MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
పాండి బజార్ కథలు - 12
నేను
భువనచంద్ర
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
న్యాయాన్యాయాలు నాకు తెలీవు. తెలిసినా వాటివల్ల నాకేమీ వుపయోగమూ లేదు. న్యాయం, ధర్మం, ఇవన్నీ చేతకాని దద్దమ్మలు వాడే పదాలని నా అభిప్రాయం.
ఎదగలేని వాడు ఎన్నో సాకులు చెబుతాడు. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, సత్యాసత్యాలు ఇలా ఏకరువు పెట్టి ఉన్నచోటే వుండిపోతాడు. ఎదగాలంటే దమ్ముండాలి. నాలా!
విశాల్, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. విశాల్ నిజంగా మంచివాడు. చాలా మంచి కుటుంబం నించి వచ్చాడు. నడకలోనూ, నడతలోనూ కూడా సంస్కారం ఉట్టిపడుతూ వుండేది. పాండీబజార్ గీతాకేఫ్ లో కాఫీ తాగుతూ నాకు పరిచయం అయ్యాడు. నేను వెళ్ళింది మంచినీళ్లు తాగడానికి. అతని ఎదురుగుండానే కూర్చొని గ్లాసునిండా టేబుల్ మీద పెట్టి వున్న మగ్ లోంచి నీళ్లు వొంపుకుని తాగాను. అతను కాఫీ ఆర్డరిచ్చాడు. నేను సర్వర్ తో కాఫీ చెప్పబోయి ఆగిపోయాను.
“కాఫీ తాగరా?” చిరునవ్వుతో అన్నాడతను.
“తాగాలనే వుంది. కానీ పర్సు మర్చిపోయాను” జవాబిచ్చాను.
“పరవాలేదు డబ్బు నేను ఇస్తాను” సిన్సియర్ గా అని, సర్వర్ ని పిలవబోతుంటే అతన్ని ఆపి, “కాఫీ తాగాలంటే ముందు టిఫిన్ తినాలి. దానిక్కూడా బిల్లు మీరు పే చేయగలరా?” అన్నాను.
“అలాగే” నవ్వాడు.
నాడు గీతాకేఫ్ లోనే మహా మహా వాళ్లంతా టిఫిన్ చేసేవాళ్ళు. ఘంటసాల గారి దగ్గర్నుంచీ, CSR గారి దగ్గర్నుంచీ, అందరు గీతాకేఫ్ కాఫీ చప్పరించిన వాళ్లే. టిఫిన్లు కూడా చాలా బావుంటాయి రెండిడ్లీ ఒక గారె, ఓ ప్లేటు పూరీ, ఓ మసాలా దోస, చాలా లిబరల్ గా చట్నీ సాంబార్ లతో తిని చివరగా కాఫీ తాగాను. అతను మాత్రం కాఫీ దగ్గరే ఆగాడు.
బయటకి వచ్చాక అడిగా, “బ్రదర్ మీ పేరేమిటి?” అని.
“విశాల్” అన్నాడు నవ్వుతూ. నవ్వు అతనికో ఆభరణం. ఆడవాళ్లు మాత్రమే నవ్వితే బాగుంటారనే దురభిప్రాయం వుండేది నాలో. విశాల్ ని చూసి ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నా.
“ఏం చేస్తారూ?” అడిగాను.
“సినిమా వేషాలకి ప్రయత్నిస్తున్నా”
“ఓహో, ఎక్కడుంటున్నారూ?”
“శివజ్ఞానం స్ట్రీట్లో. మా మామయ్యగారింట్లో”
“సరే. నా పేరు యశ్వంత్. నేనూ సినిమా పక్షినే. చాలా కొమ్మల మీద ఎక్ స్ట్రాగానో, గుంపులో గోవిందయ్యగానో వాలాను. కానీ నమ్మకం మాత్రం దండిగా వుంది. ఏదో ఓ నాడు ఇదే పాండి బజార్లో కారేసుకు తిరుగుతానని.” విశాల్ మొహంవంక చూస్తూ చెప్పాను.
“మీది మంచి ఫేసు. తప్పనిసరిగా మీరనుకున్నది సాధించగలరు” షేక్ హేండిస్తూ అన్నాడు విశాల్.
“థాంక్యూ. ఓ విషయం నేను మీకు చెప్పి తీరాలి. ఏమిటంటే, నేను పర్సు మర్చిపోలేదు. పైసా కూడా లేని ఆ పర్సుని మొయ్యడం ఎందుకని రూమ్ లోనే పడేసి వచ్చాను. ఇలాంటి ‘హౌస్ ఫుల్” బ్రేక్ ఫాస్టు తిని చాలా రోజులైంది. నా టిఫిన్ కోసం మీరు పెట్టిన పెట్టుబడిని ఇప్పట్లో తిరిగి
ఇవ్వగలుగుతానని నేను అనుకోను. కానీ, ధన్యవాదాలు మాత్రం మనఃస్ఫూర్తిగా చెప్పగలను” అన్నాను.
“ఆ విషయం మరిచిపోండి” నవ్వుతూ అన్నాడు విశాల్.
----
నాకు జ్యోతిష్యాల మీదా, రుణానురుబంధాల మీదా ఏ మాత్రం నమ్మకం లేని మాట నిజమే గానీ, పదే పదే విశాల్ ని కలుస్తూ అతనికి రుణగ్రస్తుణ్ణి కావడం మాత్రం నిజాతినిజం.
ఠంచనుగా తొమ్మిదీ నలభై నిముషాలకి అతను గీతా కేఫ్ కి రావడం, ఆ సమయానికి అక్కడే తచ్చాడుతున్న నన్ను చూసి పలకరించడం మామూలైపోయింది.
స్నేహం చిప్పిల్లే గొంతుతో, “టిఫిన్ చేశారా?” అని అతను అడగడం, “ఇంకేమీ నిర్ణయించుకోలేదు” అని నేను జవాబివ్వడం, ఆ తరవాత అతను, “పోనీ నాకు కంపెనీ ఇవ్వండి” అని నన్ను లాక్కెళ్ళి తిన్నంతా టిఫిన్ తినిపించడం ఓ దినచర్యగా మారింది.
అలాంటి ఓ రోజునే అతను చెప్పాడు, “మా నాన్న రిటైర్ మెంట్ విషయం నిన్న చర్చకు వచ్చింది. మరో నాలుగైదేళ్లలో ఆయన రిటైరవుతారు. ఈ లోపుగా నేను ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని ఆయన కోరిక” అని.
“ఆయనేంచేస్తారు” అడిగాను.
“తహసీల్ దార్”
“అయితే బాగా సంపాయించి వుండాలే” అన్నాను.
పకపకా నవ్వాడు విశాల్. అంతలా నవ్వడం అదే మొదటిసారి, ఆ తరవాత, “అంటే మీ ఉద్దేశం బాగా లంచాలు పట్టి వుండాలనేగా యశ్వంత్? కానీ, మా నాన్న లంచాల కోసం చెయ్యి జాచే టైపు కాదు. ఆయనది పెట్టే చెయ్యే కానీ, లంచాలు ముట్టే చెయ్యి కాదు. అదీగాక మా తాత ముత్తాతల ఆస్తి కొంత వుంది మాకు. ప్రశాంతంగా జీవించడానికి అది చాలు.” అన్నాడు.
అప్పుడు అర్థమైంది. సంస్కారం అనేది ‘జీన్స్‘లో వుంటుందని.
కపాలి క్రియేషన్స్ వారు కొత్త నటీనటులతో సినిమా తీస్తున్నారని నాకు తెలిసింది విశాల్ ద్వారానే, ఇద్దరం వెళ్ళాం … సినిమా ఆఫీసుకి. ఓహ్.. వందల మంది జనాలు.
“దర్శకరత్న దాసరి నారాయణరావు ఫైనల్ సేలక్షన్ కి జడ్జిగా వస్తారట.” ఓ మామూల్రావు మిగతా వాళ్ళతో చెబుతున్నాడు.
అది విన్న విశాల్ మహదానందంగా నన్నడిగాడు “యశ్వంత్… అతను చెప్పేది నిజమేనా? అబ్బా ఆయన అన్నా ఆయన సినిమాలన్నా నాకు భలే ఇష్టం” అన్నాడు విప్పారిన కళ్ళతో.
“చూడు విశాల్. ఆ చెబుతున్నవాడు నాకు ఏడాదిగా తెలిసిన వాడే. ఎవడేది చెప్పినా నమ్ముతాడు. అడిగినా అడక్కపోయినా ఆ విషయం అందరికీ చెప్పి, వాళ్ళు నోరు వెళ్ళబెట్టి వింటుంటే మహా ఆనందిస్తాడు. ఆఫ్ కోర్స్, మనిషి మంచివాడే.” అన్నాను. వాడి పేరు మనుబోలు తుమ్మయ్య. సినిమా పేరు తుషార్.
అసంభవాలంటూ ఏవీ వుండవు, ముఖ్యంగా సినీ పరిశ్రమలో. వరసగా మూడు రోజులు సేలక్షన్లు అయ్యాయి. ఫైనల్స్ కి 12 మందిమి మిగిలాం. హీరోయిన్ కేరక్టర్ కి ముగ్గురూ, అతిముఖ్యమైన కమెడియన్ పాత్రకి ఇద్దరూ, హీరో పాత్రకి నలుగురం, హీరో సిస్టర్ పాత్రకి ముగ్గురూ మిగిలాము.
నాకు ఖచ్చితంగా తెలుసు.. హీరో గా విశాల్ ఎన్నికై తీరతాడని. అతనిలో అందం వుంది. అద్భుతమైన అభినయ కౌశలం వుంది. ఒక స్టైల్ వుంది. అన్నిటినీ మించి అందరి మెప్పూ పొందే సంస్కారం వుంది. నా సంగతి వదిలేస్తే మిగతా ఇద్దరూ నటన వరకూ పోటుగాళ్ళే కానీ, మిగతా విషయాల్లో మా ఇద్దరి ముందూ నిలబడలేరు.
అయితే వాళ్ళ వెనక సినీఫీల్డ్ లో కొందరి సపోర్టు వుంది. హీరోయిన్ లుగా నిలబడ్డ వారిలో ‘లేఖ’ కి నూటికి నూరుపాళ్లు చాన్స్ వుంది. అయితే ‘యామీ’ ఓ హీరోయిన్ కూతురు. ఖచ్చితంగా ‘యామీ’ కి ప్రిఫరెన్స్ ఇచ్చి తీరతారు. మూడో అమ్మాయి పేరు ‘సగరి’. ఆ పిల్ల చామనఛాయ. అందం అనేదానికంటే, కనుముక్కు తీరులో చెప్పలేని ఆకర్షణ వుంది. ఎప్పుడూ ఏదో చదువుతూ వుంటుంది.
ఇందాక చెప్పానుగా… అసంభవాలంటూ ఏమీ లేవనీ. దాసరిగారు రావడం అసంభవం అనుకున్నాం. కానీ ఆయన ఫైనల్ సెలక్షన్ కి వచ్చారు. మొదట ఆయన కమెడియన్స్ ని టెస్ట్ చేసి ఒకర్ని ఎంపిక చేశారు. “ఇదిగో ఆనందూ… కనీసం పదేళ్లు నువ్వు ఇండస్ట్రీని ఏలతావు. అహంకారాన్ని నెత్తిన ఎక్కించుకోకపోతే” అన్న కితాబుని అతనికిచ్చారు.
హీరో సిస్టర్ పాత్రకి ఓ తెలుగు బాగా వచ్చిన తమిళ అమ్మాయిని సెలెక్ట్ చేయడమే కాక తన పిక్చర్స్ లో అవకాశం ఇస్తానని కూడా ప్రామిస్ చేశారు.
హీరోయిన్స్ సెలెక్షన్ చాలా క్లిష్టంగా మారింది. లేఖనీ, యామీనీ వెనక్కి నెట్టి చామనఛాయ ‘సగరి’ ముందుకు దూసుకొచ్చింది. కారణం, ఆమె అణువణువునా అభినయం తొణికిసలాడటమే.
హీరో సెలెక్షన్ టైమ్ రాగానే ఆయన లేచి నిలబడి, “ఇవాళ ఏ టెస్టూ నేను చేయదలచుకోలేదు. పదిహేను రోజుల తరవాత చేస్తాను. మీ ‘నటన’ కి పదును పెట్టుకోండి.” అన్నారు. ఇంకొంచెం టైమ్ దొరికింది కదా అని అందరూ సంతోషించారు… నేను తప్ప. ఎందుకంటే, సెలెక్షన్ లు ఎలా వుంటాయో చూడటం ఆ ముగ్గురికీ మొదటిసారి. నాకు మొదటిసారి కాదు.
మరో కారణం ఏమంటే ప్రతిసారీ ‘అసంభవాలు‘ ‘సంభవాలుగా’ రూపు మార్చుకోవు. డాII దాసరి నారాయణ రావుగారికి మంత్రి పదవి వచ్చింది. అదీ కేంద్ర మంత్రిగా. దాంతో హీరో సెలక్షన్ కి వారు జడ్జిగా రాలేకపోయారు. EVV సత్యనారాయణ గార్ని నిర్మాతలు ఆహ్వానించారు గాని, వారు వారి సినిమా ఆఖరి షెడ్యూల్లో వుండడం వల్ల ‘రాలేనని’ కబురు పెట్టారట.
కపాలి క్రియేషన్స్ వాళ్లు బాగా పేరున్న వాళ్లే. కొత్తవాళ్లతో తీయడం ఇదే ప్రథమం గానీ, సినిమాలు చాలానే తీశారు. ఒకటో రెండో హిందీ సినిమాలతో సహా.
అదృష్టం అనేదాన్ని నమ్మాలా వద్దా అని ఓ డిబే టు పెడితే సినిమా వాళ్లంతా నమ్మాలనే వాదిస్తారు.. నేను తప్ప. ఎందుకనేది పాండీ బజార్లో నడిచీ నడిచీ అరిగిపోయిన నేను నా చెప్పులకి కూడా తెలుసు. అట్లాంటిది ఆరోజున నేను అదృష్ట దేవతని కొలిచే అపర భక్తుడ్ని అయిపోయా!
“ముప్పత్తమ్మ” కోవెల అనేది మహా శక్తివంతమైన గుడి. అక్కడే ‘శేఖర్’ కలిశాడు. శేఖర్ అంటే కపాలి క్రియేషన్స్ లో అసోసియేట్ డైరెక్టరు. అతను నాకు బాగా తెలుసు. “యశ్వంత్, పోటీ నీకు విశాల్ కి మధ్య వుంది. నువ్వు కొత్తవాడివి కావు. గుంపులో గోవిందం పాత్రలు చాలా వేశావు. అయినా నిన్ను కన్సిడర్ చేశాం. ఒక్కటి గుర్తు పెట్టుకో.. ఎవడూ అవకాశాల్ని ఇవ్వడు… దక్కించుకోవాలి. మరో వారం రోజుల్లో ఎవరో ఓ డైరెక్టర్ నో నటుడ్నో జడ్జి గా పెట్టి ఫైనల్ సెలక్షన్ పూర్తి చేస్తారు. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి.” అన్నాడు.
“భయ్యా… ఈ క్షణం వరకు నేను, ఫుడ్డు క లాటరీ కొడుతున్న సంగతి నీకు తెలుసు. చిన్న హింట్ ఇస్తే జన్మంతా కృతజ్ఞుడుగా వుంటాను,” రెండు చేతులూ పట్టుకున్నాను.
“విశాల్ ని పోటీలోంచి నువ్వే తప్పించు. నీ కంటే అతనికే ప్లస్ పాయింట్లు ఎక్కువున్నాయి. అతను నీకు బాగా తెలిసినవాడే అని నాకు తెలుసు.” చిన్నగా నవ్వి అన్నాడు శేఖర్, వెళ్లి పోవడానికి చెప్పులు తొడుక్కుంటూ.
నేనేమి విలన్ ని కాదు. దుర్మార్గుడ్ని అంతకన్నా కాను. మనుషులందరిలాగే రాగద్వేషాలున్న వాణ్ణి. ఆశ నిరాశల వూయలూగేవాడ్ని. ఎదగడానికి నా నిచ్చెనని నేనే వేసుకోవలసిన వాడిని.
అదృష్టం అప్పుడు డిమానిటైజేషన్ రూపంలో నన్ను వరించింది. పిక్చర్ని మూడు నెలలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విశాల్ ని దారి మళ్లించడానికి ‘యామీ’ అస్త్రంగా నాకు దొరికింది. కేజువల్ గా సెలక్షన్స్ లో పరిచయమైన ఆమెతో బాగా పరిచయం పెంచుకున్నాను. ప్రతిసారి నాతోబాటు విశాల్ ని తీసికెళ్లేవాణ్ణి వాళ్ళింటికి.
యామీ ఓ హీరోయిన్ కూతురని ముందే చెప్పానుగా. తెలుగు సినిమా హీరోయిన్ గా కొన్ని చేసినా, మలయాళం ఫీల్డులో అంటే ‘మాలీవుడ్' లో అవకాశాలు ఎక్కువ దొరకడం వల్ల ఆవిడ ఎక్కువగా మలయాళం సినిమాల్లోనే నటించింది. డబ్బు విలువ బాగా తెలుసు ఆవిడకి, ఇతర విలువల కన్నా. నేనూ, విశాల్ ఇద్దరం ఫైనల్స్ కి వచ్చామని కూడా తెలుసు. కపాలి క్రియేషన్స్ ప్రొడక్షన్ చీఫ్ అంతకన్నా బాగా తెలుసు. ఎటొచ్చీ ఆమెకి తెలియనిది ఏమంటే, యామీ కి సినిమాలన్నా, సినిమా ఫీల్డన్నా ఇష్టం లేదనీ, ప్రేమలో పడటానికి సిద్ధంగా వుందనీ.
మమ్మల్నిద్దర్నీ ఆవిడ చక్కగా స్వాగతించేది. ఎవరు హీరో అయినా యామీకి సపోర్టు అవుతామని. ఉప్పుని, నిప్పుని పక్కన పెట్టినా, పక్కలో పెట్టినా చిటపటమని పేలుతాయి, అదే నెయ్యినీ, నిప్పునీ పక్క పక్కన పెడితే? నెయ్యి చక్కగా కరుగుతుంది. ఒకవేళ ఆ నెయ్యి నిప్పుల్లో పడితే నిప్పుల్ని మహోజ్వలంగా మండించి మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. విచారకరమైనది ఏమంటే నెయ్యి ఆవిరైపోతుంది. ఇక్కడ నెయ్యి విశాల్ అయితే నిప్పు యామీ. చలికాచుకున్నది నేను. సీదా సాదాగా, నిర్మలంగా వుండే విశాల్ కి సినిమా హంగులు తెలీదు. అందుకే యామీ. యామీ తాలూకు ఫ్రీనెస్ అద్భుతంగా అనిపించింది. హీరోయిన్ల కంటే హీరోయిన్ల తల్లుల కి ఆశలు ఎక్కువుంటాయి, ఎందుకంటే, తాము ఎన్ని కష్టాలు పడ్డారో అనుభవపూర్వకంగా తెలుసు గనక. బాలీవుడ్ లో అయితే ఒకప్పుడు ‘స్టార్ మదర్స్’ హవానే నడిచింది.
“ప్రేమంటే ఏమిటి? ఆకర్షణా? అర్పణా?” సీరియస్ గా నన్నడిగాడు విశాల్.
“రెండూ” సింపుల్ గా అన్నా.
“యశ్వంత్.. యామీ మీద నీ అభిప్రాయం ఏమిటీ?” అడిగాడు.
“లవ్ లో పడ్డావా?” అడిగా.
“తెలీదు. మళ్ళీ మళ్ళీ చూడాలి మాట్లాడాలి అనిపిస్తోంది, షీ యీజ్ సంథింగ్ స్పెషల్.” తలవొంచుకుని అన్నాడు.
“వాళ్ళమ్మ ఒప్పుకోదు. కూతుర్ని హీరోయిన్ చేసి కోట్లు గడించాలని ఆవిడ కోరిక. అంతేకాదు విశాల్, ప్రతీ హీరోయినూ కొత్తలో కొన్ని కష్టాలకి గురికాక తప్పదు. అప్పుడు రేగిన ప్రతీకారేచ్ఛ అంత తొందరగా అణగదు. కనుక నీది లవ్ అయితే ఇప్పుడే అడ్డుకట్ట వెయ్యి. నీలో బోలెడు సంస్కారమూ, అమాయకత్వమూ ఉన్నాయి. ప్రేమలకి కావలసింది అవి కాదు. దమ్ము... షీర్ గట్స్” అతని భుజం మీద చేయి వేసి అన్నాను. నేనన్నమాట అతనికి ఎక్కడ తగులుతుందో నాకు తెలుసు.
“అంటే నాకు గట్స్ లేవంటావా? చూపిస్తా…నేనేమిటో చూపిస్తా” కోపంగా లేచి వెళ్ళిపోయాడు.
అతనుండేది సారంగపాణి స్ట్రీట్ లోని ఓ రిచ్ అపార్ట్మెంట్ లో. బీజం పడింది.
మొలకెత్తడమే తరువాయి.
యామీ తల్లి పేరు ప్రియంవద. డైరెక్టుగా ఆమె దగ్గరకి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి సాయంత్రం 6 గంటలు. ఆవిడ కాస్త స్వింగీగా వుంది.
“ఓహ్ యశ్వంత్… సారీ మనసు బాగోక అయిదున్నరకే ఓ లార్జ్ మొదలుపెట్టాను. కంపెనీ ఇస్తావా?” అన్నది.
నాకు నవ్వొచ్చింది. దాహంతో మరిగిపోయేవాడికి ‘’చల్ల’టి నీళ్లు కావాలా’ అని అడిగినట్లనిపించింది. పర్సు బరువుగా లేనివాడి ‘డ్రింక్స్’ కూడా ‘పరువు’ లేనివిగానే వుంటాయి. అంటే ‘చీప్’ డ్రింక్స్ అని అర్థం. ప్రియంవద లాంటి వాళ్లు తాగేది చెత్తా కానీ సరుకు కాదు. బాటిల్ ఖరీదు వేలల్లోనే ఉంటుంది.
“నాకు అలవాటు లేదు ప్రియంవద గారు... కానీ, లోకాన్నేలే మహారాణి ఆకస్మాత్తుగా దర్శనం ఇచ్చి, అమృతం తాగమంటే వద్దని అనగలనా?” అన్నాను.
పొగడ్త అనేది సినీ జనాలకి ప్రాణ వాయువు లాంటిది.
----
ఎందుకు, ఎలా అనే ప్రశ్నల్ని పక్క బెడితే, ప్రియంవదకి కళ్ళూ చెవులూ ప్రస్తుతానికి నేనే. మా పరిచయమూ, స్నేహం కానీ స్నేహమూ ‘డ్రింక్’ దగ్గరే ఆగకుండా ముందుకు ముందుకు పొడిగించింది నేనే. గిట్టనివాళ్ళు బోలెడు అనుకుంటారు అవన్నీ వ్యర్థ ప్రేలాపాలు.
“మిస్టర్ విశాల్, జీవితంలో నా ఇంట్లోకి ఆడుగుపెట్టకు” అని తెర వెనగ్గా వుండి ప్రియంవద చేత విశాల్ కి వార్నింగ్ ఇప్పించిందీ నేనే.
“ఆ విశాల్ గాడితో మాట్లాడితే కాళ్ళు విరగొట్టి కూచోబెడతా…. చచ్చినట్టు పడుండు … చెప్పింది విను పెట్టింది తిను” అని యామీని గదిలో పెట్టి, ప్రియంవద చేత తాళం వేయించిందీ నేనే. మళ్ళీ ఎవరికీ తెలియకుండా దొడ్డిగుమ్మం గుండా యామీ, విశాల్ వాళ్ళ వూరికి పారిపోయేట్టుగా ఏర్పాటు చేసిందీ నేనే. ప్రియంవద పోలీస్ రిపోర్టిస్తానంటే, ‘పరువుపోవడమే గాక యామీ కూడా దక్కదని’ ఆపుచేయించిందీ నేనే.
ఒకమాట చెప్పకతప్పదు… మనిషి బ్రతకాలంటే డబ్బుకంటే ముందు తెలివుండాలి. ఎందుకంటే, తెలివి లేని వాడిదగ్గర డబ్బు నిలవదు.
‘ఫైనల్ సెలక్షన్’ గురించిన కబురు విశాల్ కి అందకుండా నేను తీసుకున్న జాగ్రత్తలు సఫలమయ్యాయి. ప్రియంవదనే పావుగా చేసి, హీరో కేరక్టర్ నాకే దక్కేలా ప్రొడ్యూసర్ మీద కొంచెం వత్తిడి తెచ్చాను. అంతేకాదు, ప్రస్తుతం నేను ప్రియంవదకి ఫ్రెండ్ నీ, ప్రియుడ్నీ, సలహాదారుడ్ని కూడా.
నాకంటే పెద్దదయితేనేం.. ప్రియంవద అన్నిటిలోనూ ‘ప్రియ’మైనదే. అంటే కాస్ట్లీ అన్నమాట. మాంఛీ లొకేషన్లో ఇల్లూ, కారూ, విలాసాలు దొరకాలంటే కొద్దోగొప్పో చెమటోడ్చక తప్పదు కదా.
ఈ సౌఖ్యాలు కూడా నిచ్చెనలాంటివే. ఓ ‘హోదా’ మనం అడక్కుండానే జనాలు ఇస్తారు. వెనకాల ఎవడు ఏం మొరిగితే మనకెందుకూ!
పిక్చర్ సూపర్ హిట్. ప్రస్తుతం ఆరు సినిమాల్లో హీరోగా బుక్కయ్యాను.
ఇంకో విషయం మీకు చెప్పితీరాలి. మంచినీటి చేప ఉప్పు నీటిలో బ్రతకదు.
‘యామీ’ అప్పర్ మిడిల్ క్లాస్ జీవితంలో ఒదగలేక ఆర్నెల్లలో తల్లి దగ్గరికి తిరిగొచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నాతోనే హీరోయిన్ గా కాంటాక్టు సైన్ చేసింది.
ఇక విశాల్ సంగతా! మద్రాసులోనే వున్నాడు. అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తాడు.
“యశ్వంత్.. నాకున్న నిజమైన స్నేహితుడివి నువ్వొక్కడివే. ప్రేమకంటే కెరీర్ ముఖ్యం అని, నువ్వెంత చెప్పినా నేను వినలేదు. తగిన శాస్తి జరిగింది బ్రదర్” అని ఏడుస్తూ వుంటాడు. నేను ‘పోయించే’ మందు తాగుతూ. అతను కాఫీ టిఫిన్లు ఇప్పిస్తే, నేను మందు పోయిస్తున్నాను. ఇందులో అన్యాయమేముందీ! అయినా న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు దద్దమ్మలు వాడే పదాలు!
మళ్ళీ కలుస్తా.
భువనచంద్ర