MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
అంతా కృష్ణమయం!! (తాయే యశోద)
శ్రీహరి అక్కిరాజు
(మనమే దేవుళ్ళం అంటుంది వేదాంతం. అయితే దేవుడే తన కొడుకుగా వచ్చినా, అతన్ని ఓ మనిషిగా చూసి ప్రేమలో ముంచెత్తింది ఓ తల్లి. అది ద్వాపరయుగం, వ్రజ భూమి, బృందావనం... )
అంతా కృష్ణమయం !
బృందావనం మళ్లీ కళకళలాడింది. చెట్లు విరపూసాయి, వీధులు కొత్త రంగులు అద్దుకున్నాయి. గోపబాలకుల్లో ఉత్సాహం పరవళ్ళు తొక్కింది . గోవులు, దూడలు గోధూళి వేళకి ముందే ఇళ్ళకు పరిగెత్తుతున్నాయి. గోపికల మాట ఇంక అడగాలా? పనిమానేసి సింగారించుకొంటున్నారు. ఇక యశోదమ్మ సంగతి వేరే చెప్పాలా ? ఆమె ఏంచేస్తున్నదీ ధ్యాస ఉంటేగా? పెరుగు కాగపెడుతున్నది, పాలు చిలుకుతున్నది, వెన్న రాలేదని వాపోతున్నది.
బాల కృష్ణుడు బృందావనం విడిచి వెళ్లి సంవత్సరాలు గడిచాయి. రాజకీయాలలో తీరిక లేదో ఏమో, మళ్లీ గోకులం రాలేదు. అయితే కృష్ణుడి ప్రాణ స్నేహితుడు, సన్నిహితుడు ఉద్ధవుడు వస్తున్నాడు ఈనాడు. నందుడు ఈ వార్త చెప్పినప్పటి నుండీ ఒకటే హడావిడి బృందావనంలో.
సాయంకాలం అవుతూనే మధుర నుంచి ఉద్ధవుడి రధం బృందావనం చేరింది. నందుడి ఇంటి ముందు ఆగింది. అన్ని సత్కారాలతో ఎదురేగి ఆప్యాయంగా ఉద్ధవుడిని పలకరించాడు నందుడు. గోప గోపికలతో నిండిన ప్రాంగణం. అందరూ దిగిన ఉద్ధవుణ్ణి చూస్తూ మైమరచి ఉండి పోయారు. వ్రుష్టి వంశజుడు. వాసుదేవుని తమ్ముడి కొడుకు, అచ్చు కృష్ణుడే ! అదే ఒడ్డు పొడుగు, శ్యామ శరీరం, పొడుగు చేతులు, మందహాసం, కొంటె చూపులు, మెడలో పూల హారం ! మురళి ఒక్కటే కొరవ అనుకుంటున్నారు గోపికలు !
యశోదమ్మ పరుగున వచ్చింది, చేతిలో వెన్నముద్దతో సహా. ' ఎప్పుడు తిన్నావో? ఇదిగో కొంచెం తిను' అంటూ తనే నోటికి అందించి, బుగ్గలు తడిమి మురిసిపోతూ, అంతలో గుర్తొచ్చి, ఉండుండు, దిష్టి తీయాలి అంటూ కుంకం నీళ్ళతో దిష్టి తీసి, చేతులు పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళింది .
కృష్ణుడి కబుర్లతో పాటు విందు భోజనం ముగిసింది. మధురలో రామ కృష్ణుల ఉపనయనము, సాందీపని ముని ఆశ్రమంలో విద్యాభాసం గురించి చెబుతున్నాడు ఉద్ధవుడు. యశోద అవేవి వింటున్నట్లు లేదు. కన్నయ్యా, మధురలో చట్టుపక్కల ఇళ్ళలో పాలు పెరుగు దొరుకుతాయా? వీడికి ఇంట్లో కాలు నిలవదాయే? అడుగుతోంది. నందుడు నవ్వుకుంటూ అన్నాడు, "యశోదమ్మ నీకు మా కృష్ణుడి చిలిపి చేష్టల గురించి చెప్పకుండా వదలదు. యశోదా, ఉద్ధవుడు అలసినట్లున్నాడు ప్రయాణం చేసి. ఇక కొంచెం విశ్రమించనీ. తెల్లవారగానే గోకులం వెళుతున్నాము. సన్నాహాలు చేయాలి". గోకులం మాట వినగానే యశోద మొహం విప్పారింది. ఇక ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు, గోకులం వెళ్ళే సంబరంతో యశోద, బండ్లు సరంజామా సమకూరుస్తూ గోప బాలకులు, కృష్ణున్ని తలుచుకుంటూ గోపికలు!
మరుసటి నాడు పెందరాళే బయలుదేరారు గోకులానికి. బృందావనం అంతా కదిలింది. గోవుల మంద కూడా చిరుగంటలు మ్రోగిస్తూ ముందే పరుగెడుతున్నాయి. అవును మరి, చిన్నప్పుడు తిరుగాడిన, ఆడుకున్న పల్లె కదా ! చిన్ని కృష్ణుడి జ్ఞాపకాలే అన్నీ !
ఉద్ధవుడు రధం వదిలి బండిలో చేరాడు గోప బాలుర చెంత. ఎన్ని కబుర్లో ? ఇట్టే గోకులం వచ్చేసింది. నంద గృహానికి వెళ్ళగానే యశోద ఉద్ధవుడి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. ఓ వారగా వున్న గది ! రెండు పెద్ద పట్టె మంచాలు, పక్కనే అలంకరించిన వూయలలు. యశోద చెబుతోంది... ఇదిగో ఇక్కడే నా కన్నయ్య ఈ లోకంలోకి వచ్చింది. మైకమేమో? ఎలా నా పక్కకు చేరాడో తెలియనే లేదు. అప్పటినుంచి నన్ను ఒక్క గడియ కూడా వదలలేదు. ఇంకో విచిత్రం. మా రోహిణి కొడుకు, పదినెలల బిడ్డ, ఆ మంచం మీద పడుకునే వాడా! అప్పటి దాకా ఉలుకు పలుకు లేని వాడు వీడు రాగానే వేయి నోళ్ళ మాటలు ఒక్కసారి పలికాడు.
ఉద్ధవుడి చేయి వదలకుండా, చక చక పెరటిలోకి తీసుకువెళ్ళింది యశోద. చెబుతోంది… కన్నయ్య రోజుల బిడ్డడు అప్పుడు. ఓ పడుచు వచ్చి వాడిని ఎత్తుకొని ఇక్కడకు వచ్చి పాలివ్వబోయిన్దనుకుంట , మేము వచ్చి చూసేసరికి చచ్చి పడి వున్న పేద్ద శరీరం, పైన ఆడుకుంటున్న కన్నయ్య! ఆ మహాదేవుడే కాపాడాడు ఆనాడు.
ఇదిగో ఈ విరిగిన బండి చక్రం చూసావా? నెలల పిల్లాడు, బోర్లపడే సమయం. బండి కింద ఊయల కట్టి పడుకోపెట్టి ఇంట్లోకి వెళ్ళాను. ఇంతలో పెద్ద శబ్దం. వచ్చి చూతునుకదా, బండి ముక్కలై పోయింది, వీడు మాత్రం చక్కగా ఆడుకుంటున్నాడు. తోటి పిల్లలు ఆ బండి ఆకాశంలోకి ఎగిరి కింద పడ్డదని ఏవేవో చెప్పారు కానీ నే నమ్మను, మళ్ళీ ఆ దైవమే కాపాడిందయ్యా.
మూడేళ్ళ వయసు వుంటుంది. ఓ రోజు ఇదిగో ఈ చావడిలోనే నే పెరుగు చిలుకుతున్నా. ఆకలేసిందని అల్లరి. పాలు కాగిపోతున్నాయని చూసి వచ్చేంతలో పెరుగు కుండ పగలకొట్టి పైగా నవ్వుతుంటే నాకు కోపం వచ్చి, పట్టుకోపోతే ఓ పట్టాన చిక్కాడా ? నన్ను ఎలా పరిగెత్తించాడో ? పిచ్చి అమ్మ అలిసిపోతుందనుకున్నాడేమో పట్టుబడ్డాడు. కట్టేద్దామని తాడు తెచ్చి మొలకు కట్టబోతే చాలదే, ఇంట్లో ఉన్న తాడు ముక్కలేవి సరిపోలా, ఏమి చిత్రమో! రెండు అంగుళాలే తక్కువయేది. నేను వూరుకుంటానా, ఎలాగైనా వీడిని కట్టి పడేయాలని దీక్షగా చేస్తే కట్టబడ్డాడయ్య, నా కన్నయ్య. ఇదిగో ఈ రోటికి కట్టి నా పని కోసం లోనికి వెళ్ళా. పిల్లలు అరుస్తుంటే వచ్చి చూతునుకదా, పిల్లడు పాక్కుంటూ వెళ్లి ఇక్కడి రెండు మద్ది చెట్ల మధ్యగా వెళ్ళాడేమో అవి వేళ్ళతో సహా కూలిపోయాయి. వీడేమో నవ్వుతూ కూర్చున్నాడు. ఎన్నని చెప్పను? అల్లరి చేయని రోజు లేదు, మురిపించని క్షణం లేదు. దిష్టి తీయని రోజు లేదు.
ఓ రోజు మట్టి తిన్నాడని నోరు చూపమంటే ఆ చిన్ని నోటిలో విశ్వాన్నే చూశానో… నన్నే చూసుకున్నానో ఇప్పటికీ కలో, మాయో తెలీకుండా వుంది నాయనా! ఎన్నని చెప్పను? ఇక అల్లరి సంగతి అంటావా? అడక్కు మరి. ఈ గోకులంలో వాడు, వాడి మిత్రుల తోటి వెళ్లి పాలు, వెన్న దొంగిలించని ఇల్లు ఉందా? నా ఇంటికి వచ్చి కన్నయ్య చిలిపి పనులు ఏకరువు పెట్టని గోపిక ఉందా? ఎన్ని తగవులో ? కాని అదేమి చోద్యమో, వాడు అల్లరి చేయని క్షణం, వాడిని తలవని క్షణం అసలు తోచేదే కాదు.
యశోద అలుపు లేకుండా చెబుతునేవుంది కన్నయ్య తోటి గడిచిన క్షణక్షణం గురించి, చూపిస్తూనే వుంది కన్నయ్య కాలిడిన ఆణువణువూ!
నందుడు యశోదకు గుర్తుచేసాడు, ఫలహారాలు పళ్ళు పాలు ఇస్తే గోపాలురతో కలిసి ఊరు తిరిగి వస్తామని.
కృష్ణుడు తిరిగిన చోటల్లా కలయతిరిగారు ఉద్ధవుడు, గోపాలురు. కథలు కథలుగా వినిపిస్తూనే వున్నారు కృష్ణుడి లీలలు .
సాయంసంధ్య సమీపిస్తుండగా అందరూ గోవర్ధనం చేరారు. దారిలో కాళీయ మడుగు దగ్గర ఆగి, కృష్ణుడు ఎలా విషంతో నిండిన ఆ మడుగును కాళీయుడి నుంచి కాపాడాడో వివరించి చెప్పారు. కొందరైతే ఆ బాల కృష్ణుడు తన చిన్ని పాదాలతో కాళీయుడి ఐదు పడగల మీద ఎలా ఆనంద తాండవం చేసాడో చూపిస్తూ పరవశించిపోయారు. యశోద మాత్రం ఆ పాదాలు ఎంత కందిపోయాయో అని తలుచుకొంది.
గోవర్ధనానికి నమస్కరించి నందుడు వివరించాడు . ప్రతి యేడు మాకు వర్షాలు, సంపద ఇచ్చే దేవేంద్రుని పూజించటం ఆనవాయితీ . కాని ఆ యేడు కృష్ణుడు మనకు తిండి, గోవులకు గ్రాసం ఇచ్చేది గోవర్ధనం కదా, అతనికే పూజ చేయండి అన్నాడు. అలాగే గొప్పగా అన్నకూట పండగ చేసాము. ఐతే దేవతల ఆగ్రహమేమో… ఘోర వర్షం, గాలి నిలవ నీడ లేకుండా అయింది. అప్పుడు మా కృష్ణుడు, ఆరేళ్ళ పిల్లడు, గోవర్ధనాన్ని ఎత్తిపట్టి మమ్మల్నందరినీ ఏడు పగళ్ళు, రాత్రులూ కాపాడాడు. దేవతలు శాంతించారు అప్పుడు. ఆ తర్వాత మాకు గోవర్ధనం పవిత్రుడయాడు. యశోదమ్మ మళ్లీ తల్లడిల్లింది, ఆ చేయి ఎంత కందిపోయిందో కదా, ఎలా ఓర్చుకున్నాడో పాపం అని.
ఆ తర్వాత దేవతలు దిగివచ్చి బాల కృష్ణుడికి పట్టాభిషేకం చేసారని సిద్ధ పురుషులు అంటారు కాని మాకదేది తెలియదు, ముగించాడు నందుడు. అందరూ ఉత్సాహంగా గోవర్ధనానికి పరిక్రమ చేసారు ఆ రాత్రి.
ఆ నాటి వెన్నెల రాత్రి ఉద్దవుడు గోపికలను కలిసి కృష్ణుడి సందేశం వినిపించాడు. గోపికల మధుర ప్రేమ, కృష్ణుడి పట్ల వారి భక్తీ చూసి విస్తుపోయాడు.
ఆ రాత్రీ యశోద నిద్రపోలేదు. కన్నయ్య చేసిన చిలిపి పనులు కథలు కథలుగా చెప్పిందే చెబుతూనే వుంది… బాలకృష్ణుడికి పాలిచ్చి పెంచాను. చిలిపితనం చవిచూసాను. వాడి అల్లరి చూసాను. ఇక ఒక్కటే కోరిక... ఓ పిల్లను చూసి, దగ్గరుండి పెళ్లి జరిపించి, కళ్ళారా చూసుకుంటూ, వాళ్ళకి వండి పెట్టాలని వుంది. చూస్తే అక్కడ కన్నయ్యే సాక్షాత్. నవ్వుతూ ఓ భరోసా! 'నువ్వు చూపిన ఈ ప్రేమకు ఇంకో జన్మ ఎత్తి నువ్వు ఒప్పుకున్న పిల్లనే పెళ్ళాడి ఆ ఋణం తీర్చుకోవాల్సిందే.’ రెప్పలు మూయకుండా చూస్తూ ఉండిపోయింది యశోదమ్మ !
తెల్లవారింది. చిత్రంగా ఆ రోజు చంద్రుడు ఉండగానే సూర్యుడు వచ్చేశాడు, బృందావనంలో కృష్ణుడి సఖుని చూడాలనే ఆత్రం అనుకుంటా!
ఉద్ధవుడు తిరిగి మధుర వెళ్ళే వేళ. ఓ నాలుగు రోజులు ఇంకా ఉంటే బావుంటుంది అన్నారు నందుడు, యశోద. అక్కడ కృష్ణుడు నా రాక కోసం, మీ కబుర్లు వినటం కోసం ఆత్రంగా వున్నాడు. వెళ్ళాలి. నాకు సెలవిప్పించమన్నాడు ఉద్ధవుడు . అవునవును బయలుదేరమని, బహుమానాలతో, కృష్ణుడికి ఇష్టమైన తిండి పదార్ధాలతో రధం నింపి సిద్ధం చేసారు.
ఊరంతా కదిలి వచ్చారు. పొలిమేర వరకు రధం వెనకాలే నడిచి వచ్చారు. ఉద్ధవుడు వెనుతిరిగి చూస్తున్నాడు . నందుడి తండ్రి మమత, యశోద అమ్మ ప్రేమ, గోపబాలకుల స్నేహం, గోగణం వాత్సల్యం చవిచూపిన ఆ బృందావనవాసులను చూస్తున్నాడు. కళ్ళల్లో నీళ్ళు! తుడుచుకొని చూసాడు. ఏరి ? నందుడు, యశోద, గోపాలురు, గోపికలు, గోవులు, చెట్లు, పర్వతాలు? అంతటా కృష్ణుడే! అణువణువునా కన్నయ్యే! వినపడుతున్న వంశీ నాదం! ఉద్ధవుడు చేతులు పైకెత్తి జోడించి నమస్కరించాడు. నోరారా కీర్తించాడు
అంతా కృష్ణమయం! సర్వం కృష్ణార్పణం !
'బండి రాక్షసు, వెలగపండు రాక్షసులను
చెండాడి చంపిన చిన్నిపదము
గోవర్ధనమ్మును గొడుగల్లె నిలబెట్టి
గోపకుల కాపాడు గొప్పచేయి
వేలలీలల నవలీల చేసినట్టి
చిన్ని కన్నా ! శత కోటి మంగళములు !! '
(గోకులంలో యశోదే కాదు, అందరూ కృష్ణుని తమవాడిగా, తమ'లో' వాడిగానే భావించి అతనితో కలిసి ఆడారు, తిరిగారు, అల్లరి చేసారు. కృష్ణుడు కూడా మానవుడిలాగే వుంటూ, అసాధ్యాలు చేసినా చేయనట్లు అనిపించేట్లు చేసి మానవుడిలోనే దైవత్వం ఉంటుందని చెప్పాడా? నిస్వార్ధ ప్రేమకు, మధుర భక్తికి నిలయం ఈ బృందావనం ! మరి ఈ ప్రపంచమే బృందావనం ఐతే ? )
ఉద్ధవుడి చిన్ని కృష్ణుడి కీర్తన రమణ గారి రమ్యమైన 'తిరుప్పావై' అనుసృజన నుండి తీసుకున్న ఓ నాలుగు పాదాలు!
రమణీయ హరి
మాకు బృందావనాన్ని చూపించిన మా అబ్బాయి 'వంశీ ' ఈ కథకు ప్రేరణ. అందరు తల్లులూ యశోదలే, అందుకే ఈ కథ అమ్మలందరికీ అంకితం!
OOOOOOOOO
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
శ్రీహరి అక్కిరాజు
శ్రీహరి అక్కిరాజు: గుంటూరులో పుట్టి, భాగ్యనగరంలో పెరిగి, విశాఖలో B.Tech , మద్రాస్ లో M.Tech చేసి, ఓ మూడు ఉద్యోగాలు మారి , గత ఏటినుంచి విశ్రాంతిగా వుంటున్నారు ఈ కెమికల్ ఇంజనీర్ మరియు సిమెంట్ స్పెషలిస్ట్ . పూర్వీకుల ( గుంటూరు సీమలో తొలి తెలుగు కథా రచయిత అక్కిరాజు ఉమాకాంత విద్యా శేఖరులు ) కృప వల్ల , తల్లితండ్రుల ఆశీర్వాదం వల్ల రాయాలన్న తపన కలిగి, మిత్రుల( శాయి రాచకొండ, సత్య సాయి, వేణు ) విమర్శ , ప్రోద్బలంతో కవితలు, కథలు రాస్తున్నారు. భగవాన్ రమణులపై భక్తి , బాపు రమణలంటే ఇష్టం, ఇక భార్యా 'మణి' తోడైతే రచన చేసే హృదయం ' రమణీయ హరి' అయింది!
తెలుగులో అచ్చవుతున్న వీరి మొదటి కథ 'మధురవాణి 'లో రావటం వీరు తమ అదృష్టంగా భావిస్తున్నారు!