MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
నాతిచరామి
దినవహి సత్యవతి
శంకరయ్య, జగదాంబ దంపతులకు లేక లేక కలిగిన ఏకైక పుత్ర సంతానం విష్ణు. వృత్తి రీత్యా డాక్టరు. ఎన్నో పెద్ద ఆస్పత్రులనించి అన్ని సౌకర్యాలతో పాటు మంచి జీతం కూడా ఇస్తామంటూ ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ, సొంతప్రాక్టీసు పెట్టుకుంటే వృద్ధులైన తన తల్లిదండ్రులకి కూడా తగినంత సమయం కేటాయించవచ్చుననే ఆలోచనతో ఇంటిదగ్గరే క్లినిక్ ప్రారంభించాడు. తన దగ్గరికి వైద్యం కోసం వచ్చినవారికి మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా నామమాత్రపు ఫీజు తీసుకుంటూ దయాగుణం కలిగిన డాక్టరు, మృదుస్వభావి… అని మంచి పేరు సంపాదించుకున్నాడు.
పెద్దల పట్ల, సంస్కృతి సాంప్రదాయాలపట్ల ఎంతో గౌరవం కలవాడు విష్ణు. మంచి గుణాలు అంతకుమించి ఎంతో మంచి మనసు, వయసు 28 సంవత్సరాలు… పైగా తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు కావడంతో పిల్లనిస్తామంటూ ఎన్నో సంబంధాలు వస్తున్నాయి ముంగిట్లోకి !!! వచ్చిన సంబంధాలలోంచి, విద్యావంతురాలు గుణవంతురాలైన లలిత అనే అమ్మాయి అన్నివిధాలా అందరికీ నచ్చింది. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగి, క్లినికల్ సైకాలజీలో ఉన్నత విద్యనభ్యసించి ఒక ఆస్పత్రిలో క్లినికల్ సైకాలజిష్టుగా పనిచేస్తోంది ఆమె.
అటు లలిత వాళ్ళ తరఫు నించి కూడా అంగీకారం రావటంతో వెంటనే నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుని సంబంధం ఖాయం చేసుకున్నారు. మరో అయిదు నెలల తరువాత పెళ్ళికి ముహూర్తం కూడా నిశ్చయించబడింది.
వివాహం నిశ్చయం అవటంతో విష్ణు లలిత లిద్దరూ సమయం దొరికినప్పుడల్లా కలుసుకుని కబుర్లు చెప్పుకోవటం, తమ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవటం... లాంటివి చేయసాగారు.
మంచిరోజు చూసుకుని పెళ్లి పనులు మొదలు పెట్టారు విష్ణు తల్లిదండ్రులు. పనుల హడావిడిలో అలసట ఎక్కువ అవటంచేతను, పెద్ద వయసు అవటం వల్లను విష్ణు తల్లి - జగదాంబ తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యింది. ఆ సమయంలో లలిత తన తల్లికి చేసిన సేవకి విష్ణు ఎంతో సంతసించాడు. శంకరయ్య జగదాంబ దంపతులు కూడా కాబోయే కోడలి సేవా తత్పరతకి ఎంతో పొంగిపోయారు. కొడుకు వైద్యం , లలిత సేవలతో ఆవిడ త్వరగానే కోలుకున్నారు.
అనుకున్న ముహూర్తానికి విష్ణు లలితల పెళ్లి అత్యంత వైభవంగా జరిగిపోయింది. కోడలిని ఎంతో అట్టహాసంతో అంతకంటే ఎక్కువ ఆప్యాయతతో సాదరంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు శంకరయ్య దంపతులు.
విష్ణు లలితల వివాహమైన కొన్నాళ్ళకి శంకరయ్య దంపతులు తీర్థయాత్రలు చేసివస్తామని వెళ్లారు. మూడు నెలలు గడిచాయి.........
లలిత కొంచెం నీరసంగా ఉండటం గమనించిన విష్ణు ఒకరోజు “ఏమైంది లలితా? ఒంట్లో బాగుండటంలేదా “ అని అడిగాడు.
“ అవును విష్ణు ఎప్పుడూ ఎందుకో విపరీతమైన నీరసంగా, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటోంది, అప్పుడప్పుడు కొంచెం జ్వరం వచ్చినట్లుగా కూడా అనిపిస్తోంది ” అంది లలిత.
“ఈ మధ్య నీకు ఇంటా బయటా కూడా పని ఒత్తిడి ఎక్కువైంది. పని తగ్గించుకోమంటే వినవు కదా? నా మాట విని కొన్నాళ్లు సెలవు పెట్టి వెళ్ళి మీ అమ్మానాన్నల వద్ద ఉండి విశ్రాంతి తీసుకునిరా. నీ సెలవు గురించి మీ ఆస్పత్రిలో నేను మాట్లాడతానులే “ అని చెప్పి విష్ణు వెళ్లిపోయాడు.
“అలాగే” అని లలిత పుట్టినింట్లో పదిహేను రోజులు ఉండి కొంచెం కోలుకున్నాక తిరిగి వచ్చింది. కానీ వచ్చిన కొన్నిరోజులకే మళ్ళీ అనారోగ్యానికి గురైంది.
ఇంక అశ్రద్ధ చేయటం మంచిది కాదనిపించి “పద ” అని లలితని తీసుకెళ్లి అన్ని వైద్య పరీక్షలు దగ్గరుండి చేయించాడు విష్ణు. ఫలితాలలో లలితకి ‘హ్యూమన్ ఇమ్మ్యునో డెఫిషియన్సీ’ (హెచ్.ఐ.వి.) వైరస్ సోకిందని వెల్లడైంది. అది తెలిసి ఇరువురూ విభ్రాంతులయ్యారు .
‘ఇదెలా సాధ్యం?’ అనుకుంటూ విపరీతమైన ఆందోళనకి గురయ్యారు. ఎంత ఆలోచించినా కారణం తెలియరాలేదు. ఈ విషయం నిర్థారించుకోవటానికి లలితకి వేరే చోట మళ్ళీ అన్ని పరీక్షలు చేయించాడు విష్ణు. మళ్ళీ అదే ఫలితం ?????
విషయం తెలిసిన శంకరయ్య జగదాంబ దంపతులిద్దరూ తీర్థయాత్రలు మధ్యలోనే ముగించుకుని హుటాహుటిన తిరిగి వచ్చేశారు. మనుమరాలి కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వార్త శరాఘాతంలా తగిలి విలవిలలాడిపోయారు.
“ఈ వైరస్ వివాహేతర సంబంధాలవల్ల, రక్త మార్పిడివల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల సంక్రమించే అవకాశం ఉందనీ, ప్రాణాంతకమైనదనీ… “ శంకరయ్య దంపతులు మునుపు విని ఉన్నారు కొడుకు ద్వారా. వైద్యానికి సంబంధించి ఏ విషయమైనా తల్లిదండ్రులతో చర్చించటం మొదటినించి అలవాటు విష్ణుకి. ఇప్పుడు వారిద్దరి ఆందోళనల్లా ‘ఈ హెచ్.ఐ.వి. వైరస్ లలితద్వారా విష్ణుకి సోకుతుందేమోనని?’ అప్పటిదాకా అమృతవర్షిణి లా అనిపించిన లలిత ఈ విషయం వెల్లడికాగానే ఒక్కసారిగా, ముఖ్యంగా కొడుకుపాలిట, విషకన్య లా అగుపించసాగింది జగదాంబ శంకరయ్యగార్లకి .
విష్ణు లలితలు దిగులుగా కూర్చుని తమ జీవితాలలో చోటుచేసుకున్న అనుకోని ఈ పరిణామానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ తమ వివాహానంతరం జరిగిన సంఘటనలన్నీ పునరావలోకనం చేసుకుంటుంటే కొన్నాళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన చటుక్కున జ్ఞాపకం వచ్చింది . విష్ణు డాక్టరు కావటంతో లలితకి ఈ వైరస్ సోకటానికి ఆ సంఘటనకి తప్పక ఏదో సంబంధం ఉండి ఉండవచ్చని సందేహించాడు...
కొన్నాళ్ళ క్రితం రెండు రోజులు సెలవలు కలిసి రావటంతో విష్ణు లలితలిద్దరూ బైక్ మీద ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ సందర్శించి వద్దామని వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బైక్ అదుపుతప్పటంతో జరిగిన ప్రమాదంలో విష్ణు చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నప్పటికి, వెనక కూర్చున్న లలితకి మాత్రం బాగా గాయాలు తగిలి ఎక్కువగా రక్తస్రావం కావడంతో వెంటనే రక్తం ఎక్కించవలసిన ఆగత్యం ఏర్పడింది. వెంటనే దగ్గరలోనే ఉన్న ఆస్పత్రికి చికిత్స నిమిత్తమై వెళ్లారు. అది ఒక చిన్న ఆస్పత్రి. అక్కడి అపరిశుభ్ర వాతావరణం చూసి అంతగా నచ్చకపోయినా, తప్పనిసరి పరిస్థితులలో లలిత అక్కడే చికిత్స చేయించుకోవలసి వచ్చింది. ఆ సమయంలో త్వరితంగా నొప్పి ఉపశమించటానికి ఇంజక్షన్లు ఇచ్చి రక్తం కూడా ఎక్కించడం జరిగింది.
ఆ సందర్భంగా వాడిన సూదుల ద్వారా గాని లేదా ఎక్కించిన రక్తం కలుషితమైనదైనా అయిఉండటంవల్లగానీ లలితకి ఈ వైరస్ సోకి ఉండవచ్చునని విష్ణు సందేహించాడు. అదే విషయం లలితతో అన్నాడు .
“అవును విష్ణు, నువ్వు చెప్పినది వింటుంటే నీ సందేహం సమంజసమైనదేనని నాకూ అనిపిస్తోంది. అదే నిజమైతే ఈ వైరస్ ఇప్పటికే నీకు కూడా సోకి ఉండవచ్చేమోననే భయం కూడా మొదలైంది నాకు . ఎందుకైనా మంచిది వెంటనే ఒకసారి నువ్వు కూడా అన్ని పరీక్షలు చేయించుకో” అంది లలిత .
“సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను” అని విష్ణు తాను కూడా అన్నీ పరీక్షలు చేయించు కున్నాడు. విష్ణుకి ఈ వైరస్ ఇంకా సోకలేదనే సంగతి తెలిసి లలిత తేలికగా ఊపిరి పిల్చుకుంది.
ఆ తరువాత ఇద్దరు బాగా ఆలోచించి, ఒక మంచి లాయరుని సంప్రదించి, లలిత వైద్యం చేయించుకున్న ఆస్పత్రిపై, ఆనాడు లలితకి చికిత్సలో జరిగిన నిర్లక్ష్యం వల్లనే ఆమెకు ఈ హెచ్.ఐ.వి. వైరస్ సోకిందని ఆరోపిస్తూ కోర్టులో కేసు వేయాలనే నిర్ణయానికివచ్చారు.
“అంతకంటే ముందుగా ఈ విషయం వెంటనే అమ్మా నాన్నలకి చెప్తాను . ఈ వైరస్ నీకు ఎలా సోకిందో వాళ్ళకి చెప్పి, మనం కోర్టులో కేసు వేయాలనుకుంటున్న సంగతి కూడా వాళ్ళకి తెలియజేయటం మంచిది కదా!” అంటూ తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళాడు విష్ణు.
జరిగిన సంఘటన గురించి తల్లిదండ్రులిద్దరికి పూసగుచ్చినట్లు వివరించి “ఆ సమయంలో మీరు కంగారు పడతారని ఈ విషయం మీదాకా రాకుండా జాగ్రత్తపడ్డాము కానీ ఇలా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. అంతే కాకుండా ఆ ఆస్పత్రిపై కోర్టులో కేసు వేయాలని కూడా నిశ్చయించుకున్నాము” అని చెప్పాడు విష్ణు.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది శంకరయ్య దంపతులకి, కొన్నాళ్లక్రితం కొడుకు ‘నేను, లలితా రెండు రోజులు చుట్టుపక్కల ప్రదేశాలు సందర్శించి రావటానికి వెళుతున్నాము’ అని చెప్పిన విషయం. కానీ వాళ్ళు తిరిగి రావటానికి పదిరోజులయ్యిందనే సంగతి మాత్రం ఇప్పుడే తెలిసింది వారికి.
విష్ణు అంతా వివరించి చెప్పినప్పటికీ వాళ్ళ ఆందోళన ఏ మాత్రం తగ్గలేదు. అందుకే “చూడు విష్ణు, లలితకి ఈ వైరస్ ఎలా సోకినది తెలిసాక మాకూ ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే నిజంగా బాధగానే ఉంది. అసలు ఇప్పటికే ఈ సంగతి నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారో, ఏమంటారో అని మేము భయ పడుతుంటే నువ్వు ఇంకా కోర్టూ –కేసూ అంటావేమిటి? సరే ఆ విషయం ప్రస్తుతానికి పక్కనపెడితే నువ్వు లలితతో కలిసి ఉంటే ఎప్పటికైనా నీకు ఈ వ్యాధి సోకే అవకాశముంది. ఒకవేళ ఈ వ్యాధి ఇప్పటికే నీకు సోకిందేమో కూడా అని మాకు భయంగా ఉంది . అదే జరిగుంటే నీ జీవితం ఏంకావాలి? నీమీదే ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్న మా గురించి ఆలోచించావా? అందుకే మాకింకేమీ చెప్పొద్దు. మేము వినదల్చుకోలేదు. ఈ వ్యాధి నీకు సోకకముందే నువ్వు లలితని పుట్టింటికి పంపించేయి. కావాలంటే లలిత వైద్యానికయ్యే ఖర్చంతా మనమే భరిస్తామని చెప్పు” అని అంతటితో ఊరుకోకుండా, కోడలు వింటే బాధపడుతుందని కూడా చూడకుండా మళ్ళీ “ఆ తరువాత లలితకి విడాకులు ఇచ్చేసి వేరే వివాహం చేసుకో” అన్నారు జగదాంబగారు.
విష్ణుకి అత్తగారికి మధ్య జరుగుతున్న సంభాషణ అంతా గదిలోంచి బయటకు వస్తూ ఆలకించిన లలిత, అత్తగారు అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడతారని ఏమాత్రం ఊహించకపోవటంతో ఒక్కసారిగా దుఃఖం పెల్లుబుకి రాగా ఏడుస్తూ తిరిగి గదిలోకి వెళ్లిపోయింది.
తల్లి కర్కశమైన పలుకులకి “అమ్మా!” అంటూ బాధగా ఇంటి కప్పు ఎగిరేలా అరిచాడు విష్ణు. కొడుకు అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు శంకరయ్య దంపతులు.
“అంత నిర్దయగా ఎలా మాట్లాడగలిగావమ్మా నువ్వు లలిత గురించి? నీకు అనారోగ్యం చేసినప్పుడు, పెళ్ళికి ముందే అలా వచ్చి మనింట్లో ఉండిపోతే ఎవరైనా ఏమైనా అంటారనిగాని, అనుకుంటారనిగాని భయపడకుండా పగలు రాత్రి లలిత ఇక్కడే ఉండి నీకు చేసిన సేవలు మర్చిపోయావా?”
“అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. లలితకి అసలు ఈ వ్యాధి నయమవుతుందో లేదోననే విషయం ఒక డాక్టరుగా నీకు కూడా తెలుసు. అలాంటప్పుడు తల్లిదండ్రులుగా నీ సుఖం కోరుకోవటం మా తప్పంటావా? ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం లలితని పుట్టింటికి పంపివలసినదే, ఆమె ఇక్కడ ఉండటానికి ఎంత మాత్రం వీల్లేదు”
“లలితకి నయమవుతుందో లేదో అనే విషయం గురించి ఇప్పుడు నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. ఇంక నా సంగతికి వస్తే లలిత కోరిక మీద నేను ఇప్పటికే అన్నీ పరీక్షలు చేయించుకున్నాను. నాకు ఇంకా ఈ వైరస్ సోకలేదు. ఇక ముందు సోకకుండా మేమిద్దరము జాగ్రత్త పడతాము. ఆ విషయమై మీరిద్దరు కలతచెందవలసిన అవసరంలేదు. మరొక విషయం, జరిగిన దానిలో లలిత తప్పేమీ లేదు. చేయని తప్పుకి లలిత ఒక్కర్తినే శిక్షించటం న్యాయంకాదు. ప్రస్తుతం ఆమె ఉన్న స్థితిలో మనమిచ్చే డబ్బు, చేయించే వైద్యం కంటే ఎక్కువగా మన ప్రేమాభిమానాలు ఆమెకు ఎంతో అవసరం. అవే ఆమె ఇంక ముందు ప్రశాంతంగా జీవించడానికి దోహదపడతాయి. లలిత ఎక్కడికీ వెళ్ళదు. నాతోనే ఉంటుంది. కానీ ఆమె ఇక్కడ ఉంటే ఎవరేమనుకుంటారో అని మీరు భయపడుతున్నారు కనుక మేమిద్దరం వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉంటాము. అంతే గాని లలితని పుట్టింటికి పంపించే ప్రసక్తే లేదు.“ అని ఖచ్చితంగా చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు విష్ణు.
విష్ణు మాటలన్నీ లోపలినించి విన్న లలిత తన పట్ల భర్త ప్రేమానురాగాలకి ఎంతో ఉప్పొంగిపోయింది. కానీ అంతలోనే ‘ఇంత మంచి మనిషితో చిరకాలం జీవించే అదృష్టానికి నేను నోచుకున్నానో లేదో’ అనుకోగానే మళ్ళీ దుఃఖం తన్నుకొచ్చింది. అయినా తమాయించుకుని విష్ణు గదిలోకి రాగానే “విష్ణు ! అత్తయ్య మామయ్య అన్నది కూడా నిజమే కదా? నువ్వు వాళ్ళకి ఒక్కగానొక్క సంతానం. నీ సుఖం వాళ్ళు కోరుకోవటంలో తప్పేముంది? అదీగాక నేను కూడా ఎంతకాలం బ్రతుకుతానో...” అంటున్న లలిత మాట పూర్తికాకుండానే గభాలున వచ్చి ఆమె నోటికి చెయ్యి అడ్డుపెట్టి మరేమీ మాట్లాడకుండా చేసి, ఆమెని దగ్గరగా లాక్కుని గట్టిగా కౌగలించుకున్నాడు విష్ణు. అప్పటిదాకా అతి కష్టం మీద దిగమింగుకుంటున్న దుఃఖం విష్ణు ఆప్యాయతతో ఒక్కసారిగా కన్నీళ్ళ రూపంలో బయటపడింది లలితకి. విష్ణు చేతుల్లో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది.
“ఒక్క విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు? ఆ రోజు జరిగిన ప్రమాదం కారణంగా ఇదే పరిస్థితి నాకు కలిగిఉంటే నువ్వు నన్ను వదిలి వెళ్లిపోయేదానివా?”
విష్ణు ప్రశ్నకి లలిత దగ్గరనించి సమాధానంలేదు.
“లలితా! నీ మనసు నాకు తెలుసు. ఇప్పుడు నేనేం చేస్తున్నానో, ఇంక ముందు ఏమి చేయాలో కూడా నాకు తెలుసు. ఇదేమీ త్యాగం కాదు. నా బాధ్యత. పద మనం ఇంక ఇక్కడ ఉండొద్దు. చీరాల వెళ్లిపోదాము. అక్కడ నీకు అవసరమైన చికిత్స గురించి బాగా తెలిసిన నా స్నేహితులైన డాక్టర్లు ఒకరిద్దరు ఉన్నారు. నేను కూడా అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. స్థలం మార్పుతో నీకు కూడా కొంత ప్రశాంతత చిక్కుతుంది. సరేనా?” అని ఆమె దుఃఖం ఉపశమించేవరకు అలాగే ఆప్యాయంగా ఆమె జుట్టు సవరిస్తూ ఉండిపోయాడు.
ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత విష్ణు, లలిత చీరాల మకాము మార్చేశారు. ఇల్లు వదిలి వెళుతున్న కొడుకుని, కోడలిని పలుకారణాల వల్ల ‘ఆగమని’ కూడా అనలేక నిస్సహాయంగా చూస్తుండి పోయారు శంకరయ్య దంపతులు. పెద్దవాళ్ళిద్దరిని ఆ వయసులో ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టంలేకపోయినా ఇక్కడ ఉండి వారిని ఇబ్బంది పెట్టడం కంటే అదే మంచిదనిపించింది విష్ణు, లలితలకు .
కొత్త వాతావరణంలో లలితకి అన్నివేళలా చేదోడు-వాదోడుగా ఉంటూ, ఆమె చికిత్స విషయంలో ముందుగా అనుకున్నట్లే తన స్నేహితుల సలహాలు తీసుకుంటూ, వారి సూచనల మేరకు చికిత్స చేస్తూ, ఆమెని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇసుమంతైనా కష్టం కలుగకుండా ఎల్లప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకుంటూ, పెళ్లినాడు “నాతిచరామి......... “ అంటూ ఆమెతో ఏడడుగులు నడిచి అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలని అక్షరాలా నిజం చేస్తూ జీవన పయనంలో తుది వరకూ లలితకి తోడుగా ఉండిపోయాడు విష్ణు.
OOOOOOOOO
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
దినవహి సత్యవతి
దినవహి సత్యవతి: బి.టెక్(సివిల్), ఆ తర్వాత ఎం.సి.యే చేసి 12యేళ్ళు ఉపాధ్యాయ వృత్తి అనంతరం గృహిణిగా చెన్నై లో నివసిస్తున్నారు. రచనా వ్యాసంగంలో ఇప్పటివరకు దిన, వార, మాస పత్రికలు మరియు వెబ్ పత్రికల లో 33 వరకు కథలు, కవితలు, వ్యాసములు ప్రచురించబడ్డాయి. ప్రచురించబడినవి అన్నీ వారి బ్లాగు “మనోవేదిక” లోను, చిన్న పిల్లల కోసం ప్రత్యేక బ్లాగు “బాల మనోవేదిక “ లోను పొందుపరిచారు.