top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి 8  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం

నా కథ - 6

bhuvana.jpg

భువనచంద్ర

జరిగిన కథ:

మొదటి ఎపిసోడ్ లో జరిగిన కథ- క్లుప్తంగా: 

బాలా త్రిపుర సుందరి తల్లి తండ్రి ఆమె 17వ యేట విడిపోయారు. తల్లి దిలావర్ అనే ముస్లింని ప్రేమించి ఆస్ట్రేలియా వెళ్లిపోతే, తండ్రి సరోజినీ ఆంటీ అనే ఓ డాన్సర్ తో బొంబాయి లో సెటిల్ అవుతాడు. బాలని శ్రీనివాస్, పశుపతి, జీవన్ అనే ముగ్గురు ప్రేమిస్తున్నా నిర్లిప్తంగా ఉంటుందే తప్ప ఏ సమాధానమూ ఇవ్వదు. బాలకి డబ్బు, ఇల్లు, కార్లు, తోటలు అన్నీ ఉన్నాయి, తోడు మాత్రం ఎవరూ లేరు. స్వేచ్ఛ నిండుగా ఉన్న ఒంటరితనం బాలది.

 

రెండో ఎపిసోడ్ లో జరిగిన కథ- క్లుప్తంగా: 

మాల్ దగ్గర కలిసిన క్లాస్మేట్ కామేశ్వరి బాలాని ముంబై రమ్మని పిలుస్తుంది. అప్పుడే కామేశ్వరీ, బాల శ్రీనివాస్ గురించి, పశుపతి గురించి చర్చిస్తారు. కామేశ్వరి శాండిల్య గురించి చెబుతుంది. తర్వాత కథ చదవండి :

మూడవ ఎపిసోడ్  లో జరిగిన కథ- క్లుప్తంగా:  

ముంబయి చేరుకున్నాక శాండిల్య బాలాని, కామెశ్వరిని పికప్ చేసుకోవటానికి వస్తాడు. శాండిల్య హుందాగా వ్యవహరించే తీరు, వ్యక్తిత్వం, అమ్మాయిలకి అతనికిచ్చే గౌరవం బాలాకి అబ్బురంగా కనబడుతుంది.

నాలుగో ఎపిసోడ్  లో జరిగిన కథ- క్లుప్తంగా:  

రాంబాబు అనే ప్రొడక్షన్ అసిస్టెంట్ శాండీ, బాలా, కామీ లని చాటుగా అనుసరిస్తాడు. వాళ్ళు శివసాగర్ హోటెల్ లో కూర్చుని ఉన్న సమయంలో హర్షవర్ధన్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి తనని తాను పరిచయం చేసుకుని, రాంబాబు వాళ్ళని స్టార్ మెటీరీయల్ గా గుర్తించిన విషయం చెబుతాడు.  కారణమేదయినా రహస్యంగా అనుసరించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు శాండీ.

ఐదవ ఎపిసోడ్ లో జరిగిన కథ క్లుప్తంగా: 

హర్ష, రాంబాబుల మాటలు విన్నాక, తమలో తాము మాట్లాడుకుని, హర్ష చెప్పే కథ విన్నాక నటించేదీ, లేనిదీ నిర్ణయించుకోవచ్చని తలుస్తారు. ముగ్గురూ ఆఫీస్ కి వెళ్లి కలుద్దాం అనుకుంటారు. అంతలో హర్షవర్ధన్, రాంబాబులే వీళ్ళ ఫ్లాట్ కి వచ్చారు.  వాళ్ళకి కథ నచ్చుతుందా? కింది ఆరవ ఎపిసోడ్ చదవండి.

తరువాతి ఆరవఎపిసోడ్ ఇప్పుడు చదవండి.

             

శాండీ అందరికీ కాఫీ కలిపి తెచ్చాడు. హర్ష మొహంలో చిరునవ్వు. మేం ఒప్పుకొని తీరుతామన్న నమ్మకం. నా వంక సూటిగా చూశాడు. “వెల్, మీరనుకుంటున్నట్లు మీరు ఒప్పుకుంటారనే నమ్మకం నాకు ఉంది. నమ్మకం కంటే ఆశ ఉంది. ఎందుకంటారా, మీ మొహంలో ఏ భావాలు దాగవు. అద్దంలో చూసినట్లు భావాలు కనపడతాయి. నాకు కావాల్సింది అదే, నటన కాదు. యాక్షన్ ఎవరైనా చెయ్యొచ్చు, ఎవరితోనైనా చేయించుకోవచ్చు. కానీ ‘రియాక్షన్’ మాత్రం కొన్ని ముఖాల్లోనే ప్రస్ఫుటంగా కనబడుతుంది. మీకున్న మరో పెద్ద ఎసెట్ మీ కళ్ళు. అవి మోస్ట్ ఎక్స్ ప్రెసివ్” సిన్సియర్ గా అన్నాడు హర్ష. 

“యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రైట్, తనను చూసిన మొదటి క్షణం లోనే నేననుకున్నాను.ఈమెది ప్రత్యేకమైన ముఖమని” అన్నాడు శాండీ. నాకు కొంచెం బిడియంగా అనిపించింది. ఫక్కున నవ్వింది కామీ,  “మొహం మీద బిడియం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందే బాలా” అన్నది.

 

“డిస్కషన్ జరుగుతోంది హర్షగారు, మొదట మీరు చెప్పే కథ విన్నాక నిర్ణయం తీసుకుందామని అనుకున్నాం” ఓపెన్ గా అన్నాడు శాండీ.

 

“శాండిల్యా, మీరు నన్ను హర్ష అంటే చాలు  గారూ, గీరూ వద్దు. నేను మిమ్మల్నందరినీ మీ పేరుతోనే పిలుస్తా. ఈ మాట అందరికీ వర్తిస్తుంది” అన్నాడు హర్ష. వాతావరణం తేలికపడింది.

 

“హర్షా. కథ చెప్పుకోవాలంటే మంచి టైం పన్నెండు దాటాకే, ఈలోగా మనం ఎక్కడైనా టిఫిన్ కానిద్దాం” అన్నాడు రాంబాబు.

 

నేను ఆశ్చర్యంగా అతని వంక చూశాను. “రాంబాబుకి పంచాంగం అంతా కంఠోపాఠమే. రాహుకాలం, యమగండం, వర్జ్యం, వారం అన్ని పాటిస్తాడు. టైం చూసే ఇవాళ నన్ను ఇక్కడికి బయలుదేర తీశాడు” నవ్వుతూ అన్నాడు హర్ష.

 

“అంత నమ్మకమా? పంచాంగంలోనూ, దినవార పత్రికల్లోనూ రాసినట్టే జరుగుతుందంటారా?” సూటిగా అన్నది కామీ.

 

“అయ్యా.నేను నమ్ముతాను. అలాగని మూఢంగా నమ్మను. చెరువులో నీళ్లు, నదిలో నీళ్లు, బావిలో నీళ్లు, కాలువలో నీళ్లు, సముద్రంలో నీళ్లు. అన్ని నీళ్ళే కానీ మనం తాగేది మంచినీళ్లు మాత్రమే. అలాగే అన్ని రోజులూ, గంటలూ, ఘడియలే అయినా కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని సుమారు అయినవి ఉంటాయి, కొన్ని కష్టనష్టాలు కలిగించేవి ఉంటాయి. అయ్యా. పెద్దలు ఏది చెప్పినా శాస్త్రీయమైన రుజువులు లేకుండా చెప్పలేదు. ఇంగ్లీషు కేలండర్లో డే అండ్ డేట్ ఉంటాయి అంతే, మరి మన పంచాంగంలో? అవి మాత్రమే కాక, ఎప్పుడూ వర్షాలు కురుస్తాయో, ఎప్పుడు కార్తెలు మారుతాయో, ఎప్పుడు సూర్యచంద్ర గ్రహణాలు కలుగుతాయో, వాటి పట్టు కాలం, విడుపు కాలంతో సహా సర్వం ఉంటాయి. అందుకే నేను నమ్ముతా, వీలైనంతగా పాటిస్తా” సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు రాంబాబు.

“మీరన్న మాటలు చాలా కన్విన్సింగ్ గా ఉన్నాయి. కాల విభజన సృష్టిలో జరిపింది భారతీయులే, అలాగే గ్రహ చలనాలను స్పష్టంగా చెప్పిందీ భారతీయ ఖగోళ శాస్త్రకారులే” తలాడించి అన్నాడు శాండీ.

 

“అష్టమి నవములు కష్టపు దినములు అంటారు, అలాగే కొన్ని సమయాల్ని వర్జించమంటారు. స్వానుభవం ఏమన్నా ఉందా?” అడిగింది కామీ. తనకి ఈ మాత్రం తెలుసని కూడా నాకు తెలీదు.

 

అయినా మా గాఢ పరిచయం బాంబే ప్రయాణం నుంచేగా.

 

“అష్టమి నవములు అందరికీ కష్ట దినాలు కాదు. ఏది చూసినా మీరు పుట్టిన తేదీ, నక్షత్రం, లగ్నం, రాశి బట్టి చూడాలి. కొంతమంది ఆ రోజుల్లోనే ప్రయాణం చేస్తూ కష్టాలకి గురైన వారు నాకు తెలుసు, అలాగే ఆ రోజుల్లోనే ఏ కష్టమూ లేకుండా తెగ ‘సంపాదించిన’ వారూ నాకు తెలుసు. ఏదేమైనా మన నమ్మకం మీదే అన్ని ఆధారపడి ఉంటాయి. ఒక్కమాట చెప్పనా, ఏది ఫాలో అయినా కాకపోయినా జరిగేది జరక్కమానదు, ముందు జాగ్రత్తల వల్ల జరిగే వాటి గాఢతని తట్టుకోగలము” అన్నాడు రాంబాబు.

 

“అదెలాగా?”

 

“కృష్ణ, రామ్మోహన్, సంధ్య, సుకన్య అనే నలుగురే కాక అనేకమంది ‘తేనె మనసులు’ అనే సినిమాలో సెలెక్ట్ అయ్యారు. కృష్ణా, రామ్మోహన్ ఇద్దరు హీరోలు, సంధ్యా సుకన్య హీరోయిన్లు. అందరూ రామ్మోహన్ గొప్పస్టార్ అయిపోతాడని జోస్యం చెప్పారు, ఆంధ్రా దేవానంద్ అని కూడా పేరు పెట్టారు. అలాగే సుకన్య ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేశారు. చిత్రం ఏమిటంటే కృష్ణ సూపర్ స్టార్, సూపర్ ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్, డైరెక్టర్ ఎట్సెట్రా అయ్యి, ఇండస్ట్రీ మూల స్తంభాల్లో ఒకరైతే రామ్మోహన్ కేవలం కొన్ని సినిమాలకే పరిమితమయ్యి పెట్టె సర్దుకొని వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇద్దరినీ ఇంట్రడ్యూస్ చేసింది ఆదుర్తి గారే, ఒకరు మాత్రం సూపర్ స్టార్డం అందుకుంటే మరొకరు తొలిమెట్టు దగ్గరే ఎందుకుండాల్సి వచ్చిందీ? అయ్యా దాన్నే అంటాం ఫేట్ అనో, కాల మహిమ అనో” చల్లారిపోయిన కప్పుని చూస్తూ అన్నాడు రాంబాబు.

 

“అది కింద పెట్టండి, మరో కప్పు కాఫీ తెస్తాను” శాండీ అర్జెంటుగా కిచెన్ లోకి వెళ్ళాడు.

 

“మా రాంబాబు ఏదైనా వివరిస్తున్నాడు అంటే ఆకలి దప్పులు మరిచిపోతాడు. మంచి నాలెడ్జి ఉన్న వ్యక్తి. హేతువుని సహేతుకంగా వివరించగల దిట్ట” అడ్మైరింగ్గా అన్నాడు హర్ష.

 

మరో రౌండ్ కాఫీలు.

 

“జూహూ ఝ్49 దగ్గర్లో ఓ పిజ్జా హట్ ఉంది, దాన్ని కొల్లగొడదామా?” అన్నాడు శాండీ.

 

“ఓకే, నాకు పిజ్జా అంటే మోజు లేదు కానీ, నలుగురితో నారాయణ అనడానికి మాత్రం సిద్ధం” అన్నాడు రాంబాబు.

 

“ప్లేట్లో పిజ్జా, వెన్నెల్లో రోజా నాకు ఒకేలా అనిపిస్తాయి” నవ్వి అన్నది కామీ. అది పిజ్జా లవర్ అని నాకు ఇప్పుడే తెలిసింది.

 

“కాకినాడ కాజా, ఇటాలియన్ పిజ్జా, మంచినీళ్ళ కూజా, ఫ్లవర్ వాజ్ లో రోజా, రోజ్ వుడ్ మేజా, పెళ్లిల్లో బాజా అన్ని సూపరే”  రిథమిక్ గా అన్నది కామీ.

 

“భలే” అన్నాడు హర్ష నవ్వుతూ.

 

“అయిదుగురం ఒకే కార్లోనా, మీరు ముగ్గురు మేమిద్దరం రెండు కార్లలోనా?” అన్నాడు రాంబాబు.

 

“ఇరుక్కుని కూర్చోవడంలోనే అందం, ఆనందం” నవ్వింది కామీ.

 

“నేను, బాలా, శాండీ వెనుక సీట్లో మీరిద్దరూ ముందు సీట్లో, డ్రైవర్ ఎవరో మీరిద్దరిలోనే తేల్చుకోండి” అని కూడా అన్నది.

 

“అబ్బా, భలే క్లీన్ గా చెప్పారండి” ఫక్కున నవ్వి అన్నాడు హర్ష.

 

ఓ అరగంటలో వాళ్ళ కారులోనే మేము కూర్చున్నాం.

 

**

 

రెండున్నరకి హర్ష ఇల్లు కం ఆఫీసులో కూర్చున్న వాళ్ళం 7:30 కి లేచాము. మొదటి రెండున్నర గంటలూ హర్ష కథ చెప్పాడు. పిన్ డ్రాప్ సైలెన్స్. మిగతా మూడు గంటలు ఆల్మోస్ట్ సైలెన్స్. టీలూ, కాఫీలూ 4.30 తొ 7.30 వరకూ సాగాయి నేనైతే టోటల్ సైలెంట్.

“ఎన్నివేల సార్లు ఈ సినిమా మీ మనసనే సెల్యులాయిడ్ మీద చూశారు సార్?” ట్రాన్స్ లో అడిగినట్టు అడిగాడు శాండీ.

“చెప్పలేను. నిజంగా చెప్పలేను శాండీ, నా దగ్గర చాలా కథలున్నాయి. అవి తీస్తే సూపర్ హిట్ అవుతాయని తెలుసు. ఈ కథ మాత్రం ప్రత్యేకం, నో కమర్షియల్ టాక్టిక్స్. ఈ కథ తెలిసింది నాకు తప్ప నలుగురికే. మీ ముగ్గురు ప్లస్ రాంబాబు. కథ చెప్పేటప్పుడే బాలా రియాక్షన్ గమనించా, షీ ఈజ్ పర్ఫెక్ట్. అలాగే కామీ పాత్రకి 100% పర్ఫెక్ట్ ఆర్టిస్టునే పట్టుకున్నానన్న నమ్మకం పెరిగింది” చాలా సంతృప్తితో అన్నాడు హర్ష. నేను అవాక్కయ్యాను, కామీ కళ్ళలో చెమ్మ.

 

“నేను నిజంగా వైశాలి క్యారెక్టర్ కి సరిపోతానా?” గాద్గికంగా అన్నది కామీ.

 

“చెప్పాగా 100% అనీ” నవ్వాడు హర్ష.

 

“శాండీ.. నీ పాత్ర ఇందులో లేదు కానీ ఉంటుంది. నీకు ఓకే అయితే స్క్రిప్టులో నూరు దర్శకత్వంలోనూ పాలు పంచుకోవచ్చు” శాండీని చూస్తూ అన్నాడు హర్ష.

 

ఎనిమిదిన్నరకి అందరం సన్ అండ్ శాండ్ కి వెళ్ళాము. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఈజీ చైర్ లో కూర్చున్నాం. అందరి చేతుల్లోనూ కోక కోలా.

 

“ఎక్స్ క్యూజ్ మీ”  ఒకతను నా చైర్ దగ్గరికి వచ్చి అన్నాడు.

 

“ఎస్..” అన్నాను.

 

“నా పేరు వినోద్ నిగం, హిమాలయ మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్ ని” ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు.

 

“ఓహ్. నేనెలా తెలుసూ?” ఆశ్చర్యంగా అడిగాను.

 

కామీ, హర్ష కూడా ఆశ్చర్యంగా వింటున్నారు. రాంబాబు ఆఫీస్ నుంచే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు.

 

“మా డైరెక్టర్ మిమ్మల్ని చూశారు, ఇన్ఫాక్ట్ ఆ రూమ్ (మూడవ అంతస్తు చూపి) నుంచి చూస్తూనే ఉంటారు ఇప్పుడూ. ‘పెహలా కదం’ అనే సినిమా సిట్టింగ్స్ జరుగుతున్నాయి, సినిమాలో ఏక్ట్ చేయడం ఇష్టమేనా అడిగిరమ్మన్నారు. మీరు సౌత్ ఫిలిమ్స్ లో ఏమైనా చేశారా” సిన్సియర్ గా అడిగాడు.

 

శాండీ, హర్ష మొహాల్లో నవ్వు. శాండీ మొహంలో ఆశ్చర్యం.

 

“సారీ మిస్టర్ నిగం, నేను నటిని కాదు ఏ సినిమాలోనూ చెయ్యలేదు, నటించాలనే కోరిక లేనేలేదు. డిన్నర్ చేద్దామనుకొని వచ్చాము అంతే” స్పష్టంగా అన్నాను.

 

“సారీ మామ్. సీ యు అగైన్” తలవంచి ‘సలాం’లా చెయ్యి ఊపి గబగబా వెళ్ళిపోయాడు నిగం.

 

“ఓహ్. మై డియర్ హీరోయిన్. ఐయామ్ సో హ్యాపీ” నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది కామీ.

 

శాండీ నవ్వి, “చూశారా, రాంబాబు 100% కరెక్ట్. మీరు నిజంగా స్టార్ మెటీరియల్ అని రుజువు చేసుకున్నారు” సంభ్రమంగా అన్నాడు.

 

“బాలా. ముందు కంగ్రాట్స్! హిమాలయా మూవీస్ చాలా రెప్యూటడ్ ఫిలిం కంపెనీ. దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రొడక్షన్ హౌస్ అది. వాళ్ళ నుంచి ఆఫర్ రావడం అంటే నక్కతోక తొక్కినట్టే. బహుశా ఇప్పుడు మళ్లీ నిగం వస్తాడు” అన్నాడు హర్ష.

 

“ఎందుకూ?” ఆశ్చర్యంగా అడిగింది కామీ.

 

“సీ యు అగైన్ అన్నాడుగా. బాలా, బాంబే వాళ్ళకి చాలా పేషన్సే కాదు, అపరిమితమైన తెలివితేటలూ ఉన్నాయి. ఎప్పుడైతే నేను నటిని కాను, ఏ సినిమాలోనూ చేయలేదు అని మీరన్నారో ఆ క్షణమే అతనికి కావలసిన ఇన్ఫర్మేషన్ దొరికింది. నెక్స్ట్ స్టెప్పు మిమ్మల్ని ఒప్పించడం. దానికి వస్తాడు”  వివరంగా చెప్పాడు హర్ష.

 

“మై గాడ్” ఆశ్చర్యంగా అన్నాను. నేనన్న మాటలు అతనికి ఇన్ఫర్మేషన్ గా మారడమే నా ఆశ్చర్యానికి కారణం.

 

మరో పది నిమిషాల్లో మేము లేవబోతుండగా వినోద్ నిగం “జస్ట్ వన్ మినిట్ మామ్” అంటూ వచ్చాడు. “మా డైరెక్టర్ శిబూ చక్రవర్తి వారి కార్డుని మీకు ఇచ్చి రమ్మన్నారు. హి ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్, వెంటనే మీరు ఓకే అనక్కర్లేదు ఆలోచించుకున్నాకే ఎస్ అనో నో అనో ఫోన్ చేసి చెప్పమన్నారు. చాలా పెద్ద బడ్జెట్ సినిమా, మంచి క్యారెక్టర్ అని కూడా చెప్పమన్నారు” వెనుతిరిగాడు వినోద్ నిగం.

 

రెండు నిమిషాలు ఆగి, “మై గాడ్ శిబూ చక్రవర్తా? టాప్ త్రీ బాలీవుడ్ డైరెక్టర్స్ లో అతను ఒకరు. ఇప్పటికీ ఎనిమిది వరుస సిల్వర్ జూబ్లీలు ఇచ్చారు. బాలాజీ, మీరు వాళ్ళకి ఓకే అన్నా నేనేం అనుకోను. ఎందుకంటే ఇటువంటి ఛాన్స్ లైఫ్ లో ఒకసారే వస్తుంది” నా చేతులు పట్టుకొని ఊపేస్తూ అన్నాడు హర్ష. కామీ, శాండీ అవాక్కయి నిల్చున్నారు.

 

**

 

అందరం ఫ్లాట్ కి వచ్చాం.

 

దారంతా హర్ష శిబూ చక్రవర్తి గురించే చెప్పాడు.

 

ఓ ఆర్ట్ ఫిలిం డైరెక్టర్ గా ఎన్నో ఎన్నో విదేశీ ప్రదర్శనలలో బోలెడు అవార్డులు గెలుచుకున్నా స్వదేశంలో ఏమాత్రం గుర్తింపు రాలేదట. కేన్స్ ఫెస్టివల్ లో ప్రథమంగా వచ్చినా బాలీవుడ్ చిత్రపరిశ్రమ ఏమాత్రం పట్టించుకోలేదట. అప్పుడు ఓ కచ్చతో కమర్షియల్ ఫిలిమ్స్ తీసి బాలీవుడ్ పరిశ్రమకే రారాజై ఏలుతున్నాడట.

 

“ఎస్. ఆయన సినిమాలన్నీ నేను చూశాను. ఎంత కమర్షియల్ ఎలిమెంట్ ఉన్నా ఎక్కడో అక్కడ హృదయాన్ని స్పృశిస్తాయి. దట్ ఈజ్ కాల్డ్ ద డైరెక్షనల్ టచ్. ఇప్పట్లో అతన్ని కొట్టేవాళ్ళు లేరు” అంటూ శిబూ చక్రవర్తి సినిమాల పేర్లన్నీ ఏకరువు పెట్టాడు శాండీ.

 

“రెండు, మూడు సినిమాలు నేను చూసా, థియేటర్ అంతా ఈలలూ, కేకలే” అన్నది కామీ.

 

నేనూ ఆయన సినిమాలను చూశాను గానీ మౌనంగానే ఉన్నా. గత రెండు రోజుల్లో జరుగుతున్న ఘటనలు నాకే నమ్మశక్యంగా లేవు. అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు.

 

“మీరేమనుకుంటున్నారూ?” కారుని రోడ్డు వారగా ఆపి అన్నాడు హర్ష.

 

“మైండ్ అంతా బ్లాంక్ గా ఉంది. నిజంగా” అన్నాను.

             

“మీరూ?” కామీని అడిగాడు.

 

“అసలు నా ప్రసక్తే లేదుగా” నవ్వింది కామీ.

 

“ఏమో. మీకూ ఆఫర్ వస్తుందని నా మనసుకి తోస్తుంది” సూటిగా కామీని చూస్తూ అన్నాడు హర్ష.

 

“మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు. మీ పిక్చర్ ని వదిలి అటువైపు జంపు చేస్తామనా?” ఓపెన్ గా అన్నది కామీ.

 

“జంపు చేసినా తప్పేముంది? నా సినిమా గొప్పదే, కానీ బడ్జెట్ చాలా తక్కువ. మీకు ఇచ్చే రెమ్యూనరేషన్ నిజంగా మీ ఖర్చుల్ని తీర్చలేవు. అదే శిబూ చక్రవర్తి సినిమా అయితే మీ ఇంట్రడక్షనే దశదిశలూ దద్దరిల్లిపోయేట్టు చేస్తారు. అనౌన్స్ చేసిన రోజే పది బ్లాంకు చెక్కులు మీ టేబుల్స్ మీద ఉంటాయి. ఎక్కడికెళ్ళినా మీ న్యూసే. మీ న్యూస్ కోసం సినీ పత్రికలు, ఛానల్స్ పిచ్చిగా వెంటపడతాయి. ఇవన్నీ నా ఊహలు కావు, నిజాలు పచ్చి నిజాలు. నేను అన్నట్టు కోటికోసారి వచ్చి ఆపర్చునిటీ ఇది” స్పష్టంగా, ఓపెన్ గా అన్నాడు హర్ష. ఒక విధంగా ఇలా జరగడంతో అతనూ షాక్ లోనే ఉన్నాడనిపించింది.

 

“నా స్థానంలో ఉన్నా, బాల స్థానంలో ఉన్నా మీరేం చేస్తారు?” అడిగింది కామీ.

 

"అది చాలా క్రూరమైన ప్రశ్న కామీ. ఆయన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు వేయొద్దు” సీరియస్ గా అన్నాను కామీతో.

 

“అది ఇరుకున పెట్టే ప్రశ్న ఆయనా, అడగవలసిందే అడిగింది. నేనే బాలనైతే అర్జెంటుగా శిబూజీకి ఫోన్ చేసి నా సమ్మతి తెలుపుతాను. ఎందుకంటే, నా డైరెక్షన్ ఇంకా మొదలవలేదు. మనసులో సినిమా చూసుకోవడం వేరు. మనో సెల్యులాయుడికి బడ్జెట్ తో పనిలేదు. ప్రాక్టికల్ వ్యవహారం వేరు” నిర్మొహమాటంగా అన్నాడు హర్ష, నేనేమీ మాట్లాడలేదు.

 

“అది ద్రోహం కాదా?” అన్నది కామీ.

 

“ద్రోహం ఎట్లా అవుతుందీ  నేను మీకు చిల్లుకాణీ ఇవ్వలేదు. మీరు నాకు మీ సమ్మతినీ తెలుపలేదు. కథ విని నిర్ణయించుకుందామనుకున్నారు. కథ విన్నారు. సంతకాలేమీ పెట్టలేదుగా? ఒకే ఒక రిక్వెస్ట్ ఏమంటే, నా కథని మీరెవరికి రివీల్ చేయకూడదని. మీ మీద నాకా నమ్మకం ఉంది” ప్రాక్టికల్ గా మాట్లాడాడు హర్ష కార్ స్టార్ట్ చేస్తూ.

 

ఫ్లాట్ వరకు ఆల్మోస్ట్ మౌనమే. 

**

 

రాత్రి 10:30 కి మాకు ఎవరికీ నిద్ర పట్టడం లేదు శాండీ లేచి ‘జాగ్ తే రహో’ అనే రాజు కపూర్ పిక్చర్ ని పెట్టాడు. క్షణాల్లో పిక్చర్ మా మనసుల్ని లాగేసింది. మై గాడ్.. అటువంటి సినిమా కథ ఎలా తడుతుందీ! సినిమా ఒకటే కానీ ఎన్ని జీవితాలను వడకట్టి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. మన సొసైటీనే మన కళ్ళకి కట్టినట్టు చూపించాడు, అదీ నవరసాల కలబోతతో.

 

సినిమా అయిపోయిన తర్వాత కూడా చివరి సీనే మా మనసులో తిష్ట వేసుకుని కూర్చుంది.. తుఫాను తర్వాత వచ్చే ప్రశాంతత లాగా

వాహ్! ఇప్పుడు ఏవి ఇలాంటి సినిమాలు?

 

ఠక్కున హర్ష చెప్పిన కథ గుర్తుకొచ్చింది. ఒకసారి మళ్ళీ మనసులో రివైండ్ చేసుకున్నాను. చిత్రంగా అతని చిత్రంలో హీరోయిన్ అచ్చు నాలాగే ఉంది!

 

**

 

“What to do?” నిద్ర లేస్తూనే అడిగాను శాండీని.

 

“మరో డిస్కషన్ పెట్టుకోవాలి బాలా. బహుశా వినోద్ నిగం ఈపాటికే మన గురించిన సమాచారం సేకరించాడేమో! ప్రొడక్షన్ మేనేజర్లు, ముఖ్యంగా బాంబే వాళ్ళు మహాఘటికులు. నటీనటులు, దర్శకులు, సంగీత సాహిత్య కళాకారులు ఎంత ముఖ్యమో, ప్రొడక్షన్ మేనేజర్లు సినిమాకి అంత ముఖ్యం. నిర్మాత తర్వాత నిర్మాత అంత కమాండ్ వీరిదే. నటీనటుల కాల్ షీట్స్ నుంచి, షూటింగ్స్ స్పాట్స్ ని ఫిక్స్ చేసే వరకూ అన్నీ వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయి” వివరించాడు శాండీ.

 

“మన నెంబర్ వాళ్లకి ఇవ్వలేదుగా?” అన్నాను.

 

“అది ఎంతసేపు కనుక్కోవడం” నవ్వాడు శాండీ. నైట్ గౌన్ లో కామీ హాల్లోకి వచ్చింది. అద్భుతమైన స్ట్రక్చర్.

 

“హాయ్.. గుడ్ మార్నింగ్” శాండీ విష్ చేసి కిచెన్ లోకి వెళ్ళాడు.

నేనూ కామీని విష్ చేసి బ్రష్ చేసుకోవడానికి బాత్రూం కి వెళ్ళాను.

 

**

 

మేము కాఫీలు తాగే స్నానాలు ముగించుకునేసరికి టైం 9 అయింది. డ్రెస్ చేసుకుని బ్రేక్ ఫాస్ట్ కి బయలుదేరేంతలో డోర్ బెల్ మ్రోగింది. ఓపెన్ చేస్తే హర్ష, రాంబాబు.

 

“బయలుదేరుతున్నారా. పదండి మేము మీతోనే వస్తాము” అంటూ వెనక్కి తిరిగాడు హర్ష. ఫ్లాట్ కి తాళం వేసి అందరం బయలుదేరాము. మా కారులో మేము, వాళ్ళ కారులో వాళ్ళు.

 

“ఇక్కడ ‘సన్నీ సౌండ్స్’ అనే ఓ రికార్డింగ్ థియేటర్ ఉంది. అది ధర్మేంద్ర గారిది. అక్కడి క్యాంటీన్లో సూపర్ గా ఉంటాయి, టీ సూపర్. అక్కడికి వెళ్దామా? అయితే కూర్చుని తినే అంత వీలు ఉండదు. నేను ప్రొడక్షన్ వాడిని కనుక ఓకే” అన్నాడు రాంబాబు.

 

 “ఊహూ..! మనం కాస్త తీరిగ్గానే తింటూ డిస్కస్ చేసుకోవాలి” అన్నాడు హర్ష.

 

“ఓకే, సైక్లింగ్ రోడ్లో ‘టూ లిప్స్’ అనే జాయింట్ ఉంది. లవ్లీ ప్లేస్, పొద్దున్న పెద్దగా రష్ ఉండదు. దోస, ఇడ్లీ కూడా అక్కడ దొరుకుతాయి” అని అడుగు రాంబాబు.

 

**

 

అందరం ‘టూ లిప్స్’ లో కూర్చునే సరికి 10 గంటలు అయింది. చాలా స్లో డ్రైవ్ లో వచ్చాం. టూలిప్స్ నిజంగా బాగుంది. కొంత మోడర్న్, కొంత ఏన్షియంట్ లుక్ తో కంఫర్టబుల్ గా అనిపించింది. కూర్చోగానే ఫ్రెష్ గా ఫైనాపిల్ జ్యూస్ గ్లాసులు పెట్టాడు సర్వర్. సిప్ చేస్తే అద్భుతంగా ఉంది.

“ముంబై స్మెల్ కూడా ఉంది కదూ! కారణం నేను చెప్పనా, పైనాపిల్ జ్యూస్ లో కొంత ‘రూఆఫ్జా’ కలిపారు” నవ్వుతూ అన్నాడు శాండీ.

 

వంటల ఎక్స్పర్ట్ అతనేగా మరి. తలో  ప్లేట్  ఇడ్లి ఆ తరువాత మసాలా దోస మెల్లగా తెమ్మని పురమాయించాడు హర్ష.

 

ఆ తర్వాత, “ఓకే గైస్, రాత్రంతా నేను ఆలోచించాను. 6 గంటలకే రాంబాబుకి కబురు పెట్టి పిలిచాను. మేమూ చాలా ఆలోచించాము. మొదట మీ ఆలోచనలు ఏమిటో తెలుసుకోవడం అది ముఖ్యం. అందుకే  మీ నిర్ణయాన్ని చెప్పండి” అన్నాడు హర్ష. మా ముగ్గుర్నీ చూస్తూ.

 

“మీ సినిమా ఆఫర్ మొదట వచ్చింది. అదీ, ఏమాత్రం మా మీద అవగాహన లేకుండా. నటనలో నేనూ, కామీ ఇద్దరం కొత్త బిచ్చగత్తలమే. అయినా మీరు అత్యంత నమ్మకంతో మమ్మల్ని సినిమాలోకి ఆహ్వానించారు. ఇప్పటికీ నేను నటించగలనన్న నమ్మకమూ, నా ద్వారా సినిమాకి ఒక స్థాయి కలుగుతుందన్న నమ్మకమూ మీకుంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్, నూరో ప్రిఫరెన్స్ కూడా మీ సినిమానే” స్పష్టంగా చెప్పాను హర్ష తోటి.

 

అతని మొహం మీద ఓ అభిమానపు మెరుపు మెరిసింది.

 

“నేను రాత్రంతా ఆలోచించాను. నాకు 100% సూట్ అయ్యే పాత్ర మీ వద్ద ఉందని అన్నారు. బాలాకైతే రెండో ఆఫర్ వచ్చింది. నాకు ఉన్నది ఒకే ఒక్క ఆఫర్, మీ ఆఫర్. కనుక నేను నటించుటకు సిద్ధం” అన్నది కామీ.

 

“నా నిర్ణయమూ డిటోనే హర్షా. సినిమాకి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్స్, అంటే క్రాఫ్ట్స్ లో నైనా నేను సిన్సియర్ గా పనిచేస్తానని ప్రామిస్ చేస్తున్నాను” అన్నాడు శాండీ.

 

“ఓహ్! నిజంగా నేను ఎంత అదృష్టవంతుడిని. వజ్రాల్లాంటి ముగ్గురు స్నేహితులు నాకు దొరికారు. ఏమాత్రం మోహానికీ, ఆశకీ లొంగనివాళ్లు, స్నేహధర్మాన్ని గౌరవించేవాళ్ళు. గాడ్! నిజంగా అయాం సో హ్యాపీ. మీ నిర్ణయం నాకు నిజంగా ఓ అపురూపమైన వరమే కానీ... ” ఆగాడు హర్షవర్ధన్.

 

మళ్ళీ కలుద్దాం

మీ భువనచంద్ర

*****

bottom of page