MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
'అలనాటి' మధురాలు
మా అవ్వతో వేగలేం… తిరునాళ్ళలో తప్పిపోయింది
స్వర్గీయ దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి
1940 దశకం లో 'ఆకాశ వాణి" వారి "వాణి' పత్రికలో మదటి సారి ప్రచురించబడింది
మా అవ్వ నెరగరూ మీరూ, అవ్వని? హయ్యొ! సుబ్బమ్మవ్వని? మా వూళ్ళో ఆవిణ్ణి యెరుగనివాళ్ళు లేరే! అసలు వూరంతా అవ్వనే పిలుస్తారావిణ్ణి. కొద్దిమంది "సుబ్బమ్మవ్వగారూ" అని కూడా అంటారు. ఆవిడికి కోపం వొచ్చినప్పుడు, "ఆఁ ఆఁ, ఆఁ! ఎవర్రా అవ్వ! నువ్వు నాకేమవుతావురా? చస్తే దెయ్యమవుతావుగాని!" అని గద్దిస్తుంది; అప్పుడు చటుక్కున సర్దుకుని "సుబ్బమ్మగారు" అంటారు. వొక్కొక్కప్పుడు, 'సుబ్బమ్మగారూ' అని పిలిస్తే, 'హారి గాడిదా! వేలెడంతలేవు, బొడ్డుకోసి పేరెడతావురా నాకు!' అని దులిపేస్తుంది వెంటనే దిద్దుకుని "అవ్వగారూ!" అంటారు.
ఏఁవయితేనేం, ఆవిడంటే అందరికీ యిష్టఁవే. అవ్వంటే.
అవును అందరికీ యిష్టఁవే మరి! వాళ్ళకేంపోయింది. యిష్టం కాక! యెప్పుడో కనిపిస్తుంది వాళ్ళకి; కనిపించినప్పుడు యంచక్కా కుశల ప్రెశ్నలూ అవీ వేస్తుంది; సావెఁతల్తో సాతాళించి కబుర్లూ కథలూ చెబుతుంది; మాంచి ఫారంలో వుంటే, అంటే వొడుపులో వుంటే, పాటలు పాడుతుంది, పాఁవుపాటా,అవీ. ఆ కాస్సేపూ వాళ్ళకి కులాసాగా వుంటుంది. వింటారు. పోతారు. వాళ్ళకేం. హమేషా ఆవిడితో యింట్లో వుండేవాళ్ళం, మేం వేగలేక చస్తున్నాం గాని!
అన్నట్లు--అవ్వంటే మీరెరగరన్నారు కదూ. సుబ్బమ్మవ్వ; ఆవిడ మమ్మల్నెలా యేడిపిస్తుందో చెప్పే ముందు ఆవిడా రూపురేఖలూ ధోరణీ మీకు తెలియద్దూ! మా అవ్వంటే, సుబ్బమ్మవ్వ. మా నాన్నగారి మేనత్త. ఆయన్తాలూకు అయిదెకరాల పొలఁవూ అప్పారం లోగిలీ వగైరా ఆస్తితో అవ్వకూడా నాకు సంక్రమించింది. మా నాన్న మేనత్తంటే దాదాపు డబ్బయేళ్ళపై మాట గదా! అయితేఁ? నడుం నిటాగ్గూ కదురులా నిలబెడుతుంది. యిష్టం లేనప్పుడు మాత్రం తెలుగులో 'ఐ' అక్షరం లేదూ, 'ఐ'-దానిలాగ వొంగిపోతుంది. తరుచు కంఠం రైలు గంటలాగ గణగణా పలికిస్తుంది; యిష్టం లేనప్పుడు పీలగా మూలుగుతుంది. ఈ మధ్య కొంచెం చెడ్డా, గెద్దచూపులాఁటిది అవ్వచూపు, అయితే పళ్ళు మాత్రం తీయించెయ్యటమో రాలిపోవడఁమో జరిగింది. వొఖటే వొఖ పైపన్ను మాత్రం, ముందుది కింది పెదవి మీదికి వొంగి అక్కడ కాలూది మాట్టాడుతున్నప్పుడు రవ్వంత తలాడిస్తూ వుంటుంది. అది అందానిక్కాబోలు వుంచేసిందవ్వ, సుబ్బమ్మవ్వ. మా యింటికొచ్చిన వో పెద్దమనిషి-అప్పన్న శాస్తుర్లని మాంచి కవి గూడా- ఆయనొకసారన్నాడూ చమత్కారంగా "ప్రెపంచంలో యే ప్రభుత్వఁవూ చెయ్యలేనిపని సుబ్బమ్మవ్వగారు చేసిందండీ! వొకేవొఖటి తప్ప యే పన్నూ లేకుండా చేసిందీ!" అని, అయితే అవ్వ మాట్టాతుంటే మాత్రం అతి స్పష్టంగా తెలుస్తుంది.
కొందరు పళ్ళులేనివాళ్ళ నోరు లక్కపిడతలాగ డొల్లగా వుంటుంది. మాట్టాడుతుంటే యేఁవీ తెలీదు. రొచ్చులో నడుస్తున్నట్టు పుసుకూ పుసుకూ గాలిపోసుకుంటుంది, అంతే;
పాత రబ్బరు బొమ్మ నొక్కితే చప్పుడైనట్లు. అవ్వలాగాదు.
అయినా వో లోపం వుంది. అవ్వ మాటల్లో 'ప', 'ఫ 'అని పలుకుతుంది. "కఫ్ఫూ, పఫ్ఫూ, చెఫ్ఫూ అంటుంది- ఆ వొంటిపన్ను వల్ల.
అసలు అవ్వదీ, సుబ్బమ్మవ్వదీ పెద్ద జాతీయ నాయకుడి వుపన్యాస ధోరణి. అయితే అవ్వ తెలివిగా మాట్లాడుతుంది. వోసారీ, వుపన్యాసాల్తో దేశాన్నంతటినీ తలదిమ్మెక్కించే వో పెద్దమనిషి మా యింటికొచ్చాడు. ఆయన సభలోనే గాక, సభ యివతలకూడా సభలో అంతా మాట్టాడతాడు. మా ఇంటికొచ్చిన పదినిమిషాల్లో మొదలెట్టాడు ప్రసంగం. మరి పది నిమిషాల్లో అవ్వ కలగజేసుకుని రంగస్థలంలో విరగబడింది. ఆ నాయకుడు గారు తోకజాడించి, నాటికీ నేటికీ అవ్వకి 'నమస్తే'. అంతే! ఆవిడ సన్నిధానంలో నోరు విప్పడు.
వెనుకటికి వోకవిగాడు చెప్పినట్టు "నిప్పుల, నీళ్ళను, చప్పిడుప్పిళ్ళను, తీర్థాల, తిరునాళ్ళ త్రిప్పటలను" గడిదేరి గడ్డకట్టిన ఘటం అవ్వ.
వోపెళ్ళికి కాస్త ముందో వెనకో పోయాడు పెనిఁవిటి. డబ్భైయేళ్ళపైని యేకధాటీగా అంటే యేకటాకీని వైధవ్య రాజ్యాన్ని పరిపాలించి పారేసిన రాణీ బహద్దర్. గడ్డు బ్రహ్మచారిణి. యాక్సిడెంట్, అంటే ఏ కారో రైలో కలగజేసుకుంటే తప్ప మార్కండేయాది చిరంజీవుల లిస్టులో మనిషి, మా అవ్వ, సుబ్బమ్మవ్వ.
నాలుగ్గంటలకే లేచి తొలికోడిని లేపడం, తలుపులన్నీ తెరిచి పారేసి పాచిపనులూ అవీ చెయ్యడం, చెంబులూ గిన్నెలూ చప్పుళ్ళు చెయ్యడం, స్నానం చెయ్యటం, పత్తిరాట్టంలాంటి కంఠఁవెత్తి 'ప్రాత స్మరామి’ వగైరా శ్లోకాలు చదవటం, మా నిద్దర తగలెయ్యటం- ఇలాగ రోజంతా జరిగే తంతును గూర్చి ఆట్టే చెప్పడం నాకిష్టం లేదు. ఈ వివరాలు కూడాచెప్పకపోదును. కాని మీకోసఁవే చెప్పా ఇదంతా. అవ్వ ధోరణిలో చెప్పవలిసివస్తే యెప్పుడయినా అవ్వ యెదురయితే చప్పున తప్పుకుని దాటి పోవచ్చని మీరు!
అంతేగాక, ఇవన్నీ చెబితే గాని మేఁవావిడితో యెలా వేగిపోతున్నాఁవో మీకు తెలీదనిగూడా ఇన్ని వివరాలిచ్చా మీకు. యింట్లో మమ్మల్ని ప్రతీ ఘడియా యేడిపించే పనుల్ని గురించి నేను చెప్పనే లేదు.
హయ్యొ, బాబో! యేఁ నవ్వండీ బాబూ! కోటయ్యగారు క్లీన్గా భోంచేసిన విస్తట్లోనే కొత్తదనుకున్నానని, మా శాషమ్మ దొడ్డమ్మకి మళ్ళీ వొడ్డించడం, నీళ్ళనుకొని చెంబుడు చామర్ల కోట పప్పునూనితో చెయ్యి కడుక్కోవడం, యెంగిలి విస్తళ్ళన్నీ కట్టగట్టి గోడమీదనుంచి వీధంట వెడ్తున్న మేస్ట్రీటు వీర్రాజుగారి తలమీద పడేటట్టు విసిరివేయడం, గోవిందరావుగారి చేతిమీద వేడిపులుసు వొడ్డించాలని వొడ్డించడం--- ఈ గొడవలన్నీ ముందు ముందు మీకు తెలుస్తాయి. అలాగే సినిమాకు వెళ్ళడం, సర్కస్ వాళ్ళ బోనులదగ్గిర కదలకుండా నిలబడి అక్కడ జెంతువుల్తో జెతకట్టడం శాసనసభ సీటు కోసం మా వూళ్ళో చేసిన పెద్ద యెన్నికల సభలో రభస చెయ్యడం-- ఇలాంటివన్నీ కూడా యిప్పుడు కాదు. తర్వాత చెప్తా.
అయితే వో చిన్న సంగతి చెప్పి- అది చెప్పి తీరాలి-- ఆవిడ తిర్నాళ్ళలో తప్పిపోవడం దగ్గిరకొస్తా.
అప్పన్న శాస్తుర్లుగారని చెప్పానే ఇందాకా, కవిగారు, ఆయన వోసారి అవ్వమీద పంచరత్నాలు చెప్పాడు. భోజనాలదగ్గిర--సరదాకి!
"సుగుణమణి గణ నికురుంబ సుబ్బమాంబ
అనిన్నీ
సుజన సేవావలంబ గం సుబ్బమాంబ
అనిన్నీ.
"గం." అంటే గంగాభాగరథీ సమానురాలనిట.
ఆయన పద్యాలు చెప్తుంటే, అవ్వ ముసిముసినవ్వుల్తో అటూ ఇటూ తిరుగుతూ, ఏదో తన గొడవ కాదన్నట్టు నిర్లక్ష్యంగా పట్టించుకోనట్లూ, విననట్లూ అంతా విని," అవి వో కాయితం మీద రాసిపారెయ్యండి బాబూ, మా నానిగాడికివ్వండి." అంది.
నానిగాడంటే మా పెద్దబ్బాయి వాడంటే మా అవ్వకిష్టం. మా నాన్న పేరని! వాడూ గడుసురాస్కల్ యేం చేశాడూ, ఆ పద్యాలు తీసుకుని, వల్లించి, అడపా తడపా పెద్ద రాగ వరసపెట్టి అవ్వ దగ్గిర చదవడఁవూ. ఆవిడదగ్గరేదేనా కొట్టేయడఁవూ. ఈ పద్యాల వెర్రి అవ్వను ఎంతదాకా పట్టుకుందీ అంటే, వోసారి నాతో అందీ--"వోరే అబ్బాయీ! నేను పోయాక పదకొండోరోజున యీ కవుల్నదర్నీ పిలిపించి నామీద పద్యాలు చెప్పించరా" అని.
ప్రెసుతమేఁవిటంటే, నాన్నిగాడు శివరాత్రి తీర్థానికెళ్దాఁవని అవ్వని రెచ్చగొట్టాడు. నాకిష్టం లేదు. "తీర్థములు మానసములు ముక్తిప్రదములు" అంటూ "సత్యము తీర్థము" అంటూ కవి చెప్పిన మాటల్లో నమ్మకఁవున్నవాణ్ణాయెను. అయితే యేం చెయ్యను? అవ్వా నానిగాళ్ళల్లో యే ఒక్కళ్ళనీ లొంగదీయడఁవే కష్టం! ఇద్దరూ పట్టుకున్నారాయె!! పోనీ యిల్లేనా ఆనాటికి విశ్రాంతిగా ఉంటుందనిన్నీ దారిపొడుగునా అస్తమానఁవూ అవ్వకోసం పంచరత్నాలు పద్యాలు చదివి నాన్నిగాడి తెగులు కుదురుతుందనిన్నీ.
ఆ తీర్థానికే వెళ్తున్న రావఁయ్య కాపుని బతిమాలుకుని, అతని రెండెండ్ల బండిలో మా వాళ్ళనీ కుక్కాను. తోవలో అవ్వ కునికిపాట్లు పడి కింద పడకుండా రాఁవయ్యకాపు పెద్దకొడుకుని బండి చివర బిరడాలాగ బిగించాను. ఈ బిరడా సంగతి కూడా తర్వాత చెబ్దా.
వాళ్ళు తెల్లారగట్లే వెళ్ళారు. సాయంకాలఁవో, రాత్రి పడుతూంటేనో రావాలి మూడు నాలుగ్గంటలకి. యేదో పనివుండి వీధుల్లోకి వచ్చా. వీధరుగు పక్కని బిక్కమొహం వేసుకుని, యేడిచి యేడిచి వాచిన యెర్రకళ్ళూ వాడూ నాన్నిగాడు వొదిగి నిలబడివున్నాడు.
"ఏమిరా? అవ్వేదిరా??" అన్నాను.
"త-త-త-" అన్నాడు.
"ఏమిట్రా త-త-త? తప్పిపోయిందా? చ చ చ కాదుగదా అంటే చచ్చిపోలేదుగదా" అనడిగాను.
"తీర్థంలో అవ్వ కనబళ్ళేదు" అన్నాడు వాడు మెల్లిగా.
"ఆఁ?!" అన్నాను. నా గుండె గుభేలుమంది. గోదార్లో పడిందేవోఁ! కారు కింద పడిందేవోఁ! గుండె ఆగి పోయిందేమో, ముసల్ది! నాకు మహ జాలి, దుఃఖం వేసుకొచ్చాయి. అసలు అవ్వంటే మా అందరికీ ఎంత యిష్టఁవో అప్పుడు తెలిసొచ్చింది నాకు. అవ్వని విడదీస్తే లోకం ఎలా వుంటుందో మాకు తెలియదు. పాపం ఆవిడకెవరున్నారు? నిజానికి నాకు ముసలాళ్ళన్జూస్తే ఎంతో దిగులు, ముందుకు చూసుకుంటే నోరుతెరుచుకుని దగ్గరగా వొచ్చే చీకటి భూతం కేఁవుందీ!
మా అవ్వ చూపులు వొక్కొక్కప్పుడు, దూరాన ఆకాశాన పోయే పక్షుల్లాగా వుంటూంటాయి. యెక్కడికో యెక్కడికో పోతూన్నట్లు, అప్పుడు నాకు భయం వేస్తుంది. అవ్వ వొక్కొక్కప్పుడు పొడుగ్గా నిట్టూర్చేది; ఆ నిట్టూర్పు చిన్నతనం నుంచీ యాభై యేళ్ళ దార్లో పడి పాకి వచ్చినట్టుండేది. ఇప్పుడు ఈ మాటలన్నీ స్తిమితంగా అంటున్నాను గానీ అప్పుడు...
"యేఁవిట్రా. యేం జరిగిందీ?" అని నాన్నిగాణ్ణి అడిగాను.
గోదావర్లో స్నానం చేసొచ్చారట. గుళ్ళోక్కూడా వెళ్ళొచ్చారట. స్వామి దర్శనఁవయ్యాక, గుళ్ళో మండపం మీద కూర్చుని వాడిచేత సరదాగా పంచరత్నాలుగూడా చదివించుకుందిట. తర్వాత యివతలికి వచ్చాక రంగులరాట్టం దగ్గరికొచ్చేప్పటికి నాన్నిగాడు అదెక్కుతానన్నాడట, వాడు కాస్సేపు దానిమీద తిరిగొచ్చేసరికి అవ్వక్కడ లేదు. వాడు మొదట యిక్కడా అక్కడా చూసి, కనబడకపోతే కంగారుపడి, "అవ్వా, అవ్వా" అని పిలుస్తూ తీర్థఁవంతా తిరిగీ, బళ్ళు విప్పిన చోటు దగ్గరికొచ్చీ అక్కడ కూడ ఆవిడ కనబడకపోతే అయిదుమైళ్ళూ నడిచి యింటికొచ్చేశాడు. ఇదీ కథ.
వెంఠనే రావయ్యకాపొచ్చాడేమో-వాళ్ళింటిక్కభురు చేశాను. కాఁవిగాణ్ణీ, గోవిందునీ తిర్నాళ్ళకి పరిగెత్తించాను. అవసరమైతే పోలీసులతో గూడా చెప్పమన్నా. ఇంట్లో మా ఆవిడ, పిల్లలూ నిశ్శబ్ధంగా కూర్చున్నారు. కుక్కిన పేనుల్లా. నేను శివస్మరణ చేస్తూ బయటికెళ్తూ, లోపలికొస్తూ మతిపోయినట్లు తిరగడం మొదలెట్టాను!
రాత్రి పదయ్యింది. అవ్వలేకుండా రాఁవయ్యకాపు బండి ఒచ్చేసిందిట’ కావిఁగాడూ గోవిందూ వఠిచేతుల్తో, అంటే అవ్వలేకుండా వొచ్చేశారు. ఇహ వూరుకోగూడదని. మా ఆవిడ లోపల్నించి కొంచెం కూనిరాగం యేడుపు ప్రారంభించింది. చంటిపిల్లాడు గూడా యథాశక్తి వాళ్ళమ్మకి తోడయ్యాడు. చూడ్డానికీ, ఉబుసుపోకా సొహంగ్రామం మా ఇంటి దగ్గిరచేరి, అవకాశం రాగానే సరదాగా పరామర్శలోనూ అవ్వ దివ్యస్మృతుల్ని నెవఁరువేసుకోవడంలోనూ అప్పుడే పడిపోయారు.
ఇదీ తిరునాళ్ళరోజున అర్ధరాత్రి మా స్థితి.
అంతలో “సన్యాసి రాజుగారిల్లిదేనా?" అని దూరాన్నుంచి గద్దిస్తూన్న మాటలు వినబడ్డాయి. అందరూ అటు తిరిగి చూశారు!
"యెవరు బాబూ యేఁవిటి?" అని గావుకేక పెట్టాను నేను. చీకట్లోంచి వొస్తూ పోలీసుజెవాను కనబడ్డాడు. కూడా టీగ్గా నడుస్తూ, చీకట్లో దీపస్తంభం లాగా జెవానుకంటే ధాటీగా అవ్వ సాక్షాత్కరించింది! “అవ్వొచ్చింది" అని కేకేశాను! లోపల్నించి అందరూ "ఘొల్లు"మని యివతలికి వొచ్చారు!
కొందరు మాత్రం అవ్వ అప్పుడే దొరికేసిందే, నాల్రోజులపాటు సరదా పోయిందే" అని దిగులుమొహం వేశారు.
పోలీసు జెవాన్, "యిదుగోనండీ ముసిలావిడ. నా ప్రాణాలు తోడేసిందీ! యీవిణ్ణి తిర్నాళ్ళకీ, తీర్థాలకూ పంపి, దేశం మీద వొదుల్తారేఁవిటయా? యీవిడకంటె మా సూపరెంటు నయం" అని చీదరించుకుంటూ అన్నాడు!
"పోరా! నే సూపరిండెంటునే, నాకేం రా బహద్దర్ని. శెలవిచ్చాను. ఫో" అంది అవ్వ. వాడు పళ్ళు బిగించి కొర కొర చూచి, చీకట్లోకి నడిచి, అక్కడ ఖాండ్రించి వుమ్మేశి చక్కా పోయాడు!
ఇహ తీర్థంలో జరిగిన కథేవిఁటంటే-
నాన్నిగాడు రంగులరాట్టం తిరుగుతూంటే పిల్లలందరికీ జీళ్ళూ, జంగిడీ మిఠాయీ, తొక్కుడుండలూ కొందామని, ఆ కొట్లకెళ్ళి వొక్కొక్కళ్ళకీ పేరు పేర్నా వొక్కొక్క పొట్లాం కట్టించిందిట. అక్కడ చిల్లర విషయంలో కొట్టువాడితో పేచీ వొచ్చి, వాణ్ణి భూశెయనం చేసిపారేసి, దమ్మిడీలతో సహా వాడిదగ్గర్నుంచి రాబట్టి పాత్ర సాఁవాను దుకాణంవైపు దండయాత్ర మళ్ళించి, అక్కడ ఆ దుకాణం మీద పడిందట! అక్కడ రాగిచెంబూ గరిటా బేరం తేల్చడానికి రాఁవరావణ యుద్ధం చేసి, రాచ్చిప్పల కొట్టువైపు ద్రుష్టి తిప్పి, అటు దాడి చేసింది! దారిలో డక్కీ డమడమల బండీవాడు తారసిల్లితే అన్నీ వాయించీ నడిపీ చూసీ, అమ్మేవాడు బారుమని యేడ్చేదాకా వాణ్ణి ఆపి, అంతలో వుప్మాకయ్యగారి కుటుంబం కనబడితే వాళ్ళతో వూసులాడి అట్టే నాలుగడుగులేసేసరికి నాన్నిగాడు జ్ఞాపకానికొచ్చాడు. అప్పటికప్పుడే పొద్దు వాల్తోంది!
"నాన్నిగా నాన్నిగా" అని తీర్థఁవంతా తిరగడం మొదలెట్టింది! బళ్ళ దగ్గరికొచ్చి చూస్తే, రాఁవయ్యకాపు బండీ వెళ్ళిపోయింది! మళ్ళీ తీర్థం లోకి వొచ్చింది! "మా నాన్నిగాడు కనబడ్డాడా?" అనడుగుతూ! ఎవళ్ళనడిగినా వాళ్ళు పట్టించుకోలేదు! అప్పటికి కంగారుపడ్డం మొదలెట్టిందవ్వ. ఇంతలో కనబడిన పోలీస్ జెవాన్ ని కూడా అడిగింది! వాడు వూరూపేరూ అన్నీ అడిగి పోలీస్ స్టేషన్ దగ్గిర కూచోబెట్టాడు!
"అమ్మా! భైపడకండి, ఇంటికి తీసికెడతాం" అని పోలీసువాడంటే, "ఎవడికిరా భయం?" అని ధీమాగా మొదట అన్నప్పటికీ, నాన్నిగాడి కోసం లోపల్లోపల కంగారు పడిపోయింది అవ్వ! ఆవిడ పోలీస్ స్టేషన్ లో కూచున్న సమయంలోనే, కాఁవిగాడూ గోవిందూ ఆఁవె కోసం గాలించి పోయారు! యిదంతా చెప్పాక యిలాగంది అవ్వ! "ఆ రాచిప్పలదుకాణం దగ్గిరాలస్యఁవయి పోయిందర్రా! అక్కడే వొళ్ళు మరిచిపోతూంటాను! ఏమిరా నాన్నిగా. శివరాత్రి గూడాను. అప్పన్నశాస్తుర్లుగారి పద్యాలు నా మీద రాసినవి చదవరా" అంది! అందరూ పకపకా నవ్వారు! నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చింది! ఆవిడ గొంతుక పట్టుకుని ఆ రాత్రి ఆఁవెని శివసాయుజ్యం పొందిద్దాఁవనుకున్నాను! దిక్కుమాలిన పాపభయవో, దండన భయంఁవో వొచ్చిపడి మళ్ళీ తఁవాయించుకున్నాను! అంతకంటే గూడా లోపల పిచ్చి యిష్టం గూడా యేడిసిందాయెను ఆవ్వమీద, సుబ్బమ్మవ్వమీద!
*****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...