top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం

స్పర్శ

భువనచంద్ర

"వెల్ కమ్!" నవ్వుతూ ఓ గులాబీ పువ్వూ ఓ చాక్లెట్ ఇచ్చింది సుజాత.

"థాంక్యూ సుజీ!" నవ్వాడు వెంకట్రావు ఆకెళ్ళ.

"వీరు మా వారు శ్రీకాంత్. రైల్వే సూపరింటెండెంట్ గా రిటైరయ్యారు" భర్తని పరిచయం చేసింది సుజాత.

"ఓహ్. గ్లాడ్ టు మీట్యూ సార్. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. అంతేకాదు, మా కాలేజ్ బ్యూటీని పెళ్లి చేసుకోగలిగినందుకు అభినందనలు" శ్రీకాంత్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు వెంకట్రావు.

"ఈజిట్? మీ కాలేజ్ బ్యూటీనని ఎప్పుడూ సుజాత నాతో చెప్పలేదే!" ఆశ్చర్యంగా అన్నాడు శ్రీకాంత్.

"ఆ విషయం మాలో మేము అనుకునేవాళ్ళం గానీ, సుజాతతో చెప్పే ధైర్యం ఆనాడు లేదు కదా! ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడైనా చెప్పకపోతే బ్రతికి లాభమేముందీ!" పకపకా నవ్వి అన్నాడు వెంకట్రావు.

"నాయనా వెంకీ. మునగ చెట్టు ఎక్కించకు" చిన్నగా నవ్వి అన్నది సుజాత.

"సుజాతగారూ, వెంకట్ అన్నమాట ముమ్మాటికి నిజం. అసలు మీరెప్పుడొస్తారా అని చాలామందిమే ఎదురు చూసేవాళ్ళం. మీరేరంగు డ్రెస్ వేసుకొస్తారా అని పందెం కూడా వేసుకునే వాళ్ళం" ఓ నిమిషం ముందే అక్కడికొచ్చిన సారధి సంతోషంతో విచ్చుకున్న మొహంతో అన్నాడు. 

“రియల్లీ?" ఆశ్చర్యంగా అన్నది సుజాత.

"అరవై దాటాక అబద్ధాలు ఎందుకు చెబుతాం?" అప్పుడే వచ్చిన సూర్యం అన్నాడు.

"సరే సరే, ముందర మీరంతా టిఫిన్ చేసి రండి. అదిగో, మరో గ్రూప్ వస్తోంది" గేటు వైపు చూస్తూ అన్నది సుజాత.

"టిఫిన్ దేముందీ! రోజూ చేసేదేగా. ఈరోజు మళ్ళీ మన జీవితాల్లో వస్తుందో రాదో! రేయ్ వెంకట్, అదిగో. వసుమతి వస్తోందిరా" ముఖం విప్పార్చి  ఆమె వంకే చూస్తూ అన్నాడు సూర్యం.

  "నిజమేరా.! అప్పుడు అజంతా శిల్పంలా ఉండేది. ఇప్పుడెలా అయ్యిందో. అదో, ఆ నవ్వొక్కటే మారలేదు" వసుమతిని చూస్తూ అన్నాడు వెంకట్.

"ఏం నాయనా.  పిల్లల్ని కనీ, పెంచీ మేం కాస్త లావు అయిపోవటం సహజమే. మరి నీ సంగతీ?  మీరు మాత్రం మారలేదా? ఆనాటి దేవానంద్ క్రాఫ్ లూ, ఆర్.నాగేశ్వర్రావ్ సైడ్ బన్స్ పోయి బట్టతలలు రాలేదా?" చిరుకోపంగా అన్నట్టు అన్నది సుజాత నవ్వుతూనే.

"క్షమించు తల్లీ. మాది తప్పే. ఇంకా నీ స్త్రీవాదం పోలేదు గదా" రెండు చేతులూ పూర్తిగా పైకెత్తి దండం పెడుతూ అన్నాడు వెంకట్రావు. ఈలోగా వసుమతి గ్రూప్ వచ్చేసింది. 

"అవునోయ్ కృష్ణా. ఆ రోజుల్లో నువ్వు హంబర్ సైకిల్ మీద వచ్చేవాడివి గదా! అది ఇంకా వుందా, పారేశావా?" సూర్య పక్కన ఉన్న కృష్ణారెడ్డిని అడిగింది వసుమతి.

"అబ్బా! ఎంత జ్ఞాపకం? సెకండ్ ఫాం లో నీ చెప్పులు తెగిపోత లిఫ్ట్ ఇచ్చాను, ఆ విషయం జ్ఞాపకం ఉందా?" 'ఇంత' మొహం చేసుకుని నవ్వుతూ అన్నాడు కృష్ణారెడ్డి. 

"ఎందుకు గుర్తులేదూ? మగపిల్లాడి వెనకాల సైకిల్ మీద కూర్చుని ఇంటికొస్తావుటే భడవా, అని మా బామ్మ తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టింది కదా!" నవ్వింది వసుమతి. 

"ఆ రోజులే వేరు!" నిట్టూర్చి అన్నది చంచల.

“ఇదిగోనోయ్, నీ రెండో కృష్ణుడు వస్తున్నాడు” వసుమతి వీపుమీద చరిచి అన్నది పారిజాతం.

“నీ అల్లరి బుద్ధి పోలేదే పారీ,  మా ఆయన అక్కడ సిగరెట్ పీలుస్తున్నాడు. దూరంగా ఉన్నాడు గనక సరిపోయింది, వింటేనా జన్మంతా కాఫీ గింజల్ని వేపుకు తినట్టు నన్ను వేపుకు తినేవాడు” చిరుకోపంగా అన్నది వసుమతి.

“మరీ అంత జిడ్డుగాడా? సరేలే కాసేపు మీ ఆయన్ని నేను కబుర్లలో పెడతాగానీ, ఇప్పుడైనా ఆ కృష్ణమూర్తితో రెండు మాటలైనా మాట్లాడు” మరోసారి వసుమతి వీపుమీద చరిచి, సిగరెట్ తాగుతున్న వసుమతి భర్త వైపు నడిచింది పారిజాతం.

“బాగున్నారా వసుమతీ” వసుమతిని కళ్ళనిండా నింపుకొని అన్నాడు అప్పుడే వచ్చిన కృష్ణమూర్తి.

“ఇన్నాళ్ళకి ఇలా ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ జరుగుతోంది గనక కలిశాముగానీ, లేకపోతే ఎవరున్నారో ఎవరు పోయారో కూడా కాదు తెలిసేది కాదు గదా!” భాస్కర్రావు చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కుతూ అన్నాడు సుందరమూర్తి. వాళ్ళిద్దరూ ఎలిమెంటరీ స్కూల్ డేస్ అప్పటినుంచి స్నేహితులు.

“అవున్రా మనకు సుదర్శనంగాడు పోయాడట. ఇక్కడికి వచ్చాకే ఆ విషయం తెలిసింది. కాంతారాణి గుర్తుందా? తను హాస్పిటల్లో ఉందట. ఒరేయ్. రమాదేవి సూసైడ్ చేసుకుందట్రా”. గద్గద స్వరంతో అన్నాడు భాస్కర్రావు.

“నువ్వామెని ప్రేమించావు గదూ?” నిట్టూర్చి అన్నాడు సుందరమూర్తి.

“ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పుడు వచ్చింది కూడా రమని చూడడానికే. కానీ,” సైలెంటయిపోయాడు భాస్కర్రావు.

“బాధపడొద్దురా. అందరం ఏదో ఓ రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే” ఓదార్చాడు సుందరమూర్తి.

* * *

 

“హాయ్ ఎవ్రీబడీ!” నల్లద్దాల కళ్ళజోడులో స్టైలిష్ గా చెయ్యి ఊపింది ఒకామె.

 “ఎక్కడో చూసిన గుర్తురా, బహుశా బేచ్ అయి ఉండదు” అని కృష్ణారెడ్డితో అని, “హలో. కొంచెం గుర్తు పట్టలేకపోతున్నాం. పేరు చెప్పరూ. దశాబ్దాలు గడిచాయి కదా మరి” నవ్వుతూ చేయి అందిస్తూ అన్నాడు సారథి. 

“వాటే పూర్ మెమరీ! నా కోసం కవితలూ, ప్రేమలేఖలూ వ్రాసిన విషయం కూడా గుర్తులేదా?” కళ్ళజోడు తీసి నవ్విందామె. 

“మైగాడ్ శిరీషా. అచ్చు అప్పట్లాగే ఉన్నావు. నిజంగా నువ్వేనా. నువ్వేనా?” ఆమె చేతిని మహాసంతోషంగా వూపుతూ అన్నాడు పార్థసారథి.

“అవును బాబూ నేనే, ముమ్మాటికీ నేనే. నా చెయ్యి ఎంతసేపు పట్టుకున్నా నాకు ఓకే గానీ, మీ ఆవిడ చూస్తుందేమో చూడు. కొంప కొల్లేరయిపోతుంది” నవ్వింది శిరీష.

“ఆ చాన్స్ లేదులే. మా అత్తగారికి బాగోలేక పుట్టింటికి వెళ్ళింది. నీ సంగతి ఏమిటీ? ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? పిల్లలెంతమందీ?” వరుసగా ప్రశ్నల్ని సంధించాడు సారధి.

“ఓరి నాయనోయి. ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే, నేనేదో పరీక్ష హాల్లో కూర్చున్నట్లు ఉంది. ఇంతకీ ఇప్పుడు కూడా కవితలు రాస్తున్నావా, మానేశావా?” సారధి భుజాన్ని పట్టుకొని అడిగింది శిరీష.

“అవన్నీ నీకోసం మాత్రమే రాశాను శిరీషా. ఆ తర్వాత ఎవరి కోసమూ వ్రాయలేదు. వ్రాయాలనీ అనిపించలేదు. రాసినా సంతోషపడేవాళ్ళు లేరు. ఇంతకీ పెళ్లయిందా?” అన్నాడు సారధి.

“ఆ! అవునూ అయ్యింది. పెటాకులు అయినాయి” నవ్వుతూనే అన్నది శిరీష.

“సారీ శిరీ. ఎక్కడో ఓ చోట నువ్వు సంతోషంగా ఉంటావనే నమ్మకంతోనే ఇప్పటిదాకా ఉన్నాను. ఇలా ఒంటరిగా ఉన్నావన్న విషయం తెలిసిన ఈ క్షణం మాత్రం చాలా బాధ కలుగుతోంది” సిన్సియర్గా అన్నాడు సారధి.

 “పోనీ మీ ఆవిడకి విడాకులు ఇచ్చేస్తావా? కనీసం ఇప్పుడైనా మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టు గడపొచ్చు”  సారధి కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నది శిరీష.

సైలెంట్ అయిపోయాడు సారధి. ఏం చెప్పాలో అర్థం కాలేదు.

“ఏం చెప్పాలో తెలీటం లేదు కదూ? లోకం ఏమంటుందో అన్న భయం. పెళ్ళాం ఏం అఘాయిత్యం చేస్తుందో అన్న భయం.  పిల్లలేమంటారో అన్న భయం. సమాజంలో నీ పేరు ప్రతిష్టా ఏమౌతాయో అన్న భయం. అడుగు ముందుకెయ్యాలంటే భయం. అడుగు వెనక్కి తియ్యాలంటే భయం, అవునా? సారీ సారధి, ఇవన్నీ నిన్ను బాధపెట్టడానికి అనడం లేదు. నిజాన్ని నిజంగా చెబుతున్నా. అంతే. జస్ట్ ఫర్గెట్ ఇట్. ఈ క్షణంలో కలుసుకున్నాము, ఈ కలయిక హృదయపూర్వకంగా ఆహ్వానించి enjoy చేద్దాం cheer up” అంటూ భుజం తట్టింది శిరీష.

ఆలోచిస్తూనే తల ఊపాడు సారధి.

 

* * *

 

“జీవితం మరోసారి మళ్ళీ చిగిర్చినట్టయింది కదూ. ఎన్ని ఊహలూ ఎన్ని ఆశలూ అన్నీ ఆవిరైపోయి, మనుషుల్లా కాకుండా యంత్రాల్లా గడిపాము. మళ్ళీ ఆమె ఊహలన్నీ తొలకరి చినుకుల్లా మనసులో కురిసినట్టుంది. శరీరానికి వయసు వచ్చినా మనసుకి మళ్ళీ యవ్వనం వచ్చినట్టుంది రాఘవా” రాఘవరావు చేతిని ఊపుతూ సంతోషంగా అన్నది విద్యుల్లత. ఆ రోజుల్లో వారిద్దరిదీ విడదీయలేనంత బంధం. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇద్దరూ కలిశారు.

“నా కూతురి పేరు విద్యుల్లత.” విద్యుల్లత మొహం వంక ఆర్తిగా చూస్తూ అన్నాడు రాఘవ.

“ఏమని పిలుస్తావు?” కుతూహలంగా అడిగింది విద్యుల్లత. ఆమె కళ్ళలో చెమ్మ. 

“విధూ అని” సుదీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు రాఘవ. విద్యుల్లతని ఆ రోజుల్లో “విధూ” అనే పిలిచేవాడు. ఒక్క ఉదూట్న రాఘవని కౌగిలించుకుంది విద్యుల్లత.  

 

* * *

 

“Yes. వాళ్ళిద్దరూ మేము చదువుకునే టైం లో లవర్స్” మేనకోడలు ప్రేమతో అన్నది శారద. శారద విద్యుల్లతకీ రాఘవకీ క్లాస్ మేట్. ఉమ చదివిందీ ఆ కాలేజీ లోనే. 

“అబ్బా ఎంత కాలానికి చూస్తున్నామురా సూర్యారావు మాస్టార్నిని” గబగబా కారు వైపు నడుస్తూ అన్నాడు కాంతారావు. అప్పటికీ ఆల్ రెడీ కారు దిగారు మాస్టారు. వయసు 80 దాటిన ఆరోగ్యంగానే ఉన్నారనడానికి చేతికర్రా కళ్ళజోడు లేకపోవడమే సాక్ష్యం. గబగబా ఓ పాతిక ముప్పైమంది స్టూడెంట్స్ సూర్యారావుగారి వైపుకి పరిగెత్తి, వారికి పాదనమస్కారాలు చేశారు. కొందర్ని ఆయన గుర్తుపట్టి పలకరిస్తే, కొందరు తమని తాము ఆయనకి పరిచయం చేసుకుని తమ అనుభవాల్ని ఆయనకి గుర్తు చేశారు.

“మిమ్మల్నందర్నీ చూస్తుంటే నా వయసు సగానికి సగం తగ్గినట్టుందిరా. ఒరేయ్… నువ్వు కేశవరావువి కదూ.! ఇదేంటి యీ వీల్ చైర్ మీదా?” వీల్ చైర్ ముందు ఆగి అన్నారు సూర్యరావుగారు.

“ఏం చేయను మాస్టారు. పెద్ద ఉద్యోగం ఇంట్లో AC, కార్లో AC ఆఫీసులో AC, బద్ధకం తెగ పెరిగి వళ్ళు అనకొండలాగా పెరిగింది. ఎంత ప్రయత్నించినా తగ్గలేదు. కీళ్ల నొప్పులు. పట్టున పదిగజాలు నడిస్తే రెస్ట్ తీసుకోవాల్సిందే!” వీల్ చైర్లోంచి బలవంతంగా లేచి నమస్కరించాడు కేశవరావు.

 

“నాగరికత తెచ్చిన తిప్పలు” నవ్వారు మాస్టారు.

 

* * *

 

“హేయ్ జై. అటు చూడు. ఆ వస్తున్నా అమ్మాయి అచ్చు మన మదాలస లాగా లేదూ!” జయరాజ్ కులకర్ణి భుజం మీద కొట్టి అన్నది కవిత. అటు చూసిన జై “ఓహ్. అచ్చు మదాలసే, మదాలసే” అంటూ అటువైపు పరిగెత్తినంత వేగంగా అడుగులు వేశాడు. కవిత కూడా అంత వేగంతోనూ వెంబడించింది. “నువ్వు. మీరు.” ఆమె ముందర ఆగి అన్నాడు జై.

 

ఆమె నవ్వింది. “మీరు జయరాజ్ కులకర్ణి. ‘నాసా’లో  పనిచేస్తున్న మోస్ట్ ఫేమస్ ఆస్ట్రో ఫిజిస్ట్. ఆ, మీరు? మీ మెడ దగ్గర కుంకుడు కాయంత పుట్టుమచ్చ ఉంది కనక కవితగారు. అవునా?” కవిత చెయ్యి అందుకుని అన్నది ఆమె.

“మా పేర్లు నీకెలా తెలుసూ?” ఇంతకీ మదాలస నీకేమవుతుందీ?” ఎక్సైటింగ్ గా అడిగింది కవిత.

“మా అమ్మ. తనెప్పుడూ నన్ను కూతురిగా చూడలేదు. ఫ్రెండ్ గానే చూసింది. అన్ని విషయాలు చెప్పింది. తనూ జయరాజ్ గారూ ప్రేమించుకోవడం, మా అమ్మగారి తల్లిదండ్రులు అడ్డు చెప్పడం, ఆయన ఊరొదిలి వెళ్లిపోవడం,  అన్నీ చెప్పింది. మీ గురించీ, మీ స్నేహం గురించీ అయితే రోజుకోసారైనా చెప్పేది” జయరాజ్ వంకా కవిత వంకా చూస్తూ అన్నది జయవంతి. కవిత కళ్ళల్లో చెమ్మ. 

“చెప్పేది అంటున్నావు. ” సడన్ గా అడిగాడు జయరాజ్.

“రెండు నెలల క్రితం చనిపోయింది. ఈ మీట్ అరేంజ్ చేస్తారని మూడు నెలల క్రితం ఫోన్ వచ్చిన దగ్గరినించీ చాలా చాలా ఉత్సాహంగా ఉంది. వద్దామని ఎన్నో డ్రస్సులు, గిఫ్ట్ లూ సిద్ధం చేసింది. జై గారికీ, మీకు చక్కని బట్టలు కూడా కొన్నది. కానీ సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చి.” సైలెంటైంది జయవంతి. 

“Oh God!” నిల్చున్న చోటే కూలబడిపోయాడు జయరాజ్. 

“జై. ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్” కంగారుగా వంగి జయరాజ్ భుజాలు పట్టుకుంది కవిత. తనూ క్రిందకి వంగింది జయవంతి. జయరాజ్ ముఖం నిండా చెమటలు. “కవితగారూ, నా కారు తెస్తాను. ముందు ఆయన్ని హాస్పిటల్ కి తీసుకు వెళ్దాం” పల్స్ చూసి కారు వైపు పరిగెడుతూ అన్నది జయవంతి.

* * *

“థాంక్ గాడ్! యూ ఆర్ సేఫ్” జయరాజ్ ని బయటకి తీస్తూ అన్నది కవిత. జయవంతి పక్కనే ఉంది. 

“మళ్లీ కాలేజీకి.” సందేహిస్తూ అన్నది జయవంతి.

“వద్దమ్మా. నేను స్టేట్స్ నుంచి వచ్చింది కేవలం ఒక్కసారి మీ అమ్మగార్ని చూడటానికే, కవితని కలవటానికే. కవిత కలిసింది. ఇక ఈ జన్మలో మీ అమ్మగారిని చూడలేనని.” సైలెంటయ్యాడు జైరాజ్.

“అయితే మా ఇంటికి పోదాం. ప్లీజ్ అంకుల్. అదీగాక.”

“ఊ. ఏమిటీ?” అడిగింది కవిత.

“మా పెద్దమామయ్య, అంటే మా తాతగారి అన్నగారి కొడుకు, మీకు బాగా తెలుసట. వారు కూడా స్టేట్స్ లోనే డైరెక్టర్ గా పనిచేసి అయిదు నెలల క్రితమే ఇండియాకి పర్మినెంట్ గా వచ్చేశారు. ఆయన వైఫ్ పోవడంతో మా దగ్గరే ఉన్నారు ఆయన పిల్లలు ఇంకా స్టేట్స్ లోని ఉన్నారు” కారుని తన ఇంటి వైపు పోనిస్తూ అన్నది జయవంతి. 

 

* * *

 

“హేయ్. నువ్వా” గబగబా వీల్ చైర్ దగ్గరికి వెడుతూ అన్నాడు జైరాజ్.

“యా. మై డియర్ జై. నేనే. మధుసూదన్ ని” అని నవ్వుతూ, చేయి అందించాడు మధుసూదన్. ఆ గదిలోనే మదాలస ఫోటో. అటువైపు చూశాడు  జైరాజ్. మనిషి ఏమీ మారలేదు. ఏవో చిన్న మార్పులు తప్ప.

“మై హ్యాండ్ ఈస్ వెయిటింగ్ జై” నవ్వి అన్నాడు మధు. స్పృహలోకొచ్చి చెయ్యి అందుకున్నాడు జై. 

“ఐ యాం కవిత” పరిచయం చేసుకుంది కవిత. 

“మీరు పరిచయం లేకపోయినా, గత ఐదు నెలల్లో మీరెవరో. మీ స్నేహమాధుర్యం ఎంతదో మా మధూ, అదే మదాలస చెబుతూనే ఉంది. కనుక కొత్త కాదు” నవ్వి చెయ్యి అందించాడు మధుసూదన్.

“నేను లైట్ గా లంచ్ ప్రిపేర్ చేస్తాను” లోపలికి వెడుతూ అన్నది జయవంతి.

“అబ్బే ఎందుకూ హోటల్ కి.” చెబుతొండగా, “ఈ రోజు కోసం మధు చాలా ఎదురు చూసింది. దయచేసి ఆగు జై, అదీగాక నేను నువ్వు కలిసింది అమెరికాలో. మన పరిచయమూ తక్కువేం కాదుగా. నేను మళ్ళీ అమెరికా రాదలుచుకోలేదు. జయవంతిని సెటిల్ చేసి మా ఊరు వెళ్లిపోవాలనుకుంటున్నా. మొన్నేదో కిందపడి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది,  ఇది బాగుపడిన వెంటనే మా ఊరు వెళ్లాలి” జై చెయ్యి పట్టుకొని అన్నాడు మధు. జయవంతి లోపలికి వెళ్ళింది.

 

* * *

 

కవిత “మీరు మాట్లాడుతూ ఉండండి, జయవంతి కి హెల్ప్ చేస్తా” అంటూ కిచెన్ లోకి వెళ్ళింది. జై సైలెంట్ గా మదాలస ఫోటోనే చూస్తున్నాడు. చెప్పలేని బాధ. మధు అతన్నే చాలాసేపు గమనించి “జై, మదాలస నీకో విషయాన్ని ఎప్పటికీ చెప్పొద్దని ప్రామిస్ తీసుకుంది. కానీ, చనిపోయే ముందర.” ఆగాడు మధు.

“వాట్?” ఆశ్చర్యంగా, ఉద్విగ్నంగా మధు వైపు చూశాడు జై.

“నిజం. నీకు తెలుసా మధు స్టేట్స్ వచ్చిందనీ, దూరాన్నించి నిన్ను చూసిందనీ” మెల్లగా అన్నాడు మధు.

“వాట్?” షాక్ తిన్నాడు జై.

“అవును. మధుకి పెళ్లి నిశ్చయమైందని తెలిసి నువ్వు వెళ్ళిపోయావు. తను మాత్రం పెళ్లి చేసుకోనని పీటలమీదే పెళ్లి కొడుకుతో చెప్పేసింది. అంతే కాదు ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయింది. అప్పటికి నువ్వెవరో కూడా నాకు తెలీదు. హూస్టన్ కి ముందు నేను కాలిఫోర్నియాలో వర్క్ చేసేవాడిని. అక్కడ ఓ తెలుగు మీట్ జరిగితే నువ్వూ, నీ భార్యా వచ్చారు గుర్తుందా? అప్పుడు నిన్ను చూసి నువ్వెవరో నాకు చెప్పింది మధూ. పెళ్లి ఆగాక నేనే తనని అమెరికా పిలిపించాను. కొన్నేళ్ళు నా దగ్గరుంటే తన హెల్త్ బాగవుతుందని” ఆగాడు మధుసూదన్.

“హెల్త్ కి ఏమైందీ?” కంగారుగా అన్నాడు జై.

“తిండి మానేసి కూర్చోవడం వల్ల చాలా వీక్ అయ్యింది. అదీగాక. ఎనీవే. నీనుంచి దూరంగా ఉంది కానీ, నీ భార్యతో మాట్లాడిందట. మీ తల్లిదండ్రుల బలవంతం వల్ల నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావనీ, తనకసలు పెళ్ళంటేనే ఇష్టం లేదనీ, పిల్లలంటే అసహ్యం అనీ చెప్పిందట. ఆ తర్వాతి నెల్లో, నేనూ, నా భార్యా, మధూ కూడా హూస్టన్ వచ్చేసాం. కారణం, హూస్టన్ లో నాకు చాలా మంచి ప్లేస్మెంట్ దొరకడం. నేను ట్రినిటీ హాస్పిటల్లో పని చేసేటప్పుడే మధుకి క్యాన్సర్ వచ్చింది. హూస్టన్ వచ్చాక మధు ఫ్రెండ్ ఒకామె నీ గురించి మీ ఆవిడ మెంటాలిటీ గురించి మధుతో చెప్పిందట. నీకు పెళ్లి అయ్యింది తప్ప పెళ్లి ద్వారా ఏ సుఖమూ లేదనీ, నీ భార్యకస్సలు పిల్లలు పుట్టరనీ చెప్పిందట” మళ్లీ ఆగాడు మధు.

“ఓ గాడ్. కనీసం నన్ను కలిసే ప్రయత్నమే చెయ్యలేదా?” తల పట్టుకున్నాడు జై. కాసేపు నిశ్శబ్దం తాండవమాడింది.

“తన బ్రతుకు ఏమైనా నీకోసం, కేవలం నీకోసం, ఓ బిడ్డని నీ ద్వారా కనాలని మధూ కోరింది. అప్పటికి మధు ఇంకా కేన్సర్ జోన్ లోనే ఉంది. అందుకే, నిన్ను కలిసి, “ఓ ఇండియన్ కపుల్ కి పిల్లలు కావాలనీ, వాళ్లు ‘కుల్ కర్ణీస్’ (మరాఠీ బ్రాహ్మిన్స్) కనక ఆ ఇంటి పేరు వారైతే సంతోషమనీ చెప్పి, నీ చేత స్పెరమ్ ని డొనేట్ చేయించాను. అలా చేయడం మెడికల్ ఎథిక్స్ యాంగిల్ నుంచి చూస్తే తప్పే, కానీ, మానవత్వంతో చూశాగనకే అబద్దమాడాను అప్పుడు.” ఆగాడు మధు.

“అంటే.?” షాక్ లో నిలబడ్డాడు జై. 

“అవును జయవంతి నీకు పుట్టిన, అంటే పరోక్షంగా పుట్టిన బిడ్డే” ముగించాడు మధు.

రెండు చేతులతో తల పట్టుకుని కూర్చున్నాడు జై.

 

* * *

 

“అంకుల్. భోజనానికి రండి. మావయ్యా నువ్వు కూడా. నీకిష్టమైనవే కాదు మామయ్యా, జై గారికి ఏవేవి ఇష్టము అమ్మ చెప్పేది కదా, అవన్నీ కూడా చేశా. పొద్దున్నే. ఇప్పుడు వేడి చేశా అంతే” మధుసూదన్ భుజం మీద చేతులు వేసి, జైతో అన్నది జయవంతి.

జై మౌనంగా బాత్రూం సింక్ లో మొహం కడుక్కొని, తుడుచుకుని బయటకొచ్చాడు.

జయవంతి, కవిత వస్తున్న శబ్దం వినిపిస్తోంది. 

“ఇవన్నీ చెప్పి ఇబ్బంది పెట్టానా” మెల్లగా అన్నాడు మధుసూదన్ “అసలు చెప్పొద్దనే మధూ అన్నది, కానీ ఇవాళ తను లేదు గనక.” మళ్ళీ సైలెంటయ్యాడు మధుసూదన్.

అంకుల్. త్వరగా రావాలి. అన్ని చల్లారిపోతున్నాయి” హాల్లోకొచ్చి అన్నది జయవంతి.

“వస్తాను అమ్మా. అయితే ఒకే ఒక్క కండిషన్” గొంతు సవరించుకొని నేల వంక చూస్తూ అన్నాడు జై.

“కండిషనా” ఏమిటంకుల్?” ఆశ్చర్యంగా అన్నది జయవంతి.

“ఇట్లారా” దగ్గరికి తీసుకుని స్పష్టంగా అన్నాడు జై.

“ఈ క్షణం నుంచి నువ్వు నన్ను అంకుల్ అని పిలవకూడదు. నా. నాన్న అనే పిలవాలి” మాట ఆపాడు జై.

జై కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారగా జయవంతి తలమీద కురుస్తున్నాయి. గట్టిగా జై ని కౌగిలించుకుంది జయవంతి. లక్ష కోటి మాటలు చెప్పలేని భావం. ఒక్క గాఢమైన స్పర్శ చెప్పగలదు కదూ!

 

* * *

bottom of page