MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
పాండి బజార్ కథలు - 5
మనసు 'పరిమళిం'చెనే
భువనచంద్ర
గంటన్నరనించీ ఆలోచిస్తున్నాడు సంజయ్.
రేపు జనం ఏమంటారు? పగలబడి నవ్వుతారా, చీ అంటూ మొహం తిప్పుకుని వెళ్లిపోతారా?" అని.
చుట్టూ చూశాడు. చిన్న నవ్వు. 'హు. ఇదే గది. ఇక్కడే కలిసింది. ఇక్కడే ఎన్నో కబుర్లు చెప్పుకున్నదీ. కలలు గన్నదీ. ఏవీ? ఆ కౌగిలింతలేవు. ఆ ముద్దులేవి? జ్వాలల్లాంటి ఆ ఉఛ్ఛ్వాస నిశ్వాసాలేవి?"అన్నీ జ్ఞాపకం తెచ్చుకుని మళ్లీ తల వంచుకున్నాడు.
మొబైల్ మోగింది. సత్యారావు. "హలో" అన్నాడు.
"సంజయ్. నేను విన్నది నిజమేనా?" సత్యారావు గొంతులో ఆశ్చర్యంతో కలిసిన ఆవేదన.
"నిజమే!" నిర్లిప్తంగా అన్నాడు సంజయ్.
"పోనీ. నేను వెళ్లి ప్రయత్నించనా?"
"వద్దు సత్యా. మనిషికి నమ్మకం వుండాలి. అది పోయాక ఇంకేమీ మిగలదు. ప్రయత్నాలు చేసేది అనుకున్న పని నెరవేర్చడం కోసం. అతకని మనసుల్ని
ప్రయత్నాలు చేసి అతికించలేము. ఇప్పటికి చాలాసార్లు ఇదే డ్రామా జరిగింది. ఇక వద్దు." ఓ నిర్ణయంతో అన్నాడు సంజయ్.
"సరే. ప్లీజ్ బేబీ కూల్ అండ్ బ్రేవ్." నిట్టూర్చి అన్నాడు సత్యారావు.
తలుపు తట్టిన చప్పుడు. తీస్తే మధురనాయగం ఉన్నాడు. ఆయన ఇంటి ఓనరు. "ఎప్పుడు వస్తిరి మీరు. తాళందా తీసి వుండాది. అందుకుదా తలుపు తడితిని."
పళ్ళన్నీ కనిపించేట్టు నవ్వుతూ అన్నాడు మధురనాయగం.
"రాత్రి వచ్చాను సార్." నవ్వీ నవ్వనట్టుగా మొహం పెట్టి అన్నాడు సంజయ్.
"మీరు గ్రేట్ సార్. ఒక్కరోజు రూములో లేకపోయినా మూడు వర్షమా రెంట్ కడ్తనే వుండారు. సిన్సియర్‌గా పే సేస్తానే వుండారు. సరే. అందమ్మా వరిల్లియా?" కుతూహలంగా అన్నాడు మధురనాయగం.
"పుట్టింటికి వెళ్ళింది" చిన్నగ నవ్వి అన్నాడు. మధురనాయగం పోలీసు కుక్కలాంటోడు. ఏ చిన్న ఎక్స్‌ప్రెషన్ తేడా వచ్చినా వాసన పట్టేస్తాడు.
"ఆమా. రొంబ హేపీ న్యూస్ సారూ. డెలివరీ ఎప్పూ?" పళ్లికిలిస్తూ అన్నాడు.
"6th"నవ్వు నటిస్తూ అన్నాడు.
"వేరీగుడ్. పోయివస్తును. ఏమన్నా వేణుమన్న ఆంటీ లోపల వుండాది. పోయి అడగండి" మద్రాసుకి ప్రత్యేకమైన తమిళ తెలుగులో అన్నాడు మధురనాయగం.
అది ఆనందన్ స్ట్రీట్. సంజయ్ జీవితం మొదలైంది అక్కడే. ఆ చిన్న గదిలోనే సత్యారావు, వెంకటరమణ, సంజయ్ ఉండేవాళ్లు. సత్యారావు సీనియర్. అతను టాప్ డైరెక్టర్ దగ్గర అసొసియేట్‌గా వుంటున్నాడు. ఫేమిలీ నాయుడుపేటలో వుండేది. మద్రాసులో ఫేమిలీని పెట్టుకుని పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలంటే అసొసియేట్ డైరెక్టర్ గిరీ చాలదు. అదీగాక సొంత వూళ్ళో మంచి ఇల్లూ, వ్యవసాయం ఉన్నాయి. తల్లినీ, తండ్రినీ చూసుకుంటూ ఉంది భార్య. అందుకే సత్యారావు నిశ్చింతగా వున్నాడు.
సంజయ్ ఆ గదిలోనే చేరిన మూడోనెల్లో సత్యాకి డైరెక్టరుగా ప్రమోషనొచ్చింది. ఆ సినిమాకే సంజయ్‌నీ, రమణనీ అసిస్టెంట్స్‌గా తీసుకున్నాడు సత్యా. పిక్చర్ హిట్.
ఆ తరవాత చకచకా ఆరు సినిమాలు వరస హిట్లయ్యాయి. సత్యా కోడంబాకంలో ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయాడు. రమణకి మళయాళం బాగా వచ్చు. దాంతో అతను మళయాళ సినిమా పరిశ్రమలో డైరెక్టరుగా నిలదొక్కుకున్నాడు. మద్రాసులొ ఓ ఇల్లు, కొచ్చిలో ఓ ఇల్లు కొని వెళ్ళిపోయాడు. సంజయ్ కూడా డైరెక్టరయ్యాడు. అతని సినిమాలు ఆలోచింపచేస్తాయి. అందువల్ల మేధావి వర్గం మాత్రమే చూస్తుంది.
"మనక్కావలసింది మేధావి వర్గం కాదు. ఫక్తు మాస్" అని సత్యా చాలాసార్లు చెప్పినా సంజయ్ తన పద్ధతి మార్చుకోలేదు.
అయితే సంజయ్‌ని ఫిలిం ఇండస్ట్రీ మేధావిగా గుర్తించింది. ఏ సెమినార్లు జరిగినా, ఫిలిం ఫెస్టివల్స్ జరిగినా, నంది బహుమతులు ఎంపిక అయినా అతన్ని ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తారు. కమర్షియల్ సినిమాలు అరుదుగా చేసినా, రాష్టం తరఫు నించి ప్రత్యేక చిత్రాలు (ప్రగతి, ప్రణాలికల గురించి) బాగా తీశాడు సంజయ్.
"అమ్మయ్యా.. నువ్వొచినావు.. సంజూ. పూడ్చిన నా ఊపిరి తిరిగొచ్చినాది."లోపలికొస్తూ అన్నది పరిమళం. మధురనాయగం రెండో భార్య ఆవిడ. ముప్ఫై ఆరేళ్ళుంటాయి. పెద్ద పెద్ద కళ్ళు. చూపులు అయస్కాంతంలా వుంటాయి.
"తిరిగొచ్చాను. అవును. మామీ" అన్నాడు సంజయ్. "మామీ అనొద్దు. పరిమళా అని కూపుడు" చాపమీద కూర్చుంటూ అన్నది. ఆమె వొంటి మీంచి పసుపు, సీకాయ కలిపిన పరిమళం వొస్తున్నది.
"ఏమయింది? చెయ్యి మీద చెయ్యి వేసి అన్నది పరిమళం. సంజయ్‌కి దుఃఖం తన్నుకొచ్చింది. బొటబొటా కన్నీళ్ళు కారసాగాయి.
"అరె..దా!" గభాల్న అతని తలని గుండెలమీదకి లాక్కుని తల నిమరసాగింది పరిమళం. చాలాసేపు పొట్ట ఎగిరెగిరిపడేట్టు ఏడుస్తూనే వున్నాడు సంజయ్.
పరిమళం వేళ్ళలోంచి అనంతమైన ప్రేమ ప్రవహించి అతని జుట్టుని శాంతితో నింపుతోంది.
స్త్రీ...! ఎంత గొప్పది. ఎంత చెడ్డది. ఎంత ప్రేమస్వరూపి. ఎంత హింసామూర్తి. అన్నీ స్త్రీలోనే. ఏడ్పించగలదు, నవ్వించనూ గలదు. గుండెనిండా ప్రేమించనూ గలదు. నిర్దాక్షిణ్యంగా సమ్మెటతో రాయిని పగలగొట్టినట్టు గుండెని పగలగొట్టి ముక్కలుగానూ చెయ్యగలదు.
ఒక ఆడది చేసిన గాయాన్ని సృష్టిలో ఎవ్వరూ మార్పలేరు.. మరో ఆడది తప్ప.
మెల్లగా తల ఎత్తి.. "థాంక్స్" అన్నాడు సంజయ్.
"అయ్యో.. ఎందుకబ్బా.. ఒకరి కష్టానికి ఒకరు తోడు. హాయిగా పండుకో. టిఫిను పంపిస్తును" లేచి లోపలికి వెళ్ళింది పరిమళం. అందమైన మనిషి తను. కానీ ఆ
అందం అడవి గాచిన వెన్నెల. మధురనాయగం పెద్ద కూతురికి అంటే మొదటి భార్య కూతురికి పరిమళ వయసే వుంటుంది. ఆ కూతురికి ఇద్దరు కొడుకులు. వాళ్లలో ఒకడు మలేషియాలో, ఇంకోడు సింగపూరులో స్థిరపడ్డారు.
పరిమళం సినిమా పిచ్చితో త్రిచూర్ నించి మద్రాసొచ్చింది. వాళ్ల అక్క వుండేది మద్రాసులోనే. బావ అశోక్ లేలాండ్‌లో మెకానికల్ ఇంజనీర్. పరిమళం సినిమా వేషాలకోసం వచ్చిందని అతనికి తెలియనంత కాలం బాగానే గడిచింది. తెలిసిన మరుక్షణం ఆమెకి ఓ వెయ్యి రూపాయలిచ్చి "సినిమా పిచ్చికి నా ఇంట్లో చోటు లేదు. త్రిచూర్‌కి వెళ్లి చక్కగా పెళ్లి చేసుకుని సంసారివౌతావో, ఆ మద్రాసు సినిమా బురదలో పందిలా దొర్లుతావో నీ ఇష్టం. సినిమాని కోరుకుంటే మాత్రం ఏనాడూ నా గుమ్మం తొక్కకు"అన్నాడు. ఎలా చేరితేనేం ఎక్‌స్ట్రా సప్లయర్ మధురనాయగం గ్రూపులో వచ్చి పడింది. చూడగానే గ్రహించాడు. ఆ పిల్ల ఇంకా శీలాన్ని పోగొట్టుకోలేదని. అప్పటికే మొదటి భార్య గతించి రెండేళ్ళయింది.
"నైటుకి పదివేలిచ్చే శేఠ్ ఒకాయనున్నాడు. ఒప్పుకుంటావా? ఎక్‌స్ట్రా వేషాలలో ఏముంటుందీ?" అని అడిగాడు.
"చచ్చినా ఒప్పుకోను. మర్యాదకోసం మాడైనా చస్తాను గానీ పడుపు కూడు తినను" స్థిరంగా అన్నది పరిమళం.
"అయితే బయటెక్కడా వుండొద్దు. మా యింటికి పద. నా పెద్ద కూతురిది కూడా నీ వయసే. నా దగ్గరుంటే నిన్నెవరూ కన్నెత్తి చూడరు." అని ఆఫరిచ్చాడు. వచ్చింది.
మధురనాయగం ఏనాడూ ఆమె మీద చెయ్యి వెయ్యలా. పదేళ్లలో అతని కూతురూ, కొడుకులూ సెటిలై వెళ్లిపోయారు.
"నేను పెద్దాణ్నయిపోయాను. నువ్వెవరినైనా ప్రేమించినా పెళ్ళి చేసి పంపిస్తా" అన్నాడోనాడు.
"ఇన్నేళ్ళు ఇక్కడున్నాక నేను శీలవతిని ఎవడు అనుకుంటాడు. వద్దు అయ్యా. ఆ కట్టే పసుపుతాడు నువ్వే కట్టు"నవ్వి అన్నది పరిమళం.
ఆవిడ జీవిత కథ అంతా ఓ నాడు సంజయ్‌కి చెప్పింది. సంజయ్ ఆ గదిలో వున్న మూడేళ్ళలోనూ పరిమళంలో ఏ మచ్చా చూడలేదు. గొప్ప మానవత్వం వున్న
మనిషి. సరదాగా 'మామీ' అంటే మాత్రం "ఒద్దబ్బా' అంటుంది.
మరో గంటకి మూడు 'అడ'లు, సాంబారు, తక్కాలి (టొమాటో) చెట్నీ తెచ్చి దగ్గరుండి తినిపించింది పరిమళం.
"ఇప్పుడు చెప్పు. ఏమి జరిగినాది?" అన్నది.
*****
లావణ్యలో అద్భుతమైన అకర్షణ వుంది. ఆ ఆకర్షణనే గాక అందమని అందరూ అనుకుంటారు. మత్తుగ, మెత్తగా తగిలే చూపు, విచ్చీ విచ్చని గులాబిపువ్వురెక్కలాంటి పెదాలూ, ఏ మాత్రం కదిలినా అందంగా కదిలే లోలాకులూ, తళుక్కున మెరిసే పలువరుసా, కదిలితే చాలు చిలిపి అలలా వొంపులు తిరిగే వయసు భారాలూ. ఆమెని ఒక్కసారి చూస్తే జన్మలో మరువనివ్వవు. ఆవిడకి ప్రత్యేకంగా దేవుడిచ్చిన వరం మరోటి వుంది. అది ఆమె స్వరం. మామూలుగా అయితే అత్యంత పరుషంగా, అధికారికంగా ధ్వనించే ఆమె సహజ స్వరం, ఎవరి ముందైనా మాట్లాడేటప్పుడు మాత్రం తేనే, పంచదార కలబోసినంత తియ్యగా, బూరుగు దూదంత మెత్తగా మారిపోతుంది. లావణ్య తండ్రి ఓ మాదిరి పోయట్రీ వున్నవాడు. అయితే లావణ్య మాత్రం "మా డేడీ లాండ్‌లార్డ్' అనే అంటుంది.
ఆయనో అమాయకప్పక్షి.
అడిగినంతా కూతురికి అప్పోసప్పో చేసి పంపడం మాత్రమే తెలుసుగానీ, ఆ పంపిన డబ్బుని కూతురు ఏమి చేస్తుందో అడిగే తెలివి ఆయనకి లేదు.
సత్యారావు తీసిన అయిదో సినిమా 'వాంచ' సమయంలో షూటింగ్ చూడ్డానికి స్నేహితులతో వచ్చింది లావణ్య. లావణ్యదీ నాయుడుపేట దగ్గరి వూరే.
సంజయ్‌ని చూసిన వెంటనే ప్రేమించింది. ఎంత గాఢంగా అంటే, ఓ సునామీ వచ్చి తీరం మొత్తాన్ని ముంచేసినంతగా. ఒక విధంగా చెప్పాలంటే లావణ్య
సంజయ్‌ని మనస్ఫూర్తిగా ప్రేమించడం కన్నా, ప్రేమించాననే భావాన్ని ఎక్కువగా ప్రేమించింది. ఆ విషయం ఆమెకీ తెలీదు. తెలియకపోవడం, అసలు ఏ మాత్రం ఆలోచించకపోవడం ఆవిడ నైజం.ప్రేమకి ఏ హక్కులూ, ఏ బాధ్యతలూ వుండవు. పెళ్లయిన మరుక్షణం ప్రేమకంటే ఫాస్టుగా ఎదిగేవి హక్కులూ, బాధ్యతలే.
సత్యారావు, అతని భార్య సుందరి దగ్గరుండి మరీ జపించారు సంజయ్ వివాహాన్ని. సత్యా కొత్తగా కొన్న 'వడపళని' ఇంట్లోనే లావణ్య, సంజయ్‌ల సంసారం మొదలైంది. పెళ్ళైన రెండో నెలలోనే సంజయ్ తీసిన ఓ డాక్యుమెంటరీ ఫిలింకి నేషనల్ అవార్డు రావడంతో, లావణ్య 'లక్'ని వెంట తెచ్చిందని జనలూ, పత్రికలూ తెగ పొగిడేశాయి. రావడానికి నేషనల్ అవార్డు వచ్చినా, ఫైనాన్షియల్ పొజిషన్ అంతంత మాత్రమే.
ఏడాదికేడాది సత్యరావు, రమణల సంపాదన పెరగడం, సంజయ్‌ది ఎక్కడ వేసిన దుప్పటి అక్కడే వుండడంతో లావణ్యకి అసహనం మొదలైంది. ఆ అసహనం కాస్తా అసహ్యంగా మారడానికి ఎన్నో నెలలు పట్టలేదు.
"నువ్వు తీసే బొచ్చు డాక్యుమెంటరీలు చూసే వెధవ ఎవడూ? పద్ధతి మార్చుకో. ఫక్తు కమర్షియల్ తీసి నీ దమ్ము చూపించు. ఏడుపుగొట్టు సినిమా తీస్తే ఎవడికి లాభం?" రోజుకి కనీసం పది సార్లయినా సంజయ్ గుండెల్లో తూట్లు పొడీచినట్లు మాటల తూటాలు పేల్చేది. చివరికి ఎంతదాకా అంటే, "నువ్వో పనికిరాని వెధవి. నీకంటే మా పాలెగాడ్ని చేసుకున్నా బావుండేది" అనేవరకూ. ఆవిడ అలిగి వెళ్లిపోవడాలూ, వాళ్ల నాన్న గోడు భరించలేక సత్యారావు, సుందరీ సంధి ప్రయత్నాలు చేసి ఏదో విధంగా సంసారం నిలబెట్టడాలూ అయిదారుసార్లు జరిగాయి. ఏం జరిగిందో ఏమో, రెండు మూడు నెలల్నించీ ఆమె సణుగుడు మానేసింది. శ్రీలంకలో ఓ డాక్యుమెంటరీ తీయడానికి వెళ్లాడు సంజయ్. కొత్తగా బయటపడ్డ రావణగుహ వంటివాటిని తీయడానికి.
తిరిగొచ్చేసరికి లావణ్య సినిమాల్లో సెకండ్ హీరో వేషాలేస్తున్న ప్రేమ్ కిరణ్ చేతుల్లో కనిపించింది. నిర్ఘాంతపోయిన సంజయ్ మొహం మీదే "నువ్వు మనిషివి కాని మగాడివీ కావు. మనిషనేవాడికి ఎదగాలనే తాపత్రయం వుండాలి. మగాడికైతే ఆడదానికేం కావాలో గ్రహించి అలా నడుచుకునే నేర్పుండాలి. నువ్వో జీరోగాడివి. ఇదిగో.. నువ్వు కట్టిన మాంగల్యం. హా.హా. మాంగల్యం తెంచనా. నిన్ను వెర్రివెధవను చేయనా" అంటూ కిరణ్‌తో బెడ్‌రూంలోకి నడిచింది.
ఎందుకు వుంచాడో ఏమో, తన స్నేహానికి, ప్రేమకి గుర్తుగా ఆ రూంకి మూడేళ్ళుగా అద్దె కడుతూ, తన కిందే వుంచుకున్నాడు సంజయ్. ఇవ్వాళ మళ్లీ ఆ రూమే అతనికి ఆశ్రయం ఇచ్చింది.
మొన్నటివరకూ లావణ్యదీ, తనదీ అతకని మనసులు. తాడు చేతికిచ్చాక ఇంకేం బాంధవ్యం మిగిలిందీ? అసలామె తనకి ఏమవుతుందీ?
****
కన్నీళ్ళతో అతన్ని చూస్తోంది పరిమళం. "సంజూ. బాధపడక. ఆడదాని మనసు అడివిలాంటిది. దాన్ని అదే కాల్చుకుంటుంది. నువ్వు బాధపడక. నువ్వు పుట్టినప్పుడు ఆమె లేదు.నువ్వు యీ గదికి వచ్చినపుడు ఆమె లేదు. నువ్వు పైకొచ్చేటప్పుడు ఆమెవల్ల నీకు ఏ లాభమూ లేకపోగా హింసే మిగిల్చింది. ఇప్పుడు నిన్ను వొదిలిపోయి నీ నెత్తిన పాలు పోసింది. లే. హాయిగా తిరుగు. ఆడదానికి లేని మానం మగాడికెందుకు. నువ్వు నవ్వుతా వుండాల. లే. పోయి తిరిగిరా. బయట తినొద్దు సరేనా" గుడిగంట కొట్టినట్టు ధైర్యం చెప్పింది పరిమళం.
ప్రతీ కథకీ ఓ మలుపు ఉంటుంది. ఉండకపోయినా రచయితలు మలుపుల్ని సృష్టిస్తారు. నేను సాక్షినేగానీ మలుపుల్ని సృష్టించే రచయితనిగాను. 'మేధావి' వర్గం సెమినార్లలో బల్లగుద్ది వాదిస్తోంది. కథకీ ఓ నిర్వచనం ఉందనీ, కథకులు దాన్ని ఫాలో కావాలనీ, ఎత్తుగడా, నడకా, ముగింపూ వంటివి అద్భుతంగానూ, పాఠకుడ్ని మైమరపించే విధంగానూ వుండాలనీ, అసలు కథకంటూ ఓ ప్రత్యేకతా, ఓ ప్రయోజనమూ ఉండాలంటారు.
అయ్యా.. అవేమీ నాకు తెలీదు. పట్టదు కూడా. నాకు తెలిసింది ఏమంటే, తెలిసినదాని గురించి మాత్రమే చెప్పడం. లావణ్య అలా ఎందుకు మారిందీ అనే విషయాన్ని విశ్లేషించాలంటే ఓ నవల తయారవుతుంది. అంతగా ఆవిడ మనో విశ్లేషణ చేసినా, పాఠకుడికి వొరిగేదేముందీ? అందుకే నాకు తెలిసింది చెపుతున్నా. కాలప్రవాహం నడుస్తూ నడుస్తూ మధురనాయగాన్ని తనతో తీసికెళ్లిపోయింది. ఆ తరవాత మాత్రమే తనకంటే కొన్నేళ్ళు చిన్నవాడయిన సంజయ్‌ని పరిమళ వివాహమాడింది. అదీ సంజయ్ బలవంతం మీదే. వైద్యంలో వచ్చిన విప్లవం వల్ల సరైన వైద్యురాలి పర్యవేక్షణలో ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది. వాళ్లలో ఒకడి పేరు మధురనాయగం. ఆ పేరు పెట్టింది సంజయే.
ఇప్పుడు సంజయ్ టాప్ క్రియేటివ్ డైరెక్టర్లలో వున్నాడు. లావణ్య కొట్టిన దెబ్బ అతడి ప్రయోనాత్మక వైఖరిని కాల్చి పారేసి, కమర్షియల్ డైరెక్టరుగా నిలబెట్టింది. ఇప్పుడు పరిమళం, సంజయ్‌లు సకల సౌకర్యాలతోటీ సంతోషంగా వున్నారు. లావణ్య ప్రేమ్ చరణ్‌ని వదిలేసి, మరో పెద్ద హీరో ఇలాకాలో కొంతకాలం వుండి ఆ తరవాత ప్రస్తుతం దుబాయిలో ఉంటోంది. 'వేరీ రిచ్ ఇండియన్ లేడీ' అంటుంటారట ఆమెని. ఇంతకీ యీ జీవితాలు ఎవరికేమిచ్చాయి.?
లావణ్యకి ధనలాభాన్నీ, లగ్జరీనీ ఇచ్చింది ఆమె జీవితం. సంజయ్ జీవితం సంజయ్‌కి ఉండే క్లాస్ తుప్పుని వొదిలించి మాస్ డైరెక్టర్‌షిప్పునీ, ప్రశాంత నదిలాంటి పరిమళనీ ఇస్తే, పరిమళ జీవితం పరిమళని ఓ ప్రేమ నిండిన ఒడ్డుకు చేర్చింది. అంతే కాదు బంగారు బొమ్మల్లాంటి ఇద్దరు పిల్లల్నీ, గొప్ప భర్తనీ ఇచ్చింది.
మధురనాయగం మరో జన్మకి తన 'పేరు'ని నిలబెట్టుకుని, మంచితనానికింకా లోకంలో చోటుందనీ, ఆ మంచితనానికి 'కృతజ్ఞత' అనే బహుమతి లభించి తీరుతుందనీ తన జీవితం ద్వారా లోకానికి రుజువు చేశాడు.
సత్యారావు - రమణల స్నేహానికున్న విలువను, తమ జీవితాల ద్వారా లోకానికి చాటారు.
ఈ కథ కథకుడిగా నాకూ ఓ బహుమతినిచ్చింది. సంజయ్ ఓ నాడు నాతో అన్నాడు. "భయ్యా.. పనిచేసి ఇంటికెళ్లి పరిమళ ఒళ్ళో కనీసం ఒక్క నిముషమైనా పడుకుంటా. ఆమె చూపులు అప్పుడు అమృతపు చినుకుల్లా నా మీద కురుస్తాయి. ఆమె నాకు దేవుడిచ్చిన వరం కాదు. మధురనాయగం ఇచ్చిన వరం. నేను పరిమళలో చూస్తున్నది ఏమిటో తెలుసా? స్త్రీత్వం అనబడే సంపూర్ణ దైవత్వాన్ని" అని.
అతను స్త్రీ గురించి అన్న ఆ ఒక్క చివరి మాట చాలదూ. చెవులు తరించడానికి. చుట్టూ చూడండి. స్త్రీత్వం వున్నవారు స్త్రీలల్లో ఎంతమంది వున్నారూ???
స్త్రీ అంటే ప్రేమ. స్త్రీ అంటే కరుణ. స్త్రీ అంటే శాంతి. స్త్రీ అంటే జాలి. స్త్రీ అంటే సహనం. స్త్రీ అంటే స్వర్గం. సర్వం అన్నీ. కానీ. స్త్రీత్వం లేని స్త్రీలు పురుషుడికి చూపించేది నరకం మాత్రమే. అలాగే పురుషుల్లో పురుషులెంతమందీ?
ఒక్కమాట చెప్పనా. నేను చూసినవారిలో స్త్రీ అంటే 'పరిమళ’ లోకంలోని పరిమళలందరికీ చెయ్యెత్తి నమస్కరిస్తూ.
మళ్లీ కలుద్దాం.
-భువనచంద్ర.
Tags, Bhuvana Chandra, Pandey Bazaar Kathalu, madhuravani telugu magazine, Telugu Film Industry, TFI