MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
“శ్రీని” వ్యాస వాణి
ఇంట్లో ఈగల మోత! బయట పల్లకీ మోత!!
శ్రీనివాస్ పెండ్యాల
అప్పుడే మన మోడీ గారి రాజ్యస్థాపన జరిగి దాదాపుగా 2 సంవత్సరాలయింది. మోడీ గారు ఎప్పుడూ ఎన్నికల సభలలో చెప్పేట్టు, ఒక్కసారి రిపోర్టుకార్డు పరిశీలించాలనే ఆలోచన మెదిలింది నాకు. అయినా… 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి ఇంకా 2 నెలలు వుందిగా... ఇప్పుడే ఏం తొందర అనుకొన్నాను... కానీ ఇంకో 2 నెలల్లో మన ఇద్దరు చంద్రుల… అదేనండీ… "ఆ విధంగా ముందుకుపోదాం" అనే నారా చంద్రుడు, "ఏందిరా బై! పాతరేస్తా" అనే ఖారా చంద్రుడి మూల్యాంకనం ఎలాగూ వుంది కనుక మోడీ గారికి ఇప్పుడే చాకిరేవు పెట్టాలనిపించింది. అయినా ఒక్క ఓవర్‌లో చకచకా ఫోర్లు కొట్టే విరాట్ కొహ్లి ఏమీ కాదు కదా మన మోడీ... ఇంకో రెండు నెలల్లో ఏవో అద్భుత నిర్ణయాలు తీసుకొని మన అభిప్రాయాలను తలక్రిందులు చేయడానికి... అందుకే రెండు మెత్తటి మొట్టికాయలేయడానికి సిద్ధమయింది నా కలం.
ఒక్కసారి ఆదిత్య-369 సినిమా కాలయంత్రంలో మన మౌనమోహనుడి కాలానికి వెళితే... ఒళ్ళు జలదరించే ఆ నిర్భయ నేరాలు, దాదాపుగా ఒక చిన్న దేశపు బడ్జెట్ కు సరిపోయే 2G/3G అనే సామాన్యుడికి అర్థం కాని స్పెక్ట్రం కేటాయింపు తాయిలాలు, బొగ్గు కూడా వదలని మాయగాళ్ళు... ఇలా చెప్పుకుపోతే చాంతాడయ్యేంత స్కాంలలో పరవశిస్తున్న రోజుల్లో... అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో సర్దుకుపోయి కదిలే నదిలో అలా అలవాటుగా... గాలివాటుగా… సాగిపోతున్న భారత ప్రజానీకంలో కలల వరదని సృష్టించి… స్వచ్ఛమైన సెలయేటికి చేర్చే సేవకుడిని నేనే అంటూ ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తించాడు మోడీ! కట్ చేస్తే - ఇందిరాగాంధికి మాత్రమే సాధ్యమయినంతటి శక్తివంతమయిన ప్రభుత్వాన్ని స్థాపించాడు...
కాని, 2 సంవత్సరాలకే ‘డామిట్! కథ అడ్డం తిరిగింది’ అనిపించేట్లు మోడీ రథం అనుకున్న వేగాన్ని ఎందుకు అందుకోలేకపోతుందీ? మోడీ తన ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు... అవినీతి నిర్మూలన, ఆర్ధిక నేరగాళ్ళ సత్వర విచారణ, నల్లధనం వెలికితీత, ద్రవ్యోల్బణం అదుపు, దేశ ఆర్థిక పరిస్థితి పట్టాలెక్కించడం... వంటివి కాకుండా… ఎందుకిలా JNU, లలిత్ మోడీ, జాతీయతావాదం Vs దేశభక్తీ, లాంటి వార్తలు ప్రధాన వార్తలవుతున్నాయి? లోపం మోడీ ప్రభుత్వానిదా? లేక పక్షవాతమొచ్చిన ప్రతిపక్షాలు చైతన్యవంతమయ్యాయా?
ఎన్నికల ప్రచారంలో అత్యంత ప్రాధాన్యతా అంశం ఆర్ధిక నేరగాళ్ళపై సత్వర విచారణ. కాని గత రెండు సంవత్సరాలుగా ఈ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. పైపెచ్చు ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పోటీపడిన సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే వంటి వారు లలిత్ మోడీతో జతకట్టి పరాయి దేశంలో ప్రభుత్వపరువు తీసినా స్పందించని మోడీ మౌనం నిజంగా మౌనమోహనుడిని గుర్తుతెచ్చింది! ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడిన రాబర్ట్ వాడ్రా, షీలా దీక్షిత్, మారన్, రాజా లాంటి వారంతా బయటే హాయిగా శేషజీవితం ఆస్వాదిస్తున్నారు! మరి మోడీగారి సత్వర న్యాయం విచారణ ఏమయినట్లూ? కొంతలో కొంత అభినందించాల్సిన అంశం “తను తినను... తన వారినీ తిననీయను” అనే సిద్దాంతాన్ని కొంతలో కొంత పాటించడం. ఒక్క సుష్మా స్వరాజ్‌ను మినహాయిస్తే తనపై గాని, తన సహచర మంత్రులపై గానీ ఆర్థిక నేరాలెలాంటివీ వెలుగు చూడకపోవడం అభినందనీయం. భర్త పుణ్యంలో భార్యకు సగం వెళ్ళినట్లు, BJP ముఖ్యమంత్రుల పనితీరులో లోపాలు కూడా మోడీ ఖాతాలో చివరి పద్దుగా వచ్చే ఎన్నికలలో జతవుతాయి. కురువృద్ధ పార్టీలో లాగా విజయం వీరమాతకి, అపజయం పల్లకీ మోసిన బోయీలదిగా ఉండదు BJPలో. విజయమైనా వీరస్వర్గమయినా… సారధ్యం వహించిన రాజుదే ఖ్యాతైనా అపఖ్యాతైనా! మొత్తంగా, మంచి చెప్పేవాడు చూసేవాడుగా మారకుండా చేసేవాడిగా మారితే సమాజం హర్షిస్తుంది.
మరొక ప్రధానాంశం నల్లధనం. యధాలాపంగా చెప్పారో, లేక… ఎవరు అడుగుతారులే అని చెప్పారో గాని, చక చకా ఇంటింటికీ 15 లక్షలు ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ... అని ఇంద్ర సినిమాలో తెనాలి బ్యాచ్‌కి చెప్పినట్లు ఊరూరా చెప్పారు. ఈ మాటల్ని పట్టుకొని మన యువరాజా వారు విదేశాలకు వెళ్ళివచ్చినప్పుడల్లా ‘ఎక్కడ నా 15 లక్షలు, ఎక్కడ నల్లధనం’ అని తెగ గగ్గోలు పెడుతున్నాడు. మరి ఈ లెక్కలు తేలేదెప్పుడో? కనీసం 15 లక్షలు కాదుకదా 15 వేలు వచ్చినా పండగే అని అమాయకంగా ఎదురుచూసే ప్రజలూ ఉన్నారనుకోండి! మోడీ గారి స్విట్జర్లాండు విహారం ఎప్పుడో మరి?!!
ఏ ప్రభుత్వమయినా మొదటి రెండు సంవత్సరములు అత్యంత ప్రజాదరణ కలిగి ఉంటుంది. ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలైనా తీసుకోవాల్సిన సమయం ఇదే. కానీ మోడీ ప్రభుత్వం ఎందుకో మీనమేషాలు లెక్కిస్తున్నట్టుగా ఉంది. దీనికి కొన్ని కారణాలు ఉండి ఉండాలి… రాజ్యసభలో BJP కి పూర్తిగా బలం చేకూరేంతవరకూ వేచిచూడడం. తనపై తనకు అతి విశ్వాసం కలిగి ఉండటం. అన్ని సమస్యలకు తానే పరిష్కారం చూపగలననుకోవడం. ప్రతిపక్షాలే తన దారికి వచ్చి సహకరించాలనుకోవడం. ఇది మన భారత ప్రజాస్వామ్యంలోనే కాదు మరే దేశంలోనైనా జరగని పని. మొదటి రెండు సంవత్సరాలలో తీసుకొనే అత్యంత కీలక నిర్ణయాలు కొన్ని సందర్భాలలో ప్రజలకు చేదుగా కూడా అనిపించవచ్చూ! కాని వాటి ఫలాల రుచి చూడడం ఆరంభించాక ఆ చేదు గుళికల అనుభవం మాయమవుతుంది. గడచిన రెండు సంవత్సరాలలో ఇలాంటి నిర్ణయాలేవీ మనకు కనబడలేదు. అటు పారిశ్రామికరంగం కానీ ఇటు వ్యవసాయ రంగం కానీ నిరాశలోకి జారుకునే ప్రమాదం ఉంది. అదే జరిగితే మోడి తన ప్రధాన బలమయిన పారిశ్రామిక వర్గాలను కోల్పోవలసివస్తుంది. ఇంకా వేచిచూసి లేటు నిర్ణయాలు తీసుకుంటే అది వచ్చే ప్రభుత్వానికే మేలవుతుంది కాని ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమీ ప్రయోజనం ఉండదు. చంద్రబాబు కూడా చేసిన తప్పిదమిదే! చివరి రెండు సంవత్సరాలలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని, సంపద సృష్టించి 10 సంవత్సరాలు అధికారం కోల్పోయాడు. రాజశేఖరుడు ఆ సంపదతో జల్సా చేసి ‘సంక్షేమరత్న’ గా మిగిలి... పోయాడు!
మనమెంత ఎలుగెత్తి ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ అని నినదించినా... ఇన్వెస్టర్స్ మాత్రం తమకు లాభదాయకమయిన మార్గాలను ఏర్పరచినప్పుడే పెట్టుబడులతో వస్తారు. నాయకత్వమనేది స్థిరత్వాన్ని ఇస్తుంది కాని ఆకర్షించేది మాత్రం… సులభతరమయిన పారిశ్రామిక విధానమే. మోడి గారి ప్రచారం… “వేడి వేడి గా చిక్కటి పాలతో కాఫీ చేసి ఫ్రిజ్ లో పెట్టా! వేడి తగ్గకముందే ఆస్వాదించండి” అన్నట్లుంది. పడిపోతున్న ఆయిల్ ధరలు, కుంచించుకుపోతున్న యూరప్ మార్కెట్లతో బలపడవలసిన మన ఆర్థిక స్థితి ఇంకా పట్టాలెక్కినట్లనిపించడం లేదు. దీనికి సగటు వృధ్ధి రేటు, రూపాయి మారకం విలువ వంటి సూచీలే నిదర్శనాలు.
అంత అనర్గళంగా మాట్లాడే మోడీ మీడియాతో ఎందుకు నోరు తెరిచి తన అభిప్రాయాలని పంచుకోలేకపోతున్నాడు? విదేశీ CEOలతో, జర్నలిస్టులతో అత్యంత కలివిడిగా వ్యవహరించే మన ప్రధానమంత్రి గారు... దేశీయ CEOలతో కానీ, జర్నలిస్టులతో కానీ... బ్యాంకర్లతో కానీ...మాటకలిపిన సందర్భాలు బహు అరుదు. దీనికి అధానీ, అంబానీలు మినహాయింపు అనుకోండి. ట్విట్టర్ సందేశాల కంటే 'మీట్ ద ప్రెస్" లాంటి కార్యక్రమాలే ప్రజలకు ఎంతో చేరువ చేస్తాయి. ఈ ప్రెస్ విషయంలో... మౌన మోహనుడికి, మహాన్ మోడీ కి పెద్ద తేడా ఐతే కనిపించట్లేదు మరి.
ప్రజలనీ, ప్రచారమధ్యమాలనీ, ప్రతిపక్షాలని కలుపుకుని ఏకతాటిపై తీసుకు రాగలిగినప్పుడే ప్రభుత్వం పదికాలాలపాటు పచ్చగా ఉంటుంది... తనకున్న 282 మంది సభ్యులతోనే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోగలననుకోవటం అమాయకత్వమే! రాజ్యసభ ఆమోదము లేకుంటే ఏ ప్రతిపాదనయినా ముందుకు పోలేదు. పార్లమెంటులో కానీ, మరే ఇతర మాధ్యమంలో కానీ... ప్రతిపక్షాలతో చర్చించి వారిని దారిలోకి తెచ్చే చాకచక్యమైన చాణక్యరీతి బహుశా మోడీకిపుడు అత్యవసరమేమో! అందుకు... మోడీ ఒకసారి చరిత్రలోకి చూస్తే... తన ఆదిగురువు వాజ్ పేయి, పరగురువు పి.వి. నే మంచి ఉదాహరణలు. కానీ, పాపం… మోడీ గారు చరిత్రలో చాలా వీక్ అని ఎన్నికల ప్రచారాల సాక్షిగా దేశమెరిగిన సత్యమే!
మొదటి సంవత్సరంలో కురువృద్ధపార్టీని ఒంటిచేత్తో ఎదుర్కున్న మోడీ... వారి విమర్శలకెప్పుడూ బదులిచ్చేవాడు కాదు. కానీ, రెండో సంవత్సరంలో తానే కాక తన మంత్రివర్గంతో కూడా ప్రతిసమాధానాలిప్పిస్తున్నాడంటే... ఒకరకంగా మోడీ, తనకి తాను ఆత్మరక్షణలో పడుతున్న సంకేతాన్నిస్తున్నాయి.
ఇకపోతే, ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛభారత్, జన్ 'డన్' యోజన లాంటి విషయాలకొస్తే... నినాదాలుగా రక్తి కట్టించాయి కానీ, వాస్తవంలో నిదానంగా సాగి చతికిలపడ్డాయి... ఒక పేదవాడికి బ్యాంకులో ఖాతా కంటే చేతిలో కాసు పడితేనే ఎక్కువ ఆనందం. రిజర్వ్ బ్యాంక్ లెక్కప్రకారం యాభైశాతం పైచిలుకు ఖాతాల్లో యిప్పటికీ ఒక్కరూపాయి కూడా జమ కాలేదన్నది కాదనలేని సత్యం.
ఇలా... ఇంట్లో పథకాలు ఈగలు తోలుతున్నా... విదేశాల్లో మాత్రం మోడీకి పల్లకీ సేవలే లభిస్తున్నాయి... మునుపెన్నడూ లేనంతగా… ఇండియా మంత్రాన్ని జపం చేస్తున్నారు విదేశీనేతలు. ఇందుకు ఒబామా, కామెరూన్, మోర్కెల్ వంటి నేతలే ఉదాహరణ. యోగాపై ‘మేడిన్ ఇండియా’ ముద్ర వేసి ప్రపంచవిపణిలో గుర్తింపు తేవటంలో మోడీ పాత్ర ప్రధానమైందే. ఇదే కాక, బ్రిక్స్ డెవలప్‌మెంటు బ్యాంకు ప్రతిపాదన, బంగ్లాదేశ్‌తో సరిహద్దు సవరణ, పాకిస్తాన్‌లో ఆకస్మిక పర్యటన, ఆస్ట్రేలియాతో అనుబంధం వంటి కీలకమయిన వ్యవహారాలు మోడీమార్కు విజయాలే! ఇందుకు అభినందనీయుడే!
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే... మన మోడీ గారు ప్రధానమంత్రిగా ఎంత స్కోరు సాధించారో తెలీదు కానీ, విదేశాంగమంత్రిగా వరల్డ్ కప్ సాధించారు. పనిలోపనిగా ఫేస్ బుక్, ట్విట్టర్ CEOల కంటే కూడా వాటి ప్రచారం మాత్రం జీతంలేని బ్రాండు అంబాసిడర్లా ... మన మోడీ గారు భలే శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. కానివ్వండి. ఇలాగయినా...ఒబామాని ఆశ్చర్యపరిచినట్టే… ఏదో నాడు మోడీనీ నోబుల్ వరించి ఆనందపరిస్తే మనకీ గర్వకారణమేగా!
****