top of page

వ్యాస​ మధురాలు

అమ్మ భాష: మా అనుభవాలు

డా. అల్లాడి మోహన్, ఎం. డి

ముందుగా ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి.  పుదూరు ద్రావిడులమైన మాకు, తమిళం మరియు తెలుగు రెండూ కూడా మాతృ భాషలే! ఆంధ్రప్రదేశ్   రాష్ట్రంలోని నెల్లూరులో పుట్టి పెరిగిన నాకు అమ్మ భాష తెలుగు  అంటే ఎంతో ఇష్టం!  ప్రస్తుత కాలంలో, కనీసం ఐదు నిమిషాల సేపు, పరభాషా పదాలు వాడకుండా, కేవలం తెలుగు భాషలో మాట్లాడలేకపోతున్న  వారిని  చూస్తుంటే మనసు కష్టంగా ఉంది.

మా తల్లిదండ్రులు కీ. శే. అల్లాడి ఐరావతి, రామన్ లు,  మా చిన్నతనంలో  మాకు తెలుగు భాషాభిమానం కలగాలని  చేసిన ప్రయత్నాలు  మరీ మరీ గుర్తుకు వస్తున్నాయి. నెల్లూరులో, ఆంగ్లమాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తున్నా, మా తండ్రిగారు, నాకు నా తమ్ముడు  అల్లాడి వెంకట శ్రీకుమార్ కు, ఐదవ సంవత్సరం నుంచే, పోతన భాగవతంలోని రుక్మిణీ కల్యాణం, గజేంద్రమోక్షం పద్యాలు; వేమన, సుమతి, భాస్కర శతకం లోని పద్యాలు రాగయుక్తంగా  పాడి,  వినిపించి , వీటన్నిటినీ  మాచే కంఠస్థం చెయ్యించబట్టే ఈనాటికీ వీటిని మేము మా పిల్లలకు నేర్పించగలుగుతున్నాము. సరదాగా కాలక్షేపానికి స్నేహితులతో మాట్లాడుతున్నా, ఉత్తరాలు రాస్తున్నా, మా తల్లితండ్రులు,  "మాట్లాడితే పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలి, అలాగే, వ్రాస్తే పూర్తిగా తెలుగులోనే వ్రాయాలి.  ఆంగ్లమో లేదా మరో భాషా  పదాలు  ప్రత్యామ్నాయ పదాలు  లేకపోతేనే  వాడాలి"  అని చెప్పేవారు. ఇలా చేస్తేనే భాష మీద పట్టువస్తుంది అనేవారు. ఇది ముమ్మాటికీ నిజం - నేను అనుభవపూర్వకంగా తెలుసుకొన్న సత్యం!

వేసవి సెలవులప్పుడు, రాత్రి పడుకొనేముందు ఆ రోజు దినచర్య  వివరాలు ఒక పుస్తకములో తెలుగులో వ్యాస రూపంలో వ్రాసి చూపించమనే వారు. ప్రతిరోజూ ఒక కొత్త తెలుగు  పద్యం నేర్చుకోవాలి  అని వారు నేర్పించిన  అలవాటు ఈ నాటికీ  మేము క్రమం తప్పకుండా పాటిస్తున్నాము, మా పిల్లలకూ నేర్పుతున్నాము. మా అమ్మ మున్సిపల్ హైస్కూల్ లో లెక్కల అయ్యవారమ్మ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి "ఉత్తమ ఉపాధ్యాయిని"  సన్మాన  గ్రహీత. మా చదువులు ఆంగ్ల మాధ్యమంలో సాగుతున్నా, అమ్మ తెలుగు మాధ్యమం పుస్తకాలు తెచ్చిఇచ్చి వాటిని కూడా ఇంటిదగ్గర అధ్యయనం చెయ్యమనేవారు. లెక్కలు కావచ్చు సాంఘీక శాస్త్రం కావచ్చు, విఙ్ఞాన   శాస్త్రమో,  మరొకటో  కావచ్చు, అమ్మ భాష లో, అదే "తెలుగు భాషలో" చదివితేనే   వీటిని సమగ్రంగా అర్ధం చేసుకోవచ్చు అని చెప్పేవారు! ఎంత నిజం! ఈనాడు, నేను వైద్య శాస్త్రానికి సంబంధించి గాని, మరో సాంకేతిక అంశానికి సంబంధించి గాని తెలుగులో మాట్లాడాలన్నా, వ్రాయాలన్నా నాకు  ఎటువంటి అసౌకర్యం అనిపించదు అంటే ఇది తల్లి తండ్రులు పెట్టిన భిక్షే కదా! 

మా తండ్రిగారు,  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, 6 జిల్లాలకు అధికారి.  ఎప్పుడూ క్షణం తీరికలేకుండా ఊర్లు తిరుగుతుండేవారు. కానీ,  నెల్లూరు “టౌన్ హాల్” లో కవి సమ్మేళనం గాని, అవధానం గాని జరిగితే, పని ఒత్తిడి ఎంత ఉన్నా తీరిక చూసుకొని  మా తండ్రి గారు మా అమ్మని,   తమ్ముడిని, నన్నూ, మా మాతామహులు కీ. శే. వజ్ఝల ఆదినారాయణ గారిని    ఈ కార్యక్రమాలకు తప్పకుండా తీసుకెళ్ళేవారు. ఆ  ప్రక్రియలలోని మాధుర్యాన్ని, రసానుభూతిని ఆనందించే అవకాశాన్ని  చిన్న వయసులోనించే మా పెద్దవాళ్ల పుణ్యమా అని మాకు కలగడము మా పూర్వజన్మ సుకృతం! ఇతర భాషలలో "కవిత్వం" ఉన్నా, "పద్యం" "అవధానం" తెలుగు భాషకు ప్రత్యేకమైన ప్రక్రియలు అని చిన్న నాటి నుంచే వారు నేర్పించినందువల్ల, తెలుగు భాషా సరస్వతికి మేము ఈ రోజు నిత్యార్చన చేసుకోగలుగుతున్నాము.

నా శ్రీమతి హిమబాల కూడా  తెలుగు  భాషాభిమాని కావడం నా అదృష్టం. మేమిద్దరం, ఎంతో ఇష్టపడే కార్యక్రమం  ప్రతి వారం  “ఈనాడు”  వార్తాపత్రిక  ఆదివారం అనుబంధంలోని "పదవినోదం"  పూరించడం. ఇలా కొత్త పదాలను వెతికేందుకు కనీసం వారానికొకసారైనా  తెలుగు  సాహిత్యాన్ని, నిఘంటువుని, అధ్యయనము చేసే అవకాశం  పొందుతున్నాము, రసానుభూతిని ఆస్వాదిస్తున్నాము. అలాగే మేమిద్దరం  క్రమం తప్పకుండా దూరదర్శినిలో (టీవీ లో), అంతర్జాలములో తెలుగు సాహిత్య  కార్యక్రమములు, కవిసమ్మేళనం,  అవధానం మొదలైన  కార్యక్రమాలు చూడడం   ఇష్టపడుతాము!

మా అబ్బాయి విక్రమ్ కు తెలుగు భాష పై  అభిమానము కలిగించాలని మేము నిరంతరంగా ప్రయత్నిస్తున్నాము. మా విక్రమ్ చిన్నప్పట్నుంచి, ప్రతి రోజూ వాళ్ళ అమ్మ వాడికి భోజనము తినే సమయము లో భాగవతము, శివపురాణము లేదా మర్యాద రామన్న కధలో, చదివి వినిపించడం ప్రారంభించింది (భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి పారిపోలేడు కదా!). ఇదే  అలవాటు ఇప్పటికీ కొనసాగిస్తున్నాము. పాత చందమామలు ఇటీవల ప్రారంభమైన బాలభారతం మొదలైన పుస్తకాలన్నీ తప్పక కొనుక్కొని ప్రతిరోజూ కాసేపైనా చదువుతాము.

మా ప్రయత్నాల వల్ల మా అబ్బాయి  (ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు) ప్రతిరోజూ తెలుగు వార్తాపత్రికను క్రమం తప్పకుండా,  ముఖ్యంగా వాడికి  నచ్చిన క్రీడారంగ వార్తలకై   చదవడం  ప్రారంభించినా, సమకాలీన తెలుగు సాహిత్యం, ముఖ్యంగా, తెలుగు కధ చదవడం  ఇష్టపడేవాడు   కాడు.   వాడికి,  తెలుగు కధ పై  ఆసక్తి   కలిగించేందుకు, అవసరాల రామకృష్ణారావు పిల్లల కొరకు రచించిన  "గణిత విశారద" (వాహిని బుక్ ట్రస్ట్  ప్రచురణ) చదివించే ప్రయత్నం చేసాము.   సరళమైన తెలుగు లో గణితం, చిక్కు ప్రశ్నలు,  నేపధ్యంలో సాగే ఈ పుస్తకం మావాడికి తెలుగు భాషా సాహిత్యం చదివేందుకు  ప్రేరణ అవుతుందని ఆశించాము. అలాగే మరో  ప్రయత్నం  కూడా చేసాము.  ప్రస్తుతం  రాయని భాస్కరుడైనా,   కొన్నేళ్ల క్రితం తనదైన  విలక్షణమైన “మణిప్రవాళ”  “త్రిభాషా”   శైలిలో  తెలుగునాట ఓ వెలుగు వెలిగిన రచయిత, ప్రఖ్యాత వైద్యులు అయిన  మెడికో  శ్యామ్  వ్రాసిన "శ్యామ్‌యానా  (వంగూరి ఫౌండషన్ ఆఫ్ అమెరికా ప్రచురణ)" లోని “ఐసిసియు కధ”  పరిచయము  చేసి  చదవమని ప్రోత్సహించాము.  ఆశ్చర్యకరంగా మావాడు ఈ కధ చదివి, ఈ పుస్తకం లోని ఇతర కధలను కూడ చదివాడు, తెలుగు కధలు చదవడం ప్రారంభించాడు.  ఈ రచయిత శైలి అచ్చ తెలుగు కాదు. మరి,  "వ్రాస్తే/మాట్లాడితే   ఒక్క భాషలోనే వ్రాయాలి/మాట్లాడాలి" అన్న మేము పాటించే  సూత్రానికి విరుధ్ధంగా తెలుగు కధ పై మక్కువ కలిగించేందుకు ఈ రచయిత కధ ఎందుకు ఎన్నుకొన్నామా?  అని ఆలోచించాము. వైద్య, సాంకేతికత   నేపధ్యం, మంచి తెలుగు భాషా విన్యాసం ఉన్న రచన అయినందువల్ల  మా వాడికి నచ్చుతుందేమో,  తెలుగు కధలు చదివేందుకు  ప్రేరణ  అవుతుందేమో అన్న అంతర్లీనమైన అలోచనే దీనికి ప్రేరణ అయ్యి ఉండవచ్చు! బహుశా  ఇది “తెలిసిన/ఇష్టమైన విషయంతో  ప్రారంభించి, క్రమంగా తెలియని కొత్త విషయాలు  నేర్చుకోవడం” అన్న సూత్రానికి నిజజీవితంలో ఉదాహరణేమో అనిపించింది.  ఇప్పుడు మేము కలిసి భోజనం చేసేటప్పుడు   ఇటీవల   ప్రచురించబడిన   తెలుగు కధల గురించి  చర్చించడము మా దినచర్య లో భాగమైనది.

తిరుపతిలోని మా శ్రీ వెంకటేశ్వర వైద్య  విజ్ఞాన సంస్థలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో తెలుగు పద్య పఠనం, ఇతరభాషా పదాలు వాడకుండా చెప్పిన అంశంపై కేవలం  తెలుగులోనే మాట్లాడడము  వంటి పోటీలు ప్రవేశ పెట్టాము!  సభలు, సమావేశాలలో   కార్యక్రమాలకు   నేను తెలుగు  మాధ్యమంలో సమన్వయకర్తగా    వ్యవహరించేటప్పుడు,  వేదిక ఏదైనా…  హాయిగా అమ్మ భాషలో (తెలుగు భాషలో) మాట్లాడే అవకాశం కలిగినప్పుడు కలిగే ఆనందం అసాధారణమైన అనుభూతి,  భగవంతుడు నాకు ఇచ్చిన వరం!

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

bio

డా. అల్లాడి మోహన్, ఎం. డి

డా. అల్లాడి మోహన్, ఎం. డి. : డాక్టర్ అల్లాడి మోహన్ నెల్లూరులో జన్మించారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్  మెడికల్ సైన్సెస్ లో  ఎం. డి. (మెడిసిన్) డిగ్రీ పొందారు.   వీరి  200 పైగా పరిశోధన  పత్రాలూ, సాంకేతిక  వ్యాసాలూ  వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరు రెండు వైద్యశాస్త్ర సాంకేతిక  పత్రికలకు సంపాదకత్వం నిర్వహిస్తున్నారు.  వీరి సంపాదకత్వంలో వెలువడిన నాలుగు పుస్తకాలలో,   "ట్యూబర్కులోసిస్" అనే పుస్తకం వైద్య విద్యార్థులకు పాఠ్యగ్రంధంగా స్వీకరించబడి బహుళప్రాచుర్యం పొందింది.  వీరు ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వేంటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో ఆచార్యులు, మెడిసిన్ విభాగాధ్యక్షులుగా విద్యాభోదనా, వైద్యసేవలూ అందిస్తున్నారు. వీరికి తెలుగు భాష పై  మక్కువ ఎక్కువ!

comments
bottom of page