top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

మధురవాణి ప్రత్యేకం - భువనోల్లాసం

మా.గ్రే.బురా.బుస్.జా…

భువనచంద్ర

“ఇక నేనీ ఇంట్లో వుండను.. వుండనంటే వుండను. ఛీ.. ఇన్నేళ్లుగా మీ కోసం నానా చావులూ చచ్చిచచ్చి, మిమ్మల్ని పోషించి కొవ్వొత్తి కరిగినట్టు కరిగిపోయా. ఇదా.. ఇదా మీరు నాకిచ్చే మర్యాద? ఛీ..” చూస్తున్న న్యూస్ ఛానల్ ని ఠక్కున మార్చి స్పోర్ట్స్ ఛానల్ పెట్టుకుంటారా?” ఛర్రున లేచి భుజాన వేసుకున్న టర్కీ టవల్ని పిచ్చి కోపంతో దులిపాడు గజముఖలింగం.

దీక్షగా ఫేస్ బుక్ చూసుకుంటున్న మంగతాయారు ఓ క్షణం చేస్తున్న పనిని ఆపి నిర్లిప్తంగా గజముఖలింగాన్ని గమనించి మళ్లీ తన ఫేస్‌బుక్ రీడింగ్ లో పడిపోయింది.

“ఏమిటీ నువ్వు చేసింది? టిఫిన్ మింగి ఆఫీసుకు పోయి అక్కడ పూటుగా నిద్రపోవడం తప్ప అసలు ఏం చదువుతున్నామో, మాకేం కావాలో ఏనాడైనా పట్టించుకున్నావా? ఏదో ఫీజులు కట్టావు.. కన్నావు గనక. ఆ పని ఏ సుబ్బారావైనా చేస్తాడు. దానికోసం నీకు మర్యాదల్ని ఒలకబొయ్యాలా? పగలూ రాత్రీ లేకుండా ఆ కంప్యూటర్ ముందు కూర్చుని, బుర్ర తిరిగేలా అలిసిపోయి, కాస్తంత రిలీఫ్ కోసం ఛానల్ మారిస్తే ఇంత కోపమూ శివతాండవమూనా?” ఛర్రున లేచి అన్నాడు నిర్ణయరావు. అతను గజముఖలింగం కుమారుడు.

పక్షపాతం లేకుండా ఓ అరక్షణం కొడుకుని కూడా నిర్లిప్తంగా చూసి మళ్లీ తన ఫేస్ బుక్కులో మునిగిపోయింది మంగతాయారు.

“ఛీ.. ఛీ.. పెద్దవాడ్ననే ఇంగితం కూడా లేకుండా మాట్లాడే మనుషుల మధ్య ఎందుకూ నేనుండటం” టవల్ విసిరేసి, ఆ వూపులోనే పేంటూ షర్టూ వేసుకుని చరచరా బయటకొచ్చాడు గజముఖలింగం. అయితే పర్సుని జేబులో పెట్టుకోవడం మాత్రం మరిచిపోలేదు.

 

ఎక్కడికెళ్లాలా అని ఆలోచించి, డైరెక్టుగా మిత్రుడు జలసూత్రం జ్ఞానేశ్వరరావు ఇంటి వైపు నడవడం మొదలెట్టాడు లింగం. ఆల్ మోస్టు సగం దూరం నడిచాక, “ఇదిగో గమ్మూ, ఇటు ఇక్కడ .. నీ కుడి వైపు సందులో” అన్న కేక ‘కెవ్వు కేక’ లా వినపడింది. అదిరిపడి అటు చూశాడు - ఓ గుండ్రటి బంతి దొర్లుకుంటూ దొర్లుకుంటూ యమ వేగంగా వస్తోంది. కొంచెం దగ్గరికి రాగానే తెలిసింది ఆ వచ్చేది ఎవరో, ఆవిడ శ్రీమతి లక్ష్మీ పార్వతీశం. ఆవిడా, ఆవిడ భర్త పార్వతీశం, గజముఖలింగం ముగ్గురూ, చిన్నప్పటి నుంచీ పదో తరగతి వరకు కలిసే చదువుకున్నారు. అదీ, ఒకే స్కూలులో. ఆ తరవాత పెద్దవాళ్ళకి ట్రాన్స్ ఫర్ లు రావడంతో ఎవరి దారి వారిదైంది.

ఈ మధ్యనే పార్వతీశం గజముఖలింగం ఉండే వీధికి రెండు వీధుల అవతల ఇల్లు కొని సెటిలయ్యాడు.

“నువ్వా .. ఎండ వెలుగులో ముఖం సరిగ్గా కనిపించక ఎవరో అనుకున్నాను. దిక్కుమాలిన కళ్ళజోడు తెచ్చుకోవడం మరిచానేమో.. ఒకటే రిఫ్లెక్షన్. ఇంతకీ, ఇంత ఎండలో ఏం పని పెట్టుకున్నావ్?” అడిగాడు గ.ము.లిం.

“నాతో వస్తావా?” అన్నది ఓ స్వీట్ స్మైల్ ఇచ్చి లక్ష్మీ పార్వతీశం.

“ఎక్కడికి?” అయోమయంగా అడిగాడు లింగం.

“అదే మరి.. మాట్లాడకుండా నేను తీసికెళ్ళిన చోటుకి రావాలి. ఎక్కడికీ? ఎందుకూ? అని అడక్కూడదు” గోముగా అంది లక్ష్మి.

 ఎంతైనా చిన్ననాటి ఫ్రెండు. అదీగాక ఆ వయసులో ఉండే ‘క్రష్’ అంత తొందరగా మరపుకిరాదు కదా. ఎండ దంచేస్తోంది. ఎండ బాధ కరెక్ట్ గా తెలిసేది టోపీ లేని బట్టతల వాడికే గదా.

“ఆటోలో పోదాం. ఆలోచించి చెప్పు. అసలే ఆ పత్తిగాడు వుత్తి అనుమానాప్పీనుగు” అన్నాడు గజముఖలింగం.

“అది చిన్నప్పటి కథ. ఇప్పుడు మనిద్దరం లేచిపోయినా, హాయిగా యూట్యూబ్ లో మునుగుతాడే తప్ప, కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వడు” నవ్వి అన్నది లక్ష్మి, దారిలో పోతున్న ఆటోని ఆపుతూ.

“మీటర్ మీద యాభై రూప్పాల్” అన్నాడు ఆటో జానీ.

“ఓర్నీ! ఆశకు చిల్లులు పడా. మరీ అంత కలికాలమా?” గయ్యిమంది లక్ష్మి.

“మీటర్ మీద అరవయ్యి రూప్పాల్” నిర్వికారంగా అన్నాడు జానీ.

“హూ.. అందుకే ఇవాళా రేపూ ఎవడూ ఆటోల మొఖం చూడకుండా ఊబర్ లు ఓలాలు ఎక్కుతున్నారు. ఆఖరిమాట చెప్పు” గదమాయించింది శ్రీమతి.లక్ష్మీ పార్వతీశం. గజముఖలింగం బుర్ర ఎండకి చెడ తిరిగిపోతుంది.

“ఏదో ఒకటి కానిద్దాం లచ్చిమీ. ఎండకి కళ్ళు తిరిగేట్టు ఉంది” గుసగుసగా లక్ష్మితో అన్నాడు గ.ము.లిం.

ఆటో జానీ ఆ మాట చక్కగా విని, “మీటర్ మీద వంద రూప్పాల్” అంటూ ఆటో స్టార్ట్ చేసి ఎదురుగా చూపాడు. అటుచూస్తే ఆటోవాడ్ని ఎవరో చేతులెత్తి పిలుస్తున్నారు.

“హూ” అరమైలు పొడుగు నిట్టూర్చి ఆటో ఎక్కింది లక్ష్మి. ఆటో పార్టులన్నీ కసకసలడాయి. తనూ ఎక్కి ఓ మూలగా సెటిలయ్యాడు గజముఖం.. వైస్ వెర్సా. లక్ష్మికి గుండె మండుతూనే ఉంది. ఆటో జానీ గాడు చెప్పిన రేటుకి.

“యాడికి బోవాల?” అడిగాడు జానీ.

“టికో టాకు స్టూడియో” అన్నది లక్ష్మీ ముభావంగా.

“గా బంజారా హిల్స్ గోడౌనా?” గేర్ లో వేసి అన్నాడు ఆటో చక్రవర్తి.

లక్ష్మీ మాట్లాడలేదు. “సర్లే..” తుర్రున పోనిచ్చాడు ఆటోవాలా.

“స్టూడియోకా?” అయోమయంగా అడిగాడు గజముఖం.

“అవును” ఆటో జానీ మీదొచ్చిన కోపాన్ని మరచిపోయి ఉత్సాహంగా అన్నది లక్ష్మీ పార్వతీశం.

“ఇప్పుడు యాక్టింగా?” షాక్ తిని అన్నాడు లింగం.

“ఛీ, అదేం కాదు, ఆ స్టూడియోలో ఓ కొత్త రెసిపీ వొండి చూపించాలి” ఉత్సాహంగా అన్నది లక్ష్మి.

“నువ్వా? వంటా? అదెప్పుడు నేర్చుకున్నావు? పెళ్ళైనదగ్గర్నుంచి తానే చెయ్యి కాల్చుకుంటున్నానని పత్తిగాడు చెప్పాడే. ఇప్పుడు ఇదేంటి?”

“హ.. హ.. మీ పత్తిగాడి వంటంత సుత్తి వంట ఈ లోకంలో ఉండదు. ఆ దిక్కుమాలిన వంట నేను కాబట్టి తిని పడి ఉంటున్నానుగానీ, మరొకరయితే ఎప్పుడో విడాకులిచ్చి పోయేది” అన్నది లక్ష్మి .

“మరి?” గుడ్లు వెళ్ళబెట్టి అన్నాడు లింగం.

“అదే మన స్పెషాలిటీ” కళ్లెగరేసి నవ్వింది లక్ష్మి.

“ఇదిగో. గోడౌన్ కి తోలుకొచ్చిన, నా మీటర్ మీద నూట ఇరవై పెట్టండ్రి సీరియస్ గా అన్నాడు ఆటో జానీ.

“అదేంటీ? మీటర్ మీద వందే కదా అన్నదీ?” ఆశ్చర్యంగా అడిగాడు గజముఖలింగం.

“అది యీ మా తల్లి వంట చేసుడు కొస్తాందని తేలీకముందు. ఇట్లాంటావిడ చేసిన భాడాఖాప్ వంటదినే మా అమ్మ ఠక్కున సచ్చింది. మర్యాదగా నూటయాబై ఇవ్వు, లేకపోతే బలవంతంగా ఇద్దర్నీ పాతబస్తీకెళ్ళి దింపుతా.” కౄరంగా చూస్తూ అన్నాడు జానీ. మాట్లాడకుండా ముడుపు సమర్పించాడు.

“హలో.. వ్యూయర్స్, వెల్ కం. ఇప్పుడు మనం వ్యూ చేయబోయేది మిస్సెస్.లక్ష్మీ పార్వతీశంగారు కుకు చెయ్యబోయే న్యూ రెసిపీ. హియర్ ఐ ప్రెసెంట్ లక్ష్మీగారు, ది న్యూ చెఫ్” కాళ్ళూ నడుమూ రకరకాలుగా తిప్పుతూ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అరిచింది యాంకర్.

స్టూడియో వాళ్లు ‘అరేంజ్’ చేసిన ప్రేక్షకులందరూ వీరలెవల్లో చప్పట్లు చరిచారు. వాళ్లతో పాటు కూర్చున్న గజముఖలింగానికి కూడా చప్పట్లు చరవక తప్పలేదు. సైడ్ డోర్ లో నించి సెట్ మీదికి ఎంటరైయింది లక్ష్మి. ‘తాలియా’ (చప్పట్లు) అని మళ్ళీ భీకరంగా అరిచింది యాంకర్.

“ఏం జరిగిందని చప్పట్లు కొట్టాలీ?” గుసగుసగానూ కోపంగానూ అవతల ఉన్నవాడ్ని అడిగాడు గజముఖలింగం పక్కన కూర్చున్న పెద్దాయన.

“ఆ దొబ్బుడాయి కాకపోతే ఏమిటా ప్రశ్న. వాళ్లు ఏం చేసినా చప్పట్లు కొట్టడానికేగదా మనకి డబ్బులిచ్చేదీ." నవ్వు చెదరకుండా కసిరింది పక్కావిడ.

“మిమ్మల్ని మీరే ఇంట్రడ్యూస్ చేస్తూ వుంటుంటే, భలే ఇంట్రెస్టింగా వుండును” పదహారు పళ్ళు ఇకిలించి అన్నది యాంకర్.

“అదేం భాషా?” నసిగాడు పక్కనున్న పెద్దాయన.

“ఆ పిల్లది పంజాబీది. ఆ మాత్రం తెలుగు మాట్లాడుతున్నందుకు సంతోషించు” కసిరింది పక్కావిడ.

“యా.. ఐ ఇంట్రడ్యూస్ మీ..” పళ్లికిలించింది లక్ష్మి.

“ఓసి దీని మొహం మండా. అసలింతకీ ఇది తెలుగు ప్రోగ్రామా? ఇంగ్లీష్ ప్రోగ్రామా? ఇంగ్లీష్ తెలుగు సంకరజాతి ప్రోగ్రామా?” విసుక్కుంటూ అన్నాడు పెద్దాయన.

“విసుగు మొహం పెట్టొద్దన్నానా. ఏడ్చేటప్పుడు కూడా నవ్వుతున్నట్టే మొహం పెట్టాలని చెప్పే తీసుకొచ్చారుగా” కసిరింది పక్కావిడ.

“మై నేమ్ ఈజ్ లక్ష్మీ పార్వతీశం. నేను హౌస్ వైఫ్ ని. మా హస్బెండ్ నా వంటకం అంటే పడి చచ్చిపోతారు. ఇన్ ఫ్యాక్ట్, ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి ఈ ప్రోగ్రాంకి పంపారు” వయ్యారం వలకబోస్తూ అంది లక్ష్మి.

“ఏమిటా తిప్పుకోవడం ఏ నడుమన్నా పట్టిందంటే అంబులెన్స్ లో ఎక్కించలేక మనం చావాలి” మళ్లీ విసుక్కున్నాడు పెద్దాయన.

“ఉష్.. నోరుతెరవద్దన్నానా” గట్టిగానే కసురుకుంది పక్కావిడ.

“ఇంట్లోనూ తెరవకూడదు, ఇక్కడా తెరవకూడదు. ఇక నోరు తెరిచేదెప్పుడు. చచ్చినప్పుడా?” కోపంగా అన్నాడు పెద్దాయన. ఆ కోపంలో చాలా దీనత్వం ఉందని గ్రహించాడు లింగం.

“ఇంతకీ మీరు ఏ డిష్ ప్రజెంట్ చేయబోతున్నారూ?” అడిగింది యాంకర్, విలాసంగా పెదాల్ని నాలుకతో తడుపుకుంటూ.

“అదేమిటీ వంటే మొదలు కాలేదుగా?” ఆశ్చర్యంగా అన్నాడు ముందు సీట్లో కూర్చున్న పేయిడ్ ఆడియన్.

“టేస్టు చెయ్యడానికి అంత ఆత్రంగా ఉన్నానని ఆ భంగిమకి అర్థం” విడమర్చి చెప్పింది మరో సీనియర్ పేయిడ్ ఆడియన్.

“డిష్ పేరా.. సస్పెన్స్.. నేనెప్పుడూ వంట చేశాకే పేరు పెడతా. దట్ ఈజ్ మై స్పెషాలిటీ!” కళ్ళెగరేసి నవ్వింది లక్ష్మీపార్వతీశం.

“ఓహ్.. గ్రేట్.. స్టార్ట్ చేద్దామా?” ఉత్సాహంగా అన్నది యాంకర్.

“యా, ముందుగా నిన్నరుబ్బి ఫ్రిజ్ లో ఉంచిన మల్టీ గ్రేయిన్ పిండిని బయటికి తీద్దాం” వయ్యారంగా నడిచి ఫ్రిజ్ ఓపెన్ చేసింది. అంతే… ఓ పది ఎలకలు గంతులేస్తూ ప్రేక్షకుల మీదనించీ, కెమెరామేన్ నెత్తి మీదనించీ, యాంకర్ నడుం మీదనించీ దూకాతూ క్లోజ్ డ్ గేట్ల వైపు పరుగుతీశాయి. అందరూ ఠక్కున ముక్కులు మూసుకుని హాహాకారాలు చేస్తూ కకావికలయ్యారు. స్టూడియో మొత్తం చెడకంపు నిండిపోయింది.

“ఓపెన్ ఆల్ ద డోర్స్.. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వెయ్యండి” పరుగులు పెడుతూ అరిచాడు కెమెరామెన్. అతన్ని ఫాలో అయ్యారు స్టూడియో స్టాఫ్.

అరగంట తరవాత మళ్లీ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. లక్ష్మీ కొంచెం తేరుకొని, “సారీ.. నిన్న రిహార్సల్స్ కి వచ్చి రుబ్బిన పిండిని ఫ్రిజ్ లో పెట్టి వెళ్లిపోవడంవల్లా, రాత్రి ఫ్రిజ్ స్విచ్ ఆఫ్ లో ఉండడంవల్లా పిండి కొంచెం పులిసినట్టుంది. అయినా ఏం పర్లేదు. పిండి ఎంత పులిస్తే యీ డిష్ అంత బాగుంటుంది” అన్నది.

“కొంచెం పులిసిందా.. దీని మొహంమండా, బకాసురుడు బాంబు వేసినంత ఘోరంగా చచ్చింది.” ముక్కుని సాగదీసు తీసుకుంటూ అన్నాడు పక్కాయన. ఏదో అనబోయి, అంటే ఆ కంపు ఎక్కడ నోట్లోకి పోతుందో అని భయపడి కళ్ళు ఉరిమింది పక్కావిడ.

“ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగిద్దాం.” వెలిగించింది లక్ష్మి. “వావ్” అరిచింది యాంకర్. “వావ్ అని అరవడానికి ఏముందీ? స్టవ్ వెలిగించింది అంతేగా?” అన్నాడు చికాగ్గా పక్కాయన.

“చెఫ్ ని ఎంకరేజ్ చేయడం యాంకర్ బాధ్యత” కంపుని మరిచి అన్నది పక్కావిడ.

“ఇప్పుడు ఓ బౌల్ తీసుకొని, అందులో నిన్న నానబెట్టి రుబ్బి ఉంచుకున్న పిండిని ఇలా వేసుకోవాలి” తియ్యగానే మళ్లీ హాహాకారాలు. సద్దుమణగడానికి సమయం పట్టింది.

“బౌల్ అని ఏడ్చేబదులు గిన్నె అని ఏడవచ్చుకదా?” బాహాటంగానే అన్నాడు పెద్దాయన.

“అప్పుడది తెలుగు ప్రోగ్రాం ఎందుకవుతుంది?” కోపంగా అన్నది పక్కావిడ.

“ఓకే. ఓకే. అన్నట్టు ఆ పిండిలో ఏ ఏ గ్రేయిన్స్ వేశారు?” అడిగింది యాంకర్ కొంచెం దూరంలో నిలబడి.

“గుడ్ క్వశ్చన్. కందిపప్పు, శనగపప్పూ, పెసరపప్పూ, జీడిపప్పూ, బాదంపప్పూ, చారపప్పూ, గోధుమలూ, బియ్యం, సగ్గుబియ్యం, బార్లీ అన్నీ సమపాళ్ళలో వేసి రుబ్బిఉంచాను. అన్నట్టు రాగులూ, కొర్రలూ, క్వినోవా కూడా కలిపాననుకోండి. ఇటు చూడండి, పిండి ఎంత ముద్దుగా బురబురలాడుతుందో!” పొంగిపోతూ అన్నది లక్ష్మి.

“ఓ పక్క ముక్కు పగిలిపోతున్నా, అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినందుకు యీవిడకి ఏకంగా ఆస్కార్ ఎవార్డివ్వాలి” ముందువరుసలో ఉన్న పేయిడ్ ఆడియన్ మెచ్చుకుంటూ అన్నాడు.

“ఇప్పుడు దిస్ గ్రీన్ చిల్లీస్ నీ, దట్ గ్రీన్ క్యాప్సికంనీ, ఆ రెడ్ క్యాప్సికంనీ, కొంచెం అల్లాన్నీ, ఆ పక్కనున్న క్యారెట్ నీ, కేబేజీనీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇందులో పడేసి చక్కగా కలుపుతూ కొంచెం హల్ది, అంటే పసుపు అన్నమాట, ఇందులోవేసి ఇలా కలపాలి” అన్నిట్నీ కలుపుతూ అంది లక్ష్మి.

“ఆ పప్పుల పేర్లు కూడా ఇంగ్లీషులోనే ఏడవచ్చుగా” చికాగ్గా అన్నాడు పెద్దాయన. “తెలీదేమో” అన్నాడు పక్కాయన.

“ఇదిగో ఇప్పుడే ఇందులో ఫ్రెష్ గా కట్ చేసుకున్న పాలక్, కొంచెం పన్నీర్, కొంచెం బచ్చలికూరా, చుక్కకూరా, తోటకూరా, మెంతికూరా కూడా యాడ్ చెయాలన్నమాట. వాటిని గిన్నెలో పడేస్తూ అన్నది లక్ష్మి.

“ఆవుపేడ కలపలేదు నయం” అన్నాడు పెద్దాయన.

“ఛీ” అంది పక్కావిడ.

“అన్నిట్నీ పడేసి ఒక్క తిప్పుతిప్పింది లక్ష్మి. మళ్ళీ హాహాకారాలు. ఒకరిద్దరు వాంతి చేసుకోబోతూ ఆఖరి క్షణంలో ఆగారు. అప్పటిదాకా ఉగ్గబట్టుకొని చూస్తూన్న యాంకర్ స్టూడియో టాప్ లేచేట్టు తుమ్మింది. ఆ ఊపుకి వెలుగుతున్న పొయ్యి (గ్యాస్ పొయ్యి) ఆరింది. ఆ వెనుకనే ‘హ్యాచ్చ్ హ్యాచ్చ్’మంటూ పెయిడ్ ప్రేక్షకుల, సాంకేతిక నిపుణుల తుమ్ములతో స్టూడియో దద్దరిల్లింది. తుమ్మని ఆడబడుచు ఒక లక్ష్మీ మాత్రమే.

 “సారీ, కట్ చేసి పేస్టు చేస్తాలేండి ఎడిటింగ్ లో. మీరు తొందరగా వంటకాన్ని కానివ్వండి” ఏడుపు గొంతుతో అన్నాడు కెమెరామెన్. అతనే డైరెక్టర్ కూడా.

“ఇప్పుడు ఓ పెద్ద భాండి పెట్టి దాన్లో ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని పకోడీల్లా వేయించుకోవాలి, అంటే ‘ఫ్రై’ చేయాలన్నమాట”

“ఉప్పూ కారం తగలెట్టవా?” గుసగుసగానే అరిచాడు పక్కాయన.

“సప్త సముద్రాల్లోని ఉప్పునంతా పోసినా ఆ పులిసి చచ్చిన పిండికి సరిపోదు. మాట్లాడకుండా చూడు” అరిచింది పక్కావిడ. ఏం చేయలేక మౌనంగా ఉన్నాడు గజముఖలింగం. ఎంతైనా క్లాస్ మేట్ కదా. “నౌ ఆయిల్ హీటెక్కింది. ఫస్టు పకోడా వేస్తున్నానోచ్” ఉత్సాహంగా అంటూ పిండిని చేత్తో చిన్నముద్దగా తీసి భాండిలో వేసింది లక్ష్మి.

ఒక్కసారి వెయ్యి డేంజర్ వాలాలూ, వెయ్యి చిచ్చుబుడ్లూ, ఓ వెయ్యిన్నర కాకర పూవ్వత్తులు ఒకేసారి చిటపటా పేలిన శబ్దం. యాంకర్ ఎగిరి దూకింది. మొత్తానికి ఏదో విధంగా సాయంత్రానికి షూటింగ్ పూర్తి. చివర్లో “దీపికగారు, నా డిష్ ఎలా ఉంది” తాను తయారించిన ‘డిష్’ ని చిన్న పళ్లెంనిండా పెట్టి.. “దీని పేరు చెప్పలేదు కదూ.. “మా.గ్రే.బురా.బుస్.జా…” అన్నది లక్ష్మి. “అంటే” ప్లేట్ లోని వస్తువుని ముట్టుకోకుండా కెమెరామెన్ వంక అర్థవంతంగా చూస్తూ అన్నది యాంకర్ దీపిక.

“చూశారా మీరు కనుక్కోలేకపోయారు. మాగ్రే అంటే మల్టీ గ్రైన్.. దాన్ని నానబెట్టి గ్రైండ్ చేసే బురబురలాడుతోందిగనక ‘బుర’ అన్న పదం చేర్చాను. ఆ తర్వాత, నూనెలో పడేస్తే బుస్సుమని పొంగుతోందిగనక ‘బుస్’ అన్నాను, గర్వంగా నవ్వుతూ అన్నది లక్ష్మి. “మరి ‘జా’ అంటే?” అడిగింది యాంకర్ దీపిక నములుతున్నట్టు యాక్ట్ చేస్తూ.

“జాస్ కి, అంటే దవడలకి మాంఛి బలాన్నిస్తుందిగనక చివర ‘జా’ అని తగిలించాను ఉత్సాహంగా అన్నది లక్ష్మి.

“ముందు మన ప్రేక్షకుల ఒపీనియన్ తీసుకుందాం. హలో మై డియర్ వ్యూయర్స్, ఎలా ఉందీ న్యూ డిష్ కాల్డ్ “మా.గ్రే.బురా.బుస్.జా…” అన్నది యాంకర్.

“టేస్టు ఎలా ఉందో చెప్పలేదేం” అన్న లక్ష్మి ప్రశ్నని దాటవేస్తూ. ఆ ప్లేట్ ని ప్రేక్షకుల ముందుకి తెచ్చింది లక్ష్మి.

“తిన్నట్టు నటించండి. నోట్లో పెట్టుకుంటే, పట్టుకుపోవడానికి యమదూతలు కూడా రారు” పక్కావిడ పెద్దాయనతో అన్నమాట గజముఖలింగానికి స్పష్టంగా వినిపించి, తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు.

 

***

“సారీ నాన్నా, పొద్దున్నే మిమ్మల్ని అనవసరంగా హార్ట్ చేశాను. మీ న్యూస్ ఛానల్ హాయిగా చూసుకోండి” అని రిమోట్ ఇచ్చిన నిర్ణయరావు వంక నిర్లిప్తంగా చూశాడు లింగం. మధ్యాహ్నం కంపు అతని బట్టలకేకాక, ఒంటికి కూడా పట్టుకుందాన్న అనుమానంతో అప్పటికీ మూడుసార్లు వాంతులు చేసుకున్నాడు.

 

                          ***                       

 

సరిగ్గా వారం తర్వాత, “హలో.. వ్యూయర్స్, రేపు ఉదయం 11 గం.కి శ్రీమతి.లక్ష్మీ పార్వతీశంగారి వంటకాన్ని చూసి మీ అభిప్రాయం మాతో పంచుకోవడమే కాక, మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. మా ‘వంటా తంటా’ ప్రోగ్రామ్స్ ఎప్పుడూ మీకో కొత్త వంటకాన్ని అందిస్తూనే ఉంటాయి” యాడ్ లో అంటుంది యాంకర్ దీపిక

 

***

మరో రోజు వార్త: ‘వంటా తంటా’ ప్రోగ్రాంలో టెలివైజ్ చేసిన శ్రీమతి.లక్ష్మీ పార్వతీశంగారి స్పెషల్ డిష్ “మా.గ్రే.బురా.బుస్.జా…”కి నగరంలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లందరూ ప్రత్యేక బహుమతి ప్రకటించారు. సదరు ప్రోగ్రాం ఎన్నిసార్లు రిపీట్ చేసినా, అన్నిసార్లూ వాళ్లే స్పాన్సర్ చేస్తామని ప్రత్యేక ప్రకటన ఇచ్చారు. ఠక్కున స్పృహ తప్పాడు లింగం.

PS. ‘చలం’గారి కథ ‘అట్ల పిండి’ జ్ఞాపకం వచ్చిందా? వస్తే ధన్యుణ్ణి.

 

మీ

భువనచంద్ర

bottom of page