MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
ఈ విమానాల సంసారం కాదనుకొండి!
వేమూరి వేంకటేశ్వరరావు
ఈ రోజుల్లో విమానపు ప్రయాణాలంటే విసుగేస్తోంది. కించిత్ భయం కూడా వేస్తోంది.
పూర్వం విమానపు ప్రయాణం చేసేమంటే అది సంఘంలో మన అంతస్థుకి ఒక గుర్తు, గుర్తింపు. ఇప్పుడో? ప్రతీ అబ్బడ్డమైనవాడూ, అంకుపాలెం వెళ్ళొచ్చినట్లు అమెరికా వెళ్ళీ వచ్చేస్తున్నాడు. పడవలో కాదు, విమానంలో. నిన్న మొన్నటి వరకు చెంబుచ్చుకుని బయలుకెళ్ళడానికి మించి ఇంటి గుమ్మం దాటని ప్రబుద్ధులంతా అకస్మాత్తుగా విమానం ఎక్కేయడంతో ``దోసెడు కొంపలో పసుల రేణము`` అని శ్రీనాథుడు అన్నట్లుగా తయారయేయి ఈ విమానాలు.
చెంబు, రేణము అనగానే మరో రెండు విషయాలు గుర్తుకి వస్తున్నాయి. ఈ మధ్య నా స్నేహితులలో కొందరు తెలుగుకి అంతర్జాతీయ భాషగా గుర్తింపు రావాలని చాల కుతూహలం చూపిస్తున్నారు. ఈ సందర్భంలో “అసలు అంతర్జాతీయ భాష” అంటే ఏమిటని చాల ఘాటుగానే (తెలుగు వాళ్లం కదండీ) ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించేసుకున్నాం. అంతర్జాతీయ భాష అంటే “అంతర్జాతీయ వేదికల మీద తెలుగు కనపడాలి” అన్నారు కొందరు. ఈ లెక్కని “ఎమిరేట్స్” వాడు తెలుగుని అంతర్జాతీయ వేదిక మీదకి ఎప్పుడో ఎక్కించేసేడు! ఎమిరేట్స్ వాడి విమానంలో ఎప్పుడైనా కక్కసు దొడ్డి వాడేరా? ఆసనం వెనక గోడ మీద తాటికాయంత తెలుగు అక్షరాలతో ఆ పరికరం ఎలా వాడాలో వాడు తెలుగులో రాసి పెడతాడు. ఇంగ్లీషులో కాదు, జపానీలో కాదు, తమిళంలో కాదు. తెలుగులో! తెలుగు మీద అభిమానం చంపుకోలేక దానికి ఫోటో తీసి తెచ్చుకున్నాను; ఇన్నాళ్ళకి తెలుగుకి, తెలుగు వాళ్లకి అంతర్జాతీయ వేదికల మీద రావలసిన గుర్తింపు వచ్చినందుకు.
కక్కసు దొడ్లు అంటే మరొక విషయం జ్ఞాపకం వస్తున్నాది. మన ఇండియన్సు ఎక్కువమంది ఎక్కిన విమానాలలో ఒక దృగ్విషయం గమనించేను; అందరికీ ఆ టోయిలెట్ కి వెళ్ళవలసిన అవసరం ఒకే సారి వస్తుంది - ఎవ్వరో సింక్రనైజ్ చేసినట్లు! ఒక సారి, నిక్కచ్చిగా చెప్పాలంటే 1964 లో, ఒక ప్రొపెలర్ విమానాన్ని అద్దెకు తీసుకుని భారతీయులం కొంతమందిమి అమెరికా నుండి ఇండియా వెళ్లేం. తెల్లవారే సమయానికి అందరం విమానం తోకలో ఉన్న టోయిలెట్ దగ్గర బారులు తీసేం. పైలట్ ``విమానం తూగిపోతోంది, కొంచెం ఎగువకి జరగండి బాబూ`` అని మొర పెట్టుకున్నాడు. నా చిన్నతనంలో బండి తోలే మా ఎర్రన్న ఇలాగే ``ఎగువకి రండి అమ్మా`` అన్నప్పుడల్లా మా అత్తయ్య, ``అలా ఆశీర్వదీంచు బాబూ, నీ బండి మళ్ళా మళ్ళా ఎక్కుతాను`` అనేది.
``ఆఁ, మీకు ఇండియన్సు మరీ లోకువ అయిపోయేరు. ప్రతీ చిన్న విషయానికీ మీరు ఇండియన్సు మీద అలా విరుచుకు పడడం ఏమీ బాగు లేదు`` అని కొందరు ఆప్తులు నన్ను పక్కకి పిలచి కూకలేసేరు. మీరు చెప్పండి. ప్రపంచంలో ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఇటువంటి ప్రవర్తన ఎక్కడేనా చూసేరా?
సాధారణంగా ప్రయాణీకులు విమానం ఎక్కే ముందు ఆ విమానం అవతలి గట్టుకి క్షేమంగా చేరుతుందో లేదో అనేది మొదటి భయం. ఈ విషయంలో నేను చెప్పగలిగే సలహాలు రెండు. ఒకటి, విమానం ఎక్కే ముందు ఆ వెంకటరమణమూర్తి కి ఒక దండం పెట్టుకుని, ఆ విమానంలో ఉన్నంతసేపూ రామా కృష్ణా అనుకుంటూ కూర్చోవటం. లేదా, రెండవ మార్గం ఏమిటంటే, ఎయిర్ పోర్టు లో కనిపించిన ఆ హరే కృష్ణా వాడికి ఐదో పదో ఇచ్చేసుకుని, వాడి దగ్గర భగవద్గీత ఒకటి పుచ్చుకొని దాన్ని పారాయణ చేసెయ్యటం.
ఇక రెండో భయం ఏమిటా అని కదూ అడుగుతున్నారు? చదవండి, తరవాయి కథనం!
విమానాలలో రెండు రకాలు ఉన్నట్లు నాకు అనిపిస్తుంది: పెద్దవి, బుల్లివి. మీ "ఫ్లైట్ నంబరు" ఎంత పొడుగ్గా ఉంటే మీ విమానం అంత బుల్లిగా ఉంటుందన్నది గమనించవలసిన మొదటి సూత్రం.
పొడుగాటి "ఫ్లైట్ నంబరు" ఉన్నటువంటి బుల్లి విమానాల్లో రెండు పుంజీలకి మించి సీట్లు ఉండవు. కనుక మీరు ఏ పది నెలల ముందో "రిజర్వేషన్" చేయించేసుకోవడం తెలివైన పద్ధతి. ముందే రిజర్వు చేయించుకున్నా కంపెనీ వాడిని కనీసం రోజుకి రెండు సార్లేనా టెలిఫోనులో పిలచి మీ సీటు మీ పేరనే ఉందో మరొకరి పేరుకి బదిలీ అయిపోయిందో చూసుకుంటూ ఉండండి. ప్రయాణం దగ్గర పడుతోందనగానే, కంపెనీ వాడిని ఆరేసి నిమిషాలకి ఒకసారి చొప్పున ఆరారా పిలచి మీ సీటుని ఖరారు చేసుకోవడం లో నాకు తప్పేమీ కనిపించటం లేదు. నన్నడిగితే రేపు ప్రయాణం అనగా, ఈ వేళే ఆ ఎయిర్ పోర్టు కి వెళ్ళిపోమంటాను.
పొట్టి "ఫ్లైట్ నంబరు" ఉన్న పొడుగాటి విమానాలు దేశపు ఈ కొస నుండి ఆ కొసకో, ప్రపంచపు ఈ కొస నుండి ఆ కొసకో వెళతాయి. ఈ రకం విమానాలలోనే మేం ఇండియా నుండి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద భోషాణపు పెట్లు రెండేసి చొప్పున పట్టుకొచ్చేవాళ్లం. న్యూయార్కులో దిగిన తరువాత మీరు బేంగర్, మెయిన్ వెళ్ళవలసి వచ్చిందనుకొండి. అప్పుడు ఈ భోషాణపు పెట్లు కానీ పైన చెప్పిన బుల్లి విమానాలలోకి ఎక్కించేమంటే అవి గాలిలోకి లేవలేవు. అసలు నన్నడిగితే ఈ సామానుని ఏ "ఫెడ్ ఎక్స్" లోనో పంపించేసి, ఆ "ఫెడ్ ఎక్స్" వాడు ఒప్పుకుంటే మీరు కూడా మరో శాల్తీ అనుకొని ఆ "ఫెడ్ ఎక్స్" విమానంలో లోనే బంగీలతో పాటు ఎక్కెయ్యండి. అవి పెద్ద జెట్ విమానాలు.
పోతే, బుల్లి విమానాలు ఎక్కే ముందు గేటు దగ్గర మన బరువెంత అని అడుగుతారు. ఎక్కడేనా మీ బరువుని దాచిపెట్టచ్చు కాని, అమ్మా మీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడ మాత్రం బరువెంతో నిజం చెప్పెయ్యండి. మీరు మొహమాటపడిపోయి వాడి దగ్గర బరువు తగ్గించి చెప్పేరంటే, విమానం కడితేరా గమ్యం చేరకుండానే పెట్రోలు అయిపోతుంది. తరవాత విచారించి లాభం లేదు.
మీరెంత ముందు జాగ్రత్తలో ఉన్నా, ఈ బుల్లి విమానం బయలుదేరే వేళకి మిమ్మల్ని బండి ఎక్కనిస్తారన్న భరోసా ఏమీ లేదు. ఎదురు గాలి ఎక్కువగా వుంది కనుక బండి సగం ఖాళీగా ఉంచాలి అంటాడు. ఇటువంటి పరిస్థితులలో మనం మన "స్టేటస్" ని చాటి సీటు సంపాదించడానికి పట్టు చీరలు కట్టుకున్నా, నగలు పెట్టుకున్నా, సూట్లు వేసుకున్నా ఏమీ లాభం లేదు. అందుకని అప్పుడే సర్జరీ లోంచి బయటకు వచ్చిన డాక్టరులా నీలం రంగు పజామా, జుబ్బా వేసుకుని, ఒక గుడ్డ టోపీ పెట్టుకుని ఎయిర్ పొర్టు కి వెళ్ళండి. ఓపిక ఉంటే, దార్లో ఏ టార్గెట్ లోనో ఆగి ఒక "బీచ్ కూలర్" కొని దాని మీద "రష్, హ్యూమన్ ఆర్గన్" అని ఎర్రటి అక్షరాలతో ఒక కాగితం అంటించేరంటే, మీ సీటుకి ఢోకా ఉండదు. గేటు దగ్గర వాడు మిమ్మల్ని "డాక్" అని పిలిచినప్పుడు మాత్రం ఎవరిని పిలుస్తున్నాడా అని వెనక్కి తిరిగి మాత్రం చూడకండి.
మొత్తం మీద మన ఏడుపు ఏదో ఏడిచి, గేటు దాటి బయటపడ్డాం అనుకుందాం. అక్కడ విమానానికి బదులు ఒక బస్సు ఉంటుంది. నిజంగా విమానం ఎక్కిస్తాడా లేక ఈ బస్సులోనే మన గమ్యానికి తీసుకుపోతాడా అని అనుమానం వచ్చేలా ఒక పావుగంట సేపు నానా సందులు, గొందులు తిప్పి చివరికి అగ్గిపెట్టెలలా ఉన్న నాలుగు విమానాల గుంపు దగ్గరకి తీసుకెళతాడు.
బోయింగు 747 ఒక ఏనుగులా కనిపిస్తే ఈ బుల్లి విమానాలు ఎలకల్లా కనిపిస్తాయి. మీ చేతులో ఏమైనా "కేరీ ఆన్ బేగేజి" ఉంటే ఒక ఆసామీ ఆ బుల్లి విమానం మెట్ల దగ్గర మీ సామాను అంతా పుచ్చేసుకుని, మిమ్మల్ని ఒక్కరినే విమానం ఎక్కమంటాడు. ఆ సామానుని విమానం డిక్కీలో వేసేసి అదే ఆసామీ విమానం నడపడానికి వస్తాడు కనుక మీరు పరాగ్గా వాడికి "టిప్పు" ఇవ్వడం లాంటి అపసంతి పనులు చెయ్యకండి.
మీరు చిన్నప్పుడు ఎప్పుడేనా చెరువు గట్టు దగ్గర నిలబడి చిల్ల పెంకుతో నీళ్ళ మీద కప్ప గంతులు వేయించేరా? ఒడుపు చూసుకుని చిల్ల పెంకుని నీళ్ళల్లోకి విసిరితే అది నీటి ఉపరితలాన్ని తాకుతూ, లేస్తూ, గెంతులు వేస్తూ వెళుతుంది. మన బుల్లి విమానం గాలిలోకి లేచిన తరువాత అలాగే కుప్పి గంతులు వేస్తూ వెళుతుంది. దారి పొడుగునా మన గుండె కాయ గొంతుకలోనే ఉంటుంది కనుక విమానం బయలు దేరే లోగా ఒక “వేలియం” మాత్ర పడేసుకొండి. ఆ మరచిపోయేను. ఆ మాత్ర వేసుకునే లోగా, ఒక కాగితం మీద మీ పేరు, చిరునామా, టెలిఫోను నంబరు, మీ "బ్లడ్ టైపు" వగైరా వివరాలు అన్నీ రాసేసి ఆ కాగితాన్ని అందరికీ కనిపించేలా మీ బట్టలకి అంటించేసుకొండి.
విమానాలు - ప్రత్యేకంగా బుల్లి విమానలు - తోలేవాళ్ళకి "ఫ్రీ వే" ఏదో "రన్ వే" ఏదో తేడా తెలియకపోవచ్చు. చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు "శ్రీ, చుక్క, దెబ్బ" వేసిన విధంగానే మొట్టమొదట "చెకిన్" అయిన ఆసామీని "పైలట్" గాను, వరుసలో రెండవ వాడిని "కోపైలట్" గానూ, మూడవ వ్యక్తిని "స్టువర్డు" గాను వేస్తారని ఎవరో అంటూ ఉంటే ఒక సారి విన్నాను. కనుక విమానం తోలడంలో మనకి ఎంత అనుభవం ఉందో వాళ్ళకీ అంతే ఉండి ఉంటుంది. అంత కంటే ఎక్కువ అనుభవం ఉంటే వాళ్ళకి కూడా పెద్ద విమానాలు తోలే ఉద్యోగాలే దొరికేవి కదా.
ఈ మధ్య ఇలా బుల్లి విమానాలు తోలి తోలి చివరికి పెద్ద విమానం పైలట్ గా చిన్న "ప్రమోషను" సంపాదించుకొన్న ఒక పైలట్ పిల్ల పరాకు చిత్తగిస్తూ - బర్బేంక్ అనే ఊళ్లో "రన్ వే" మీద ఆపడం మానేసి విమానాన్ని నేరుగా ఊళ్ళో ఉన్న పెట్రోలు బంకు దగ్గరకి తీసుకెళ్ళి ఆపిందిట. (ఈ రోజులలో ఆడ పైలట్లు కూడా ఉంటున్నారన్న మాట మరచి పోకండి.)
కారు తోలుతున్నాననుకుంది కాబోలు. బండి ఆగే లోగా ఒక సారి "లిప్ స్టిక్" రాసుకుందుకని "రియర్ వ్యూ మిరర్" లో చూసుకుంటూ ఉండుంటుంది. లేకపోతే సర్దార్జీ జోకులో చెప్పినట్లు "రియర్ వ్యూ మిరర్" లో కనిపించిన "రన్ వే" ప్రతిబింబాన్ని చూసుకుని, "అరె, దూరం వెళుతూన్నకొద్ది ఈ రన్ వే పొడుగౌతున్నాదే" అని హాశ్చర్య పోయే లోగా ప్రమాదం జరిగిపోయిందేమో.
నిజానిజాలు మనకి తెలియవు కదా.
ఈ సోదంతా మనకి ఇప్పుడు ఎందుకు కానీ విమానం ప్రయాణాలు మాత్రం పూర్వంలా "ఫన్" గా ఉండటం లేదు. రెండేళ్ల వయస్సప్పుడు ఇండియా వెళ్లి తిరిగొస్తున్న మా అబ్బాయి విమానం ఎక్కగానే “రామూ చిన్నాన్నా! ఇది బస్సా?” అని అడిగేడుట. “అన్నయ్యా! ఈ విమానాలు బస్సుల్లా తయారయేయని మన సునీలు ఎప్పుడో చెప్పేడురా” అని మావాడు నాతో అంటూనే ఉంటాడు. మరీ పిప్పళ్ళ బస్తాలో కుక్కీసినట్లు కుక్కేస్తున్నాడు. కాలు జాపుకుందుకి చోటుండదు. ఒళ్ళు విరుచుకోడానికి వీలుండదు. పోనీ కన్ను మూసి కునుకు తీద్దామంటే వెనక సీట్లో ఉన్న ఆసామీ ఒడ్డీ మంగలాడిలా మనని మోకాళ్ళతో గుద్దుతూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది? ఎలాగో ఒకలాగ కన్ను మూసేం అనుకొండి. ఉత్తర క్షణంలో "విండో సీటు" లో కూర్చున్న ఆసామీకి ఒంటేలుకి వస్తుంది.
విమానాలలో తిండి సంగతి నేను ప్రత్యేకం రాయక్కరలా! వాళ్ళు పెట్టే గడ్డి ఎలానూ తినలేమని తెలిసి కూడా బుద్ధి గడ్డి తిని "వెజిటేరియన్" భోజనం కావాలని అడిగేమనుకుందాం. మూడొంతుల ముప్పాతిక మనం అడిగిన "స్పెషల్ మీలు" వాళ్ళ కంప్యూటర్లో ఉండదు. మన పని గోవిందా! పోనీ మన అదృష్టం బాగుండి "స్పెషల్ మీలు" ఉందనుకుందాం. అప్పుడు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్న పక్షపాతం లేకుండా - అన్ని పూటలు ఒకే భోజనం పెడతాడు. ఏదో వాడే పోయాడు, సరిపెట్టుకుందాములే అనుకొని, ఆ తిండిని నోట్లో పెట్టుకుంటే, తస్సాదియ్య, దాని రుచి అట్ట ముక్కలా ఉంటుంది.
ఇలా “తిండి అట్ట ముక్కలా ఉంటుంది, రుచిగా ఉండదు” వగైరా నిందారోపణలు చేస్తూ ఉంటే "ఆ, మరీ డెక్కురుగొట్టు వాళ్ళల్లా ఏమిటి, వాళ్ళు పెట్టే తిండి కోసం విమానం ఎక్కుతామా మనం" అని ఒకావిడ ఒకసారి నన్ను నిలేసి అడిగింది.
"ఈ ప్రెషరైజ్డ్ కేబిన్ లో మన రుచి బొడిపెలు బాగా వికసించవండి. అంతే కాకుండా కేబిన్ లో పీడనం వల్ల ఆహారంలో "ఫ్లేవరు" ఉండి చచ్చినా అది మన ఘ్రాణ నాడుల వరకూ చేరదండి. అందుకని వాళ్ళు ఎంత బాగా వండినా ఈ విమానాలలో తిండి ఇంతకంటే బాగుండదండి" అని "పాప్యులర్ సైన్స్" లో ప్రవేశం ఉన్న ఒక పెద్ద మనిషి విమానాలవాళ్ళని వెనకేసుకొచ్చాడు.
ఇవన్నీ ఒక ఎత్తు, సింగపూర్ నుండి మద్రాసు వెళ్ళడం లో ఉన్న భయం మరొక ఎత్తు. నేనొకసారి ఈ కాలి మీద (ఈ "లెగ్" మీద అనడానికి నేను తెలుగులో పడుతూన్న తాపత్రయానికి నన్ను క్షమించి ఒదిలెయ్యండి) ప్రయాణం చేస్తున్నాను. విమానం గాలిలోకి లేచి కొంచెం కుదుట పడగానే నా ఎదురుగుండా ఉన్న ఒక ఆసామి లేచి, "ఓవర్ హెడ్ బిన్" తెరచి తన సంచి తీసేడు. సంచి లోంచి ఏదైనా పుస్తకం తీస్తున్నాడనుకొన్నాను. అది పుస్తకం కాదు. అదొక లుంగీ. ఆ లుంగీని బయటకు తీసి, కట్టుకున్న పేంటు చుట్టూ ఆ లుంగీని చుట్టి, లోపల నుండి పేంటుని బయటకి లాగి, పేంటుని మడత పెట్టి ఆ సంచీలో పెట్టేసి, సంచీని పై అరలో పెట్టేసి, తన సీట్లో మళ్ళా కూర్చున్నాడు. మనిషి కంగ లేదు. కానీ నా పక్కన కూర్చున్న ఆడ కూతురు మూర్చిల్లి పడిపోయింది. మద్రాసు వచ్చేవరకు మరి లేవలేదు.
ఆమ. "దట్సిట్."
*****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
ప్రొ. వేమూరి వేంకటేశ్వర రావు
ప్రొఫెసర్ వేమూరి వేంకటేశ్వర రావు గారు: అమెరికాలో తొలి తరం రచయితలలో అగ్రగణ్యులు. ఇటీవల ఒక వెబ్ పత్రిక దేశవ్యాప్తంగా “లివింగ్ లెజెండ్” గా ఆయనని గుర్తించడం అందుకు ఒక చిన్న ఉదాహరణ. చోడవరం లో పుట్టిన వేమూరి గారు తుని, మచిలీపట్నం కాకినాడ లలో విద్యాభ్యాసం తరువాత 1960 దశకం లో అమెరికాలో స్థిర పడి, యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా లో కంప్యూటర్ సైన్సెస్ లో ఆచార్యుడిగా పదవీ విరమణ చేశారు. అక్కడి బెర్క్ లీ లో తెలుగు విద్యాపీఠం నెలకొల్పారు. వైజ్ఞానిక ఇతివృత్తాలతో అనేక కథలు రచించి, అఖండమైన పేరు ప్రఖ్యాతులు గడించిన వేమూరి గారు జీవ నది, నిత్య జీవితంలో రసాయన శాస్త్రం, మహాయానం, విశ్వ స్వరూపం, ప్రాణి ఎలా పుట్టింది మొదలైన శాస్త్రీయ గ్రంధాలు, కించిత్ భోగే భవిష్యతి అనే వైజ్ఞానిక కథా సంపుటి, అమెరికా అనుభవాలు యాత్ర అనే స్వీయ చరిత్ర, ఒక బృహత్తర శాస్తీయ నిఘంటువు మొదలైన అనేక గ్రంధాలు, శతాధిక వ్యాసాలు, కథలు ప్రచురించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి జీవన సాఫల్య పురస్కార గ్రహీత. కాలిఫోర్నియా లోని ప్లెజన్ టన్ నివాసి.