MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా వాణి
డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ
జయ జయ జయ జయ సంక్రాంతి - ఆనంద గీతం
రవితేజ గమనాల రసరమ్య పర్వం - నవ ధాన్యరాశులు అవనికే గర్వం
వ్యవసాయదారుల వందనాపూర్వం - కలబోయు సంతోష సంక్రాంతిపర్వం
జయ జయ జయ జయ సంక్రాంతీ
సకలకళానిధి సంక్రాంతీ !! జయ!!
పాశురములను గోదాదేవి పంచిన సంక్రాంతి
తీసిన మాలలు వెన్నుని మెడలో వేసిన సంక్రాంతి
గాలిపటాలను గగనసీమలకు కలిపే సంక్రాంతి
గంగా గోదావరి స్నానాలకు కదిలే సంక్రాంతి !! జయ!!
మకరంలో దినకరుని ప్రవేశపు మహిమల సంక్రాంతి
మధురమైన పొంగళితో రుచులు సుధలొలికే సంక్రాంతి
మార్గళిలో గోపిక సమూహముల మదిలో సంక్రాంతి
గొబ్బిళ్ళూ గోవులతో వనితలు కొలిచే సంక్రాంతి !! జయ!!
అరిశలు కరియలు చక్కిలాలను ఆరగించు సంక్రాంతి
గలగలపారే నదీమ తల్లికి తిలతర్పణముల సంక్రాంతి
నువ్వుల స్నానం నువ్వుల దానం నవ్వుల సంక్రాంతి
భోగిమంటలు పండిన పంటల పుష్యం సంక్రాంతి !! జయ!!
గంగిరెడ్లు సన్నాయి నృత్యముల భంగిమ సంక్రాంతి
హరిలోరంగహరీయని పల్కెడి హరిదాసుల సంక్రాంతి
రంగవల్లులు రంగని సేవల ముంగిటి సంక్రాంతి
రమణీయమ్మగు బొమ్మల కొలువుల రైతుల సంక్రాంతి !!జయ !!
మందిరాలలో సుందర నృత్యం మహిమాన్విత సంక్రాంతి
వందనములు, సంగీత నృత్యముల సందడి సంక్రాంతి
బంధుగణమ్ముల రాకలు, రుచిగల విందుల సంక్రాంతి
భవ్య నవ్య వస్త్రాలంకరణల భారతి సంక్రాంతి !! జయ !!
తిల్గుడ్ లోహడీ పొంగల్ పానుఙ్ తీరగు సంక్రాంతి
మిలమిలలాడే భోగి మంటలో మెరిసే సంక్రాంతి
తళతళలాడే ప్రాంగణములతో కళగల సంక్రాంతి
ధన్యం భారత నందనవనిలో తన్మయ సంక్రాంతి !! జయ!!
కిభశ్రీ
ఎందుకు ఓ రామయ
ప: ఎందుకు ఓ రామయ మా
కెందుకు అది తెలియదయ్య
.............ఎందుకు ఓ రామయ్య
చ: ఒక్కటె బాణముతో పలు
రక్కసులను దునిమిన ని
న్నొక్కసారి మదితలచిన
చిక్కులు తొలగేనే ఆ నిజ
మెందుకు ఓ రామయ....
చ: కీర్తి కాదు కావలె సం
పూర్తిగనీ కరుణ మాకు
ఆర్తితొ వేడంగా అని
వర్తివి నీవున్నావని
ఎందుకు ఓ రామయ ......
చ: మనసున నిను నిలుపుకొనిన
కనగలమే ఎల్లప్పుడు
పనిగట్టుకు రేయిపగలు
వినువీధుల వెదకనేల
ఎందుకు ఓ రామయ మా....
చ: కనదలచిన సృష్టియందు
కనబడుదువు అన్నిటాను
ఘనమగు నీరూపు నిలుప
మనసే మందిరము గాదె
ఎందుకు ఓ రామయ .....
చ: కీర్తిని కామించక సం
కీర్తనలో మునిగి చక్ర
వర్తివి నిన్నే శరణన
పూర్తిగ మము బ్రోచెదవని
ఎందుకు ఓ రామయ .....
చ: సంప్రదాయముల పేరిట
సంబరాలు జరుపుకొనుట
అందరమూ ఒకటిగ ఆ
నందముగా గడుపుటకని
ఎందుకు ఓ రామయ్య....
చ: పేరుకున్న అహము కనుల
నేరకముగ కప్పివేసి
నేరుగ ఎదురుగనున్నా
నీరూపము కననీయదు
ఎందుకు ఓ రామయ .....
(ని)స్వార్థం
'నాదీ' అనుకున్నప్పుడు
ఏం చేసేందుకైనా జంకుండదు
పోట్లాటలు గిల్లికజ్జాలపోరులోనూ
విజయగర్వం విర్రవీగుతుంది
చాడీలు అబద్ధాలు అన్నవి
అయాచితంగా అబ్బిన లౌకికజ్ఞానమౌతుంది
దోపిడీలు మోసగింపులు
సమర్థతకు నిదర్శనాలై నిలుస్తుంది
'మన' అనుకుని చూసినప్పుడు
ఏదో చేసేయాలనే ధ్యాసుండదు
ఓడినా సర్వత్రాప్రశాంతతే!
సహనం చిరునవ్వై పెదవుల్నివీడదు
ఆత్మ పరిశీలనే దైవత్వమై
అక్కునచేర్చి ఆదరిస్తుంది
ఎన్ని అనుబంధాల్ని పోగొట్టుకుందో తెలిసి
ఘనీభవించిన మనసు
ఆవిరై ఆకాశమంతగా వ్యాపిస్తుంది
తేలికైన దూదిపింజ మేఘంలా!
జ౦ట స్వరాలు
నిశ్శబ్ద౦లో ప్రతి శబ్ద౦ నా ఇతివృత్త౦
ప్రతి శబ్ద౦లో నిశ్శబ్ద౦ నీ వృత్తా౦త౦
పదాల పలుకులలో నా భావ౦ నిక్షిప్త౦
పలుకు పదాలలో నీ భావ౦ స౦క్షిప్త౦
నా జీవనమొక మురళీ గాన౦
నీవిస్తావొక మురళికి ప్రాణ౦
ఆకాశ౦ నా భావ౦
పాతాళ౦ నీ అనుభవ౦
నా గమన౦ నది వ౦టిది
నీ వేగ౦ మనస౦టిది
నా ముగి౦పు ఆలోచనలను తె౦పు
నీ గమ్య౦ అ౦తర్మధనమునకు పె౦పు
భాష నాది, భావ౦ నీది
భువిలో సర్వ౦ నీదీ నాదీ
నేనొక కధను, నీవొక కవితవు
కరుణార్థులు
భువన గర్భపు చిరుజీవై అ౦కురి౦చినపుడు
ఈ పద్మవ్యూహపు కధా కమామిషు
వారి స్మృతిపధ౦లో రికార్డు కాకపోలేదు …
సి౦థటిక్ చిరుతిళ్లు కొసరికొసరి తినిపిస్తూ
చదువుల మూటలు
వీపున మోసే కూలీలుగా మారుస్తూ
వారి ఆశల్నీ, ఊసుల్నీ
ఆలోచన మొలకల్నీ
ఆదిలోనే తు౦చేస్తున్నా౦ …
రే౦కుల ఎరలను చూపి
వాళ్ల బాల్యపు బ౦గరు తునకల్ని
దొ౦గిలిస్తున్నపుడు
వాళ్ల కళ్లలోని దైన్యాన్ని సైత౦
మన క౦టిరెప్పలతో కత్తిరిస్తా౦ …
వాళ్ల కేరి౦తల సాయంత్రాలతో
మనం గూటీ బిళ్లాడుతున్నపుడు
ఎవరో కొట్టిన బౌ౦డరీల వైపు
నిస్సహాయ౦గా చూడకే౦జేస్తారు…
ఇది ఇక్కడ......నీ పక్కన
మాతృమూర్తి ఒడిలోని శైశవగీతాల్ని
మర ఫిర౦గుల గర్జనలు
కబళిస్తున్నాయొక చోట …
అమ్మ చేతి బొటనవ్రేలిని
ఏనాడూ స్పృశి౦చని
చిన్ని పెదవులపై
కన్నీటి చారికలి౦కోచోట …
తుమికాకు మడతల్లోని బాల్య౦
చేయ౦దివ్వని శాసనాలవైపు
నోటిక౦దే చేతివైపూ
అయోమయ౦గా చూస్తు౦ది మరోచోట …
మీ వివాదాలూ,విభేదాలూ
శాసనాలూ,చర్చా వేదికలూ …
ఏమీ ఎరుగని పసితనం
అమాయక౦గా సంధించిన శరపర౦పర
ఎప్పటికీ మీ క౦టి కుహరాల్లోంచి
పయనిస్తూనే ఉ౦టు౦ది
మీ మనో ఫలక౦పై
క్వశ్చన్ మార్కులై మొలకెత్తటానికి…
మధుర స్మృతిగా మార్చాల్సిన బాల్య౦
కా౦క్రీటు కొలమానాల పాత్రల్లో ని౦పినా
అర్రులు చాచిన ఆకలి కేకల్ని అదిలి౦చినా
ఆ బాల్య౦..........
కాల౦ చెక్కిళ్ళమీద
ఘనీభవి౦చిన కన్నీటిచుక్కవుతు౦ది
అక్షర హారతి
అక్షరాలకు రంగూ, రుచీ, వాసనా ఉంటాయని
అక్షరాలా నిరూపించిన కళా తపస్వికి,
ముత్యాల సరాలలో నిత్య సత్యాలను గుప్పించి
ముందు తరాలకు వెలుగుదారులు వేసిన యశస్వికి,
మగువను సాటి మనిషిగా గుర్తించి
సమరస భావంతో సత్కరించిన మనస్వికి,
తెగువ గల మహిళను సబలగా
సమాజ రంగం మీదికి తెచ్చిన క్రాంతదర్శికి,
సరి కొత్త వ్యంగ్యపు చురకలతో, సబబైన తీర్పులతో
సమాజాన్ని చక్క దిద్దిన సాహితీవైద్యునికి,
దేశమంటే మనుషులనే పరమసత్యాన్ని
లోకానికి చాటి చెప్పిన మనీషికి,
మంచి, చెడ్డలు రెండే కులములని మానవత్వాన్ని ఏకీకృతం చేసిన విశ్వమానవునికి,
మనిషిలోని దైవత్వాన్ని గ్రహించి
సకల మతాల సారాన్ని సార్వజనీనం చేసిన సమన్వయ కర్తకు,
చక్కటి కథాకథనాలతో పాఠకుల హృదయాలలో
గూడుకట్టుకున్న భావనా విహంగానికి
అందమైన పదాలతో చిన్నారులకోసం
కమ్మని పాటలల్లిన కవిచంద్రునికి,
నవ యుగాల గురిదీపం గురజాడ మహాకవికిదే
హస్తిన రచయిత్రి చేతి అక్షర హారతి
నిద్ర
ఎవరయినా పిడికెడు
నిద్రను దానం చేస్తే బాగుండు
కళ్ళను ఎన్నిగంటలు
మూసుకుంటే మాత్రం ఏముంది
మనసురెక్కలు విహంగాలయి
గతం లోకి వర్తమానం లోకి
ఊయలలూగుతూ వుంటే
నిద్ర నేను రాను రానంటూ
దాగుడు మూతలాడుతుంది
శరీరం భూమికి సమాంతరంగా
చాపలా పరుచుకుని
చీకటి ఎంత దోహదం చేసినా
నిద్ర చుట్టూ తిరుగాడుతూ
రానని మారాం చేస్తుంది
దుఖం దాడి చేసినప్పుడల్లా
నిద్ర బలైపోతుంది
ఆలోచనల్ని ఆస్పష్టత ఆవరించినా
నిద్ర నిటారుగా నిలబడి పోతుంది
నిద్ర ఓ గొప్ప టానిక్
సమస్త శరీరాన్ని ఆవహిస్తుంది
నిరాశనీ నిస్సత్తువనీ
ఆవిరి చేస్తుంది
నిద్ర అంటే కాసేపు
కను రెప్పలు మూయడమే కాదు
మనసు రెక్కల్నీ మూయాలి
అందుకే ఎవరయినా
ఓ పిడికెడు నిద్రను
దానం చేస్తే బాగుండు
స్వచ్ఛభారత్
"తొలుదొల్తన్ పనిచేసి చూపవలెనెంతో శ్రధ్ధగా, పిమ్మటన్
పలుకంగావలె" నంచు జెప్పెనుగదా "బాపూజి", నీ కార్యముల్
సలుపంబూనుట "స్వఛ్ఛభారత" మగున్ సంకోచమున్ వీడుచున్,
తెలిపెన్ దాని "నరేంద్రమోడి" ప్రజకున్ దేశాభివృధ్ధింగనన్.
ప్రతివారున్ స్వగృహంబులన్, పరిసరప్రాంతంబులన్, స్వఛ్ఛశు
భ్రతలన్ పాలనజేయ "భారతము" తా"స్వఛ్ఛంబగున్" పూర్తిగా,
సతతంబుందురు భోగభాగ్యములతో స్వాస్థ్యంబు శోభిల్లగన్,
అతిపూజ్యంబగు భారతంబు ధరలో నాధ్యాత్మికస్వఛ్ఛతన్.
"భారతప్రగతి గ్రామాల ప్రగతియందె
యున్న"దని బాపుజీ మునుపన్నమాట
నిజమగును పరిశుధ్ధతన్ నిర్వహింప,
స్వఛ్ఛభారత నిర్మితిన్ సాగిరమ్ము!
పచ్చపచ్చని చేలతో ముచ్చటలర
కనులపండువు జేయుచు గానిపించు
గ్రామముల బ్రవేశింపగా కాలుపెట్ట
పుంతదారులన్నియు నిప్పులకు నెలవు
'ఊరుగొప్పదే యైనను పేరు దిబ్బ'.
'బాపూజీ' కల, 'మోడి' నిశ్చయము నింపారంగ సిధ్ధింపగా
కాపాడన్ వలె 'నీటి స్వఛ్ఛతను' సంకల్పంబుతో జక్కగా
కాపాడన్ వలె 'పారిశుధ్ధ్యమును' సాకారంబుగా స్వఛ్ఛతన్
రూపింపన్ వలె బాధ్యతన్ మన 'మహారోగ్యంబు' దీపింపగన్.
నిప్పు కుప్పలన్ దాటగా తిప్పలు పడి
ముక్కు పగులంగ నేగుదు బిక్క చచ్చి,
ఇట్టి స్థితి పల్లెల తొలగించి నపుడె
'గాంధి' 'మోది' కలలిల సాకార మగును
కాచి నపుడె గ్రామ మహిళా గౌరవమ్ము
"స్వఛ్ఛభారతోద్యమ"మిల సార్థకమ్ము!