MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం
నా కథ - 8
భువనచంద్ర
జరిగిన కథ:
మొదటి ఐదు ఎపిసోడ్ లలో జరిగిన కథ క్లుప్తంగా-
బాలా త్రిపుర సుందరి తల్లి తండ్రి ఆమె 17వ యేట విడిపోయారు. తల్లి దిలావర్ అనే ముస్లింని ప్రేమించి ఆస్ట్రేలియా వెళ్లిపోతే, తండ్రి సరోజినీ ఆంటీ అనే ఓ డాన్సర్ తో బొంబాయి లో సెటిల్ అవుతాడు. బాలని శ్రీనివాస్, పశుపతి, జీవన్ అనే ముగ్గురు ప్రేమిస్తున్నా నిర్లిప్తంగా ఉంటుందే తప్ప ఏ సమాధానమూ ఇవ్వదు. బాలకి డబ్బు, ఇల్లు, కార్లు, తోటలు అన్నీ ఉన్నాయి, తోడు మాత్రం ఎవరూ లేరు. స్వేచ్ఛ నిండుగా ఉన్న ఒంటరితనం బాలది. మాల్ దగ్గర కలిసిన క్లాస్మేట్ కామేశ్వరి బాలాని ముంబై రమ్మని పిలుస్తుంది. ముంబయి చేరుకున్నాక శాండిల్య బాలాని, కామెశ్వరిని పికప్ చేసుకోవటానికి వస్తాడు. వాళ్ళు శివసాగర్ హోటెల్ లో కూర్చుని ఉన్న సమయంలో హర్షవర్ధన్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి తనని తాను పరిచయం చేసుకుని, రాంబాబు వాళ్ళని స్టార్ మెటీరీయల్ గా గుర్తించిన విషయం చెబుతాడు. హర్ష, రాంబాబుల మాటలు విన్నాక, తమలో తాము మాట్లాడుకుని, హర్ష చెప్పే కథ విన్నాక నటించేదీ, లేనిదీ నిర్ణయించుకోవచ్చని తలుస్తారు. ముగ్గురూ ఆఫీస్ కి వెళ్లి కలుద్దాం అనుకుంటారు. అంతలో హర్షవర్ధన్, రాంబాబులే వీళ్ళ ఫ్లాట్ కి వచ్చారు. వాళ్ళకి కథ నచ్చుతుందా? కింది ఆరవ ఎపిసోడ్ చదవండి.
ఆరవఎపిసోడ్లో మరియు ఏడవ ఎపిసోడ్ లో జరిగిన కథ క్లుప్తంగా:
హర్ష చెప్పిన కథ ముగ్గురికీ నచ్చి, సినిమా చేసేందుకు ఒప్పుకుంటారు. వీళ్ళు మాట్లాడుకుంటూండగా దూరం నుంచి బాలాని చూసిన స్టార్ బాలీవుడ్ డైరెక్టర్ శీబూ చక్రవర్తి, బాలాకి సినిమాలలో నటించే ఆసక్తి ఉందేమో కనుక్కోమని ప్రొడక్షన్ మేనేజర్ వినోద్ నిగం ని పంపిస్తాడు. ఆశ్చర్యపోయిన హర్ష అతనెంత గొప్ప డైరెక్టరో, తన సినిమా కన్నా, ఈ ఆఫర్ ఒప్పుకోవటమే బాలా కెరీర్ కి మంచిదని నిజాయితీగా చెబుతాడు. బాలా డైరెక్టర్ ని కలిసి నిర్ణయించుకోవాలనుకుంటుంది.
తరువాతి ఎనిమిదవ ఎపిసోడ్ ఇప్పుడు చదవండి.
'పగటి ధ్యాస పగటిదే. రాత్రి బాధ రాత్రిదే. మనసుకైతే రెండూ ఒకటే. ఏడ్చి ఏడ్చి ఏదో తిని పడుకున్నాక నిజంగా నిద్ర పట్టలేదు సాయంత్రమే పడుకున్నానేమో నిద్ర దగ్గరకే రాలేదు. అందర్నీ ఒకసారి మనసులోనే చూసుకున్నాను. అందరికంటే సూటిగా చూసిన రాంబాబు కళ్ళే మళ్లీ మళ్లీ గుర్తుకొచ్చాయి. అతని సున్నితత్వం, నిర్భయంగా చెప్పడమూ నాకు చాలా నచ్చింది. అతన్ని నా మేనేజర్‌గానే పెట్టుకోనక్కరలేదు, పర్సనల్ మేనేజర్‌గానూ చూసుకోవచ్చు. అది 24 అవర్స్ జాబ్ కాదు, ఆయన పని ఆయన చూసుకుంటూ నాకు అడ్వైజర్‌గా నియమించుకోవచ్చు. శాండీ, హర్ష మంచి స్నేహితులుగా ఎలానూ సలహాలు ఇస్తారు. తోడుగా కామీ ఉండనే ఉన్నది. మరి భయం ఎందుకూ?' దాదాపు రెండున్నరకి నిర్ణయం తీసుకున్నాను నటించాలని, అప్పుడు పట్టింది నిద్ర.
“గుడ్ మార్నింగ్” తెల్లవారుజామున ఐదింటికి లేచి, అప్పటికే లేచి కాఫీ తాగుతున్న శాండీతో అన్నాను.
“గుడ్ మార్నింగ్ బాలాజీ! మీ ముఖం చాలా తేటగా, ప్రశాంతంగా ఉంది అంటే ఏదో ఓ నిర్ణయాన్ని తీసుకున్నారనుకోవచ్చా?” నవ్వి అన్నాడు శాండీ.
“ఎస్… ఐ యామ్ గోయింగ్ టు సే ఎస్” నేనూ నవ్వి అన్నాను.
“ఫెంటాస్టిక్! మీ నిర్ణయం హర్షకే కాదు నాకు కూడా బాగా కలిసొస్తుంది” షేక్‌హ్యండ్ ఇచ్చి కాఫీ తేవడానికి కిచెన్ రూంకి వెళ్ళాడు.
“నాక్కూడా శాండీ” బయటకు వచ్చి అన్నది కామీ, “విన్నాను బాలా, కంగ్రాట్స్! మంచి నిర్ణయం తీసుకున్నావు” నా భుజాన్ని తట్టి అన్నది కామీ.
“విధి అనేది ఉందనిపిస్తుంది. మనం బాంబే వచ్చింది ఓ నాలుగు రోజులు సరదాగా గడపడానికి, ఇలా సినిమా ఆఫర్లు వస్తాయని మన ఊహలో కూడా లేదుగా!” కామీ కళ్ళల్లోకి చూశాను.
“అవును, మన చేతుల్లోనే అన్ని ఉన్నాయి అనుకుంటాం. కానీ గమనించి చూస్తే మనం కేవలం ఆట బొమ్మలం, అంతే!” అన్నది కామీ కాస్త వేదాంత ధోరణిలో.
“ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు దానికి తగిన వస్తువులనో, ‘ఎరుక’నో సమకూర్చుకోవాలి ముగ్గురం” అన్నాడు శాండీ.
“అంటే?” అన్నది కామీ.
“రకరకాల జోనర్స్‌లో నుంచి సినిమాలు చూద్దాం. కొన్ని డైలాగ్స్‌ని మెమరైజ్ చేసి, ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ వీడియో తీసుకుందాం. ఒరిజినల్‌కీ, మనకీ ఎంత తేడానో తెలుస్తుంది. అయితే మనం ఒరిజినల్ ఎక్స్‌ప్రెషన్స్‌నీ, వాయిస్‌నీ అనుకరించకూడదు, ఆ పాత్రలో మనం ఎలా చేస్తామో ఆలోచించి చెయ్యాలి” అన్నాడు శాండీ.
“అద్భుతం!” మెచ్చుకున్నాను.
“అలాగే, పాటలకు లిప్ మూమెంట్స్ ఎలా ఇస్తే బాగుంటుందో కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఫైట్స్ విషయం వేరు, అది ఫైట్ మాస్టర్ చెబుతాడు. డాన్స్ మాత్రం మనం తప్పక ప్రాక్టీస్ చేయాలి. ప్రతి మూమెంట్‌నీ గ్రేస్‌ఫుల్‌గా ఎలా చేయాలో మనమే నేర్చుకోవాలి, అలా చేయడం వల్ల బిడియం తగ్గుతుంది” చక్కగా వివరించాడు శాండీ.
“అబ్బా! ఎంత మంచి ఆలోచన” కన్నులు విప్పార్చి అన్నది కామీ.
“అలాగే మేకప్, హెయిర్ స్టైల్స్. ఎందుకంటే మేకప్ మెన్ ఉంటారు, మనకేది నప్పుతుందో మనం తెలుసుకోవాలి అంటే ఆ వైపూ శ్రద్ధ పెట్టాలి. అంతెందుకూ ఎలా కూర్చోవాలో, ఎలా నడవాలో, ఎలా రిలాక్స్‌డ్‌గా ఉండాలో కూడా సాధన చేయాల్సిందే” మరింతగా వివరించాడు శాండీ.
“డన్, తప్పక చేద్దాం. కేవలం సినిమా కోసమే కాదు అవన్నీ నిజజీవితంలో కూడా మనకు ఉపయోగపడేవే. ఫస్ట్ థింగ్ మన అలవాట్లు, రాత్రి 7 లోగా భోజనం ముగించి తొమ్మిది గంటలకి పడుకోవాలి. తెల్లవారుజామున 5 గంటలకు లేచి కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. ఒకవేళ నిద్రపోవడం ఆలస్యం అయినా లేవడం, వ్యాయామం చేయడం మాత్రం టైంకి జరిగిపోవాలి” అన్నాను నేను.
“యెస్… ఈ రోజు నుంచి షెడ్యూల్ మొదలు పెడదాం” స్థిరంగా అన్నది కామీ.
***
హీరో డైలాగుల్ని శాండీ రాసుకుని మోడ్యులేషన్స్ మార్చి రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో వీడియోలు తీసి చూసుకుంటుంటే, మేము హీరోయిన్స్ డైలాగ్స్‌ని దంచుతున్నాము.
మొదట్లో చాలా ఇబ్బంది పడినా నాలుగు రోజుల్లో బ్రహ్మాండంగా నేర్చేసుకున్నాము, అదీ ఒరిజినల్‌ని అనుకరించకుండా అవే ఫీలింగ్స్‌ని మొహంలో పలికించడం. వారం రోజులు గడిచింది, మా సమయం అసలు ఎలా గడుస్తుందో కూడా మాకు తెలిసేది కాదు.
ఎనిమిదో రోజున కబురు వచ్చింది.
శాండీ ఫోన్ మ్రోగింది, “హలో” అని స్పీకర్‌లో పెట్టాడు.
“మిస్టర్ శాండిల్య, నా పేరు వినోద్ నిగం. హిమాలయ ఫిలిం చీఫ్ ప్రొడక్షన్ మేనేజర్‌ని. ఓ వారం క్రితం మీతో, మీతో ఉన్న మరో ఇద్దరు మహిళలతో కాబోయే డైరెక్టర్ హర్ష ముందు మాట్లాడాను, గుర్తుందా?”
“ఓ! వినోద్‌జీ, మీరా? గుర్తుంది. డైరెక్టర్ శిభూ చక్రవర్తి గారి గురించి కూడా చెప్పారు గదూ” సంభ్రమంగా అన్నాడు శాండీ.
“గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు. ఏమైనా నిర్ణయించుకున్నారా? ఇంకా సమయం కావాలా? ఏమీ లేదు, కొంచెం తొందర పెడుతున్నాను, ‘ఓకే’ అంటే రేపు ఉదయం 9 గంటలకు మీరు ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి కారు వస్తుంది, దయచేసి మీరు ముగ్గురు మాత్రమే రండి. 9:30 కు డైరెక్టర్ మిమ్మల్ని కలుస్తారు, వారితో మీరు నిస్సంకోచంగా మాట్లాడవచ్చు” చాలా ప్లీజింగ్‌గా అన్నాడు వినోద్ నిగం.
“ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు, అయినా డైరెక్టర్ గారిని తప్పక కలుస్తాం” అన్నాడు శాండీ.
“ఓకే, పొద్దున్నే 9 కి కారు సిద్ధంగా ఉంటుంది. థాంక్యూ!” ఫోన్ పెట్టేశాడు వినోద్.
“అదేంటి?” ఆశ్చర్యంగా అన్నాను. కామీ నవ్వింది.
“అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది బాలా, ఎప్పుడైతే డైరెక్టర్ని కలవడానికి ఉత్సాహం చూపించామో అప్పుడే అతనికి అర్థం అయి ఉంటుంది, మనం డిస్కస్ చేసుకుని సిద్ధంగా ఉన్నామని. కాల్ రాగానే ఓకే అంటామని, వినోద్ ప్రొడక్షన్ చీఫ్ కదా ఆ మాత్రం గెస్ చేయలేడనుకుంటున్నావా. హర్ష చెప్పనే చెప్పాడు కదా, బాంబే వాళ్లు మహా ఇంటలిజెంట్స్ అనీ!” అన్నది కామీ.
“ఓహ్! నేనెంత పిచ్చోడ్నీ, ఒక్క మాటలో ఆయన లాగేసాడు బుర్రలోని గుజ్జంతా!” నుదురు కొట్టుకొని అన్నాడు శాండీ.
“స్టిల్, మన నిర్ణయాలు మనవేగా శాండీ. నథింగ్ టు వర్రీ” అన్నాను. అంతే కదా మరి.
అరగంట తర్వాత హర్ష, రాంబాబు వచ్చారు. చాలా సంతోషించారు.
“బాలా, ఏమీ తడబడాల్సిన పని లేదు. నాకు తెలిసి అంతా బాగా జరుగుతుంది. ఒక విషయం చెప్పాలి. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఏదీ దాచడానికో, దారి తప్పించడానికో ప్రయత్నించవద్దు. శిభూ చక్రవర్తి చూపులు స్కానర్‌లలాంటివి, అన్నీ గమనిస్తాయి” చిన్నగా అన్నాడు హర్ష. అది నాకు ఎప్పుడో అనిపించింది. ఏ డైరెక్టర్ అయినా గమనించేది హావభావాలే కదా!
“ఓకే, చాలా గంటలు ఉంది గడపడానికి, ఏం చేద్దాం?” అన్నది కామీ.
“నేను దేనికైనా ఓకే” అన్నాడు శాండీ.
“హర్ష గారూ, నాకైతే మీ కథని మరోమారు మనసారా వినాలని ఉంది” అన్నాను. ఎస్. ఆ మాట నిజమే, మనసు ఎంత అలజడికి లోనవుతూ ఉందంటే సినిమాలనో, ఫుడ్‌నో ఎంజాయ్ చేసే స్థితిలో లేదు, ట్రావెల్ అస్సలు చేయాలనిపించలేదు.
“బాలా, మీ మనసులో కలిగే భావాలు నాకు తెలుస్తున్నాయి. బెస్ట్ ఛాయిస్ నీదే, అలాగే చెబుతా” అన్నాడు హర్ష.
***
శిభూ చక్రవర్తి స్మార్ట్‌గా ఉన్నాడు. అతని జీవితం గురించి, ఆర్ట్ ఫిలిం గురించి నెట్‌లో క్షుణ్ణంగా చదివాను. ఒకప్పటి అతని ఫోటోలు చాలా సింపుల్‌గా ఆర్ట్ ఫిలిం నటీనటుల్లా సీదాసాదాగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన డ్రెస్‌లో దర్పమూ, ధనమూ తొణికిసలాడుతున్నాయి. ఆయన వాచీ ఖరీదు కొన్ని లక్షలు (అని హర్ష అన్నాడు).
“వెల్‌కమ్” ఆయన చిరునవ్వు మాత్రం నిష్కల్మషంగా ఉంది.
“ఓ ఐదు నిమిషాలు వెయిటింగ్‌లో పెట్టాను, సారీ. అది ఓ టెస్టే అనుకోండి, మీరు నన్ను చూడలేరు నేను మిమ్మల్ని చూడగలను” కలుపుగోలుతనంగా నవ్వి గ్లాస్ డోర్స్ చూపించాడు.
నిజం… లోపలి నుంచి బయటవి అన్ని క్రిస్టల్ క్లియర్‌గా కనబడతాయి, బయట నుంచి మాత్రం లోపల ఏదున్నా కనపడనే కనపడదు.
“మా మాటలు కూడా వినే సౌకర్యం ఉందా” అడిగింది కామీ.
“ఎస్… కానీ ఎందుకో నేను స్విచ్ ఆన్ చేయలేదు. మీ ముగ్గురిని అబ్జర్వ్ చేశానన్నమాట మాత్రం 100% నిజం” సిన్సియర్‌గా అన్నాడు. నాకు నవ్వొచ్చింది.
“మీ స్మైల్ చాలా బాగుంది, కానీ ఎందుకు నవ్వారూ?” చిన్న ఆశ్చర్యం.
“సర్, ఈ క్షణాన్ని యధావిధిగా తరచిచూస్తే ఓ అత్యంత పేరున్న గొప్ప దర్శకుడి ముందర మేమున్నాము. ఇది అసలు ఏనాడూ మేము ఊహించలేదు. సరదాగా నేనూ, కామేశ్వరి ముంబై వచ్చాము. శాండిల్య మాకు ఊరు చూపిస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు జరిగిన సంఘటనల పరంపర ఊహించనిదీ, ఊహలకి అందనిది. ఎవరిని కలుసుకోవాలని ఉత్సాహంగా వచ్చామో, వారే మమ్మల్ని ఐదు నిమిషాల పాటు మాకు తెలియకుండా చూశారంటే ఓ చిత్రమైన నవ్వు రాదూ!” నవ్వుతూనే స్పష్టంగా చెప్పాను.
“ఎస్… చిత్రమైన నవ్వు. చిత్రమైన నవ్వు అని కదూ అన్నది!”.
“ఎస్… ఆ చిత్రమైన నవ్వుని నీ పెదాల మీద నేను చూశాను అంటే మనసులోని నీ ఆలోచన పెదాల మీద నవ్వుగా ఎలా ప్రతిఫలించిందో స్పష్టంగా గమనించాను. వినోద్ ఈజ్ రైట్, యు ఆర్ ద ఒరిజినల్” లేచి నా మొహం వంకే చూస్తూ అన్నాడు. ఆ చూపుల్లో ‘ఈ వ్యక్తి నాకు తెలుసు’ అన్న భావం కనబడింది. ఆత్మ పరిచయం అంటారేమో!
నేనేమీ మాట్లాడలేదు. సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ మళ్ళీ అన్నాడు, “బాలా, నేను వెతుకుతున్న స్త్రీ నీలో కనిపించింది. ‘స్త్రీ’ అంటే పాత్ర, ఆ పాత్రలో జీవించాలి, అంతేకానీ నటించకూడదు. దయచేసి నటనను నేర్చుకోకు. ఏ క్షణంలో నటన సాధన చేస్తావో, ఆ క్షణమే నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. నీ నవ్వు నీది కాదు, నీ నడక నీది కాదు, నీ భావాలు నీవి కావు, ఆఖరికి నీ మనస్సు కూడా నీకు దూరంగా జరిగిపోతుంది, జస్ట్ బి యాజ్ యు ఆర్, వాట్ యు ఆర్” అన్నాడు.
రిలీఫ్! అద్భుతమైన రిలీఫ్‌ని ఫీలయ్యాను, “థాంక్స్” అన్నాను సంతోషంగా. ఆయన వాత్సల్యంగా నా తలని నిమిరాడు.
“గో… హాయిగా బాంబే తిరిగి చూడు. సాయంత్రం లిచ్ఛవి వస్తుంది, చాలా గొప్ప రూపశిల్పి ఆమె. కానీ చాలా టఫ్ క్యారెక్టర్. ఓ పట్టాన ఎవరిని మనసులోకి రానివ్వదు. బట్, నో ప్రాబ్లం నువ్వు ఆవిడ దగ్గరికి వెళతావా లేక ఆవిడని ఆఫీసుకు రమ్మననా” అన్నారు.
“మీరు ఎలా చెబితే అలా” అన్నాను.
“ఈ ఆఫీసులో 8 గదులు ఉన్నాయి. ఒకటి నీకు ఎలాట్ చేయిస్తా, ఇష్టం అయితే ఇక్కడే ఉండిపోవచ్చు లేదా మార్నింగ్ కారు వస్తుంది. నీ ఇష్టం వచ్చినంత సేపు ఉండి వెళ్ళిపోవచ్చు. ఆఫీస్ అంటే కొత్త పోవాలి, ‘నాది’ అనే భావన కలగాలి. అతి త్వరలోనే నీ డేట్స్ నీకు ఇస్తాను. అందరూ మనవాళ్లే గనక ధైర్యంగా ఉండు. మిస్టర్ శాండిల్య, మిస్ కామేశ్వరీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఎప్పుడైనా సరే మీరు రావచ్చు. ఆఫీసు మీకు కూడా ఆతిథ్యమిస్తుంది. బాలా మీతో ఉన్నా ఏ అభ్యంతరమూ లేదు. అలవాటు కావడం కోసం రమ్మంటున్నాను అంతే” అని లేచాడు శిబు చక్రవర్తి.
“అసలు అంత సేపు ఆయన మాతో గడపడమే ఓ అద్భుతం” అని తర్వాత హర్ష, రాంబాబు అన్నారు. “ఆయన అంత మాట అన్నాక మీ వంక ఎవ్వడూ కన్నెత్తి చూసే ధైర్యం చేయడు”, చాలా మెప్పుదలతో నా వంక చూస్తూ అన్నాడు హర్ష. “హిమాలయ హీరోయిన్స్ అంటే బాలీవుడ్‌లో ప్రత్యేక గౌరవం ఇస్తారు. ఒకప్పుడు ఋఖ్ హీరోయిన్స్‌కి ఇచ్చినట్టు” అన్నాడు రాంబాబు.
“నీకైతే ఓకే బాలా, మరి మా సంగతేమిటి? నటన నేర్చుకోవాలా, వద్దా? నటన ప్రాక్టీసు చేయాలా, వద్దా?” అందరి ముందూ అడిగేసింది కామీ.
“శిబూ సర్ అన్నది నూటికి నూరుపాళ్ళు కరెక్ట్. నటించడం మొదలెట్టాక నటీనటులు తమ సహజత్వాన్ని పోగొట్టుకుంటారు. ఎంతగా అంటే సన్నివేశం మొదలుకాగానే నటీనటుల హావభావాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులు అనుసరించి చూపేంత. మగవాళ్ళకి కాస్త హార్స్ రైడింగూ, కాస్త వ్యాయామం, కాస్త రన్నింగ్ ఎత్చ్ నేర్చుకోక తప్పదు. అయినా కామీజీ, హాయిగా రిలాక్స్ కండి వీలైతే కాస్త యోగా, కాస్త ప్రాణాయామం లాంటివి చేయండి” వివరించాడు హర్ష.
ఎంత విచిత్రం అంటే మేం ముగ్గురం, హర్ష, రాంబాబు ఓ ఫ్యామిలీగా తయారయ్యాం. నిస్సందేహంగా మా మా అనుభవాలు ఆలోచనలు పంచుకుంటున్నాం.
సాయంత్రందాకా జూహు, అంథేరీలో చక్కర్లు కొట్టాం. సాయంత్రం అయిదింటికి ఠంచనుగా నన్ను హిమాలయ ఫిలిమ్స్ ఆఫీసులో దిగబెట్టారు మిగతా నలుగురూ.
“ఎస్కార్ట్‌గా ఉండమంటావా?” అన్నది కామీ.
“నో ప్రాబ్లం, ఎస్కార్ట్‌గా కాదు సరదాగా ఉండాలనుకుంటే ఉండు” అన్నాను నేను.
“భలే అన్నారు, ఓకే మేము బయలుదేరుతాం. కామీజీని మీ వెంట ఉంచుకోండి, వాళ్ళ కారే మిమ్మల్ని తర్వాత దింపుతుంది” అన్నాడు హర్ష.
“ఓకే” అన్నాం నేనూ, కామీ!
***
“విస్కీ విత్ కోకాకోలా?” అన్నది లిచ్ఛవి.
“నో మామ్” అన్నాను నేను.
“నీకూ?” కామీని చూస్తూ అన్నది.
“ఊహూ, టీ చాలు” అన్నది కామీ.
చిన్నగానవ్వి తన గ్లాసులో రెడ్ లేబుల్, జానీ వాకర్ విస్కీ పోసుకుంది లిచ్ఛవి. ఆవిడకి ఓ 40 ఏళ్లు ఉండవచ్చు, కళ్ళ కింద నలుపు, కొంచెం లావు పర్సనాలిటీలోకే వస్తుంది. బెల్ కొట్టి బాయ్‌ని మా కోసం టీ తెమ్మని చెప్పింది. విస్కీలో ఐస్ క్యూబ్స్ వేసుకుంది. నా మొహంలోకి రెండు నిమిషాలు సూటిగా చూసి విస్కీ సిప్ చేయడం మొదలుపెట్టింది. ఆమె చూపులు కాస్త నన్ను ఇబ్బంది పెట్టిన మాట నిజమే. ఆ చూపుల్లోని అర్థం మాత్రం నాకు స్ఫురించనే లేదు. జస్ట్ బ్లాంక్ లుక్స్ అంతే.
“కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. మీరిద్దరూ మాంఛి యవ్వనంలో ఉన్నారు, పైగా అందగత్తెలు. ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా?” చిన్నగా నవ్వి అన్నది. ఆ నవ్వులో సున్నితత్వం లేదు, చాలా చాలా మొరటుదనం ఉంది.
“నథింగ్ లైక్ దట్” అన్నాను నేను.
“నేనైతే చాలామందిని ప్రేమించాను కానీ మేడం, ఆ విషయం ఎవరితోటి చెప్పలేదు. అందరితోటి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేదాన్ని, ఎవరితోటి మనసు పంచుకోవాలని అనిపించలేదు. ఎందుకంటే, అర్జెంటుగా ఎవరితోనైనా నా ఆనందాన్నో, విచారాన్నో పంచుకోవాలనే సన్నివేశాలు నా జీవితంలో జరగలేదు. అలా అని సుఖమో, దుఃఖమో కలగలేదు. ఆ సుఖదుఃఖాలు ఏనాడు నా మనసుని బలహీన పరచలేదు” నెమ్మదిగా, స్పష్టంగా అన్నది కామీ.
ఫర్ ద ఫస్ట్ టైం కామీని నేను ఏనాడూ సరిగా అర్థం చేసుకోలేదని అనిపించింది. ఇంకో విధంగా చెప్పాలంటే కామీని అర్థం చేసుకునే ప్రయత్నం నేను ఏనాడూ చేయలేదు. బాంబే వచ్చిన తరువాత అయినా సరే.
“రియల్లీ సారీ కామీ, నా గోలలో నేనున్నాను. నీ గురించి నిజంగా చెప్పాలంటే పట్టించుకోలేదనే చెప్పాలి. ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం, ఎవరి ఆలోచనల్లో వాళ్ళు, ఎవరి భావాల్ని మధించుకుంటూ. అత్యంత పరిచయస్తులమైనా అపరిచితులమే” అన్నాను. నిజంగా అన్నాను, గుండెలో మాటని విప్పి చెప్పాను. నిజంగా చెబితే నన్ను చూసుకొని నేనే సిగ్గుపడ్డాను.
“అదేంటి బాలా, నేనూ అలానే ఉన్నాగా. నా జీవితాన్ని, నా కష్టసుఖాల్ని ఏనాడు నీతో పంచుకోలేదు. అసలు నీ పరిస్థితి ఏమిటో కూడా నేను అడగలేదు, నీ మనసుని నేనూ పంచుకోలేదు. ఒక విధంగా అది మంచిదే ఇప్పుడు కదా అవకాశం వచ్చిందీ. అయినా ఒకటి చెప్పనా, ఈ లోకంలో ఏం జరిగినా అవన్నీ క్షణికాలే, అశాశ్వతాలే” చిన్నగా, అనునయంగా అన్నది కామీ. కామీ ఓ నవ యవ్వన యువతిలా అనిపించలా ఆ క్షణం, ఎంతో అనుభవాన్ని పోగేసుకున్న వేదాంతిలా కనబడింది.
సంభాషణ ఇంగ్లీషులో జరుగుతుంది.
“గుడ్, అలా భావించడం గొప్పదే కానీ అమ్మాయిలూ, ఈ పరిశ్రమలో మీకు కావాల్సింది వేదాంతం కాదు పట్టుదల. ఏదెలా జరగాలంటే అది అలాగే జరుగుతుందని నిస్సారంగా, నిర్వీర్యంగా కూర్చుంటే మనిషి అగ్గిపెట్టని కనిపెట్టగలిగేవాడా? ఇవాళ అంతరిక్షాన్ని వడపోయగలిగేవాడా? అంత ఎందుకు మీ ఇద్దరినీ చూడండి ఈ కార్లు రైలు, విమానాలు, లేకుంటే బాంబే మీరు ఎలా వచ్చేవారూ? నడిచి వచ్చేవారా, బండమీదా? అంటే ఎద్దుల బండి మీద, సైకిల్ మీద రావాలన్నా ఎవరో ఒకరు దాన్ని కనిపెట్టాలిగా. ఎవరో కనిపెట్టినవి మనం ఉపయోగించుకుంటున్నాం, అందుకేనా మనం పుట్టిందీ. మీరు వచ్చింది ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌కి అంటే, ప్రజల్ని ఆనందపరచాలి, వారిలో ఆలోచనలు రేకెత్తించాలి, మూడు గంటల పాటు వారిని మంత్రముగ్ధుల్ని చేయాలి. అంటే మీరు ఎంత కాన్షియస్‌గా ఉండాలీ. సో, ఫస్ట్ లెసన్. బీ సీరియస్, దేన్నీ తేలికగా తీసుకోవద్దు. నటన అయినా, మేకప్ అయినా, దుస్తులు ధరించడం అయినా, సంభాషణలు పలకడమైనా, దేన్నైనా సరే. బీ సీరియస్. రెండో లెసన్, టైం మేనేజ్‌మెంట్. సమయపాలన, సమయ వినియోగం. అది వంట పట్టాలంటే కావలసింది క్రమశిక్షణ. మరో ముఖ్య విషయం, ఈ క్షణం నుంచి మీ అందం మీది కాదు, ప్రేక్షకులది. మీ అభినయం ప్రేక్షకుల కోసమే. సమయానికి నిద్ర, సమయానికి ఆహారం, సమయానికి వ్యాయామం, సమయానికి యోగ. సమయానికి ప్రాణాయామం, అన్నీ పర్ఫెక్ట్ గా పాటించాలి. నేను కొంచెం కఠినురాలిని, నన్ను మీరు భరించక తప్పదు” ఓ లార్జ్ సిప్‌తో గ్లాస్ ఖాళీ చేసింది లిచ్ఛవి.
“గాడ్… నేను మీ స్టూడెంట్‌ని, అదే ఈ సినిమాలో లేనుగా” రిలీఫ్‌తో అన్నది కామీ.
“ఎవరన్నారూ? శిబూ నిన్ను కూడా ట్రైన్ చేయమని చెప్పాడు. నో ఛాన్స్ బేబీ” పకపకా నవ్వింది లిచ్ఛవి మరో గ్లాసులో రా విస్కీ పోసుకుని, ఐసు ముక్కలు వేస్తూ.
“రియల్లీ?” అరిచింది కామీ.
“ఎస్… శిబూ ఈజ్ ఎ జెమ్. ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలో ఇట్టే నిర్ణయించుకుంటాడు. నోట్లోంచి మాట రాకముందే వారి టాలెంట్‌ని లెక్కగట్టగలిగిన దిట్ట. మీరిద్దరూ చాలా చాలా అదృష్టవంతులు, శిబూ అండ దొరికిందంటే దేవుడి అండ లభించినట్లే” మాట ఆపి విస్కీ స్కిప్ చేసింది లిచ్ఛవి.
నాకేమీ మాట్లాడాలో తెలియలేదు. ఆవిడ బాస్ కనుక అలా మాట్లాడి ఉండొచ్చు. ఒక లైన్ నర్మగర్భంగా ఉంది, ‘మీ అందం ఇక మీది కాదు, ప్రేక్షకులది’ అనే లైన్. ప్రేక్షకులకు మా అందం చేరవేసేది శిబూ ద్వారానేగా! అంటే!
“హ… హ… అంత ఆలోచించాల్సిన పనిలేదు బాలా, హీ ఇస్ ఏ సిన్సియర్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్” నా మనసుని చదివినట్టుగా నవ్వుతూ అన్నది లిచ్ఛవి. నాకు కూడా నవ్వొచ్చింది.
“అలా అయితే మేము ఎంతో అదృష్టవంతులం మేడం. అంతేకాదు మేము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో సింపుల్‌గా, స్పష్టంగా చెప్పడం చాలా ఆనందం కలిగించింది. మీరు చెప్పిన మాటలు ఏ పరిశ్రమలో చేరాలనుకునే వారికైనా అద్భుతంగా ఉపయోగపడతాయి” సిన్సియర్‌గా అన్నాను.
“థాంక్యూ” మళ్లీ ఒక గుక్కలో విస్కీని తాగేసి, మళ్లీ ఓ లార్జ్ ఇంకో గ్లాసులో పోసుకొని ఐసు ముక్కలు వేసుకుంది.
“ప్రతిసారి ఓ కొత్త గ్లాసు ఉపయోగిస్తున్నారు ఎందుకు అడగొచ్చా?” అన్నది కామీ.
“జనరల్‌గా నన్ను ప్రశ్నలు అడిగే ధైర్యం ఎవరూ చేయరు, అసలు ఇంతసేపు మాట్లాడను. కానీ అమ్మాయిలూ, కొందరిని చూస్తే కొన్ని గుర్తు వస్తాయి. ఈ బాలాని చూశాక!” సైలెంట్ అయిపోయింది.
మాట్లాడాలని నోరు తెరిచిన కామీ టక్కున నోరు మూసుకుంది.
ఆ తరువాత ఓ పదిహేను నిమిషాలు నిశ్శబ్దంగానే గడిచింది. రెండే శబ్దాలు ఒకటి లిచ్ఛవి విస్కీ గ్లాసులో పోసుకునే శబ్దం, రెండు విస్కీ గ్లాసులో ఐసు ముక్కలు జారి పడుతున్న శబ్దం. ఐదు గ్లాసులు ఖాళీ అయ్యాయి.
“మై డియర్ యంగ్ ఫ్రెండ్స్! థాంక్యూ ఫర్ యువర్ కంపెనీ. ఎందుకో ఇవాళ చాలా ఎక్కువగా తాగాను, తాగాలనిపించింది. బట్ మైండ్‌కి మత్తెక్కట్లేదు. మీరు హాయిగా వెళ్లి రిలాక్స్ అవ్వండి” అన్నది.
“మరి మీరూ?” ధైర్యం చేసుకొని అడిగాను.
“నేనా, ఇలా మెల్లగా విస్కీ తాగుతూ ఈ దుర్భరమైన రాత్రికి సాక్షిగా మిగిలి ఉంటా. నిద్రపడితే ఈ గదికి పక్కనే బ్రహ్మాండమైన బెడ్ రూమ్ ఉంది, అందులో పడుకుంటా. విష్ మీ గుడ్ లక్ మై డియర్ ఏంజెల్స్” అన్నది లేచి మమ్మల్ని బయటకి పంపడానికి గ్లాస్ డోర్ తీస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి.
బయటికి వచ్చాం. డ్రైవర్ సిద్ధంగా ఉన్నాడు. యూనిఫామ్ మీద “హిమాలయ ఫిలిమ్స్” అన్న ఎంబ్లెమ్ కుట్టబడి ఉంది. ఫస్ట్ రైడ్ అది.
మళ్ళీ కలుద్దాం, బాయ్
భువనచంద్ర
*****