top of page

వ్యాస ​మధురాలు

సీ.పీ. బ్రౌన్, తెలుగు తల్లి ఫ్రౌన్, నిజం డౌన్ (రెండవ భాగము)

నెల్లుట్ల నవీన్ చంద్ర

డాక్టర్ నెల్లుట్ల నవీన చంద్ర

ముందు మాట

అతిశయోక్తులంటే సౌందర్యలహరి గుర్తుకొస్తుంది. ఈ మహాకావ్యము లోని రెండవ, మూడవ శ్లోకాల అనువాదము చూడండి. అనువాదకర్త భవదీయుడే! భగవాన్ శంకరుని అతిశయోక్తులను చదివినప్పుడు పద రమణీయత , భావ సౌందర్యము, రస పోషకత్వము  చదువరుల మనస్సులతో దాగుడు మూతలాడి, పరవశం చేస్తాయి. ఎబ్బెట్టుగా అనిపించవు. ఇంకా చదవాలనిపిస్తుంది.

1. తల్లి పాద ధూళి దొక్క రేణు తోడ

కట్టు తాడు బ్రహ్మ విశ్వ మంత

రక్ష చేయు శౌరి వేయి తలల పైన

పూసుకొనును శివుడు దేహ మంత

 

2. మూర్ఖ తనము చీల్చు ఉదయ కాంతి

జాడ్య తనము మాడ్చు జ్ఞాన జ్వాల

లేమి తనము తీర్చు రత్న రాశి

మునుగు వారి పైకి దీయు పంది కొమ్ము

కాదె అమ్మగారి పాద ధూళి రేణు

 

నిజముగా “పార్వతి కాలి ధూళిదొక్క రేణు తోడ” ఇవన్నీ సాధ్యము అవుతాయా? కాని ఈ భావ ఔన్నత్యము, పదవిన్యాసము, రస నిర్దేశము మన హృదయాలను ఆకట్టుకొంటాయి. కావ్యరచనలో ఈ అలంకారము అద్భుతంగా కనిపిస్తుంది.

కాని అతిశయోక్తులు చరిత్రలో అసహ్యముగా వుంటాయి. సైన్సులో వీటికి చోటేలేదు.

బ్రౌన్ తనను గూర్చి తాను, స్వలాభపరముగా చెప్పుకున్న సంగతులు ఈ కోవకే చెందుతాయి. తెలుగువాళ్ళు ఒప్పుకుని ప్రచారము చేయడము బుద్ధిహీనతగా అనిపిస్తుంది. ఈ రెండవ వ్యాసములో మనం ఈ అతిశయోక్తుల గూర్చి చెప్పుకుందాం. అబద్ధాలను అబద్ధాలనకుండా ”terminological inexactitudes” అని సరిపుచ్చు కోవచ్చు.

 

ప్రధమ ప్రయత్నాలు

ఆంగ్లేయులకు ముందే తెలుగు దేశం పైన ఫ్రెంచి వాళ్ళు కన్ను వేసియున్నారన్నది చరిత్ర ప్రసిధ్ధం. ఆర్కాటు నవాబు మీర్ అహ్మద్ అలి ఖాను 1747 లో యానాము హక్కులను ఫ్రెంచి వాడైన సింఫ్రెకు హస్తగతం చేశాడు. వీరు వేయి తెలుగు వాడకాలను, వాక్యాలను  తమభాషలోనికి అనువదించి ప్రచురించి తమ దూరదృష్టి చూపించుకోడమేకాక వేమన పద్యాలను కూడా అనువదించి, ప్రచురించారు.  ప్రపంచ భాషలలో ప్రసిద్ధమైన మొదటి తెలుగు పుస్తకం ఇదే.  చందుర్తి యుద్ధములో ఇంగ్లీషు వాళ్ళు ఫ్రెంచి వాళ్ళను ఓడించి ఉత్తర సర్కారులను తమ వశములోకి తీసుకున్నారు. 1824లో ఫ్రాంకొ యొక్క ఈ తెలుగు ప్రయత్నము బ్రౌను కబంధ హస్తాలలో పడింది. మత ప్రచారం కోసం సులభ వాక్కులో, లోతైన భావాలతో, సంఘాన్ని ఖాతరుచేయని, ఆలోచనాత్మకమైన కృతి కోసం వెదుకుతున్నటువంటి ఈయనకు బెల్లప్పలా దొరికింది. ఇది చూసి ఎగిరి గంతేసి వుంటాడు మానవుడు.

దొరికిన ఏ రెండు పుస్తకాలలోనూ ఏ పద్యములోనూ పదాల పొంతన కుదరలేదు. ప్రచురించే ముందు కవితలను పొందుపరచి, ప్రామాణికము చేసే అవసరము వచ్చింది.  ఒక రాతగానితో, ఐదారుగురు పండితులతో కలిసి కావ్యాన్ని తయారు చేయించాడు బ్రౌను. ఒక ఏడాది పైనే అయింది పని పూర్తికావడానికి (1825, ప్రచురణ1829).

ఇదే పద్దతిలో రెండు ద్విపద కావ్యాలను రాఘవుని “నల చరిత్ర” (1841), గౌరన మంత్రిగారి "హరిశ్చంద్రుని  కష్టాలు” (1842) సంస్కరించి ప్రచురణకు సిద్ధం చేయించాడు. “వసుచరిత్ర” (1844) ను మిల్టను పుస్తకాల తోనూ, భట్టుమూర్తిని మిల్టనుతోనూ పోల్చి, తనకు మిల్టను అంటే ఇష్టము కావడం వలన, ఈ తెలుగు కావ్యకారుడంటే బ్రౌను చాలా ఇష్టపడ్డాడు. ఇంకొక కారణం భట్టుమూర్తి బ్రాహ్మడు కాకపొవటమని తానే చెప్పుకున్నాడు. ఇదే కారణము వల్ల వేమన అంటే ఇష్టపడ్డాడు అనేది నిస్సందేహమైన విషయం. ఎందుకోగాని పెద్దన గారి “మనుచరిత్ర”ను (1851) కూడా ప్రచురణకు సిధ్ధం చేయించాడు. శ్రీనాధుని ద్విపద కావ్యము “క్రీడాభిరామం” 1852 లో తయారు అయింది. ఈ రెండు కావ్యాలను సిద్ధం చేయడానికి  బ్రౌను ఎంతవరకు ఆమోదించాడో చర్చనీయాంశం. బ్రౌను “సుమతీ శతకం” 1973 లో సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు.

ఆరి సీతారామయ్య (West Bloomfield, MI, USA), పరుచూరి శ్రీనివాసు (Paderborn, Germany) లాంటి భక్తులు పుస్తక శాలలో కనిపించే అన్ని కావ్యాలనూ బ్రౌను సంస్కరించి ప్రచురించాడనీ, బ్రౌను తెలుగు వ్యాకరణము వ్రాసాడనీ, మొదటి నిఘంటువు వ్రాసాడని పుక్కిటి పురాణాలు చెబుతారు.  బ్రౌను వ్యాకరణము రాయలేదు. పండితుల కృషితో  తెలుగు ఛందస్సును వివరించే ఒక పుస్తకాన్ని సంకలనము చేశాడు. బ్రౌన్ లాక్షణికుడూ కాడు, కవి అంత కన్నా కాడు.  బ్రౌను మొదటి నిఘంటువును రాయలేదు కూడా!  కాంపుబెల్లు, మామిడి వెంకయ్య గారు బ్రౌనుకు ముందే తెలుగు నిఘంటువు వ్రాసారని చెప్పుకున్నాము. విపుల శబ్దశాసనుడైన మహాకవి నన్నయ్య గారు ఒక శబ్ద రత్నాకరము లాంటిది లేకుండా తెలుగులో పంచమవేదాన్ని రాయడానికి పూనుకొని  వుంటారా? అసలు ఇంగ్లీషులోనే 1755 వరకూ డా.సామ్యుయెలు జాన్సను వ్రాసేదాకా  ఒక నిఘంటువు లేనే లేదు. 

అప్పుడే పండితులలో ఒకరైన పఠం బ్రహ్మశాస్త్రి గారు భారతము చదవమని చెప్పినారు. కాని బ్రౌను చదివాడని తోచదు. ఒక మహాకావ్యాన్ని చదవడం వేరు, వేమన శతకమూ, సుమతి శతకమూ చదవడము వేరు. బ్రౌనుకు కావలసింది సులభశైలి.  ఆ శైలి భారతములో లేదు కదా! పాండిత్యమంటే ఏవగించుకునే బ్రౌను మహాభారతం జోలికి పోయి వుంటాడా అనే సందేహం కలుగక మానదు.  బ్రౌను భక్తులు అనేది ఏమంటే ఈయనే భారత భాగవతాలను చదివి, సిద్ధం చేయించాడని. భారతము రాసిన కవిత్రయము బ్రాహ్మలేనాయెను! ఈ విషయములో తెలుగు పండితులే చొరవ చూపించి వుంటారు.  బ్రౌను చూసీ చూడకుండా ఈ ప్రయత్నానికి  అడ్డంకులు పెట్టి వుండడు. ఈ ఐదు పుస్తకాలు (“నల చరిత్ర”, "హరిశ్చంద్రుని  కష్టాలు” , “వసుచరిత్ర “, “మనుచరిత్ర”, “క్రీడాభిరామం”) ప్రచురింపబడడముతో, సాహితీవేత్తలు ముందుకు వచ్చి ఇతర కావ్యాలను సంసిద్ధం చేసారని అంటే సత్యమునకు తలవంపులు రానేరవు. పురాణం హయగ్రీవ శాస్త్రి పోతన “భాగవతం”(1848), "వర్తమాన తరంగిణి" ఎడిటర్ పువ్వాడ వెంకట రావు సంపూర్ణ “మహాభారతం” ప్రచురించారు అని తేలుతున్నది.

బ్రౌను నీడ కూడా పడని కొన్ని మహాకావ్యాలు

తంజావూరు సరస్వతీ మహలు లో దేవనాగరి లిపిలో మహారాష్త్ర రాజులు రాసిన తెలుగు కృతులెన్నో వున్నాయని బ్రౌనుకు తెలిస్తే తెలుగు సాహిత్యం 1825 లో చచ్చిపడి వున్నదని అనేవాడు కాదు. అంతేకాదు. త్యాగయ్య అనే గొప్ప కవి, సంగీత వేత్త ఉన్నాడని బ్రౌనుకు తెలుసా? సాహిత్యమూ, సంగీతమూ సగ పాళ్ళలో ఉన్న బ్రహ్మాండమైన కళాఝరిని ప్రవహింపజేసి, దక్షిణాది అంతా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సమకాలీనుడు కదా! ఈ రామభక్తుడు మనకెందుకులే అని నిర్లక్ష్యం చేసాడా? లేకపోతే తెలుగు సాహిత్య ఉద్ధరణ ఉద్యమంలో ఉద్దండుణ్ణని తనను తానే వర్ణించుకున్నవాడు ఆయనను ఆదరించ వచ్చు కాదా! త్యాగయ్య గారికి గుళ్ళ వెంట బడి, చెప్పులు అరిగినట్లు తిరిగి, తన కవిత్వం తాను రాసుకోలేక, శిష్యులు రాస్తే నిలబడేది - లేకపోతే లేదు అనే దురవస్థ తప్పి ఉండేదికదా! అసలు కారణం “1825 లో తెలుగు సాహిత్యము చచ్చిపడి వున్నది, దానిని తాను ఉద్ధరించాననే” సిద్ధాంతానికి ఎక్కడ ఆఘాతం కలుగుతుందోనని వెరచి త్యాగయ్య గారి వైపు దృష్టి మరలించలేదు అన్నది తేటతెల్లమౌతున్నది కదా!  బ్రౌను అడిగినా ఆ తంజావూరు రాజుల ఆశ్రయాన్నే ఒప్పుకోని యోగీశ్వరుడు, మహానుభావుడు ఒక ఇంగ్లీషు వాడి అండ చేరేవాడా?

నేడు బజారులో దొరుకుతున్న ప్రతి క్లాజికలు పద్యము బ్రౌను ప్రచురించినదో లేక ప్రచురణకు సిద్ధము చేసినదో అని శీతారామయ్య ఆరి మరియు శ్రీనివాస్  పరుచూరి  గారలు నుడివిన వాక్యానికి ప్రత్యామ్నాయంగా నేను ఒక వంద పద్యాలు కాదు ఒక వంద కావ్యాలనే చూపిస్తాను.

బ్రౌను రక్షించని కొన్ని  మచ్చుతునకలు :

  1. కేతన గారి దశకుమార చరిత్రము

  2. నన్నెచోడుని కుమారసంభవం

  3. శ్రీనాథుని హరవిలాసం, ఇంకా ఇతర కృతులు

  4. తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యము

  5. పింగళి సూరన కళాపూర్ణోదయం, ఇంకా ఇతర కృతులు  

  6. మొల్ల రామాయణం

  7. అన్నమయ్య పదాలు

  8. క్షేత్రయ్య పదాలు

  9. త్యాగయ్య కీర్తనలు

  10. చిన్నయసూరి నీతిచంద్రిక

ఇంకా చాలా వున్నవి. మహాకవి ధూర్జటి "శ్రీకాళహస్తీశ్వర శతకం" కూడా ఈ కోవకే చెందుతుంది.

అతిశయోక్తులు వాటి పూర్వ పక్షం

అతిశయోక్తులలో అగ్రతాంబూలం బండి గోపాలరెడ్డికి ఇవ్వాల్సిందే.

బండి గోపాల రెడ్డి: “ప్రపంచం లోని అందరు తెలుగు అధ్యాపకులూ, అన్నీ అకాడెమీలూ, అన్నీ ప్రభుత్వాల  పరిశోధకులూ కలిసి చేసిన తెలుగు భాషా సేవ, ఒక్క సీ. పీ. బ్రౌన్ చేసిన దానిలో ఆవ గింజంతైనా వుండదు.”

ఉత్తరపక్షం: క్రింద ఉటంకించబడిన మహానుభావులు బ్రౌను కంటే ఎక్కువే తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికీ  సేవ చేసారు.

  • నన్నయ్యగారిని తెలుగులో ఆదికావ్యం రాయమని ప్రోత్సహించిన రాజ రాజ నరేంద్రుడు

  • తిక్కనను ఆదరించిన మనుమసిద్ధి 

  • శ్రీనాథుణ్ణి  పోషించిన అనేక రాజులు

  • ఎవరూ పోషించని, తనను  తాను పోషించుకున్న మహానుభావుడు, యోగీశ్వరేశ్వరుడు, మహాకవులలో అగ్రేసరుడు  బమ్మెర పోతన్న గారు

  • కవులను ఘనముగా సత్కరించిన, పోషించిన వారిలో అగ్రేసరేసరుడు కృష్ణదేవరాయ భూపాలుడు, ఆంధ్రభోజుడు

  • వాగ్గేయకారులకు నివాస స్థానములైన గుళ్ళూ, గోపురాలూ

 

అతిశయోక్తులలో రెండవ బహుమతి జనమద్ది హనుమచ్చాస్త్రికి పోతుంది.

జనమద్ది హనుమచ్చాస్త్రి (వేప చేదు ఫౌండేషను): “మినుకు మినుకు మంటున్న తెలుగు వాఙ్మయదీపాన్ని స్నేహసిక్తం  చేసి ప్రజ్వలింప చేసిన ఆంధ్రభాషోధ్ధారకుడు C. P. బ్రౌన్.”

సీతారామయ్య ఆరి మరియు శ్రీనివాస్  పరుచూరి  గారలు: “తెలుగు సాహిత్యం కనీ కనబడని దీనావస్థలో ఉండినది కొన్ని సాంఘిక మరియు రాజకీయ కారణాలవల్ల. పదునెనిమిదవ శతాబ్దములో దిగజారి పోయింది ఎందుకంటే - ప్రముఖమైనకారణాలు గొప్ప కవులు లేకపోవడమున్నూ, విజయనగర రాజులవంటి పోషకులు కరువైనందువల్లనూ.”

ఉత్తర పక్షం:  తెలుగు భాషా, తెలుగు సాహిత్యమూ దేదీప్యమనంగా, అఖండ జ్యోతిలా వెలిగింది 1600 నుందీ 1861 వరకూ, ఆ తర్వాత గూడానూ. ఈ పట్టీ  చూస్తే మీకే తెలుస్తుంది. క్షేత్రయ్య, శహాజి, ముద్దుపళని, సముఖము వెంకట క్రిష్ణప్ప నాయక, శ్యామ శాస్త్రి , త్యాగరాజ స్వామి, చిన్నయసూరి.  ఇటువంటి మహా సాహిత్యవేత్తలు తెలుగు ఆకాశములో గొప్ప తారలుగా వెలుగుతూ మనకు వెలుగునిచ్చిన ఉదంతము తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పడుతున్నది. వీరు మినుకు మినుకు మంటున్న దీపాలా? లేక జనమద్ది హనుమచ్చాస్త్రి గారికి అల్ట్రా వయొలెట్టు కళ్ళు ఉన్నాయా అని అనుమానము వస్తున్నది.  తెలుగు సాహిత్యం కనీ కనబడని దీనావస్థలో వున్నదా? లేక సీతారామయ్య మరియు శ్రీనివాసు గార్ల నిస్సారవంతమైన ఊహాకల్పనా?

“బ్రౌణోఛిష్ఠం జగత్సర్వం” అన్న నిడదవోలు సుందరేశ్వర రావుకు ఇంకొక బహుమతి పోతుంది. పాపం బాణుడెక్కడ వున్నాడో మహనీయుడు చాలా బాధ పడియుంటాడు, తనతో అపండితుడైన బ్రౌన్ను పోలిస్తే.  బాణుడూ, బ్రౌనూ ఒక సరి వాళ్ళా? ఇంత కన్న అతిశయోక్తి ఉన్నదా?

ఉత్తర పక్షం:  అసలు బ్రౌను చేసింది ఏమిటి? కొంత ప్రభుత్వ హోదాలో వుండడము వలన, కొంత అధికారము చేతిలో ఉండడము వల్లనూ, కొన్ని పుస్తకాలను సేకరించి, అచ్చు వేయించాడు. ఆ కాలంలో తెలుగు సాహిత్యము చచ్చి పోనూలేదు దానిని ఏ ఆంగ్లేయుడూ ఉధ్ధరించనూలేదు అని ఘంటాపధముగా చెప్పవచ్చు.

ఇక బ్రౌను ఏమన్నాడో విందాం. “Telugu literature was dying out; the flame was flickering in the socket in 1825, I found Telugu literature dead. In 30 years I raised it to life".

ఉత్తర పక్షం: పైన పట్టిక లో వున్న సాహితీ పరులు ఒక్కొక్కరూ ఒక దిగ్గజము. ఈ దిగ్గజాలు వెలసిన యుగంలో తెలుగు సాహిత్యము చచ్చి పోయి వున్నదా? ఒక ఇంగ్లీషువాడు ప్రాణం పోశాడా? ఎవరు చెప్పాలి? ఎవరు నమ్మాలి?

బ్రౌను ఐదు కావ్యాలను తాళ పత్రములనుండి కాగితము పైకి ఎక్కించాడు - మూడు ద్విపదలూ - నల చరిత్ర, హరిశ్చంద్రుని  కష్టాలు, క్రీడాభిరామం; రెండు కావ్యాలూ - వసుచరిత్ర, మనుచరిత్ర.  క్రీడాభిరామం సిద్ధం చేయడములో కొంత బ్రౌను చేయి ఉన్నా, మనుచరిత్రలో ఉండదని పైన చెప్పిన కారణాల వల్ల సందేహించవలసి వస్తున్నది.  రెండు శతకాలను అనువదించాడు - మత ప్రచారానికి వినియోగించుకున్నాడు. ఒక ఛందస్సును ఇంగ్లీషులోకి సంగ్రహించాడు.  ఒక నిఘంటువును ఇతరుల సహాయముతో, కొంత  కాపీ గొట్టి వెలిగించాడు. ఇంత మాత్రానికే ఈయన తెలుగును పునరుజ్జీవింప జేశాడా? తెలుగు చచ్చిపోనేలేదు కదా! మనము తెలుగు భాషలో మహాకవి ఆదికవి నన్నయ్య గారిని విపుల శబ్దశాసనుడు అని ఆదరించినట్లే ఇంగ్లీషు భాషలో మొదటి నిఘంటువు పరిష్కరించిన డా.సామ్యుయెలు  జాన్సనును శబ్దశాసనుడు అంటారు. బహుశ తనను  ఇంగ్లీషులో ఒక డా. జాన్సనుగా భావించ లేదు కదా?  డా. జాన్సనుకూ బ్రౌనుకూ హస్తిమశకాంతర భేదము వున్నది.

ఆ తాళపత్ర గ్రంధాలు కూడా శిథిలమైనవి గావు. మంచి కండిషనులో వున్నవి.  వాటిని బదులు పుచ్చుకుని, తన పని అయ్యాక మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు. అసలు, సిసలు ఉద్ధరణ రాజ రాజ చోళుడు శివ కీర్తనలను చిదంబరం గుడి నుండి పైకి తీయించడమూ, అయ్యంగారు అన్నదమ్ములు త్యాగయ్య తాళపత్రాలను సేకరించడమూ. అటువంటిది బ్రౌను చెయ్యలేదు.

నిజమైన ఉద్ధరణకు ఉదాహరణం:

రాజ రాజ చోళుడు ఒక సారి ఎవరో శివ కీర్తనలు చదవడం విన్నాడు. వాటి పుట్టు పూర్వోత్తరాలను గూర్చి వాకబు చేస్తే  అవి చిదంబరం గుడిలో వున్నాయని తెలిసింది. పూజార్లు వందల ఏళ్ళుగా తాము తాళం వేసి ఒక గదిలొ భద్రం గా దాచి ఉంచామని, ఆయా కవులు వస్తే నే తలుపుల తాళాలు తీయడం జరుగుతుందని నిష్కర్షగా చెప్పారు.అంతట రాజ రాజు ఆ నలుగురు కవుల విగ్రహాలు చేయించి గుడికి తెచ్చి "వీరే కవులు, తాళాలు తీయండి" అని అడిగారు. పూజార్లు ఆ విగ్రహాలను ఒప్పుకోలేదు.రాజు గారు గర్భగుడి వైపు చూపించి "దేవుడి విగ్రహం పూజిస్తారు కదా దేవుడని, ఈ విగ్రహాలను మాత్రం కవులని ఎందుకు అనుకోవద్దు?" అని అడిగితే, తమ అజ్ఞానానికి సిగ్గుపడి పూజార్లు తాళాలు తీసి తలుపులు తెరిచారు. ఆ తాళపత్రాలు చెదలు పట్టి వున్నవి. వాటిని బయటకు తీసి సంస్కరించి, తమిళ సాహిత్యానికి ఎంతో సేవ చేసారు రాజ రాజు. తిరుమురైని రక్షించాడు గనుక రాజ రాజ చోళుణికి తిరుమురై కండ చోళన్ అనే పేరు వచ్చింది. అంతవరకూ శివాలయాలలో కేవలము దేవతా విగ్రహాలే వుండేవి. ఈ సంఘటన తర్వాత  సంబందార్, అప్పార్, సుందరర్, మణిక్కవసాగరు, నంబి వంటి నాయనారు కవుల విగ్రహాలు కూడా పెట్టడం మొదలు పెట్టారు. సంబందార్, అప్పార్, సుందరర్ కవితలను ఏడు సంపుటలుగా, మణిక్కవసాగరు రాసిన తిరుకొవ్వారు మరియు తిరువాచకములను ఎనిమిదవ సంపుటముగా, ఇంకా తొమ్మిది కవుల 28 పదాలు తొమ్మిదవ సంపుటిగా, తిరుమలూరు రాసిన తిరుమందిరము పదవ సంపుటిగా, వేరొక పన్నెండు కవుల 40 పదాలు, తిరుతోతనారు-తిరువంతతి, మరియు తన పదాలూ, ఇంకా 63 నాయనార్ల పవిత్ర కీర్తనలు కలిపి పదకొండవ సంపుటిగా నంబి సంకలనము చేసాడు.  సెక్కిరాజు పెరియ పురాణం పన్నెండవ సంపుటిగా శైవమత ఉత్కృష్ఠ  గ్రంధముగా తీర్చిదిద్దినారు. దీనిని తిరుమురై అని ఉద్ఘాటించారు. బ్రౌను అలా చేయలేదు.  బ్రౌను ఉద్ధరించినదేమిటి? శిథిలమౌతున్న తాళపత్రాలను ఉద్ధరించి అందులోనుండి వచ్చిన సాహిత్యమును ఒక మతపు పవిత్ర సూత్రాలుగా రూపొందించి, ప్రకటించిన రాజ రాజ చోళుని ప్రయత్నము ముందు బ్రౌను చేసింది ఏమి పనికి వస్తుంది!

నిజాలు: "Colonialization and its forms of Knowledge, The British in India," (Princeton University Press 1996) లో Bernard S Cohn రాసాడు. మత ప్రచారానికి, దేశస్థులతో వ్యవహారాలు చేయడములో వ్యాకరణాలూ, నిఘంటువులూ, అనువాదాలూ పనికి వచ్చాయి.  తెలుగు సాహిత్యం ప్రచురించడం ప్రధమ ధ్యేయం కాదు. తెలుగు పండితులకు బ్రౌన్ కన్నా అధిక పాండిత్యమూ, విజ్ఞానమూ తమకు వున్నవని తెలుసు. తమను పనిముట్టుగా వాడుకుంటున్నారనీ తెలుసు (Cohn, P51).  బ్రౌన్ 40 ఏళ్ళు తెలుగు భాష కొసం కృషి చేసినవాడు బ్రాహ్మలు నౌకా భంగం చేసారని పితూరీలు చెప్పాడు.  కనపడని, అందుకోరాని ఆశయాలకు అర్రులు చాస్తారనీ, రోజూ వినియోగపడే వాటిని వారు నిర్లక్ష్యం చేస్తారని విమర్శించాడు (Cohn, P51).

కొన్ని ఆలోచనలు:

  • బ్రౌన్ వ్యాకరణాలు "మేడ్ ఈజీ” రకాలు.  పరిపాలితుల భాష అర్థం చేసుకోడానికీ, మాట్లాడడానికీ వాడుకున్నారు.          

  • ఏ భాషలోనైనా ఒక వేయి వాక్యాలు వస్తే చాలు సర్దుకు పోడానికి. ప్రయాణీకులకు 140 పదాలు వస్తే చాలు.

బ్రౌను తెలుగు నేర్చుకోవడము గొప్ప బ్రహ్మ విద్య అని చెప్పుతారు కొందరు. ఎంతమంది  భారతీయులు అనేక యూరోపు భాషాలలో నిష్ణాతులు కాలేదు? ఒక విదేశీ భాష నేర్చుకోవడము పాండిత్యపు అంతస్తుకు రావడమేనా? బ్రౌను తెలుగు పండితుడని ఒక్క భక్తుడు నిరూపించ గలుగుతాడా? తెలుగు పండితులు బైబిలును తెలుగులోకి అనువాదము చేసినారన్నదని చెప్పరుగదా ఈ భక్తులు.

  • ప్రపంచానికే వ్యాకరణ భిక్ష పెట్టిన పాణిని, పతంజలి పుట్టిన భారతదేశములో సాహిత్యమైన తెలుగును ఒక ఇంగ్లీషు   వాడు ఉద్ధరించాడని బాహాటముగా చెప్పడం దాస్యభావమేకాక, భావ దాస్యం కూడ ఔతుంది. హాస్యాస్పదము కూడా.

  • నన్నయ వ్యాకరణం వ్రాసే, విపుల శబ్దశాసనుడయ్యే, మహాభారతం  రాయడానికి పూనుకొన్నారు అన్నది మరచి పోవద్దు.

  • బ్రౌనుకు ముందే కాంప్బెల్లూ, మామిడి వెంకయ్య నిఘంటువులు రాసారన్నది జగద్విదితం.

 

మరి కొన్ని ఆలోచనలు:

  • బ్రౌను ఒక కవిని పోషించలేదు, గత కాలపు రాజులవలె

  • బ్రౌను ఒక కావ్యము రాయలేదు గత కాలపు రాజులవలె

  • బ్రౌను పండితుడు కాదు. లాక్షణికుడు అస్సలేకాదు

  • బ్రౌను ఒక శిథిలమైన తాళపత్ర గ్రంథాన్నిసంస్కరించలేదు

  • బ్రౌను మంచి కండిషను లో వున్న తాళ పత్రాలను బదులు తీసుకుని కాగితానికి ఎక్కించి, స్వంత దారుకు తిరిగి ఇచ్చేశాడు

  • బ్రౌనుకు తెలుసు ఆ స్వంతదారులు వాటిని జాగ్రత్తగా తమ పూజా గృహాలలో పెట్టి భద్రముగా చూసుకొన్నారు అని

  • అనేకమంది తెలుగు పండితుల సహాయముతో వాటిని సంస్కరించాడు

  • వీరికి వేతనము కూడా సరిగ్గా ఇవ్వలేదు అని ఆరుద్ర తన పుస్తకములో రాసాడు

లక్ష్మయ్య  మరియు విలియము టైలరు కథ (Cohn, P. 86,87):

  • కావెలి వెంకట లక్ష్మయ్య  తెలుగు కృతుల ఉద్ధరణకు ఒక ప్రాజెక్టును అత్యంత సమగ్రముగా విపులీకరించి తమ ఆధ్వర్యంలో  ఈ పనులను చేయించమని ప్రభుత్వము వారికి దరఖాస్తు పెట్టుకుంటే వారు ఒప్పుకోలేదు. "లక్ష్మయ్యకు అధికారంతో పని చేసే గుణగణాలు లేవు, ఏదో సహాయకారిగా మాత్రమే పనికి  వస్తాడు మిగిలిన తెలుగు వాళ్ళ మల్లే" అని అబిప్రాయం వచ్చింది. 

  • ఇలాంటి పనులను చేయడానికి శక్తి వున్న తెలుగు వాళ్ళను కాదని, ఇంగ్లీషువాళ్ళకు బాధ్యతాయుతమైన ఉద్యోగాలు ఇచ్చారు.

  • లక్ష్మయ్య ఉద్యోగం విలియం టైలరుకు పోయింది. భారత దేశమన్నా, భారతీయులన్నా అసహ్యించుకునే ఈ దౌర్భాగ్యుడు భారతీయుని మెదడు అధొగతిలో వుంది, వాళ్ళు చేసింది కొత్తది ఏమీలేదు అని దబాయించి, వీళ్ళకున్నదంతా ఈజిప్టు, చాల్డియా నుండి వచ్చింది అని అనడమేగాక, "హిందూ కపాలము సెల్టికు కపాలానికంటే చిన్నదయినప్పుడు, చాలా పెద్దదయిన ఆంగ్లోసాక్సను కపాలానికి ఇంకా తక్కువ స్థాయి లో వుంటుంది” అని అభిప్రాయపడ్డాడు. వాడింకా ఏమన్నాడంటే  "భారతీయులు గీచుకొని, కాళ్ళమీదబడి, తమ రాజులను పొగడడానికి మాత్రమే అర్హులు, అట్లాగే వారికి చిన్నప్పటినుండి పోషణ వచ్చింది".

మామిడి వెంకయ్య: మామిడి వెంకయ్యగారి కథ మొదటి భాగంలో చదువుకున్నాము.

క్షేత్రయ్య: క్షేత్రయ్య (1600–1680) కర్ణాటక సంగీతానికి ఎన్నో పదాలు, కీర్తనలూ రాసిన కవి.  నాలుగు వేల కృతులు రాసాడని నానుడి. కొన్ని మాత్రమే మిగిలి పోయాయి. తన ఆరాధ్య దైవము కృష్ణుడి పైన రాసినవి ఇవి.  బ్రౌనుకు ఈ సంగీతకారుడు తెలువడు. తెలుసుకోడానికి కూడ ప్రయత్నం చేయలేదు.

ఒక క్షేత్రయ్య పదం తెలుగు/సంస్కృతం  72/13 పదాల విభజన. తెలుగు పదాలే ఎక్కువగా వున్నవి వేమన పద్ధతిలో. బ్రౌను వీటిని ఎందుకు సంస్కరించలేదో?

ఎంత చక్కని వాడే నా సామి వీడెంత చక్కని వాడే || 9/9

ఇంతి మువ్వ గోపాలుడు సంతతము నా మదికి సంతోసము చేసెనే || 5/8

మొలక నవ్వుల వాడే ముద్దు మాటల వాడే || 6/6

తళుకారు చెక్కుటద్దముల వాడే || 4/4

 

తంజావూరు:  తంజావూరులోని సరస్వతి మహల్ గ్రంధాలయము - దేవనాగరి లిపిలో వ్రాయబడ్డ అనేక తెలుగు పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. వీటి కాలం 17-19 శతాబ్దాలు. వీటిలో గొప్ప సాహిత్యము వున్నది.

బ్రౌనుకు వీటి సంగతి తెలియదు. తెలిసినా తెలియనట్టు ప్రవర్తించాడు. కారణం తన సిద్ధాంతానికి భంగం కలుగుతుందని.  తంజావూరు మరాఠా రాజులు సంస్కృతమునూ, తెలుగునూ పోషించి తమిళమును నిర్లక్ష్యము చేయడముతో ఆ భాష వెలుగు ఆరిపోవడం మొదలు అయింది.  భోంస్లే వంశపు మొదటి రాజు వెంకోజి తెలుగులో ఒక ద్విపద రామాయణం రాసాడు. అతని కొడుకు షహుజి కూడా ఒక గొప్ప సాహిత్య, శాస్త్ర పోషకుడు. “అద్వైత కీర్తన” ఈ కాలపు గొప్ప కృతి.  తర్వాత వచ్చిన సర్ఫోజి-II , శివాజి  సాహిత్య, శాస్త్ర పోషణలో మునిగి పోయారు. రాజ్యము కోల్పోయిన తర్వాత కూడా మానలేదు. సర్ఫోజి-II సరస్వతి  మహల్ గ్రంధాలయం కట్టించి తన అమోఘమైన పుస్తక, చేతివ్రాతల సంకలనాలు దాంట్లో భద్ర పరిచాడు. దేశ భాషలందే గాక సర్ఫొజి-II ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చు, గ్రీకు, లాటిను భాషలందు కూడా నిష్ణాతుడు.

 

షహజి I (1684-1712):  కర్ణాటక సంగీత ప్రమాణాలు తంజావూరులో స్థాపింపబడ్డాయి. భారతదేశమంతటికీ అత్యంత మహాద్భుతమైన, పాండిత్య శ్రేష్ఠమైన తంజావూరు కొలువులో ఈ అత్యంత లావణ్యమైన సంగీతము సృష్టింపబడుటలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నాయక పోషక సంప్రదాయానికి తగిన వారసుడైన షహజీ ఈ సహనానికి ప్రతీకయై నిలిచి తెలుగు, మహారాష్ట్ర, సంస్కృత, తమిళ సంస్కృతులను తగిన పాళ్ళలో మేళవించి తంజావూరును పరిపాలింఛాడు. 

  • స్మృతులనూ, అనుభూతులనూ, ప్రతిబింబాలనూ రేకెత్తించే, లేవనెత్తే షహజి-I గానాలు సంగీతపరముగా క్లిష్టమై వెలుగుతూ వుంటాయి. చాలా తక్కువగా పాడబడ్డవిగాని, లేకుంటే, చాలా గొప్ప సంగీత విద్వాంసుడుగా గుర్తింపబడేవాడు.

  • మరాఠీవాడు కావడం వల్ల తెలుగును దెవనాగరి లిపి లో రాసాడు. బ్రౌనుకు షహజి-I తెలవడు.  తెలుసుకోడానికి కూడ ప్రయత్నం చేయలేదు.

 

సముఖము వెంకట కృష్ణప్ప నాయక: మదురై రాజు విజయరంగ చొక్కనాధుని (1706-1732) సేనానాయకుడు నాలుగు పుస్తకాలు తెలుగులో రాసాడు.  ఒక పొడుగాటి కవిత "అహల్యా సంక్రందనము"  ఈయన రాసిన గొప్ప సాహిత్య కృతి. జైమిని భారతం కూడా రాసాడు. ఎన్నో వచన వ్యాసాలూ రాసాడు.

ముద్దు పళని (బహుశా 1763):  ముద్దుపళనిని గూర్చి మొదటిభాగంలో కొంచెం చెప్పుకున్నాం. తల్లి, అమ్మమ్మల వలెనే ముద్దుపళని కూడా తెలుగు కవయిత్రి, దేవదాసి. ప్రతాపసింగు అనే తంజావూరు మరట్ఠా రాజు కొలువులో వుండిన ఈవిడ  తెలుగు, సంస్కృత సాహిత్యాలను ఆకళింపు చేసుకున్నది. ఆమె ప్రసిద్ధమైన రచన రాధికా సాంత్వనము. కలలో వచ్చి కృష్ణుడు రెండవ భార్య ఇళతో తాను శృంగారము జరిపినప్పుడు తన మొదటి భార్య రాధ ఎలా విరహముతో కృంగిపోయిందో అనే కావ్యాన్ని   రాయమని ఆదేశించినాడని ముద్దుపళని చెప్పింది.  ఆమె జయదేవుని అష్ఠపదులను కూడా తెలుగులో రాసింది.

అత్యద్భుతమైన, శృంగార  రస భరిత మైన గొప్ప కావ్యము రాధిక  సాంత్వనం (రాధికను ఓదార్చుట) పధ్ధెనిమిదవ నడుమ కాలంలొ 584 పద్యాలతో రాయబడ్డ, ఆంధ్రప్రదేశ్ బైట తెలవని తెలుగు సాహిత్య రత్నము, ఉద్గ్రంధము.  ఈ పుస్తకాన్ని 1990  ప్రాంతాలలో సూజి తరు, కే. లలిత గార్లు “Women writing in India from 600 BC to Present Day” అనే ఉత్తమ సంకలనములో ప్రకాశింపజేసి ఆ లోటు తీర్చారు. గుర్తుందా, బ్రౌను ఈ శతాబ్దములో తెలుగులో కవులే లేరని వాపోయాడు.

పశ్చిమ సంస్కారాన్ని అలవర్చుకున్న “సంస్కర్తలు”, విక్టోరియా రాణి నీతులలో వృధాగా విహరించి, తమ సంప్రదాయమూ, చరిత్రనూ మరచిపోయి, ఈ పుస్తకాన్ని ప్రభుత్వము చేత 1911 లో నిషేధింప జేశారు. పుస్తకాలను సేకరించి తగులబెట్టారు. కొన్ని మాత్రము ప్రజా వ్యాపారములో మిగిలి పోయాయి. దేశానికి స్వతంత్రము 1947లో వచ్చాక, మద్రాసు ముఖ్యమంత్రి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ నిషేధాన్ని తొలగించారు. ఇతర దేశ భాషలలోనికీ, ప్రపంచ భాషలలోనికీ ఈ పుస్తకాన్ని అనువదించే దినం ఎప్పుడో కదా!

ఈ కాలపు ఇతర కృతుల కొరకు 1995లో ప్రచురించబడ్డ M N Sarma And M V Sastry  గార్లు రాసిన History and Culture Of The Andhras  అనే పుస్తకాన్ని చదవండి.

శ్యామ శాస్త్రి  స్వర జతి  తెలుగు సాహిత్యకారుడు 1762- 1827: శ్యామ శాస్త్రి స్వర సాహిత్యాలకో ఉదాహరణ -

పల్లవి

రావే హిమగిరి కుమారీ

రావె హిమగిరి కుమారీ కంచి కామాక్షి వరదా  

మనవి వినవమ్మ శుభమిమ్మా మాయమ్మా …

 

... శ్యామకృష్ణనుతా విను నా చింతను వేవేగ దీర్చి అభయమియ్యవే కల్యాణీ

కంచి కామాక్షీ నీ పాదమే దిక్కు

 

ఈ స్వర జతి లోని పదాల కూర్పు, వాటి రమణీయత, వాటి లాలిత్యము ఏ సాహిత్యకారుని మనస్సును ఆకట్టుకోలేవు? పార్వతిని పదహారు పేర్లతో వర్ణించాడు - ఆమె అందము, ఆమె కరుణ, ఆమె ధైర్యము, ఆమె శాంతి, ఆమె శృంగారమూ, ఇంకా ఇతర గుణాలు రసభరితముగా ఇమిడ్చగలిగిన ఈ చాతుర్యము దేదీప్యమానముగా వెలుగుతున్న కాలము తెలుగు అవసానదశ అని ఎలా చెప్పగలిగాడు బ్రౌను? భావ గాంభీర్యత, భావ ఔన్నత్యమూ, విభిన్న భావభరితమూ అయి స్వచ్ఛమైన ఊట నీటివలె ప్రవహించు ఈ కవితా ఝరిలో ఓలలాడగలిగే  పుణ్యము ఎంతమందికి వున్నది? కంచి కామాక్షిపై వ్రాసిన ఈ ఒక్క తేనె తునక చాలు బ్రౌను స్వప్రచారానికి చేసిన సిద్ధాంతమనే మట్టి కుండను తునా తునకలు చేయడానికి! తమిళులైనా అత్యంత సుందరమూ, అత్యంత మధురమూ ఐన తెలుగులో తెలుగుదనాన్ని ఉట్టిపట్టినట్లు కరతలామలకముగా రాసిన శ్యామశాస్త్రి సామర్ధ్యమును మెచ్చుకోలేకుండా ఉండగలమా? బ్రౌను తెలుగు నేర్చుకున్నందుకే బాకాలు పట్టిన సాహితీవేత్తలు, చరిత్రకారులు ఒక తమిళుడు పోటీ భాష ఐన తెలుగులో ఇంత ప్రతిభావంతముగా రాసినందుకు ఎందుకు మెచ్చుకోలేదో?

త్యాగరాజు  (1767-1847):

  • పేరు:  కాకర్ల త్యాగబ్రహ్మం

  • జననం:  4 మే  1767, కంభం, ప్రకాశం  జిల్లా , ఆంధ్ర ప్రదేశ్  

  • మరణం:  6 జనవరి   1847 (వయస్సు 79), తంజావూరు జిల్లా, తమిళ నాడు

  • కర్ణాట సంగీత వాగ్గేయకారుడు            

  • ఆంధ్ర భాషోధ్ధారకుడు(?) బ్రౌనుకు  త్యాగరాజు తెలవడు       

త్యాగరాజ కీర్తన

ఎందరో మహానుభావులందరికి వందనములు....

... ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు 
రామభక్తుడైన త్యాగరాజనుతుని 
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

 

ఇది సాహిత్యము కాదని ఎవరనగలరు, బ్రౌను అతని భక్తులు గాకుండా? ఇందులో కవిత్వము లేదా? పదలాలిత్యమూ, రసపోషకత్వమూ, భావ ఔన్నత్యమూ, సహజ భాషా నిర్దేశమూ, తెలుగు పాండిత్యమూ ఈ పదములో కనుగొననివాళ్ళు  సాహిత్యాంధులు. ఈ లక్షణాలు గొప్ప సాహిత్యానికి గుర్తులు కావా? త్యాగయ్యగారు 1767 నుండి 1847 వరకూ ఇలాంటి పదాలనెన్నో (కొందరు అనడము 24000 అని) సృష్టించి, పాడి, ఒకరి అండ జేరక గుళ్ళ వెంట తిరిగి దక్షిణ  భారతమంతా ప్రసిద్ధి చెందాడే (తమిళ, కన్నడ, మలయాళ  దేశాలలో కూడ పేరు ప్రఖ్యాతులు  తెచ్చుకున్న తెలుగు మహానుభావుడే) బ్రౌనుకు సమకాలీనుడే త్యాగయ్య గారు, బ్రౌను 1825లో తెలుగు చచ్చిపడివున్నదని ఎలా అన్నాడు? ఆరుద్ర, బండి గోపాలరెడ్డి, హనుమచ్చాస్త్రి, ఆరి సీతారామయ్య, పరుచూరి శ్రీనివాసు, నిడదవోలు సుందరేశ్వర రావు ఏ విధముగా ఒప్పుకున్నారు ఈ అసత్యాన్ని? ఒప్పుకొని తెలుగు సాహిత్యానికీ, భాషకూ, చరిత్రకూ అంతులేని అన్యాయము చేయలేదా వీళ్ళు? తమ లాంటి తెలుగువాళ్ళు (త్యాగరాజు లాంటివాళ్ళు) చేసిన గొప్పదనము నేలకు రాసి, ఇంగ్లీషు వాడైనంత మాత్రాన బ్రౌను చేసిన ఒక అసత్యపూరితమైన ప్రకటనను హిమాలయమంత సత్యముగా మహత్వీకరించడమేనా? ఇలా చేయడానికి వీళ్ళ అంతఃకరణ  ఎలా ఒప్పుకుంది?

 

బ్రౌను సమకాలీనులు:  రామభక్తి లో సంపూర్ణముగా  మునిగిపోయి, వైరాగ్యంతో ప్రపంచసుఖాలకు పూర్తిగా విముఖుడైన  త్యాగరాజు తన అఖండమైన సంగీత సాహిత్యమును ఒక పధ్ధతి ప్రకారము క్రోడీకరించలేదు. త్యాగరాజు మరణించినప్పటి   పరిస్థితుల గూర్చి తన పుస్తకం "కృతి మణిమలై" లో కర్ణాటక  సంగీతములో గొప్ప కృషి చేసిన రంగరామానుజ అయ్యంగారు గారు చెప్పారు. ఆయన రాసిన 24000 కీర్తనలలో 1000 కంటే ఎక్కువ మిగులలేదు. మానుష్య, ప్రాకృతిక దుర్ఘటనలవలన నశించి పోయాయి. సాధారణముగా ఆయన రాముణి విగ్రహము ముందు పాడుతుంటే శిష్యులు వివరాలన్నీ తాళపత్రాలపైన రాసుకునేవాళ్ళు. ఆయన దివంగతులైనాక ఈ వివరాలన్నీ శిష్యుల  చేతులలోనూ, వారి వారసుల  కుటుంబాల చేతులలోనూ వుండి పోయాయి.  ఒక నిర్ధారించబడిన త్యాగరాజ సంపుటము లేకుండా పోయింది.

 

బ్రౌను లాగే పనిచేసిన  భారతీయులు:  త్యాగయ్య గారి కీర్తనలు ప్రజాబాహుళ్యంలో ప్రసిద్ధి పొందాయి. కాంచీపురం నాయన పిళ్ళై, సిమిజ్హి సుందరం అయ్యరు మరియు వీణై  ధనమ్మాళు లాంటి సంగీత విద్వాంసులు ఆయన పదాలలో నిబిడి ఉన్న సంగీత సృజనాత్మకానికి గల అనంతమైన దారులను గ్రహించి వారికి దొరికిన పదాలను ఒక పధ్ధతి ప్రకారము క్రోడీకరించారు. దీని వేకువలో విసుగు చెందని విక్రమార్కుని వలె పట్టుదలతో శ్రీ కే. వీ. శ్రీనివాస అయ్యంగారు మరియు శ్రీ రంగరామానుజ అయ్యంగారు బ్రహ్మాండమైన ప్రయత్నముతో అనేక అధ్యాపకులనూ, వారి కుటుంబాలనూ కలిసికొని వారి వద్ద వున్న తాళపత్ర గ్రంధాలను సేకరించారు. కే.వీ. శ్రీనివాస అయ్యంగారు “ఆది సంగీత రత్నావళి” మరియు “ఆది త్యాగరాజ హృదయం” (మూడు సంపుటాలు) ప్రచురించారు. రంగరామానుజ అయ్యంగారు “కృతి మణి మలై” రెండు సంపుటాలు బాహాటము చేసారు. అయ్యంగారు సోదరులు త్యాగయ్యగారి కృతులను శిధిలమైన తాళపత్రాల నుండి సంరక్షించి ప్రచురించడము బ్రౌను చేసిన పనులకన్నా తక్కువైనదా? ఆరుద్రలాంటి వాళ్ళు ఈ బృహత్కార్యాన్ని  ఎందుకు గమనించలేదు? ఇది భావ దాస్యమా లేక దాస్య భావమా?

ఇంకా, భావ సంగీతానికే ప్రాణము పోసిన సుబ్రమణ్య అయ్యరు తన స్వంత గ్రంధాలయములో విస్తారమైన సంకలనము పెట్టుకున్నారు. ఆయన శిష్యుడు టీ .కే. గొవింద రావు ఇంగ్లీషులో, దేవనాగరి  లిపిలో త్యాగయ్య గారి కీర్తనలను ఒక సంపుటిలో వెలువరించారు. త్యాగయ్య గారి సాహిత్యములో నిష్ణాతులైన టీ. ఎస్. పార్థసారథి గారు, త్యాగరాజ కీర్తనలను అర్థముతో సహా ప్రచురించారు. ఇంకా అనేక పుస్తకాలు ఈ మహానుభావుని పై వున్నాయి. దక్షిణ భారతములోని ఆంధ్రేతరులు త్యాగయ్యగారి సాహిత్య, సంగీత ఔన్నత్యాన్ని గుర్తించారు, కాని తెలుగు వాళ్ళు గుర్తించలేదు, అంతేగాక తెలుగు చచ్చిపోయిందన్నారు. ఇంతకన్న నీచత్వం ఏది? తమిళ సాహితీవేత్తలు ముందు సాహిత్యాన్ని గుర్తించారు- ఈ సాహిత్యానికి త్యాగరాజు గారిచ్చిన సంగీత వ్యాఖ్యానము తర్వాత వచ్చింది అని పరిశీలించి ఈ కృతులు అజరామరాలని తెలుసుకున్నారు. వారు తెలుసుకున్న సాహిత్య నిజాన్ని బ్రౌను ఎందుకు అర్థం చేసుకోలేదూ? బ్రౌను సంగతి వదిలేయండి, ఈ తెలుగువాళ్ళ బుధ్ధులేమైనవి అని అడుగకుంటే సంస్కృతికీ, నాగరికత్వానికీ, చరిత్రకూ, సాహిత్యానికీ, సంగీతానికీ  చేటు వాటిల్లుతుంది.

కర్ణాటక సంగీత త్రిమూర్తులు

శ్యామ శాస్త్రి: వేంకట  సుబ్రమణ్యను (1762 - 1827), తెలుగులో రాసారు. శ్యామ శాస్త్రిగా పేరొందిన ఈయన తమిళ బ్రాహ్మణుడు.  స్వరాక్షరాలను వినియోగించుటలో ఈయన సిద్ధహస్తులు. రాగమూ, పదమూ ఒకే మాత్రలో వుండడము దీని విశిష్ఠత.  

త్యాగయ్య, కాకర్ల త్యాగబ్రహ్మం (1767 - 1847) తెలుగులో వ్రాసారు. సంస్కృతములో అందె వేసిన చేయి.  పదవిన్యాసములో ఆయనకు ఆయనే సాటి. సంగీత రచనలో ఆయనకు పోటీ వచ్చే వారు ఎవరూ లేరు. భగవంతుని చేరడానికి సంగీతము కేవలము  ఒక మార్గము, ఒక విధానము. ఒక రాజు కొలువులో ఉండడానికి నిరాకరించిన ఒక యోగీశ్వరేశ్వరుడు..

ముత్తుస్వామి దీక్షితారు (1775 – 1835) ముఖ్యముగా సంస్కృతములో రాసారు. గురుగుహ అని సామాన్యముగా వ్యవహరించబడ్డ ఈయన హిందూస్తాని నడకలో తన గమకాలను సమ్మేళనం చేసారు. కర్నాటక సంగీతములోని అన్ని తాళాలలోనూ తన కృతులను రాసిన సంగీతకారుడు.   

పరవస్తు చిన్నయ సూరి; 1807–1861

చిన్నయ పరవస్తు వెంకట రంగయ్య అనే పండితుని కొడుకు. మద్రాసు పచ్చయ్యప్ప కళాశాల యందు అధ్యాపకుడుగా, ఈస్టు ఇండియా కంపెనీ సుప్రీము కోర్టులో న్యాయశాస్త్ర పండితునిగానూ పని చేశాడు. సంస్కృతము, తెలుగు, ప్రాకృత, తమిళ భాషలందు ప్రవీణుడు, నిష్ణాతుడు, పండితుడు. తెలుగు, సంస్కృతాల సంప్రదాయ విద్యలో గొప్ప నిపుణుడని ప్రాముఖ్యత  చెందినవాడు. తన జీవితకాలములో మూడు వంతులకన్నా ఎక్కువ కాలం పాఠశాలల్లోనూ, మద్రాసు ప్రెజిడెన్సీ కళాశాలలోనూ తెలుగు బోధించటంలో గడిపాడు. పంథొమ్మిదవ శతాబ్దములో ప్రసిధ్ధి చెందిన పండితులలో ఒకడు. తెలుగు భాష అభివృధ్ధికీ, ఉధ్ధరణకూ తన జీవితమంతా ధార పోసిన ధన్యజీవి . సూరి అతనికి ఇవ్వబడ్డ బిరుదు.

 చిన్నయ్యసూరి రాసిన పుస్తకాలలో ఆంధ్ర వ్యాకరణమును కూలంకషంగా పరిశోధించి కొత్త శైలిలో సమకూర్చిన  బాలవ్యాకరణం (1855) తెలుగువాళ్ళ కందిన అత్యంత అమూల్యమైన వర ప్రసాదం. ఆయన రాసిన ఇతర పుస్తకాలు: 1) నీతి చంద్రిక 2) సూతాంధ్ర వ్యాకరణం 3)ఆంధ్ర ధాతు మూలం 4) నీతి సంగ్రహం.  పంచతంత్రము లోని మిత్ర లాభము, మిత్ర భేదం అనువాదమే నీతిచంద్రిక.

సూరిగారి ప్రభావము: సూరిగారు సంప్రదాయ శైలిలో నమ్మకము ఉన్నవాడు. ఆయన వచనము కఠిన పద భూయిష్టమై, అలంకార భరితమై, పొడుగాటి వాక్యాలతో నిండినా, ఒక ప్రాకృతిక లయలో  బహు రమణీయముగా వుండును. కందుకూరి వీరేశలింగము గారి సంధి, కొక్కొండ వెంకట రత్నము పంతులు గారి విగ్రహమూ, పంచతంత్రంలోని మిగిలిన రెండు భాగాలు, సూరిగారి శైలి లోనే వున్నవి. ఇతర పండితులు గ్రాంధిక శైలి వ్యావహారిక శైలి కన్నా మంచిదని అభిప్రాయపడిరి. 1834లో మాట్లాడుకొనే భాషలో రచించబడ్డ  పంచతంత్ర  కథలు, మళ్ళీ గ్రాంధిక భాషలో తిరిగి రాయబడి 1870 లో ప్రచురించబడెను.

తుది మాట:  1825లో చచ్చి పడివున్న తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింప జేసాడనే సిద్ధాంతానికి జల్లెడలో ఎన్ని చిల్లులున్నాయో అన్ని బొక్కలే వున్నాయని నిరూపించడము అయింది. బ్రౌను హస్తవాసి పడని అనేక కావ్యాల పట్టిక  ఇవ్వడమైంది. పూర్తిగా చెదలుపడ్డ తాళపత్రాలను ఈయన ఉద్ధరించలేదు. మంచి స్థితిలో వున్న వాటినే వినియోగించుకుని, స్వంత దారులకు తిరిగి ఇచ్చేశాడు.ఈయన ప్రచురించక పోతే ఈ కృతులు చచ్చిపోయేవని అనడము సందేహాస్పదము అని నిర్ధారించబడ్డది. రాజ రాజ చోళుణి ఉదాహరణతో నిజమైన సాహిత్య ఉద్ధరణ ఎలా వుంటుందో విపులీకరించబడ్డది, నిరూపించబడ్డది! బ్రౌను వేమన, సుమతి శతకాలను అనువదించడానికి తను చెప్పిన కారణం అవి చాలా సులభ శైలిలో వున్నవని! పదాలూ, కృతులూ, కీర్తనలూ, స్వర జతులూ సులభ శైలి లోనే వున్నా వాటిని బ్రౌను తాకలేదు. కారణం? అవి మత ప్రచారానికి వినియోగపడవు.  అస్సలు వీటిని తోసిరాజన్నాడు కదా ! బైబులును తెలుగీకరించిన తెలుగు వాళ్ళ ఔదార్యానికీ, పదాలను ఆంగ్లీకరించని బ్రౌను సంకుచిత తత్వానికి తేడా చూడండి - ఒకటి  సుగంధ పూరిత మలయానిలమైతే, ఇంకొకటి దుర్గంధ భూయిష్టమైన మురికి  కాలువ! ఔనండీ, అన్నమయ్య వెంకటేశ్వరుడు, క్షేత్రయ్య మువ్వగోపాలుడు, శ్యామ శాస్త్రి కంచి కామాక్షి, త్యాగయ్య శ్రీరాముడు కిరస్తానీవాళ్ళకు ఏమి పనికి వస్తాయి, మనకే పనికి రానప్పుడు? సమర్థులైన తెలుగు వాళ్ళకు నిర్దేశక ఉద్యోగాలు ఇవ్వక, జాతితత్వము అనే జాడ్యముతో అంగవికలాంగులై, మేధా హీనులై బాధ పడుతున్న ఇంగ్లీషు అధికారులు, వీరిని తోసిపుచ్చి తెలుగు భాష ఉద్ధరణానికి తమ వాళ్ళనే పెట్టుకున్నారని లక్ష్మయ్య ఉదాహరణంగా స్థాపించబడ్డది.  తెలుగువాళ్ళకే  ప్రభుత్వము ప్రోత్సాహము ఇచ్చి వుంటే  బ్రౌను చేసిన పని వీళ్ళే చేసివుందురన్నది నిస్సందేహము. తెలుగు పండితులకు జీతాలు కూడా బ్రౌను ఇవ్వలేదని తెలుస్తున్నది.  బ్రౌను కవి కాడు, పండితుడు అస్సలేకాడు, లాక్షణికుడు కానేకాడు. బ్రౌను మనస్తత్వము  గూర్చి కొన్ని లక్షణాలు చెప్పడము అయింది. ఏ కాలములో బ్రౌను తెలుగు చచ్చిపోయిందన్నాడో , అదే కాలంలో, త్యాగరాజు గారి పదాలు సాహిత్య సంపూర్ణత్వముతో దేదీప్య మానముగా విరాజిల్లినవని నిరూపించబడ్డది. బ్రౌను తన సమకాలీనులను ఎరుగడో, లేక ఎరిగివున్నా వాళ్ళను త్రోసిరాజన్నాడు అని సత్యీకరించబడ్డది.  ఒక సిద్ధంతాన్ని ఏర్పాటు చేసుకుని, దానికి  వ్యతిరేకముగా వున్న నిజాలన్నిటినీ బ్రౌను నిర్లక్ష్యము చేసాడు అని చె(ఒ)ప్పుకోక తప్పదు. ఇందుచేతనే ఇది ఒక కపట సిద్దాంతము. దీనిని లేవదీసినవారూ, సమర్ధించిన వారూ కపటులు గారా మరి!  శ్రీ కే. వీ. శ్రీనివాస అయ్యంగారు మరియు శ్రీ రంగరామానుజ అయ్యంగారు బ్రహ్మాండమైన ప్రయత్నముతో అనేక అధ్యాపకులనూ, వారి కుటుంబాలనూ కలిసికొని వారి వద్ద వున్న త్యాగయ్య గారి కృతుల తాళపత్ర గ్రంధాలను సేకరించారు. వీరికి తెలుగు చరిత్రకారులు గౌరవమివ్వలేదు, వీరు చేసిన సేవ బ్రౌను చేసిన సేవకు తక్కువ కాక పోయినా. కనీసము ఇప్పుడైనా తెలుగు చరిత్రకారులు నిజాలను చెప్పుతారని ఆశిస్తున్నాము.

బ్రౌను పైని వ్యాసము మూడవ భాగము లో ఇంకా సంగతులు మీకు చేరవేస్తాను.

 

***

 

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

Bio

డాక్టర్ నెల్లుట్ల నవీన చంద్ర

నెల్లుట్ల నవీన్ చంద్ర గారి జన్మ స్థలం వరంగల్ నగరం. పుట్టిన తేదీ డిశంబర్ 17, 1941. ఉస్మానియా, ఎడ్మంటన్ -ఆల్బర్టా (కెనడా) లలో విద్యాభ్యాసం. Ph. D. (Physics) పట్టా పొందారు. భారత, కెనడా, బ్రజిలు, మొజాంబిక్  దేశాలలో పరిశొధకులు, అధ్యాపకులు, భూతత్వ-భూభౌతిక శాస్త్రఙులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. తెలుగు రచయితగా కథలూ, గేయాలూ, వ్యాసాలూ, సైన్సు పుస్తకాలూ రచించారు.
ఆయన చిన్నపిల్లల కోసం రచించిన Big Bang, Floating Continents, Life on Earth పుస్తకాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. తోట పనిలో సిద్ధహస్తులుగా టొరాంటో నగర బహుమతి పొందారు. 
Toronto Dharma Group ఉపన్యాసకులు. సంస్కృత, హిందీ భాష అధ్యాపకులు.సాంఖ్య-వైశెషిక అనుచారులు.గౌతమ బుద్ధునిపై ప్రీతి. కపిల మహర్షి ప్రాపర శిష్యులు. భగవత్ గీత,  ఉపనిషత్తులు ఇంగ్లీషులోకి అనువదించారు. తెలుగు భాష అంటే ప్రాణం. ప్రస్తుత నివాసం టొరాంటో, ఆంటేరియో, కెనడా. 

comments
bottom of page