MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
ఆబోతుగారి పన్నువిరిగిన కథ
డా. మూలా రవి కుమార్
రైలుదిగి స్టేషన్‌కి వచ్చిన తమ్ముడి బండిమీద కూర్చొని వస్తూఉంటే రోడ్డుపక్కన ఆంబోతు కనిపించింది. ఫక్కున నవ్వేను.
“ఏమైంది?” తమ్ముడడిగేడు.
“ఇంటికెళ్ళేకా చెబుతా” మరింత నవ్వుతూ అన్నాను.
“అంతలా ఊగిపోతూ నవ్వితే బండి బేలన్సు తప్పుతుంది” మా వాడి హెచ్చరికతో కష్టపడీ నవ్వాపుకొని, గతంలోకెళిపోయేను.
* * *
పూనాలో రైల్వే టెలికాం ఇంజనీరుగా జాయిన్ అయిన రెండోరోజు ఆఫీసు వరండాలోకొచ్చి ఇంటిఫోన్ మాట్లాడి పెట్టేసరికి ఒక పెద్దాయన పలకరించి నా వివరాలు అడిగేరు. చెప్పేకా, జేబులోంచీ కార్డు తీసిచ్చి ‘వీలు చూసుకొని ఇంటికి రా’ అన్నారు. కార్డు చూస్తే, పీబీ రావు, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీరు అని ఉంది. మా ప్రక్క విభాగం అధిపతి. అంటే నాకన్నా నాలుగు రేంకుల పై అధికారి.
ఇంకా కుటుంబాన్ని తీసుకురాకపోవటంతో ఆ సాయంత్రమే రావుగారింటికి వెళ్ళాను. ఆయనతో మాట్లాడుతూ ఉంటే మా బాస్ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న హిందీలో మాట్లాడి పెట్టేసాకా రావుగారన్నారు. “నీ హిందీ చూస్తుంటే ముప్పయ్యేళ్ళక్రితం నా హిందీ గుర్తొస్తోందయ్యా?”“మీరు పూనా వచ్చి ముప్పయ్యేళ్ళయిందా సర్?” అనే అర్ధం కూడా ఉందని..“
లేదు. నేను ఎమ్మెస్సీ కోసం మధ్యప్రదేశ్‌లో సాగర్ యూనివర్సిటీ వెళ్ళేను. అక్కడ నేనూ, నాపాటి హిందీ కూడా రానివాడూ కలిసి యూనివర్సిటీ గేటు బయటకు వచ్చాకా, పరుపులు కొనుక్కోవాలని గుర్తొచ్చి, అక్కడున్న రిక్షా పిలిచాం. పిలవటానికి పెద్ద హిందీ అక్కర్లేదుగానీ, ఎక్కడికెళ్ళాలో చెప్పటానికీ, పరుపునేం అంటారో తెలీడానికి కావలసినంత హిందీ మాకెవరికీ రాదు. ఆలోచించగా నిద్రని సోనా అంటారని గుర్తొచ్చి, వస్తువులు అనటానికి హిందీలో వస్తువోం అంటారని తీర్మానించి, నిద్ర సంబంధిత వస్తువుల దుకాణం అనే ఉద్దేశ్యంతో ‘సోనేకా వస్తువోం కా దుకాణ్’ అన్నాం. వాడు తిన్నగా బంగారం కొట్లుండే వీధికి తీసుకెళ్ళిపోయాడు. హిందీలో సోనా అంటే బంగారం అనే అర్ధం ఉందని మాకప్పటికి తెలీదు.”
నేను నవ్వి “బావుంది సార్. నేను పుస్తకాల్లో హిందీ గుర్తుకు తెచ్చుకొని మాట్లాడుతుంటే ఇక్కడి వాళ్ళకి సగానికి పైగా అర్ధం అవట్లేదు. వాళ్ళు మాట్లాడితే నాకు ఆపాటీ అర్ధం కావట్లేదు.”
ఆ తర్వాత వారానికీ, పదిహేను రోజులికీ రావుగారిని కలవటం, నేరుగా నా పైఅధికారి కాకపోవటం వల్ల మొహమాటంలేకుండా మాట్లాడుకోవటం జరిగేది. నెమ్మదిగా నా హిందీ పద పరిజ్ఞానం పెరుగుతోంది. తెలుగు వాళ్ళకర్థమయ్యే అచ్చ తెలుగులో చెప్పాలంటే వొకేబులరీ ఇంప్రూవ్ అవుతోంది.
రైల్వే ట్రాక్ వెంబడి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసే పనిని మేం పెద్ద కంపెనీకి కాంట్రాక్టుకి ఇచ్చేం. వాళ్ళు ఆ పనిని ముక్కలుగా విడగొట్టి లేబరు కాంట్రాక్టరుకి సబ్‌కాంట్రాక్టు ఇచ్చారు. పని మందకొడిగా సాగుతోంది. వారంలో మా హెడ్డాఫీసు ఇనస్పెక్షన్లో సమస్య అయ్యేంత మందగించింది. నేను కంపెనీకి ఈమెయిల్ ఇచ్చేను. ఆ సాయంత్రం నాకు ముంబై ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. మాట్లాడినది జనరల్ మేనేజరుట. మర్నాడు పని జరుగుతున్న సైటుకి వస్తున్నట్టూ, నేను కూడా అక్కడే ఉంటే, వాళ్ళు నియమించిన లేబర్ కాంట్రాక్టర్ని నా సమక్షం లో హెచ్చరిస్తాననీ చెప్పేడు.
మర్నాడు నేను సైట్లో కి వెళ్ళేసరికి నాకన్నా పొట్టిగా, నాకు నాలుగింతలు లావుగా ఉండే శాల్తీ అందరిమీదా మరాఠీలో రంకెలేస్తోంది. నేను వెళ్ళేసరికి, అక్కడున్న లేబర్ సూపర్వైజర్ సదరు శాల్తీ దగ్గరకెళ్ళి నన్ను చూపించేడు. నావైపు చూసిన సదరు శాల్తీ, బుసలూ, ఆయాసం ఆపుకుంటూ, కొంచెం చిరునవ్వు తెచ్చుకొని, నన్ను కలుస్తూనే, నమస్కార్ సాబ్. నేను నిన్న మీతో మాట్లాడిన జీఎంని అన్నాడు. ఇద్దరం కొంచెం సేపు నిలుచునే మాట్లాడుకున్నాకా, ఎదురుగా ఉన్న లేబరు కాంట్రాక్టరుపై మరిన్ని కేకలు వేసి, చివరగా నా వైపు తిరిగి ఇంగ్లీషులో “ఇకపై నేనే మీకు ప్రతి రెండురోజులకీ ఫోన్ చేస్తాను సార్. మీరు వీళ్లమీద జాలి పడొద్దు.” మొత్తమ్మీద నా మెయిలుకి ఫలితం బాగానే ఉంది.
ఆ సాయంత్రం, పెద్ద కంపెనీ నుండి లేబరు కాంట్రాక్టు పొందిన సబ్ కాంట్రాక్టర్ వచ్చి మా బాసుముందు చేతులు కట్టుకొని నిలుచున్నాడు. మా బాసు నన్నుకూడా లోపలికి రమ్మన్నాడు.
కాంట్రాక్టరు హిందీ భాషలో మరాఠీ యాసలో చెబున్నాడు. తను చెప్పటం అయ్యాకా మా బాసు నావేపు తిరిగి “ఇతను లేబరు కాంట్రాక్టరు. పేరు పాటిల్. ఇతని ఫోన్ నెంబరు దగ్గరుంచుకొని, సైట్లో పని ఇబ్బంది ఐతే ఇతనికి చెప్పు. నేరుగా సాండుకి చెప్పకు” అని హిందీలో నాకు చెప్పి, నేను ఏదో అడగబోయేంతలో సైగ చేసి నన్ను ఆపి పాటిల్ని పంపించేసాకా, “ఇప్పుడు చెప్పు, పాటిల్ ఉండగా నువ్వు నన్ను అడగాలనుకున్నది ఏమిటి?” అన్నాడు.
“సార్, పాటిల్ అన్న దాంట్లో వలస కూలీలు, లోకల్ కూలీలు అన్న మాటలు తప్ప పెద్దగా అర్ధం అవలేదు.”
“ముంబై, పూనేలు బాగా అభివృద్ధి చెందేసరికి, ఇక్కడ లేబరు రేట్లు పెరిగిపోయేయి. అలాగే కూలిచేసుకునేవారు కూడా గవర్నమెంటు ఉద్యోగుల్లా, ఎనిమిదిగంటల పనివేళల్లోనే రెండు టీ టైములూ, ఒక లంచ్ టైమూ కలిపి దగ్గర, దగ్గర రెండుగంటల పని ఎగ్గొట్టేస్తారు. కాంట్రాక్టరు గట్టిగా అదిలిస్తే, యూనియన్లూ, ఎమ్మెల్యేలూ ప్రవేశించి, వందమంది సోమరి శ్రామికులకన్నా ఎక్కువ సంపాదించుకొని వెళ్ళిపోతారు.”
“అదేంటిసార్. వీళ్ళని మనం ఎలా భరిస్తున్నాం?”
“మనం నేరుగా భరించక్కర్లేదు. అంచనాలు విలువ పెంచుతాం. మిగిలినవి పాటిల్ లాంటి కంట్రాక్టరు చూసుకుంటాడు. పాటిల్ లాంటివాళ్ళని మనం నేరుగా ఏమీ అనం. సకాలంలో పని జరగకపోతే, రైల్వేతో నేరుగా టెండరు వేసిన కంపెనీకి మనం చెల్లింపు ఆపేస్తాం. వాళ్ళు పాటిల్ కి ఆపేస్తారు. ఈరోజు సాండ్ వచ్చి వెళ్ళిన ఖర్చులు కూడా పాటిల్ కి ఇచ్చే మొత్తంలోంచీ కోసేస్తారు. అందుకే మిమ్మల్నినేరుగా సాండ్ తో మాట్లాడొద్దని బతిమాలుతున్నాడు”
“సాండ్ అంటే ఎవరు సార్?”
“అదే, ఈరోజు సైట్లోకొచ్చిన స్థూలకాయుడైన జీఎం.” నవ్వాపుకుంటూ చెప్పేడు. బహుశః, సాండు స్తూలకాయం గుర్తొచ్చి నవ్వుతున్నాడనుకున్నాను.
“సరే సార్. నాకిన్ని తెలీవు. నా దగ్గరున్న పేపర్లు చూసి నేరుగా ఈమెయిల్ ఇచ్చేను. మరి పాటిల్ పదే పదే వలస కూలీలు అని ఎందుకంటున్నాడు, సార్?”
“ఈ చుట్టుప్రక్కల బీహార్ నుంచొచ్చిన వలస కూలీముఠాలు ఉంటాయి. వాళ్ళు ఎనిమిది గంటలూ వొళ్ళు వొంచి పనిచేస్తారు.”
“మరి కాంట్రాక్టర్లంతా వాళ్ళని ఎందుకు పెట్టుకోరు సార్?”
“ఎవరైనా లేబరు కంట్రాక్టరు బీహారీ కూలీలను తీసుకున్నరోజు, లోకల్ కూలీ యూనియన్ల నాయకులకు కొంత మామూలు ఇవ్వాలి. ఈ రెండూ కలిపి ఖర్చు ఎక్కువవటంతో, ఆఫీసరు ఇనస్పెక్షన్ లాంటి గడువు దగ్గరపడేటప్పుడు వీళ్ళు లోకల్ వాళ్ళకి మామూలిచ్చి, బీహారీ కూలీలను తెచ్చుకుంటారు.”అక్కడతో నాకంతా అర్ధం అయిందనే అనుకున్నాను. మా బాసుకూడా, నాకింకేమీ బోధపరచక్కర్లేదనుకొని, “సరే, హెడ్డాఫీసు ఇనస్పెక్షన్ నాటికి సమస్య రాకుండా చూసుకో. పాటిల్ స్పందన బావున్నంతవరకూ సాండుకి ఫోన్ చెయ్యకు.” నేను సరే అని చెప్పి వచ్చేసాను.
ఇంకో రెండురోజుల్లో ఇనస్పెక్షన్ అనగా, పని చూస్తే నాలుగు రోజులకు సరిపడా ఉంది. సైట్లోకెళ్ళిన నేను, పాటిల్ కి ఫోన్ చేస్తే, గంటలో ట్రాక్టరు నిండా వలసకూలీలు దిగేరు. ఆ వెంటనే, అక్కడ కూలీల్లో ఒకడు నాదగ్గరికి వచ్చి “వీళ్ళని ఎవరు పంపేరు సార్?” అని అడగటం, “పాటిల్” అన్న నా సమాధానం విని, ఎవరికో ఫోన్ చెయ్యటం, అర నిమిషంలో ఫోన్ పెట్టేసి, తన సహచరులతో ఏదో చెప్పటం, వెంటనే లోకల్ కూలీలు, పలుగూ పారా వదిలేసి, అరుచుకుంటూ, తిట్టుకుంటూ ట్రాక్టరు దిగిన కూలీలను చుట్టుముట్టటం, మళ్ళీ వాళ్ళు, వచ్చిన ట్రాక్టరు లోనే వెళ్ళిపోవటం జరిగింది.
ట్రాక్టరు వెళ్ళేకా, లోకల్ కూలీలంతా గట్టుమీద కూర్చున్నారు. పనికి సరిపడా కూలీలు లేరని నేననుకుంటే, సైట్లోకొచ్చిన అదనపు కూలీల్ని తరిమేసి, వీళ్ళు కూడా “అస్త్ర సన్యాసం” చేసి గట్టుమీద కూర్చున్నారు. నేను చేయగలిగిందిలేక, పాటిల్ కి ఫోన్ చేసి, నా హిందీ అనుమతించిన మేర పరిస్థితి వివరించేను. అదేరోజు సాయంత్రం సాండు నాకు ఫోన్ చేస్తాడనీ, హెడ్డాఫీసు పర్యవేక్షణలో నా పై అధికారులని సమాధానపరచవలసినది సాండూవాళ్ళ కంపెనీయేనని హెచ్చరించా. పాటిల్ మీద సాండు పేరు ప్రభావం తెలిసినవాణ్ణి కదా…
అరగంటలో వగర్చుకుంటూ వచ్చిన పాటిల్ ని చూస్తే పుండుమీద కారం పడ్డవాడిలా ఉన్నాడు. గట్టుమీద కూర్చున్న కూలీలదగ్గరికెళ్ళి కేకలేస్తాడనుకుంటే, వాళ్ళముందు నిలుచొని ప్రాధేయపడుతున్నాడు.
మొత్తానికి, అరగంట తర్వాత వాళ్ళు టీ బ్రేక్ తీసుకొని తాపీగా పనిలోకి దిగాకా, పాటిల్ నాదగ్గరకొచ్చేడు. ఓదార్చాలనిపించినా, తమాయించుకొని “ఏమిటి విషయం పాటిల్ సాబ్?” అన్నాను.
“ఏం చెప్పమంటారు సార్. వీళ్ళకు మామూలిచ్చుకొని, వలసకూలీల్ని పెట్టుకుంటే, కిట్టుబాటు కాదు. పని సరిగ్గా జరగట్లేదని మీరు సాండుకి ఫోన్ చేస్తే, అంతకన్నా నష్టం. ఈ రోజు వీళ్ళు పనిచేస్తున్నా సరిపోరని వలస కూలీలని తెప్పిస్తే, వాళ్ళని తరిమేసారు. తరిమేసిందే కాక, గట్టుమీద కూర్చొని, వాళ్ళ యూనియన్ లీడర్ చేత నాకు క్లాసు పీకించేరు. మీ అనుమతి లేకుండా వలసకూలీల్ని తీసుకురావటం తప్పే అని యూనియన్ లీడర్ దగ్గర వొప్పుకొని, ఇక్కడికొచ్చి వీళ్ళని బతిమాలితేగానీ పని మళ్ళీ మొదలవలేదు. రేపటి పని వివరం మీరు నాకు ఇప్పుడే చెప్పండి. ఈసాయంత్రమే, వీళ్ళ యూనియన్ లీడర్లకి సరిపడ మామూలిచ్చి, రేపు మొత్తం వలసకూలీల్నే పెడతాను. ఇలా ప్రతి గాడిద కాలూ పట్టుకొని లేబరు కాంట్రాక్టులు చేసుకొనే బదులు సాండ్ కింద సూపర్వైజరుగా చేరుదామనుకుంటే, వాళ్ళదగ్గర ఇంజనీరు కన్నా చిన్న ఉజ్జోగాలు లేవు అన్నాడు. నేనేమో పదోక్లాసు చదువుకున్నాను.” అన్నాడు.
సీత కష్టాలు, పీతకష్టాలు, సినిమా కష్టాలూ గుర్తొచ్చేయి. ఇనస్పెక్షన్ నాటికి అంతా బాగానే అయిపోయింది. సాయంత్రం మా బాసు గదిలో, ఆయన ఎదురుగా, నేనూ సాండూ కూర్చున్నాం. అంతలో ఏదో పనిమీద రావుగారు మా బాసు గదిలోకి తొంగిచూడ్డం, మా బాసు “ఆయియే, రావ్ సాబ్” అని కూర్చోబెట్టటం జరిగింది. సాండు ఏదో చెప్పేడు. బాసు నా అభిప్రాయం అడిగేడు. నేను సాండు వేపుతిరిగి, “దేఖియే, సాండ్ సాబ్” అన్నాను. అంతే, సాండ్ మొహం ఇబ్బందిగా మారింది. మా బాసు మొహం కూడా కొంచెం భయం భయంగా మారింది. వెంఠనే రావుగారు, స్వచ్ఛమైన మరాఠీలో “కిరణ్ తో నాకు అర్జెంటు పని ఉంది. పదినిమిషాల్లో పంపిస్తాను” అని మా బాసుతో చెప్పి, ఎవరి సమాధానం వినకుండా నన్ను రెక్క పట్టుకొని ఈడ్చుకెళ్ళినంత పనిచేసి, ఆయన గదిలో ఒక కుర్చీలో నన్ను కూలదోసి, తన కుర్చీలో ఆయన కూలబడ్డారు. కిర్రు, కర్రు శబ్దాలు వినిపిస్తే భయంగా తలెత్తి చూద్దును కదా, ఆయన ఆపుకోలేక నవ్వుతూ ఊగుతున్న ఊగుళ్ళకి రివాల్వింగ్ కుర్చీ కిర్రుకర్రుమంటోంది.
“ఏమైంది సార్?” అడిగేను.
“సాండుగాణ్ణి అలా ఎందుకు పిలిచేవయ్యా?” నవ్వులకు ఊగుతూనే అడిగేరు.
“మనకు వినపడే మాటల్లో అతి తియ్యనైనది స్వంత పేరు అని విన్నాను సార్. అలా పేరుతో పిలిస్తే సాండు సంతోషిస్తాడని”
“మనకు వినపడే మాటల్లో అతి చేదైనది మనకు పెట్టిన మారుపేరు అని వినలేదా?”
“మారుపేరేంటి సార్? మా బాసు కూడా, సాండుకి మెయిల్ పెట్టేవా అనే అడిగేవారు.”
“సాండుగా పిలువబడే వ్యక్తి అసలుపేరు విక్రం శుభంకర్. ఇప్పుడంతా ఆ పేరు మరిచిపోయేరు. ఏడాది క్రితం మా డిపార్టుమెంటు కాంట్రాక్టు పని జరుగుతున్న సైట్లోకొచ్చినపుడు, తను అద్దెకి తెచ్చుకున్న టేక్సీలో డీజిల్ అయిపోయింది. స్వంత డ్రైవర్ని కేకలేసినట్టే, టేక్సీ డ్రైవర్ని కేకలేసీసరికి, వాడు తిరిగి కేకలేసేడు. మా అసిస్టెంటు ఇంజనీరు లోకల్ టేక్సీ డ్రైవర్ని సముదాయించబోతే, ఆ డ్రైవరు తన మొబైల్ నుండి టేక్సీ యజమానికి ఫోన్ చేసి, గట్టిగా అరుస్తూ, “వంద కిలోమీటర్లు తిరగాలని చెప్పి, ఇప్పటికి రెండొందల కిలోమీటర్లు తిప్పేడు. డీజిల్ అయిపోయిందని ఇప్పుడు నన్ను అరుస్తున్నాడు. ఇలాంటి సాండ్‌తో నేను వేగలేను”, అన్నాడు. అక్కడున్న లేబరూ, సూపర్వైజరూ, అప్పటివరకూ ఎన్నో సందర్బాల్లో సాండు వేసిన రంకెలని భరించేరేమో, ఆ కసి అంతా ఒక్కసారి నవ్వుల రూపంలో తన్నుకొచ్చింది. ఆ రోజు నేనూ, మా అసిస్టెంటు ఇంజనీరు నవ్వాపుకుందుకి విశ్వప్రయత్నం చేసి, దొరికిపోయాం. టేక్సీ డ్రైవరు అలిగి వెళ్ళిపోవటంతో, ఆ రోజు మా కార్లో సాండుని పూనాలో దింపేం. అతి కష్టంతో టేక్సీలో ఉన్న రెండు గంటలూ గంభీరంగా ఉండి, సాండు దిగగానే నేనూ, మా అసిస్టెంటు ఇంజనీరూ, డ్రైవరూ, మా ఉద్యోగస్థాయిలు మరిచి ఆనకట్ట తెగిన నదుల్లా ఒకేలా నవ్వుకున్నాం”
“ఇంతకీ సాండ్ అంటే ఏమిటి సార్. మూర్ఖుడనా?”
“అలా ఐనా బావుండేదయ్యా. ఆ పేరు మరుగున పడిపోయేది. సాండ్ అంటే…, ఆబోతు అని అర్ధం.”
“అంటే, నేను ఇందాకా, మాట్లాడింది ‘చూడండి ఆబోతుగారూ’ అనా!?”. అలాంటి సందర్భంలో ఇంట్లో ఉంటే, మంచం మీద దొర్లి దొర్లి నవ్వేవాణ్ణి.
* * *
ఇంతలో ఇల్లు వచ్చింది. కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే మళ్ళీ నవ్వొచ్చింది. నవ్వుతూ, ఆపుకుంటూ, అంతా చెప్పేకా తమ్ముడడిగేడు. “సాండుకి నీ హిందీ దెబ్బ బాగానే తగిలినట్టుంది. నువ్విలా సాండుని పిలిచినట్టు ఇంకెవరికీ తెలియలేదా?”
“ఆరోజు సాండ్ కంట పడలేదు. మాబాసూ, రావుగారూ కూడా జరిగినది ఇంకెవ్వరికీ లీకవనివ్వలేదు. కనీసం పాటిల్‌కి కూడా తెలీనివ్వలేదు.”
“ఆతర్వాత నువ్వు సాండుని తప్పించుకు తిరగలేదూ?”
“ప్రయత్నించా. కానీ నా హిందీ దెబ్బ సాండుకి మరోసారి తగిలింది.” ఆని మొదలెట్టాను.
* * *
ఒక నెల గడిచింది. రైల్వే కేబుళ్ళు ప్రైవేటు స్థలాల్లోంచీ, మునిసిపల్ స్థలాల్లోంచీ వేసే పని మొదలైంది. దీనికి మునిసిపాలిటి వాళ్ళిచ్చే అనుమతులకి రోజువారీ ఫీజు కట్టాలి. అలాగే మామూళ్ళు కూడా. లేబరూ, జేసీబీలూ చక్కటి సమన్వయంతో పనిచేయకపోతే, కూలి ఖర్చు గాని, జేసీబీ అద్దె గానీ అనవసరంగా భరించవలసి వస్తుంది. లేబర్ కాంట్రాక్టర్లు పనికి కాకుండా, రోజువారీ పేమెంటు అడిగేరు. అలాగే అభ్యంతరాలూ అనుమతులూ, మామూళ్ళూ అవీ కూడా వాళ్ళ మీద పెట్టుకోలేదు. అంచేత సాండు స్వయంగా పూనాలో ఉండి ప్రతిరోజూ పూనా చుట్టుప్రక్కల ఉన్న అన్ని సైటుల్లోనూ ఒక్కో అరగంట ఉంటూ సమీక్షించేవాడు. ఇలాంటి సందర్భాల్లో మునిసిపల్ వాళ్ళు ప్లాను ఇచ్చి ఊరుకుంటారు. తవ్వవలసిన ప్రాంతంలో ఆక్రమణలూ వగైరాలు ఉంటే, రైల్వేవాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా, పోలీసూ, మునిసిపల్ మామూళ్ళు మాత్రం సాండువే.
ఒకరోజు నేను పూనా నుండి నలబై కిలోమీటర్ల దూరంలో సైట్లో పని పర్యవేక్షిస్తున్నాను. పూనా కంటోన్మెంటు ఏరియా లేబరు సూపర్‌వైజరు నుండి ఫోను “సాబ్. గణేష్‌కీ దాంత్ టూట్‌గయా. కాం బంద్ హోగయా.” ఫోన్ కట్టయ్యింది. అప్పటికి నాకు హిందీ చాలా వచ్చింది. నాకొచ్చిన ఫోను సారాంశం, గణేష్ పన్ను విరిగిపోయింది, పని ఆగిపోయింది. అక్కడ ఏదో కొట్లాట జరిగినట్టుంది. గణేష్ అనేవాడి పన్ను విరిగిందట. ఇంకెవరికైనా ఏవైనా దెబ్బలు తగిలేయో లేదో తెలీదు. మళ్ళి ఫోన్ చేస్తే, ఎత్తేడు, కానీ, వాడిమాటకంటే ఎక్కువ కేకలూ, గలాటా వినిపించాయి. నాకు వచ్చే సిగ్నల్, పోయే సిగ్నల్. నేనొచ్చేవరకూ పని మొదలుబెట్టవద్దనీ గణేష్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళమనీ చెప్పాను. నా మాటలు వాడెంత అర్ధం చేసుకున్నాడో అంతుబట్టటం లేదు.
“గణేష్‌ని ఎక్కడికీ తీసుకెళ్ళడం కుదరట, సార్. చాలక్ చెబుతున్నాడు.” వాడి మాటలు హిందీ, మరాఠీ, కలిపి, వచ్చీ పోయే సిగ్నల్సులో ఏమీ అర్ధం కావట్లేదు. ఈ చాలక్ అనేవాడు గణేష్‌ని కొట్టిన ముఠా వాడో, లేక గణేష్ ముఠా వాడై ఉండి, మేమంతా వచ్చేవరకూ రక్తం కారుతున్న గణేష్ ని సాక్ష్యం కోసం ఉంచేద్దామనుకుంటున్నాడో.
వెంటనే నేను సాండుకి ఎస్సెమ్మెస్ పెట్టేను. ‘కంటోన్మెంటు ఏరియాలో గొడవ జరుగుతోంది. మీరు పోలీసులకి ఫోన్ చేసి అక్కడికి చేరుకొండి. నేను మరో గంటలో గొడవ జరిగే సైట్లో ఉంటాను. రైల్వే అంబులెన్సుకి ఫోన్ చెయ్యండి.’ పదినిమిషాల్లో అటు నించి ‘అలాగే సార్, విక్రం శుభాంకర్’ అని మెసేజ్ వచ్చింది. ఈ పేరెక్కడొ విన్నట్టుందే అనుకుంటూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది ఇది సాండు అసలుపేరు అని.
సైట్లో కెళ్ళేసరికి చూద్దును కదా, సాండూ, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళూ, ఇంకో వ్యక్తీ ఒక కల్వర్టు గట్టుమీద కూర్చున్నారు. లేబరంతా రోడ్డుమీదే కూర్చొన్నారు. రోడ్డుమీద అంబులెన్సు నిలుచొని ఉంది. అంతా ప్రశాంతంగానే ఉంది. నా జీపుని చూసి… నాకు ఫోన్ చేసి గణేష్ పన్ను విరిగిందని చెప్పిన సూపర్‌వైజర్ పరుగెత్తుకుంటూ వచ్చాడు.
“గణేష్‌కి ఎలా ఉంది?”
“సిటీ నుంచి ఒక మెకానిక్ కొత్త బకెట్ తీసుకొని మినీ వేను మీద బయలుదేరేడు. ఇక్కడికి రాగానే గణేష్ పన్నువిరిగిన బకెట్ విప్పి కొత్త బకెట్ బిగించి పని మొదలెడతాం సార్.”
నేను సరిగ్గా అడగలేదో, వాడు సరిగ్గా చెప్పలేదో అర్ధం కాలేదు. “గణేష్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని అంబులెన్సు పంపేను కదా. ఇప్పుడెలా ఉంది.”
వాడు మరింత ఆశ్చర్యంతో... “గణేష్ గురించే నేను చెబుతున్నాను, సార్. అదుగో గణేష్. ఉదయం తవ్వుతూ ఉంటే రాయి తగిలి పన్ను విరిగిపోయింది.” వాడు ఇందాకటి మాటలు మళ్ళీ చెబుతూ అక్కడే ఉన్న జేసీబీని చూపించాడు. దాని తొండం చివర తవ్వటానికి ఉపయోగించే బకెట్ చూస్తే, దానికుండే మూడు పళ్ళలో ఒక పన్ను విరిగి ఉంది. ఆ జేసీబీ మీద గణేష్ అని రాసి ఉంది. అంటే విరిగింది మనిషి పన్ను కాదు. జేసీబీ బకెట్‌కి ఉన్న పన్ను. దాన్ని నాకు చెప్పేటప్పుడు జేసీబీ అని చెప్పకుండా గణేష్ అన్నాడు. నేను మరో రకంగా అనుకున్నాను. జేసీబీ చివర బకెట్ అని పిలువబడే డొక్కుకి నేల తగిలే చోట మూడు మొనదేలిన దంతాల్లా ఉంటాయి. వాటినే వీళ్ళు దంతాలు అంటారు.
“మరి చాలక్ అంటే ఎవరూ?”
“జేసీబీ డ్రైవరు సార్” కరెక్టే. గుర్తొచ్చింది. హిందీలో చాలక్ అంటే డ్రైవరు. నేను అది కూడా మనిషి పేరే అనుకున్నాను.
“గణేష్ కాక ఇంకో జేసీబీ లేదా?”
“హనుమాన్ ఉంది కానీ, అదిప్పుడు గోర్‌పురీ దగ్గర పనిచేస్తోంది సార్.” అంటే వీళ్ళు ఒక జేసీబీకి గణేష్ అనీ ఇంకో జేసీబీకి హనుమన్ అనీ పేర్లు పెట్టుకున్నారన్నమాట. ఈసారి మాట్లాడేటప్పుడు హనుమాన్‌కి కాలు విరిగిందంటే, ముందు మనిషి కాలో, జేసీబీ కాలో కనుక్కోవాలన్నమాట.
* * *
ఐతే ఎవరిపన్ను విరగలేదన్నమాట. అంతా విన్న తమ్ముడు నవ్వుతూ అడిగేడు.
“ఏ మనిషి పన్నూ భౌతికంగా విరక్కపోయినా, సాండు మాత్రం పన్ను విరిగినవాడిలా విలవిల్లాడిపోయేడు.”
“అదేం?”
“పోలీసు మామూళ్ళూ, అంబులెన్సు ఖర్చూ, జేసీబీ కొత్త బకెట్ ఖర్చూ అన్నీ కలిపి పన్ను పీకినంత విలవిల్లాడిపోయేడు.”
OOOOOOOOO
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
డా. మూలా రవి కుమార్
డా. మూలా రవి కుమార్: స్వస్థలం విజయనగరం జిల్లా. వృత్తిరీత్యా పశుపోషణలో శాస్త్రవేత్త. ఉద్యోగరీత్యా భారతదేశంలో నాలుగు రాష్ట్రాల్లోనూ, అన్ని తెలుగుప్రాంతాల్లో పనిచేసారు. పదిహేళ్ళుగా వ్రాస్తూ, తెలుగులో ఇరవైకి పైగా కథలు వ్రాసి 2012 లో “చింతలవలస కథలు” అనే కథా సంకలనం వెలువరించారు. పాడిపరిశ్రమ ఇతివృత్తంగా వ్రాసిన కథలు అనేక రంగాల నిపుణుల, మేథావుల మన్ననలు పొందాయి.