MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం
నా కథ
భువనచంద్ర
“నువ్వు చాలా అందగత్తెవి, నీలాంటి వాళ్ళు కోటికొక్కరు కూడా ఉండరు”, వెయ్యిన్నొకటోసారి అన్నాడు శ్రీనివాస్. అతని తండ్రి పెద్ద ల్యాండ్ లార్డ్, అంటే భూస్వామి. కనీసం ఆరు వందల ఎకరాలకి యజమాని, అదీగాక రైస్ మిల్లులో రెండు, పుగాకు బేరన్లో నాలుగు, షాపింగ్ కాంప్లెక్స్ లో మూడు ఆయనవే. ‘యధా తండ్రి - తథా సుతా’లాగా శ్రీనివాస్ కి కూడా చాలా కళాత్మక ఆలోచనలు ఉన్నాయి. అయితే ఎరవేసి ఓపిగ్గా ఎదురు చూడడం అతని లక్షణం. సాలెపురుగు చేసే పని అదేగా, గూడు అల్లేసి మధ్యలో హాయిగా కూర్చుంటుంది. ఏ జీవి చిక్కినా వెంటనే ఆరగించదు, తీరిగ్గా ఆరగిస్తుంది. ప్రస్తుతానికి నేను అతనికి అందని అవకాశాన్ని.
“నీ కోసం నా ప్రాణాలు ఇచ్చేస్తా సుందూ, నీవు లేని నా బ్రతుకు వృధా వృధా” అంటాడు పశుపతి. పశుపతి గొప్పకవి, గాయకుడు కూడా. చిత్రం ఏమంటే, అతని కవిత్వం ఏనాడు నన్ను ఎక్సైట్ చేయలేదు. కారణం, ఆ కవిత్వంలో ‘హృదయం’ కనబడలేదు. అలాగే అతని గానం జనానికి అద్భుతం అనిపించినా, నాకు మాత్రం అందులో ‘జీవం’ అనేది ఒక్కసారి కూడా తొంగిచూడలేదు.
అలాగే ‘ఏ కళాకారుడు ‘ప్రేమ’ అనే బంధానికి కట్టుబడడు’, అని నా నిశ్చితాభిప్రాయం. ఏ రచయిత అయినా, నటుడు అయినా, గాయకుడు అయినా, శిల్పి అయినా, నృత్యకారుడు అయినా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకున్నంతగా ఎవరినీ ప్రేమించలేరు, అందుకే కళాకారుల జీవితాల్లో అన్నీ అలజడులు, ఒడిదుడుకులు.
‘జీవన్’ నా దృష్టిలో మాంఛి పెంపుడు జంతువు. నా క్రీగంటి చూపు కోసం నిరంతరం ఎదురు చూసే ఓ సామాన్యుడు. పశుపతి, శ్రీనివాసులా కోటీశ్వరుడు ఏం కాదుగానీ, ధనవంతుడే. కవి, గాయకుడు కావడంవల్ల ‘ప్రేమింపబడటానికి నేను 100% అర్హుణ్ణి’ అనుకునే మనస్తత్వం అతనిది. జీవన్ సర్వ సామాన్యుడు. తల్లి మిషన్ కుట్టి కొడుకుని చదివించలేదు కానీ, ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ జీవన్ ని అతని చెల్లెల్ని చదివించింది. దిగువ మధ్యతరగతి మనస్తత్వం వారిది. పై వాళ్ళని చూస్తే భయంతో కూడిన గౌరవం, కింద వాళ్ళని చూస్తే బెరుకుతో కూడిన భయం. త్రిశంకు స్వర్గం అని అనేది మరి దీన్నేనేమో.
శ్రీనివాస్ మాటలకి చిన్నగా నవ్వాను. “కనికరించవా సుందూ?” నాటకీయంగా అన్నాడు శ్రీనివాస్. ఆ యాక్షన్ కి నాకు మళ్ళీ నవ్వొచ్చింది. “ఓ లాంగ్ డ్రైవ్ కి పోదామా?” అడిగాడు.
“నా సమాధానం నీకు తెలుసుగా శ్రీనూ, నన్ను ఎవరు ఆపేవాళ్లు లేరు, కానీ నా హద్దుల్ని నేనే నిర్ణయించుకున్నాను గనక వాటిని నేను దాటను” అనునయంగా అన్నాను.
“నువ్వు అసలు నాకెప్పుడూ అర్ధం కావు” కాస్త అసహనంగా అన్నాడు.
“ఆ మాట నిజమే కాసేపు నేను ‘బాల’ నీ, కాసేపు నేను ‘త్రిపుర’ నీ, కాసేపు ‘సుందరి’ నీ, అందుకే క్షణానికో రూపుధరించాల్సి వస్తుంది. ఇంతకీ నీ పెళ్లి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా?” అని అడిగాను, ఈ ప్రశ్న అతనికి కోపం తెప్పిస్తుంది అని తెలుసు.
“కత్తి పెట్టి పొడవరాదూ, వెయ్యిసార్లు చెప్పాను. మా డబ్బున్నోళ్ళ ఇళ్లల్లో పెళ్లిళ్లు మనుషుల మధ్య జరిగేవి కావు. అవి కులాల మధ్య, స్టేటస్ ల మధ్య, ధనం బలాల మధ్య జరిగేవి. ఆ పెళ్లిళ్ళకీ ప్రేమలకీ మధ్య వెయ్యి సముద్రాల దూరం ఉంటుంది. నిన్ను నేను ప్రేమిస్తున్నంతకాలం పెళ్లితో నీకు ఏమి అవసరం” తీవ్రంగా అన్నాడు శ్రీనివాస్.
“అంటే, జీవితాంతం నువ్వు ప్రేమికుడివీ, నేను ప్రేమికురాలిని. ఓ బంగళా, ఓ తోట, నౌకర్లు, చాకర్లు, ఓ కారు, ఓ మేనేజర్, నగలూ, నాణ్యాలూ అంతేగా మన ప్రేమ చిహ్నాలు. మరో విధంగా చెప్పాలంటే, నీ అనంతమైన ప్రేమకి సాక్షిగా నన్ను ‘ఉంచు’కుంటావన్నమాట”, నవ్వుతూనే అన్నాను. నేను అనుకున్నట్టుగానే అతను ఎదుట ఉన్న స్టీల్ గ్లాస్ ని గోడకేసి విసిరి చకచకా నడుచుకుంటూ కారు దగ్గరికి పోయాడు. రేపు మళ్ళీ వస్తాడు, అసలేమీ జరగనంత కూల్ గా. ఆ విషయం నాకు తెలుసు.
“తిప్పూ.. గుర్తుంచుకో ఎవరూ లేని ఆడది అందరికీ ఉమ్మడి ఆస్తి లాంటిదన్నట్టు భావించే విషప్పురుష పురుగులు ఉన్న లోకమిది. జాగ్రత్తగా చెప్పాలంటే తనను తాను రక్షించుకునేందుకు కోరల నిండా విషయం నింపుకునే నాగు పాము లాంటిది. అవసరం వచ్చినప్పుడు బుస కొట్టడమే కాదు, కాటు కూడా వెయ్యాలి. ముప్పైయిద్దరు రాక్షసుల్లాంటి పళ్ళ మధ్యలో ఒదిగిన నాలుకలా ఉండాలి. పళ్ళ కాటు తప్పించుకోవాలి”, అని జగదాంబ చేసిన బోధ జ్ఞాపకం వచ్చింది నాకు. త్రిపురకి షార్ట్ కట్ ‘తిప్పూ’, సుందరికి షార్ట్ కట్ ‘సుందూ’. బాలకి షార్ట్ కట్ ఎవరూ పెట్టలా.
“బాలా.. రేపు మా ఇంట్లో వ్రతం ఉంది, వస్తావు కదూ”, ప్రేమగా అడిగింది సరస్వతి గారు. ఆవిడ జీవన్ తల్లి.
“ప్రయత్నిస్తా ఆంటీ” అన్నాను. ఆవిడ ఆ మాటకే ఆనందించింది. జీవన్ కి నామీద చెప్పలేనంత ప్రేమ ఉందని ఆవిడకి తెలుసు. నేను ఒంటరిదాన్నయినా, నా వెనక చాలా ఆస్తి వుంది. అదీగాక ‘అందగత్తె’నని ఆడవాళ్లూ అనుకోవడం చాలాసార్లు నేను విన్నాను. ఈ రెండు కారణాలు చాలు నన్ను కోడలిగా చేసుకోవడానికి. బోలెడంత నీడనిస్తుందని ఏ మూర్ఖుడూ ‘మర్రి చెట్టు’ పెరట్లో నాటడు, ఇక్కడ ‘ఫలం’ ముఖ్యం, నీడ కాదు.
“అసలు నీ ఉద్దేశం ఏమిటి?”, ఆరా తీసింది లలిత. లలిత చాలా మంచిది, పాపం ఎవరు ప్రేమించానని చెప్పినా చాలా పొంగిపోతుంది. చాలా దయగా సముదాయిస్తుంది. అయితే పుట్టుకతో వచ్చిన పిరికితనం వల్ల ఇంకా మానసిక, శారీరక కన్యత్వాన్ని పోగొట్టుకోలేదు.
“పశుపతి అడగమన్నాడా?” సూటిగా లలితని అడిగాను. ఇతరులని మాటల్లో పడేసి ఇలాంటి ఇంక్వైరీలు చేయించడం పశుపతి ప్రత్యేక టాలెంట్ అని నాకు తెలుసు.
“హూ.. స్నేహితురాలిగా నిన్ను అడగ కూడదా. అయినా పశుపతికి ఏం తక్కువ? ఎంత గొప్ప కవి, ‘నీ జడతో నన్ను ఉరి వేసుకోనీ’ శీర్షికతో ఎంత గొప్ప కవిత్వం చెప్పాడు. అయినా సుందూ, అతని పాట వింటే చాలే”, నా భుజం మీద చెయ్యి వేసి అన్నది లలిత. దాచడమనేది ఆ పిచ్చి మొహానికి తెలియదు.
“పోనీ, పశుపతిని అడగనా, నిన్ను పెళ్లి చేసుకోమని” అన్నాను.
“అయ్య బాబోయ్, మా నాన్న చంపేయడూ. వాళ్ళ కులం వేరు, మా కులం వేరూ” అన్నది కంగారుగా.
“కవిత్వానికి, గానానికి కులాలు మతాలు లేవు కదే. మీ వాళ్ళని నేను ఒప్పిస్తాగా” అన్నాను.
“ఆ పని మాత్రం చెయ్యద్దు తల్లీ. అసలే మా నాన్న చండ ప్రచండ కోపిష్టి” లేచింది లలిత. నిజంగా నాకు జాలేసింది. అంత చండ ప్రచండ కోపిష్టి, సనాతనుడు, సర్వశాస్త్రాలూ చదివినవాడూ అయిన అయాచితుల సర్వేశ్వర శర్మ సాయంత్రం ఆరు దాటగానే హాజరయ్యేది K.D.లక్ష్మి గారి ఇంటికి వరండాలో. K.D.లక్ష్మి అంటే కాడుబోయిన దావీదు లక్ష్మి. అసలు పేరు కాడు బోయిన ధనలక్ష్మి, మతం మార్చుకొని దావీదు లక్ష్మి అయ్యింది. మొదట ఆవిడని తీసుకొచ్చిన ఘనత శ్రీనివాన్ తండ్రి వెంకటరత్నానిదే. ఆడాళ్ళనీ, కార్లనీ తరుచుగా మార్చడం ఆయన హాబీ.
జీవితం అనేది ఓ సమూహంలాంటిది. కొద్ది క్షణాలు కలిసి వెళ్లిపోయే వారు కొందరు, కొన్ని నిమిషాలూ, గంటలూ, రోజులూ, నెలలూ, రుతువులూ మనతోనే పయనించేవారు మరికొందరు. ఎక్కడో ఉండేవాళ్ళు ఒక్కోసారి ప్రాణం కంటే ఎక్కువ అయితే, పక్కనే ఉండేవారు కూడా పరాయి వారిలా మారే సన్నివేశాలు కోకొల్లలు. ఎందరి జీవితపు క్షణాలో మనం పంచుకుంటే మన జీవితం క్షణాల్ని పంచుకునేది ఎందరెందరో. బిందు సమూహం సముద్రం అయితే, క్షణ సమూహం జీవితం.
“నన్ను ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోకు. జీవితం మీద నాకు అవగాహన లేదు, ఉండాలని అసలు కోరుకోను కూడా. వచ్చేదాన్ని వచ్చిన విధంగా ఒప్పేసుకోవడమే నాకు ఇష్టం. మీ అమ్మ, నువ్వు కూడా నా జీవితంలోకి అలా వచ్చిన వారే. మీ అమ్మ నా జీవితంలోకి ప్రవేశించినాకే నాకు లోకం కొంత అర్థం అయింది. ‘ఈ లోకంలో అందరూ ఏదో కావాలనుకుంటారని, కోరుకున్నది సాధించుకోవడమే మహా విజయమనీ మీ అమ్మ నాకు బోధించింది. ఆ బోధ నాకు వంటబట్టలేదు, అందుకే నన్ను మీ అమ్మ ‘వ్యర్థుడా’ అని పిలిచేది.“ అన్నాడు మా నాన్న పదహారో ఏట. మా అమ్మ చాలా స్టైలిష్. చాలా అందమూ, అహంకారమూ కలబోసుకున్న వ్యక్తి. ‘నీ విలువ తెలిసేది, నువ్వు ఉన్న స్థానాన్ని బట్టే’ అని స్పష్టంగా చెప్పేది. అందుకే ఎక్కడున్నా ఆవిడ ‘టాప్’ లోనే ఉండేది. ఆ ‘టాప్’ లో నిలబడటం కోసం ఆవిడ చేసే ప్రయత్నాలు అనూహ్యం.
మా అమ్మా, నాన్నా నాకు ఎప్పుడూ ఇద్దరూ వేరువేరు వ్యక్తులలాగే కనిపించేవారే కానీ, భార్యాభర్తల్లా కనబడలేదు. మా అమ్మది షార్ట్ టెంపర్, మా నాన్న మీతభాషుల్లో మితభాషి. నా పదహేడో పుట్టినరోజు వాళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయిన మాసంలోనే మా నాన్నని సరోజినీ ఆంటీ ఇంట్లో చూసాను. ఆయన అంత సరదాగా ఉండటమూ, మాట్లాడటమూ అది మొదటిసారి (నే చూడటం).
“సుందూ.. నీకు అర్థం కాదు ఇప్పుడు. ఎప్పుడో అర్థమవుతుంది, “ప్రేమ అంటే సంపూర్ణ స్వేచ్ఛ” అనే నిర్వచనం. విడాకులు తీసుకున్న రెండో మాసంలో ఇంట్లో, తోటలో, రెండు కార్లు. ఇవన్నీ నా పేర రిజిస్టర్ చేసి మా అమ్మ ‘దిలావర్’ అనే ముస్లింని పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. సరోజినీ ఆంటీ గొప్ప డాన్సర్. ఆవిడతో మా నాన్న బాంబే వెళ్లిపోయాడు. మిగిలింది నేను. ఒంటరిని. మా అమ్మ, మా నాన్న కూడా ప్రేమించుకుంది తమను తామే. అందుకే వాళ్ల ప్రేమ విఫలమైందనుకుంటా. అటు తల్లి, ఇటు తండ్రి వదిలేసిన పిల్లని గనక జాలిని జనాలు జడివానలా నామీద కురిపించారు. కొన్నాళ్ళు నిజంగా ఏడ్చాను, ఆ తర్వాత హాయిగా అనిపించింది. నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో అర్థమైంది. సానుభూతి అనేది అప్పుడప్పుడు లభించడం ఓకే, కానీ వర్షంలా కురుస్తుంటే చాలా ఇబ్బంది. అది గనక అలవాటైతే చచ్చామే. మాదకద్రవ్యాలకంటే ఘోరంగా సానుభూతికి అడిక్ట్ అవుతాము. ఆ విషయంలో నన్ను నేను అభినందించకోక తప్పదు. పనికిమాలిన ‘అయ్యో పాపం’ గాళ్ళనీ, ‘ఎంత కష్టం ఆ దేవుడు నీ నెత్తి మీద పెట్టాడే తల్లి’, అని ముక్కు చీదుకునే అచ్చెమ్మ, బుచ్చెమ్మల్ని ఆమడ దూరం పెట్టాను. అన్ని రోజులు ఒకేలా ఉన్నట్టూ, ఒకేలా గడిచిపోతున్నట్టూ అనిపిస్తుంది, కానీ తరచి చూస్తే ఏ రోజు ప్రత్యేకత ఆ రోజుదే. ‘మొన్నటి’లో జీవించే వాడికి ‘నిన్నటి’ మజా ఎన్నడూ అర్థం కాదు. బూజుపట్టిన ఊరగాయ లాంటివాళ్ళు అటువంటి వాళ్ళు. నేను పొరపాటున కూడా అలా జీవించలేను. నిన్నటి కథలల్ని, మొన్నటి వ్యధల్ని తలుచుకోవడం అంటే నాకూ మహా చిరాకు. నా దృష్టిలో ప్రతి ఉదయం ఓ జననంలాంటిది. ప్రతి అస్తమయమూ, అంటే సూర్యాస్తమయమూ ఓ మరణంలాంటిదే. ఇదే మాట బోలెడుమంది చెప్పి ఉండవచ్చు, నేను గంట బజాయించి చెబుతున్నా, నేను చేతలదాన్నే కానీ మాటలదాన్ని కాదని. ఇది నా జీవిత కథ, అబద్ధాలు చెప్పాల్సిన ఖర్మ నాకెందుకూ. ఢంకా బజాయించి చెబుతా, ఆపై మీ ఇష్టం. సరేనా. ఓ చిన్న బ్రేకు..
వచ్చేవారం కలుద్దాం. నమస్సులతో
మీ
భువనచంద్ర