top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

పాండి బజార్ కథలు - 11

ఖుషీ కార్నర్ లో ఓ పిట్ట కథ!

  ఇదీ కథ!

భువనచంద్ర

                                                           


టీ. నగర్ లోని అడ్డాలలో 'హమీదియా' హోటల్ ఒకటి.

 

ఆ హోటల్ దగ్గరే డా. గోపాలకృష్ణ గారు రాత్రి తొమ్మిది నుంచి పదకొండు దాకా ఫ్రీ హోమియో మందులు ఇచ్చేవారు. ఆడవారికి కావలసిన నైటీలు, జాకెట్ పీసెస్ లు ఇంకా ఇష్టమైనవి దొరికేవి ' కైరాలి' లో. పాండీ బజార్ లోని అతిపెద్ద సరుకుల (వెచ్చాల)దుకాణం సలామ్ స్టోర్స్. ఇవన్నీ అప్పటి కథలు.


ఉడ్ లాండ్స్ హోటల్లో టిఫిన్ తిని కాఫీ తాగడం ఓ చిన్నపాటి లగ్జరీ. కాఫీ ఖచ్చితంగా బావుంటుంది. దోశ ఏదైనా స్వచ్ఛమైన నెయ్యి వాసనతో అలరారుతుంటుంది. ఇక మాంబళం రైల్వే స్టేషన్ దగ్గరున్న భట్స్ హోటల్ ఎప్పుడూ కష్టమర్లతో కళకళలాడుతూనే ఉంటుంది.


లత. ఆవిడ అసలు పేరు రాధాలక్ష్మి. రాగలత అన్నది సినిమా పేరు. మెల్లగా నడుస్తూ శివజ్ఞానం స్ట్రీట్ లో కొచ్చింది. రోడ్డు మీదే నిట్టూర్చింది. ఎన్ని కలలు ఆ నిట్టూర్పులో కన్నీళ్ళలా ఆవిరైపోయాయో.


"తప్పెవరిది? ఈ రోజున ఎందుకిలా ఉన్నాను?" తనలో తనే అనుకుంది.


“హాయ్. . . రాగా ఎక్కడున్నావ్ చూసి చాలా కాలామైంది ". యధాతథంగా నవ్వుతూ అంది ఉజ్వల. ఈ యధాతథంగా అనే పదం ఎందుకంటే ఉజ్వల ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. దేవుడిచ్చిన ఓ అద్భుత వరం అది.
 

“బస్. . . ఊళ్ళు తిరుగుతున్నా "నవ్వింది రాగలత.
 

“ఒంటరిగానా ? జంటగానా? “మళ్ళీ నవ్వింది ఉజ్వల.
 

"ఒంటరిగానే ! "నిట్టూర్చింది రాగ.
 

“అయితే పద. . . . ఆ నరసూస్ కాఫీ వాడిని బాగు చేద్దాం “నరసూస్ కి దారితీస్తూ అంది ఉజ్వల. రంగనాధన్ స్ట్రీట్ టర్నింగ్ లోనే నరసూస్ వాళ్ళ కాఫీ షాప్ ఉంది.
 

“ఇప్పుడే భట్స్ లో తాగి వస్తున్నా !”ఆగి అంది రాగలత.
 

"కాఫీకి మందుకీ టైములూ, లిమిట్స్ విధించకూడదోయ్ ". మరో కాఫీకి ఎప్పుడూ పొట్టలో చోటు ఉండనే ఉంటుంది. పకపకా నవ్వి, రాగలత ని కాఫీ షాప్ లోకి లాక్కెళ్ళింది ఉజ్వల.
రెండు స్ట్రాంగ్ కాఫీ బేరర్ కి చెప్పి - “ఇప్పుడు చెప్పు. . . . ఎందుకా నిట్టూర్పులు?”అనునయంగా అడిగింది ఉజ్వల.

 

ఉజ్వల తండ్రి తెలుగువాడు. తల్లి మళయాళీ. తండ్రి ఓ కంపెనీలో పని చేస్తుండేవాడు. స్ఫురద్రూపి. ఉజ్వల తల్లి పేరు ఉత్తర. వంటలో ఎక్స్ పర్ట్. ఆవిడ అవియల్ చేస్తే అదిరిపోయేది. అలాగే ఓ మంచి నటి. ఓ రియాలిటీ షోలో వంటల పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. ఆ షోలో చూసిన శోభనాద్రినాయుడనే తెలుగు ప్రొడ్యూసర్ ఆమెని సినిమాలో వేషం వెయ్యమని అడిగి ఒప్పించాడు. భగవంతుని ' దారి ' అది మన ఊహకి అందదు. ఆమె నటి కావడం, తండ్రి పైకి వెళ్ళడం ఓ ఏడాది తేడాలో జరిగాయి. ఆ ఏడాది తొమ్మిది సినిమాల్లో బుక్ అయింది ఉత్తర. అక్క వేషాలు, వదిన వేషాలు ఆవిడని వెతుక్కుంటూ వచ్చేవి. ఉజ్వలకి నాలుగేళ్ళ వయసులో తండ్రి పోయినా చక్కగా చదివించడమే కాక ఏ లోటు లేకుండా పెంచింది.

 

ఉజ్వల తల్లి అంత అందగత్తె కాదు. దాంతో హీరోయిన్ కు ఫ్రెండ్ గానో, హీరోకో, సెకెండ్ హీరోకో చెల్లెలుగానో వేషాలు వచ్చేవి. వేరే బాధ్యతలు లేవు కనుక ఉజ్వల ఆ చిన్న వేషాలతోటే సంతృప్తి పడేది. సారంగపాణి స్ట్రీట్ లో ఓ ఇల్లు, బాంకులో ఇరవై లక్షల ఫిక్స్ డ్  డిపాజిట్లు, ఎనిమిది లక్షల కాషూ, ఓ ఐదారు లక్షల ఖరీదు చేసే నగలు, పోరూరులో ఉన్న మూడు గ్రౌండ్ల స్థలము ఇవన్నీ ఉత్తర సంపాదించినవే. మనిషి మంచిది. మనసు మంచిది.
 

"ఏమో ఉజ్వల. . . జీవితం ఘోరంగా ఉంది.“ గాఢంగా నిట్టూర్చి అంది రాగలత.
 

"ఓ పని చేద్దాం, ఇక్కడినుంచి సరాసరి మా ఇంటికి వెళదాం. అమ్మ కేరళ వెళ్ళింది.
 

సో - నో డిస్టర్బెన్స్. అక్కడయితే ఫ్రీ గా మాట్లాడుకోవచ్చు." రాగలత భుజం మీద చెయ్యేసి అంది ఉజ్వల.
 

"సరే”అన్నది రాగ. ఇద్దరూ మెల్లగా నడుస్తూ సారంగపాణి స్ట్రీట్ లో ఉన్న ఉజ్వల ఇంటికి చేరారు. విశ్రాంతిగా సోఫాలమీద కూర్చున్నారు. "మా అమ్మ ఇల్లు చాలా క్లీన్ గా ఉంచుతుంది. నేను మహా బేడ్. ఎనీవే, ఇప్పుడు చెప్పు విషయం ఏమిటో ! “మెల్లగా అడిగింది ఉజ్వల.
 

"మా అమ్మానాన్నలు మంచివాళ్ళే. అలాగే మా అక్కాబావా, తమ్ముడు కూడా. నేను మలయాళం, కన్నడం లోనేగాక ఒరియా సినిమాలు కూడా చేశానని నీకు తెలుసు. తెలుగు,తమిళం సరేననుకో. గొప్ప హీరోయిన్ ని కాకపోయినా సెకండ్ హీరోయిన్ గా కనీసం వంద సినిమాలు చేసుంటాను. దిగువ మధ్య తరగతి అంటే లోయర్ మిడిల్ క్లాస్ అయిన మావాళ్లు నా సంపాదన పెరిగాక లగ్జరీకి అలవాటుపడ్డారు. ఆ మాటా తప్పే. మావాళ్లని 'బాగా ' చూసుకోవాలని నేనే లగ్జరీ అలవాటు చేశానేమో ! సరే అకౌంట్సన్నీ మా నాన్నగారే చూసేవారు. కారణం ఆయన ఓ కో- ఆపరేటివ్ బ్యాంక్ లో క్లర్కుగా పనిచేశారు. దొంగ లెక్కలు వ్రాయడంలో ఆయన ఎక్స్పర్ట్ అని అందరూ అనేవారు కానీ నాకే తెలీదు. మా అక్కకి ధూంధాంగా పెళ్ళి చేయించింది మా అమ్మ. తమ్ముడ్ని కూడా 'బిట్స్ పిలానీ' కి పంపించి బ్రహ్మాండంగా చదివించింది.


ఉద్యోగం చూసుకుంటామని మద్రాసు వచ్చిన అక్కా,బావలు ఇక్కడే ఉండిపోయారు. పెళ్ళి కాకముందు బ్రేక్ ఇన్స్ పె క్టర్ గా పని చేసిన బావ బ్రహ్మాండంగా సంపాదించేవారు. తర్వాత తెలిసింది ఏసీబీ వాళ్ళకి రెడ్ హాండెడ్ గా పట్టుబడి, ఉద్యోగం పోగొట్టుకున్నారని. నా పెళ్ళి విషయం అసలు ఎత్తడం మానేశారు ఇంట్లో వాళ్ళు.
 

తమిళ సెకండ్ హీరోగా వేసే 'అరఘన్' కొంతకాలం నా వెంట పడ్డాడు. ఓ దశలో పెళ్ళిచేసుకుందామని నిర్ణయించుకున్నా.
కానీ మా అమ్మానాన్న తమ్ముడి చదువు అయ్యేంతవరకూ ఆగమని కాళ్లావేళ్లా పడ్డారు. సరేనన్నా.

తమ్ముడి చదువు అయ్యేలోగానే మా వాళ్ళు 'చాలా' జాగ్రత్త పడ్డారు. మా ఊళ్ళో భూములు కొన్నారు, ఫస్ట్ క్లాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ విషయాలసలు నాకేవీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
 

ఫైన్ మార్నింగ్ చూస్తే ఏం మిగిలింది? చిప్పాకర్రా “నిట్టూర్చింది రాగలత. కళ్ళలోంచి ధారగా కన్నీరు.
 

“ఊ” ఏకాక్షర సమాధానమిచ్చి ఊరుకుంది ఉజ్వల. తనకి తెలుసు, ఎప్పుడోగానీ కన్నీళ్ళు రావని. ఆ అదృష్టం కలిగినప్పుడు ఆపకూడదని.
కొన్ని క్షణాలపాటు ఆ గదిలో మౌనం తాండవించింది. రాగలత సర్దుకుంది.

 

“ఆ తర్వాత? “ రాగని గమనించి అడిగింది ఉజ్వల.


“ఏముంటుంది? నూటికి తొంభై శాతం సినిమావాళ్ళకి కలిగే అనుభవమే. "ఇన్నాళ్ళూ పెంచి పెద్ద చేసాము. ఆ డబ్బంతా ఎవడో అరవ వాడికి సమర్పించడం ఏం న్యాయం? మా దగ్గర ఉండటమే మంచిది. రేపెప్పుడన్నా ఆ అరవ వాడు తన్ని తగలేస్తే కనీసం అన్నవస్త్రాల కన్నా లోటుండదు. “అని సాక్షాత్తూ మా అమ్మే నా నగలతో సహా చుట్టబెట్టుకుపోయింది. "


"అదేమిటి, ఇల్లు నీదేగా?”
 

"ఆ.  నాదే. నా కష్టార్జితమే. కానీ టాక్స్ ఎలా తగ్గించాలో తనకి బాగా తెలుసనీ, తను చూసుకుంటానని నాన్న అంటే ఊరుకున్నాను. నాకేం తెలుసు దొంగలెక్కలు రాసే టాలెంట్ అంతటినీ నా మీదే ప్రయోగిస్తాడనీ. “మళ్లీ సైలెంటయి పోయింది రాగలత.
 

"అళఘన్ ని కలవలేదా?”అడిగింది ఉజ్వల.
 

"కలిశా. ఉన్నదున్నట్టుగా చెప్పాను. అతను చిన్నగా నవ్వి, మీ నాన్న ఆల్రెడీ మా అమ్మానాన్నలకి అల్టిమేటం ఇచ్చాడు. అంతకుముందు మీ వాళ్లు అంత సరైనవాళ్లు కాదని నీతో చూచాయగా చెప్పినా నువ్వు వినలేదు. పెళ్ళి అనేది గొడవలతో మొదలు కాకూడదని మావాళ్లు ఓ సంబంధం చూడటం, ఓకే చేసేయడం అయిపోయిందన్నాడు. ఇక చేసేదేముంది?  బాధగా అన్నది రాగలత.


“సరే. . లతా, జీవితం అంతా ముందే ఉంది. ఇప్పుడు నీ వయస్సు ముప్ఫై ఐదో, ముప్ఫై ఆరో. ఈ వయసుకి తగ్గ వేషాలు దొరక్కపోవు. సినిమాతల్లి కన్నతల్లికన్నా వంద రెట్లు గొప్పది. ఆఫ్కోర్స్ మా అమ్మ నిజంగా గ్రేట్. నా కోసం స్వర్గాన్ని సిద్ధం చేసింది. ఒక విధంగా తాను కొవ్వొత్తిలా కాలుతూ నా కోసం వెలుగుని స్టోర్ చేసింది. నా జీవితానికి ఢోకా లేకుండా చేసింది. ఇక నీ సంగతైతే పరిశ్రమని నమ్ముకున్నవారు ఏనాడూ నిరాధారులవరు లతా.

 

ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నావు ?”కొంత ధైర్యం, కొంత సానుభూతి కనబరుస్తూ అడిగింది ఉజ్వల.
 

“కథ పూర్తి కాందే. . !”నవ్వింది లత నీరసంగా.
 

“కదూ. . ! సరే తర్వాతేం జరిగింది? “అడిగింది ఉజ్వల.


“అళఘన్ కి పెళ్లైపోయింది. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం నేను బెంగళూరు వెళ్ళాను. అక్కడ కలిశాడు అప్పుడే పైకొస్తున్న వెంకట్. “ఆగింది రాగలత.
 

“ఆయన నాకు తెలుసు. దాదాపు పదిహేను సంవత్సరాలు నానా కష్టాలు పడితేనేగానీ డైరెక్షన్ ఛాన్స్ రాలేదు. అతనేనా? "
 

“అతనే ! అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా చాలా ఏళ్ళు పనిచేశాకే ఓ కన్నడ సినిమాకి డైరెక్టర్ అయ్యాడు. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఆ టైంలోనే మావాళ్లు నన్ను ఛీట్ చేసి మాయమైంది. ఉజ్వలా, నా ఇల్లు నాకు తెలీకుండానే అమ్మేవారు. మొత్తం డబ్బు పట్టుకుని పోయారు. ఇంకో గంటలో బయలుదేరుతాననగా ఇల్లు కొన్నవాడు నా దగ్గరకి వచ్చి డాక్యుమెంట్స్ చూపించి ఓ నెలలో ఇల్లు ఖాళీ చెయ్యమన్నాడు. ఆ దుఃఖంతోనే బెంగళూరు వెళ్ళాను. వెంకట్ నన్ను అభిమానంగా అడిగేసరికి, అన్ని విషయాలు  అతనికి చెప్పి భోరుమన్నాను. ఆ ఓదార్పులోనే మేం ఒకటి కావడం జరిగింది. ఓదారుస్తే ఆడది కరిగిపోతుంది. ఓదారుస్తూనే మగాడు మనసు పారేసుకుంటాడు. అదో ట్రాన్స్ లాంటిది. ఓ విషయం చెప్పనా ? అన్ని మత్తుమందుల కన్నా చాలా గాఢమైంది ఓదార్పనే మత్తు. ఆ ఓదార్పుకి అలవాటు పడ్డవారికి ఉచ్ఛం నీచం తెలియదు.“ సైలెంట్ అయ్యింది రాగలత.
 

“నిజం ! ఈ విషయాన్ని అమ్మ నాతో చాలాసార్లు చెప్పింది.“ తలవూపి అన్నది ఉజ్వల.
 

“నేను వెంకట్ ని బ్లేమ్ చెయ్యను. గుండె మీద వాలి ఆడది వెక్కివెక్కి ఏడుస్తుంటే ఏ మగవాడు మాత్రం ఏం చెయ్యగలడు? తరువాత నాకనిపించింది, ఆ స్పర్శలోని సుఖం నేను కోరుతున్నానని. దుఃఖం నిజమైనదైతే కోరిక ఎలా పడగానే విప్పుతుంది? అలాగని నా దుఃఖం కల్పితమైనదీ కాదు. మనసు ఛిన్నాభిన్నం అయినప్పుడు శరీరాన్నీ, మనసునీ సేదదీర్చేది సెక్స్ ఒక్కటేనేమో! “ఎక్కడో చూపు నిలిపి అన్నది రాగలత.
“ఈ విషయాన్ని ఎవరూ ఒప్పుకోరు. అయినా ఇది నిజం. ఈ నిజం నాకు అనుభవైకమైనదే ! “రాగలత భుజం మీద చెయ్యేసి అన్నది ఉజ్వల.
మళ్ళీ ఓ మారు మౌనం విశృంఖలంగా కొంతసేపు నృత్యం చేసింది.

 

“ఆ తర్వాత? “
 

“అయిదారు రోజుల షూటింగ్ కి వెళ్లినదాన్ని, అక్కడే ఉండిపోయా. అతనే తన అసిస్టెంట్స్ కి చెప్పి ఇల్లు ఖాళీ చేయించి సామాన్లు బెంగళూరుకి తెప్పించాడు. ఏం సామానుందీ? వందరోజుల జ్ఞాపికలు తప్ప ! “నిర్లిప్తంగా నవ్వింది రాగలత.
 

“మనకి మిగిలే ఆస్తి అవేగా ! “తనూ నవ్వింది ఉజ్వల.
 

“సరే ! మూడు నెలల తర్వాత గానీ తెలియలేదు నేను ప్రెగ్నెంట య్యానని."


“ఓహ్. . . ఇది నిజంగానే దేవుడిచ్చిన ట్విస్టే. కనీసం నా అనుకునే బిడ్డ నీకుంటాడుగా!“ ఉత్సాహంగా అంది ఉజ్వల.


“వచ్చిన గొడవ అదే ! నాకు తెలిసేటప్పటికి మూడు నెలలు, మరో నెల వెంకట్ కాశ్మీర్ లో షూటింగ్ నిమిత్తం ఉండడం వలన చెప్పలేదు. తన ఆధీనంలో నేనున్నానుగా మరి. నా మంచీ చెడూ అతని పర్సనల్ డ్రైవర్ చూసుకునేవాడు. ఆ మాటకొస్తే వెంకట్ నన్ను మంచి ఇంట్లోనే ఉంచాడు.“ ఆగింది రాగలత.
 

సడన్ గా కిటికీలు పటపటా కొట్టుకున్నాయి. చూస్తే ఆకాశం మేఘావృతమై గాలి ఉధృతంగా వీస్తోంది. వర్షం రాక తప్పదనిపించింది. ఉజ్వల గబగబా కిటికీలు లాగి బోల్టులు వేసేసింది.
 

రెండే రెండు నిమిషాల్లో భోరున వర్షం మొదలై మరో మూడు నిముషాలకి కుంభవృష్టిగా మారిపోయింది. మద్రాసుకీ వర్షాకాలానికీ ఎప్పుడూ వైరమే. వర్షమనేది మద్రాసులో ఎప్పుడూ అడుగెట్టదు. ఒకవేళ అడుగెట్టినా ఏ తుపానులో, సునామీలో వర్షానికి తోడుగా రావాల్సిందే. ప్రస్తుత పరిస్థితి అదే, తలుపులు మూసేసినా ఒకరి మాట మరొకరికి వినపడనంతగా హోరు గాలీ, వర్షపు సవ్వడి.


వర్షం మొదలైన పది నిమిషాలకి కరెంటు తీసెయ్యటం ఆనవాయితీ. ఓ పక్క చీకటి మరోపక్క వర్షం. రెండు కొవ్వొత్తులు వెలిగించి ఉజ్వల ఫ్రిజ్ లోకి తొంగి చూసి, “ లెట్స్ ట్రై సమ్ పకోడీ “ అంటూ ఓ అరటికాయ, నాలుగు బంగాళాదుంపలు, పచ్చిమిర్చి బయటికి తీసింది. బుట్టలోంచి నాలుగు పెద్ద పెద్ద ఉల్లిపాయలు కూడా బయటకు తీసింది. 


“రాగా డార్లింగ్, తెలుగువాళ్ళు మిర్చిబజ్జీ ఎక్స్ పర్టులనిని నాకు తెలుసు. చదువుకునే రోజుల్లో ఓ రెడ్డి అబ్బాయితో లవ్వు కొంచెం వెలగబెట్టానులే. సరే కళాయిలో నూనె వెయ్యడం నా పని. ఈ బజ్జీ పిండి కలిపి బజ్జీలు వెయ్యడం నీ పని.“ చేతిలో ఉన్న వస్తువులన్నీ పడేస్తూ అన్నది ఉజ్వల. రాగలతకి అర్థమైంది, అదంతా తన మైండ్ డైవర్ట్ చెయ్యడానికేనని. 


ఓ గంట గడిచింది. రెండు ప్లేట్లలో వేడి వేడి ఆలు, మిర్చిబజ్జీలు, ఉల్లిపకోడిలు వేసి టేబుల్ మీద పెట్టింది ఉజ్వల. 

“ఒన్ మినట్ రాగా. నా క్యాబినెట్లో ఓ వోడ్కా బాటిల్ కూడా ఉంది. ఫ్రిజ్ లో సోడాలు ఉన్నాయి. లెట్స్ సెలబ్రేట్ ద ఫస్ట్ రెయిన్ ఆఫ్ ద సీజన్ “లోపలకి వెళ్తూ అన్నది ఉజ్వల.


చిన్నగా నవ్వుకుంది రాగలత. డ్రింక్స్ కొత్త కాదుగానీ ఒక ఆడది అంటే సాటి స్త్రీతో కలిసి తాగడం ఇదే మొదటిసారి. 


వర్షం భీభత్సంగా కురుస్తోంది. మద్రాసు వర్షాలు చిత్రమైనవి. అనుకోని అతిథిలా ఊడిపడి ఆకాశం నుండి అడ్డూ ఆపూ లేకుండా వర్షం కురుస్తుంది. రోడ్లు కాలువలవుతాయి. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ ఏకమవుతాయి. ఒకరోజు వర్షం పడితే వారం రోజులపాటు నరకమే. ఒక్కోసారి అనిపిస్తుంది, చెత్త తొలగించే పని, గుడిసెలో కడిగేపని ఈ అరవ్వాళ్లు వానదేవుడికే అప్పజెప్పారేమోనని. పేరుకేమో 'సుందర చెన్నై ' ఆ సౌందర్యమంతా కలల్లోనే.
“ఇప్పుడు చెప్పు."రెండో పెగ్గులో అడిగింది ఉజ్వల.


“చెప్పిన వెంటనే వెంకట్ కి కోపం వచ్చింది. కడుపు తీయించేయమన్నాడు. ఎంతో ప్రాధేయపడ్డాను, వినలేదు. నేను బయటకి వచ్చేశాను.“ సైలెంట్ అయ్యింది రాగలత.


“జరగాల్సిన తప్పు మొదలే జరిగింది రాగా ! రెండో పెళ్ళివాడిని ఎన్నుకోవడమే అసలు తప్పు.“ అన్నది ఉజ్వల.


“ఆ విషయం నాకు నాలుగు నెలల క్రితమే అర్థమైంది. నూటికి తొంభై శాతం సినిమాల్లోకి వచ్చేవాళ్లు మధ్యతరగతికి చెందినవారే. లేని పోని హిపోక్రసీ మనకేగా!  మనమేదో పెద్ద సెలబ్రిటీలమయిపోయినట్టూ, ఏ చిన్న విషయం బయిటికి వచ్చినా సమాజంలో పరువూ ప్రతిష్ఠలు మంటగలిసిపోయినట్టూ తెగ ఊహించుకుంటాం. పరువూ, ప్రతిష్ఠ. . . మై ఫుట్. . ఈ రెండు పదాల్నీ కనిపెట్టిన స్కౌండ్రెల్ని నిట్టనిలువునా పాతేయ్యాలి.“ కోపంగా అంది రాగలత.


“అవును. పెద్ద పెద్ద హీరోయిన్లు అటు బాలీవుడ్లో కానీ ఇటు కోలీవుడ్ లో కానీ ' సహజీవనం ' పేరిట అన్నీ సాగిస్తున్నా అదో స్టైల్ గా భావించే మీడియా కూడా చిన్న హీరోయిన్ల పాత్రధారులు అదే పని చేస్తే మాత్రం వ్యభిచారం అంటారు. నడిచే వీధుల్లోకి ఈడుస్తారు.“ బాధగా అన్నది ఉజ్వల. తన తల్లి 'ఉత్తర ' మీద ఎన్ని పుకార్లు వచ్చాయో చిన్నప్పటి నుంచీ ఉజ్వలకి తెలుసు.


“సరే ఆ ప్రిస్టీజ్ ఒక కారణమైతే, స్వంత బంధువులే రాబందులుగా మారడం. నా జీవితంలోనే కాదు, ఎందరో సినీ నటీమణుల జీవితంలోనూ జరిగింది అదే. సొంతవాళ్ళేవెన్నుపోటు పొడవడం. కళ్ళు తెరిచి చూసుకునే సరికి పర్సు ఖాళీగా మిగలడం. మూడో కారణం మానికమైన ఇన్ సెక్యూరిటీ. తల్లీతండ్రి మోసం చేశారు. నేను నిబ్బరంగా ఉండొచ్చుగా! వెంకట్ దగ్గర ఎందుకు భోరుమన్నాను? మానసికమైన ఒంటరితనం వల్లనేగా!”మళ్ళీ ఆగింది రాగలత.


“ముమ్మాటికీ నిజమే. పెళ్ళి అయినవాడ్ని, రెండో పెళ్ళి చేసుకున్న ప్రతి సినీ జీవికైనా ఈ అనుభవాలే కారణం. అయితే కొంత క్రూరత్వం మనలోనూ లేకపోలేదు. పెళ్ళైపిల్లలున్న వాడి దగ్గర మనం రెండో భార్యగా చేరితే- అయ్యో ! మొదటి భార్యా పిల్లల పరిస్థితి ఏమౌతుందని ఆలోచించాలి కదా ! ఉహూఁ. . . అంతేకాదు వాళ్ళని వదిలేయమని మనం వాళ్ళని పట్టుబట్టడం క్రూరమే కదా!”మూడో పెగ్గు గ్లాసుల్లో పోస్తూ అంది ఉజ్వల.


“నిజమే కానీ ఉజ్జూ, నేను మాత్రం వెంకట్ తో పెళ్ళాం పిల్లల్ని వదిలేయమని చెప్పలేదు.“ సిన్సియర్ గా అంది రాగలత. ఆ మాటే నిజం కూడా.


“నువ్వు అనకపోయినా, నీ విషయం తెలిసాక వెంకట్ మొదటి భార్య ఏమనుకుంటుంది ? అయ్యో ఆ అమ్మాయి చాలా గొప్పది. నన్నూ నా పిల్లల్ని విడిచిపెట్టమని చెప్పలేదని ఆనందంగా గెంతులేస్తుందా? చస్తే చెయ్యదు. నీకంటే వెయ్యి రెట్లు ఇన్సెక్యూరిటీలో కూరుకుపోతుంది.“ రాగలత మొహంలోకి సూటిగా చూస్తూ అంది ఉజ్వల.


“అంత ఆలోచన ముందరే ఉంటే ఇంతమంది జీవితాలు కుక్కలు చింపిన విస్తర్లలా ఎందుకుంటాయీ? ఇంకో విషయం తెలుసా నీకు? నటుల పెళ్ళాలుగానీ,దర్శకుల, రచయితల, గాయకుల, ప్రొడ్యూసర్ల పెళ్ళాలుగానీ ఎంతమంది లేని పోని అనుమానాలతో మొగుళ్లని రాచిరంపాన పెడుతారో తెలుసా? అక్కడ దొరకని ప్రేమ మరో చోట దొరికేసరికి వీళ్ళూ ఆడవాళ్ళని 'ఈజీ' గానే పడతారు. రాబోయే పరిణామాల గురించి ఆడవాళ్ళు ఎలా ఆలోచించరో, ఈ మగవాళ్లూ అంతే. అందుకే ఆ విషయం అర్థమయ్యే అతని సంసారజీవితం దుర్భరం కాకూడదని బయటికి వచ్చేశాను.“ తలవంచుకుని అన్నది రాగలత.


“నీది మంచి మనసు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం.“ గ్లాసు ఖాళీ చేస్తూ అన్నది ఉజ్వల.


“ఇంకోటి?” తన గ్లాసులో పోసుకుని రాగలత గ్లాసులో పొయ్యబోతూ అన్నది ఉజ్వల.


“వద్దు. అసలు డెలివరీ అయ్యేదాకా ముట్టుకోకూడదనుకున్నాను. కానీ. . . . . “ ఆగింది రాగలత.


“అంటే?”షాకింగా లేచి నిలబడింది ఉజ్వల.


“మరో రెండు రోజుల్లో ఆరో నెల.“ మెల్లగా అన్నది రాగలత.


“మై. . గాడ్! మరి పొట్ట అసలు తెలియడం లేదే?"


“నాది మా అమ్మ స్ట్రక్చర్. ఎనిమిది తొమ్మిది నెలల్లో గానీ నిండు గర్భిణి అని తెలియదుట. గర్వంగా మా అమ్మ చెప్పేది. జాగ్రత్తగా గమనిస్తే నీకు తెలుస్తుంది.“ నవ్వు కాని నవ్వు ఒకటి నవ్వి అన్నది రాగలత. ఆమె చీరలో లేదు, లూజ్ ఫిట్ చుడీదార్లో ఉంది.


“ఓహ్. . నేనో ముద్దపప్పుని. ఇందాక మనం వచ్చేటప్పుడు చాలా స్లోగా నడుస్తుంటే విసుక్కున్నాను. ఇప్పుడు అర్థమైంది. సో హ్యాపీ రాగా ! ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు?“ ఆనందంగా అడిగింది ఉజ్వల.


“రామ్స్ హోటల్ తెలుసుగా?”తలవంచుకుని అంది రాగలత.


“తెలుసు. ఒకప్పుడు అది గ్రాండ్. ఇప్పుడక్కడ 'లోకల్స్' తప్ప ఎవరూ అడుగుపెట్టరు.“ షాకింగా అంది ఉజ్వల.


“అక్కడే ఉంటున్నా. మరో ఛాయిస్ లేదు. వెంకట్ దగ్గర నుండి బయటకు వచ్చేశా. కొన్ని బట్టలు, కాసిని నగలూ తప్ప నా దగ్గర ఏం లేదు. శాంతి జ్యుయెలరీస్ లో నాలుగు గాజులు అమ్మిన డబ్బు మాత్రం ఉంది. “ నిట్టూర్చి అంది రాగలత.


“సారీ రాగా! ఇవ్వాళ ఇక్కడ ఉండిపో. అమ్మకి ఫోన్ చేస్తా. రేపటికి వస్తుంది. మా అమ్మ మనసు నీకు తెలుసు కదా. నేనే ఓ స్టెప్ తీసుకోవచ్చు కానీ అమ్మని అడగటం ధర్మం. “ రాగలత భుజం మీద చెయ్యేసి అన్నది ఉజ్వల.


ఉత్తర. . అంటే ఉజ్వల అమ్మ చాలా మంచి మనిషి. రాగలతని తన దగ్గర ఎంచుకోవడానికి మనస్పూర్తిగా ఒప్పుకుంది. ఉజ్వల ఒక మనిషికి కష్టంలో తోడుగా నిలిచినందుకు ఎంతో ఆనందించింది. తల్లీకూతుళ్ళిద్దరూ రాగలతని ఆత్మబంధువులా చూసుకున్నారు. మధ్యలో మూడు సార్లు వెంకట్ తన అసిస్టెంట్ ని పంపాడు. మూడోసారి రాగలత ఆ అసిస్టెంట్ తో “దయచేసి ఇంకెప్పుడూ ఎవర్నీ పంపొద్దని మీ డైరెక్టరుగారితో చెప్పండి. నాకు ఎవరి సాయమూ అక్కర్లేదు. నా దారిన నన్నుండనివ్వమన్నానని చెప్పండి.“ అని అందరి ఎదురుగానే చెప్పింది.


'అనే ఆవిడ అనక మానుతుందా ? కనే ఆవిడ కనక మానుతుందా? ' అన్న సామెతని నిజం చేస్తూ రాగలత పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది రాగలత. కన్నీళ్ళతో ఉత్తర పాదాలు కడిగి ఉజ్వలని కావలించుకుంది రాగలత.


ఒక పిల్లాడు. ముగ్గురు తల్లులు. సంవత్సరానికే మాటలొచ్చేసాయి. బిడ్డ పుట్టిన అదృష్టమేమోగానీ రాగలతకి ఓ పెద్ద హీరోకి అక్కగా వేసే వేషం దొరికింది. బస్. . సినిమా తర్వాత సినిమా. అన్నీ పెద్ద సినిమాలే. అదివరకు కంటే పదిరెట్లు ఎక్కువ రెమ్యునరేషన్. కోడంబాక్కంలో ఇల్లు కొనుక్కుంది. మళ్ళీ కారు కొనుక్కుంది.


తల్లితండ్రులు మళ్లీ చేరడానికి ప్రయత్నిస్తే, గూర్ఖాతో గేటు బయటనుంచే వెళ్ళగొట్టించింది. వెంకట్ కి మగపిల్లలు లేరు.
పెళ్ళి చేసుకుంటానని, కనీసం బిడ్డనైనా చూడనిమ్మని ఎన్నిసార్లు ఫోన్ చేసినా, బ్రతిమాలినా కనీసం కలవడానికి కూడా ఒప్పుకోను పొమ్మంది.

ఉజ్వలకి ఓ మంచి వ్యాపారవేత్తతో వివాహం జరిపించింది ఉత్తర. ఉజ్వల పెళ్లైన వారంలోనే భర్తతో పాటు అమెరికా వెళ్ళిపోతే ఉత్తరని తెచ్చుకుని తనతో బాటు ఉంచుకుంది రాగలత. ఆ తరువాత ఉత్తరే రాగలతకి తల్లీతండ్రి అయ్యింది.

 

కథ కంచికి. . . మనం ఇంటికి. 


కథ గనుక ఇలా ముగిస్తే అద్భుతంగా ఉండేదని నాకు అనిపిస్తుంది. కానీ కథని నడిపించే రైటర్నీ, డైరెక్టర్నీ నేను కాదు కదా! అందర్నీ నడిపించేది,దర్శకత్వం వహించేది ఆ పైవాడు. 

అసలు జరిగిందేమంటే. . . . .
రాగలత మగబిడ్డకి జన్మనిచ్చింది. అది తెలిసి వెంకట్ వెతుక్కుంటూ వచ్చాడు. బెంగళూరులోనే ఓ అపార్ట్ మెంట్ ని అద్దెకు తీసుకుని అక్కడ పెట్టాడు.


రాగలతకి ఓ పేద్ద హీరో సినిమాలో అక్క వేషం వచ్చిన మాట నిజమే. పిచ్చిగా డబ్బు సంపాదించిన మాటా నిజమే. కానీ వెంకట్ సినిమాలన్నీఫ్లాపులవడంతో అతన్ని నిలబెట్టడానికి సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టి సినిమా తీయించింది. అది బిగ్గెస్ట్ ఫ్లాప్ ఆఫ్ ఆల్ టైం.


“వదిలిపోయిన దరిద్రాన్ని నెత్తికెక్కించుకున్నావు, ఫ్లాపులు కాక సక్సెస్ లు వస్తాయా? ?”అని సినీజనం సెంటిమెంట్ మత్తుని ఎక్కించారు.


“సారీ! ఇక్కడికి వస్తే నా భార్య సూసైయిడ్ చేసుకుంటానంది. ఇక రాలేను. “అని నిర్మొహమాటంగా చెప్పి సీన్లోంచి తప్పుకున్నాడు వెంకట్.
“అప్పుడైతే నటివి కనుక వేషాలిచ్చాం, ఇప్పుడు నిర్మాతవి, నిర్మాతకి వేషాలించ్చేంత వాళ్ళం కాదు. “అని నిర్మాతలూ తప్పుకొంటుంటే బిత్తరపోయింది రాగలత.


కారూ, ఇల్లూ వచ్చినవి వచ్చినట్టే పోయాయి. “పిల్లాడ్ని కావాలంటే నేను పెంచుకుంటాను. నేను చెయ్యగలిగేది అంతే! “అన్నది ఉజ్వల. తనకి గర్భసంచీ ప్రాబ్లం. అందువల్ల తమ ఇంట్లోనే పుట్టిన రాగలత బిడ్డని సశాస్త్రీయంగానే దత్తత తీసుకున్నది ఉజ్వల. 


మరి, ప్రస్తుతం రాగలత కథ? ప్రొడక్షన్ మానేసి విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రొడ్యూసర్ కి ' మూడో ' భార్యగా సెటిలైంది. 

కారణాలు :
1. మానసిక ఇన్ సెక్యూరిటీ
2. ఆర్థిక ఇన్ సెక్యూరిటీ
3. సామాజిక ఇన్ సెక్యూరిటీ

అభద్రత!! అన్నిరకాలుగా !!! ఇంకేం చెప్పేదీ!

మళ్ళీ కలుద్దాం
మీ...

భువనచంద్ర



 

bottom of page