top of page

‘టీ’ కప్పులో ఎన్నికలు

హితేష్ కొల్లిపర

ఉదయం ఎనిమిది గంటల యాబై నిమిషాలు, కళ్ళు తెరవగానే ఎదురుగా గోడకు వేలాడుతున్న వాల్ క్లాక్ చూపిస్తున్న సమయం. బద్దకంగా అవలించాను. ఆదివారం కావడంతో ఆఫీసుకు వెళ్ళే పని లేకపోవడం చేత పెందలాడే లేవలేదు. పైగా నా ప్రియాతిప్రియమైన భార్యామణి, ‘భాగ్యశ్రీ’ కూడా లేదు. నిన్ననే నా మీద అలిగి నాలుగిళ్ళు అవతల ఉన్న తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా అలగడం అనేది ఒక సాకు మాత్రమే. ప్రతి శనివారం ఆమె ఇలా పుట్టింటికి వెళ్తుంది. కాకపోతే ఎప్పుడూ శనివారం రాత్రి వెళ్ళి, మళ్ళీ ఆదివారం ఉదయం తనే వచ్చి నన్ను నిద్ర లేపుతుంది. కానీ నిన్న మాత్రం సాయంత్రం నాతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఉదయం రాలేదు. అందుకే కాబోలు ఈ ‘ఉదయం చాలా ఆహ్లాదంగా’ ఆన్పిస్తుంది. ఎవరు చెప్పారు తుఫాను ముందు ప్రశాంతత ఉంటుందని? తుఫాను తరువాత కూడా ప్రశాంతత ఉంటుంది! అవునూ... ఇంతకీ మా ఇద్దరి మధ్యా జరిగిన గొడవ ఏంటి?? ఆలోచిస్తుంటే నిన్నటి రోజు మొత్తం కళ్ళ ముందు రీల్ తిరిగింది.
నిన్న ఉదయం ఆఫీసుకి వెళ్ళేటప్పటికే మా మేనేజర్ పీనుగ గాడు హెడ్ ఆఫీసు నుంచి ఇన్స్ పెక్షన్ కోసం జి‌ఎం వస్తున్నాడని ఫాక్స్ వచ్చిందంటూ నానా హంగామా చేస్తున్నాడు. వాడు పరుగులు పెట్టడమే కాక మమ్మల్ని పరుగులు పెట్టించాడు. మధ్యాహ్నం మూడింటి వరకు ఇదే తంతు. హెడ్ ఆఫీసు నుంచి జి‌ఎం కాదు గదా కనీసం ప్యూను కూడా రాలేదు. మూడున్నరకి మా మేనేజర్ పీనుగ వచ్చి,
“మై డియర్ స్టాఫ్ మెంబర్స్! ఇన్స్ పెక్షన్ కోసం జి‌ఎం వచ్చే శనివారం వస్తున్నాడు. కళ్ళజోడు లేకుండా ఫాక్స్ చూశానేమో, ‘కమింగ్ సాటర్డే’ అన్న పదం సరిగా కన్పించలేదు. సో, యు గయ్స్ క్యారి ఆన్ విత్ యువర్ వర్క్” కళ్ళజోడు సరిచేసుకుంటూ అనేసి వెళ్ళిపోయాడు.
అందుకు కాదూ? మేము వాడ్ని ‘పీనుగ’ అని పిలిచేది!?
మా అందరికీ కోపం వచ్చింది. నాకు అదనంగా తలనొప్పి తోడు వచ్చింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఉసూరుమంటూ ఇంటికి వచ్చి కూలబడ్డాను. అప్పుడు నా భాగ్యశ్రీ టీవీలో అదేదో నోరు తిరగని పేరు కలిగిన సీరియల్ చూస్తుంది, ఎంతో తీక్షణంగా. నేను కూడా చూపు కలిపాను. అదే నేను చేసిన తప్పు.  తలపోటు అధికమైంది. భరించలేక,
    “భాగ్యం(నేను అలానే పిలుస్తాను) కాస్త టీ పెట్టివ్వవా?” అని అడిగా.
    “ఒక్క నిమిషం ఆగండి. ఇది అయిపోయాక పెట్టిస్తా” అంది. ఒక్క నిమిషం గడిచి ఐదు నిమిషాలైంది.
    “భాగ్యం కాస్త టీ పెట్టవే. తల నొప్పిగా ఉంది”
    “అబ్బా... ఒక్క నిమిషం ఆగండి. సీరియల్ అయిపోయాక పెట్టిస్తా”
    “ఒక్క నిమిషం అయిపోయి ఐదు నిమిషాలైందే”
    “మాంచి సస్పెన్స్ లో ఉందండి”
    “రేపు మళ్ళీ రీక్యాప్ వేస్తారుగా... అప్పుడు చూసుకోవచ్చుగా...” అన్నా బేస్ వాయిస్ లో.
“రేపు మళ్ళీ మీకు తల నొప్పి వస్తుందని ఇప్పుడొచ్చిన తలనొప్పికి టీ తాగకుండా ఉన్నారా?...” అంది లో వాయిస్ లో. నాకు దిమ్మదిరిగిపోయింది.
అప్పుడే ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నేను ‘ఏ...’ అన్నాను. తను ‘బీ...’ అంది. అల్పపీడనం వాయుగుండంగా మార్పు చెందింది. నేను మెరిశాను. తను ఉరిమింది. వాయుగుండం తుఫానుగా తీవ్రరూపం దాల్చింది. గొడవ ఎక్కడ్నించి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకర్నొకరు సవాలు విసురుకునే స్థాయికి చేరుకుంది. 
    “నేను లేకుండా ఒక్క పని చేసుకోలేరు. మీకెందుకు అంత డాబు” అంది.
    “అది నీ భ్రమ మాత్రమే. నేను గట్టిగా తల్చుకుంటే ఏ పనైనా చిటికెలో చేసేయగలను” అన్నాను.
    “అయితే టీ పెట్టండి చూద్దాం” సవాలు విసిరింది.
    “ఒక్క టీ ఏం ఖర్మ! పంచభక్ష్యపరమాన్నాలు చేయగలను” నేనూ తగ్గలేదు.
    “అక్కర్లేదు… టీ పెట్టండి చాలు. కనీసం కుక్కర్ మూత కూడా తీయలేని మీరు టీ పెడితే అదే గొప్ప”
    “పెట్టి చూపిస్తా”
“అయితే సరే. మీరు టీ పెట్టి చూపించే దాకా వంట గది గడప కూడా తొక్కను. అందాకా మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మీరు టీ పెట్టి పిలిస్తేనే మళ్ళీ వస్తాను” అనేసి వెళ్ళిపోయింది. ఇంజెన్ వెంబడి రైలు పెట్టెలు వెళ్ళినట్టు, భాగ్యశ్రీ వెంబడి నా ఏడేళ్ళ పుత్రరత్నం కూడా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు “బై నాన్న” అంటూ చేతులూపి మరీ వెళ్ళాడు. అలా తుఫాను తీరం దాటింది. అదీ మా ఇద్దరి మధ్యా జరిగిన గొడవ.
ఠంగ్!..... వాల్ క్లాక్ చప్పుడు చేయలేదు. కానీ చప్పుడు చేసినట్టు అన్పిస్తే అటువైపు చూశా. తొమ్మిదైంది. అసలు తను సవాలు విసిరితే నేనెందుకు రెచ్చిపోవడం? తనన్నది నిజమేగా. నాకు కుక్కర్ మూత తెరవడం కూడా రాదు. మరలాంటప్పుడు ఎందుకు అనవసర బెట్టుకి పోవడం? ఏదేమైనా సరే సవాలు స్వీకరించాం. సాధించి తీరాల్సిందే. కానీ టీ ఎలా పెట్టడం? తెలీదే! ముందు లేచి ఫ్రెష్ ఆయి తరువాత ఆలోచిద్దాం అనుకుంటూ ఒక్క ఉదుటున మంచం పై నుంచి లేచాను. కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికి పదైంది. కాసేపు టీవి చూద్దామని టీవి ఆన్ చేశాను. న్యూస్ ఛానలే పెట్టాను. ‘పంచ్ టు పంచ్’ ప్రోగ్రాం వస్తుంది. ఎన్నికల సీజన్ కదా, నాయకుల పంచింగ్ మాటలు ప్రసారం చేస్తున్నారు.
“నీ హయాంలో లక్షకోట్లు కాజేశావు” అని ఒక నాయకుడు పంచ్ విసిరితే,
“నీ హయాంలో లక్షమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు” అని మరో నాయకుడు పంచ్ విసిరాడు. ఇది తేలే విషయం కాదని టీవి ఆఫ్ చేసి మళ్ళీ నా బ్రహ్మకార్యం గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఎంతకీ ఉపాయం తట్టలేదు. ఆలోచించగా ఆలోచించగా ఫ్లాష్ లా ఒక ఐడియా తట్టింది. వెంటనే కంప్యూటర్ ఆన్ చేసి నెట్ ఓపెన్ చేశా. ‘హౌ టు ప్రిపేర్ టీ?’ అని గూగుల్ లో టైప్ చేసి ఎంటర్ కొట్టా. ఓ పది లింకులు వచ్చాయి. మొదటిది క్లిక్ చేశా. చాంతాడంత మ్యాటర్ వచ్చింది. ఓపిగ్గా చదివా. కొద్దిగా అవగాహన వచ్చింది. యూట్యూబ్ లో ‘టీ ప్రిపరేషన్స్’ వీడియోస్ చూశా. అర్థమైంది. హుషారుగా వంటింట్లోకి వెళ్ళి స్టౌ ఆన్ చేసి గిన్నె పెట్టా. సరిగ్గా అప్పుడు మోగింది కాలింగ్ బెల్. ఎవరనుకుంటూ వెళ్ళి తలుపు తెరిచా. ఎదురుగా టక్ చేసుకుని టై కట్టుకున్న వ్యక్తి చిరు మందహాసం వేసుకుని నించున్నాడు. చూస్తేనే అర్థమైపోతుంది సేల్స్ ఏజెంట్ అని.
    “ఇప్పుడేం వద్దయ్యా” అంటూ తలుపు వేసేయబోయా. కానీ,
    “సార్.. సార్... నేను సేల్స్ ఏజెంట్ కాదు సార్” అనడంతో ఆగిపోయా.
    “ఎవరు నువ్వు? ఏం కావాలి?” అడిగా.
    “సార్! నేను మనదేశం పార్టీ నుండి వస్తున్నాను” చెప్పాడు.
    “అదేం కంపెనీ?”
    “కంపెనీ కాదు. పోలిటికల్ పార్టీ సార్! మనదేశం”
    “అయితే?”
    “సార్ మీకేమన్నా పంట రుణాలు ఉన్నాయా?”
    “ఎందుకు?”
    “పోనీ, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా?”
    “ఆడవాళ్ళు లేని ఇల్లు ఎక్కడైనా ఉంటుందా?”
    “వాళ్ళ పేరు మీద ఏమైనా రుణాలు ఉన్నాయా?”
    “ఎవరు నువ్వు?, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావ్?”
“సార్ వచ్చే ఎన్నికలలో మా పార్టీకి ఓటు వేయండి. అధికారంలోకి వచ్చాకా మీ రుణాలన్నీ మాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా మీ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, వారి పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ మేమే చూసుకుంటాం. ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతాకి అధమ పక్షం పదివేలు పడతాయి. ఇది మా హామీ. ఇంకా...”
    “నువ్వు పార్టీ కార్యకర్తవా?” వాడి మాటల ప్రవాహాన్ని అపుదామని అడిగా.
    “లేదు సార్. ఎం‌బి‌ఏ స్టూడెంటుని”
    “మరి పార్టీకి ప్రచారం చేస్తున్నావా?”
“లేదు సార్, పార్టీ మాలాంటి వారిని హైర్ చేసుకుంది. ప్రజలకి పార్టీని మరింతగా చేరువ చేసే ఆలోచనతో ఇలా చేశాం. కస్టమర్స్ ని అట్ట్రాక్ట్ చేసి ప్రాడక్ట్ కొనిపించడంలో మాలాంటి వారి అనుభవం ఓటర్లని అట్ట్రాక్ట్ చేయడంలో ఉపయోగపడుతుందని ఇలా చేశారు”
“నిజమా!....”
“తప్పదు సార్. కొత్త ట్రెండ్ ఫాలో కావాల్సిందే. ఎన్నికల్లో గెలుపు కోసం ఇలా చేయాల్సిందే. కానీ సార్ ఏదో మాడు వాసన వస్తున్నట్టు ఉంది కదా..” అన్నాడు. అవును నిజమే... మాడు వాసన వస్తుంది. కానీ ఎక్కడ్నుంచి? ఇంతలో గుర్తుకొచ్చింది.
    “అమ్మో!... స్టౌ మీద గిన్నె పెట్టాను. నువ్వేల్లవయ్యా అక్కడ అది మాడి పోయినట్టుంది”
    “మరి మా పార్టీకి ఓటు వేస్తారా?”
    “వేస్తాలే వెళ్ళవయ్యా” అంటూనే తలుపేసేశాను.
ఇలా రుణాలన్నీ మాఫీ చేసుకుంటూ పోతే ఇక దేశం ఆర్దికంగా ఏం వృద్ది చెందుతుంది? అనుకుంటూనే వంటింట్లోకి వెళ్ళా. వంటిల్లు మొత్తం పొగతో నిండిపోయింది. గిన్నె నల్లగా మాడిపోయింది. నాకు ఊపిరాడక దగ్గోచ్చింది. ఎలాగో కష్టపడి గిన్నెను స్టౌ మీదనుంచి తోసేశాను. గిన్నె చూసి భాగ్యం ఏమంటుందో. మళ్ళీ కొత్త గిన్నె పెట్టి పాలు పోసి స్టౌ వెలిగించాను. కాలింగ్ బెల్ మోగిన శబ్దమైంది. వెళ్ళి తలుపు తీశాను. ఇందాకటి లానే ఇంకో వ్యక్తి నించుని ఉన్నాడు. ఏంటన్నట్టు చూశా.
    “సార్ మీరేం పని చేస్తుంటారు?” అడిగాడు.
    “ఉద్యోగం” చెప్పాను.
    “జీతమెంత?”
    “ఓయ్, ఎవరు నువ్వు? నీపాటికి నువ్వు విషయం చెప్పకుండా వివరాలు అడుగుతున్నావు”
“సార్ నేను పి‌టి‌ఆర్ పార్టీ నుండి వస్తున్నాను. మీరు గనుక మా పార్టీకి ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే, గృహాలక్ష్మి పధకం కింద మీ ఆడవాళ్ళకు ఐదు వేలు, సరస్వతి పధకం కింద ఎల్‌కే‌జి చదువుతున్నా సరే మీ పిల్లలకి ల్యాప్టాప్ లు. రక్షా పధకం కింద వయసొచ్చిన మీ ఆడపిల్లలకు సెల్ ఫోన్లు(ఫోన్ దగ్గరుంచుకుంటే వారు ఎక్కడున్నారని తెలుసుకోవచ్చని), 75 రూపాయలకే ఇంటిల్లిపాదికీ సరిపడా రేషన్, ఇంకా టీవి లేకపోతే టీవి కూడా ఇస్తాం సార్. ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. మమ్మల్ని గెలిపించండి చాలు. మీ జేబులోంచి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మీ కుటుంబాన్ని మేమే పోషిస్తాం” గడగడా చెప్పి ఆగాడు.
    “సరే” అన్నాను
    “సరే కాదు సార్ ఓటు వేయండి”
    “వేస్తానయ్యా”
    “థాంక్ యు సార్. మీలాంటి వారు అండగా ఉంటే మా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది” షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఒకడు రుణాలు మాఫీ అంటాడు, ఇంకోడు ఏకంగా కుటుంబాన్నే పోషిస్తా అంటాడు. అంతేకాని ఒక్కడూ మంచి పరిపాలన ఇస్తామని చెప్పాడు. ఛీ ఛీ. ప్రజల్ని సోమరిపోతులు చేసి చెప్పు కింద తేలులా ఉంచుకోవాలని వీళ్ళ ఉద్దేశం. ఆలోచిస్తూ స్టౌ దగ్గరకి వెళ్ళి గిన్నెలో చూశా. గిన్నె ఉంది కానీ పాలు లేవు. పాలేవీ? ఇంకిపోయాయి. చిర్రెత్తుకొచ్చింది. వీళ్ళ ఎన్నికలు ఏమో గానీ నన్ను ప్రశాంతంగా టీ పెట్టనీడంలేదు. మళ్ళీ పాలు పోసి, పంచదారా, టీ పౌడర్ వేశా. కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. తప్పదు వెళ్ళి తలుపు తీశా. ఇందాకట్లానే మరో వ్యక్తి.
    “చెప్పు” అన్నట్టు తలాడించా.
    “సార్ నేను అభయహస్తం పార్టీ నుండి వస్తున్నాను”
    “ఆహా!..... నువ్వేం ఫ్రీగా ఇస్తావు బాబు?” అన్నాను.
“ఫ్రీగా ఇవ్వడం కాదు సార్. మీ సమస్యలు వివరించండి. మీకేం కావాలో చెప్పండి. నోట్ చేసుకుని, మేం అధికారంలోకి రాగానే అది మీకు నెరవేరుస్తాం”
    “టీ పెట్టడం నేర్పిస్తారా?” ఏం చెప్పాలో తెలియక నా సమస్య గురించి చెప్పా.
    “అయ్యో!... తప్పకుండా సార్.” అంటూ వాడి దగ్గర ఉన్న పుస్తకంలో ఏదో రాసుకున్నాడు.
“మీ సమస్య రాసుకున్నాను. మా అధిష్టానంతో చర్చించి దీనికి సంబంధించిన పధకం ప్రవేశపెట్టి, రేపు మేం అధికారంలోకి రాగానే మీ సమస్య తీరుస్తాం. మరి మీరు మాకే ఓటు వేయాలి. ఓకేనా....” అనేసి వెళ్ళిపోయాడు.
ఏడ్వలేక నవ్వాను. పట్టరాని కోపం వచ్చింది. డబేల్మని తలుపేశాను. ఇంక ఎవరొచ్చినా సరే టీ పెట్టనిదే ఊరుకోకూడదని నిర్ణయించుకున్నాను. వంటింట్లోకి వెళ్ళి దిగ్విజయంగా ఇందాక అన్నీ పోసి ఉంచిన గిన్నె వెలిగించాను. టైమ్ చూశాను. యూట్యూబ్ లో చూపించినట్టు ఐదు నిమిషాలు మరిగితే ఘుమఘుమలాడే టీ రెడీ! సమయం గడుస్తుంది. టీ దగ్గరపడుతుంది. సరిగ్గా అప్పుడే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. మళ్ళీ ఎవడో పార్టీ వాడు వచ్చాడు. ఈసారి ఎవడైనా సరే చచ్చాడే! నా చేతిలో చచ్చాడే. చుట్టూ చూశాను. ఎదురుగా చపాతీ కర్ర కన్పించింది. చేతిలోకి తీసుకున్నాను. వెళ్ళి కర్ర పైకెత్తి పట్టుకుని తలుపు తెరిచి, “రేయ్!.....” అని గట్టిగా అరిచాను. కానీ వచ్చిన వ్యక్తిని చూడగానే నా నోట మాట పడిపోయింది. ఆ వచ్చింది భాగ్యశ్రీ! అప్రయత్నంగా నా చేతిలోని కర్ర జారిపడింది.
    “భాగ్యం నువ్వా!....” అన్నాను. తను నా వంకా, కింద పడ్డ కర్ర వంకా తేరిపారా చూసి,
“ఆదివారం కదా, పాపం ఇంతవరకు టిఫిన్ కూడా చేసుండరు. పోన్లే చేద్దాం అని వస్తే, నా మీదే చపాతీ కర్ర ఎత్తుతారా?.... ఇక ఈ జన్మలో ఈ ఇంటి గడప తొక్కను. మీ పాట్లు మీరు పడండి. నే పోతున్నా” అంటూ వెళ్ళిపోయింది. వెనుకన ఉన్న నా పుత్రరత్నం కూడా “బై నాన్న” అంటూ తన వెనకే వెళ్ళిపోయాడు.
“భాగ్యం అది కాదే... వినవే...” అంటూ వెంటపడ్డా. వినిపించుకుంటేగా... ఆగకుండా వెళ్ళిపోతుంది. నేనూ ఫాలో చేస్తూ తన వెనకే వెళ్ళా. సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది స్టౌ మీద టీ మరిగిపోతుందని. అటు వెళ్ళాలా లేక ఇటా?... ఆకాశం కేసి చూశా దేవుడు చెప్తాడేమోనని. మీరన్నా చెప్తారా?.....
(Disclaimer: ఇది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వ్రాసిన కథ. ఎవరినీ నొప్పించడానికి కాదు.)

OOOOOOOOO

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
 

Bio

హితేష్ కొల్లిపర​

హితేష్ కొల్లిపర: గుంటూరుకు చెందిన హితేష్ కొల్లిపర వయస్సు 23 సంవత్సరాలు. చార్టర్డ్ అకౌంటెన్సీ- ఫైనల్ చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి కథలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతో వ్రాసిన మొదటి కథ 'పేరమ్మ పేరాశ' 2004లో ఈనాడు-హాయిబుజ్జిలో ప్రచురితమైనది. ఇప్పటి విషయానికి వస్తే, నాలుగు కథలు స్వాతి, ఆంధ్రభూమి పత్రికలలో ప్రచురితమైయ్యాయి. 'లవ్ ఇన్స్టిట్యూట్' పేరుతో నవల ప్రచురించబడింది.

Comments
bottom of page