top of page

మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం

నా కథ - 3

భువనచంద్ర

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

జరిగిన కథ:

మొదటి ఎపిసోడ్ లో జరిగిన కథ- క్లుప్తంగా: 

బాలా త్రిపుర సుందరి తల్లి తండ్రి ఆమె 17వ యేట విడిపోయారు. తల్లి దిలావర్ అనే ముస్లింని ప్రేమించి ఆస్ట్రేలియా వెళ్లిపోతే, తండ్రి సరోజినీ ఆంటీ అనే ఓ డాన్సర్ తో బొంబాయి లో సెటిల్ అవుతాడు. బాలని శ్రీనివాస్, పశుపతి, జీవన్ అనే ముగ్గురు ప్రేమిస్తున్నా నిర్లిప్తంగా ఉంటుందే తప్ప ఏ సమాధానమూ ఇవ్వదు. బాలకి డబ్బు, ఇల్లు, కార్లు, తోటలు అన్నీ ఉన్నాయి, తోడు మాత్రం ఎవరూ లేరు. స్వేచ్ఛ నిండుగా ఉన్న ఒంటరితనం బాలది.

 

రెండో ఎపిసోడ్ లో జరిగిన కథ- క్లుప్తంగా: 

మాల్ దగ్గర కలిసిన క్లాస్మేట్ కామేశ్వరి బాలాని ముంబై రమ్మని పిలుస్తుంది. అప్పుడే కామేశ్వరీ, బాల శ్రీనివాస్ గురించి, పశుపతి గురించి చర్చిస్తారు. కామేశ్వరి శాండిల్య గురించి చెబుతుంది. తర్వాత కథ చదవండి :

మూడవ ఎపిసోడ్  చదవండి!

నేనూ, కామేశ్వరి ట్రైన్ లోనే ముంబై చేరాము. కార్ ఇంకా వెళ్ళలేదు. నేను ఫ్లైట్ లో వెళ్ళిపోదాం అని అన్నాను, “బాలా, జర్నీ అంటే వినోదం మాత్రమే కాదు విజ్ఞానం కూడా ఇచ్చేలా ఉండాలి. ఫ్లైట్ లో మహా గంటన్నరో, గంటంబావో పడుతుంది. ఫ్లైట్ ఎక్కేవాళ్ళు కూడా ఎంతో గంభీరంగా, మొహమాటంగా, కొందరు రిగి పిరికి, పిరికిగా ఉంటారే కానీ, ఎవరూ ఎవరితో కలివిడిగా ఉండరు. ట్రైన్ అంటావా బోలెడంత కాలక్షేపం. జనాల  మూడ్ తెలుస్తుంది. రాజకీయాలు, లేటెస్ట్ ప్రజా సమస్యలు, వాటికి సామాన్యులు ఇచ్చే పరిష్కారాలు, సినిమాలు హీరో హీరోయిన్ల లవ్ అఫెయిర్లు  ఫేస్బుక్ యూనివర్సిటీ పుకార్లు లక్ష విధాల ఎంటర్టైన్మెంట్ కదు, లేటెస్ట్  సమాచారం అంతా మన బుర్రలో దూరిపోతుంది”, పకపకా నవ్వి అన్నది.

అది అన్నది నూటికి నూరు పాళ్ళు నిజమే. మా జర్నీ లో ఇద్దరూ వర్ధమాన సినీ రచయితల్ని కూడా కలిసాము. ఓ లెక్చరర్, ఓ డాక్టర్, ఓ బిజినెస్ మాన్ కూడా మా చర్చల్లో భాగం పంచుకున్నారు. ఆత్మ నుంచి ఒమిక్రాన్ మా సంభాషణ వెల్లివిరిసింది. తన ప్రొఫెషన్ ఏమిటో చెప్పని ఓ పెద్దాయన మా సంభాషణలన్నీ జాగ్రత్తగా వినడం నేను గమనించాను. అరవై దాటిన ఆయనలో ఏదో చిత్రమైన వెలుగు ఉంది, బట్ ఎందుకో పరిచయం చేసుకోలేదు.

కంపార్ట్మెంట్ ఎదురుగానే నిలుచున్నాడు శాండిల్య. చాలా అందగాడు, చాలా మృదుస్వభావి అని చూడగానే నాకు అనిపించింది. “వెల్కమ్ కామూ, మోస్ట్ వెల్ కం త్రిపుర సుందరి గారూ, నా పేరు శాండిల్య”  రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ నాతో అన్నాడు. శాండిల్య కామీ వైపు చూసి అనునయంగా నవ్వడం నేను గమనించాను.

మా బ్యాగ్ లు తన రెండు చేతులతోనూ అందుకున్నాడు. ఆడవాళ్ళని అలా గౌరవించే వాడిని అప్పుడే నేను చూడటం. అఫ్ కోర్స్, అలాంటి సందర్భం ఎవరితోటి రాలేదన్నది వేరే సంగతి. అమ్మానాన్న విడిపోయాక బయటకి వచ్చింది ఇప్పుడేగా.

“థాంక్యూ” ట్రైన్ దిగి అన్నాను.   

“శాండీ, బాల అసలు వస్తుందని నేను ఊహించలేదు. నాకైతే పిచ్చ క్రేజీగా ఉంది. అన్నట్టు బాల చాలా మితభాషి, ఎవ్వరి వ్యవహారాల్లోనూ తలదూర్చదు” నా గురించి కూడా వివరించింది కామేశ్వరి.

“ఓహ్! మంచి అలవాటు. మీరు ముంబై వచ్చినందుకు చాలా సంతోషం. మీ యాత్ర అర్థవంతంగా జరగాలని కోరుకుంటున్నాను” చిరునవ్వుతో అన్నాడు శాండిల్య.

“బుద్దూ, తను ఉండేది మనతోనే. యాత్ర అర్థవంతంగా, ఆనందంగా ఏర్పాటు చేయాల్సింది మనమే”  శాండిల్య వీపు మీద కొట్టి అన్నది కామీ.

“అవశ్యం” కారు దగ్గర ఆపాడు శాండిల్య. కారు మెటల్ కలర్ లో మెరిసిపోతోంది. నీలం అంటే నాకు ఇష్టం. నీలం “శక్తి”కి నిదర్శనం. రాముడు నీలం, కృష్ణుడు నీలం, సముద్రం నీలం, ఆకాశం నీలం, ఆఖరికి గ్యాస్ స్టవ్ మంట కూడా నీలంగా ఉంటేనే ఆహారం ఉడుకుతుంది. ఎర్రగా ఉండే మంట వల్ల ఏది ఉడకదు. ఆ మాటే అన్నాను.

“హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బాలాజీ. శనికి కూడా చుట్టూ నీలి వలయాలు ఉన్నాయి కనకనే శనీశ్వరుడు అయ్యాడు. వేరే ఏ గ్రహానికి “ఈశ్వరతత్వం” దక్కలేదు” మెచ్చుకోలుగా నా వంక చూస్తూ అన్నాడు శాండిల్య.

“బాలా, శాండీ ఇల్లంతా నీలిమయం. నాకేమో నీలం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. నాకు ఎరుపు అన్నా, గులాబీ రంగన్నా ఇష్టం” వెనక సీట్లో నా పక్కన కూర్చుంటూ అన్నది కామీ.

“కామీ బాలా గారిని ముందు సీట్లోకి రమ్మను. వెళుతూ వెళుతూ కొన్ని ప్లేసెస్ ని పరిచయం చేయవచ్చు” మెత్తగా అన్నాడు శాండిల్య.  

“తను ఆల్రెడీ ముందు సీట్లో కూర్చో అని సైగ చేసింది కానీ నేనే వెనక్కివచ్చాను. ఇహ ప్లేసెస్ సంగతా, ఓ రోజు రోజంతా అవి చూడటానికి టైం ని ఖర్చు చేసేద్దాం” అన్నాను. ఇందాకే కామేశ్వరి ఫ్రంట్ సీట్లోకి వెళ్ళమని చెప్పింది నేనే వెనక్కివచ్చాను.

“OK, OK” స్టార్ట్ చేసాడు శాండీ.  అటూ ఇటూ చూస్తుంటే కార్ విండోస్ లో నుంచి, ఏదో ఒక చిత్రమైన భావన, ఈ నగరం నాకు ఎప్పుడో పరిచయం అని. నన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన నాన్న ఇక్కడే ఉన్నాడు  అన్న స్పృహ వల్ల కాదు ఆ ఆలోచన, నాకే తెలియని ఓ చిత్రమైన ఆకర్షణలో తట్టిలతలా మెరిసింది. ఏదో జన్మలో నాకూ ముంబై నగరానికీ సంబంధం ఉందని. ఆ మరుక్షణమే చచ్చేంత నవ్వు వచ్చింది, అప్రయత్నంగానే నవ్వాను.

“నవ్వు ఎందుకొచ్చిందీ?” ఆశ్చర్యంగా అన్నది కామేశ్వరి. నా మనసులో కదిలిన ఊహ యధాతథంగా చెప్పాను.

“అది ఊహ కాదు బాలాజీ, నిజమే అవ్వచ్చు. ఏదో ఓ జన్మలో సంబంధం లేకుండా మనం ఏ ప్రదేశానికీ వెళ్ళలేము. అంతేకాదు ఈ నీరు, ఈ గాలి మీకు రాసి పెట్టకపోతే అసలు ఇక్కడికి రానే రాలేరు” స్పష్టంగా అన్నాడు శాండిల్య.

“ఓహ్! మళ్లీ  జన్మల్లోకి దూరుతున్నావా నాయనా” తల బాదుకుంటున్నట్టుగా అన్నది కామేశ్వరి.

“అంటే మీరు జన్మల్ని పునర్జన్మల్ని నమ్ముతారా?” అన్నాను నేను.

“గత జన్మలూ పునర్జన్మలూ నాకు తెలీదు కానీ, ఈ జన్మ తెలుసు. మీ విషయమే తీసుకోండి. మీరెవరో నాకూ, నేనెవరో మీకు తెలియనే తెలియదుగా. కామేశ్వరి అడిగింది, మీరు వచ్చారు. మీరు నేను కలవడానికి కారణం కామేశ్వరి. మిమ్మల్ని రమ్మని ఎందుకు అడిగిందీ. ఒకవేళ రమ్మని బలవంతం చేసినా మీరు నో అనొచ్చు కదా. కానీ ఎందుకు OK అన్నారూ. ఈ ప్రశ్నలన్నీ మనకి మనం వేసుకుంటే బోలెడంత ఆశ్చర్యమే కాదు, ఎన్నో ఇతర ప్రశ్నలు కోకొల్లలుగా పుట్టి జవాబుల కోసం మన మనసుని మధిస్తాయి. ఒక ఉదాహరణ చెప్పనా. చదరంగం బోర్డు మీద పావులు వాటంతట అవి కదలవు. దాని వెనక చాలా మేధోమధనం ఉంటేగాని వాటిని కదిలించేవారు పావుల్ని కదపలేరు. వ్యక్తుల్ని చూడగలం, వారి మెదడులో వచ్చిన ఆలోచనలను చూడలేము కదా. మనందరం పావులమే, కదిలించేది మనకు కనిపించని ఒక మహాశక్తి” డ్రైవింగ్ చేస్తూ అన్నాడు శాండిల్య.

“బాలా, శాండీ కి ఈ సబ్జెక్టు అంటే పిచ్చి! తెల్లార్లూ మాట్లాడామన్నా మాట్లాడుతాడు. తన మమ్మీ డాడీ డాడీలకి కూడా జన్మలూ, నమ్మకాలు అదేదీ కార్యచరణ సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నాయి. అఫ్ కోర్స్ నాకు అవంటే పెద్దగా నాలెడ్జ్ లేదనుకో. ఒకసారి వాళ్ళు ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటే నాకు డౌట్ వస్తుంది. నేను ఇంట్లో ఉన్నానా, ఏదైనా ఆశ్రమంలో ఉన్నానా అని” డిస్కషన్ లో తానూ పాలు పంచుకుంది కామేశ్వరి.

“తల్లీ!, అంతొద్దు. ఈ సంగతులన్నీ ఓ విధంగా చూస్తే ప్రతి మనిషికి ముఖ్యమైనవే. ఈ లోకంలోని కోటానుకోట్ల జీవులు వస్తున్నాయి. కొంతకాలం అద్భుతమైన ఈ లోకంలో బ్రతికి శరీరాన్ని ఇక్కడే వదిలి పెట్టి కనిపించని లోకాలకు కనిపించని రూపంలో వెళ్లిపోతున్నాయి. జీవితమంటే కన్నతల్లి ఒడిలోంచి నేలతల్లి ఒడిలో దాకా సాగే పయనమేగా. ఈ పయనంలో నేర్చుకునేది ఏమిటీ? ఈ ప్రశ్న నన్ను చిన్నప్పటినుంచీ  వెంటాడుతూనే ఉంది” డ్రైవ్ చేస్తూనే అన్నాడు శాండీ.

“జవాబు దొరికిందా?” ఠక్కున అన్నాను.

“లేదు. కానీ, చాలా చిత్రమైన విషయాలు తెలిసాయి. సమయం వచ్చినప్పుడు చెబుతాను, లేకపోతే కామేశ్వరి మిమ్మల్ని కూడా బహిష్కరిస్తుంది” వెనక్కి తిరక్కుండానే అన్నాడు. డ్రైవ్ చేస్తూ వెనక్కి తిరిగే వాళ్ళన్నా, పక్కవాళ్ళని చూస్తూ మాట్లాడే వాళ్ళన్నా నాకు చచ్చే కోపం. ఆ రెండు పనులు చేయకపోవడం వల్ల నాకు ఇంకా నచ్చాడు.

చాలాసేపు మళ్ళీ మౌనం. “ముంబాయి చాలా బిజీ సిటీ. ముంబైకి మరో పేరు “నిద్రపోని నగరం”. మిగతా నగరాల్లో నైట్ యాక్టివిటీస్ తక్కువ, ముంబైలో పగలు రాత్రి ఒకటే. ముంబైట్స్ చాలా అద్భుతమైన వారు. ఏ సమస్య ఎదురొచ్చినా ఏకమై నిలుస్తారు. పక్కవాళ్ళకి సహాయం చేయడంలో ముందుంటారు. అయితే ఎవరి  స్వవిషయాల్లోనూ తలదూర్చరు”  నగరం గురించి వివరించాడు శాండిల్య.

“ఆ విషయం నేను చాలాసార్లు పేపర్లలో చదివాను. వర్షాలు ముంచెత్తినప్పుడు ముంబైవాలాలు ఇరుగుపొరుగులకే కాక అపరిచితులకు చేసిన సహాయాన్ని కూడా చదివి అబ్బురపడ్డాను. అంతటి సంఘీభావం మన వైపు ఎక్కడ చూడం." ఒప్పుకున్నాను.

“ఈ నగరం మనుషుల “స్వేచ్ఛ” ని గౌరవిస్తుంది. నేను ఉన్న కొన్ని రోజుల్లో ఈ విషయం మాత్రం గుర్తించాను. రెండోది ఏమిటంటే ఎవరూ సోమరిపోతులుగా ఉండరు.  కలో గంజో ఏదైనా స్వయంగా  సంపాదించు కోవడానికే ప్రయత్నిస్తారు. మహారాష్ట్రలో ఉన్న మిగతా నగరాలకి దీనికి చాలా భేదం ఉంది.  తనదైన వ్యక్తిత్వం ఉన్న నగరం ముంబై.  వ్యక్తిత్వం అనే పదం నగరానికి వాడకూడదేమో కానీ, అయినా ఆ పదమే వాడాలి అనిపించింది." అన్నది కామేశ్వరి.

“బాస్.. సరదాగా ఓ చోట ఆపితే ఓ వడాపావ్ గాని, టిపికల్ ముంబై సమోసా గాని బాలకి రుచి చూపిద్దాం” నా వీపు మీద  చెయ్యివేసి అన్నది కామీ.

“నేను కచ్చితంగా చెప్పగలను.. ఇది నీ కోరిక, బాలాజీది కాదు. అయినా గ్రాంటెడ్. పది నిమిషాల్లో జూహూ చేరతాం. అక్కడ అ ఓ జాయింట్ ఉంది. ఐటమ్స్ సూపర్” అన్నాడు శాండిల్య.

“ఇంతకీ మనం వెళుతున్నది ఎక్కడికి??” కామేశ్వరి అడిగింది.

“జూహూలోనే. నీకు తెలియదు కదూ, మా డాడీ ఫ్రెండ్ పూణే షిఫ్ట్ అవుతూ వాళ్ళ ఫ్లాట్ తాళాలు నాకు ఇచ్చాడు. ఇంకా సేల్ కి పెట్టలేదు.  ఫుల్లీ ఫర్నిష్ డ్, నిన్నే చూసి వచ్చాను. అద్భుతంగా ఉంటుంది. జూహూలో “శివ సాగర్” ఉడిపి హోటల్ కూడా ఉంది. “సన్ అండ్ సాండ్” లో బ్రేక్ ఫాస్ట్ సూపర్. ఇక సాయంత్రాలు జూహూ బీచ్ లో తిరుగుతుంటే టైమే తెలీదు. ఇంకోటి చెప్పనా, ఈ ఏరియాలో అంటే బాంధ్ర, అంధేరీల్లో సినిమా వాళ్ళు ఎక్కువగా నివసిస్తారు అంటారు. అప్పుడప్పుడు ఆ తారల దర్శనాలూ చేసుకోవచ్చు. ఒకప్పుడైతే JW మారీయట్ లో బోల్డన్ని పార్టీలు జరిగేవి” గుక్క తిప్పుకోకుండా చెప్పాడు శాండిల్య.

“మీరు చూశారా?” సరదాగా అన్నాను.

“బోలెడు మందిని చూశాను. ఇప్పటికే సినీ స్టార్స్ లో సన్ అండ్ సాండ్ కి అలవాటు పడ్డవారు ఎందరో ఉన్నారు. ఏమైనా “ఓల్డ్ ఈజ్ గోల్డ్” ఆయన చిన్నగా నవ్వడం మిర్రర్ లోంచి చూశాను. నిష్కల్మషంగా, స్నేహపూరితంగా ఉందా నవ్వు. పువ్వులకీ అగరువత్తులకీ ఎలా తమవైన పరిమళాలు ఉంటాయో నవ్వులకి కూడా తమదైన పరిమళం ఉంటుంది. అది మనసుకు తెలిసే పరిమళము. మూడోసారి నవ్వాడు శాండిల్య.  “బత్తమీజ్” సినిమాలో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ డ్రెస్ లో ఉన్న ఆనాటి గ్లామర్ క్వీన్ సాధనని నా చిన్నప్పుడు చూశాను. ముంబైకి మా పేరెంట్స్ వచ్చాక సన్ అండ్ సాండ్ కి తీసుకు వెళ్ళమని బుర్రలు తినేసాను. ఇప్పుడు తలుచుకుంటే భలే నవ్వొస్తుంది’, నేను ప్రశ్న వేయకపోయినా తనంతట తానే చెప్పాడు శాండిల్య.

“వక్త్” సినిమాలో  కూడా నేను సాధనని స్విమ్మింగ్ డ్రెస్ లో చూశాను. అదే సన్ అండ్ సాండ్ లో సునీల్ దత్ కూడా ఉంటాడు. ఆ సీన్ లో తనూ చెప్పింది” కామీ.

“ఏవైనా ఆ సినిమాలు వేరు, ఆ రోజులు వేరు” అన్నాడు శాండిల్య.

“ఇప్పటి లేటెస్ట్ సినిమాలు మీకు నచ్చవా?” అడిగాను.

“అతి తక్కువ మాత్రమే. అన్నీ ఉన్నాయి హృదయం తప్ప. ఒక శ్రీ 420, ఓ జిస్ దేశ్ మెయిన్ గంగ బెహతీ హై, ఓ గంగా జమునా,  తీస్రీ కసం, ఆఖరికి ఓ జంగ్లీ, ఓ ఆరాధనా ఇవన్నీ కూడా గుండెని టచ్ చేస్తాయి. అసలు ముఘల్-ఎ-ఆజమ్, మదర్ ఇండియా, పాకీజా ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయా? అసలెవరైనా తీయగలరా? అప్పుడు సినిమా అంటే కళాత్మక వ్యాపారం, ఇప్పుడది వ్యాపారాత్మక కళ. కళ కంటే కలెక్షన్స్ ముఖ్యం. ఓ ఆవారా, ఓ అనాడీ, ఓ కాగజ్ కే ఫూల్, ఓ బైజూ బావరా, ఓ గైడ్ ఇవన్నీ ఇప్పటికీ మనసు లోపల స్పృశిస్తాయి. ఇప్పుడంతా పైపై సినిమాలే. అసలు పాటలు? ఆ పాటలు వేరు, ఆ సింగర్స్ వేరు. వీళ్లంతా హృదయంతో కాదు గొంతు నుంచి మాత్రమే వాడేవాళ్ళు. ఏకబిగిన అన్నాడు శాండిల్య. కొంత నిరాశ ధ్వనించింది అతని కంఠస్వరంలో.

“సినిమాలు అంటే మీకు ఇష్టమని తెలిసింది. మరి మీరు సినిమాల్లో చేరడానికి ఇంట్రెస్ట్ ఎందుకు చూపించలేదు?” అని అడిగాను.

వడపావ్ సెంటర్ ముందు కారు ఆపి వెనక్కి చూశాడు, “నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో  చేరదాము అనుకున్నాను. మమ్మీ డాడీ కూడా ఓకే అన్నారు. దాదాపు నేను టాప్ అనుకున్నా 300 సినిమాలు  అనేకసార్లు విశ్లేషించి, నోట్స్ లు రాసుకున్నాను. ఇంగ్లీష్ సినిమాల స్క్రిప్ట్ ల్ని కొని షాట్ డివిజన్ గురించి తెలుసుకుని ఏ డైరెక్టర్ ఏ షాట్ ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటారో నోట్స్ లు రాసుకున్నాను.  ప్రయత్నించినప్పుడు మాత్రమే తెలిసింది, మనకి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదనీ చాలా తతంగం ఉంటుందనీ. బాలాజీ,  అదో పాడు కల అంతే”, డోర్ తీసి బయటకు వస్తూ, “మీరు ఇంక దాని గురించి ఆలోచించకండి. ఎందుకంటే నేను ఏదీ మొదలెట్టను, మొదలెట్టాక వదిలిపెట్టను. సినిమా ఫీల్డే నన్ను పిలిచేలా చేస్తా” అన్నాడు. అతని మాటల్లో ఏదో చెప్పలేని నమ్మకం. నేను సైలెంటయ్యాను.

“శాండీ, అసలీ విషయాలేవీ నాకు తెలీదు. ఎప్పుడు నువ్వు చెప్పనూ లేదు” కొంచెం నిష్టూరంగా అన్నది కామీ.

“అవసరం రాలేదుగా కామేశ్వరి. ఏదో ఇవాళ వచ్చింది కానీ కదా అని చెప్పాను. సక్సెస్ స్టోరీలు వినసొంపుగా ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలు వినడానికి అంత బాగోవు. కానీ మనమీద మనకి ‘కచ్చ’ పెంచి మనని మళ్ళీ దారికి తెచ్చేది మన ఫెయిల్యూర్సే. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి ‘పట్టిన పట్టు వదలకు’ అనే సూత్రాన్ని ‘మనసా, వాచా, కర్మణా’ ఆచరించాలి” నవ్వి అన్నాడు శాండిల్య.

వడాపావ్ అద్భుతంగా ఉంది. చెట్ని ఆ ‘బాగోతం’లో ప్రథమ పాత్ర పోషించింది. బాంబే చాయి ప్రత్యేకత బాంబే చాయిదే. స్ట్రీట్ ఫుడ్ లో ఉన్న రుచి ఫైవ్ స్టార్ ఫుడ్ కి రాదు. ‘సమర్ధత’ ‘స్టైల్’ కీ మధ్య చాలా దూరం ఉంటుంది

.

“ఇవాళ డైరెక్టుగా ఫ్లాట్ కి వెళ్ళిపోదాం. అక్కడ్నుంచి నేను మా కంప్యూటర్ సెంటర్ కి వెళ్లి సాయంత్రం వస్తాను. అఫ్కోర్స్ లంచ్ కరెక్ట్ గా టైంకి వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను. నేను తిరిగి వచ్చాక బీచ్ కి పోదాం. అద్భుతమైన సాయంత్రపు గాలిని పీల్చి, అక్కడినుంచి ఇస్కాన్ కి పోయి అక్కడ డిన్నర్ చేద్దాం. ‘సన్నీ సౌండ్స్’ అంటే సన్నీ డియోల్ రికార్డింగ్ థియేటర్ చూపిస్తా. వెళ్లేప్పుడో, వచ్చేప్పుడో అనిల్ కపూర్ ఇంటినీ, అమితాబ్ ఇంటినీ చూపిస్తా. లక్ బాగుంటే ఎవరో ఒకరు బీచ్ లో కనపడకపోరు. బిల్ పే చేస్తూ అన్నాడు శాండిల్య.

సినిమాల గురించి అతను చెప్పడం నాకు చాలా ఇష్టంగా అనిపించింది. నేను పెద్దగా సినిమాలు చూడను. “మాయాబజార్” లాంటి సినిమాలు కొన్ని నాన్నతో చిన్నప్పుడు టీవీలో చూసేదాన్ని తప్ప సినిమాల గురించీ, నటీనటుల గురించీ గొప్ప పరిజ్ఞానం నాకెప్పుడూ లేదు. శాండిల్య చెప్పాక అనిపించింది, ఆయన చేసిన సినిమాలన్నీ లిస్ట్ రాసుకుని నేను చూడాలని.

 - మళ్ళీ కలుద్దాం

మీ భువనచంద్ర

bottom of page