top of page

మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం

నా కథ - 4

భువనచంద్ర

manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

జులై - సెప్టెంబర్ 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

జరిగిన కథ:

మొదటి ఎపిసోడ్ లో జరిగిన కథ- క్లుప్తంగా: 

బాలా త్రిపుర సుందరి తల్లి తండ్రి ఆమె 17వ యేట విడిపోయారు. తల్లి దిలావర్ అనే ముస్లింని ప్రేమించి ఆస్ట్రేలియా వెళ్లిపోతే, తండ్రి సరోజినీ ఆంటీ అనే ఓ డాన్సర్ తో బొంబాయి లో సెటిల్ అవుతాడు. బాలని శ్రీనివాస్, పశుపతి, జీవన్ అనే ముగ్గురు ప్రేమిస్తున్నా నిర్లిప్తంగా ఉంటుందే తప్ప ఏ సమాధానమూ ఇవ్వదు. బాలకి డబ్బు, ఇల్లు, కార్లు, తోటలు అన్నీ ఉన్నాయి, తోడు మాత్రం ఎవరూ లేరు. స్వేచ్ఛ నిండుగా ఉన్న ఒంటరితనం బాలది.

 

రెండో ఎపిసోడ్ లో జరిగిన కథ- క్లుప్తంగా: 

మాల్ దగ్గర కలిసిన క్లాస్మేట్ కామేశ్వరి బాలాని ముంబై రమ్మని పిలుస్తుంది. అప్పుడే కామేశ్వరీ, బాల శ్రీనివాస్ గురించి, పశుపతి గురించి చర్చిస్తారు. కామేశ్వరి శాండిల్య గురించి చెబుతుంది. తర్వాత కథ చదవండి :

మూడవ ఎపిసోడ్  లో జరిగిన కథ- క్లుప్తంగా:  

ముంబయి చేరుకున్నాక శాండిల్య బాలాని, కామెశ్వరిని పికప్ చేసుకోవటానికి వస్తాడు. శాండిల్య హుందాగా వ్యవహరించే తీరు, వ్యక్తిత్వం, అమ్మాయిలకి అతనికిచ్చే గౌరవం బాలాకి అబ్బురంగా కనబడుతుంది.

***

నాలుగో ఎపిసోడ్  చదవండి: 

నేనూ కామేశ్వరీ జూహులో శాండిల్య ఫ్లాట్ దగ్గర దిగిపోయాక, శాండిల్య తన కంప్యూటర్ సెంటర్ కి వెళ్ళి పోయాడు. ఆఫ్ కోర్స్ మాకు ఫ్లాట్ తాళాలు ఇచ్చి చూపించాక.

చాలా “పోష్” గా ఉంది. “బాంబేలో అన్నీ దొరుకుతాయి స్థలం తప్ప. ఎంత గొప్ప హీరో హీరోయిన్ అయినా మన సౌత్ వాళ్ళలా పెద్ద పెద్ద మహాల్స్ లో ఉండలేరు. ఇక్కడంతా కాంపాక్టే కానీ కావలసిన విధంగా ఉన్నచోటనే మలుచుకోవడం ముంబైట్స్ కి వెన్నతో పెట్టిన విద్య” అన్నది కామీ.

 చక్కటి భోజనం  కూడా వచ్చింది కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి పడుకున్నాం.  

కొత్తగా బాంబే వచ్చినట్టు అనిపించలేదు. కొన్ని నగరాలు  అంతేనేమో. వచ్చినవారిని ఒడిలోకి తీసుకుంటాయేమో తల్లిలా. నాకు నవ్వొచ్చింది. తల్లిలా ఒడిలోకి తీసుకోవడం ఏమిటీ!  నా తల్లే నన్ను నా అదృష్టానికి వదిలేసి పోయిందిగా!! నాన్నా అంతే. పచ్చి స్వార్థం అంటే ఇదేనా?

పడుకున్నాను గాని నిద్ర రావడం లేదు. కామేశ్వరి గాఢంగా నిద్రపోతోంది. నేను మెల్లిగా బయటకు వచ్చి చిన్నగా ఉన్న బాల్కనీలో కూర్చున్నా. అక్కడో చిన్న చైరూ ఓ బుల్లి టేబులు ఉన్నాయి.  బహుశా శాండీ అక్కడ కూర్చొని మార్నింగ్ కాఫీ తాగుతాడేమో.

చిన్నప్పుడు నాకు అనిపించేది. అమ్మ గానీ, నాన్న గానీ నా గదిలో పడుకుంటే బాగుంటుందని.  మనసు ఎన్ని బంధాల్ని కోరుకుంటుందీ!

నా చిన్నతనం అంతా సినిమా రీల్ లా నా మనసులో తిరుగుతూనే ఉంది. కళ్ళు మూసుకున్నా కన్నీళ్లు కళ్ళల్లోంచి జారీ బుగ్గల మీదుగా కిందికి జారుతున్నాయి. తలని ఆ బుల్లి మేజా మీద ఆన్చి పడుకోవాలనిపించింది. అలాగే పడుకున్నా.

* * 

కళ్ళు తెరిచేసరికి ఎదురుగా శాండీ, కామీ ఇద్దరూ ఉన్నారు. కంగారుగా లేచా.  చీకటి పడింది.  

“నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దన్నాను. ఏసీ గదిని వదిలి ఇక్కడికి వచ్చారంటే అప్పుడు నిద్ర పట్టి ఉండదు. ఇక్కడ నిద్ర సంగతి అంటారా? నిద్ర సుఖమెరుగదు అనే సామెత ఉండనే ఉందిగా” నవ్వుతూ అన్నాడు శాండిల్య. కానీ అతను నా బుగ్గల మీద చారికల్ని చాలా స్పష్టంగా చూశాడు అని నాకెందుకో అనిపించింది. కానీ చూడనట్టే ప్రవర్తిస్తున్నాడు. చీకటి మొహాన్ని పూర్తిగా దాచెయ్యదు.

లోపలికి వెళ్లాక అన్నాడు, “మీరు ఫ్రెష్ అయితే సరదాగా జూహు బీచ్ లో తిరిగొద్దాం” అని.

ఇరవయి నిమిషాల తరువాత బీచ్ లో ఉన్నాము. నడుస్తూ. ఆకాశంలో నక్షత్రాల్లా బీచ్ లో లెక్కలేనన్ని లైట్లు.  సమోసా దుకాణాలు, వడా పావ్ దుకాణాలు, చెరుకు దుకాణాలు, ఇడ్లీ దోస వేసే సౌత్ ఇండియన్ దుకాణాలు, ఐస్ క్రీమ్ దుకాణాలు, కూల్ డ్రింక్ షాపులు, కుల్ఫీ బడ్డీలు యమా బిజీగా ఉన్నాయి.  బయటి ఫుడ్ తినడంలో ఢిల్లీ, ముంబై, కోల్ కతాలు మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ అంటారు. పిజ్జా హట్ ల సంగతి సరేసరి. అవి పోష్ గా ఉంటే, బీచ్ లో ఉండేవి పిజ్జా బడ్డీలు. ఫ్యామిలీ స్ కి ఫ్యామిలీలు బీచ్ లో సందడిగా తిరుగుతున్నారు. ఇరుకు ఇళ్లలోని జనాలకి ఇదో ఆటవిడుపు. శాండీకి ఏ షాపులో బెస్ట్ ఐటమ్స్ ఉంటాయో బాగా తెలుసునుకుంటాను. అందుకే జనాల రష్ ని బట్టి కాక కూల్ లొకేషన్లో ఉండే బడ్డీలకి తీసుకెళ్లాడు. “పొవార్ వడా పావ్” సూపర్ గా ఉంది. ఆదిత్య పొవార్ దుకాణదారు పేరు. వాళ్ళది పూణేట. ఆదికాండం వాళ్ళ తాతదిట. అందుకే ఈజీగా ప్రవేశం దొరికిందిట. బీచ్ లో దుకాణం పెట్టాలంటే మామూలు కాదు, “పగిడి” సిస్టం ఉంటుంది. మనం ఒక ఇంట్లో అద్దెకి ఉంటున్నామనుకోండి, అది ఖాళీ చేసి వెళ్లాలంటే, కొత్తగా వచ్చే వాళ్లు మనకి “పగిడి” చెల్లించాలి. ఒక్కోసారి అది లక్షల్లోనే ఉంటుంది. పూరి గుడిసె అయినాసరే. అలాంటిది బీచ్ దుకాణం పెట్టాలంటే ఇంతా అంతా కాదు. ఆపైన దాదాలు, అఫ్తాలు (వారానికోకసారి చెల్లించి తీరాల్సిన రౌడీ మామూళ్లు)

  ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది ఆదిత్య పోవార్. రాసేది పవార్ అని రాసినా, పలికేది పోవార్ అని పలకాలిట. ఈ విషయాలు శాండీకి కొట్టినపిండే. పోవార్ ఇంకో విషయం కూడా చెప్పాడు. అతను చేసింది MBA అని. నాకు షాక్. “మరి ఇదేంటి?” అని అడిగాను.

“నేను గనుక ఇది ఖాళీ చేస్తే కొన్ని లక్షల పగిడి వస్తుంది. కానీ మా తాతల నుంచీ వస్తున్న ఇక్కడి ‘చోటు’ పోతుంది. మళ్లీ దక్కించుకోవడం అసంభవం. అందుకే నేను ఈ దుకాణం నడుపుతున్న. నా తమ్ముడు ఇప్పుడు MBBS చేస్తున్నాడు. వాణ్ణి చదివిస్తున్నది నేనే? అన్నాడు, అవాక్కయ్యాను. కామీ ఆశ్చర్యంగా చూస్తే శాండీ చిన్నగా నవ్వి “పోవార్ భాయ్! యూ ఆర్ ఏ ట్రూ మహారాష్ట్రియన్. నిన్ను కలుసుకోవడం నాకు గర్వంగా ఉంది” అన్నాడు.

ఘంఘన్ వాలా కుల్ఫీ మహాద్భుతం. కుల్ఫీ రుచి కుల్ఫీదే. మరొకదానితో పోల్చలేము. తిరిగివస్తూ చివరగా ‘అయ్యర్ దోసె’ దగ్గర నాలుగు దోసెలు తిన్నాము. సాంబార్ టేస్ట్ కి పిచ్చెక్కింది. ప్రస్తుతం దుకాణం వాడు నడుపుతున్నది జనక్ రాజ్ అయ్యర్. వాళ్ల ముత్తాత గారి నుంచీ ఇదే వృత్తి, ఇదే దుకాణం. ఇదికాక బాంద్రాలో ‘దోసె జాయింట్’ ఉందిట. చాలా దుకాణాలు వంశపారంపర్యంగా వస్తున్నవే అనిపించింది. ఫ్లాట్ కి వచ్చేటప్పుడు నడుస్తూనే వచ్చాము, వెళ్ళడమూ నడుస్తూనే వెళ్ళాం. ‘శివ్ సాగర్’ లో ఫిల్టర్ కాఫీ తాగి ఫ్లాట్ కి చేరేసరికి రాత్రి 10 గంటలు.

“బాంబే హోటల్స్ లో బెస్ట్ ఫుడ్ తినాలి అంటే,  అంటే రాత్రి భోజనం (సప్పర్) చెయ్యాలంటే రాత్రి 12 దాటాక ఆర్డర్ చెయ్యాలి. అప్పుడు సర్వ్ చేసేవి చాలా ఫ్రెష్ గా ఉంటాయి” అన్నాడు శాండీ, షూస్ ని పొందిగ్గా షూ స్టాండ్ లో పెడుతూ. అతనలా పద్ధతిగా షూస్ ని పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది.

“ఫీలింగ్ స్లీపీ డియర్” అంటూ కామీ మంచం మీద వాలిపోయింది వస్తూనే. దాని సాండిల్స్ నేనే తీసి షూ స్టాండ్ లో పెట్టా. హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ టీవీ ఆన్ చేశాడు శాండీ. అదీ నా పర్మిషన్ అడిగి.

యూట్యూబ్ కి వెళ్లి “గంగా జమున” హిందీ పిక్చర్ సెలెక్ట్ చేశాడు. నేనూ చూస్తూనే కూర్చున్నా. ఆ భాష ‘భోజ్ పురి’ అని శాండీ చెప్పాడు. అంటే హిందీ, భోజ్ పురి మిక్స్డ్ ఉన్నాయి డైలాగ్స్. దిలీప్ కుమార్ సొంత తమ్ముడే ఈ సినిమాలో దిలీప్ కుమార్ కి తమ్ముడిగా నటించాడు. వైజయంతిమాల హీరోయిన్. ఓ అద్భుతమైన చలనచిత్ర అది. “దో హంసోంకా జోడా” పాటని చూస్తూ నా కళ్ళు చెమ్మగిల్లాయి. సినిమా కాదు ఓ సజీవ శిల్పాన్ని చూస్తున్నట్టు అనిపించింది. సినిమా అయ్యాక ఇద్దరి నోటా మాట లేదు. లైట్లు తీసి, TV ఆఫ్ చేసి, AC అడ్జస్ట్ చేసి, నైట్ లాంప్ వేసే వరకూ శాండీని అబ్జర్వ్ చేశా. ఓ డిసిప్లిన్, ఓ క్లీన్లీనెస్, ఓ స్వీట్ ఫ్రెండ్షిప్ అన్నీ మూర్తిభవించిన యువకుడు శాండీ అనిపించింది. అతనో సోఫా మీద వాలితే నేనో సోఫా మీద వాలి కళ్ళు మూసుకున్నాను. మనసుకి చెప్పలేని ఆహ్లాదం ఓ చిరుగాలి లాగా నన్ను అమాంతం తనలోకి తీసుకున్నంత హాయి.  

* * 

తెల్లవారుజామునే లేచాను. అప్పటికే లేచి శాండీ టీ తాగుతున్నాడు. “గుడ్ మార్నింగ్” అన్నా.

“శుభోదయం, బ్రష్ చేసి వచ్చేసరికి కాఫీ రెడీ చేస్తా” నవ్వుతూ అన్నాడు. కామీ నిద్రపోతూనే ఉంది.

నిన్న మధ్యాహ్నం విషయం కదపుతాడేమో అనుకున్నాను కానీ కదపలేదు. ఆ విషయం నాకు ఇంకా నచ్చింది. కొన్ని సెన్సిటివ్ విషయాల్ని అలా వదిలేయడమే మంచి లక్షణం. అవసరమైన కుతూహలం ఎప్పటికీ అనర్థమే.

“ఇవాళ లంచ్ ఇస్కాన్ లో ఐటమ్స్ లంచ్ చేద్దాం. ప్యూర్ కౌ మిల్క్ ఐటమ్స్ ఉంటాయి. హెర్బల్ ప్రొడక్ట్స్ అయితే అమోఘం” అన్నాడు. కాఫీ కప్పు ఇస్తూ ఉంటే మంచి స్మెల్. అదే మాట అన్నాను.

“ఇది ఫిల్టర్ కాఫీ. మద్రాసులో ఇలా చేస్తారు. ఫిల్టర్ అక్కడి నుంచి కొనుక్కొచ్చానని మా ఆంటీ అనేది. ఆవిడే నాకు నేర్పింది” అన్నాడు.

‘నొవోటెల్’ లో టిఫిన్ చేసాము. బాంబే అందరి సిటీ. ఇప్పుడు ముంబై అయినా పెద్దవాళ్లు బాంబే అనే పిలుస్తున్నారు. పెద్ద హోటల్లో దోస రూ. 250 ఉంటే చిన్న హోటల్లో రూ. 150 ఉంటుంది. స్ట్రీట్స్ లో, తోపుడు బండిలో తింటే రూ.50, అదే ఫైవ్ స్టార్ హోటల్లో రూ.520, విషయం ‘దోస’ అయినా చేసే లభించే చోటుని బట్టి రేటు. మానవుడి తెలివితేటలు కూడా చోటుని బట్టేగా ప్రకటింపబడింది. అదే మాట అన్నాను.

“నూటికి నూరుపాళ్లు కరెక్ట్. కర్మాకర్ అని నాతో చదువుకున్నవాడు ముంబైలో యూనో టెక్నాలజీస్ లో పని చేసేవాడు. వాడు మంచి తెలివైనవాడే, కానీ వాడిని ‘స్లీపింగ్ టామ్’ అనేవారు. పని అంతా గంటలో పూర్తి చేసి కునుకు తీసేవాడు. లక్కీగా వాడికి అమెరికాలో చాలా పెద్ద కంపెనీ నుంచి కాల్ వచ్చింది. ఇప్పుడు వాడక్కడ ‘చీఫ్ ఎగ్జిక్యూటివ్’. నేను అడిగాను “ఇప్పుడు కునుకు తీస్తున్నావా?” అని. వాడు నవ్వి, “వాళ్లకి కావాల్సింది నా పని. నా కునుకు సంగతి కాదు. వాళ్లకి కావాల్సిన పని రికార్డు టైంలో చేస్తున్నంత కాలం నేను ఉద్యోగంలో ఎదుగుతూనే ఉంటా” అన్నాడు. నీకు కావాల్సింది ‘దోసె’ అయినప్పుడు మనం చూడాల్సింది చోటు సంగతీ, రేటు సంగతీ కాదు. రుచి సంగతి” నవ్వుతూ అన్నాడు శాండీ.

“దోసెల దోస్తీ పక్కనబెట్టి మరేదన్నా చెప్పు శాండీ. నేనేమీ దోసె ప్రేమికురాలిని కాదు” అన్నది కామీ.

“పోనీ సమోసా గురించి మాట్లాడుదామా? అమ్మాయీ, ఆహారాన్ని ఆస్వాదించు. ఫుడ్ ఆర్డర్ చేసిన వాడిని అభినందించు” పకపక నవ్వి అన్నాడు.

 “సరే బాబా సరే. గొప్ప దోసెని, గొప్ప చోట పెట్టించినందుకు సలాం. ఇప్పుడు ఏం చేద్దాం?” నాటకీయంగా ఆంది కామీ.

“అది నిర్ణయించాల్సింది మన గెస్ట్ గాడ్ గారు. అతిథిదేవోభవ కదా! మీరెక్కడికంటే అక్కడికి” నా వంక చూస్తూ అన్నాడు శాండీ.

“బాగుంది, సర్దార్జీని సాంబారు పెట్టమన్నట్టుంది. ఊరు మీది. ఏది చూపిస్తే అది చూస్తా, ఏది తినిపిస్తే అది తింటా!” అన్నాను.

“ఒక పని చేద్దాం జూహూలోనే ఓ రౌండ్ వేసి లంచ్ కి ఇస్కాన్ కి పోదాం. విండో షాపింగ్ లాగా విండో  హోటల్ లుక్కింగ్” లేచాడు శాండీ.

చాలా సేపు బయట నుంచే మాస్టర్స్ సూట్, లోకోమో హోటల్, బావా ఇంటర్నేషనల్, రామదా ప్లాజా, Hotel Sea Sands, Sea Princess లాంటి హోటల్స్ ని చూసి, మధ్యాహ్నం ఇస్కాన్ కి చేరాము. చాలా ప్రశాంతంగా ఉంది. వండటం, వడ్డించడం భగవత్కార్యంగా భావిస్తారు ఇస్కాన్ వారు. ప్రతిరోజూ కొన్ని లక్షల మందికే కాక అనేకానేక స్కూళ్లకి కూడా అత్యంత పౌష్టిక ఆహారాన్ని ఉచితంగా అందిస్తారు. ఇక్కడ మాత్రం పే చేయాలి. అన్నీ పరిశుభ్రమైన పదార్థాలనే వాడి శ్రద్ధగా వడ్డించారు. ఉప్పు కారాలు ఎంత వరకు ఉండాలో అంతే ఉన్నాయి. కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు మెల్లగా భోజనం చేస్తూ గడిపాము. నేను చాలా ఫాస్ట్ ఈటర్ ని. “నో, అలా కాదు. ఎంజాయ్ చేస్తూ తినండి” నేను ఫాస్ట్ గా తినడం చూసి మెల్లగా అన్నాడు శాండీ. ఎందుకో అతను అలా చెప్పడం నచ్చింది.

“నిద్ర ముంచుకొస్తుంది శాండీ” ఆవలించి అన్నది కామీ. “భుక్తాయాసం” నవ్వి నేను అన్నాను.

* * *

సాయంత్రం ఆరు గంటలకి ‘శివ్ సాగర్’ దగ్గర ఉన్నాము మంచి కాఫీ తాగాలని. సౌత్ ఇండియన్సే కాదు, మరాఠీలు, సింధీలు, బెంగాలీలు కూడా ఉన్నారు, వారి వారి భాషల్లో ముచ్చటించుకుంటూ, టిఫిన్ తింటూ. సందడిగా ఎవరెలా మాట్లాడుతారో, అంటే ఏ పదాన్ని ఏ భాష వాళ్ళు ఎలా ఉచ్ఛరిస్తారో చెపుతుంటే నేనూ, కామీ హాయిగా నవ్వుకున్నాం. శాండీకి అనుకరణ విద్య వచ్చని అప్పుడే తెలిసింది.

“Excuse me” సన్నగా పొడుగ్గా అందంగా ఉన్న ఓ ముప్పయి ఏళ్ల వ్యక్తి శాండీ తో అన్నాడు.

“మీరు? I mean you are…” అన్నాడు శాండీ.

“కూర్చోవచ్చా. మీతో, అంటే మీ ముగ్గురితో మాట్లాడాలి. ఎందుకూ అంటే నా విషయం చెప్పాలి, కొంచెం మీరు నాకు టైం ఇవ్వాలి” ప్లెసెంట్ గా నవ్వి అన్నాడు అతడు.

“OK. మీ పేరు?” కుతూహలంగా అడిగాడు శాండీ.

“నా పేరు హర్షవర్ధన్. పదహారణాల  తెలుగు వాణ్ణి. కానీ పెరిగింది ముంబైలో. కొన్ని ఉద్యోగాలూ చేశాను. కానీ నా మనసంతా సినిమాల మీదే. కొన్నాళ్ళు ఎక్స్ ట్రాగా సినిమాల్లో చిన్నచిన్న డైలాగులు చెబుతూ చేశాను. రెండు మూడేళ్లలో తేలిపోయింది నాలో యాక్టింగ్ లేదని. చిత్రమేమిటంటే మా నాన్నగారు కూడా సినిమాల్లోనే చేసేవారు. హిందీ సినిమాల్ని తెలుగులోకీ, తెలుగు సినిమాల్ని హిందీలోకి అనువదించేవారు. అయితే డైరెక్టుగా ఆయన పేరుతో అనువాదం చేసే వారు కాదు. కారణం ఆయన ఓ పెద్ద బ్యాంకు బ్రాంచ్ కి చీఫ్ మేనేజర్ కూడా. డబ్బింగ్ లో మెళకువలు నేర్పారు. కొద్దో గొప్పో నేనూ అనువదించగల స్థాయికి వచ్చాను. మా నాన్నగారు అనువదించిన చిత్రాల్లో కొన్నింటికి నేను డబ్బింగ్ కూడా చెప్పాను. ఒక స్టేజి లో ప్రొడ్యూసర్ డైరెక్టర్లతో నేనే కూర్చొని డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేసేవాణ్ని” ఆగాడు హర్ష.

“ఓహ్! వెరీ ఇంట్రెస్టింగ్” కళ్లు మెరుస్తూ ఉండగా అన్నాడు శాండీ.

“అవును..” తలాడించింది కామేశ్వరి.

“మా నాన్నగారికి సినిమా అంటే ప్రాణం. రిటైర్ అయ్యాక సినిమాలే ఫుల్ టైంగా పని చేస్తాను అనేవారు” సైలెంట్ అయ్యాడు.

“అంటే” అన్నాడు శాండీ.

“హీ ఈజ్ నో మోర్ సడన్ గా వెళ్లిపోయారు. అప్పుడనిపించింది నేనూ, మదర్ బ్రతకడానికి చాలానే ఉంది. అందువల్ల నా కోరిక, మా నాన్న కోరిక తీర్చుకోవాలని. షకీల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి కొంత అనుభవం సంపాదించాను. షకీల్ ఎవరో మీకు తెలుసు. పేరు మార్చాను నా వల్ల ఆయనకి ఇబ్బంది రాకూడదు కదా. చాలా టాలెంటెడ్ డైరెక్టర్, మా అందరి పట్ల చాలా ప్రేమగా ఉండేవారు. చక్కగా చర్చించేవారు. ఆయన దగ్గర నేను చేసిన రెండు పిక్చర్లూ సూపర్ హిట్ అయ్యాయి. నాలోని స్పార్క్ ని చూసి ఓ సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్ చాలా మంచి ఆఫర్ ఇచ్చాడు. ఆ ప్రొడ్యూసర్ నాకు తెలిసిన వాడే, మొదట్లో తెలుగు నుంచి హిందీకి డబ్బింగ్ చేసేవాడు. ఆ తర్వాత మలయాళం నుంచి హిందీకి చాలా సినిమాలు డబ్ చేసి బాగా సంపాదించాడు. ఒకే సినిమాని ఏ భాషలో తీసినా నాలుగు భాషల్లోకి డబ్ చేసే విధంగా ఉండాలని కండిషన్ పెట్టాడు. మిగతా వాటిల్లో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ప్రస్తుతం నేను కథ గురించి ఆలోచిస్తున్నాను” ఆగాడు హర్షవర్ధన్.

“బాగుంది. ఇందులో నాతో మాట్లాడాల్సిన మాట్లాడటానికి ఏముంది?” సూటిగా అడిగాడు శాండీ.

“మాట్లాడటానికి చాలా ఉంది, అందుకే మీ దగ్గరికి వచ్చాను” నవ్వాడు.

“నాకు మాత్రం అర్థం కావడం లేదు సీరియస్ గా” అన్నాడు శాండీ.

“పొద్దున మీరు నోవోటెల్ కి టిఫిన్ కి వెళ్లారు కదూ! అక్కడ మా రాంబాబు మీ ముగ్గురిని చూశాడు.  మీరు హోటళ్ళన్నీ చూడటం, ఆ తర్వాత ఇస్కాన్ కి వెళ్లి భోంచేయడం, ఆ తర్వాత అపార్ట్మెంట్ కి వెళ్లడం చూసి అడ్రస్ నోట్ చేసుకున్నాడు. ఇందాకటిదాకా అక్కడే ఉండి మీరు శివ్ సాగర్ కి వచ్చిన సంగతి నాకు చెప్పాడు. అంటే ఫోన్ లో. మీ దుస్తులని వర్ణించాడు. నేను వచ్చాను. రాంబాబు చెప్పిన పాయింట్ 100% రైట్ అనిపించింది”.

“ఏ పాయింట్?” సీరియస్ గా అన్నాడు శాండీ, అతని మొహం కోపంతో ఎర్రబడటం నేను స్పష్టంగా చూశాను.

“అదీగాక మా వెనకాల తిరుగుతూ మేమేమి చేస్తున్నామో, ఎక్కడున్నామో ఆచూకీ తీయాల్సిన అవసరం అతగాడికి ఎందుకెందుకొచ్చింది. వాట్ ద హెల్ హీ యీజ్? వేర్ ద హెల్ హీ యీజ్?” అరిచినంత గట్టిగా అన్నాడు శాండీ.

“అతను మీ వెంట పడినందుకు నేను క్షమాపణ చెబుతున్నా. ప్లీజ్ బీ కూల్. అతనో టాలెంటెడ్ ప్రొడక్షన్ మేనేజర్. చాలామంది నటీనటులకి PRO గా పని చేస్తాడు. అంటే సెక్రెటరీగా అన్నమాట. చాలా గొప్ప హీరోయిన్లకి అతను సెక్రెటరీ. తెలుగు ఆరిజన్. మేమిద్దరం చాలా కాలం నుంచీ ఫ్రెండ్స్. నేనో హీరోయిన్ క్యారెక్టర్ వేసే అమ్మాయి కోసం వెతుకుతున్నానని అతనికి తెలుసు. అందుకే అతను మీ ముగ్గురిని చూసిన వెంటనే నాకు ఫోన్ చేశాడు. డియర్ సార్! ఇలా చెయ్యడం తప్పే కావచ్చు, కానీ సినిమా వాళ్ళ చూపులన్నీ ‘స్టార్ మెటీరియల్స్’ మీదే ఉంటై. ఫలానా వాళ్ళు సూపర్ మెటీరియల్ అనుకుంటే వెంటనే వాళ్ల గురించిన వివరాలు పట్టేస్తారు. రోజూ  కొన్ని వేల మంది యువతీయువకులు ముంబై వస్తారు. రాంబాబు లాంటి వాళ్ళ కళ్ళ పడడానికి లేదా స్టూడియోల చుట్టూ వేషాల కోసం తిరగడానికి. కానీ అందులో 100% పర్సెంట్ ని కూడా అదృష్టం వరించదు. ఒక్కోసారి పదివేల మందిలో ఒకరిని కూడా అదృష్టం వరించదు. రాంబాబు నిజంగా జీనియస్” అన్నాడు హర్షవర్ధన్.

మళ్ళీ కలుద్దాం

మీ భువన చంద్ర

bottom of page