top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం

నా కథ - 5

bhuvana.jpg

భువనచంద్ర

జరిగిన కథ:

మొదటి ఎపిసోడ్ లో జరిగిన కథ- క్లుప్తంగా: 

బాలా త్రిపుర సుందరి తల్లి తండ్రి ఆమె 17వ యేట విడిపోయారు. తల్లి దిలావర్ అనే ముస్లింని ప్రేమించి ఆస్ట్రేలియా వెళ్లిపోతే, తండ్రి సరోజినీ ఆంటీ అనే ఓ డాన్సర్ తో బొంబాయి లో సెటిల్ అవుతాడు. బాలని శ్రీనివాస్, పశుపతి, జీవన్ అనే ముగ్గురు ప్రేమిస్తున్నా నిర్లిప్తంగా ఉంటుందే తప్ప ఏ సమాధానమూ ఇవ్వదు. బాలకి డబ్బు, ఇల్లు, కార్లు, తోటలు అన్నీ ఉన్నాయి, తోడు మాత్రం ఎవరూ లేరు. స్వేచ్ఛ నిండుగా ఉన్న ఒంటరితనం బాలది.

 

రెండో ఎపిసోడ్ లో జరిగిన కథ- క్లుప్తంగా: 

మాల్ దగ్గర కలిసిన క్లాస్మేట్ కామేశ్వరి బాలాని ముంబై రమ్మని పిలుస్తుంది. అప్పుడే కామేశ్వరీ, బాల శ్రీనివాస్ గురించి, పశుపతి గురించి చర్చిస్తారు. కామేశ్వరి శాండిల్య గురించి చెబుతుంది. తర్వాత కథ చదవండి :

మూడవ ఎపిసోడ్  లో జరిగిన కథ- క్లుప్తంగా:  

ముంబయి చేరుకున్నాక శాండిల్య బాలాని, కామెశ్వరిని పికప్ చేసుకోవటానికి వస్తాడు. శాండిల్య హుందాగా వ్యవహరించే తీరు, వ్యక్తిత్వం, అమ్మాయిలకి అతనికిచ్చే గౌరవం బాలాకి అబ్బురంగా కనబడుతుంది.

నాలుగో ఎపిసోడ్  లో జరిగిన కథ- క్లుప్తంగా:  

రాంబాబు అనే ప్రొడక్షన్ అసిస్టెంట్ శాండీ, బాలా, కామీ లని చాటుగా అనుసరిస్తాడు. వాళ్ళు శివసాగర్ హోటెల్ లో కూర్చుని ఉన్న సమయంలో హర్షవర్ధన్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి తనని తాను పరిచయం చేసుకుని, రాంబాబు వాళ్ళని స్టార్ మెటీరీయల్ గా గుర్తించిన విషయం చెబుతాడు.  కారణమేదయినా రహస్యంగా అనుసరించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు శాండీ.

తరువాతి ఐదవ ఎపిసోడ్ ఇప్పుడు చదవండి.

Episode 5

నా కథ

 

“సో వాట్, మా వెనకబడి డిటెక్టివ్ పని చేయడానికి అతనికేం అధికారం ఉంది” కఠినంగానే అన్నాడు శాండీ.

కామీ ఉత్సాహంగా చూస్తుంది. “మరోసారి రాంబాబు తరపు నుంచి మిమ్మల్ని నేను క్షమించమని అడుగుతున్నాను. ఇందాక చెప్పినట్టు రాంబాబు స్టోరీ మెటీరియల్ ని పసిగట్టడంలో ఎక్స్పర్ట్. మా ప్రోడక్ట్ విషయం వివరంగా చెప్తాను. అయితే ముందు నటించడానికి సమ్మతించాలి” అందరి వంకా చూస్తూ అన్నాడు హర్షవర్ధన్.

‘ఎవరు సమ్మతించాలి?’ నా మనసులో నేనే అనుకున్నాను. నా దృష్టిలో నాకూ, నటనకూ సంబంధమే లేదు. శాండీది బలిష్టమైన బాడీ మాత్రమే కాదు, ఆకర్షణీయమైన స్పష్టమైన ఫీచర్లు. కామీ నిజంగా అందగత్తే. అంతే కాదు జనాన్ని పిచ్చెకించేంత వున్న శరీర సౌష్టవం. ఓపెన్ గా చెప్పాలంటే, సెక్సీయస్ట్ బాడీ.

“ఎవరు సమ్మతించాలి?” నాలో నేను అనుకున్న ప్రశ్న అని బయటికి అనేసింది కామీ.

“ప్రస్తుతానికి మీ ఫ్రెండ్..!” నా వంక చూస్తూ అన్నాడు హర్ష.

“అంటే?” అయోమయంగా అన్నాను.

“మీరే” సిన్సియర్ గా అన్నాడు హర్షవర్ధన్. నాకు చచ్చేంత నవ్వొచ్చింది.

“మిస్టర్, నా జీవితంలో నేను విన్న బెస్ట్ జోక్ ఇది. నేనా? నటనా? గాడ్.. నేను తూర్పు అయితే అది పడమర, నేను ఉత్తరమయితే అది దక్షిణం. నటించే సమస్యే లేదు. కూరగాయలు అమ్మించినా అమ్మగలను గాని సినిమాల్లో మాత్రం ఇమడలేను” నవ్వుతూనే అన్నాను.

“నటన సంగతి మాకు వదిలేయండి, ఆ విషయం మేం చూసుకుంటాం. నటన వచ్చిన వాళ్ళు మాకు నిజంగా అక్కర్లేదు. మా కథ కోరుకునేది సహజత్వాన్ని. ఒక్కటి మాత్రం చెప్పగలను, సినిమా పేరుతో మీలాంటి యువతుల్నీ, యువకుల్నీ ముగ్గులోకి దింపి పబ్బం గడుపుకునే వాళ్ళం కాదు మేము. ఒక వైవిధ్యమైన స్టోరీ ఉంది, రెగ్యులర్ నటీనటులు ఆ కథలో ఇమడలేరు. మిస్టర్ శాండిల్య, నేను వీరికి కథానాయకి పాత్ర ఇవ్వాలనుకుంటున్నాను. అంతేకాదు మీరూ, ఇక్కడున్న మరో సిస్టరూ కూడా మాతో చేయి కలపాలని నా ఆశ. మీ మీ పాత్రల గురించి వివరంగా చెబుతా, ముందు మీరు మా ఆఫీస్ కి రావడానికి అంగీకరిస్తే” నెమ్మదిగా అన్నాడు హర్ష.

శాండీ ఏదో అనుబోయి ఆగాడు.

“క్షమించండి, నాకు తెలియని పని నా చేత చేయించాలని ప్రయత్నించకండి” సూటిగా చెప్పాను హర్షవర్ధన్ కి.

శాండీ ఎందుకు మాట్లాడకుండా ఆగాడు నాకు అర్థమైంది, ఒకవేళ నటించడానికి నేను ఇష్టపడుతున్నట్లయితే అతను అడ్డు రాకూడదు కదా!

“బాలా, నేనొక మాట చెప్పదలుచుకున్నాను. ఇది తనంతట తానుగా వచ్చిన అవకాశం, ముందు వీరి ఆలోచనలో ఎంత నిజం ఉందో, ఎంత సిన్సియారిటీ ఉందో తెలుసుకుందాం. రెండోది, నీకు నటన రాదని నాకూ తెలుసు, కానీ ఏమీ ఏ మహానటీ నటన నేర్చుకుని సినిమాల్లోకి రాలేదు. కొంచెం సమయం తీసుకుని ఆలోచించి చెప్పు” అనునయంగా అన్నది కామీ.

“అదీ నిజమే, మీకు ఆలోచించే సమయం ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు చెప్పమనడమూ అన్యాయమే. నేను మావాళ్ళు చేసిన తప్పుల్ని మనస్ఫూర్తిగా క్షమించండి. ఇది నా అడ్రస్, అదే మా ఆఫీస్ అడ్రస్. దయచేసి మీరు వస్తే అన్ని సంగతులు తీరిగ్గా చర్చించాకే ఓ నిర్ణయానికి వద్దాం” మా వంకా, శాండీ వంకా అపాలజిటిక్ గా చూసి కార్డు తీసి శాండీకి ఇచ్చాడు హర్షవర్ధన్. శాండీ కార్డు తీసుకొని లేచి నిలబడ్డాడు.

“దయచేసి నా రిక్వెస్ట్ ని కన్సిడర్ చేయండి” షేక్ హాండ్ ఇచ్చి మా వంక చిరునవ్వుతో చూసి బయటికి నడిచాడు హర్షవర్ధన్. మేమూ ఆ తర్వాత బయటికి వచ్చాము. నడుస్తూ నడుస్తూ బీచ్ లో మౌనంగా కలియతిరిగారు తిరిగాము. మొదట ఆఫర్ చేసింది నాకు అయినా ముగ్గురికీ పాత్రలు ఉన్నాయన్నమాట గుర్తొచ్చింది. అసలు వాళ్ళ మనసుల్లో ఏముందీ?

“శాండిల్య గారూ మీ అభిప్రాయం ఏమిటీ?” డైరెక్ట్ గా అడిగా.

“నిజం చెబితే, అది మీరు మాత్రమే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే సినిమా అనేది ఓ అందమైన, అద్భుతమైన వ్యసనం. అందమూ, అద్భుతమూ కంటే అత్యంత ఆకర్షణీయమైనది. సింపుల్ గా చెప్పాలంటే ఆ పిచ్చి ఒకసారి పడితే ఇక దిగదు. నేనే అందుకో ఉదాహరణ. ఇది ఎటువంటిది అంటే, ఈత నేర్చుకోకుండా సముద్రంలో దూకడం లాంటిది. అదృష్టం అంటే ఉంటే ఈత వచ్చి బయటపడొచ్చు, లేకపోతే మునిగిపోవడమే. అందుకే బాలాజీ, మీ నిర్ణయం మీరు తీసుకోవడమే ఉత్తమం” స్పష్టంగా చెప్పాడు శాండీ.

“యు ఆర్ సెంట్ పర్సెంట్ కరెక్ట్ శాండీ అన్నది కామీ.

“మీ ఇద్దరికీ కూడా పాత్రలు ఉన్నాయి అన్నాడుగా అతను, మీకు ఎలా ఉంది?” సిన్సియర్ గా అడిగాను.

“నా వరకు నేను మీట్ అవుతాను, పాత్ర ఏదైనా కావచ్చు. అంటే నటనే కాదు డైరెక్షన్, స్టోరీ ఎడిటింగ్. ఏ డిపార్ట్మెంట్ అయినా తప్పక యాక్సెప్ట్ చేస్తా. మీకు ఆల్రెడీ చెప్పినట్టు నేను చాలా హోంవర్క్ చేశాను, ఎన్నో కథలని కూడా తయారు చేసుకున్నాను. అవి ఎంతవరకు కూడా పనికొస్తాయో ప్రాక్టికల్ గా పరిశ్రమలోకి దిగితే తప్ప మనకి అర్థం కాదు. అందుకే ఆఫీసుకు వెళ్లి అసలు వాళ్ళ ప్రపోజల్ ఏదనేది తెలుసుకోవాలి. ఆ తర్వాతే నా నిర్ణయం” చెప్పాడు శాండీ.

“నీ సంగతి” అడిగాను కామేశ్వరిని.

“బాలా, నాదో చిత్రమైన లైఫ్. ఏనాడు దేనికీ నేను పెద్దగా ఆలోచించను. ఎందుకంటే ఇప్పటివరకూ నా జీవితంలో ఏవి జరిగినా నా ప్రమేయం లేకుండానే జరిగాయి. ఒకటి మాత్రం నిజం. ఇది యాదృచ్ఛికంగా రాలేదు, దీనివల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అసలే తెలీదు. కానీ అవన్నీ పక్కన పెట్టి స్వచ్ఛమైన మనసుతో ఒకసారి వాళ్ళ ఆఫీసుకి వెళ్దాం. మనకి ఇష్టం లేని పనిని ఎవరూ మన చేత చేయించలేరుగా. అందులోనూ ఒకళ్ళం కాదు, ముగ్గురం” నవ్వి అన్నది కామీ.

 

“ఓకే.. డన్..: నేను అన్నాను.

“హ..హ.. హ! ఇప్పుడు రాంబాబు ఇంకా మనని కనిపెడుతూనే ఉన్నట్లయితే, బీచ్ సాక్షిగా మనం ఆఫీస్ కి వస్తామని హర్షవర్ధనుడికి రిపోర్ట్ ఇచ్చే ఉంటాడు. బాలాజీ, కామీ మహా విచిత్రంగా ఉంది కదూ! సినిమా అవకాశం తనంతట తానుగా మన తలుపు తట్టడమా! అదీ ఒకేసారి ముగ్గురికీనా! కలో నిజమో తెలియడం లేదు. ఎవడో స్పై చేశాడని అన్నప్పుడు పిచ్చి కోపం వచ్చినా, ఇప్పుడు అదంతా కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఏమన్నాడూ? స్టార్ మెటీరియల్ గుర్తించడంలో రాంబాబు ఎక్స్పర్ట్ అనా!” నా చేతుల్ని పట్టుకుని నవ్వుతూ అన్నాడు శాండీ.  ఫస్ట్ టైం, అదోచిత్రమైన స్పర్శ. ఆ స్పర్శలో ఓ స్నేహం, ఓ ఆప్యాయత, ఓ తెలియని అనుబంధం ఉన్నాయని నాకు అనిపించింది.

దాదాపు రెండు గంటలు తిరిగాం. తిరుగుతూనే ఉన్నాం.

“బాలాజీ, మీకు గుర్తుందా? మిమ్మల్ని స్టేషన్ నుంచి తీసుకొస్తూ అన్నాను, సినిమా ఫీల్డే నన్ను పిలిచేటట్టు చేస్తానని” నా కళ్ళలోకి చూసి అన్నాడు శాండీ.

“అవును, గుర్తుంది” నా మాటలు ఆశ్చర్యం “నిన్ననేగా అన్నదీ!”

“సినిమా ఫీల్డ్ నన్ను పిలవలేదు, మీ ద్వారా నన్ను పలకరించింది! మీ ద్వారానే నేను నూటికి పిలువబడ్డాను. ఇందులో ఒక్కసారి ఏ చిన్న పనిలోనైనా కుదురుకోగలిగితే నా స్వప్నం సాకారం అయినట్లే” కళ్ళు మెరుస్తూ ఉండగా, ఆరాధనగా నా వంక చూస్తూ అన్నాడు శాండీ.

“హా.. హా దోశ మీద చట్నీ వేసినా, చట్నీ మీద దోశని వేసినా తినేటప్పుడు రుచి ఒకటే కదా!” దోస ముక్కని చట్నీలో నంజుకుంటూ అన్నది కామీ.

“శభాష్.. కొత్త ఉపమానం” నవ్వాడు శాండీ.

“సరే, నీకు కథానాయకగా, నీకు డైరెక్టర్ గా ఛాన్సులు వచ్చుగాక! నా సంగతి అంటావా.. బహుశా ఈ వాస్తవ సినిమాలో నాకు ఏమన్నా వేంపు పాత్ర పడేయొచ్చు. ఎందుకంటే నా నటనకన్నా నా శరీరాన్ని జనాలు కళ్ళు విప్పార్చి చూస్తారని నేను బెట్ కట్టి మరీ చెప్పగలను” నవ్వి అన్నది కామీ.

“ఛుప్..  నిన్ను నువ్వు తేలిక చేసుకోకు చిరుకోపంగా అన్నాడు శాండీ.

“నో మిస్టర్, మనని ఎవరో అసెస్ చేసేకంటే మనని మనమే అసెస్ చేసుకోవడం మంచిది. నా ప్లస్లులూ, మైనస్లూ నాకు తెలుసు” శాండీ చేయి మీద చేయి వేసి అన్నది కామీ.

జనక్ రాజ్ అయ్యర్ అందరికీ తలోదోసే అడక్కుండానే వేశాడు.

“అదేంటి, చెప్పకుండానే వేశారు?” ఆశ్చర్యంగా అన్నాడు శాండీ.

“అయ్యా, బాగా మాట్లాడలేనేమో గాని తెలుగు నాకు బాగానే అర్థం అవుతుంది. ఖుష్ ఖబరీ విన్నాను గనక ఆనందంతో వేశాను. మేడంని చూశాక గొప్ప స్టార్ అవుతుందని నిన్ననే అనుకున్నాను” కామీ వంక చూసి అన్నాడు జనక్ రాజ్.

“బాబ్బాబూ స్టార్ ఆవిడ, నేను ముంబై సిల్క్ ని”  ఫకాల్న నవ్వి అన్నది కామీ.

“చోడో యార్, రేపటి సంగతి రేపు. ఇప్పుడు అందరం నేల మీదే ఉన్నాం” సరదాగా అని దోశ మీద కొంచెం చట్నీ, కొంచం సాంబారు పోయించుకున్నాడు శాండీ. బ్రహ్మాండమైన సాంబార్ అనడంలో పొగడ్తలేనే లేదు.

అందరూ నడుస్తూ మళ్ళీ ఫ్లాట్ వైపుకు వెళ్ళాము, సన్ అండ్ శాండ్ లో నుంచి ఒకాయన వస్తూ  కనిపించాడు, “అదిగో ఆయనే పరీక్షిత్ సహానీ, ఆయన తండ్రి పేరు బలరాజ్ సహానీ. అసలు పేరు, మొదటి సినిమాలో ఆ పేరుతోనే నటించాడు. అన్నట్లు ‘అనోఖీ రాత్’ సినిమా చూశారా? అద్భుతమైన సినిమా, దానిలో ఓ చిత్రకారుడిగా ఈయన యాక్ట్ చేశారు. ఫెంటాస్టిక్ అనుకోండి. ఆఫ్ కోర్స్, హీరో సంజీవ్ కుమార్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్. హీరోయిన్ వచ్చి నరగిస్ మేనకోడలు జహీదా. సంగీతం రోషన్, ఎన్ని అద్భుతమైన పాటలున్నాయో తెలుసా? ఉత్సాహంగా అన్నాడు శాండీ.

“ఇవాళ మనము ఆ సినిమా చూద్దాం” హుషారుగా అన్నాను నేను.

“నో నో, నేను సినిమా యాక్టర్ ని కాబోతున్నాను, నా మొహం తాజాగా ధగధగలాడాలంటే

మాంఛి నిద్రపోవాలి. అజయ్ సహానీ అందునా అయ్యర్ దోశ సాంబార్ మెక్కానేమో నిద్ర దానంతట అదే వచ్చి కనుల మీద వాలిపోతుంది” డ్రీమిగా అన్నది కామీ.

అందరం హాయిగా నవ్వుకున్నాము, ఫ్లాట్ కి చేరిన వెంటనే శాండీ ‘అనోఖీ రాత్’ సినిమా పెట్టాడు. ఒక్కక్షణం మేము తల తిప్పలేదు. ఒక్క రాత్రిలో జరిగిన సంఘటనల సమాహారం అది. అరుణా ఇరానీ  ఎపిసోడ్ అద్భుతం అయితే, సంజీవ్ కుమార్ ఎపిసోడూ, యాక్షన్ పరమాద్భుతం. రాధగా, గోపాల్ గా జహీదా నటన అమోఘం, అపూర్వం. బరువెక్కిన గుండెలతో మంచాల మీద, సోఫాల మీద పడ్డాము. ఎంత గొప్ప సంగీతం. హాస్యం చేసే ఆ ‘ముక్రీ’, అతను దిలీప్ కుమార్ క్లోజ్ ఫ్రెండ్ అట.

“ఒహో రే, తాల్ మిలే  నదీ కే జల్ మే” పాట నా మనసులోనే సుళ్ళు తిరుగుతుంది.

‘సముద్రంలో ఉన్న ముత్యపు చిప్ప దాహంతో తపిస్తుంది, చుట్టూ జలం ఉన్నాదాని దాహం తీరాలంటే గాలు కురిపించే నీటి బిందువులే శరణ్యం. దాహంతో తెరుచుకొని ఉన్న ముత్యపు చిప్ప నోట్లో పడే చుక్క, ఎప్పుడు పడుతుందో ఏ మేఘంలో ఆ చుక్క ఉన్నదో ఎవరు చెప్పగలరూ’ అని అర్థం ఓ చరణంలో వస్తుంది.

మానవులం మనమూ అంతే, మనసు చల్లబడాలంటే నిన్ను నిన్నుగా ప్రేమించేవారు నీకోసమే బ్రతికి ఉండేవారు ఒకరు ఉండాలి. ఆ మనిషి ఎప్పుడు, ఎక్కడ దొరుకుతాడో ఎవరికీ తెలుసూ? ఒక్కోసారి జన్మంతా వెతికిన దొరక్కపోవచ్చు, ఆల్చిప్పలోనూ దాహం తీరేది కొన్నిటికే. కొన్ని దాహమే తీరకుండా ముత్యంగా జీవితాన్ని మార్చుకోకుండానే మరణిస్తాయి.

ఏవేవో ఆలోచనలు. శాండీ సోఫా మీద అటు ఇటు కదలడం తెలుస్తుంది. నేను మేలుకునే ఉన్నాననే విషయం అతనూ గ్రహించి ఉండాలి. కానీ మౌనమే రాజ్యం మేలింది.

అబ్బా, గోపాల్ చనిపోయినప్పుడు సంజీవ్ ప్రదర్శించిన నటన నిజంగా అద్భుతం. అలాగే క్లైమాక్స్ కూడా. చిత్రకారుడిగా ముత్యం  నటన చాలా సహజంగా ఉంది. ఇప్పుడు? వయసు తన ప్రభావాన్ని అందరిలాగే ఆయన మీదా చూపించింది. ఎంత విచిత్రం ఈ జీవితం.

“బాల్యం ఏమీ తెలియకుండానే ఆటపాటల్తో గడిచిపోయింది

యవ్వనం తీపి కలలు కంటూ నిద్రలో గడిచిపోయింది

మిగిలింది వృద్ధాప్యం, ఏముందీ ఏడవడానికి తప్ప దీనిలో”

అనే ముఖేష్ పాట గుర్తుకొచ్చింది.

(సజన్ రే ఝూట్ మత్ బోలో.. ఖుదా కే పాస్ జానా హై

న హాథీ హై న ఘోడా, వాహా పైదల్ హీ జానా హై)

అనే పాట.

ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు.

 

***

 

తెల్లవారుఝామునే లేచాను. శాండీ ఆల్ రెడీ కాఫీ తాగుతున్నాడు.

“నిద్ర పట్టలేదనుకుంటా..!  నా పరిస్థితి అదే. బాలాజీ, సినిమా అనేది నాకో కల. అది ఎప్పుడు నాలోకి దూరిందో తెలియదు, యాక్టర్ గా కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాలని ఉంది”

నవ్వి నేను బాత్రూంకి వెళ్లాను. బ్రష్ తీసుకుని వచ్చేసరికి కాఫీ రెడీ.

“అలాగే అడగండి, ఎందుకంటే వాళ్ళకి మనుషులు కావాలిగా. ఇంతకుముందు మీరు 300 ప్రపంచ ప్రసిద్ధి అభిమానుల అభిమానం పొందిన సినిమాల్ని విశ్లేషించారు కదా. మీ, ఆ, నాలెడ్జ్ వాళ్లకే ఉపయోగపడుతుంది. అయినా నాకు ఒక మాట చెప్పనా? చిన్నప్పుడు మా స్నేహితురాలు ఒకతి ఉండేది, దాని పేరు సుధ. అది కేరమ్స్ లో బ్రహ్మాండమైన ఎక్స్పర్ట్. కానీ నీకు కొత్త వాళ్లతో ఎప్పుడు కేరమ్స్ ఆడినా ఆ ఆట తనకి తెలుసని చెప్పేదికాదు. ఫస్ట్ టైం ఆడుతున్నట్టు మొహం పెట్టేది. అలా ఎందుకే అని నేను అడిగితే, ‘వాళ్ళు ఎలా ఆడతారో తెలియాలంటే మనకి ఏమీ తెలియనట్టే ఉండాలి’ అన్నది. శాండిల్య గారూ, మీరూ మీ సినిమా ఇంట్రెస్ట్ గురించి వాళ్లతో ఏమీ చెప్పొద్దు. వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవడానికి వచ్చినట్టే ప్రవర్తించండి”  పెద్ద ఆరిందాలాగా ఓ సలహా ఇచ్చాను.

శాండీ ఓ రెండు నిమిషాలు రెండు నిమిషాలు నా వంక ఆశ్చర్యంగా చూశాడు.

“ఇదీ అసలు సిసలైన సలహా అంటే. థాంక్స్ బాలాజీ, మీరు అన్నదే నిజం. నేను నా ఆప్షన్ చెప్పను వాళ్ళు ఏం చేయమంటే అదే చేస్తా” అడ్మయిరింగ్ గా నా వంక చూస్తూ చెప్పాడు శాండీ.

”అన్నీ వింటున్నాను” నవ్వుతూ వచ్చింది కామీ, “మీలాగే నాకు కూడా నిద్ర పట్టలేదు. ఒకవేళ వాళ్ళు నన్ను నటించడానికి కన్విన్స్ చేస్తే” ఆఫ్ కోర్స్ మా అమ్మ సంతోషపడదు. ఖంగారుపడుతుంది ఎందుకంటే సాంప్రదాయ బద్ధమైన జీవితాన్ని ఇంతవరకు మేం గడిపాము. సినిమా వాళ్ళ అవన్నీ పై మెచ్చులూ,  ప్లాస్టిక్ నవ్వులూ అని అందరూ అంటారు కదా. ఏదీ ఉన్నది ఉన్నట్టుగా ఉండదు, అంతా కృత్రిమమే అని అంటారు గదా. ఆమె సంతోష పడదు, అలాగని అడ్డూపెట్టదు. మై క్యాకరూ శాండీ?” సీరియస్ గా అన్నది కామీ.

“నిజమే, అదిగాక కామీకి వాళ్ళమ్మ, వాళ్ళమ్మకి కామీ ఒకరికొకరు. సినిమాల్లోకి వస్తే కామీ తో పాటు వాళ్ళ మదర్ ని కూడా ఉంచుకోవాల్సి వస్తుంది.  అదీగాక, ఈ సినిమా తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసూ?” అన్నాను.

“నందో రాజాభవిష్యతి అంటారుగా విశ్వనాథ వారు, ఆ పేరుతో నవల కూడా రాశారుగా, చూద్దాం. మొదట మనం వెళ్లాలా, వద్దా అనేది గట్టిగా నిర్ణయించుకోవాలి. అమ్మాయిలూ నేను మగాడ్ని,  అదీ నా సొంత కంప్యూటర్ సెంటర్ ఉన్వాడ్ని. ఫైనాన్షియల్ గా మీరిద్దరూ సౌండ్ అని నాకు తెలుసు, కానీ సినీ జీవితం అనేది అత్యంత ఆకర్షణీయమైన ఊబి. అడుగుపెట్టే ముందే ఆలోచించాలి. నిన్న తీసుకున్న నిర్ణయాన్ని బీచిలోనే వదిలిపెడదాం. ఇప్పటినుంచీ మనం సీరియస్ గా ఆలోచిద్దాం” సీరియస్ గా అన్నాడు శాండీ.

డోర్ బెల్ మోగింది. శాండీ ఆశ్చర్యంగా డోర్ దగ్గరికి వెళ్ళాడు, హర్షవర్ధన్ అతని వెనుక ఓ కొత్తవాడు బహుశా రాంబాబు కావచ్చు కనిపించారు.

“కమాన్.. కం” సంభ్రమంగా ఆహ్వానించాడు శాండీ.

“ఇతనే రాంబాబు నా ఫ్రెండ్, మీరు కోపంగా ఉన్నారనీ బహుశా ఇంకా సీరియస్ కావచ్చనీ చెప్పే తీసుకొచ్చాను” నవ్వుతూ అన్నాడు హర్ష.

“నోరూ చెయ్యీ చేసుకున్నా నేనేమీ అనుకోను కళాకారులారా, అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చాను”  చేతులు జోడించి నవ్వుతూ అన్నాడు రాంబాబు. అతని నవ్వు నిష్కల్మషంగా ఉంది స్నేహపూరితంగా ఉంది.

‘సారీ రాంబాబు గారూ, కొంచెం కోపం వచ్చిన మాట నిజమే” షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నాడు శాండీ.

“కూర్చోండి ప్లీజ్” అన్నది కామీ.

“కాఫీ కూడా నేనే ఆఫర్ చేసేదాన్ని, కానీ ప్రపంచంలో వరస్ట్ కుక్ నేనే గనుక కాఫీ కార్యక్రమాన్ని శాండీకి గొప్ప ఒప్పచెపుతున్నా” మళ్లీ అన్నది కామీ.

“వెల్కం” అన్నాడు హర్షవర్ధన్. అతను అన్న ఆ చిన్న మాటలో ఆనందం, అతని మీద ఉన్న నమ్మకం కనిపించాయి నాకు.

 

***

మళ్ళీ కలుద్దాం

భువనచంద్ర

మళ్ళీ కలుద్దాం

మీ భువన చంద్ర

bottom of page