top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

పాండి బజార్ కథలు - 2

ఓ కప్పు కాఫీ.. ఓ సిగరెట్… బస్!

భువనచంద్ర

సారంగపాణి స్ట్రీట్.

పొద్దున్నించీ అక్కడక్కడే తిరుగుతున్నాను.

'రాఘవన్' ఇల్లు ఆ చివర వీధని ఒకరంటే, యీ చివర వీధని ఇంకొకరు. ఇద్దర్నీ కలిశా. కానీ, వాళ్లిద్దరూ తమిళ రాఘవన్‌లు. నాక్కావలసింది తెలుగు రాఘవన్. అతడు తెలుగువాడని మాత్రం తెలుసు. నేనెప్పుడూ మలర్‌కొడి మేన్షన్‌లో వుండేవాడ్ని. దానికి మేనేజర్ 'రవి'

"భువన్‌జీ. పొద్దున్నే ఓ టెలిగ్రాం వచ్చింది. ఎడ్రెస్‌డ్ టు రాఘవన్ అని. ఆ రాఘవన్ అసలు పేరు రాఘవరావు. మీ తెలుగువాడు. అంతకు ముందు అప్పుడప్పుడూ వచ్చి ఉత్తరాలు కలెక్టు చేసుకుపోయేవాడు. ఓ ఆర్నెల్లుగా ఇటు రావట్లేదు. మీ తెలుగువాళ్లనే ఎంక్వయిరీ చేస్తే అతను సారంగపాణి స్ట్రీట్‌లో ఉన్నట్టు తెలిసింది. టెలిగ్రాం కంటెంట్ చాలా సీరియస్. అతని భార్య పోయిందిట. మీరేమన్నా యీ కబురు అతనికి అందించగలరా?" అని తమిళం లో చెప్పాడు.

"ష్యూర్. తప్పక అందిస్తాను. థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్" అని రవికి ధన్యవాదాలు చెప్పి టెలిగ్రామూ, ఉత్తరాలూ తీసుకున్నాను. భగవతీ విలాస్‌లో కాఫీ తాగి నడుస్తూనే సారంగపాణి  స్ట్రీట్ అంతట్నీ జల్లెడ పడుతున్నాను. మిట్టమధ్యాహ్నమయినా 'రాఘవన్' జాడ దొరికే అవకాశం దొరకలేదు. ఏ ఇంట్లో అడిగినా, "అతను ఎలా వుంటాడూ?" అనడుగుతున్నారు. చూస్తేగా చెప్పడానికీ!.

"ఏమిటీ… కవిగారేమిటీ రోడ్డుమీద చెక్కర్లు కొడుతున్నారు?" అన్నదో పాతికేళ్ళ అమ్మాయి. అప్పటికి నేను రాస్తే మహా అయితే- అయిదో, ఆరో సినిమాలకి పాటలు రాసి ఉంటాను. ఖైదీ 786 ఇంకా రిలీజ్ కాలేదు. అయ్యుంటే "గువ్వా గోరింకతో" పాట ద్వారా నా గురించి తెలిసి వుండేది. రిలీజ్ కాలేదాయే. రిలీజ్‌కి ముందరే ఏ పాట హిట్టవుతుందో ఎవరు చెప్పగలరూ?

"కవిగారెవరూ?"తెలీనట్టుగా అన్నాను.

"మీరే కదా స్వామి. నాకూ పెళ్లాం కావాలి, ప్రాణస్నేహితులు, మా యింటి మహారాజు. ఇవన్నీ మీరు పాటలు రాసిన సినిమాలేగా మీరు నాకు బాగా తెలుసు. డాక్టరుగారి దగ్గర ఆల్‌మోస్ట్ రోజూ చూస్తూనే వుంటాను. నేను మీకు బొత్తిగా తెలీదు. కారణం మీరు నన్ను గమనించకపోవడం"నవ్విందా అమ్మాయి.

"ఓహ్. రియల్లీ సారీ. గమనించనందుకు" నొచ్చుకున్నాను.

"ఫరవాలేదులెండి. ఏమిటీ సారంగపాణి స్త్రీట్ పొడుగు కొలుస్తున్నారు" మళ్లీ నవ్విందామె.

"రాఘవన్ అనే వ్యక్తి కోసం వెతుకుతున్నాను." అన్నాను.

"బాగుంది. కేరళ వెళ్లి 'నాయర్' అనే వ్యక్తిని వెతుకుతున్నా అన్నా, బెంగాల్‌కి పోయి ఫలానా 'చటర్జీ'నో, బెనర్జీనో వెతుకుతున్నా అన్నా, పంజాబ్‌కి పోయి ఏదో 'xyz సింగ్'ని వెతుకుతున్నానన్నా, ఇక్కడ రాఘవన్‌ని వెతుకుతున్నానన్నా ఒక్కటే. ఇంతకీ ఎవరా రాఘవన్. ఏమా కథ?" అన్నది.

"ఆయన్ని నేనూ చూడలేదు. ఆయన పేరున 'వైఫ్ ఎక్స్‌పైర్డ్' అని టెలిగ్రాం వచ్చింది. కొన్ని వుత్తరాలు కూడా. ఆయన యీ సారంగపాణి స్ట్రీట్‌లోనే ఎక్కడో వుంటున్నాడని తెలిసింది. అతను తమిళవాడు కాదు. రాఘవరావనే తెలుగువాడు" వివరించాను.

"అలాగా… అయితే ఖచ్చితంగా వెతకాల్సిందే. ఓ పని చేద్దాం. తెలుగువాళ్లు ఎవరున్నా ఇక్కడున్న శ్రీవిలాస్‌గారికి తెలిసే వుంటారు. ఆయన్ని కనుక్కుందాం" అన్నది.

"శ్రీవిలాస్‌గారు నాకెందుకు తెలీదు. నా ఫ్రెండే. బుక్స్ పేరడైజ్ ఆయనదేగా. ఇప్పుడు ఇంట్లో వుంటారు.  వారుండేది ఆంధ్రా క్లబ్‌కి వెళ్ళే విజయరాఘవ రోడ్‌లోనే"అన్నాను.

"ఇంకేం. ఆయన్ని ట్రై చెయ్యండి. ఈలోగా నేనూ కాస్త ఎంక్వయిరీ చేస్తా. అదిగో ఆ పచ్చ డాబా వెనకాలున్న ఔట్‌హౌసే నేను వుండేది. నా పేరు లావణ్య. నిరభ్యంతరంగా నన్ను కలవొచ్చు. ఒకవీళ మీరు రాకపోయినా, నాకు గనక అతని అడ్రస్ తెలిస్తే అది మీకు అందేట్టుగా డాక్టరుగారికి ఇస్తాను." అన్నది. నాకు చాలా ఆనందం కలిగింది.

"థాంక్స్ లావణ్యగారూ" అన్నాను.

"మరీ గారూ, చారూ అనక్కర్లేదులెండి. లావణ్యా అంటే చాలు" అన్నది. మరోసారి థాంక్స్ చెప్పి మేన్షన్‌కి బయలుదేరాను. మధ్యాహ్నం పూట ఓ 'బ్రెంజీ'నో(అంటే, వంకాయ రైస్) టమాటో రైసో ఏదో ఒకటి తింటా. ఆ గుప్పెడు చాలు.

నాలుగు నాలుగున్నరకల్లా డాక్టరుగారి దగ్గరకెళ్ళాను. ఎందుకయినా మంచిదని రాఘవన్ విషయం చెప్పి "ఆయన భార్య పోయిందంట. ఈ కబురు అందకపోతే నిజంగా అతని దురదృష్టం కదా?" అన్నాను.

"అన్నింటికీ లోకంలో 'ప్రాప్తం' అంటూ ఒకటి వుంటుంది రాజావారూ. అది లేనప్పుడు పక్కనే వున్నా కూడా కబురందదు." అన్నారు. ఆ తరవాత 'ప్రాప్తం' గురించి చర్చలో చాలామంది తమ తమ అనుభవాల్ని చెప్పారు. వీలున్నంతమందికి యీ రాఘవన్ విషయం నేనూ డాక్టరుగారూ కూడా చెప్పాం. సాయంత్రం 7.30 ప్రాంతంలో ఒకాయన దొరైస్వామి బ్రిడ్జి దాటి ఓ రెండు వీధులు దాటాక, ఎడమవైపు సందులోకి నాలుగు నెలల క్రితం ఓ తెలుగు వ్యక్తి అద్దెకున్నాడనీ, ఇప్పుడు వున్నాడో లేదో తెలీదని, కారణం తను ఇల్లు మారడమేనని చెప్పాడు. ఇంకేం. డాక్టరుగారితో చెప్పి బయలుదేరాను. దొరైస్వామి బ్రిడ్జి దగ్గరే మరి.

బ్రిడ్జి దాటి రెండో సందు లెఫ్ట్‌కి తిరగ్గానే లావణ్య కనిపించింది. "హా..హా. చూశారా.. మీకోసం ఎంత చెమటోడుస్తున్నానో. మా వీధిలో  మధ్యాహ్నమంతా తిరిగితే ఒకతను చెప్పాడు.  సదరు రాఘవన్ యీ వీధిలోకి అద్దెకొచ్చాడని. ప్రస్తుతం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్  ఏమంటే ఆయన అద్దె కట్టి మూడు నెలలు అయిందనీ, తాళం పగలగొట్టి లోపల చూస్తే అతని తాలూకు సామాన్లు  ఏవీ లేవనీ!!" అన్నది.

"నాకోసం మీరింత కష్టపడినందుకు థాంక్స్. అతను దొరకనందుకు నిజంగా బాదగా వుంది. కనీసం రాత్రిలోగా బయలుదేరినా అతడు వాళ్ల వూరు చేరుకోగలడనే ధైర్యంతోనే డాక్టరుగారి దగ్గరా, మరెంతోమంది దగ్గరా యీ టెలిగ్రాం సంగతి చెప్పాను" అన్నాను.

"అవును. మెయిల్‌కి యెక్కినా చేరగలడు. కానీ అసలతని ఊరేమిటీ? అదన్నా తెలిస్తే ఆ ఎడ్రస్‌కో టెలిగ్రాం ఇచ్చి 'పర్సన్ నాట్ ఫౌండ్ అని వాళ్ల వాళ్లకి ఇన్‌ఫర్మేషన్ ఇవ్వచ్చు" అన్నది లావణ్య.

"టెలిగ్రాం వచ్చింది మాత్రం తెనాలి నించి. అందులో అడ్రస్ వుండదు కదా. ఇహపోతే అతనికొచ్చిన ఉత్తరాలు కొన్ని వున్నాయి. వాటిని చించి చదవడం సభ్యత కాదు." అన్నాను. "ఇప్పుడు మనకి కావల్సింది 'సభ్యత' గురించిన మంచీ చెడ్డా కాదు. అతని తాలూకు సమాచారం కావాలి. కనీసం వాళ్ళ వాళ్ల ఎడ్రెస్ కావాలి" అన్నది లావణ్య.

"బట్" నేను సందేహించాను.

"ఈ విషయాల్లో మగవాళ్లకంటే ఆడవాళ్ళే బెటర్. మా కుతూహలం 'సభ్యత'ని జయిస్తుంది. ముందా ఉత్తరాలు నా చేతికిస్తే ఆ తర్వాత ఏం చెయ్యాలో నేనది చూస్తాను. అయితే కవిగారూ, ముందు నాకో స్ట్రాంగ్ కాఫీ కావాలి. అభ్యంతరం ఏమీ లేదు కదా?" అన్నది. "లేదు . పదండి" అన్నాను.

ఉమ్మిడియార్స్, నల్లీస్ దాటితే వెంకటనారాయణ రోడ్ టర్నింగ్‌లో క్రింద మాంచి కాఫీ హోటల్ అదే 'వుడ్‌లాండ్స్' మేం లోపలికి వెళ్తుండగానే మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తూ బయటికొచ్చాడు నవీన్ కుమార్. "హాయ్.. ఎంజాయ్" అంటూ కొంచెం వెకిలిగా నవ్వి బయటికి వెళ్ళాడు. అతను నాకు పెద్ద పరిచయస్థుడు కాదు. డాక్టర్‌గారి దగ్గరికి అప్పుడప్పుడూ వస్తూ వుంటాడు. నాకు తెలిసినంతవరకూ ఓ అయిదారు సినిమాల్లొ ఎక్‌స్ట్రా వేషాలు వేసినట్టు గుర్తు. అంటే- హీరోకి 'దూరపు ఫ్రెండ్స్' గ్రూప్‌లోనో, విలన్స్ డెన్‌లో ఎర్ర బనీను నల్ల కళ్ళద్దాలతో వుండే అసిస్టెంట్ విలన్‌గానో యాక్ట్ చేశాడని విన్నాను. ఓసారైతే డాక్టరుగారితో "గురూగారూ 'ఫలానా' పిక్చర్ రిలీజైతే నేను హిట్ కొట్టడం గ్యారంటీ. అయిదు సీన్లు చేశా" అని అతను చెప్పడం నాకు గుర్తుంది. అతను వెకిలిగా నవ్వడమే నాకు ఆశ్చర్యం కలిగించింది.

"ఆశ్చర్యమా? ఇంకా మీకు సినిమా రక్తం ఎక్కలేదు. ఇండస్ట్రీకి తెలిసినంతవరకూ మీరు బ్యాచిలర్లు  వుండే మలర్‌కొడి మేన్షన్‌లో వున్నారు. అంటే మీకు పెళ్ళైనా, కాకపోయినా బ్యాచిలర్ కిందే లెక్క. అలాంటి మీరు ఓ అమ్మాయితో, అదీ ఎక్‌స్ట్రా నటీమణితో కనిపించారంటే జనాలు ఏమనుకుంటారు? 'షేక్‌హేండ్' ఎఫైర్ అనుకుంటారు" పకపకా నవ్వింది లావణ్య. నవ్వేటప్పుడు కళ్ళల్లో మెరుపు, బుగ్గ మీద పడ్డ సొట్ట నా దృష్టిని దాటిపోలేదు.

'షేక్‌హేండ్ ఎఫైర్ అంటే?" అడిగాను. నిజంగా నాకు తెలీదు.

"ప్రతీ పరిశ్రమకీ తనదనే ఓ పరిభాష వుంటుంది. ఇక్కడెవరన్నా టిఫిన్ చేద్దామా అన్నారనుకోండీ.. అదే, అపోజిట్ సెక్స్ వాళ్లతో .. దానికర్ధం 'ముద్దూ ముచ్చట' కానిద్దామని. "డిన్నర్ ఎప్పుడిస్తావ్?' అన్నారనుకోండి. అంటే శోభనానికి పిలుపన్నమాట. ఇక 'షేక్‌హేండ్ అఫైర్' అంటే తాత్కాలిక పరిచయాలన్నమాట. ఈ పరిచయం పరిధి టిఫిన్ కావొచ్చు, డిన్నర్ కావొచ్చు. ఏదైనా కావొచ్చు. అయితే అది షేక్‌హేండ్ ఇచ్చుకుని కలిసి, షేక్‌హేండ్‌తో విడిపోతూ ఈజీ టూ గో సంబంధమన్నమాట" మళ్లీ నవ్వి అన్నది లావణ్య.

"మైగాడ్!" అన్నాను నిజంగా ఆశ్చర్యపోతూ.

"ఇప్పుడు ఆశ్చర్యపోవడంలో వింత లేదు. తరవతరవాత యీ భాష అలవాటైపోతుంది. అలవాటు చేసుకోకుండా వుండేవాళ్లు నిజంగా జితేంద్రీయులు" అంది లావణ్య.

కాఫీ వచ్చింది. నిజంగా బావుంది.

"రెండో కప్పు కూడా తాగితే మీకేమన్నా అభ్యంతరమా?" అన్నది.

"మీరు హాయిగా తాగొచ్చు. నాకు మాత్రం ఒక కప్పు ఎక్కువే" నవ్వాను.

"OK" రెండో కప్పుకి ఆర్డరిచ్చింది లావణ్య.

"అయితే మీరు సినిమాల్లో నటిస్తున్నారన్నమాట" అన్నాను.

"'నటిస్తున్నాను' అనేంత పెద్దమాటని వాడలేనుగానీ, సినిమాయే నన్ను బ్రతికిస్తున్నది. అది చిన్న చెలికత్తె వేషం గానీండి, గుంపులో గోవింద వేషం కానీండి, డబ్బింగ్ గ్రూప్‌లో అరుపులు కానీండి ఏదైతేనేమి నెలకో అయిదారు వేలు సంపాయిస్తున్నా. నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నా" అన్నది.

"మీవాళ్లు... "అడగబోయి ఆగిపోయాను.

"సందేహించక్కర్లేదు. ఏ ప్రశ్న అయినా అడగొచ్చు.. ఎదుగుతున్న ఓ కవిగారితో కబుర్లు చెప్పడమంటే నా 'లెవెలు' కాస్త పెరిగినట్టే" అంటూ పకపకా నవ్వి "మీ ప్రశ్న నాకు అర్ధమయింది. నాకు అందరూ వున్నారు. కానీ ఎవరూ లేనిదానికిందే లెక్క. నా జీవిత సంగ్రహాన్ని ఓ ప్లేటు పకోడీలానో, మిర్చీబజ్జీలాగానో మీ ముందు పెట్టవచ్చు కానీ, కాఫీ తాగాక టిఫిన్ తినడం బాగోదు కదా. అందుకే కాస్త గేప్ ఇస్తా. ఇందాకటినుంచీ ఆ వుత్తరాల్లో ఏముందా అనే కుతూహలం నన్ను తినేస్తోంది. ముందు ఆ వుత్తరాలు బయటికి తియ్యండి" అన్నది.

"రూంలో వున్నాయి" అన్నాను.

"అయితే అర్జంటుగా ఆ పని చూద్దాం" ఊదుకుంటూ రెండో కప్పు కాఫీ ఖాళీ చేసి నుంచుంది లావణ్య. బిల్లు చెల్లించి బయటపడ్డాం. ఆమెని భగవతీ విలాస్ టర్నింగ్‌లో నిలబెట్టి నేను రూంకెళ్ళి ఉత్తరాలు తీసుకొచ్చాను. మెట్లు దిగుతూ వుండగానే ఆలోచన. ఎక్కడ కూర్చుని ఉత్తరాలు ‘శోధించాలీ' అని.

కిందకి వెళ్లి కలవగానే "మా యింటికి  పోదామా?" అన్నది. వేరే దారి లేదు. డాక్టరుగారి దగ్గరికి వెళ్లొచ్చు గానీ, సాయంత్రాలు అక్కడ మరీ రద్దీగా వుంటుంది. వాళింటికే వెళ్ళాం. చిన్న గది, ఓ చిన్న కిచెన్. అవతలి పక్కన బాత్‌రూం. ఓ ఐరన్ కాట్, దాని మీద కాటను పరుపు రెండు దిళ్లు. అన్నీ లేత పసుపు పచ్చరంగువే. దండెం మీద నీటుగా హేంగర్లకి వేళ్ళాడుతున్న నాలుగైదు చీరలు, జాకెట్లు. ఓ కుర్చీ ఓ చిన్న రైటింగ్ టేబుల్. ఓ మూల కూజా. దానిమీద బోర్లించిన చిన్న గాజుగ్లాసు. ఇల్లు…సారీ గది పొందిగ్గా వుంది. కిచెన్‌కీ గదీ’కీ' మధ్య కర్టెన్. అదీ పసుపు పచ్చ కర్టెనే.

"కూర్చోండి." కుర్చీ చూపించి మంచం కిందనించి ఓ  'మోడా' బయటకి లాగి కూర్చుంటూ అన్నది. 'ఇది మన ఆశ్రమంబు' అని పాడాలని వుందిగానీ, నా గొంతు నెమలిగొంతు. వింటే అంత బాగోదు.." నవ్వి అన్నది.

"మీ వాయిస్ కేమీ!" అన్నాను.

"హా..హా.. అక్కడే పప్పులో కాలేశారు. సినిమా అంటేనే మరో అర్ధం 'మార్పు' అని. ఇక్కడికొస్తూనే అన్నీ మార్చుకోవాలి. కట్టూబొట్టూ, పేరు ఊరూ, ఆఖరికి వాయిస్ కూడా. ఇది నా ఒరిజినల్ వాయిస్ కాదు" అన్నది. "OK ముందా వుత్తరాలు ఇటు పడెయ్యండి. ఐనా త్వరగా 'సభ్యత' నడ్డి విరగ్గొట్టాలా అని ఆత్రంగా వుంది. "జేబులోనించి నేను తీస్తుండగానే వుత్తరాల కట్టని లాక్కుంటూ అన్నది . 'కట్ట' అంటే బోలెడన్ని ఏమీ లేవు. మొత్తం ఆరు ఉత్తరాలు. అన్నీ ఇన్‌లాండ్ లెటర్సే. 

"మీరు చదవొద్దు. ముందు నేను చదివి వినిపిస్తా. OK" అంటూ ఓ ఉత్తరాన్ని జాగ్రత్తగా తెరిచింది. తనలో తనే చదివి నిట్టూర్చింది. నోట మాట లేదు.

"ఏమయింది?" అడిగాను.

"ఏం చెప్పనూ! అన్ని కథలు కంచికే ఎందుకో అర్ధమవుతోంది."నిర్లిప్తంగా అన్నది.

"చెప్పొచ్చుగా?" నా గొంతులోనూ కుతూహలం ధ్వనించింది.

"చెప్పటానికేముందీ. ఒకే కథని నలుగురు సినిమా తీసినట్లుగా వుంది... చదువుకోండి." ఉత్తరం నా చేతికిచ్చింది. జ్ఞాపకం ఉన్నంతవరకూ రాస్తున్నాను. మెయిన్ కంటెంట్ మాత్రం అదే.

ఏవండీ,

ఎన్నోసార్లు మీకు ఉత్తరాలు వ్రాశాను. ఎన్నోసార్లు మీకు ఫోన్లు చేయించాను. పది ఉత్తరాలు వ్రాస్తే ఒక్క కార్డుముక్క రాస్తారు 'తొందరగా వచ్చేస్తాను' అని. నా పరిస్థితి ఏమిటో నాకే అర్ధం కావడం లేదు. మద్రాసులో ఉద్యోగం అని మావాళ్లకి చెప్పి నన్ను పెళ్ళి చేసుకున్నారు. మూడ్నెల్లు ఊహల్లో ఉయ్యాలలూగించారు. ఆ తరవాత మా నాన్న కట్నంగా నాకు రాసిచ్చిన రెండెకరాల్నీ మీ పేర రాయించుకున్నారు. ఆ డబ్బు ఏమయిందో తెలీదు. నా నగలన్నీ మీ అమ్మానాన్న కరిగించేశారు. ఎక్కడికి పోనూ.  పోనీ పుట్టింటికి పోదామా అంటే అమ్మానాన్నా ఒకరితరవాత ఒకరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనున్న పరిస్థితి దేవుడా.. ఎవరికీ వద్దు. ఎలా చెప్పాలో కూడా తెలియడంలేదు. మీ నాన్నగారి పద్ధతి బాగోలేదు. మీ అమ్మగారు గుళ్ళోకెళ్ళినా, దొడ్లోకి వెళ్లినా నా పరిస్థితి చెప్పనలవి కాదు. కొడుకు భార్యనని కూడా చూడకుండా చీ..  పైకి మాట్లాడేవి ధర్మశాస్త్రాలు. నేను ఇక్కడ నిజంగా వుండలేను. రోజుకి ఒక్కసారైనా ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంది. దయచేసి యీ చెర వొదిలించండి.

ఇట్లు

XXXX

 

సైలెంటైపోయాను. "హో.. చదివారా?" సరే.. ఆ రెండోది చూద్దాం.. ఆగంది డేట్ వారీగా పెడదాం. అప్పుడే విషయం తెలుస్తుంది." అన్నది లావణ్య. ముఖంలో నవ్వులేదు. చెప్పలేని బాధ వుంది. ఈసారి తనే చదివింది.

"ఏమండీ,

నేను అసలు రాస్తున్న వుత్తరాలు మీకు అందుతున్నాయా? ఈ కొంపలో నా శీలం బతికి బట్టగడుతుందని నాకు నమ్మకం లేదు. వదినగారని కూడా చూడకుండా అన్నగారి ఆనతి పాలిస్తూ ఆనాడు దుశ్శాసనుడు చీరని మాత్రమే లాగాడు. మీ తమ్ముడు డైరెక్టుగా పైట పట్టుకునే లాగుతున్నాడు. ఆ కాలంలో  ధృతరాష్ట్రుడు చెయ్యని పనిని అంటే కోడళ్ళని బలవంతం చెయ్యని పనిని మీ నాన్న చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాడు. అడవిలో అయినా ఆడదానికి కూరమృగాల మధ్యన రక్షణ వుంటుందేమో గానీ యీ నరమృగాల మధ్య మాత్రం ఇంకెంతకాలం ఉండగలనో తెలీడం లేదు. మీరు త్వరగా నన్ను తీసికెళ్లకపోతే నాకు మరణమే శరణం.

ఇట్లు

XXX

 

మిగతా ఉత్తరాల కంటెంట్ కూడా ఇదే. అయితే పరిస్థితి తీవ్రమయిందని వుంది. ఇప్పుడు వచ్చిన టెలిగ్రాం ప్రకారం ఆ అమ్మాయి చచ్చిపోయింది. నిజంగా చచ్చిపోయిందా లేక చంపబడిందా, లేక తనని తనే చంపేసుకున్నదా అనేది ఎవరికెరుక?

మనసంతా భరించరాని వేదనతో నిండిపోయింది. ఇటువంటి కథలు నాకు కొత్త కాదు "మనసు పొరల్లో”(నా నవల).

నేను ఆ గదినించి బయతికి వస్తుంటే అన్నది, "కవిగారూ ఆ వెధవ అడ్రస్ మీక్ దొరికినా నాకు చెప్పొద్దు. తెలిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు" అని

అతను ఫీల్డుని వదిలి వెళ్లిపోయాడని కొందరూ, పేరు మార్చుకుని బాలివుడ్‌లో స్థిరపడ్డాడని కొందరూ, హైద్రాబాదులో వున్నాడని కొందరూ అప్పుడప్పుడూ అన్నా, ఆచూకీ మాత్రం స్పష్టంగా దొరకలేదు.

ఇక లావణ్య సంగతి. చాలాసార్లు కలిశాం. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తూ వుండగా పెళ్లయిందనీ, ఆ తరవాత మొగుడు యీవిడ నగలు తీసుకుని ఎక్కడికో చెక్కేస్తే అత్తామామలు ఆడపడుచు మొగుడూ మరుదులూ పెట్టే శారీరక మానసిక హింసలు భరించలేక మద్రాసు వచ్చిందన్న విషయం తనే చెప్పింది.

నేను రచయితగా బిజీ అయ్యే సమయానికే లావణ్య కూడా బిజీ అయ్యింది నటిగా. కొన్ని సినిమాళ్ళో మంచి పాత్రలే వేసింది. ఫైన్ మార్నింగ్ ఓ నలభై ఏళ్ళ బిజినెస్‌మేన్‌ని గుళ్ళో పెళ్ళి చేసుకున్నానని చెప్పింది. ఆవిడ మాటల్లోనే చెప్పాలంటే... "మధుసూధనన్ మంచివాడు. బిజినెస్‌మేనేగానీ, జీవితాలతో బిజినెస్ చెయ్యడం రానివాడు. ఓ బలహీన క్షణంలో అతను నాకు దగ్గరవ్వడం నా అదృష్టం. అతని భార్య పిల్లలూ కర్నాటకలో వుంటారు గనక ప్రాబ్లం లేదు.  ఒకవేళ నాకు పిల్లలు పుట్టినా హాయిగా నేనే పెంచుకుంటాగానీ అతని మీద భారం పెట్టను" అని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పింది.

ఓ ఇరవైయ్యేళ్ళ క్రితమే ఆవిడ తన ఏకైక మితృడితో బెంగుళూరు వెళ్లిపోయి అక్కడో బ్యూటీ క్లినిక్ పెట్టుకుంది. వెళ్ళే ముందు మాత్రం "కవిగారూ ఒక్కసారి ఓ కప్పు కాఫీ కలిసి తాగుదాం. ఆ తర్వాత ఒకే ఒక్క సిగరెట్, అదీ మీ జేబులోది కాల్చేసి నా దారిన నేను వెళ్లిపోతా!" అన్నది నవ్వుతూ.

ఇప్పటికీ సారంగపాణీ స్ట్రీట్ వైపు వెళ్లినప్పుడు లావణ్య వున్న ఇంటిముందు ఓ క్షణం ఆగుతా. జ్ఞాపకాల నీడలు తప్ప అక్కడేమీ లేవు. ఆ ఇళ్లు పడగొట్టి ఎప్పుడో కమర్షియల్ కాంప్లెక్సులు కట్టారు. జ్ఞాపకాలు కూడా శిథిల్లాలాంటివేగా!!

మీ

భువనచంద్ర

 

Tags, Bhuvana Chandra, Pandey Bazaar Kathalu, madhuravani telugu magazine, Telugu Film Industry, TFI

bottom of page