MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
నిజం
రాధిక నోరి
కెరటాలు హోరుమని శబ్దం చేస్తూ ఎత్తుగా లేస్తున్నాయి. ఆభాస్ బాల్ తో బీచ్ లో ఆడుతున్నాడు. ఉదయం వేళల్లో కెరటాల హోరు తప్ప వేరే ఇంకేదీ వినిపించని ఆ నిశ్శబ్దంలో బీచ్ లో ఆడుకోవటం ఆభాస్ కి చాలా ఇష్టం. ఇలా బీచ్ కి దగ్గరగా ఇల్లు వుండటం ఎంత బాగుందో అనుకున్నాడు. వావ్! ఎంత పెద్ద కెరటాలో అనుకున్నాడు సముద్రం వైపు చూస్తూ. ఇంతలో అతనికి ఏదో వింతైన శబ్దం వినిపించింది. ఆభాస్ ఉలిక్కిపడి చుట్టూ చూసాడు. ఏమీ కనిపించలేదు. పొరపాటు పడ్డానేమో అనుకున్నాడు. కొన్ని క్షణాలైన తర్వాత మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ఆడుకుంటున్న ఆభాస్ మళ్ళీ చుట్టూ చూసాడు. నలుగురైదుగురు జాగింగ్ చేస్తున్నవారు తప్ప కనుచూపుమేరలో ఎవరూ కనిపించలేదు. బీచ్ లో కొంతదూరం పరిగెట్టి, అక్కడ ఆగి మరీ చూసాడు. మళ్ళి అనుమానాస్పదమైంది ఏమీ కనిపించలేదు. కొంచెంసేపు నిశితంగా చుట్టూ చూసి మళ్ళీ బాల్ నీళ్ళలోకి విసరబోయాడు. ఇంతలో మళ్ళీ ఆ వింత శబ్దం వినిపించింది. ఈసారి కొంచెం స్పష్టంగా వినిపించింది. అది ఎవరిదో కంఠధ్వని. మరి శబ్ధం మామూలుగా లేకుండా వింతగా ఉందేమిటి? అనుకుంటూ ఆభాస్ అక్కడే నిలబడి ఒక్క క్షణం ఆలోచించాడు. ఇంతలో పెద్ద కెరటం ఒకటి విసురుగా వచ్చి బీచ్ లో వున్న పెద్ద రాళ్ళ మీద పడింది. అప్పుడు చూసాడు ఆభాస్ ఆ రాళ్ళ వైపు. ఆ వింత శబ్దం అక్కడనుండే వస్తోందని అనిపించింది. బాల్ చేతిలో పట్టుకుని ఆ రాళ్ళ వైపు నడిచాడు. దగ్గరకు వెళ్తున్న కొద్దీ ఆ ధ్వని స్పష్టంగా వినిపిస్తోంది. అది ఎవరో ఆడవాళ్ళు ఏడుస్తున్న కంఠధ్వని. ఏడుపు మధ్యలో ఏవో మాటలు కూడా వినిపిస్తున్నాయి. కానీ స్పష్టంగా లేవు.
"నువ్వే అన్నీ అని నిన్నే నమ్ముకుంటే నన్నింత మోసం చేస్తావా?" అంటోంది ఏడుస్తూ ఆ ఆడగొంతు.
"లేదు లేదు. నేనేమీ మోసం చేయలేదు. దాన్ని ఎలాగైనా నేను వదిలించుకుంటాను" అంటోంది మగ గొంతు.
ఓ... ఎవరో మగవాళ్ళు కూడా వున్నారన్నమాట అనుకున్నాడు ఆభాస్ మగ గొంతు విని. రాళ్ళ వెనక ఎవరు వున్నారో అతనికి కనిపించటం లేదు.
"మళ్ళీ… వస్తే… ఏం చేస్తావు?" ఆడ గొంతు ఏడుపు, కెరటాల చప్పుడులో మాటలు పూర్తిగా, స్పష్టంగా వినిపించటంలేదు.
"చంపేస్తాను… దాన్ని చంపేస్తాను" అంటోంది మగ గొంతు ఆవేశంగా.
వింటున్న ఆభాస్ ఒక్కసారి వులిక్కిపడ్డాడు. ‘గాడ్! మర్డర్…!’ అనుకున్నాడు భయంగా మనసులో.
"ఎలా చంపుతావు?" అంటోంది ఆడ గొంతు భయంగా, అనుమానంగా.
"చంపటానికి ఎన్నో మార్గాలు..." ఇంకా ఏదో అంటోంది మగ గొంతు. ఆభాస్ కి సరిగ్గా వినిపించటం లేదు. అతనికి భయం ఇంకా ఎక్కువైంది. గబగబా పరిగెత్తటం మొదలెట్టాడు. తీరా అక్కడకు వెళ్లి చూస్తే ఆ రాళ్ళ వెనక ఎవరూ లేరు. కెరటాల చప్పుడులో అసలు సరిగ్గా విన్నానా లేదా అన్న అనుమానం కూడా వచ్చింది ఆభాస్ కి. అనుమానంగా చుట్టూ చూస్తే ఎదురుగా దూరంగా ఒక ఆడ, ఇంకో మగ మనుషులు వెళ్తూ కనిపించారు. ఆ అమ్మాయి ముందు పరుగులాంటి నడకతో గబగబా వెళ్తోంది. వెనకాల ఆ అబ్బాయి పరిగెడుతున్నాడు. ఏమిటో అంటున్నాడు కానీ సరిగ్గా వినిపించటం లేదు. ఆభాస్ కూడా వాళ్ళని చేరుకోవాలని పరిగెత్తటం మొదలెట్టాడు. వెనక నుండి ఆ అమ్మాయి ముఖం కనిపించటం లేదు కానీ భుజానికి వేళ్ళాడుతున్న ఆ ఎర్ర రంగు బ్యాగ్ మాత్రం ఆభాస్ కళ్ళని ఆకట్టుకుంది. పెద్దగా, కొత్త స్టైల్ లో ప్రత్యేకంగా వుంది ఆ బ్యాగ్. ఆభాస్ ఆయాసపడుతూ వారి దగ్గరకు వెళ్ళేసరికి ఆ అమ్మాయి పూర్తిగా కనుమరుగైపోయింది. కానీ ఎవరో తన వెనక పరిగెడుతున్న శబ్దానికి ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసాడు. అతన్ని చూసి ఆభాస్ ఎంతో ఆశ్చర్యపోయాడు. "విలాస్ అంకుల్, మీరా?" అన్నాడు నమ్మలేనట్లు. "ఆభాస్, నువ్వా! నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఈ వేళలో?" అడిగాడు విలాస్ అయోమయంగా. "పొద్దున్నే బీచ్ లో ఆడుకుంటే బాగుంటుందని ..." ఆభాస్ ఇంకా చెప్పటం పూర్తి చేయకముందే "ఆభాస్, నేను వెళ్తాను ఇక. ఆఫీసుకి లేటవుతుంది లేకపోతే" అంటూ విలాస్ గబగబా వెళ్ళిపోయాడు.
ఆభాస్ కి ఏంచేయాలో తోచలేదు. మోసం చేసావంటూ ఏడుస్తూ గొడవ చేసిన ఆ అమ్మాయి ఎవరు? వదిలేస్తాను, చంపేస్తాను అని విలాస్ అంకుల్ ఎవరి గురించి అంటున్నాడు? ఆభాస్ ఆలోచించుకుంటూ ఇంటివైపు పరిగెత్తాడు. గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే ఏదో పనిమీద బయటికి వచ్చిన మణి కనిపించింది. ఆభాస్ ని చూడగానే " గుడ్ మార్నింగ్, ఆభాస్! పొద్దున్నే ఎక్కడ నుండి వస్తున్నావు?" అని అడిగింది.
"బాల్ ఆడుకోవటానికి బీచ్ కి వెళ్ళాను మణి ఆంటీ" అన్నాడు ఆభాస్.
"అలాగా! పొద్దున్నే బీచ్ భలే బాగుంటుంది కదూ! వాకింగ్ కి వెళదామని రోజూ అనుకుంటాను. కానీ పనితో నాకెప్పుడూ తీరదు" అంటూ లోపలికి వెళ్ళిపోయింది మణి.
ఒక్కసారి ఆభాస్ బుర్ర వెలిగింది. విలాస్ అంకుల్ వదిలేస్తాను, చంపేస్తాను అంటున్నది కొంపదీసి మణి ఆంటీ గురించి కాదు కదా! కాదేమిటి? మణి ఆంటీ గురించే! ఇంక వేరే ఎవరున్నారు? మణి ఆంటీని మర్డర్ చేసి ఆ ఎర్ర బ్యాగ్ ఆంటీతో ఉందామని కాబోలు విలాస్ అంకుల్ ప్లాను. అమ్మో! మణి ఆంటీ ఎంత మంచిదో! తనకి బోలెడన్ని యమ్మీ స్నాక్స్ పెడుతుంది. బయట సినిమాలకి, షికార్లకి తిప్పుతుంది. అంత మంచి మణి ఆంటీని విలాస్ అంకుల్ మర్డర్ చేస్తానంటే తను ఊరుకుంటాడా? ఎలాగైనా మణి ఆంటీని కాపాడుకోడూ? ఈ ఆలోచన రాగానే ఆభాస్ గబగబా మణి వెనకాలే లోపలికి పరిగెత్తాడు. 'మణి ఆంటీ" అంటూ ఏదో అనేలోపే విలాస్ 'మణీ! బ్రేక్ ఫాస్ట్ రెడీనా?" అంటూ అక్కడకు వచ్చాడు. "ఆభాస్! నువ్వు కూడా తింటావా నీకిష్టమైన పూరీ, చోలే" అని అడిగింది మణి. ఆభాస్ కి నోరూరింది. విలాస్ తోపాటు పూరీలు తింటూ అంకుల్ వెళ్ళగానే ఆంటీతో చెప్పేయాలి ఆయన ప్లాను సంగతి అని ఆలోచిస్తున్నాడు ఆభాస్. ఇంతలో “ఆభాస్” అంటూ అక్కడకు వచ్చింది అతని అమ్మమ్మ. "బీచ్ లో ఆటలయ్యాయా? అక్కడ ఆటల తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ సీన్ నడుస్తోందా?" అంది ఆవిడ నవ్వుతూ. 'రండి పిన్నిగారూ! మీరు కూడా బ్రేక్ ఫాస్ట్ చేద్దురుగాని" అంది మణి ఆవిడ కోసం కుర్చీ లాగుతూ. 'నాకొద్దులే అమ్మా! ఆభాస్ కి సంధ్యావందనం నేర్పటానికి పంతులుగారు వచ్చే టైమవుతోంది. వాణ్ణి పిలవటానికి వచ్చాను" అంది ఆవిడ.
"పదమూడేళ్ళ చిన్నపిల్లాడికి మీరు మరీ ఇంత టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తే ఎలా పిన్నిగారూ! వేసవి సెలవలలో ఆడుకోవటానికి పాపం, లండను నుండి వైజాగ్ వస్తే ఇక్కడ మీరు ముందుగానే “మినట్ టు మినట్ షెడ్యూల్” అంతా రెడీ చేసేసారు, సంధ్యావందనం క్లాసు, హిందీ క్లాసు, యోగా క్లాసు, ఆ క్లాసు, ఈ క్లాసు అంటూ. ఇది చాలా అన్యాయం పిన్నిగారూ" అంది మణి.
"నాదేం లేదమ్మా మణీ! ఇవన్నీ మా అమ్మాయి, అల్లుడి కోరికలు. ఇవన్నీ నేర్పించటం కోసమే సెలవల్లో ఆభాస్ ని ఇక్కడకు పంపారు. వారు చెప్పినట్లు చేయటమే నా వంతు" అంది ఆవిడ. ఆభాస్ అంతకు ముందు ఆలోచిస్తున్నట్లుగా మణితో ఏదీ చెప్పలేకపోయాడు. వెంటనే అమ్మమ్మతో పాటు మేడ మీద వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళిపోయాడు.
అతను స్నానం, సంధ్యావందనం క్లాసు, ఆ తర్వాత యోగా క్లాసు, ఆ తర్వాత లంచ్ ఇవన్నీ పూర్తి చేసుకుని కిందకి వచ్చేసరికి మణి తన స్నేహితురాలితో ఏదో షాపింగుకి వెళ్ళటానికి సిద్ధం అవుతోంది. "మణి ఆంటీ, నేను కూడా రానా మీతో షాపింగుకి?" అన్నాడు ఆభాస్. ఏదో వంకన ఏదో ఒక టైములో విలాస్ ప్లాన్ మణికి చెప్పి ఆమెని రక్షించాలి అని అతని తాపత్రయం. "నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇవాళ మధ్యాహ్నం నీకు హిందీ క్లాసు వుంది కదా! క్లాసు ఎగ్గొట్టి నాతో షికార్లు కొడితే పిన్నిగారికి కోపం వస్తుంది ఆభాస్" అంది మణి. ఆభాస్ నిస్సహాయంగా చూస్తుండగా మణి తన స్నేహితురాలితో షాపింగుకి వెళ్ళిపోయింది. ఆభాస్ మనసంతా మణి మీదే వుంది. సాయంత్రం మణి ఆంటీ ఇంటికి వచ్చేసరికి విలాస్ అంకుల్ కూడా వచ్చేస్తారేమో! అప్పుడు తను విలాస్ అంకుల్ ప్లాను సంగతి మణి ఆంటీకి ఎలా చెప్తాడు? పాపం, మణి ఆంటీకి విలాస్ అంకుల్ మర్డర్ ప్లాను ఏదీ తెలీదు. అన్యాయంగా విలాస్ అంకుల్ చేతుల్లో... ఆలోచిస్తున్న ఆభాస్ కి భయంతో ఒళ్ళంతా వణికింది. మధ్యాహ్నం హిందీ క్లాసు అయిన తర్వాత నుండీ బాల్కనీలో నిలబడి మణికోసం ఎదురు చూస్తూనే వున్నాడు. కానీ చీకటి పడేదాకా మణి ఇంటికి రానేలేదు. ఆ రాత్రంతా ఆభాస్ కి టెన్షన్ తో నిద్ర పట్టలేదు. రాత్రి చీకటి వేళలో ఎవరూ లేని సమయంలో ఏ గొంతు నులిమో విలాస్ మణిని చంపేస్తాడేమోనని అతని భయం. మరీ అంత ఓపెన్ గా చేయడులే, పట్టుబడిపోతామన్న దడుపు ఉంటుందిగా అనుకుని కాస్త శాంతించాడు.
మర్నాడు ఉదయం తొందరగా లేచి బీచ్ కి ఆడుకోవటానికి బయల్దేరాడు ఆభాస్. ఇవాళ కూడా విలాస్ అంకుల్, ఆ ఎర్ర బ్యాగ్ ఆంటీ వస్తారేమో చూడాలి, వాళ్ళ ప్లాను గురించి ఇంకా ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలి అనుకుంటూ నిన్న వాళ్ళు కనిపించిన రాళ్ళ వైపు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడ వాళ్ళు కనిపించలేదు. బీచ్ లో అటు ఇటు అంతా వెదికాడు. ఎక్కడా వాళ్ళు కనిపించలేదు. ఏమీ తోచక ఇంటికి వెళ్తే గేటు దగ్గర విలాస్ అంకుల్ కనిపించాడు. బయట ఎవరికో బై చెప్తూ చెయ్యి వూపుతున్నాడు. ఆభాస్ గభాల్న దృష్టి బయటకు మళ్ళించి చూస్తే ఆటోరిక్షాలో ఎవరో ఒకామె అప్పుడే ఎక్కుతూ కనిపించింది. మళ్ళీ ఆమె ముఖం ఆభాస్ కి కనిపించలేదు. కానీ ఆ ఎర్ర బ్యాగ్, అదే బ్యాగ్… ఆమె భుజాన వేలాడుతూ మళ్ళీ కనిపించింది. నిన్న తను చూసాడని ఇవాళ తనకంటే ముందే వెళ్లి తనొచ్చే టైముకి వెనక్కి వచ్చేసారు. అమ్మో! విలాస్ అంకుల్, ఆ ఎర్ర బ్యాగ్ ఆంటీ ఎంత ప్లాన్డ్ గా వున్నారో! ఏమైనా సరే, తను వాళ్ళ ఎత్తులకు పై ఎత్తు వేస్తాడు. మణి ఆంటీని ఎలాగైనా సరే, ఈ ఆపదలోంచి రక్షిస్తాడు అనుకున్నాడు.
తన క్లాసులు, లంచ్ అన్నీ ముగించి ఆభాస్ మళ్ళీ మణి దగ్గరికి వచ్చాడు. మణి కంగారుగా బట్టలు సద్దుకుంటోంది. ఎక్కడకో వెళ్లేందుకు సిద్ధంగా వుంది. ఆభాస్ ని చూడగానే "ఆభాస్, వచ్చావా? నీ కోసమే చూస్తున్నాను. చూడు. మా అమ్మ కిచెన్ లో కాలు జారి పడిందిట. నేను వెళ్తున్నాను. మీ అంకుల్ కి ఫోను చేసాను. మీటింగులో వున్నారేమో, నాకు దొరకలేదు. మెస్సేజ్ వదిలాను. నువ్వు కాస్త మీ అంకుల్ ని కనిపెట్టుకుని వుండాలి. సరేనా? నేను లేనని వేళాపాళా లేకుండా సినిమాలు, నాటకాలు అంటూ ఆలస్యంగా ఇంటికి వస్తే కాదు" గబగబా మాట్లాడేస్తోంది మణి. మనిషి చాలా కంగారుగా వుంది. ముఖం పాలిపోయివుంది. ఆభాస్ మణి చెయ్యి పట్టుకున్నాడు. "మణి ఆంటీ, అంకుల్ గురించి మీరేమీ వర్రీ అవకండి. నేనున్నానుగా" అన్నాడు. పాపం, ఆంటీ ఎంత మంచిదో, అంకుల్ గురించి ఎంత ఆలోచిస్తుందో! కానీ అంకుల్ ...... అంకుల్ ఆ ఎర్ర బ్యాగ్ ఆంటీ కోసం ఇంత మంచి మణి ఆంటీని మర్డర్ చెయ్యటానికి సిద్ధం అయ్యాడు అనుకుంటున్నాడు.
ఆలోచించిన కొద్దీ విలాస్ మీద అతని కోపం రెట్టింపు అవుతోంది. "మణి ఆంటీ, మళ్ళీ ఎప్పుడు వస్తారు?" బెంగగా అడిగాడు ఆభాస్ మణిని ఆటోరిక్షా ఎక్కబోతుంటే. "ఏమో తెలీదు. అమ్మకి కొంచెం మెరుగ్గా వుంటే వెంటనే వచ్చేస్తాను. అప్పటిదాకా అంకుల్ తో ఆడుకో. బై, ఆభాస్" అంటూ మణి వెళ్ళిపోయింది. ఆభాస్ కి ఒక్కసారి ఏమిటో, ఒంట్లోంచి శక్తంతా పోయినట్లు అనిపించింది. విలాస్ అంకుల్ మణి ఆంటీ వాళ్ళింటికి వెళ్తాడేమో! వెళ్తే వెళ్ళనీ. అక్కడ అందరి మధ్యా మణి ఆంటీని ఏమీ చెయ్యటానికి వీలుండదు. ఒకవేళ… ఒకవేళ… విలాస్ అంకుల్ మణి ఆంటీని ఏదో వంకన బయటకు తీసుకెళ్ళి అక్కడ మర్డర్ చెయ్యాలని ప్లానులు వేస్తున్నాడేమో! పాపం, ఏమీ తెలీని మణి ఆంటీ విలాస్ అంకుల్ తో ఒంటరిగా వెళ్తుందేమో! అప్పుడెలాగ ఆమెని రక్షించటం? ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ఆభాస్.
సాయంత్రం విలాస్ ఇంటికి వచ్చేదాకా బాగా ఎదురుచూసాడు ఆభాస్. విలాస్ ఎప్పుడో చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఆభాస్ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాడు. అంకుల్ అంటూ ఏదో చెప్పబోతుంటే "నాకు తెలుసు ఆభాస్. మీ మణి ఆంటీ లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది. అవునా? నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరినుండే వస్తున్నాను" అన్నాడు. నేను అనుకుంటూనే వున్నాను అనుకున్నాడు మనసులో ఆభాస్. "విలాస్ అంకుల్, ఒక్కసారి మణి ఆంటీకి ఫోను చెయ్యరా? నాకు మాట్లాడాలని వుంది" అంటూ విలాస్ వెనకాల పోరు పెట్టాడు. "మణి ఆంటీ, మీ మదర్ కి ఇప్పుడు ఎలా వుంది? ఆవిడని వదిలి మీరెక్కడికీ వెళ్ళకండి ఆంటీ. అస్తమానూ ఆవిడ దగ్గరే వుండండి. విలాస్ అంకుల్ సంగతి అసలు మీరు మర్చిపోండి. నేనున్నానుగా" అన్నాడు మణితో ఫోనులో. విలాస్ తో ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళొద్దని ఇంక అంతకంటే వేరుగా ఎలా చెప్పాలో అతనికి తెలీలేదు.
రెండు రోజులు గడిచిపోయాయి. ఆభాస్ రోజూ పొద్దున్న బీచ్ కి వెళ్ళటం మానలేదు. కానీ అక్కడ జాగింగ్ చేస్తూ ఎవరెవరో కనిపించారు కానీ విలాస్ కానీ, ఆ ఎర్ర బ్యాగ్ ఆంటీ కానీ ఆభాస్ కి కనిపించలేదు. ఇంట్లో విలాస్ వున్న సూచనలు కూడా ఏవీ కనిపించలేదు ఆభాస్ కి. మూడో రోజు ఆభాస్ ఉదయం బీచ్ నుండి ఇంటికి వచ్చేసరికి విలాస్ బయట నిలబడి ఎవరికో బైబై చెప్తూ చెయ్యి వూపుతున్నాడు. ఆభాస్ చూపులు బయటకు పాకాయి. కదుల్తున్న ఆటోరిక్షా లోంచి పెద్దగా ఒక ఎర్ర బ్యాగ్ కనిపించింది. ఆభాస్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. "విలాస్ అంకుల్" అంటూ లోపలికి పరిగెత్తాడు విలాస్ వెనకాల. "ఆభాస్, బాగున్నావా? చూడు. ఇప్పటికే నాకు ఆఫీసుకి ఆలస్యం అయిపోయింది. సాయంత్రం కూడా పని వుంది. రావటం లేటవుతుంది. ఈ వీకెండ్ అయిన తర్వాత కొంచెం టైము దొరుకుతుంది. అప్పుడు కారమ్సు ఆడుకుందాం. సరేనా?" అంటూ విలాస్ హడావిడిగా వెళ్ళిపోయాడు.
ఆభాస్ కి ఏం చెయ్యాలో తోచలేదు. అంటే విలాస్ అంకుల్ ఆ ఎర్ర బ్యాగ్ ఆంటీతో బీచ్ లో మానేసి మణి ఆంటీ లేదు కదా అని ఇంట్లోనే కలిసి మర్డర్ ప్లానులు వేస్తున్నాడన్నమాట మనసులో. అమ్మమ్మకి, తాతయ్యకి చెప్దామా అని ఒక్క క్షణం ఆలోచించాడు. కానీ వాళ్ళు నామాట నమ్మరు సరి కదా ఈ విషయం నాకు తెలిసిపోయిందన్నసంగతి విలాస్ అంకుల్ కి చెప్పేస్తారు. అప్పుడు విలాస్ అంకుల్ కి నామీద కోపం వచ్చేస్తుంది. ఆ కోపం, ఈ కోపం, అన్ని కోపాలు కలిపి మణి ఆంటీని మర్డర్ చెయ్యటానికి అప్పుడు ఇంకో ప్లాను వేస్తాడేమో. అందుకని ఈ విషయాన్ని తను ఎవరికీ చెప్పకూడదు. ఈ రహస్యాన్ని తనే భేధించాలి. మణి ఆంటీని ఎలాగైనా సరే, తను రక్షించుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తను చూసిన పెర్రీ మేసన్ షో లు, మిష్టరీ సినిమాలు, చదివిన అగాథా క్రిస్టీ పుస్తకాలు అన్నీ ఒక్కసారి గుర్తుచేసుకున్నాడు.
ఆ మరునాడు సాయంత్రం అమ్మమ్మతో కలిసి ఆభాస్ గుడికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి విలాస్ అంకుల్ వాళ్ళ ఇంటి తలుపు తీసివుంది. ఆభాస్ సంభ్రమంగా లోపలికి తొంగిచూస్తే అక్కడ హాల్లో సోఫా దగ్గర ఏదో సద్దుతూ మణి కనిపించింది. ఆభాస్ కి మణిని చూడగానే ఒక్కసారి ఏదో చెప్పలేని ఆనందం ముంచుకొచ్చేసింది. గభాల్న పరిగెత్తుకుంటూ వెళ్లి మణి ఆంటీ అంటూ మణిని గట్టిగా కౌగలించుకున్నాడు. మణి ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆభాస్ ని దగ్గరికి తీసుకుంటూ "ఆభాస్, బాగున్నావా?" అంది. ఆభాస్ సంతోషంగా తల వూపాడు. "మీ మదర్ ఇప్పుడెలా వున్నారు?" అని అడిగాడు. "ఇప్పుడు కొంచెం బెటర్ గా వుంది. నడుస్తోంది కూడాను. అందుకే నేను వచ్చేసాను. మరి నువ్వెలా వున్నావు? హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా?" అంది.
"చేస్తున్నాను. కానీ మణి ఆంటీ, నేను మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను. మీకోసం ఎంతో ఎదురుచూస్తున్నాను" అన్నాడు ఆభాస్ బెంగగా. అతను ఇంకా ఏదో చెప్పేంతలో అతను ఆశ్చర్యపోయేలాగా కిచెన్ లోంచి విలాస్ బయటకు వచ్చాడు ట్రేలో కాఫీతో, 'కాఫీ రెడీ, డార్లింగ్" అంటూ. "థేంక్యూ డియర్" అంటూ మణి కాఫీ కప్పు అందుకుంది. ఇంతలో కిచెన్ లోంచి ఎవరో ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో, ఏమిటో ఆభాస్ కి తెలీదు. ఇంతకూ ముందెప్పుడూ వాళ్ళింట్లో చూడలేదు. ఇంతలో అతని దృష్టి ఆమె భుజాన వేలాడుతున్న బ్యాగ్ మీద పడింది. ఆ ఎర్ర బ్యాగ్ ని చూడగానే ఆ అమ్మాయి ఎవరో ఆభాస్ కి తెలిసిపోయింది. అప్రయత్నంగా అతని నోట్లోంచి కెవ్వుమని కేక ఒకటి బయటకు వచ్చింది. ఉలిక్కిపడి అందరూ చటుక్కున అతని వైపు చూసారు. ఆభాస్ బుల్లి మెదడు చకచకా ఆలోచించటం మొదలెట్టింది. దానికి చటుక్కున ఏదో తట్టింది. "వద్దు మణి ఆంటీ. ఆ కాఫీ తాగకండి" కంగారుగా, గట్టిగా అరుస్తూ మణి చేతిని గట్టిగా పట్టేసుకున్నాడు ఆభాస్. ఆభాస్ ఈ విచిత్ర ప్రవర్తనకి మణి ఒక్కసారి తెల్లబోయింది. ఆభాస్ జోక్ చేస్తున్నాడేమో అనుకుంది. కాఫీ కప్పుని నోటి దగ్గరకు తీసుకోబోయింది. ఆభాస్ కంగారు ఇంకా ఎక్కువైంది. ఏం చేయాలో తెలీలేదు. "తాగద్దు మణి ఆంటీ. ఆ కాఫీలో పాయిజన్ వుంది" కంగారుగా, గట్టిగా అరిచాడు ఆభాస్. అందరూ ఉలిక్కిపడ్డారు. ఆశ్చర్యపోయారు. ముందుగా విలాస్ తేరుకున్నాడు. "ఆభాస్, జోక్ చేస్తున్నావా?" అంటూ ఆభాస్ చేయి పట్టుకోబోయాడు. ఆభాస్ ఒక్కసారి గట్టిగా ఆ చెయ్యి విదిలించుకున్నాడు. "జోకేమీ కాదు. నిజంగానే అంటున్నాను" అంటూ మణి వైపు తిరిగి "మణి ఆంటీ, విలాస్ అంకుల్ ఆ ఎర్ర బ్యాగ్ ఆంటీతో కలిసి మీకు తెలీకుండా మిమ్మల్ని మర్డర్ చేయటానికి ప్లాను చేస్తున్నారు. ఆ కాఫీలో ఖచ్చితంగా పాయిజన్ కలిపేవుంటారు" అన్నాడు మణి చేతిలోంచి కాఫీ కప్పు లాక్కుంటూ. మణి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నోరు ఏదో చెప్పాలని తెరుచుకుంది. ఆమె ఏదో అనేలోపే "ఆభాస్, ఏమిటి ఆ మాటలు? ఏమన్నా మతి పోయిందా?" అన్నాడు కంగారుగా విలాస్.
"నాకేం మతి పోలేదు. మీరు బీచ్ లో రాళ్ళ వెనక దాక్కుని ఆ ఎర్ర బ్యాగ్ ఆంటీతో మణి ఆంటీని చంపేస్తానని అనటం నా చెవులారా విన్నాను. మీ రహస్యం నాకు తెలీదనుకోకండి" కోపంగా అరిచాడు ఆభాస్. కాఫీ కప్పు మణి చేతిలోంచి లాక్కుని బల్ల మీద పెట్టి మణి నడుం ని గట్టిగా పట్టుకున్నాడు. మణికి బుర్ర పని చేయటం లేదు. ఏం చేయాలో, ఏం అనాలో తోచటంలేదు.
విలాస్, ఆ ఎర్ర బ్యాగ్ అమ్మాయి ఒక్క క్షణం పాటు బిత్తరపోయారు. బ్లాంక్ గా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ తర్వాత ఇంకో క్షణం పాటు ఆలోచించారు. వారి మెదడుకి ఏదో తట్టింది. ముందుగా విలాస్ తేరుకున్నాడు ఆలోచనలోంచి. తర్వాత గట్టిగా నవ్వటం మొదలెట్టాడు. విలాస్ ముఖం వైపు చూస్తూ ఒక్క క్షణం ఆగి ఆ ఎర్ర బ్యాగ్ అమ్మాయి కూడా నవ్వటం మొదలెట్టింది. ఆభాస్ కి కోపం ఇంకా ఎక్కువైంది. వాళ్ళ ప్లాను బట్టబయలు అయిపోయిందన్న ఫీలింగ్ కప్పిపుచ్చుకోవటానికి ఈ పిచ్చి నవ్వు నవ్వుతున్నారు అనుకున్నాడు ఎంతో అక్కసుగా.
"మర్డరా? మణినా? నేనా?" అంటున్నాడు విలాస్ పగలబడి నవ్వుతూనే. తర్వాత "ఆభాస్, వుండు. Let me explain... నేను, నువ్వంటున్న ఈ ఎర్ర బ్యాగ్ అమ్మాయి రేపు సాయంత్రం ఒక నాటకం వేయబోతున్నాము. ఆ రిహార్సల్స్ కోసం నిశ్శబ్దంగా, ఏ డిస్టర్బన్స్ లేకుండా ఉంటుందని మొదట్లో కొన్ని రోజులు బీచ్ కి వెళ్ళాం. ఆ తర్వాత అక్కడ కూడా జాగింగ్ చేసే వాళ్ళ గలాభా వల్ల ఏకాగ్రత కుదరటంలేదని ఇంక అక్కడికి వెళ్ళటం మానేసాం. నా భార్యని చంపేస్తానని అన్న నా మాటలు ఆ డ్రామాలోని నా డైలాగులు. అంతేకానీ మణిని గురించి అన్నవి కావు" అన్నాడు విలాస్ ఇంకా నవ్వుతూనే.
ఇప్పుడు ఆశ్చర్యపోవటం ఆభాస్ వంతయింది. అనుమానంగా, ఆశ్చర్యంగా విలాస్ వంక, ఆ ఎర్ర అమ్మాయి వంక సూటిగా, తేరిపార చూసాడు. కొన్ని క్షణాలు అక్కడ మౌనంగా గడిచాయి. ముందుగా తేరుకుంది మణి. మెల్లిగా ఆభాస్ ని దగ్గరకు తీసుకుంది. మెల్లిగా మౌనాన్ని భేధిస్తూ "ఆభాస్, విలాస్ అంకుల్ నిజమే చెప్తున్నారు. మొదట్లో ఒకటి రెండు రిహార్సల్స్ కి నేను కూడా వెళ్ళాను. నువ్వనే ఈ ఎర్ర బ్యాగ్ అమ్మాయి నాకు బాగా తెలుసు. విలాస్ అంకుల్ తో వాళ్ళ ఆఫీసులోనే పని చేస్తుంది. మా చుట్టాలబ్బాయితో ఆ అమ్మాయికి వచ్చే నెలలో పెళ్లి కూడా జరగబోతోంది. రేపు వాళ్ళ షో కి నువ్వు కూడా మాతో వద్దువుగాని" అంది విషయాన్ని విపులంగా చెప్తూ. ఆ ఎర్ర బ్యాగ్ అమ్మాయి కూడా మెల్లిగా ఆభాస్ దగ్గరికి వచ్చి "ఆభాస్, చూడు, మా డ్రామా స్క్రిప్ట్ చూపిస్తాను నీకు… కావాలంటే." అంటూ తన ఎర్ర బ్యాగ్ లోంచి ఒక పెద్ద కాగితాల కట్టని బయటకు తీసి ఆభాస్ కి ఇచ్చింది. ఆభాస్ కళ్ళు గబగబా ఆ స్క్రిప్ట్ వెనక పరిగెత్తాయి. తెలుగు చదవటం, రాయటం నేర్చుకోవటం అప్పుడతనికి బాగా ఉపయోగపడింది. "చూడు, ఈ కాఫీ లో ఏదో వుందని నీకు అనుమానం కదూ! నేను తాగుతున్నాను చూడు" అంటూ ఆ అమ్మాయి అక్కడ టేబిల్ మీద వున్న కాఫీ కప్పుని చేతిలోకి తీసుకుని కొంచెం తాగింది. విలాస్ కూడా ఆమె చేతిలోంచి కప్పు తీసుకుని ఇంకొంచెం తాగాడు. ఆభాస్ ఒక్క క్షణం నెర్వస్ గా, క్యూరియస్ గా వాళ్ళవైపు చూసాడు. విలాస్, ఆ ఎర్ర బ్యాగ్ అమ్మాయి ‘మేం బాగానే వున్నాం, చూడు’ అన్నట్లుగా ఆభాస్ వైపు చూసారు.
తనది కేవలం అపోహే అని, అసలు నిజం వేరే వుందని, విలాస్ చెప్పింది సత్యమే అని అందరికీ, ముఖ్యంగా ఆభాస్ కి తెలిసిపోయింది.
"సారీ విలాస్ అంకుల్. సారీ మణి ఆంటీ. సారీ ఎర్ర బ్యాగ్ ఆంటీ." అన్నాడు మెల్లిగా తను అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతూ. "ఏం ఫరవాలేదు ఆభాస్. నీకు మణి ఆంటీ అంటే ఎంత ప్రేమో తెలిసిపోతోంది. I am proud of you" అన్నాడు నవ్వుతూ విలాస్ ఆభాస్ భుజం తట్టుతూ. ఆ ఎర్ర బ్యాగ్ అమ్మాయి కూడా నవ్వుతూ ఒక్కసారి ఆభాస్ చెయ్యి నొక్కి వదిలేసింది.
"మై గాడ్! మణీ, ఏమో అనుకున్నాను. ఆభాస్ కి నువ్వంటే ఎంతిష్టమో! నీమీద ఈగ వాలనివ్వడు" అన్నాడు విలాస్ మణితో. మణి నవ్వుతూ అవునన్నట్లు గర్వంగా చూసింది.
ఆ మర్నాడు ఆభాస్ మణితో కలిసి నాటకం చూడటానికి వెళ్ళాడు. అమ్మమ్మ, తాతయ్య కూడా వెళ్ళారు వారితో పాటు. నాటకంలో నా భార్యని నేను చంపేస్తాను అన్న డైలాగు విలాస్ చెప్తున్నపుడు ఆభాస్ కి ఏదో గిల్టీగా అనిపించింది. అతను ఎంతో అపాలజటిక్ గా మణి వైపు చూస్తే, ఏం ఫరవాలేదు, మా అందరికీ తెలుసు, we love you అన్నట్లు మణి అతని వైపు చూసింది. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.
OOOOOOOOO
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
రాధిక నోరి
రాధిక నోరి: కృష్ణా జిల్లాకు చెందిన నోరి రాధిక గారు సాఫ్ట్ వేర్ రంగంలో నిష్ణాతులు గా ఫ్లారిడా రాష్ట్రంలో నగర రవాణా వ్యవస్థలో ఉన్నత పదవి నిర్వహిస్తూ సుమారు ముప్పై ఏళ్ళకి పైగా భర్త బాలకృష్ణ, కుమారుడు హరిత్ లతో టాలహసీ నగరం లో నివసిస్తున్నారు. భారత దేశంలో ఉన్నప్పుడే ఆలిండియా రేడియో ఆర్టిస్ట్ గా పని చేసిన రాధిక గారు అమెరికాలో కూడా అనేక కచేరీలు చేసి మంచి గాయని గా పేరు తెచ్చుకున్నారు. 1980 దశకంలో రచనా వ్యాసంగం లో ప్రవేశించి యాభై పైగా కథలు రచించి అనేక పత్రికలలో ప్రచురించారు. అమెరికా మహిళా రచయిత్రులలో సుప్రసిద్ధులైన రాధిక గారు సంగీతపరమైన అనేక గేయాలు రచించి అమెరికాలోనూ, ఆస్ట్రేలియా లోనూ రేడియో కచేరీలు చేశారు.