top of page

ఆహ్వానిత మధురాలు

దండేషు మాతా!

భానుమతి మంథా​

“సంధ్యా… సంధ్యా! ఇంకా అవలేదా…” గట్టిగా పిలుస్తూ, జేబులో దువ్వెనతో తల దువ్వుకుంటూ ఇంట్లోకి వచ్చాడు వివేక్. వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లి అద్దంలో మొహం చూసుకుని, చొక్కా కాలర్ సవరించుకున్నాడు. 
“వస్తున్నా… ఒక్క నిముషం.” లోపల్నుంచి సమాధానమిచ్చింది సంధ్య. 
“త్వరగా సంధ్యా! అందరూ వచ్చేశార్ట. ఇప్పటికే పది ఫోన్లొచ్చాయి.”
“వచ్చేశా...” విరబోసుకున్న జుట్టు వెనక్కి విదిలిస్తూ వచ్చింది సంధ్య. అలా జుట్టు వెనక్కి విదిల్చినప్పుడు, సంధ్య పెట్టే వంకరమూతి ఎంతో ఇష్టం వివేక్ కి. దగ్గరగా వెళ్లి, జుట్టంతా వెనక్కి తోసి, సుతారంగా హత్తుకుని నుదుటి మీద ఒక ముద్దివ్వబోయాడు. చటుక్కున వెనక్కి జరిగింది సంధ్య... స్వల్పంగా కంపిస్తున్న చేతుల్ని ఒకదాన్తో ఒకటి నొక్కుకుంటూ!
ఒకసారి నిలువెల్లా చూసి కనుబొమ్మలు చిట్లించాడు వివేక్.
“హూ… జీన్స్, వదులు వదులుగా ఆ టాప్... ఆడో మగో తెలీకుండా! ఆఫీసుకా? పార్టీకా? చీర కట్టుకోమన్నా కదా? ఫర్ ఎ ఛేంజ్… నేను టాప్ తియ్యడానికి హెల్ప్…” మీది మీదికి రాబోయాడు, 
“పెళ్లో, ఎంగేజ్ మెంటో కాదు. బర్త్ డే పార్టీ… అదీ మోస్ట్ మాడర్న్ సౌజన్యది. అమ్మాయిలంతా జీన్స్ అనుకున్నాం. డాన్స్ ఫ్లోర్ ఉంటుంది కదా, మూవ్ మెంట్స్ ఈజీ అని.” చేతులు అడ్డు పెట్టింది సంధ్య.
“మిగిలిన వాళ్ల సంగతి వదిలెయ్యి. నువ్వు శారీనే! పార్టీలకి మగరాయుడ్లా వెళ్లడం నాకిష్టం ఉండదు. చీర కట్టులో ఉన్న ఊరించే అందం ఏ డ్రస్ లో ఉంటుంది… ఆఖరికి లో నెక్, నావల్ అప్ టాప్ లో కూడా ఉండదు.”
“సరే... ఎందుకొచ్చిన గొడవ నీతో... కనీసం ఇరవై నిముషాలు పడుతుంది. చీర కట్టుకోడం అంత ఈజీ కాదు.” మొహంలో విసుగు కనిపించనియ్యకుండా లోపలికి నడిచింది సంధ్య. 
బైటికొచ్చిన సంధ్యని చూసి కనుబొమ్మలెగరేశాడు వివేక్. గంధం రంగు షిఫాన్ చీర మీద మజంతా గీతల డిజైన్.. డిజైనర్ బ్లౌజ్. శరీర కాంతిని రెట్టింపు చేస్తూ మెరిపిస్తున్నాయి. మెళ్ళో ముత్యాల దండ సుతారంగా వేళ్ళాడుతున్నరూబీ పెండెంట్ రంగుల్ని పరావర్తనం చేస్తోంది.  
“అదీ… అలా ఉండాలి! ఎంత బాగున్నావో తెలుసా...” దగ్గరగా వచ్చి ముఖం పైకెత్తి కళ్లల్లోకి చూశాడు, ప్రశంసగా, కోరికతో!
“పద... పద. చిలిపి వేషాలు తర్వాత.” చూపులకి పరవశమౌతూనే తప్పించుకుని నాలుగడుగులు పక్కకి వేసింది... నాజూగ్గా.
“కొంచెం ఆగి వెళ్ళచ్చు కదా!” ఆశగా కొంగు పట్టుకుని లాగాడు. ఆ కొంగు చుట్టుకుని అతని కౌగిలిలోకి వచ్చి పడింది సంధ్య. పెదవులు నాలుగూ దగ్గరయ్యాయి. కానీ… “ప్రియతమా… ప్రియతమా”… వివేక్ జేబులో సెల్ పాట పాడ్డం మొదలెట్టింది.
“బయల్దేరుతున్నాంరా...” అయిష్టంగానే ఫోన్ తీసి మాట్లాడి, నిరుత్సాహంగా బైటికి నడిచారిద్దరూ!
  
వివేక్, సంధ్యలకి పెళ్లయి ఆరు నెలలయింది. ఇద్దరూ హైద్రాబాద్ లో హైటెక్ లో ఒక కంపనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. వివేక్ పూర్తిగా సిటీ లో పెరిగాడు. సంధ్య టౌన్ నుంచి వచ్చింది. పెద్దలు చేసిన పెళ్లే. వివేక్ కి పార్టీలు… అందులో ఫ్రెండ్స్ తో సరదాగా వీకెండ్స్ అర్ధరాత్రి వరకూ గడపడం ఇష్టం. సంధ్య, వివేక్ ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, అతని సరదాలకి సహకరిస్తోంది. 
“వివేక్... తొందరగా వచ్చేద్దాం. అక్కడ్నుంచి పది లోగా బయల్దేరాలి.” తలుపుకి తాళం వేస్తున్న వివేక్ ని హెచ్చరించింది. పది లోగా ఇల్లు చేరాలని నియమం పెట్టుకుందామని పార్టీ ఉన్నప్పుడల్లా అడుగుతుంది. ఎప్పటికప్పుడు ‘వచ్చేసారి నుంచీ…’ అని దాటేస్తున్నాడు.
“వాకే... రాణీగారి ఇష్టం.”
“బైక్ తీస్తున్నావ్… ఆటోలో వెళ్దామనుకున్నాం కదా? ఆ పాకెట్ ఏంటి? “ 
వివేక్ జాగ్రత్తగా బండి ముందున్న సంచీలో పెడుతున్న పాకెట్ చూసి అడిగింది.
“ఏవో… కొన్ని సీసాలు. ఆటోనా! పది దాటితే చాలు... ఆటో వాడు ఒకటిన్నర రెట్లు గుంజుతాడు. అదీ కాక రాత్రి పూట కపుల్ అయినా ఆటోలో, టాక్సీలో వెళ్లకూడదని అంటున్నారు అందరూ… ఈ మధ్యని వినట్లేదూ? పైగా బైక్ మీద వెళ్తుంటే ఎంత రొమాంటిక్ గా ఉంటుందో తెలుసా! అసలే కొత్త ఏవియేటర్... మామగారి గిఫ్ట్...” మనోహరంగా నవ్వుతూ అన్నాడు.
“ఓహ్… ఈ చీరతో బైక్ మీదా! ఇంపాజిబిల్ వివీ!” ఎగిరి కూర్చోబోయి, చీర తట్టుకుని కింద పడబోయింది.
“హే… అలా కాదు. అమ్మ కూర్చున్నట్లు సైడ్ కి కూర్చో.”
“హూ! చాలా చికాగ్గా ఉంది. మరి రాత్రి డ్రైవ్ చెయ్యగలవా? పోలీసులు…” సంధ్య అనుమానంగా చూసింది.
“పోలీసులా... ఎలా మానేజ్ చేస్తానో నువ్వే చూస్తావు కదా?” ఈల వేసుకుంటూ ఝామ్మని బైక్ ముందుకి ఉరికించాడు వివేక్.
“వివేక్!” వెనక్కి పడబోతుంటే కష్టపడి ఆపుకుంది సంధ్య.
“గట్టిగా నా నడుం పట్టుకోవోయ్! నా వీపు ఉన్నది నువ్వు ఆనుకుని కూర్చోడానికే.” వెనక్కి తిరిగి కొంటెగా చూస్తూ అన్నాడు.
“హుష్. రోడ్ చూడు.” నడుం చుట్టూ చెయ్యి తిప్పి తల భుజానికానించింది. ఇద్దరూ ఇంచుమించు ఒకే పొడవు. సీటు వెనక్కి ఎత్తుగా ఉండటంతో సంధ్య తల ఇంకా ఎత్తయి, ముందు ట్రాఫిక్ అంతా కనిపిస్తోంది.
“నీకు అంత బెదురు పనికి రాదోయ్. డాషింగ్ గా ఉండాలి యూత్ అంటే.” రెండు బస్సుల మధ్య నుంచి లాఘవంగా దూసుకెళ్లాడు వివేక్. ఉన్నట్లుండి సంధ్యకి అనుమానం వచ్చింది.
“ఇంతకీ పార్టీ ఎక్కడ?” పక్కకి వేళ్లాడుతున్న కాళ్లు దూసుకెళ్తున్న బస్సులకి తగలకుండా ఒక చేత్తో చీర కుచ్చిళ్లు పట్టుకుని, బాలన్స్ చేస్తూ వివేక్ చెవిలో అరిచింది.
“కూకట్ పల్లి. సౌజన్య వాళ్లింట్లోనే.” వివేక్, సంధ్యలు హిమాయిత్ నగర్లో ఉంటారు.
“అంత దూరంలోనా? హోటల్ అన్నారు కదా! మరి తన అత్తమామలు వాళ్ళింట్లోనే ఉంటారు కదా?”
“వాళ్లు ఊరెళ్లార్ట. అక్కడైతే ఫ్రీగా ఉంటుంది. హోటల్ అయితే ఠంచన్ గా పదకొండుకల్లా వైండప్ చెయ్యాలి. ఇప్పడా మనిష్టం. హోహో... లాలాలా...” వివేక్ హుషారుకు స్పందించకుండా, సంధ్య ముభావంగా కూర్చుండి పోయింది. ఇంట్లో అంటే ఈ కోతి మూకే... హోటల్లో జనం ఉంటారు. కాస్త కంట్రోల్ ఉంటుంది. ఈ అబ్బాయిలు కాస్త మందెక్కువైతే ఎలా బిహేవ్ చేస్తారో... ఫ్రెండ్స్ కలుసుకోవడం బానే ఉంటుంది కానీ... డ్రింక్స్, ఆ జోకులూ నచ్చట్లేదు సంధ్యకి...
“హాయ్... వెల్ కం. మీరే ఆలిశ్యం. మన గాంగ్ అంతా ఎప్పుడో హాజర్.” సౌజన్య తలుపు తీస్తూనే సంధ్యని గట్టిగా హత్తుకుంది. అంతకంటే కొంచెం తక్కువగా వివేక్ ని కూడా... బుగ్గ మీద అంటీ అంటనట్టు పెదవులానించాడు వివేక్. దగ్గరగా రాబోతున్న సౌజన్య భర్త, సురేష్ ని చూసి వెనక్కి జరిగింది సంధ్య... ఎక్కడ హగ్ చేస్తాడో అని. భుజాలెగరేసి, హలో చెప్పి వెళ్ళిపోయాడు సురేష్.
“వావ్... శారీనా? ఏంటీ, నైన్టీన్త్ సెంచురీకి వెళ్లిపోయావే?” మోకాళ్ల పైకి పొట్టి స్కర్ట్ వేసుకుని ఎగురుకుంటూ వచ్చింది రమ్య... వివేక్ కొలీగ్.
అక్కడ పది జంటలున్నాయి. అందరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. కొందరికి పెళ్లిళ్లు అయి ఐదారేళ్లయి ఉంటుంది. అప్పడే పిల్లలు జంజాటం వద్దనుకుంటున్నారు. కొన్నాళ్లు ఎంజాయ్ చేసి... తొందరేముంది? కొందరు కలిసి జీవిస్తున్నారు... ఇంకా వ్యూస్ అవీ కలుస్తాయా లేదా అని చూస్తున్నారు.
సౌజన్య ఇంటినీ అందులో ఫర్నిచర్నీ కళ్లు విప్పార్చి చూస్తోంది సంధ్య. అదే మొదటిసారి, వాళ్లంతా ఎవరి ఇంట్లోనైనా కలవడం. ఇప్పుడిప్పుడే ఆ గుంపులో అందరినీ అర్ధంచేసుకోఢానికి ప్రయత్నిస్తోంది.
“నేనే శారీ అని ఇన్సిస్ట్ చేశా. మీకంటే వేరుగా కనిపించాలని.” వివేక్ ఏదో వెతుకుతున్నట్లు అటూ ఇటూ చూస్తున్నాడు. చేతిలో తను తెచ్చిన పాకెట్ పట్టుకుని.
“ఏంటి వెతుకుతున్నావ్... బార్ అక్కడుంది.” బాల్కనీ వైపు చూపించి సంధ్య చెయ్యి పట్టుకుని లాక్కుపోయింది రమ్య. రమ్య పొడుగు కాళ్లకేసి చూస్తూ బాల్కనీ లోకి నడిచాడు వివేక్. 
అదే సమయంలో సంధ్య వెనక్కి తిరిగి, వివేక్ కళ్లల్లో కనిపించిన కోరిక గమనించి కోపంగా చూసింది. అదేమీ పట్టించుకోకుండా భుజాలెగరేసి, కన్ను కొట్టి బాల్కనీలోకి నడిచాడు వివేక్. అప్పుడే సంధ్య నిర్ణయించుకుంది.. పొట్టి స్కర్టులూ, నిక్కర్లూ చచ్చినా వేసుకోకూడదని. చూడండి చూడండి అని పిలుస్తుంటే ఊరికే ఉండగలరా అని వాదిస్తాడు వివేక్… అడుగుతే!
చాలా మంది అబ్బాయిలు బార్ దగ్గర గుమికూడారు. సౌజన్య భర్త సురేష్ అందరికీ కావలసిన పాళ్లల్లో కోరుకున్న డ్రింక్స్ కలిపి ఇస్తున్నాడు. కారం జీడిపప్పులు, బాదం పలుకులు, ఉడికించిన మొలక పెసలు… రకరకాల తిను బండారాలు... కూల్, హాట్ డ్రింకులు సరఫరా అవుతున్నాయి. ఇటువంటి పార్టీకి రావడం సంధ్య కిది మూడోసారి. మామూలుగా ఎంతో సంయమనంతో ఉండే వివేక్ ఈ పార్టీల్లో ఒళ్లు మరచిపోతాడు. 
సంధ్యకి ఈ చిరుతిళ్లు రాత్రిపూట తినడం అలవాటు లేదు. మంచినీళ్లు తప్ప కూల్ డ్రింకులు కూడా తాగదు... తేనుపులొస్తాయని. 
“మాకు మాత్రం పుట్టగానే అలవాటయిందా?” బీర్ లాగిస్తూ రమ్య.
“అది కాదు. నాకు పడదు. మీరు తీసుకోండి… నేను చూస్తా.”
తొమ్మిది దాటింది. సంధ్యకి ఆకలి దంచేస్తోంది. ఎక్కడా భోజనం జాడ లేదు. వివేక్ ఇంకా బార్ లోనే... సంధ్యని చూసి చెయ్యూపాడు. అందరూ ఏదో ఒకటి తింటూ, తాగుతూ తుళ్లి తుళ్లి పడుతూ ఆనందిస్తున్నారు. సంధ్యకి విసుగొచ్చేసింది. ఎప్పుడూ వాళ్ల కంపనీ బానే ఉంటుంది... ఈ వేళే…
ఈ చీరొకటి... ముసలమ్మలాగ. దాంతో మరీ డల్ అయిపోయింది. ఏంటో వివేక్ ఉద్దేశ్యం! అలా సోఫాలో ఒరిగి పోయింది. చుట్టూ గోల… అరుపులు, డిస్కో డాన్స్ లు... సంధ్యకి అవేం పట్టలేదు. నీరసానికి గాఢంగా నిద్ర పట్టేసింది. ఎప్పుడో.. వివేక్ పక్కన కూర్చుని తట్టి లేపుతుంటే తెలివొచ్చింది. 
“లే...లే. సంధ్యా డార్లింగ్?” చెంపలు సుతారంగా తడుముతూ లేపి తన ఒళ్లో కూర్చోబెట్టుకోబోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు.. “వావ్… రొమాంటిక్.”
సంధ్య ఉలిక్కిపడి లేచింది. చుట్టూ మనుషులు... ఒక్క క్షణం ఎక్కడుందో అర్ధం కాలేదు. ఇంచుమించు వివేక్ ఒళ్ళో తాను... వివేక్ ని పక్కకి నెట్టేసి, లేచి నిలుచుంది. అప్పుడు గుర్తుకొచ్చింది పార్టీలో ఉన్నట్లు. నవ్వుతున్నవివేక్ వంక  కోపంగా చూసింది. మొహం ఎర్రగా చేసుకుని. వివేక్ మొహం కూడా అంతే ఎర్రగా ఉంది. ఉబ్బి పోయి నిగనిగ లాడుతోంది. కాకపోతే కారణం వేరు. మాట్లాడకుండా లేచి బాత్రూం కేసి నడిచింది.
అందరూ చప్పట్లు ఆపేసి, సంధ్యకి దారి ఇచ్చారు. 
సంధ్య తిరిగి వచ్చేసరికి బల్లమీద పదార్ధాలు అన్నీ అమర్చి ఉన్నాయి. ఒక్కొక్కళ్లు పళ్ళాల్లో వడ్డించుకుంటున్నారు. టైమ్ చూసింది... పన్నెండు దాటింది. ఆకలి చచ్చిపోయింది. అన్నం, పెరుగు వేసుకుని ఒక మూల నున్న కుర్చీలో కూర్చుని తిన సాగింది. “వివేక్ ఏమనుకున్నా సరే... ఇంక ఇటువంటి పార్టీలకి రాకూడదు.” గట్టి నిర్ణయం తీసేసుకుంది.
పుట్టిన్రోజు కేక్ కట్ చేసి... పాటలు పాడి బైటపడేసరికి ఒంటిగంట దాటింది. వివేక్, సంధ్య నడుం చుట్టూ చెయ్యేసి బైటికి నడిచాడు. 
  
“వివేక్... స్లో... స్లో...” సంధ్య గట్టిగా అరిచింది. వివేక్ బాలానగర్ జంక్షన్ దగ్గరకొచ్చేసరికి వేగం తగ్గించాడు. ట్రాఫిక్ పోలీసులు ప్రతీ బండినీ ఆపి ఊపిరి పరీక్ష చేస్తున్నారు. అర్ధరాత్రి మద్యం తాగి బళ్లు నడిపే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే యాక్సిడెంట్లు కూడా...
అప్పటికే ఉన్న ఇద్దరు పోలీసులూ రెండు బళ్ళని ఆపి తణిఖీ చేస్తున్నారు. వెనుక చీర కట్టుకుని కూర్చున్న సంధ్యని చూడగానే తలూపారు, వెళ్లిపొమ్మన్నట్లుగా... అచ్చు వివేక్ ఊహించినట్లే!
అర కిలోమీటర్ వెళ్ళాక, వివేక్ హుషారుగా ఈల వేస్తూ, వెనక్కి తిరిగి... సంధ్యని చూసి కన్ను కొట్టాడు. 
“చూశావా... చీర ఎందుకు కట్టుకోమన్నానో?” ముద్దగా అన్నాడు.
అంతే... తల గిర్రున తిరిగినట్లయింది. బైక్ వంకరటింకరగా వెళ్లి డివైడర్ ని కొట్టబోయింది. వివేక్ రెండు చేతుల్తో తల పట్టుకుని హాండిల్ బార్ వదిలేశాడు. అక్కడంతా చీకటి కొట్టులా ఉంది. బండి పక్కకి ఒరిగి పోయింది. ఇద్దరూ కింద పడిపోయారు. సంధ్య లేచి నిల్చుని చుట్టూ చూసింది. అదృష్టం… లారీలూ, బస్సులూ రావట్లేదు. వివేక్ ఏదో గొణుగుతున్నాడు. 
సంధ్య నడుం చుట్టూ కొంగు బిగించి, అటు పక్కకి వెళ్లి బైక్ ని లేపి, స్విచ్ ఆఫ్ చేసి, డివైడర్ కి ఆన్చి స్టాండ్ వేసింది. సంచీలోంచి నీళ్ళ బాటిల్ తీసి, వివేక్ ని తిప్పి, మొహం మీద నీళ్లు కొట్టింది. లేవబోతున్నాడు... కానీ స్వాధీనం అవడం లేదు.  దూరం నుంచి కార్లు వస్తున్నట్లు లైట్లు కనిపిస్తున్నాయి. 
సంధ్య ఇంక సంకోచించలేదు. వివేక్ మొహం పైకెత్తి, రెండు చెంపలమీదా ఛెళ్ళు ఛెళ్ళు మని వాయించింది. వాయిస్తూనే ఉంది. బిత్తరపోయి కళ్ళు తెరిచి చూస్తున్న వివేక్ మొహం మీదికి సీసాడు నీళ్ళు కుమ్మరించింది. అప్పడు అతని చూపు కాస్త నిలకడగా నిలిచింది. మెల్లిగా లేపి నిల్చో పెట్టింది. కార్లలో వెళ్ళే వాళ్ళు కిటికీలు దించి చూస్తూ వెళ్తున్నారు. ఎవరినైనా సహయం అడుగుతే... ఏమో! ఎవరెలాంటి వారో... పొద్దున్న లేస్తే పేపర్లలో వార్తలు వణుకు పుట్టించేలా ఉంటున్నాయి.
ఇంక లాభం లేదు… ఒక్కసారి సాయిబాబాని తలుచుకుంది. బైక్ మీద కూర్చుని, వివేక్ ని వెనుక కూర్చో పెట్టింది. వివేక్ కి ఏం జరుగుతోందో తెలుస్తోంది కానీ, స్వంతంగా ఆలోచించే స్థితి లేదు. సంధ్య చెప్పింది చేస్తున్నాడు. తన భుజానికున్న బాగ్ లో లైసెన్స్ ఉందో లేదో చూసుకుని, బండి తాళం తిప్పి ముందుకు పోనిచ్చింది. వివేక్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ రెండు చేతుల్తో సీటు కింద పట్టుకుని కూర్చున్నాడు. 

“సంధ్యా! ప్లీజ్... మాట్లాడవా? ఈ ఒక్క సారికీ... ఇంక జన్మలో డ్రింక్స్ వాసన కూడా చూడను. ప్రామిస్.” మూడు రోజుల్నుంచీ వెనుక వెనుకే తిరుగుతున్న వివేక్ కేసి అభావంగా చూసి తల తిప్పుకుని, వంకాయ వేపుడు కలపడమే జీవిత ధ్యేయంగా గాస్ మీదున్న మూకుడుని చూస్తోంది సంధ్య.
ఇద్దరూ ఆఫీసునుంచి వచ్చి, స్నానాలు చేసి పనుల్లోకి దిగారు. సంధ్యకి వంటలో సాయం చెయ్యాలని తాపత్రయ పడుతున్నాడు వివేక్.
“ఉండు… ఆ వేపుడు నేను కలుపుతా. నువ్వలా కూర్చో! సంధ్య భుజాలు పట్టుకుని కుర్చీలో కూర్చో పెట్టి, చేతిలో అట్లకాడ తీసుకున్నాడు వివేక్. ముద్దొచ్చేలా బుంగమూతి పెట్టుకూర్చుంది సంధ్య. కష్టపడి మనసు నిగ్రహించుకుని, మూకుట్లో ముక్కల్ని జాగ్రత్తగా ముక్క ముక్కా విడివిడిగా చేసి యూనిఫామ్ గా వేయిస్తూ… మధ్యలో ఒక్కో ముక్క నోట్లో వేసుకుంటూ... గట్టిగా తనలో తనే మాట్లాడ్డం మొదలెట్టాడు. 
“ఛీ, ఛీ!... ఇడియట్. ఎక్కడికైనా వెళ్తే ఒళ్ళు పై తెలీకుండా బిహేవ్ చెయ్యడం.... చెప్పిన మాట వినకపోవడం. కూడా తీసుకొచ్చిన వాళ్ళని పట్టించుకోక పోవడం... నిన్నసలు చెంపలు వాయించడం కాదు, కొరడా తీసుకుని వాతలు పడేలా కొట్టాలి. అసలు నిన్నిలా తయారు చేసిన వాళ్ళననాలి. నీకు చదువు చెప్పిన మాష్టర్లననాలి. కొడుకు బైటికెళ్ళి ఏం చేస్తున్నాడో గమనించుకోని అమ్మా నాన్నల్ని...” గట్టిగా ఏదో కింద పడిన చప్పుడు… వెక్కిళ్ళు వినిపిస్తుంటే వెనక్కి తిరిగాడు వివేక్.
సంధ్య కుర్చీలోంచి కింద కూలబడి, మోకాళ్ళ మీద తల పెట్టుకుని, పక్కలు ఎగసి పడేలా గట్టిగా ఏడుస్తోంది.
వివేక్ వెంటనే స్టౌ ఆర్పేసి, సంధ్య పక్కనే కాళ్ళు ముడిచి కూర్చుని రెండు చేతుల్తో తల పట్టుకుని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. భోరు భోరు మని ఏడుస్తూ అతన్ని చుట్టుకు పోయింది. సంధ్య తల ఎద మీద పెట్టుకుని, నుదురు, జుట్టు, మెడ నిమురుతూ ఏడవనిచ్చాడు. 
ఉధృతం తగ్గాక నెమ్మదిగా లేపి, నడిపించి, వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్లి, చల్లని నీళ్ళతో మొహం కడిగాడు. అలాగే పొదువుకుని, సోఫాలో కూర్చోపెట్టాడు. సంధ్య చెయ్యి, తన రెండు చేతుల్తో పట్టుకుని సుతి మెత్తగా వత్తుతూ మాట్లాడ సాగాడు.
“అయామ్ రియల్లీ సారీ సంజూ! చాలా బాధ పెట్టాను నిన్ను. ఇంక ఎప్పుడూ అలా జరగదు. నన్ను...” వివేక్  చెప్తున్నది వినిపించుకోకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది సంధ్య. కళ్ళ నిండా సుళ్ళు తిరుగుతున్న నీళ్ళు.
“అర్ధరాత్రి… స్పృహలో లేని మొగుడు, ఉండీ లేనట్లు ఏ మాత్రం వెలుగు లేని వీధి దీపాలు... ఏం చేద్దామన్నా కాళ్ళకీ చేతులకీ అడ్డం పడుతూ చీర! వంద కిలోమీటర్ల స్పీడులో కొట్టుకునే గుండె... ఏ రౌడీలోస్తారో, పోలీసులొచ్చి అరెస్ట్ చేస్తారో… ఎవరికి చెప్పుకోవాలి ఆ క్షోభ? ఎలా బైట పడతాను ఆ నైట్ మేర్ నుంచి...”
“వద్దు సంజూ! ఇంక నీకెప్పడూ అట్లాంటి నైట్ మేర్ రాదు. ప్రామిస్. వన్ వీక్ సెలవు పెట్టి ఎటైనా వెళ్ళొద్దాం. నీ కిష్ఠమైన ప్లేస్ చెప్పు. వద్దురా! అలా దీనంగా చూడకు. ప్లీజ్.” దగ్గరగా తీసుకుని కారుతున్న కన్నీళ్ళని తుడుస్తూ, కళ్ళ మీద చుంబించాడు వివేక్. 
లతలా అల్లుకుపోయింది సంధ్య వెక్కుతూనే… అలుక… విరహం, క్షమాపణలు… ఆ తరువాత కౌగిలిలోని వెచ్చదనం! ఇద్దరూ తేలిక పడ్డ మనశ్శరీరాలతో సేద తీరారు.

“అద్భుతం సంజూ! వంకాయ వేపుడు అదిరింది. అందులో... కాస్త చురుక్కు మనేట్టు పడింది కారం. నెయ్యేసి కలిపా! ఇదిగో… ఈ ముద్ద తిను. ఈవేళ నేనే తినిపిస్తా నీకు.” నోరు సున్నాలా తెరిచింది సంధ్య.
“అదిగో! నోరలా తెరుస్తే బావోదమ్మాయ్. మర్యాదగా ఉండలేనంతే!”
“సర్సరే… ముందు భోజనం కానీ... ఆకలేస్తోంది. మూడు రోజులైంది సరిగ్గా తిండి తిని.”
“అవును సంజూ! ఇద్దరం ఎంతో సఫర్ అయ్యాం. నిజంగా నీ వల్లనే మనిద్దరం ఇప్పుడు, ఇలా భోంచెయ్య గలుగుతున్నామంటే  ఎంత మాత్రం అబద్ధం కాదు. అవునూ… నీకు బైక్ నడపడం వచ్చని నాకు చెప్పలేదే ఎప్పడూ?”
“నువ్వు అడగలేదుగా ఎప్పడూ...” వెక్కిరించింది సంధ్య.
ఉన్నట్లుండి సీరియస్ అయిపోయాడు వివేక్.
“మన పెద్దవాళ్ళు వైఫ్ గురించి ఏదో చెప్తారు కదూ… మొదటిది వదిలేస్తే... ‘కరణేషు మంత్రీ, దండేషు మాతా, క్షమయా ధరిత్రీ...”
కళ్ళు పెద్దవి చేసింది సంధ్య. “భోజ్యేషు మాతా అనుకుంటా... పైగా దండేషు అనే మాట నేనెప్పుడూ...”
“అది పాత రోజుల్లో. మాడర్న్ డేస్ లో దండేషే కరెక్ట్. చెప్పిన మాట వినక పోతే అమ్మలా నాలుగు తగిలించడం అన్నమాట.” వివేక్ లేచి వాష్ బేసిన్ దగ్గరకెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు..
కుర్చీ జరిగినట్లుగా పెద్ద చప్పుడు… గాభరాగా వెనక్కి తిరిగాడు. 
సంధ్య కుర్చీలోంచి కిందకి దిగి... కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేలా... తల వెనక్కి విదిల్చి నవ్వుతోంది.
వివేక్ ఒక్క గెంతులో సంధ్య పక్కకి జారి మీదికి వంగాడు.

ఒక నెల తర్వాత, ఒక రాత్రి... గడియారం పది గంటలు కొట్టింది.
“బై గైస్...” వివేక్, రమ్య బర్త్ డే పార్టీ లోంచి హడావుడిగా బైటికెచ్చాడు… సంధ్య తన హాండ్ బాగ్, హుక్ కి తగిలించి బైక్ స్టార్ట్ చేస్తోంది.
“దండేషు మాతా…” లెంపలేసుకుంటూ వెనకాల కూర్చున్నాడు.

 

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

bio

భానుమతి మంథా

డా. మంథా భానుమతి: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం స్వస్థలమైన డా. మంథా భానుమతి గారు వృత్తిరీత్యా రసాయన శాస్త్రవేత్త. ఉస్మానియా నుంచి ఎమ్మెస్సీ, రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పట్టా, ప్రభుత్వ సిటీ కళాశాల లో ప్రొఫెసర్ గా పని చేసి 2000 లో స్వఛ్చందంగా  ఉద్యోగ విరమణ చేశారు. ప్రవృత్తి సంగీతసాహిత్యాలు. తెలుగు విశ్వ విద్యాలయం నుంచి కర్నాటక సంగీతంలో డిప్లమో అందుకున్నారు. 1993 లో తొలి కథానిక ప్రచురించి ఇప్పటి వరకూ పన్నెండు నవలలూ, యాభై పైగా కథలూ వ్రాసి లబ్ధప్రతిష్టులయ్యారు. అనేక బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు. భర్త రామారావు గారితో హైదరాబాద్ నివాసి. ఇద్దరు అబ్బాయిలూ అమెరికా నివాసులు.​

***

comments
bottom of page