top of page

ఆహ్వానిత మధురాలు

లేకపోవడమేంటి?

హెచ్కార్కే

భయమేస్తుంది
ఊపిరి సెలయేటిలో
పదును పదాలు
కోసుకుపోతాయని

 

చిద్రుపలు చిద్రుపలుగా
కురుస్తున్న చీకటి, దాని
చుట్టూరా నక్షత్రాల కోసం
అలమటించే నల్లని ఆకాశం

 

లోయ అడుగు నుంచి
ఆశ పెట్టే ఒక అలికిడి
వంకర కాళ్లతో, పైపైకి
పాకుతున్న చంద్రుడు

 

ఎంత తడిసిపోతేనేం నువ్వు
ఇది వర్షం కానే కాదు
భూమ్యాకాశాల మధ్య
ఒక సనాతన వివాదం

 

అంతా అయిపోలేదని తెలుసు
కొనసాగించే నేర్పు లేదు 
తప్పక తీసుకోవాలన్పించేది
కొత్తగా ఇంకేమివ్వను నీకు?

ఏదో పట్టుకొచ్చానే... ఏదీ?
ఏ జేబులో ఏ చూపులో
ఏ పుట్టలో దాచానో ఏమో

 

ఏదీ 
నీకు ఇవ్వడానికి 
కాసింత నేను? 
కాసింత నువ్వు? 
మరి ఇంకాసింత 
కౌగిలింతల చింత

 

పిచ్చివాడిని, ఏదో వాగాను, సర్సరేలే
నీక్కావలసిందే కావాలంటే కుదరదు
ఆసక్తికరమైనవన్నీ అదృశ్యమైనపుడు

 

ఎలా దొరికితే అలాగే, ఉగ్గ బట్టి
పీల్చుకోవాలి ఆకాశపు రసాల్ని
ఎంత చిరిగిపోయినదైనా ఈ కాస్త
ఆకాశం వుండగానే జుర్రు కోవాలి
ఔను, ఆకాశం 
ఉండక పోవడమూ వుంటుంది

 

ఆకాశం నీ కంటికి మూడో రెప్ప
అనుకోవాలే గాని, నువ్వు దాన్నీ
తాటించగలవు నీ ప్రేమ నీకెదురై,
చెంపల మీద లేత సిగ్గులు పూచి...

 

లేకపోవడం ఏమిటి
నువ్ రోజూ చూస్తున్నది,
నీ కనుల అధరాలకు
అమృతమైనట్టిది

 

ఏమీ లేని చోట కూడా
ఏదో ఒకటి వుంటుంది
కొండలు ప్రతిధ్వనించే
పెను నిశ్శబ్దం మాదిరి

 

నువ్వు రాక ముందు వుంది
నువ్వెల్లిపోయాకా వుంటుంది
ముడ్చుకుంటూ విప్పారుతూ
ఎప్పటికప్పుడు
ఊర్చడానికి సిద్ధంగా వున్న
పంట పొలమై ఒప్పారుతూ

 

****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...

click here to post your comments...

Bio

హెచ్కార్కే గురించి హెచ్కార్కే

నా పేరు ఏదో వుంది గాని, హెచ్కార్కే అనేదే ఇష్టం. ఈసారికిలా పోనిద్దాం. మాది బాగా వెనుక బడిన ప్రాంతంలో బాగా  వెనుక బడిన వూళ్లో ఒక వెనుక బడిన కుటుంబం అని చెప్పుకోడం కూడా బాగా ఇష్టం. దీన్ని కూడా ఇలా పోనిద్దురూ. ఇలా పోనివ్వాల్సిన మరి కొన్ని విషయాలు: నేను ఏ పార్టీలో సభ్యత్వం లేని కమ్యూనిస్టుని. దేవుడు లేడని కూడా నమ్మని అవిశ్వాసిని. కొన్నేళ్ల పాటు క్రియాశీల నక్సలైటుని. కవిత్వం, కథ అంటే ప్రాణం. కవిత్వం ఓ పది సంపుటాలు, కవితా/సాంఘిక విమర్శ ఓక పుస్తకం, ఒక అనువాద నవల (స్టీన్ బెక్ 'ఎలకలు మనుషులు'), తొందర్లో పుస్తకం కాబోతున్న సుమారిరవై కథలు, చాల నాన్ ఫిక్షన్ అనువాదాలు, రాజకీయార్థిక వ్యాసాలూ అచ్చేసానని చెప్పుకోడం కూడా ఇష్టం. దాన్ని కూడా ఈసారికిలా పోనిద్దాం, ఏమంటారు?

Comments
bottom of page