MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
“శ్రీని” వ్యాస వాణి
స్వదేశావలోకనం - ధరాఘాతానికి శరాఘాతం!
శ్రీనివాస్ పెండ్యాల
హమ్మయ్య! శీతాకాల పార్లమెంటు సమావేశాలు మన పార్లమెంటేరియన్లకు పెద్దగా శ్రమనిపించకుండా 'వీజీ' గానే 'వాడి' పోయాయి. న్యాయస్థానం శ్రీముఖం చూపడంతో, ప్రభుత్వంపై కన్నెర్రజేసిన రాజమాత పార్లమెంటులో పోడియం చుట్టూ 'క్రేజీ''వాల్' ని కట్టడంతో మన ప్రధాన మంత్రి గారు 'అర్జంటుగా' తన విదేశీపర్యటనలను కుదించుకొని టూరిస్టు వీసా పై స్వదేశీపర్యటనకు తిరిగొచ్చినా పెద్దగా పార్లమెంటులో మైకు వాడనవసరం రాలేదు. బ్రిటీషు కాలంనాటి తుప్పుబట్టిన పన్నువిధానాన్ని కాస్తో కూస్తో కడిగేసి 'GST' రూపంలో కొత్తసంవత్సర కానుకనిద్దామనుకొన్న మన ఆర్దికమంత్రి గారి ప్రయత్నంకాస్తా అమృతం సీరియల్లో రబ్బరు బాలాజి తీసిన బంక 'ఎపిసోడ్'లా పార్లమెంటు శీతాకాల సమావేశాల నుంచి బడ్జెట్ సమావేశాలకు వాయిదా పడింది.
ఇక విషయానికొస్తే… జీ.యస్.టి., GST, జీ.యస్.టి..... ఏమిటీ జీ.యస్.టి...(Goods &Services Tax)? ఇదేదో కొత్త బ్రహ్మ పదార్థం వండి వార్చేయటానికి మన మీడియా ప్రబుద్ధులు ప్రభుత్వ పెద్దలతో మషాలా నూరేస్తున్నారనుకుంటున్నారా? ఇదేమీ బ్రహ్మ పదార్థం కాదు. చూడటానికి మూడంటే మూడు అక్షరాల్లో ఇమిడినట్టున్నా...ఇది శివుడి త్రిశూలమంత శక్తిమంతమైనది. ఆయుధంగా మార్చితే భారత ఆర్థిక తలరాతని మార్చేంత శక్తిసంపన్నమైనది.
అవునూ...ఎప్పుడయినా గమనించారా? అమెరికాలో ఇప్పుడున్న గ్యాలన్ పాల ధర కీ, దాదాపుగా ఎప్పుడో దశాబ్దకాలం క్రితం ఉన్న పాలధరకీ... పెద్దగా తేడా లేదు. కానీ, ఇండియాలో పది మాసాలకే పాల ధర మరో రూపాయి వడ్డింపు పెరుగుతుంది... అచ్చు పాలలో పెరిగే కల్తీ లాగే...! మరి, అమెరికాలో ధరలు స్థిరంగా ఉండటానికి కారణమే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ G.S.T! అమెరికాతో సహా పలు యూరప్ దేశాలు ఈ G.S.T ని ఎప్పుడో ఎనభయ్యవ దశకంలోనే అమలు పర్చటంతో ఈ ధరల స్థిరీకరణ సాధ్యమయ్యింది.
ఎప్పుడో వాజ్ పేయి గారి మదిలో మెదిలిన ముసాయిదా, ఎన్నో కాలమాన పరిస్థితులు ఎదుర్కొంటూ, వివిధ ప్రభుత్వ పెద్దల, ఆర్థిక శిల్పుల చేతిలో రూపుదిద్దుకుంటూ ఇప్పుడు తుదిదశకి చేరుకుంది. ఒకానొక సమయంలో ఇది అసాధ్యంగా కూడా అనిపించింది. ఎందుకంటే దీనిని పార్లమెంటు బాలారిష్టాల నుంచి గట్టెక్కించి, విభిన్న రాష్ట్రాలనీ, విభిన్న పారిశ్రామిక వర్గాలనీ, విభిన్న రాజకీయ పక్షాలని ఒప్పించి దీనిని వెలికితీయటం, వెలుగులోకి తేవటం అంత తేలికైన విషయం కాదు. ఒకరకంగా ఇందిరాగాంధీలాంటి నాయకత్వం మాత్రమే ఛేదించగల కార్యమిది. బహుశా అందుకేనేమో మోడీ దీనిని 'ఢీ' కొనటానికి పూనుకున్నది!
మరీ నసపెట్టకుండా... ఇక వివరాల్లోకి వెళ్ళి... మనం త్రిశూలంతో పోల్చుకున్న ఈ చట్టం మూడు ముఖ్యమైన జాడ్యాలని ఎలా ఛేదించనుందో చర్చించుకుందాము.
1. గొలుసుకట్టు పన్ను విధానం
2. అవినీతి
3. వ్యవస్థలో అపారదర్శకత
గొలుసుకట్టు పన్ను విధానం. ప్రస్తుతం మనం ఆచరిస్తున్న పన్ను విధానంలో అత్యంత దుర్భరమయిన మూలం ఏదైనా ఉందీ అంటే అది ఈ గొలుసుకట్టు విధానమే! ఉదాహరణకి, TATA వారు ఒక ఇండికా కారుని తయారు చేస్తున్నారు అనుకుందాము. దీనికి మూడు ముఖ్య విభాగాలని వేరే ఇతర సంస్థలనించి దిగుమతి చేసుకుంటున్నారు అనుకుందాము. ఒక్కో విడిభాగం లక్ష ఖరీదు చేస్తే, ఒక్కో లక్ష పై పది శాతం అంటే పదివేల పన్ను కడతారనుకుందాము. మూడు విడి భాగాలకీ కలిపి 3లక్షలు మరియు పన్ను రూపంలో మరో ముప్పైవేలు వెచ్చించారన్నమాట. TATA వారు మరో లక్ష విలువైన వారి స్వంత విడి భాగాలని కలిపి కారుని తయారుచేశారనుకుంటే కారు పూర్తి విలువ ఇప్పుడు 4 లక్షల ముప్ఫై వేలు! ఈ కారు మార్కెట్లోకి రావటానికి వినియోగదారుడు… 4 లక్షల ముప్పైవేలు + పన్ను (10%) భరించవలిసి ఉంటుంది. దీనిలో దాగున్న గూడార్థం, ఉత్పత్తిదారుడు చెల్లించిన ముప్పైవేల పన్నుపై వినియోగదారుడు గొలుసుకట్టు రూపంలో మళ్ళీ పన్నుచెల్లిస్తున్నాడు. ఇప్పుడు తెస్తున్న కొత్త GST చట్టంలో ఇది పూర్తిగా ప్రక్షాళింపబడుతుంది. ఉత్పత్తిదారుడు చెల్లించిన పన్నుకి మినహాయింపుని ఇస్తూ తుది వెల నిర్ణయింపబడుతుంది. అంటే...పై ఇండికా కారు ఉదాహరణలో ఆ విడిభాగాల కోసం 3లక్షల పై TATA వారు ఇదివరకే పన్నుచెల్లించారు కనుక, వినియోగదారుడు కేవలం ఒక లక్ష పై పన్నుకడితే సరిపోతుంది. పైన పేర్కొన్న కారు యజమాని మారిన ప్రతీసారి, ఈ గొలుసుకట్టు పన్ను నుంచి వినియోగదారుడికి విముక్తి లభిస్తుంది. ఇది కేవలం మన జేబుకి పడుతున్న చిల్లుని పూడ్చటమే కాకుండా ధరల స్థిరీకరణతో వినియోగదారుడి కొనే సామర్థ్యం పెరగటం, దాని పరిణామంగా ఉత్పత్తి ఊపందుకోవటం, దేశ ఆర్థిక ప్రగతి పట్టాలెక్కటం ఖాయం!
అవినీతి. ఈ జాఢ్యం ఉగ్గుపాలతో మనం అణువణువునా జీర్ణించుకుని తగినంత అనుభవిస్తూ...వీలయినంత పంచుతూ...తరతరాలుగా వర్ధిల్లుతూనే ఉన్నాము. మనతో ఇంతలా పెనవేసుకున్న అవినీతి జాడ్యాన్ని మన త్రిశూలం ఎలా ఛేదిస్తుందో చూద్దాము.
పైన పేర్కొన్న విధంగా ఇప్పుడు ప్రతీ ఉత్పత్తిదారుడు విధిగా తాను కొనుగోలు చేసే ప్రతీ విడిభాగానికి సంబంధించి పన్ను రశీదు ప్రభుత్వానికి నివేదించవలసి ఉంటుంది. దీంతో ప్రతీ ఉత్పత్తిదారుడు స్వయం నియమిత పన్ను అధికారిగా మారనున్నారు (Self-Policing). తన వస్తువు అత్యంత కనిష్ట ధరకి అమ్మబడుటకు ఉత్పత్తి దారుడు విడిభాగాల సంస్థలని పన్ను రశీదులు అడగటంతో...ఒక సంస్థతో పని చేసే మిగతా అన్ని సంస్థలూ (ఉదాహరణకి విడిభాగాల ఉత్పత్తి దారులు) విధిగా పన్నులు చెల్లించటం ద్వారా ప్రభుత్వాదాయం పెంచబడుతుంది.
ఇక రెండవ అంచెలో ఇదే క్రమాన్ని వినియోగదారుడికి వర్తింపచేయనున్నారు. మీరు సంవత్సరంలో వివిధ వస్తుసేవలపై చెల్లించిన పన్నులని మీ సంవత్సరాంతంలో మీ రాబడిపై ప్రభుత్వానికి చెల్లించే పన్నుకి జతచేస్తే...పన్నురాయితీ (Tax Exemptions) పొందే అవకాశం కల్పించనున్నారు. ఇప్పుడు మీరు కొనే ప్రతీ వస్తువుపై ఖచ్చితంగా రశీదు తీసుకుంటారు కదా. దాంతో, మీరే కాకుండా మీ దుకాణదారు కూడా పన్ను చెల్లించవలిసిందే!
అపారదర్శకత. ఇది మన మూడవ అంశం. ఒక వస్తువు తయారు చేయటం నుంచి, దాని తుది వినియోగం అంటే పైన పేర్కొన్న కారు ఉదాహరణలో ప్రతీ విడిభాగంపై చెల్లించిన పన్ను, వివిధ దశలలో విభిన్న వ్యక్తులు/సంస్థల నుండి మరలా మరలా...ప్రభుత్వం వద్ద పన్ను వివరాలు సమర్పిస్తూ ...ఆ లెక్కల ఖచ్చితత్వాన్ని మరియు పారదర్శకతని నిర్వచిస్తున్నాము. అంతే కాదు దీనిలో ఇంకో కోణం దాగుంది. ఒక వస్తువుపై ఒకేసారి పన్ను విధించే ఈ విధానంతో ప్రతీసారీ రాష్ట్ర సరిహద్దు దాటే సమయంలో మరలా మరలా పన్ను కట్టాల్సిన అవసరముండదు. మనం తరచుగా వింటున్న ఆంధ్రా-తెలంగాణాల మధ్య ఏర్పడ్డ అంతర్రాష్ట్ర పన్ను సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. ఒక రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే ఇక మరే రాష్ట్రంలోనూ పన్ను చెల్లించాల్సి ఉండదు.
ఈ ముఖ్యమయిన మూడే కాకుండా అత్యవసర వైద్య సేవలపై పన్ను మినహాయింపు, అతి పేద వర్గాలకి పన్ను రాయితీలు, సంపన్న వర్గాలకి అధిక వడ్డింపులు ...ఇలాంటి ఎన్నో ఆసక్తికరమయిన అంశాలు తెరమీదకి రానున్నాయి. ఉలిదెబ్బలకి ఓర్చుకుంటే కానీ శిల్పం తయారవనట్టు... ఆర్థికశిల్పులు రూపుదిద్దుతున్న ఈ త్రిశూలం ఎన్నో ఒడిదొడికులని ఎదుర్కొని సవ్యమైన దిశలో ప్రయోగించబడి వ్యవస్థీకృతమైన చీడని తొలగిస్తూ... భారతదేశ ఆర్థిక వ్యవస్థని పరిపుష్ఠం చేస్తుందని ఆశిద్దాము.
ఇక రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఈ విధానంతో ధరల స్థిరీకరణ సాధ్యమయ్యే అవకాశం పుష్కలంగా ఉంది కనుక...మరి ఎంతో ప్రజాకర్షకమైన ‘ధరల పెరుగుదల’ లాంటి అస్త్రాన్ని కోల్పోయే అవకాశం ఏ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం వదులుకుంటారు? అదేదో సినిమాలో " లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా" అన్నట్టు... ఈ స్థిరీకరణలాంటి క్రెడిట్ అధికారపక్షానికి దక్కటంలో ఇతర ప్రతిపక్షపార్టీలు ఎందుకు సహకరిస్తాయి?! అందుకే దీన్ని అడ్డుకోవటానికి శతవిధాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి.
రాజకుటుంబాన్ని కోర్టులు ప్రశ్నిస్తే అదేదో దేశసమస్యగా మారుస్తూ పార్లమెంటుని స్థంభింపజేయటంలో గూడార్థం ఇదే! ఈ రాజకీయ కోణాలన్నీ మరియొక వ్యాసంలో చర్చిద్దాము!
అన్ని బాలారిష్టాలని దాటి వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనో లేదా మరే పార్లమెంటు సమావేశాల్లోనయినా ఇది చట్ట రూపం దాల్చితే మాత్రం మన దేశానికి ''అచ్ఛేదిన్' వచ్చేసినట్టే!
****