MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం
నా కథ - 7
భువనచంద్ర
జరిగిన కథ:
మొదటి ఐదు ఎపిసోడ్ లలో జరిగిన కథ క్లుప్తంగా-
బాలా త్రిపుర సుందరి తల్లి తండ్రి ఆమె 17వ యేట విడిపోయారు. తల్లి దిలావర్ అనే ముస్లింని ప్రేమించి ఆస్ట్రేలియా వెళ్లిపోతే, తండ్రి సరోజినీ ఆంటీ అనే ఓ డాన్సర్ తో బొంబాయి లో సెటిల్ అవుతాడు. బాలని శ్రీనివాస్, పశుపతి, జీవన్ అనే ముగ్గురు ప్రేమిస్తున్నా నిర్లిప్తంగా ఉంటుందే తప్ప ఏ సమాధానమూ ఇవ్వదు. బాలకి డబ్బు, ఇల్లు, కార్లు, తోటలు అన్నీ ఉన్నాయి, తోడు మాత్రం ఎవరూ లేరు. స్వేచ్ఛ నిండుగా ఉన్న ఒంటరితనం బాలది. మాల్ దగ్గర కలిసిన క్లాస్మేట్ కామేశ్వరి బాలాని ముంబై రమ్మని పిలుస్తుంది. ముంబయి చేరుకున్నాక శాండిల్య బాలాని, కామెశ్వరిని పికప్ చేసుకోవటానికి వస్తాడు. వాళ్ళు శివసాగర్ హోటెల్ లో కూర్చుని ఉన్న సమయంలో హర్షవర్ధన్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి తనని తాను పరిచయం చేసుకుని, రాంబాబు వాళ్ళని స్టార్ మెటీరీయల్ గా గుర్తించిన విషయం చెబుతాడు. హర్ష, రాంబాబుల మాటలు విన్నాక, తమలో తాము మాట్లాడుకుని, హర్ష చెప్పే కథ విన్నాక నటించేదీ, లేనిదీ నిర్ణయించుకోవచ్చని తలుస్తారు. ముగ్గురూ ఆఫీస్ కి వెళ్లి కలుద్దాం అనుకుంటారు. అంతలో హర్షవర్ధన్, రాంబాబులే వీళ్ళ ఫ్లాట్ కి వచ్చారు. వాళ్ళకి కథ నచ్చుతుందా? కింది ఆరవ ఎపిసోడ్ చదవండి.
ఆరవఎపిసోడ్లో జరిగిన కథ క్లుప్తంగా:
హర్ష చెప్పిన కథ ముగ్గురికీ నచ్చి, సినిమా చేసేందుకు ఒప్పుకుంటారు. వీళ్ళు మాట్లాడుకుంటూండగా దూరం నుంచి బాలాని చూసిన స్టార్ బాలీవుడ్ డైరెక్టర్ శీబూ చక్రవర్తి, బాలాకి సినిమాలలో నటించే ఆసక్తి ఉందేమో కనుక్కోమని ప్రొడక్షన్ మేనేజర్ వినోద్ నిగం ని పంపిస్తాడు. ఆశ్చర్యపోయిన హర్ష అతనెంత గొప్ప డైరెక్టరో, తన సినిమా కన్నా, ఈ ఆఫర్ ఒప్పుకోవటమే బాలా కెరీర్ కి మంచిదని నిజాయితీగా చెబుతాడు. బాలా ఆలోచనలో పడుతుంది.
తరువాతి ఏడవ ఎపిసోడ్ ఇప్పుడు చదవండి.
“కానీ..” విస్మయంతో అన్నాడు శాండీ.
“నా ఉద్దేశం మీరు శీబూ గారి సినిమా ఒప్పుకోమనే, ఎందుకంటే వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోకూడదు. బాలా జీ, మీ పర్సనల్ విషయాలు నాకు తెలీవు. మీ పేరెంట్స్ కూడా ఓకే అనాలిగా, అది నా సినిమా అయినా, శీబూ గారి సినిమా అయినా, వారిని కూడా సంప్రదించండి” నా వంకే సూటిగా చూస్తూ అన్నాడు హర్ష.
“నా పేరెంట్స్ కి నేను ఏం చేసినా ఓకే. నాకు ఏనాడో సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చారు. నాకు అర్థం కాని విషయం ఏమంటే శీబూ గారి సినిమా ఒప్పుకోమని మీరెందుకు అంటున్నారూ?” నేను కుండబద్దలు కొట్టినట్టుగానే అన్నాను.
ఒక విషయం చెప్పాలి, మా అమ్మ ఆస్ట్రేలియాలోనూ, నాన్న ఇదే ముంబైలో ఓ డాన్సర్‌తోను ఉన్నట్టూ, వాళ్ళిద్దరూ నా మానాన నన్ను వదిలేసి విడాకులు తీసుకొని పోయినట్టూ, నేను ఎవరికీ చెప్పలేదు. వాళ్ళు వేరే చోట ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నట్టు మాత్రమే చెప్పాను. శాండీకి ఆ విషయం తెలీదు, కామీకీ పూర్తి వివరాలు తెలీదు. నేను ఒంటరిగా ఉంటున్నానన్న విషయం తప్ప.
“ఎందుకంటే, అది నాకూ బోలెడంత మేలు చేస్తుంది గనుక. నిన్న అయితే ఎక్కడి వాళ్ళ ఆఫర్‌ని ఒప్పుకుంటారో అని గుండె దడదడలాడింది. పళ్ళ బిగువున మాటల్ని బయటికి రాకుండా బిగబెట్టాను, రాత్రంతా ఆలోచించినప్పుడు మైండ్ పూర్తిగా క్లియర్ అయ్యింది. శీబూ సినిమా హీరోయిన్‌గా మీకు బ్రహ్మాండమైన పబ్లిసిటీ వస్తుంది, అది నా సినిమాకి 200% ప్లస్ అవుతుంది. అదే నేను ప్రెస్స్‌మీట్ పెట్టి మిమ్మల్ని హీరోయిన్‌గా పరిచయం చేస్తే 5% జనాభా కూడా ఆ వార్తని పట్టించుకోరు. శీబూ గారి హీరోయిన్ నా సినిమాలో ఆక్ట్ చేయడానికి ఒప్పుకుందంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్సర్సూ, బ్లాంక్ చెక్కులతో నా సినిమాకి ఫైనాన్స్ చేస్తారు. అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో, క్వాలిటీతో నేను నిరాఘాటంగా పిక్చర్ తియొచ్చు. ఓ విధంగా చెబితే, శీబూ సినిమాలో మీరు బుక్ అయ్యాక నేను సినిమా తీయడం అంటే, గతుకుల బండి దారిలో నుంచి నేషనల్ హైవే కి రావడం లాంటిది” కళ్ళు మెరుస్తుండగా వివరించి, “బాలాజీ, ఆఫర్ తెచ్చిన అదృష్టం మీకు కాదు నాకు. డైరెక్టర్ గా నన్ను ఎక్కడో నిలబెడుతుంది. అఫ్‌కోర్స్ మీరు ఒప్పుకుంటే” అన్నాడు హర్ష.
“హ..హ..హ” నవ్వింది కామీ “ఈ యాంగిల్ అసలు నాకు తట్టనే లేదు సుమా” అని.
“మీరన్నదీ సబబుగానే ఉంది. నిజంగా మీరు ఎంచుకున్న సబ్జెక్టుకి అన్‌లిమిటెడ్ బడ్జెట్టే కావాలి గనక శీబూ గారి ఆఫర్ ఒప్పుకుంటే మీకూ ఆమెకీ కూడా ఎంతో మేలు కలుగుతుంది” మనఃస్ఫూర్తిగా అన్నాడు శాండీ.
నేను మాత్రం ఏమీ మాట్లాడలేదు. హర్ష చెప్పింది నిజం, అయినా, నేను అసలు నేను శీబూ గారిని కలిసి వారు చెప్పింది విని, నాకు నచ్చాక కదా నిర్ణయించుకునేది. నా నంబరూ నేను ఇవ్వలేదు. నేనే కావాలి అనుకుంటే వాళ్ళనే నా నంబర్ కనుక్కొనీ అనుకున్నాను.
“మీ ఆలోచన ఏమిటి బాలాగారూ?” మొదటిసారి చర్చలో నోరు విప్పాడు రాంబాబు.
“ముందర మసాలా దోశకి మర్యాద ఇద్దాం” చిన్నగా నవ్వి అన్నాను. మనసు ఆలోచనలో పడినప్పుడు మాట్లాడటం నాకు నచ్చదు, అలా మాట్లాడటం కూడా నా దృష్టిలో తప్పే, బహుశా అర్థం చేసుకున్నారేమో అందరూ దోశల మీదికి దృష్టి సారించారు.
ఆయిల్ కాకుండా వెన్నలో దోశ వేయడం వల్ల ఓ చిత్రమైన సొఫ్ట్‌నెస్ వచ్చింది, టమాటో చట్నీ, పుదీనా చట్నీ, బంగాళాదుంప మసాలాలు రుచిగా ఉన్నాయి. ఎంతైనా జనక్‌రాజ్ దోశ స్పెషాలిటీ దానిదే, అదే మాట కామీ అన్నది. “మిస్టర్, హర్ష మీరు జూహూ బీ జుహూ్‌బీచ్‌లో జనక్‌రాజ్ దోశ తిన్నారా? ఒకసారి మొదలెడితే రెండో, మూడో లాగించేస్తారు. అబ్బా! ఆ సాంబారు రుచికి ఎదురు లేదు. ఓహ్!” అంటూ, “బెస్ట్ ఫుడ్ జాయింట్ చూపించినందుకు థాంక్స్ శాండీ. అన్నట్టు రాంబాబు గారు, టూలిప్స్ కూడా చాలా శాంతంగా, చాలా కాజీగా ఉంది. ఇడ్లీ ఎబౌవ్ యావరేజ్, అయినా దోశ సూపర్‌హిట్” అన్నది రాంబాబుని చూసి.
“జనక్‌రాజ్ దోశ అన్నావుగా ఇంతకుముందు” అన్నాను.
“అది సూపర్‌హిట్, కాదు డైమండ్ జూబ్లీ” అంది పకపకా నవ్వి.
గాలి కాస్త తేలిక పడింది.
కాఫీలు తాగి లేచాము. “మళ్ళీ ఎక్కడికి?” అడిగాడు శాండీ.
“హర్ష గారి ఆఫీసుకి” అన్నాను నేను.
“ఓహ్! ఐ యాం ఆనర్డ్” నిండుగా నవ్వాడు హర్ష.
ఈసారి రాంబాబు ఒక్కడే వాళ్ళ కారులో. హర్ష కూడా మా కారులో వచ్చాడు.
“హర్ష గారూ ఒక హీరోయిన్ కొత్తగా ఫీల్డ్‌లోకి వస్తే పడాల్సిన కష్టాలో, నష్టాలో ఏమిటి. మీరు డీసెంట్ పర్సన్ అయ్యి ఉండవచ్చు, నేను అడిగేది జనరల్‌గా, ఉన్నది ఉన్నట్టు చెప్పండి” అన్నాను.
“కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా ఇక్కడ” ఇబ్బందిగా అన్నాడు హర్ష.
“పరవాలేదు ఓపెన్‌గానే చెప్పండి. మీ ఒక్క సినిమాలో నేను నటిస్తే సంగతి వేరు, ఇతరుల సినిమా మొదట చేయాలంటే నాకు ఓ అవగాహన ఉండాలిగా” ఓపెన్‌గానే అన్నాను. శాండీ, కామీ మొహాల మీద ఆశ్చర్యం! డైరెక్ట్‌గా అడుగుతానని వాళ్ళు ఊహించలేదనుకుంటా.
“బాలా జీ, ఇది గ్లామర్ ఫీల్డ్. నవలల్లో, కథల్లో అంగాంగ వర్ణనలు ఉంటాయి.. ప్రబంధాల్లో కూడా. ఇక్కడ వర్ణించడానికి పేపర్లు, పెన్నులు ఉండవు, కెమెరాలు ఉంటాయి, కాస్ట్యూమ్స్ ఉంటాయి, లొకేషన్స్ ఉంటాయి. సన్నివేశాన్ని ఎలివేట్ చేసే పాటలు ఉంటాయి. హీరోయిన్లకే కాదు హీరోలకి ఫిజిక్ ముఖ్యం. అలా ఎక్స్పోజ్ చేయాలంటే కొందరు హీరోయిన్లతో చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. కొందరు కొత్త అమ్మాయిలయితే మళ్లీమళ్లీ ఛాన్సుల కోసం హీరోకో, దర్శకుడికో వాళ్లే దగ్గరవుతారు. నిజం చెబితే ఇలాగే జరగాలని రూలు ఎక్కడా లేదు. జస్ట్ ఏ మాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎవరు ఎవరిని ఏది అడగరు, హింసించనూ హింసించరు” హర్ష గొంతులో ఇబ్బంది కనపడుతూనే ఉంది.
“అంటే ఫిజికల్ కనెక్షన్సా?” సూటిగా అన్నాను.
“ఆ విషయమే నేను చెప్పేది. ఇలాగే అవుతుందనీ చెప్పలేను, అవ్వదనీ చెప్పలేను. డబ్బూ, పేరూ, గ్లామర్, చప్పట్లూ పబ్లిక్‌లో ఇన్స్టెంట్ గుర్తింపూ పుష్కలంగా దొరికేవి ఈ ఫీల్డ్‌లోనే. ఇది ఎంతగా అందాన్ని ఆకర్షిస్తుందంటే పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా నటీమణులు మళ్లీమళ్లీ సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ పరిశ్రమకు ఉన్న ఆకర్షణ అలాంటిది” ముగించాడు హర్ష.
“అంతకుమించి ఇంకేం జరగాలీ? పర్సనల్ క్యారెక్టర్ వదులుకుంటేనే గానీ సినిమాలో క్యారెక్టర్ (పాత్ర) దొరకదంటారు” నోరు విప్పింది కామీ.
“సారీ, అలాగని నేను అనలేదు. నేను చెప్పింది వేరు, ఇక్కడ ఏదైనా జరగొచ్చు కానీ ఎవరూ ఎవర్నీ బలవంతం చెయ్యరు” హర్ష మొహంలో ఎంత ఇబ్బంది అంటే ఈ చర్చ ఆపెయ్యాలని మొహంలో కనపడుతూనే ఉంది.
“ఎవరూ ఎవర్నీ అడగరు కానీ తమంతట తామే లొంగిపోయే పరిస్థితులు కల్పిస్తారు. అవునా?” కామీ మొహంలో ఓ చిత్రమైన భావన కదిలింది.
“కామీజీ… ఎవరికో ప్రేయసిగా, మరెవరికో కూతురుగా, ఇంకొకరెవరికో భార్యగా, ఇలా సినిమాకు ఓ పాత్ర వేయాల్సి వస్తుంది. హీరో హీరోయిన్లుగా చేసేటప్పుడు క్లోజ్‌గా చూపాల్సిన సన్నివేశాలు ఉంటాయి. ఒళ్ళూ ఒళ్ళూ తగులుతాయి, ఇక బెడ్‌రూమ్ సీన్స్ విషయాలు వేరు. కానీ, గుర్తుంచుకోండి చుట్టూ ఎంతమంది ఉంటారు తెలుసా. అంతమంది ముందు నటించేటప్పుడు ఏమి చెడు జరుగుతుందీ? పోనుపోను ఇష్టాయిష్టాలు మొదలవుతాయి, మనుషుల మధ్య బంధాలు పెరుగుతాయి. కొన్ని మానసిక బంధాలైతే, కొన్ని శారీరక బంధాలు. వాటిని నిర్వచించమంటే ఎవరు నిర్వచించగలరు, మనం కలిసి కేవలం మూడు రోజులైంది మీతో నాకూ, నాతో మీకూ ఓ మానవీయ స్నేహబంధం బలపడిందా లేదా?” హర్ష గొంతులో ఇబ్బంది తగ్గింది.
“కొందరు నిర్మాతలో, దర్శకులో, నటులో, అమ్మాయిలని ముందు దానికే…” ఆగింది కామీ.
“అది ఎక్కడ లేదూ, ఇది గ్లామర్ ఫీల్డ్ కనుక ప్రతి చిన్న విషయమూ పబ్లిక్‌లోకి వస్తుంది. మీకో నిజం చెప్పనా ఇక్కడ డబ్బు ఇచ్చి మరీ గాసిప్‌లు రాయిస్తారు. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా నా పేరు సర్కులేషన్‌లో ఉండాలి” అన్నాడు హర్ష.
ఆఫీస్ ముందు కారు ఆగింది. రాంబాబు కారు ముందరే వచ్చింది.
నాకంటూ ఆఫీసులో ఏ పని లేదు, నేను అడగాల్సిన ప్రశ్నలు అడిగేసాను, ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ చెప్పాడు హర్ష. అర్థం ఎంతవరకూ కావాలో అంతవరకు కూడా అర్థమైంది. బాలు ఇప్పుడు నా కోర్టులో ఉంది నిర్ణయించుకోవాల్సింది, నేను మాత్రమే.
ఆఫీసులో ఏమేమో కబుర్లు సాగినయి, కానీ చేసిన డిస్కషన్ తాలూకు ఇంపాక్ట్ బాగా కనిపించింది కందిరీగల తుట్టె కదిపిన భావన.
‘కాస్టింగ్ కౌచ్’ గురించిన ప్రచారం ఈ మధ్యన బాగానే వూపందుకుంది, ఇప్పటివరకు కూడా బహిర్గతమవని ఎన్నో సినిమా విషయాలు ఇప్పుడు పబ్లిక్‌లోకి వచ్చినై. ఏది నైతికం, ఏది అనైతికం అనే చర్చలు కూడా చానెల్స్‌లో చాలా జరుగుతున్నాయి.
అఫ్‌కోర్స్ నా వరకూ వచ్చిన రెండు ఆఫర్సూ మర్యాదపూర్వకమైనవే, రిక్వెస్ట్ చేసింది వాళ్లు గనక నా టర్మ్స్ ని నేనే డిక్టేట్ చేయవచ్చు. ఈ ఆలోచన రాగానే నాకు కొంత రిలీఫ్‌గా అనిపించింది. నా హద్దులు నేనే నిర్ణయించుకోగల అవకాశం నాకు ఉంది అనుకోవడమే పెద్ద రిలీఫ్.
“రాంబాబు గారూ మీరు ఎప్పుడు కాస్త సైలెంట్ గానే ఉంటారా?” వాతావరణణాన్నితేలికపరచడం కోసం అన్నాను.
“అలా కాదు మేడం, నా బుర్రలో ఏదైనా పడిందంటే అది ఓ కొలిక్కి వచ్చినదాకా ఆలోచనలు ఆగవు” నవ్వి అన్నాడు.
“ఇప్పుడేం ఉందీ… మీ బుర్రలో?” నేనూ నవ్వి అడిగాను.
“నిజంగా చెబితే, మీ విషయమే”
“నా విషయమా?” ఆశ్చర్యంగా అన్నాను.
“మీ విషయమే, మిమ్మల్ని చూడగానే ఈ ఫీల్డ్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతారనిపించింది. హర్ష కథ చెప్పేటప్పుడు మీ ముఖంలో రియాక్షన్స్ చూసి అద్భుతం అనుకున్నాను. శీబూ గారి నుంచి ఆఫర్ వచ్చిందని తెలిసి షాకయ్యాను. మా దగ్గర ఉండేటప్పుడు మేమే మీకు రక్షణ కవచం, వేరే కంపెనీ వారు మా మాటలకు విలువ ఇవ్వరు. అది అటువంటి టాప్ డైరెక్టర్సూ, యాక్టర్లూ. మీకో విషయం తెలుసా? వినోద్ నిగం ప్రొడక్షన్ ఇన్చార్జ్ మాత్రమే కాదు, చాలామంది హీరో హీరోయిన్లకి డేట్స్ చూసే సెక్రటరీ కూడా. అతని ఇన్కమ్ మీలాంటి వాళ్ళ ఊహకే అందదు. కొన్ని చోట్ల రెమ్యూనరేషన్ లో 10%, కొన్నిచోట్ల 40% కూడా చార్జి చేస్తాడు. చాలా ఇంటలిజెంట్” ఆగాడు రాంబాబు. ఇవన్నీ నాకూ, కామీకీ కొత్త విషయాలే.
“బాలా జీ, ఇప్పుడు నా మనసులో సందిగ్ధం. నావల్ల కదా ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యిందీ అని. సినిమా మోజు మీద పారిపోయి అటు చెన్నైయో, హైదరాబాదో, కలకత్తానో వచ్చేవారు కోకొల్లలు. మీ విషయం అలా కాదు, మీకు ఏమాత్రం అన్యాయం జరిగినా నా జీవితాంతం నన్ను క్షమించుకోలేను” తలవంచుకొని అన్నాడు రాంబాబు. నేను అతని మొహాన్నే చూస్తున్నాను.
“ఏంటి రాంబాబూ నీదేం తప్పుందీ? ఆయనా ప్రొడక్షన్ ఫీల్డ్‌లో ఉంటూ ఇంత బేలతనమా!” రాంబాబు భుజం తట్టి అన్నాడు హర్ష.
“నిజం హర్షా, ఇతరుల సంగతి ఏమో. నా వరకు నాకు డబ్బులు అనేది సెకండరీ, నా వల్ల వీళ్ళకి ఏ చిన్న కష్టం కలిగినా ఖచ్చితంగా అది నా తప్పే అవుతుంది. కారణం వీరిని స్పాట్ చేసింది నేనేగా” అతని గొంతులో ఓ తెలియరాని గుబులు.
“రాంబాబూ, మీరు నాకు సెక్రటరీగా ఉండగలరా? పర్సంటేజ్ మీ ఇష్టం” సూటిగా అడిగాను. చివ్వున తలెత్తి నా వంక చూశాడు.
“బాలా జీ, మేనేజర్‌గిరీ అంత సులభం కాదు, నేను మీకు సెక్రటరీ అయితే నీకు సినిమాల్లో మరిన్ని మరిన్ని చాన్సులు దొరికేలా చూసే బాధ్యత నాదవుతుంది, సినిమా సినిమాకి మీ రెమ్యూనరేషన్ పెంచే బాధ్యతా నాదవుతుంది, అందుకోసం పరమ ఘోరమైన సలహాలు ఇచ్చే బాధ్యతా నాది అవుతుంది. అందుకే నేను ఎవరికీ సెక్రటరీగా ఉండటానికి ఒప్పుకోలేదు కేవలం ప్రొడక్షన్ కంట్రోలర్‌గా మాత్రమే పనిచేస్తున్నా” నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు రాంబాబు. అతని కళ్ళలో సిన్సియారిటీ.
మళ్లీ మౌనం రాజ్యమేలింది, రాంబాబు సిన్సియారిటీ నాకు నచ్చింది, అలాగే హర్ష ఓపెన్‌నెస్.
“ఓకే ఫ్రెండ్స్, శీబూ గారి సినిమా ఆఫర్‌ని ప్రస్తుతం పక్కన పెడదాం, ఎందుకంటే నా అంతట నేను వారికి ఫోన్ చేయాలని అనుకోవడం లేదు. సరే, మన స్టోరీని మళ్లీ డిస్కస్ చేసుకుందామా” అన్నాను హర్ష వంక చూసి.
“పూర్తి ఇన్‌వాల్వ్‌మెంట్‌తో బహుశా ఇప్పుడు చెప్పలేనేమో, రేపటి వరకు పోస్ట్‌పోన్ చేద్దామా?” అన్నాడు హర్ష.
“అదే మంచిది, ఈ ఘడియల్లో ఏది మొదలెట్టినా సక్సెస్ కాదు” అన్నాడు రాంబాబు.
***
అనీస్ రెస్టారెంట్లో కోకాకోలాతో హాట్ సాండ్విచెస్ తిన్నాం. బొంబేవాళ్ళకి అమెరికన్స్‌లా కోకాకోలా అలవాటు, అంటే అందరికీ అని కాదు, యంగ్‌స్టర్స్‌కి, సినీ జనాలకీ. అదీ బాగానే ఉంది. ఎందుకో ట్రెడిషనల్ లంచ్ చేయాలని అనిపించలేదు. ఇది అంధేరీలో ఉన్న రెస్టారెంట్ కామ్ గా ఉంది. పోష్ రెస్టారెంట్ కాదు. యువ ప్రేమికుల జంటలు చాలానే ఉన్నాయి, కొందరు ప్రేమికులు కాదని తెలిసిపోతూనే ఉంది.
ఏ దేశమైనా, ఎక్కడైనా, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణో, కోరికో, ప్రేమో, ఏదో ఒకటి ఉండక తప్పదు. పాతరోజుల సంగతి వేరు, ఇప్పుడు నూటికి 80వంతులు ప్రేమ స్టేజిలోనే ముగిసిపోతాయి.
రెండింటికల్లా మేము మా అపార్ట్మెంట్‌కి వచ్చాము. ఎందుకో చాలా అలసిపోయాను అనిపించింది. లోపలికి వెళ్ళగానే నేను సోఫాలో వాలి కళ్ళు మూసుకున్నాను.
***
“మై గాడ్, రాత్రి 7:30 అయిందా?” ఆశ్చర్యపోతూ అన్నాను. దాదాపు 5 గంటలసేపు ఒళ్ళు తెలియని నిద్ర.
“ఎస్ బాలాజీ, మానసికంగా మీరు చాలా అలసిపోయారు, అందుకే నిద్ర లేపలేదు. కామీ ఆరింటి దాకా పడుకుంది. నా సంగతి అయితే, మిమ్మల్ని ఇక్కడ వదిలి ఇన్స్టిట్యూట్‌కి వెళ్లి ఓ అరగంట క్రితమే వచ్చా” చిరునవ్వుతో అన్నాడు శాండీ. కామీ రూములో మళ్ళీ పడుకుందేమో అనుకున్నా.
“లేదు, తను రాధాకృష్ణ టిఫిన్ సెంటర్ దాకా వెళ్ళొస్తానంది. కింద ఫ్లోర్ లో ఉండే అప్సరతో వెళ్ళింది, అప్సర డిగ్రీ ఫైనల్ చదువుతోంది, నన్ను భయ్యా అంటుంది” వివరించాడు శాండీ.
“కాఫీ?” అన్నాడు.
“ఊహూ… ఏదైనా మంచి సినిమా వేయండి” అన్నాను.
“అయితే 'గైడ్' సినిమా వేస్తాను. దేవానంద్, వహీదారేహమాన్ సూపర్ డూపర్ హిట్. డైరెక్షన్ విజయ్ ఆనంద్, రచయిత ది గ్రేట్ ఆర్ కె నారాయణ్” అంటూ పిక్చర్ ఆన్ చేశాడు.
ఎస్ డి బర్మన్ మ్యూజిక్ టైటిల్స్ నుంచే ఆకట్టుకుంది.
“యహా కౌన్ హై తేరా, ముసాఫిర్ జాయేగా కహా!”
(ఓ బాటసారీ, నీకు ఇక్కడ ఎవరున్నారూ” ఎక్కడికెళ్తావు?)
“పియా తోసే నైనా లాగే రే”
(ప్రియా నీ వైపే నా కళ్ళు లాగుతున్నాయి)
“కాంటోన్ సే కీంచ్ కే యే ఆంచల్”
(ముళ్ళ మీద పడ్డ ఫైటని పైకి లాక్కొని)
“దిన్ డల్ జాయే హాయే రాత్ న జాయే”
(పగలు గడిచిపోయింది రాత్రి గడవదేం)
ఓ గాడ్! అజరామరమైన పాటలు, వహీదా నృత్యాలు హైలైట్, ప్రతి పాత్ర అద్భుతం, దేవానంద్ నటన అద్భుతం, అపూర్వం!
“గాతా రహే మేరా దిల్” పాట అవుట్ ఆఫ్ ది వరల్డ్. కిషోర్ సహ అందరి నటన అద్భుతమే, ముఖ్యంగా క్లైమాక్స్ నా కళ్ళలోంచి ధారగా కన్నీరు కారుతూనే ఉంది.
“ఏయ్ పిచ్చి ఎందుకా కన్నీళ్ళు?” నన్ను పొదవుకొని అన్నది కామీ. పొగిలిపొగిలి ఏడ్చాను, మరోసారి ఏడవడానికి ఛాన్సే రాదేమో అన్నంతగా ఏడ్చాను. గుండె లోపల గూడు కట్టుకున్న బాధ అంతా కన్నీటి రూపంలో కరిగిపోయేటంతగా వెక్కి వెక్కి ఏడ్చాను.
చాలా చాలా సేపటి తర్వాత నా ఏడుపు తగ్గింది, ఘోరమైన వాన కురిసి కురిసి వెలిసినట్టుగా. వాళ్ళిద్దరూ సైలెంట్‌గా పక్కకి వెళ్లారు. బహుశా నేను సిగ్గుపడతానని, తలదించుకునే ఉంటానని వాళ్లు అర్థం చేసుకొని ఉండొచ్చు.
మౌనంగా నాకోసం పెట్టిన శాండ్విచ్ తిని, నీళ్లు తాగాను. మనసు చాలా తేలిగ్గా అనిపించింది.
“ఎద మీదా ఎద పెట్టీ సొదలన్నీ వినుకో
వినుకొని బ్రతుకునే ఇంపుగా దిద్దుకో”
ఆత్రేయ గారి పాట గుర్తొచ్చింది
మళ్లీ కలుద్దాం
-భువనచంద్ర
*****