MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
పుస్తక పరిచయాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
శాయి రాచకొండ
అసమాన అనసూయ (నా గురించి నేనే)
శాయి రాచకొండ
అసమాన అనసూయ (నా గురించి నేనే) - అనసూయ గారి ఆత్మ కథ ఇది. కేవలం ఆత్మకథ క్రింద పరిగణిస్తే పుస్తకానికున్న విలువను పూర్తిగా తగ్గించేసినట్లే. ఇది కేవలం ఒక అహంభావి జీవిత చరిత్ర కాదు (పుస్తకం పేరుని మాత్రం చూసి అనుకుంటే). ఏదో సాధారణమైన మనిషి గొప్పలు చెప్పుకోడానికి రాసిన కథ కాదిది.
ఇది, - ఆకాశమంత ఎత్తులో నూరేళ్ళ జీవితాన్ని నిండుగా అనుభవించిన ఒక మనిషి జీవితంలో చూసిన ఎవరెస్టు శిఖరాలూ, సాగరపు లోతులూ....
- గత తొంభై సంవత్సరాలలో జరిగిన జానపద సాహిత్య చరిత్ర
- మహాత్మా గాంధి నించి, ప్రధానులు, రాష్త్రపతులు, పేరొందిన తోటి కళాకారుల మెప్పుపొందిన ఒక కళాకారిణి చెప్పిన జీవితానుభవాల కూర్పు
- తొంభై అయిదేళ్ళు నిండిన తర్వాత కూడా, తన అయిదో సంవత్సరంలో జరిగిన విషయాల్ని కళ్ళకు కట్టినట్లు మన ముందుంచగలిగిన ఒక మేధాతత్వం
- తన జీవితంలో సాధారణమైన మనిషిగా అనుభవించిన కష్టాలను నిక్కచ్చిగా చదువరులకు ఒక పాఠంగా చెప్పగలిగిన ఒక ధైర్యవంతురాలి కథ
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న నానుడి అనసూయ గారి విషయంలో అక్షరాలా నిజం. సంగీత సాహిత్యాలు కలగొలిపి ఆమె పుట్టిన ఇంటి నేపధ్యం. మేనమామ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి రాసిన ఎన్నో పాటలకి చిన్ననాటనే సంగీత బాణీలు ఆమె కట్టి పాడటం ఆయన భావగీతాలను ప్రజలలోకి తీసుకు రావడానికి దోహదం చేసిందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. 1935 లో తన పధ్నాలుగవ ఏటనే 'జయ జయ జయ ప్రియభారత ' గీతానికి కట్టిన బాణి ఈ రోజుకీ మనం అదే పాడుకుంటున్నాం. పుస్తకం చదువుతూంటే, 1925 వ సంవత్సరం నుండి, అరవైల వరకూ, సాహిత్యం, ముఖ్యంగా జానపద సాహిత్యం ఎలా, ఎప్పుడు, ఎవరి ద్వారా ముందుకు నడిచింది అన్నది స్పష్టం అవుతుంది. వల్లూరి జగన్నాధరావు గారు అనసూయగారిలోని అభిరుచి, ఆసక్తిలను గుర్తించి జానపద గీతలకు వేసిన బాట ఆమెకు ఆజన్మాంతరం జ్ఞాన పథం అయింది.
ఆవిడకి జానపదాలు నేర్చుకోడానికి పండితులే కాదు, భోగం వాళ్ళయినా కావొచ్చు, పల్లె పదాలు పాడుకునే రైతు కూలీ అయినా కావొచ్చు. కట్టిన పాటలు ఎవరివైతేనేమి? గురజాడ, రాయప్రోలు, బసవరాజు, విశ్వనాథ, అబ్బూరి, దేవులపల్లి, అడవి భాపిరాజు, శ్రీశ్రీ, ఒక్కరా? తనని మెచ్చుకున్నవాళ్ళెవరైతేనేమి? పండితులు, పామరులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ప్రసిధ్ధ హిందీ సినిమా గాయకులు, ఒక్కరా? పోనీ పాడడానికి భాష అడ్డొస్తుందా? అదీ లేదు. ఇరవై అయిదు సంవత్సరాలకే దేశం మొత్తంలోను, ఎంతో పేరు తెచ్చుకున్నారు అనసూయా దేవి గారు.
అయితే జీవితం ఒక్కలా నడవదు ఎవ్వరికీ! కష్టాలు ఆవిడకు పెళ్ళితో మొదలయ్యాయి. అందులో కూడా సాధారణమైనవి కాదు. అన్ని ఒడుదొడుకులనీ ఓర్చుతూ, అయిదుగురు పిల్లలని సాకుతూ కూడా, జానపద కళను విడవలేదు. అదే ఆమెకు ఊపిరి పోసి నిలబెట్టింది.
తనని ఆకాశంలోకి ఎత్తేసిన ఘడియలయినా, తనని చీకట్లోకి తోసేసిన సంఘటనలైనా ఒకే విధంగా మనముందుంచారు అనసూయ గారు ఈ పుస్తకంలో. సాహిత్య చరిత్ర అయినా, ఆవిడ వ్యక్తిగత జీవితం అయినా, చదువరి ఎన్నో తెలుసుకోవచ్చు ఆమె జీవిత పుస్తకంలోంచి.
పాటే ప్రాణమయిన ఆమె చివరి కోరికేమిటో తెలుసా? తను ఈ ప్రపంచం నించి నిష్క్రమించినప్పుడు ఎవరూ ఏడవవకూడదుట. ఎర్రరంగు పట్టు చీర, కాళ్ళకు ఆల్తా, గోళ్ళకు మాచింగ్ రంగు, చీరకు తగ్గ బొట్టూ, కాటుకలతో అలంకరించాలిట. తల దగ్గర తన హార్మోనియం పెట్టాలి, తన కిష్టమయిన పెర్ఫ్యూం చల్లాలి. ఇంకో ముఖ్యమయిన విషయం - 'నలుగురు కూర్చుని నవ్వే వేళల నా మాటొకపరి తలవండి! నా పాటొకపరి పాడండి!’ అంటారు. జీవితాన్ని ప్రేమించడమంటే ఇదేనా?
పుస్తకం ప్రత్యేకత ఇంకోటేమిటంటే, 1938 నించి ఎందరో మహానుభావుల స్వదస్తూరీతో అనసూయ గారికి, ఆవిడ గురించి రాసిన ఎన్నో ఉత్తరాలు, సంతకాలు, అతి జాగ్రత్తగా పొందుపరిచి, పుస్తకానికి అనుబంధంగా ప్రచురించడం. అదేకాక, అనసూయగారి బాల్యంనించి, తొంభైఅయిదో ఏటివరకు ఎన్నో చిత్రపటాల్ని రంగుల్లో చేకూర్చడం. ఇంత చరిత్రని ఒక చిన్న పుస్తకరూపంలో ప్రచురించిన వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణా చరిత్రలో ఇదొక కలికితురాయి.
*******
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
మహాదేవివర్మ గీతాలు
విజయనగరం వెళ్ళినప్పుడు చాగంటి తులసి గారిని కలిసే అవకాశం కలిగించాడు శ్యాం. ఆవిడ నాకు ఇచ్చిన పుస్తకాల్లో ఒకటి 'మహా కవయిత్రి మహాదేవివర్మ గీతాలు'. ఇవి మహాదేవివర్మ గారు హిందీ లో రాసిన కవితలకి తులసి గారు చేసిన అనువాదాలు. తులసి గారు అటు తెలుగు నించి హిందీకి, హిందీ నించి తెలుగులోనికి కూడా ఎన్నో తర్జుమా చేసారు. ఒక భాషలో వ్యక్త పరచిన భావాలు నలుగురూ పంచుకోగలిగి, వివిధ భాషల ప్రజల మధ్య అవగాహన పెంచగలిగే అవకాశం ఈ అనువాద గ్రంధాలు మాత్రమే ఇవ్వగలవు. అలాంటి సదుద్దేశంతో ఆవిడ అలుపులేకుండా చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు
శాయి రాచకొండ
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు శ్యామలాదేవి దశిక గారు రాసిన రెండవ సంకలనమిది. మొదటి సంపుటి 2010 లో వంగూరివారి నలభై ఒకటవ ప్రచురణగా వచ్చింది. గత నాలుగయిదు సంవత్సరాలలో సుజనరంజని, ఈమాట, తెలుగుజ్యోతి, కౌముది మొదలగు పత్రికలలో మొదటగా అచ్చు వేయబడిన కథలు - అవే కథల్లాంటి ముచ్చట్లు ఈ సంపుటిలో చేరుకున్నాయి.
అమెరికాలో సగటు ప్రవాసాంధ్రుల జీవితాల్లో దొర్లే అవకతవకల్ని సున్నితంగా, క్షుణ్ణంగా, చిలిపిగా, చురకలు వేస్తూ, మనమే బాధితులమనే మత్తు మందు రాస్తూ, ఎక్కడో కలుక్కు మనేలా మన ఆలోచనలకి, ఆచరణలకి, మిగతా అందరూ బాధితులవుతారన్న సత్యాన్ని మనకు తెలిసీ, తెలీకుండానే నిరూపిస్తారు రచయిత్రి. కథలు చదువుతున్నప్పుడు ముసిముసిగా నవ్వుకుంటాము.
శ్యామల గారు చెప్పినట్లు ఆంధ్ర దేశానికీ, అమెరికాకు దూరం తరిగిపోవడం వల్ల ఇండియా ముచ్చట్లు కూడా అమెరికా ఇల్లాలి ముచ్చట్లతో కలిసిపోయాయి. ఇండియా ప్రయాణమయినా, అమెరికాలో కారు ప్రయాణం జీవన గమ్యంతో పోల్చినా, అమెరికా సాహితీ సదస్సులో చిట్టెన్ రాజు గారు తన పుస్తకావిష్కరణ చేయించిన వైనం గురించి చెప్పినా, అన్నీ ఖచ్చితంగా మనందరి మనసుల్లో గూడు కట్టుకు పోయిన భావాల్ని మళ్ళీ ఆవిడ మన చేత అనుభవింపచేస్తుంది. 'కాదేదీ కవితకనర్హం' అని చెప్పినట్లుగా, ఆవిడ చెప్పే ముచ్చట్లకి పనికిరాని సందర్భం, కథా వస్తువు లేవు. ఫోన్లు, అమ్మాయి సీమంతం, హెల్తీ ఫుడ్, ప్లాస్టిక్ బాగు, తెలుగు సంఘాలు, ఒక్కటేమిటి?
అందమైన ముఖ చిత్రంతో వెలువడిన ఈ పుస్తకం అమెరికాలోనేకాదు, అన్ని దేశాల్లోని తెలుగువారూ పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టాక, వదలకుండా చదివి తీరాల్సిందే.
మొత్తానికి శ్యామలాదేవి గారు! మీ ముచ్చట్లు సూపరే సూపరండి!
*******
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
కలికి కథలు
శాయి రాచకొండ
కలికి కథలు వెంపటి హేమ గారు రాసిన యాభై పైచిలుకు కథల సమగ్ర సంపుటి. అచ్చంగా ఆరువందల యాభై పేజీల గ్రంధం. తెన్నేటి సుధాదేవి గారు ముందు మాట రాస్తూ, 'అనేకానేక జీవితాల స్థితిగతులు, మనం రోజూ చుట్టూ చూస్తున్న సంఘటనలు, ఆలోచనలు రేకెత్తించే వివిధ రకాల మనస్తత్వాలు - ఇన్నింటిని కలబోసి, చక్కని భాషలో, అందమైన శిల్పంలా ఒక్కో కథను తీర్చి దిద్దారు వెంపటి హేమ గారు' అని అంటారు. ఆవిడ చెప్పిన మాటలు అక్షరాలా నిజం. హేమ గారు కథ రాయడంలోని మెళకువలు, పాఠకుల్ని కథని ఆసాంతం చదివించే నేర్పు, పాఠకుల మనసులకు దగ్గరగా ఉన్న సమస్యల్ని ఎంచుకోగలిగిన సహజమైన తీరు మనకి కథలన్నిటిలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అంతే కాదు, మధ్యతరగతి మనుషుల జీవితాలకు ఆవిడ కథలు అద్దం పడతాయనడంలో అతిశయోక్తి లేదు.
ఆవిడ అమెరికా జీవితానుభవాల ప్రభావం వల్ల చాలా కథల్లో ప్రవాసుంధ్రుల అమెరికా జీవితం, అక్కడి వ్యవస్థ, కనబడుతూనే వుంటాయి. తన ముందు మాటగా రచయిత్రి 'కథల వెనుక గాథ ' రాస్తూ, 'చీకటి వెలుగులు పడుగు పేకలుగా చేసి నేసిన వస్త్రం జీవితం - అని చెప్పకనే చెప్పాడు సృష్టికర్త ', 'ప్రతి మనిషి జీవితమూ ఒక కథానిలయం' అంటారు. తను తీసుకున్న కథా వస్తువుల్ని గురించి రాస్తూ, తన సుదీర్ఘ జీవన ప్రస్థారంలో కళ్ళారా చూసి, విన్న, సాక్షి అయిన సంఘటనల్ని కొన్ని మాత్రమే కథలుగా రాయగలిగాననీ, వ్యథలు, సరదాలు, సుఖ సంతోషాలు కూడా కథా వస్తువులుగా ఉపకరించాయని చెప్తారు. ఆ మాటల్లో అణకువ, అతి లోతైన జీవితానుభవం కొట్టొచ్చినట్లు కనబడతాయి. అదే కథల్లో కూడా వ్యక్తమవుతుంది. తనకు అంతగా పరిచయంలేని వైద్య విజ్ఞానానికి సంబంధించిన కథాంశం వున్న కథలకు ఆవిడ పరిశోధనలో సంప్రదించిన వ్యాసాల్ని, పుస్తకాల్ని నిజాయితీగా పాఠకుల ముందుంచారు.
హేమ గారు నిత్య జీవితంలో తెలుగు భాషకు జరుగుతున్న నిరాదరణని గురించి బాధ పడుతూ తెలుగు చదువుతూన్నప్పుడు కొత్త పదం రాగానే వదిలివేయకుండా, తెలుగు నిఘంటువులను వాడమని, 'తల్లిభాషను కాపాడుకోవడం బిడ్డలమైన మన కనీస బాధ్యత అన్నది మాత్రం మనం ఎప్పుడూ మరచిపోకూడద'ని, చెబుతారు. తెలుగు భాషాభిమానమది.
ఇవి ఆమె మనసు కథలు. హృదయాన్ని మధించి రాసిన కథలు. మంచి పుస్తకం, తప్పక చదవండి.
*******
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
తలరాతలు
శాయి రాచకొండ
'తలరాతలు' అనే ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యమని వివరాలు పంపింది రచయిత డాక్టరు జడా సుబ్బారావు గారు. ముఖచిత్రం సృజనాత్మకంగా వుంది.ఇది 16 కథలున్న ఒక సంపుటం. ముసురు, బామ్మగారి బస్సుప్రయాణం, పుత్రుడు పున్నామనరకం, ఆకలి, అమ్మానాన్న ప్రేమ, అంతిమఘట్టం, తీరం చేరిన కెరటాలు, చింత చచ్చినా పులుపు చావలేదు, తలరాతలు, నువ్వు నవ్వితే వాకిట్లో వెన్నెల వాన కురిసినట్లుండేది, జ్ఞాపకాలు, సహజీవనం, హాచ్ హాచ్ హాచ్, వృద్ధాప్యపు చివరి మజిలీ, తాతయ్య నేర్పిన తెలుగు పద్యం, అబ్బాయి+అమ్మాయి = పరివర్తన - ఇవీ కథలు. దీనిని విశాలాంధ్ర ప్రచురణ సంస్థ విజయవాడ వారు ముద్రించారు. ఈ పుస్తకం విశాలాంధ్ర వారి అన్ని బ్రాంచిలలోనూ దొరుకుతుంది. దీని ధర 80/- ఎనభై రూపాయలు. డా. జడా సుబ్బారావు గారు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఏపీఐఐఐటీ లో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్నారు. నూజివీడు, కృష్ణాజిల్లా (ఆంధ్రప్రదేశ్, ఇండియా) వాస్తవ్యులు. పుస్తక ప్రతులకు కాని, రచయితను సంప్రదించుటకు గాని +91 9849031587 నంబరును కాంటాక్టు చేయవచ్చు..
*******
పుస్తక విశ్లేషణ
మేము ఎంపిక చేసుకున్న కొన్ని మంచి గ్రంధాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి. కేవలం మా ప్రత్యేక వ్యక్తిగత ఆహ్వానం మీరకే పుస్తకాలు స్వీకరించబడతాయి.
సంక్షిప్త పుస్తక పరిచయం
పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడం, పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేసే సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక రాబోయే ఉగాది సంచిక (ఏప్రిల్ 09, 2016) నుండి ప్రారంభం అవుతుంది. అందులో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు డిశంబర్ (2015), జనవరి, ఫిబ్రవరి, మార్చ్ (2016) మాత్రమే ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు మార్చ్ 31, 2016 లోపుగా పంపించవచ్చును.
పంపించవలసిన చిరునామా
‘పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే.