top of page

ఆహ్వానిత మధురాలు

కొత్త కోణం​

పొత్తూరి విజయ లక్ష్మి

ఈ మధ్య ఓ అసిస్టెంటు పెట్టుకున్నా. స్పాండిలైటిస్ కొత్తగా వచ్చింది. అదివరకులాగా చేత్తో కధలూ  కాకరకాయలూ కవితలూ గట్రా రాయటం శ్రమ అయిపోతోంది. నడుము నెప్పి వుండనే వుంది. పోనీ చచ్చీ చెడీ రాసినా అవి ఎవరూ అంగీకరించటం  లేదు. అందరూ ఫలానా ఫాంట్ లో టైపు చేసి సాఫ్ట్ కాపీ పంపించండి  అంటున్నారు. నేను టైపు చేస్తే అప్పంభోట్ల  పందిరిలాగా అన్నీ తప్పులే.
ఇలా లాభం లేదని ఓ పిల్లని పెట్టుకున్నా. ప్రతిరోజూ సాయంత్రం వచ్చి  నేను చెప్తుంటే టైపు చేసి పెడుతుంది. ఆ అమ్మాయి పేరు సుధ.
ఓ బ్రహ్మాండమైన కథ  ఆలోచించి పెట్టుకున్నా. ఈ మధ్య రూటు మార్చేద్దామని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఉత్త సాంఘికాలు రాస్తే ఊరూ పేరూ వుండటం లేదు . పాతికేళ్ళుగా రాస్తున్నా. ఓ గుర్తింపూ లేదు. ఓ ఎవార్డూ లేదు. సస్పెన్సు రాద్దామంటే  నా మనసులో ఏ మాటా  దాగదు. ఇక నేను సస్పెన్సు  ఏం మెయింటెయిన్  చేస్తానూ?
ప్రస్తుతం పురాణాలు, ఇతిహాసాల హవా నడుస్తోంది. వున్నదున్నట్లూ రాయకుండా కొత్త కోణం వెతికి రాస్తే   బాగా పేరొస్తోంది. 
అందుకే  రామాయణం లోంచీ కొత్త కోణం వెతికి కథ  రెడీ గా పెట్టుకున్నాను. 
సుధ వచ్చింది. ఓ కప్పు టీ తాగి పనిలో పడ్డాం.
“ఏదో కొత్త కోణం అన్నారు మేడం?  అదీ హాస్యమేనా?”  అని అడిగింది.
“కాదు ఇది పూర్తిగా కొత్త కోణం. దీంతో  నా రచనా జీవితం లో గొప్ప మార్పు  వచ్చేస్తుంది.”  అన్నాను 
సుధ బోలెడంత  ఆనందించింది. “చెప్పండి చెప్పండి”  అంది. 
“మారీచుడు ఎవరో తెలుసా?”  అని అడిగాను 
“తెలుసు. రామాయణం లో మాయ లేడి”  అంది. 
“అతని మీదే కధ.  కథ పేరు  మారీచుడి  ఆఖరు రాత్రి.” 
“ఇక కథా ప్రారంభం. మారీచుడి  భార్య పేరు మదిరావతి.  ఆమె మహా పతివ్రత. గొప్పరసికురాలు కూడానూ” . .  
సుధ ఆపేసింది. "మారీచుడికి భార్య ఉందా మేడం ? "అని అడిగింది. నాకు చిరాకొచ్చేసింది . ఆదిలోనే  హంసపాదు. 
"ఎందుకుండదూ, మగాడన్నాక భార్య ఉండదా?"  అన్నాను. 
"రామాయణం లో ఎక్కడా ఆవిడ ప్రసక్తి లేకపోతేనూ" అంది.
"ఇది మరీ బాగుంది. అవసరమైన  పాత్రలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఊరుకున్నారు వాల్మీకి, వ్యాసుడూ.  లేకపోతే ఇంకో ఏడు కాండలు రామాయణం లోనూ, ఇంకో పద్ధెనిమిది పర్వాలు  భారతం లోనూ వుండేవి . వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు. మిగిలినది మన ఊహకే వదిలేశారు. వాటిల్లోంచి తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత. అసలు దేవుడే లేదు. ఇంకా రావుడేవిటీ  అని కొట్టిపారేసేవాళ్ళు కూడా క్షుణ్ణంగా చదివి, అందులోని విషయాన్ని వారికి అర్ధం అయిన రీతిలో తిరగ రాసి పేరు ప్రఖ్యాతులు తెచ్చేసుకుంటున్నారు బోలెడన్ని బహుమతులూ గట్రా అందుకుంటున్నారు. కాబట్టి మనం కూడా కొత్త కోణాలు వెతుక్కుందాం " అన్నాను. 
సుధకి నేను చెప్పింది అర్ధం కాలేదు.  తన మొహం చూసి ఆ విషయం నాకు అర్ధం అయింది.
" కథ టూకీగా చెప్తాను విను " అన్నాను. “చెప్పండి” అంది. 
"రావణాసురుడు మారీచుడి దగ్గరికి వచ్చి నేను సీతాపహరణం చేస్తా. నువ్వు నాకు సాయం చెయ్యాల్సిందే   తప్పదు”  అని చెప్పి ఒప్పించటం తో కథ ప్రారంభం. 
రావణాసురుడు వెళ్ళిపోయాక  మారీచుడు మధన పడుతుండగా  మారీచుడి భార్య మదిరావతి  వచ్చి
"ఎందుకు స్వామీ?  వ్యాకుల పడుతున్నారూ?" అని అడుగుతుంది. 
“ఏం చెప్పను ప్రియే!” అని విషయం అంతా చెప్పాడు.  లంకాపతి  రావణాసురుడు వచ్చి సాయం అడిగాడు, రాజాజ్ఞ కాదనలేను. మాయ లేడిగా వెళ్తే రాముడి చేతిలో మరణం ఖాయం. కాబట్టి ఇదే నాకు ఆఖరి రాత్రి” అన్నాడు.

పాపం మదిరావతి ఏడిచింది. తరవాత గుండె రాయి చేసుకుంది. “పోన్లే స్వామీ. ఏంచేస్తాం? మనకింతే  ప్రాప్తం. రేపటి గురించి దిగులు పడకుండా ఈ రాత్రిని హాయిగా గడుపుదాం. అంటుంది. ఆ తరువాత  వారిద్దరూ  ఆ రేయి ఎలా గడిపారు. ఆ మహా పతివ్రత మదిరావతి మర్నాడు పొద్దుటే భర్తని ఎలా పంపించిందీ  అనేదే  మన కధ-  మారీచుడి  ఆఖరు రేయి." అని వివరం గా  చెప్పాను. తలొంచుకుంది సుధ. "ఇవన్నీ ఎందుకు మేడం. మామూలుగా  కధలు  రాసుకోవచ్చుగా" అంది.

నాకు చిరాకేసింది “నువ్వు నా దగ్గర పనిచేస్తున్న దానివి. నేను చెప్పినట్లు వినాలి. అంతే గానీ సినిమాలో హీరోలాగా యజమానిని ఎదురు ప్రశ్నలు వేయటం, సలహాలు చెప్పటం ఏమిటీ?" అని మందలించాను. తర్వాత నాకే జాలి వేసింది. ఇటువంటి కొత్త కోణాలు గట్రా గురించి  చదివినప్పుడు నా వంటి మేధావికే బుర్రకి ఎక్కదు.  పిల్ల కాకి పాపం తనకేం  అర్ధం అవుతుంది?  అందుకే ఇంకాస్త వివరంగా చెప్ప దల్చుకున్నాను. 
"చూడు సుధా! ఈ కరువు రోజుల్లో అన్నింటితో బాటు కథా వస్తువుకి కూడా కరువొచ్చి పడింది. వృద్ధుల సమస్యలు, బీదల పాట్లు ఎంతకాలం రాస్తాం? మనకే విసుగొస్తోంది. చదివేవాళ్ళకి రాదూ? అందుకే ఇలా పురాణాల్లోకి పోయామనుకో.  కొదవ వుండదు.  సీత తల్లి, మాండవి తల్లి కూచుని తమ కూతుళ్ళు కష్టాలు పడుతున్నారు అని దుఃఖించటం ఓ కథ. గాంధారి ఇరవై రెండో కోడలు కర్ణుడి మీద ఎలా మనసు పడిందో ఇంకో కథ.  అలా  ఏడు జన్మలు రాసుకోవచ్చు" అన్నాను . 
"మేడం. నాకివ్వాళ ఓ పనుంది.  కాస్త త్వరగా వెళ్లాలి.  కథ మొదలెట్టినా  పూర్తి కాదు. రేపొచ్చి  పూర్తిగా టైపు చేస్తా "అంది. “సరే వెళ్లిరా”  అని పంపించాను. 
అదే పోత మళ్ళీ రాలేదు. ఫోన్ చేస్తే  ఊరొదిలి వెళ్ళిపోయింది అన్నారు వాళ్ళ వాళ్ళు .  
ఫోను పెట్టేసి  మా వాళ్ళని "నా బోర్డ్ ఏదీ"  అని అడిగాను?   అది వరకే " కంప్యూటర్ మీద పని చేసే ఆడపిల్ల కావలెను”  అని ఓ బోర్డ్ రాయించి పెట్టుకున్నా. 
"ఎందుకూ బోర్డ్? ఈ పిల్లా పారిపోయిందా?" అని అడిగారు. పదిహేను రోజుల్లో ఇది మూడో కాండిడేట్!
“అవును”  అన్నాను. ఇంట్లో వాళ్ళు మొహమొహాలు చూసుకున్నారు.  సమాజాన్ని ఉద్ధరించే  సందేశాత్మక మైన కధలు  రాయక పోయినా  కాలక్షేపం  కధలు బాగానే రాస్తావుగా. చదినవాళ్ళు  ఆనందిస్తారు. మరి అసిస్టెంట్లు ఎందుకిలా పారిపోతున్నారు?  అని నన్నే అడిగారు.  నా కొత్త కోణం గురించి చెప్పాను. 
జాలిగా చూసారు."జట్కా గుర్రం లాగా కళ్ళకి గంతలు కట్టుకుని కూచోకుండా కాస్త ప్రపంచం ఎలా వుందో చూడమనేది ఇందుకే. గుర్తింపు రావాలంటే  ప్రతిభ  వుంటే చాలదు.  వెనకాల అండా  దండా వుండాలి.   వడ్డించే మనవాళ్ళు ఉండాలి. చుట్టూ భజనపరులు ఉండాలి. "అన్నారు
"అవేవీ నాకు లేవుగా."   . 
"అందుకే నీ పద్ధతి లో నువ్వు రాసుకో.  పేరొస్తుంది. అవార్డులు వస్తాయి అని ఆశతో కొత్త కోణాలు మొదలెడితే ఇదుగో  నీ పాఠకులు కూడా ఇప్పుడీ పిల్లలాగా పారిపోతారు”. అని చెప్పారు.

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

bio

పొత్తూరి విజయలక్ష్మి​

పొత్తూరి విజయలక్ష్మి: తెలుగు నాట అరుదైన ఉత్తమ హాస్య రచయితగా పేరు పొందిన శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి గారు 1982 లో వ్రాసిన తొలి నవల ‘ప్రేమ లేఖ’. ఇది శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాగా తీయబడింది. ఈమె మొత్తం మీద సుమారు 50 పైగా కథలు, 14 నవలలు, 3 సినిమాలు, 2 టీవీ సీరియల్స్ రచించి లబ్దప్రతిష్టులయ్యారు. ఈమె రచనలు రేడియోలో నాటికలుగా ప్రసారమయ్యాయి. ఈమె రాసిన హాస్య కథలు "పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు”, మా ఇంటి రామాయణం, చంద్రహారం, అందమె ఆనందం అనే హాస్యకథా సంపుటాలుగా వెలువడ్డాయి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం,  తురగా కృష్ణమోహనరావు గారి స్మారక పురస్కారం, శేషారత్నం స్మారక హాస్యకథా పురస్కారం మొదలైన గుర్తింపులు పొందారు.

***

comments
bottom of page