top of page

మధురవాణి ప్రత్యేకం

పాండి బజార్ కథలు - 5

hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

ఖుషీ కార్నర్

భువనచంద్ర

“ ఏవుందండీ మీ సినిమాల్లో.. అంతా ఆర్టిఫిషియలేగా..!" హేళనగా అన్నాడు కోరంగారు. "కోరంగారి"పూర్తి పేరు కోదండ రంగారావు. ఏ పనీ చెయ్యాల్సిన అవసరం  ఆయనకి లేకపోవడంతో , 'పని చేస్తున్నవాళ్లని' మాటల్లోకి దించి పని చెడగొట్టడమే ఆయన 'పని'గా పెట్టుకున్నాడు.

"అంటే?" చేస్తున్న పనిని ఆపి అడిగాడు సైకిల్ మూర్తి. ఆయన్ని అందరూ అలాగే పిలుస్తారు. నలభైయ్యేళ్ల క్రితం కొన్న 'హంబర్' సైకిల్నే ఇంకా వాడుతున్నాడు. స్టాండు వేసినప్పుడల్లా దాన్ని తుడవడం ఆయన హాబీ.

"దుస్తులు కుట్టేది ఒకడు... క్రాఫింగు దువ్వేదో, విగ్గు పెట్టేదో ఇంకోడు… మాటలు ఒకడు… పాటలు ఒకడు... ఇలా చెయ్యి అని నటించి చూపించేది ఒకడు, చెయ్యి విసరంగానే ఢమాల్న కిందపడేవాళ్లు యాభైమంది… 'ఇలా ఎగురు, ఇలా దుముకు. ఇలా నడ్డి ఆడించు' అని నానా స్టెప్పులు నాట్యం పేరున వేయించేవాడు మరొకడు... ఇదంతా ఏమిటండీ?" రకరకాల అంగన్యాస హస్తన్యాసాలతో హేళనని మరింత మేళవించి అన్నాడు కోరం.

"అయ్యా… మీరు చెప్పింది నిజమే... కాదని ఎవరూ అనరు. మన జీవితాలు అంతకంటే గొప్పవేం కాదుగా. మనం తినే తిండిని పండించేదొకరు. వండేదొకరు. వొడ్డించేదొకరు... బట్టలు కుట్టేదొకరు… పాఠాలు చెప్పేదొకరు. ఇలా చూస్తే మనం మాత్రం ఇతరుల మీద ఆధారపడకుండా కుళ్ళబొడిచేసింది ఏముందీ...?" తీవ్రంగా అన్నాడు దూర్వాసరావు. ఆయన అసలు పేరు ఆనందరావేగానీ, ముక్కు మీద కోపం వుంటుంది గనక దూర్వాసరావుగారని అంటాం.

 

ఈ సంభాషణ అంతా జరుగుతున్నది 'ఖుషీ కార్నర్'లో. ఖుషీ కార్నర్ ఫుల్లయ్యేది ఉదయమూ, సాయంత్రమూ. అందరూ పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్లు కాదు,  డైరీ నించి నవలలదాకా రాసే రచయితలూ, వంటల గురించి నోరూరించే విధంగా వర్ణించే నలభీములూ, సినిమాల గురించి అనర్ఘళంగా 'వాయించే' వక్తలూ అందరూ ఇక్కడే చేరతారు. ప్రపంచంలోని అన్ని విషయాలు ఇక్కడ 'తిరగమోత'లో పడక తప్పదు. ఆ మూల నున్న గుంటూర్ గాలిబ్‌గారు కవితల్ని కాయితాల మీద వర్ణించేది మా ఖుషీ కార్నర్‌లోనే.

 

"ఎవరు ఎంత గొప్పగా అభినయించినా ‘హాస్యాభినయం' మాత్రం చాలా క్లిష్టమైనదండీ…! విలన్‌లా ఎనిమిది రసాల్నీ 'ఏలేయొచ్చు'గానీ  హాస్యాన్ని పండించడం తేలిక కాదు..." నిర్ధారించారు ఆంబా గిరీశంగారు.

ఆంబా గిరీశం అంటే ఆంధ్రా బాంక్ గిరీశంగారన్నమాట. ఆయన జోనల్ మేనేజరుగా రిటైరయ్యారు. మాంచి శ్రోత +వక్త కూడా. "అదేం?" ముక్తసరిగా అన్నాడు ముక్తేశ్వర్రావుగారు. ఆయన LIC  ఆయన. "అన్నారూ... మీకన్నీ సందేహమే... మీరు చెప్పండి గురూజీ..." ఆంబాగారితో అన్నది అమూల్య. ఆవిడ గొప్ప ఉత్తరాల రచయిత్రి. వివిధ వార, పక్ష, మాస, త్రైమాసిక, వార్షిక పత్రికల్లో ఆవిడ రాసిన వుత్తరాలు రెండు వేలకి పైగా ప్రచురించబడ్డాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా ఆవిడ పదిలపరచడమేగాక వారింటికి వెళ్ళినప్పుడల్లా టిఫినూ, కాఫీలిచ్చి మరీ చూపిస్తుంది. మనిషి మంచిది. వృత్తి సంగీతం టీచరు. గొప్పగా పాడగలదు కూడా.

"సరే. ఇవాల్టి సబ్జక్టు 'హాస్యం'గా ఫిక్సయిపోదాం... !" చెప్పారు గురయ్యగారు. ఆయన చాలా మంచి ప్రొడక్షన్ మేనేజరు. (తరవాత్తరువాత విశేష పరిచయం చేసుకుందాం) "అదీ సినిమాలో హాస్యం అయితే ఇంకా బాగుంటుంది!" ఉత్సాహంగా అన్నది సావిత్రి. ఆవిడ అసలు పేరు సరస్వతి. సావిత్రి మీది అభిమానంతో సావిత్రి అని మార్చుకుంది. పిల్లలచేత నాటకాలు అవీ వేయిస్తుంటుంది. చిన్నపాటి రచయిత్రి కూడా.

"అవునవును... కథలూ కావ్యాల్లోని హాస్యం అంత తేలిగ్గా అర్ధం కాదు."తలూపారు నంది నరసింహంగారు. ఆయన తెలుగు మాట్లాడితే 'పులి మేక వేషం' వేసుకొచ్చినట్టు వుంటుంది.

"పాటలయితే మరీ మంచిది. ఇంకా వుత్సాహంగా వుంటుంది. పాడుకోవచ్చు కూడా.!" చప్పట్లు చరిచి మరీ అన్నాడు రమోజూ బాసు. (పూర్తి పేరు రవీందర మొక్కపాటి జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అనేది అతను బ్రాకెట్లో వేసుకునేది.) మంచి గాయకుడు. కొన్ని సినిమాల్లో 'కోరస్' పాడాడు. ప్రస్తుతం చెన్నైలోని ఓ సాఫ్టర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు గనక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు.

"ఓకే… ఓకే... ఎవరితో మొదలెడదాం?" అడిగారు గురయ్యగారు.

"ఇంకెవరూ? సృష్టికర్తతోనే...!" ముక్తసరిగా అన్నాడు ముక్తేశ్వర్రావు.

"అంటే బ్రహ్మ అన్నమాట. సరే… హాస్యరసానికి సంబంధించిన పాట ఆయన మీద ఏదన్నా వుందా?"

"ఆయన మీదే వుండక్కర్లా... ఆయన పేరు వచ్చినా చాలు...!" ఎమెండ్ చేసింది అమూల్య.

"అలా అయితే ఉంది. అదీ రేలంగిగారు పాడింది" ఠక్కున అన్నది సావిత్రి. "మిస్సమ్మలోది. సావిత్రి రామారావు హీరో హీరోయిన్లు. అన్నట్టు అక్కినేనిగారిది భలే వేషం...!"

"ఆ మాత్రం తెలుసు సావిత్రిగారూ. ఆ సినిమా కథకి మూలం. "రాసమని గర్ల్స్ హైస్కూల్" అనే బెంగాలీ నాటకం. రాసింది రవీంద్రనాథ్ మిత్రా. మన చక్రపాణిగారు ఆ నాటకాన్ని 'ఉదరనిమిత్తం' పేరుతో తెలుగులోకి అనువదించారు. అంతే కాదు శరదేందు బెనర్జీ రాసిన ఇంకో నాటకంలోని ఓ పాత్రతో నాగేశ్వరరావుగారి 'డిటెక్టివ్' పాత్రని మలిచారు" అన్నారు పూర్ణానందగారు. ఆయన సీనియర్ జర్నలిస్టు. బాగా చదువుకున్నవాడు.

"అబ్బా! ఇన్ని విషయాలు తెలియవండి"ఒప్పుకుంది సావిత్రి.

"సరే పాట చెప్పండి... నవ్వొస్తుందో రాదో చూద్దాం...!" అన్నాడు సైకిల్ మూర్తి.

"హా..హా.హా.. ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిట్టాలో వ్రాసిన జమలే బాబూ, ధర్మం చెయ్ బాబూ అన్నారు పింగళి నాగేంద్రరావుగారు. అంతకంటే హాస్యం ఇంకేముందీ? ముష్టి అడుక్కుంటాం. అది బ్రహ్మగారు మన చిట్టాలో వ్రాసిన జమ అనటం ఎంత చమత్కారంగా వుందీ.." పకపకా నవ్వి అన్నాడు. ర.మొ.

"పాడితే వింటాంగా...!" ఓ చూపు చురుక్కుమనేలా విసిరింది అమూల్య.

"పాడొచ్చు... కానీ... ఇక్కడా?"

"చక్కగా పాడొచ్చు. ఏం? రేలంగి పాడింది మాత్రం వీధిలోనూ, పార్కులోనూ కాదా?" నవ్వింది సావిత్రి.

"పాట పాడింది కూడా రేలంగి గారే... సంగీతం ఎవరో తెలుసా? సాలూరి రాజేశ్వరరావుగారు. మాటలు ఇంకెవరూ... చక్రపాణిగారే..." అన్నాడు ర.మొ.

 

*****

పాట:

పల్లవి:  ధర్మం సెయ్ బాబూ.. కానీ ధర్మం సెయ్ బాబూ..

ధర్మం చేస్తే పుణ్యవొస్తదీ కర్మ నడిపిస్తది బాబూ.. ||ధ||

చరణం: కోటి విద్యలూ కూటి కోసమే.. పూటే గడవని ముష్టి జీవితం..

పాటు పడగనే పని రాదాయే.. సాటి మనిషిని సావన బాబూ.. ||ధ||

 

చరణం:  ఐస్క్రీం తింటే ఆకలి పోదూ.. కాసులతోనే కడుపు నిండదూ..

సేసే  దానం చిన్నదియైనా.. పాపాలన్నీ బాపును బాబూ.. ||ధ||

చరణం: మీ చెయ్ పైనా నా చెయ్ కింద.. ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ

ముష్టి ఏమిటి ముసలి బ్రహ్మ మన చిట్టాలో వ్రాసిన జమలే బాబూ ||ధ||

 

ఆ రోజుల్లో డబ్బు లెక్కలు వేరు. కానీ, అర్ధణా, అణా, బేడా, పావలా, ఇలా ఉండేవి. ఇందులో 'కానీ' ధర్మం సెయ్ బాబూ అంటాడు. ఇవాళ 'ఓ రూపాయ్' ధర్మం చెయ్యమన్నట్టన్నమాట.

వేదాంతపరంగా చెబితే యీ శరీరం నిండా మనం తెచ్చుకున్న రుణమే. తండ్రి బీజం తల్లి అండం ధర్మం చేస్తేనేగా మనకీ శరీరం వచ్చింది. సో. ధర్మం సెయ్ బాబూ అని మనమూ శరీరం కోసం యాచించామన్నమాట ...

*****

"బాగుందబ్బాయి. మొత్తానికి బ్రహ్మగారితో  మొదలైందన్నమాట. " నవ్వారు కోరంగారు.

"అఫ్‌కోర్స్. ఆ విషయం పక్కనెడితే, కోటి విద్యలు కూటి కొరకే అనే నానుడిని వాడుకోవడం అద్భుతం. భజగోవింద శ్లోకాల్లో శంకర  భగవత్పాదులు అంటారు 'ఉదర నిమిత్తం బహు కృత వేషా.." అని ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని విద్యలు నేర్చినా అవి పొట్ట కోసమే అంటారు. ఆ అర్ధాన్ని యీ పాటలో వాడడం పింగళిగారికే చెల్లింది. 'పాటు పడగనే పని రాదాయే...' అని ఆనాటి నిరుద్యోగ సమస్యని ఎత్తి చూపడం. సినిమా మొదట్లోనే NTR వాంటెడ్ కాలమ్స్‍ని చూడటం చూపిస్తారు. గుమ్మడిగారు కూడా నిరుద్యోగ సమస్యకి పరిష్కారం మాటల్లో చూపి జనాలకి నీళ్ళు తాగిస్తూ చివరికి తనే నీళ్ళు తాగే పరిస్థితి తెచ్చుకుంటాడనుకోండి. అది వేరే విషయం.

మరో అద్భుతమైన మాట. మీ చెయ్ పైనా.. నా చెయ్ కింద.. అనేది. ఈ మాట 'లంచం పుచ్చుకునేవాళ్లని' ఉద్దేశిస్తూ రాసింది. లంచం అనేది కూడా 'ముష్టి' అడుక్కోవడం లాంటిదేననీ. లంచం తీసుకునేవాడు 'ముష్టివాడి'తో సమానమైనవాడనీ చురక వేశారు పింగళి.

ఇదో చిత్రమైన రచన. రేలంగిని చూస్తూ పాట వింటే కడుపుబ్బా నవ్వొస్తుంది. కేవలం పాట విని అర్ధం చేసుకుంటే సమాజం మీద రచయిత వేసిన చురకలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏమైనా హాస్యగీతాలకిదో మచ్చు తునక.."ఉపన్యాసం ఆపారు పూర్ణానందంగారు.

"ఎక్కడ్నించి ఎక్కడికి లాగారండీ.." అభినందిస్తున్నట్టుగా అన్నది సావిత్రి.

"అబ్బాయ్ రమో..మిస్సమ్మలోనే రేలంగి పాడిన ఇంకో పాట కూడా వుంది. జ్ఞాపకం వుందా?" అన్నారు కోరంగారు.

"ఎందుకు లేదూ.. అదీ హాస్యగీతమేగాక పింగళిగారు సమాజం గురించి వేసిన వ్యంగ్య బాణం.."నవ్వాడు రమో.

"పాడండి.." ఉత్సాహపరిచాడు సైకిల్ మూర్తిగారు.

 

పాట:

గానం: రేలంగి & కోరస్.

.

పల్లవి:

సీతారాం.. సీతారాం.. సీతారాం జై సీతారాం.. ||సీతా||

పైన పటారం లోన లోటారం.. యీ జగమంతా డంబాచారం. ||సీ||

చరణం: నీతులు పలుకుచు ధర్మ విచారం.. గోతులు తీసే కూటాచారం||సీ||

చందాలంటూ భలే ప్రచారం.. వందలు వేలూ తమ ఫలహారం ||సీ||

గుళ్ళో హాజరు ప్రతి శనివారం.. గూడుపుఠాణీ ప్రతాదివారం||సీ||

డాబులు కొడుతూ లోకవిహారం.. జేబులు కొట్టే ఘనవ్యాపారం ||సీ||

టాకుటీకుల టక్కుటమారం. కలికాలం మన గ్రహచారం.. ||సీ||

 

"ప్రతి లైన్లోనూ వ్యంగ్యమే.. సమాజంలో జరుగుతున్న విషయాల్నే పాటలోకి తెచ్చి ఎండగట్టారు పింగళిగారు.." మెచ్చుకున్నారు ఆంబా గిరీశంగారు.

"అవును.. నీతులు పలుకుచూ గోతులు తియ్యడం, చందాలు వసూలు చేసి తామే మెక్కడం, పైకి భక్తి చూపుతూ లోపల రక్తికి పీట వెయ్యడం, మోసాలు చెయ్యడం అన్నిట్నీ వాడిగా వేడిగా 'టచ్' చేశారు.."మెచ్చుకుంది అమూల్య.

"అసలా పాట నిర్మాణం చూడండి. డంబాచారం, కూటాచారం, ఫలహారం, ప్రతాదివారం, ఘనవ్యాపారం, గ్రహచారం' అంటూ ఎంత పకడ్బందీగా నిర్మించారో.." తన్మయంతో అన్నాడు గురయ్యగారు.

 

"విచిత్రం ఏమంటే, సినిమా 1955లో రిలీజైనా, పాటలో రాసిన పరిస్థితులు నేటికీ సజీవంగా వున్నాయి. నిజం చెబితే ఇంకా ఘోరంగా వున్నాయి." చెప్పారు పూర్నానందం.

 

"రచయిత దూరదృష్టేమో!" అన్నది సావిత్రి.

 

 "అంతే కాదు. మన దౌర్భాగ్యం కూడా. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకి కూడా  అవే కొనసాగటాన్ని చూస్తే మనమెంత నిద్రావస్థలో కూరుకుపోయామో అర్ధమౌతుంది."ఉద్రేకంగా అన్నాడు దూర్వాసమూర్తి.

 

"చూద్దాం!" పరిస్థితులు మారి ప్రజలకి మేలు జరగాలని ఆశిద్దాం.." లేచారు కోరంగారు.

 

 

ఓ చిన్న బ్రేక్ తరవాత మళ్లీ...

 

 

ఖుషీ కార్నర్ 2

 

"హాస్యానికి కూడా ఓ వస్తువు కావాలి. లేకపోతే చప్పగా వుంటుంది. " వక్కపొడి నోట్లో వేసుకుంటూ అన్నారు గుంటూర్ గాలిబ్‍గారు. ఆయనో చిన్నపాటి కవి. అసలు పేరు సత్యన్నారాయణమూర్తి. గాలిబ్ అంటే ప్రాణం. అందుకే గుంటూర్ గాలిబ్ పేరు పెట్టుకుని కవితలూ అవీ రాస్తూ వుంటారు.

 

"అంటే 'సబ్జక్ట్' అనా మీ ఉద్దేశ్యమా? సత్తా వుంటే రచయిత ఇసుకలోంచి కూడా నూనె పిండుతాడు. పింగళిగారిలాగా" అన్నది అమూల్య.

 

"అది నిజమేగా.. మిడిల్ యీస్ట్ ఇసుకలోంచేగా పెట్రోలియం బయటికి తీస్తున్నదీ...!" తల వూగించాడు ముక్తేశ్వరరావు.

 

"ముందు సబ్జక్టు చర్చ పూర్తి కానివ్వండి.." ఇంట్లోంచి తెచ్చిన మిరపకాయ బజ్జీల పొట్లం విప్పి అందరి ముందూ పెట్టి అన్నది సావిత్రి.

 

"పింగళిగారిదే ఓ పాట వుంది. పాతాల భైరవి సినిమాలో.." అన్నది అమూల్య.

 

"వినవే బాలా నా ప్రేమ గోలా.. అనే పాటేగా?" అన్నాడు రా.మో.

 

"అవును. అదే.. ఎవరైనా నా గోడు వినిపించుకోవా, నా మాట వినవా, నా విన్నపం ఆలకించవా అంటారు. కానీ రాజుగారి బావమరిదిగారి  పాత్రలో జీవించిన రేలంగి, 'పాత్ర'ని బట్టి శుద్ధ డాంబికమైన భాషనే తన ప్రేమ వెల్లడించడానికి వాడతాడు.

 

"ఓ బాలా.. విను నా ప్రేమగోల."అంటూ..

 

పాట:

చిత్రం: పాతాళ భైరవి: సంగీతం: ఘంటసాల. గాయకులు: రేలంగి.

పల్లవి: వినవే బాలా.. నా ప్రేమ గోల.. నిను కను వేళా.. నిలువగ జాలా ||వి||

చ: గుబుల్ గుబుల్‍ గా.. గుండెలదరగా.

దిగుల్ దిగుల్‌గా ఇది ఇదిగా... ||వి||

చ.. చిరునవ్వు చాలే.. చిత్త్తైపోతానే.

మురిపిస్తే చాలే.. మూర్చపోతానే ||వి||

చ. జోడు గూడీ.. తోడి రాగం... పాడుకుంటూ

మేడ మీదా.. తూగుటుయ్యాల్.. వేడుకలా.. ఊగరావా

ఊగరావా.. ఊగరావా..

చెట్టపట్టాల్ .. జడకోలాటం

తొక్కుడుబిళ్లా.. ఆడే నాతో.. తొక్కుడుబిళ్లా ఆడే నాతో ||వి||

 

"బాగా పాడావ్ ర. మొ"చప్పట్లు చరుస్తూ అన్నది సావిత్రి.

"అవును చాలా బాగా పాడాడు. ఇక్కడి విశేషం ఏమంటే ఇక్కడా ఓ చిత్రమైన 'నిర్మాణం' కనబడుతోంది. సామాన్యంగా కథానాయకుడు పోనీ ఇక్కడ 'గీత' నాయకుడనుకుందాం. ధీరోదాత్తుడైతే వాడే పదాలు వేరు. అది దృష్టిలో వుంచుకునే పింగళివారు రేలంగి పాత్రలోని 'ఎదగని' మనస్తత్వాన్ని ప్రేమపాటలో తెలిపారు." అననరు పూర్ణానంద.

"ఇది హాస్యగీతం కాదా?" అన్నాడు నంది నరసింహం.

"హాస్యం పండించిన ప్రేమ గీతం అనాలి. రేలంగి తన ప్రేమని వెల్లడించి రాకుమారి మనసు గెలుచుకోవాలి. అతనికి ప్రేమని అర్ధవంతంగా అందంగా తెలియజేయగల మనోపరిస్థితి లేదు. అందుకే హాస్యగీతమై అతని ప్రేమ అపహాస్యం పాలయింది" వివరించారు పూర్ణానంద్.

"ఎలా? " అడిగాడు ముక్తేశ్వర్రావు.

"హీరో తోటరాముడు తన ప్రేమను 'ఓ జాబిలీ ఓ వెన్నెల ఓ మలయా నిలమా.. ప్రియురాలికి విరహాగ్నిని పెంపు జేయరా' అని సున్నితమైన సుందరమైన పదాలతో విన్నవిస్తే .. రేలంగి వేసిన రాజుగారి బావమరిది పాత్ర 'చిరునవ్వుతో చిత్తైపోతా,మురిపిస్తె మూర్చపొతా' అంటుంది." ఆగారు పూర్ణానంద.

"అంతేగాదు మేడమీద తూగుటుయ్యాలా, జడకోలాటాలూ, తొక్కుడుబిళ్లలూ, ఆడరామంటుంది ఆ పాత్ర. ఆ సన్నివేశంలో యీ ఆటల్ని పాటలో పొదగటం ద్వారా రేలంగి పాత్ర ఎంత అపరిణితమైనదో చెప్పకనే చెప్పారు" వివరించింది అమూల్య.

"ప్రేమ సన్నివేశం అంటే,  ప్రేమని తెలిపే సన్నివేశంలో కూడా తగిన 'భాష' లేకపొతే ప్రేమ ఎలా అపహాస్యం పాలవుతుందో అద్భుతంగా సూచించారు పింగళిగారు"

"మరో సరదా విషయం చెప్పనా? మాయాబజార్‌లో కూడా అచ్చు ఇలాంటి సన్నివేశమే వుంది. పాట కూడా రేలంగిగారి మీదనే. హీరోయిన్ అంటే సినిమాలో కథానాయిక సావిత్రి. (శశిరేఖ) వెంటపడి ఆమె ప్రేమని గెలుచుకోవడానికి లక్ష్మణ కుమారుడు రేలంగి) పడే పాట్లు కూడా యీ వినవే బాలా పాటనే గుర్తుకొస్తుంది..!" అనారు ఆంబా గిరీశం.

"ఏ పాట?" అడిగారు సైకిల్ మూర్తి.

పాట:

 చిత్రం: మాయాబజార్. సంగీతం: ఘంటసాల గానం: ఘంటసాల, సావిత్రి

 

ప|| సుందరి నీవంటి దివ్యస్వరూపం

ఎందెందు వెదకిన లేదు కదా

ఎందెందు వెదకిన లేదు కదా

నీ అందచందాలిక నావే కదా.. ||సు||

సా || దూరం.. దూరం..

చ|| దూరమెందుకె చెలియ వరియించి వచ్చిన

ఆర్యపుతృడనిక నేనే కదా(R)

మన పెళ్లి వేడుకలింక రేపే కదా ||ఓహో సుందరి||

సా|| రేపటిదాకా ఆగాలి..

చ|| ఆగమంటు సఖియా అరమరలెందుకె

సొగసులన్నీ నాకు నచ్చేగద.. నీ

వగలన విరహము హెచ్చేగద..||సు||

సా|| హెచ్చితే ఎలా? పెద్దలున్నారు..

చ|| పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి

వద్దకు చేరిన పతినేగదా. నీ

ముద్దుముచ్చటలింక నావే గదా.. ||సు||

"అమ్మాయ్ సావిత్రీ.. సావిత్రి గొంతుని భలే దింపేశావమ్మా.. ర.మొ నువ్వు పాటతో కుమ్మేశావయ్యా.." చప్పట్లు చరిచారు అందరూ.

1951లో పాతాళ భైరవి తీస్తే, 1957లో మాయాబజారు తీశారు విజయావారు. ఒకటి జానపదం ఇంకోటి పౌరాణికం. సన్నివేశాన్ని అంటే , విజయవంతమైన సన్నివేశాన్ని మరొసారి వాడి, విజయం సాధించవచ్చని అర్ధం కావటం లేదూ" అన్నారు ఆంబా గిరీశం.

"సందేశమెందుకు?సాధించి చూపించారుగా.." నవ్వారు పూర్ణానంద.

"అయితే హాస్యానికి ప్రత్యేకించి 'సబ్జక్టు'తో పని లేదంటారా?' అన్నారు గుంటూర్ గాలిబ్‍గారు.

"ఎందుకు లేదు. అన్నీ అమిరితేగానీ హాస్య గీతం పండదు. చక్కని సన్నివేశం, నటీనటుల అభినయం, వాడిన భాష , ఆహార్యం, అన్నీ అమరాలి. అలా అమిరిననాడు హాస్యగీతమే కాదు ఏ గీతమైనా  పది కాలాల పాటు నిలబడి వుంటుంది."అన్నారు పూర్ణానంద.

"అటువంటిదేమైనా చెప్పగలరా?" అడిగాడు ర.మొ

"ఉంది. పెళ్ళి చేసి చూడు చిత్రంలో 'పెళ్ళి చేసి చూపిస్తాం' పాట" అన్నారు పూర్ణానంద.

పాట:

చిత్రం: పెళ్ళి చేసి చూడు సంగీతం: ఘంటసాల గానం: పిఠాపురం, మాస్టర్ రామకృష్ణ

 

ప|| పెళ్లి చేసి చూపిస్తాం.. మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం

బందర్ నెల్లూర్ హైదరబాద్, మద్రాస్ గిగ్రాస్ మధనం చేసీ

అవసరమైతే ఎంతైనా సరే అడిగిన కట్నం మొహాన వేసి ||పెళ్ళి||

చ|| కోటు పంట్లాం వాచీ గొల్సూ

వాటమైన క్రాఫింగ్ కరల్సూ

పెళపెళలాడే పెళ్ళికొడుకునీ

జబర్దస్తీగా పట్టుకవచ్చి ||పెళ్ళి||

చ|| బజ్జీ బోండా బర్ఫీ గారె

బూరె ఇడ్లీ పెసరట్ ఆపం

గంగాళాలతో కాఫీ పోసీ

ధూం ధుమాగా మర్యాదలు చేసీ ||పెళ్ళీ||

రంగురంగుల పూల పల్లకీ

తాషా మరపా తుతురు తుతుత్రూతు

బాజాబేండ్ భజంత్రీల్తో

ఆవల్ రైటుగ ఢంకా కొట్టీ  ||పెళ్ళీ||

 

"పెళ్లంటే మామూలు వ్యవహారం కాదు. అందుకే పెద్దలు అన్నారు. పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. ఎంత జాగ్రత్తగా బడ్జెట్ వేసినా అనుకున్నట్టుగా జరగదు. అది అనుభవంతో మాత్రమే తెలిసే కష్టం. అదీగాక అది వరకు ఆడపిల్ల పెళ్ళంటే కాళ్లకి బలపాలు కట్టుకు తిరిగితే కానీ కాదనేవారు"

"అవును.. నా పెళ్ళి విషయంలో అదే జరిగింది లెండి.." నిట్టూర్చి అన్నది సావిత్రి.

"అందుకే ఎన్ని వూళ్లు తిరగాలో చెప్పారు. పెళ్ళి కొడుక్కీ ఏవేం పెట్టాలో అంటే ఆనాటి పెళ్లికొడుకుల డిమాండ్లు ఏమిటీ చెప్పారూ. కోటూ పంట్లాం వాచీ గొలుసూ అన్నమాట. తరవాత టిఫిన్లూ పిండివంటలకు ఏ పదార్థాలు వండించాలో (ఇవీ పెళ్ళికొడుకు తరఫువాళ్లే నిర్దేశిస్తారన్నమాట) ఏఏ ఇతర ఆడంబరాలు అంటే బేండ్ బజంత్రీలు భాషా మర్యాదలూ ఇవన్నీ కూడా అవసరమని చెప్పారు "ఆగారు పూర్ణానంద

"అంటే పెళ్ళికి కావలసిన వస్తుసామగ్రి యీ గీతపు 'సబ్జక్టు' అయిందన్నమాట"అన్నది అమూల్య

"అన్నమాట కాదు వున్నమాటే. యీకాలం పెళ్ళిళ్ళలో ఆనాటి ఆడంబరాలు ఆడంబరాలే కాదు. ఇప్పుడయితే స్టార్ హోటల్లో నిశ్చితార్ధాలూ, మన సాంప్రదాయంలో లేని బారాత్‌లూ, సంగీత్‌లూ, కాంటినెంటల్ వంటకాలూ, పెళ్లికి ముందే రిసెప్షన్లూ. ఓహ్.. ఖర్చుకి అంతే లేదు" నిట్టూర్చాడు దూర్వాసరావుగారు. ఆయన కూతురి పెళ్ళికి సగం ఆస్తిలోంచి కర్పూరంలా హరించుకుపోయింది.

"ఇంతకీ ఇది హాస్యగీతం కేటగరీలోకి ఎలా వస్తుందీ?" అడిగారు.

" ఓ చెల్లెలి పెళ్ళి కోసం అన్నగారూ, ఆయన సిసింద్రీలాంటి శిష్యుడూ పెళ్ళికొడుక్కోసం వెతికే సందర్భంలో వచ్చే పాత ఇది. మాస్టర్ కుందు - జోగారావుల నటన మనని సున్నితమైన హాస్యతీరానికి చేరుస్తుంది" నవ్వారు పూర్ణానందం.

"కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీగారన్నట్టు పాటకి కూడా అనర్హమైన పదం లేదు. రచయిత సామర్ధ్యాన్ని బట్టి వుంటుంది అంతా అని నిరూపించిన పాట కూడా ఇది!" అన్నారు ఆంబా గిరీశంగారు.

"ఒకటి మాత్రం నాకు అర్ధమైంది.." అన్నాడు ర.మొ

"ఏమిటి?" కుతూహలంగా అడిగింది అమూల్య.

"హాస్యగీతాన్ని వినాలి. హాస్య రచనని చదవాలి. అప్పుడే దానిలోని 'మజా' ఏమిటో తెలుస్తుంది అని"

"ఏ గీతాలూ?" ఉత్సాహంగా అడిగింది సావిత్రి.

" ఓ చిన్న బ్రేక్ తరవాత చెప్తా.." లేచాడు పూర్ణానందం

 

మళ్లీ మరోసారి

మీ భువనచంద్ర

bottom of page