనకి.”

“అబ్బో! నా తృప్తి మరో వేపు ఉంది - నేను ఏ దేశానికి చెందినా నా మేధస్సు మానవాళికోసమే ఉపయోగిస్తుంటాను ! చాలా! “

తన మాటల్లో వ్యంగ్యం గుర్తించిన మూర్తి వాదన నిలిపేవాడు..

మూర్తి అలాగే అన్నాడు... అలాగే చేసాడు

తను అలా చేయలేదు...

నా తాహతూ, సామర్ధ్యమూ వినియోగించుకోలేని చోట -స్వదేశమైనా సరే - ఉండకూడదు... అది తన్ను తానే చిన్న బుచ్చుకోడమే కాక తను పడిన శ్రమనే వ్యర్ధం చేసినట్లవుతుంది.

డాక్టర్ మిత్రా పుస్తకాలన్నీ సర్దసాగాడు.

రేపు మాంట్రియాల్ ఉద్యోగం దొరికిందంటే - దొరుకుతుంది - తనకా క్వాలిఫికేషన్స్  అన్నీ ఉన్నాయి. ఈ దేశంలో పౌరుడిగా తను స్థిరపడిపోవడం ఖాయం... ఫైపులోంచి పొగ దట్టంగా లేచింది.

 

                                                *    *     *

 

డాక్టర్ రాయ్ చాలా రోజులుగా మాలలో భేదం గమనించాడు- వెళ్లే ముందు మూర్తి తన్ను చూడలేదు. కొన్ని రోజులకు ముందే తనకు కన్పించడం మానేసాడు. పని తొందర అనుకున్నాడు తను…

మాల కూడా మూర్తి విషయం అడిగితే ముభావంగా సమాధాన మిచ్చింది.

ఆ రోజు మాలకి వచ్చిన ఉత్తరం మూర్తి దే అని తనకు బాగా అనుమానం… చదివీ చదవక ముందే చించిపారేసింది మాల - తను అడగలేదు మాల చెప్పలేదు ఎవరు, ఏమిటి, అని.

 

“నా స్వార్ధం కోసం అనాలోచితంగా ఇక్కడ స్థిరపడిపోయాను... కాని మాల విషయం ఆలోచించనే లేదు… నేను… ఈ సమాజంలో మాల స్థానం ఏమిటి? భారతీయునికి, పాశ్చాత్య యువతికీ జన్మించిన ఆమెని వివాహం ‘చేసుకోవడానికి’ తను ఎవ్వరికి అనుమతి ఇవ్వగలడు? మూర్తి లాగే ఏ భారతీయుడు ధైర్యం చేయలేదు... మరి ఇక మాలతో బాటు నా వంశం అంతమై పోతుంది.

స్వచ్ఛమైన కాయస్థ రక్తం పల్చనై పూర్తిగా మారిపోతుంది”

 

“మాలా…” పిలిచాడు రాయ్.

మాల లోపల్నుంచి వచ్చింది. కూర్చోమన్నాడు రాయ్ ప్రక్కన. దగ్గరగా కూర్చుంది మాల.

“మాలా, ఈ వేసవిలో ఇండియాకి పోదామనుకున్నాను. ఓ రెండు నెల్లు.. మర్చిపోయానంతా… కానీ మిత్రులు, బంధువులూ ఉన్నారు... ఏమంటావు?”.

మాల మాట్లాడలేదు...

ఇండియా... తను ఏనాడో మర్చిపోయిన ‘జన్మ’ స్థలం. కథల్లాగే విచిత్రమైన దేశం....

కాని తను పోలేదు. ఆ అవకాశం జారిపోయింది. ఆ రోజే...

“నేను పిరికివాడ్ని మాలా, నాకేం కావాలో బాగా తెలుసు నాకు… కాని అందుకు కావాల్సిన త్యాగ బుద్ధి  నాకు లేదు. బహుశా నాకు మా పురాతన నియమాల్ని ధిక్కరించే ధైర్యం, శక్తి లేవనుకుంటాను... ఉంది ఉంటే ఈ ఉత్తరం కాక నేనే నీ చేతుల్లో పడి ఉండేవాడిని. ఇంతకన్నా ఏ వ్రాయగలను... నన్ను క్షమించు నీకు భగవంతుడు ఆనందం, సంపదా, సౌభాగ్యం ఇస్తాడని ఆశిస్తున్నాను-”

చిరిగిపోయిన కాగితం ముక్కలు గాల్లోకి ఎగిరి పోయినా, ప్రతి అక్షరం, పలుకూ తన మనస్సులో ముద్రితమై పోయాయి.

“ఏమిటమ్మా, ఆలోచిస్తున్నావు?” అన్నాడు రాయ్.

“ఏం లేదు, ఈ వేసవి సెలవల్లో నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. నీకు రాబర్ట్ తెలుసుగా. వాళ్ళ కంపనీలో… అతనే ప్రయత్నిస్తానన్నాడు...అసలు నీతో ముందే చెబుదామని…”

డాక్టర్ రాయ్ మిగతా ఏమీ వినపడలేదు... ఎప్పుడో యుగాల వెనుక లీలగా విన్పించిన ఘోష మెదిలింది మనస్సులో  - “వందే మాతరం.” అని.

****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

comments
bottom of page