MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
భయం
రాధికా నోరి
"క్షమించాలి, మీరు ఏమీ అనుకోకపోతే మీ సీటు నాతో మార్చుకోవటానికి మీకేమన్నా అభ్యంతరమా?" తన చేతిలోవున్న బేగ్ ని సీటుపై వున్న అరలో సద్దుతున్న అతను తియ్యగా వినిపించిన అ గొంతు విని ఆ మాటలు వినిపించిన వైపుకి చూసాడు. తన పక్క సీటులోని అమ్మాయి ఎంతో సంకోచంగా అతనివైపు చూస్తూ అడుగుతోంది.
" అబ్బే, ఏం లేదు, తప్పకుండా, రండి" అంటూ ఆ అబ్బాయి అటు వైపు సీటులో కూర్చున్నాడు. కిటికీ దగ్గర ఇంత మంచి సీటు వద్దని అంటోంది, ఈ అమ్మాయి కేమన్నా పిచ్చా అనుకున్నాడు మనసులో.
" కిటికీ దగ్గర సీటు వద్దని అంటున్నారు. ఏదన్నా ప్రోబ్లమా?" అని అడిగాడు ఇంక వుండలేక.
"ప్రోబ్లం ఏమీ లేదు. నాకిదే మొదటిసారి విమాన ప్రయాణం చెయ్యటం. అంత ఎత్తున ఎగురుతూ కిటికీ లోంచి బయటకు చూడాలంటే నాకు భయం" అంది ఆ అమ్మాయి మెల్లిగా.
అతను వింతగా ఆ అమ్మాయి వైపు చూసాడు. "ఇంత రాత్రి చీకటిలో బయట ఏం కనిపిస్తుంది?" అన్నాడు అప్రయత్నంగా.
"ఇప్పుడు రాత్రి కాబట్టి ఏమీ కనిపించదు. కానీ రేపు ఉదయం అవగానే వెలుతురు వస్తుంది కదా!" అంది ఆ అమ్మాయి.
ఇంతలో విమానం బయలుదేరింది. పక్కనున్న అతన్ని తగలకుండా తన సీటులో ఒక పక్కగా ఒదిగి కూర్చుంది ఆ అమ్మాయి. సీటులో సద్దుకుని కూర్చుని ఆ అమ్మాయి వైపు పరిశీలనగా చూసాడు అతను. పసుపు రాసుకున్నట్లుగా ఉన్నమేని ఛాయ, కళకళలాడే ముఖ కవళికలు, నల్లటి నిగనిగలాడే బారెడు జడ, సన్నజాజి లాంటి సన్నని నాజూకైన శరీర లావణ్యం, ఎంతో అందంగా వుంది ఆ అమ్మాయి.
"మీ పేరేమిటి? అమెరికా లో ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగాడు అతను.
"నా పేరు అభయ. అట్లాంటా కి వెళ్తున్నాను" అంది ఆమె మెల్లిగా.
"ఇదే మొదటిసారా అమెరికా కి వెళ్ళటం?" అని అడిగాడు అతను.
"అవునండి. ఎనిమిది నెలల క్రితం మా పెళ్ళయింది. పెళ్ళయిన ఒక వారం రోజుల తర్వాత మావారు అమెరికాకి వెళ్ళిపోయారు. నాకు వీసా రావటానికి, ఇదుగో, ఇన్ని నెలలు పట్టింది. ఇప్పుడు వెళ్తున్నాను" అంది ఆ అమ్మాయి కళ్ళల్లో కొత్త కోరికలని, కోటి కలలని నింపుకుంటూ.
"మరి మీ పేరేమిటి? ఎక్కడిదాకా వెళ్తున్నారు?" అంది మళ్లీ.
"నా పేరు సుధీర్. ఇక్కడే హైదరాబాదులో ఒక సాఫ్ట్ వేర్ కంపెని లో పని చేస్తున్నాను. మా తల్లితండ్రులు అట్లాంటా లో వుంటారు. వాళ్ళు స్పాన్సర్ చేస్తే నాకు గ్రీన్ కార్డు వచ్చింది. అది తీసుకోవటానికి ఇప్పుడు వెళ్తున్నాను" అన్నాడు అతను.
"పేరు అభయ అంటున్నారు. మరి అంత భయం దేనికి?" అన్నాడు అతను మళ్లీ కొంచెం అల్లరిగా.
అభయ ఒక్క సెకను పాటు అతని వైపు చురుకుగా చూసింది. "అవకాశం కనుక వస్తే మీరెంత ధీరులో నేను కూడా చూస్తాను లెండి సుధీర్ గారు" అంది చటుక్కున అతని మాటకి సరైన సమాధానం చెప్తూ.
సుధీర్ మెల్లగా నవ్వాడు. "సారీ, మీకు కోపం తెప్పించాలని నా ఉద్దేశం కాదు. కానీ మీకు తెలుసా? చాలామంది భయం లో కూడా ఆనందం పొందుతారు. అందుకే దయ్యాలు, భూతాలు, ఆత్మలు లాంటివి ఉన్న సినిమాలు హిట్ అవుతూ వుంటాయి. ఆఖరికి చిన్న పిల్లలు కూడా జూ లో అపాయకరమైన జంతువులని చూసి భయపడుతూనే ఆనందిస్తూ వుంటారు" అన్నాడు. అభయ ఏమీ మాట్లాడక పోవటంతో అనవసరంగా వాగుతున్నానేమో అనుకుంటూ మౌనం వహించాడు. తోటి ప్రయాణీకులలో చాలామంది నిద్ర పోతున్నారు. అతనికి కూడా నిద్ర పోవాలని వుంది. కానీ ఏవేవో ఆలోచనలు ముసురుకుంటున్నాయి. అతనికి ఇప్పుడు అసలు అమెరికాకి వెళ్ళాలని లేదు. అక్కడ ఉద్యోగాల పరిస్థితి ఇప్పుడేమి బాగాలేదుట. అంతే కాకుండా స్వీటీ తో ఇక్కడ తనకున్న రంగుల జీవితాన్ని ఇక్కడే విడిచి అంత దూరం వెళ్లి మళ్లీ జీవితాన్ని మొదలెట్టడానికి సిద్ధమవటం అంత తెలివైన పనేనా? ఆ వెధవ గ్రీన్ కార్డు ఇప్పుడే రావాలా? ఇలా ఆలోచిస్తూ విసుక్కున్నాడు.
పక్కకి తిరిగి చూస్తే అభయ నిద్ర పోతూ కనిపించింది. అతనికి ఒక్కసారి స్వీటీ గుర్తొచ్చింది. ఒక్క క్షణం పాటు అభయతో స్వీటీని పోల్చుకున్నాడు.
ముట్టుకుంటే మాసిపోయే రంగుతో, అమాయకత్వం ఉట్టిపడే ముఖ కవళికల తో ఉన్న అభయ ఒక వైపు, జీన్సు, టీషర్టు లో చకచకా తిరుగుతూ, కామా, ఫుల్ స్టాప్ లు లేకుండా గలగలా మాట్లాడేస్తూ, దబాయించి తనమీద జబర్దస్తి చేసే తన స్వీటీ ఇంకో వైపు కళ్ళెదురుగా కనిపించారు అతనికి. ఈ ఇద్దరికీ అసలు పోలికే లేదు అనుకున్నాడు. స్వీటీ గుర్తు రాగానే ఒక్కసారి మనసు బాధగా మూలిగింది. ఆ వెధవ గ్రీన్ కార్డు ఏదో తీసేసుకున్నాననిపించి మళ్లీ వెంటనే వెనక్కి వచ్చేయాలి. స్వీటీ తనకోసం ఎదురు చూస్తూ వుంటుంది. మెల్లిగా సరైన అదను చూసుకుని అమ్మ నాన్నలకు స్వీటీ సంగతి చెప్పేయాలి. ఇలా ఆలోచిస్తూ సరిగ్గా నిద్ర పోలేక పోయాడు సుధీర్.
గంటలు గడిచిపోయాయి. ఆదమరచి నిద్ర పోతున్న అభయ, కలత నిద్ర పోతున్న సుధీర్ వెనకనించి ఎవరో తోసినట్లుగా అనిపించటంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచారు. ఇద్దరి తలలు ముందు సీట్లకి ఎవరో బలంగా కొట్టినట్లు విసురుగా తాకాయి. అసలేమయిందో తెలిసేలోపు తోటి ప్రయాణికుల దగ్గర నుండి కూడా ఏదో అలజడి మొదలయింది. ఇంతలో విమానంలో టర్బులెన్స్ బాగా ఎక్కువగా వుందని, అందరు సీటు బెల్ట్ పెట్టుకోవాలని పెద్దగా అనౌన్సమెంట్ వినిపించింది.
"నేను బెల్ట్ పెట్టుకునేవున్నాను. అయినా ముందుకి తూలాను" అంది అభయ మెల్లిగా నుదుటి మీద దెబ్బ తగిలిన చోట అరచేతితో రుద్దుకుంటూ. ఆమెకు నిద్ర చాలా వరకు మెలకువ వచ్చేసింది. సుధీర్ కి కూడా నుదుటి మీద మంటగా వుంది. అప్రయత్నంగా కిటికీ తలుపు తెరచి బయటికి చూసాడు. లోకల్ టైం లో తెల్లవారుఝాము అయివుంటుంది బహుశా. కొంచెం కొంచెం గా వెలుతురు వస్తోంది. ఇద్దరూ పక్కకి, వెనక్కి తిరిగి చూసారు తోటి ప్రయాణికుల రియాక్షన్ ఎలా వుందో చూద్దామని. ఇంచుమించు అందరు నిద్రలో వున్నారు. ఈ సంఘటన వలన అందరికీ హఠాత్తుగా మెలకువ వచ్చేసింది.
సుధీర్ కిటికీ తలుపు మూసేసాడు. మెల్లిగా మళ్లీ నిద్ర పోదామని కళ్ళు మూసుకోబోయిన అభయ మళ్లీ ఎవరో తోసినట్లుగా గభాల్న ముందుకి పడింది. నుదుటి మీద ఇందాక దెబ్బ తగిలిన చోటే మళ్లీ ఇంకో దెబ్బ తగిలింది. 'అబ్బా' అన్న మాట ఆమె నోటి వెంట అప్రయత్నంగా బయటికి వచ్చింది. సుధీర్ తల కూడా సరిగ్గా అలాగే ముందు సీటు కి కొట్టుకుంది. అతనికి కూడా బాగా దెబ్బ తగిలింది. ఈసారి ప్రయాణికులలో అలజడి బాగా తెలుస్తోంది. సీటు బెల్ట్ పెట్టుకోవాలని, ఎవరూ సీటు లోంచి కదలవద్దని మళ్లీ ఇంకో అనౌన్సమెంట్ వినిపించింది. సుధీర్ కి తలంతా దిమ్ముగా వుంది. అసలే రాత్రంతా సరిగ్గా నిద్ర లేదు. మనసులో ఏదో అశాంతి. దానికి తోడు ఇప్పుడు తలకి తగికిన ఈ దెబ్బలు. అభయకి కూడా నుదుటి మీద చాలా నెప్పిగా వుంది. ఏదో తమాషాగా అనిపిస్తోంది అని నుదురుని తడిమి చూసుకుంటే పెద్ద బొప్పి తగిలింది చేతికి. సుధీర్, అభయ అనుకోకుండా ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. ఇంతలో ఏదో అయింది. ఏమయిందో తెలుసుకునే లోపు విమానం మొత్తం ఒక వైపుకి ఒరిగినట్లయింది. లోపల కూర్చున్నవారందరు ఒక వైపుకి అప్రయత్నంగా ఒరిగిపోయారు. దీనితో అందరికి పూర్తిగా మెలకువ వచ్చేసింది. చంటి పిల్లలు నిద్రలో లేచి తిక్కగా ఏడవటం మొదలెట్టారు. అంతవరకు నిద్రలో తూగుతున్న పెద్దవాళ్లు అందరికీ కూడా అప్పుడు మాత్రం పూర్తిగా మెలకువ వచ్చేసింది. అసలేమయిందో అందరు ఆకళింపు చేసుకునే లోపు విమానం మళ్లీ ఇంకో వైపుకి ఒరిగింది. కొంచెంగా కాదు, పూర్తిగా ఒరగటంతో ప్రయాణికులందరూ భయంతో హాహాకారాలు చేసారు. అభయకి చాలా భయం వేసింది. ఈ హడావిడిలో ఎప్పుడు పట్టుకుందో తెలీదు కానీ సుధీర్ చేతిని తనకు తెలీకుండానే గట్టిగా పట్టుకుంది.
అంతదాకా సుధీర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ విమానం రెండోసారి ఒరిగినప్పటి నుండి అతనికి కూడా మనసులో ఏమూలో ఏదో భయం లాంటిది మొదలైంది. ఏవేవో అనౌన్సమెంట్ లు వినిపిస్తున్నాయి. కానీ ఏదీ స్పష్టంగా అర్థమవటం లేదు. " బాత్రూం లోపల ఎవరో తలుపు ఎంతకీ తెరవటం లేదట" ముందు సీటు లో ఎవరో ఒకాయన అంటున్నాడు. వింటున్న అభయ కళ్ళు భయంతో ఇంకా పెద్దవయ్యాయి. సుధీర్ కి ఇంకా దగ్గగా జరుగుతూ "ఈమధ్య తీవ్రవాదుల విధ్వంసక చర్యలు ప్రతి చోటా చాలా ఎక్కువయ్యాయి. ఎక్కడికేళ్ళాలన్నా చాలా భయం వేస్తోంది" అంది భయంతో గొంతు వణుకుతుంటే. ఎవరో బాత్రూం తలుపులు బాదుతున్నారట. అక్కడ నుండి పొగ లాంటిది ఏదో వస్తోందిట, ఎవరో అంటున్నారు. వింటున్న సుధీర్ కి ఒక్కసారి భయంతో ఒళ్లంతా జలదరించింది. అతను కూర్చున్న దగ్గర నుండి బాత్రుం చాలా దూరం. కనిపించదు. అందుకని అతను ఆ విషయం ఏమిటో సరిగ్గా కనుక్కుందామని అనుకుంటే వీలు కాకుండా ఒకటే గలభాగా వుంది. ప్రతివారు మాట్లాడేవారే! ఆ గందరగోళంలో ఎవరేమంటున్నారో కొంచెం కూడా స్పష్టంగా తెలియటం లేదు. విమానం ఒక పద్ధతిలో కాకుండా ఇష్టమొచ్చినట్లు ఒరిగిపోతోంది. ప్రయాణీకుల అరుపులు, పిల్లల ఏడుపులు, మధ్యమధ్యలో ఏవో అనౌన్సమెంట్, వాతావరణం చాలా గందరగోళంగా, భయానకంగా వుంది. అసలేమైందో అడుగుదామంటే చెప్పే నాధుడు కూడా లేడు. ఆ గలభాలో ఎయిర్ హోస్టెస్ లు కూడా కనిపించటం లేదు. ఇలా చాలాసేపే గడిచిపోయింది. విమానం అలా ఇష్టమొచ్చినట్లు అటు ఇటు ఒరిగిపోతూనే వుంది. అభయకి ఈ గండం లోంచి బతికి బయటపడతామన్న ఆశ ఇంక నశించింది. ఈ గలభాలో తనకు తెలీకుండానే రెండు సీట్ల మధ్య వున్న హేండు రెస్టు ని పైకి మడిచి సుధీర్ ని అంటుకుని కూర్చుంది. కళ్ళంబడి నీళ్లు కారుతున్నాయి. ఇన్నేళ్ళు తల్లితండ్రుల చాటున మొగ్గలాగా వుండి ఈ విశాల ప్రపంచం లోకి ఒంటరిగా ఇప్పుడే బయటకు వచ్చింది. ఆదిలోనే ఈ గడ్డు అడ్డంకు ఇలా వచ్చిపడింది. పెళ్ళయి పట్టుమని పది రోజులన్నాకాలేదు. వైవాహిక జీవితంలోని తీపి మధురిమలు ఇంకా రుచి చూడనేలేదు. భర్తతో జీవితాన్ని ఇంకా పూర్తిగా పంచుకోనే లేదు. ఇంతలోనే ఇలా అర్ధాంతరంగా జీవితమే అంతమవుతుందని కలలో కూడా అనుకోలేదు. తన ఈ అకాల మృత్యువుని అమ్మ, నాన్న తట్టుకోగలరా? తనకి ఇంకా బాగా తెలీదు కానీ తన భర్త మాత్రం తన కోసం ఎదురు చూసి చూసి అలిసిపోడూ! ఇలా ఆలోచిస్తున్న అభయకి ఒక్కసారి దుఖం వెల్లువలా వచ్చేసింది. సుధీర్ ని గట్టిగా పట్టుకుని పెద్దగా ఏడవటం మొదలెట్టింది "నాకు చావాలని లేదు సుధీర్ గారూ! ఇలా అకాల మృత్యువు వాత పడతానని ఎప్పుడూ ఊహించను కూడా లేదు" అంటూ.
సుధీర్ కి కూడా చాలా భయంగా వుంది. తన రెండు చేతులతో గట్టిగా అభయని పట్టుకున్నాక, తెలీకుండానే తనకి కూడా ఏదో ఓదార్పు లభిస్తోంది. ఆ సాంత్వనలో తనకు తెలీకుండానే తన మనసులోని భావాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. "అసలీ ప్రయాణం మొదటి నుండి నాకిష్టం లేదు అభయ గారు! ఇంక గ్రీన్ కార్డు విషయం కాబట్టి నేను తప్పించుకోలేకపోయాను. నాకు ఈ గ్రీన్ కార్డు తెప్పించటం కోసం మా అమ్మ, నాన్న ఒక ఏడాది నుండి మా పెద్దమ్మ, పెదనాన్న గార్ల ఇంట్లో వుంటున్నారు. ఎంత అయినవాళ్లైనా అక్కడ ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు. నేనిప్పుడు ఆ గ్రీన్ కార్డు ఏదో తీసేసుకుంటే వాళ్ళ బాధ్యత ఒకటి తీరిపోతుందని, ఇంక అప్పుడు ఇండియా తిరిగి వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు. అయినా నాకు మాత్రం ఏమిటో ఈ అమెరికా ప్రయాణం మొదటినుండి ఏమీ ఉత్సాహంగా లేనేలేదు. మంచి ఉద్యోగం వదలలేక సెలవు పెట్టి వెళ్తున్నాను. అయినా ప్రైవేట్ కంపెని లో నాకోసం ఎంత కాలమని ఎదురుచూస్తారు? పోనీ అమెరికాలోనన్నా ఏమన్నా మంచి ఉద్యోగం, ఇక్కడి కంటే మెరుగైనది ఏదన్నా దొరికే అవకాశం వుందేమో అనుకుంటే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల్లో ఆ ఆశ కొంచెం కూడా లేదు. వీటన్నిటినీ మించి స్వీటీ ని వదలి వెళ్ళాలంటే నాకసలు సుతరాము ఇష్టం లేదు. మంచి అదను చూసుకుని స్వీటీ సంగతి ఇంట్లోవాళ్లకి చెప్దామని అనుకుంటున్నాను. ఇంతలో ఈ ప్రయాణం రావటం నన్ను చాలా చికాకుపరిచింది. ఆ చికాకు, చిటపటల వలనే ఇలా అవుతోంది ఇప్పుడు. ప్రయాణానికి అంతరాయమే కాకుండా అసలు ప్రాణాలకే ముప్పు వచ్చింది. ఈ ఆపద లోంచి బయట పడినప్పుడు కదా మిగిలినవారి గురించి ఆలోచించేది. ఆ ఆశ కొంచెం కూడా లేదు నాకు. ఈ ప్రాణాలు ఈ గాలిలో కలిసిపోవాల్సిందే!” ఇలా అంటుంటే సుధీర్ కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి.
కాలం బరువుగా నడుస్తోంది. తోటి ప్రయాణీకుల పరిస్థితి కూడా అలాగే వుంది. బాత్రూం లోంచి పొగ రావటం అది నిజం కాదుట, ఎవరో అంటున్నారు. విమానం లోపల ఎక్కడన్నా ఏదన్నా బాంబులాంటిది వుందేమో వెదకండి అంటున్నారు ఎవరో. ఈ మాట విన్న ప్రయాణికుల్లో కలకలం మళ్లీ ఎక్కువైంది. సుధీర్ అభయ మీద నుండి తన చేతులని కొంచెం సడలించి చకచకా తన చూపులను పరిసరాల వైపు పరిచాడు. అనుమానాస్పదమైనది ఏదీ కనిపించలేదు. అభయ ఉలిక్కిపడుతూ సుధీర్ చేతిని గట్టిగా పట్టుకుంది. బాంబు మాట వినగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఏడుపు ఇంకా ఎక్కువైంది. "అయిపోయింది సుధీర్ గారూ! ఇవాల్టితో నా జీవితం ముగిసిపోతోంది. అలా గాలిలో కలిసిపోవాలని రాసివుంది కాబోలు. మావాళ్ళకి నా శరీరం కూడా దొరకదు. మా అమ్మ, నాన్న ఈ షాక్ కి తట్టుకోలేరు. వారి గుండె ఆగిపోతుందేమో! మావారిని చూస్తానన్న ఆనందం లో పాపం, నేను వారి సంగతే ఆలోచించలేదు. వారిని వదిలి దూరదేశాలు వెళ్తున్నానన్న బాధ నాలో ఏకోశానా కలగలేదు. ఎయిర్ పోర్ట్ లో మా అమ్మ నన్ను కౌగలించుకుని ఏడుస్తుంటే మా ఆయన దగ్గరకి వెళ్తున్నానని ఆనందించమని నీతులు కూడా చెప్పాను. అందుకే ఆ దేవుడు నాకిలా బుద్ధి చెప్తున్నాడు" ఏడుస్తూ అంది అభయ. అందమైన ఆమె ముఖం బాధతో కమిలి ఎర్ర మందారం లాగా వుంది.
సుధీర్ కి ఎవరో చాచిపెట్టి కొట్టినట్లు అనిపించింది. " నా సంగతి కూడా అంతే అభయ గారు! నేనెంతో ఇష్టపడ్డ స్వీటీని వదిలేసి వెళ్ళాల్సి వస్తోందని మనసులో ఎంతో విసుక్కున్నాను. నా తల్లితండ్రులు కేవలం నాకు గ్రీన్ కార్డు ఇప్పించటం కోసం వృద్ధాప్యంలో ఇండియా లో హాయిగా నౌకర్లు, చాకర్లతో వారి స్వంత ఇంట్లో మనశ్శాంతి తో గడపాల్సిన జీవితాన్ని అమెరికాలో అన్ని పనులు వాళ్ళే చేసుకుంటూ మా పెద్దమ్మ ఇంట్లో అస్వతంత్రంగా గడుపుతున్నారు. ఇతరుల ఇళ్ళల్లో వుండి వారిలో ఒకరిగా మసలటం మగవారికంటే ఆడవారికే బాగా చేతనవుతుంది. మా పెద్దమ్మ వాళ్ళింట్లో మా అమ్మ బాగానే అడ్జస్ట్ అయిపోయింది కాని మా నాన్న అంత తేలికగా అడ్జస్ట్ కాలేకపోయారు. అంతేకాకుండా మా పెదనాన్నగారు వాళ్ళ తమ్ముడి కుటుంబాన్ని స్పాన్సర్ చేసారు. వాళ్ళకంటే ముందు మా కుటుంబానికి గ్రీన్ కార్డు రావటం ఆయనను చాలా చికాకు పరిచింది. అనుక్షణము ఆయన చూపించే చిటపటలు మా నాన్నకు నచ్చేవికాదు. అసలే అమెరికాలో అస్వతంత్రమైన జైలు లాంటి జీవితం. దానికి తోడు వారికి ఇంట్లో ఈ అవమానకరమైన పరిస్థితులు. అయినా నా భవిష్యత్తు, నా గ్రీన్ కార్డు ఎదుర్కొంటున్నారు. కొరకు అవన్నీ ఎలాగో భరిస్తూ రోజులు లెక్కబెట్టుకుంటూ అక్కడే వున్నారు. ఈ వయసులో కూడా వాళ్ళు నాకోసం చేస్తున్న త్యాగాన్ని గ్రహించలేక నా స్వసుఖం కోసమే ఆలోచించాను. ఎంతసేపు స్వీటీని వదిలి వెళ్ళాల్సి వచ్చినందుకు విసుక్కున్నానే తప్ప తల్లితండ్రుల పట్ల నా బాధ్యతని గుర్తు పెట్టుకోలేకపోయాను. అందుకే దేవుడు నాకు బాగా బుద్ధి చెప్తున్నాడు. కనీసం నా చివరి చిహ్నాలైనా కూడా వాళ్లకు దక్కకుండా చేస్తున్నాడు. నాలాంటి వారికి అలాగే జరగాలిలెండి. వాళ్ళ ప్రేమని పొందటానికి నేను అర్హుడిని కాను. అమ్మా, నాన్నా, నన్ను క్షమించండి" పశ్చాత్తాపంతో కళ్ళలోంచి నీళ్ళు ధారగా కారుతుంటే వణుకుతున్న గొంతుతో అన్నాడు సుధీర్.
విమానంలో అందరి పరిస్థితి అలాగే వుంది. అంతా పెద్ద గలభాగా వుంది. ఇంతలో ఎవరో మంత్రం వేసినట్లు విమానం పల్టీలు కొట్టటం, పక్కలకు ఒరగటం లాంటివి హఠాత్తుగా ఆగిపోయాయి. ఒక క్రమపద్ధతిలో నార్మల్ గా ఎగరటం మొదలెట్టింది. ప్రయాణికులు మెల్లిగా వారివారి సీట్లలో కూర్చుంటున్నారు. కొంతమంది ఇంకా నిలబడే వున్నారు. అందరి ముఖాల్లో ఆనందం, ఆశ్చర్యం, అనుమానం కలగాపులగంగా కనిపిస్తున్నాయి. అసలంతవరకు ఏం జరిగిందో, అప్పుడు హఠాత్తుగా మళ్లీ ఇంకేం జరుగుతోందో ఎవ్వరికి అర్థం కావటం లేదు.
ఇంతవరకు జరిగిన గందరగోళం ఇందాకట్నుంచి ఎలా అర్థం కాలేదో, ఇప్పుడు ఈ సద్దు మణిగిన హడావిడి కూడా ఆమెకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. సుధీర్ కూడా అయోమయం గానే వున్నాడు. మళ్లీ ఏవేవో అనౌన్సమెంట్ వినిపిస్తున్నాయి. ఒక్కటి సరిగ్గా, స్పష్టంగా అర్థం కావటం లేదు. జాగ్రత్తగా విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అంతా అయోమయంగా వుంది. మెల్లిగా కళ్ళు తుడుచుకున్నాడు. కొన్ని నిముషాల తర్వాత అభయ కూడా కొంచెంగా తేరుకుంది. మెల్లిగా "సుధీర్ గారు! ఏమైంది? అపాయం తొలిగిందా?" అని అడిగింది అపనమ్మకంగా. "తొలిగినట్లే అనిపిస్తోంది. కాని ఖచ్చితంగా తెలియటంలేదు " అనుమానంగా అన్నాడు సుధీర్.
ప్రయాణీకుల గలభా పూర్తిగా కాకపోయినా చాలావరకు తగ్గింది. ఏవో రెండు, మూడు అనౌన్సమెంట్ ల తర్వాత ఒక ఎయిర్ హోస్టెస్ తమ సీటు వైపు వస్తుంటే ఆమెని అడిగాడు సుధీర్ అసలేమైంది అని. ఆమె గబగబా ఏదో అంటూ కంగారుగా వెళ్లిపోవటంతో సుధీర్ కి మళ్లీ అయోమయం తప్పలేదు. విమానం మళ్లీ ఇదివరకటి లాగా ఒరిగిపోతుందేమో, మళ్లీ ఇంకేం అపాయం వస్తుందేమో అని ఉలికిపాటుగా వుంది. ఇంతలో ఇంకో అనౌన్సమెంట్ వినవచ్చింది. విమానం లాండు అవటానికి సిద్ధం అవుతోంది, ఎవరూ సీటు బెల్టులు తీయకూడదని. అది విన్నఅభయకి ప్రాణం లేచివచ్చింది. సరిగ్గా వింటున్నానా, లేదా అన్న అపనమ్మకం కలిగింది. "సుధీర్ గారు! నేను సరిగ్గానే వింటున్నానా? విమానం లాండు అవబోతోందా?" అని అడిగింది, అనుమానంగా, ఆనందంగా. "అవును అభయగారు! మీరు సరిగ్గానే విన్నారు. వాళ్ళు అదే అనౌన్స్ చేసారు " ఆనందంగా అభయ చేతులు పట్టుకుని గట్టిగా ఊపుతూ అన్నాడతను. ఇద్దరు ఆ సంభ్రమం లోంచి తేరుకుంటూ వుండగా మెల్లిగా విమానం ఆగింది. ఆనందం, రిలీఫ్ అందరి ముఖాలలో కన్పిస్తోంది. బాధతోనో, సంతోషంతోనో, కొంతమంది ఇంకా ఏడుస్తూనే వున్నారు.
వంట్లో కొంచెం కూడా ఓపికగా లేదు. సుమారు ఒక రెండు గంటల నుండి పడుతున్న మానసిక వ్యధ వలన శరీరం లో వున్న శక్తి అంతా ఇగిరి ఆవిరి అయినట్లుగా వుంది. సుధీర్ మానసిక స్థితి కూడా అలాగే వుంది. రాత్రంతా సరిగ్గా నిద్ర లేక, జుట్టంతా రేగి, బట్టలన్నీ నలిగి పది రోజుల నుండి లంఖణాలు చేసినవాడిలాగా వుంది అతని పరిస్థితి. ప్రయాణీకులు హడావిడిగా, ఆలస్యం చేస్తే మళ్లీ ప్రమాదంలో పడిపోతామేమో అన్నట్లుగా గబగబా బయటకు పరిగెడుతున్నట్లుగా నడుస్తున్నారు.
"మీరిక్కడే కూర్చోండి. మనకి అట్లాంటా కి నెక్ష్ట్ ఫ్లయిట్ ఎప్పుడుందో కనుక్కుని వస్తాను" విమానం లోంచి దిగగానే మెల్లిగా అన్నాడు సుధీర్. ఇందాక విమానం లో జరిగిన గలభా సంగతే అందరు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సుధీర్ పరుగు పరుగున వచ్చాడు. "మన ఫ్లయిట్ కి ఇంకా రెండు గంటల వ్యవధి వుంది. మన గేట్ దగ్గరికి వెళదాం, పదండి" అన్నాడు అభయతో. అభయ వంట్లో అస్సలు ఓపిక లేనట్లుగా మెల్లిగా లేచి సుధీర్ చెయ్యి పట్టుకుని అడుగులు వేసింది. వాళ్ళ గేట్ దగ్గరకి వెళ్లి ముఖం కడుక్కుని, రేగిపోయిన జుట్టు దువ్వుకుని, వేడి వేడి కాఫీ తాగిన తర్వాత కాస్త ప్రాణం తేరుకున్నట్లు అయింది ఇద్దరికీ. "విమానం లో బాంబు లేదు, ఏమి లేదు. తీవ్రవాదుల చర్య కూడా ఏమి కాదు. ఒక ఇంజనులో ఏదో ప్రోబ్లెం వచ్చిందట. చాలా అదృష్టవంతులం. ఈ మాత్రంతో ఇంత పెద్ద ప్రమాదం లోంచి ప్రాణాలతో బతికి బయటపడ్డాం. లేకుంటే అన్ని వేల మైళ్ళ ఎత్తున ఏం జరిగినా మన అతీ గతీ కూడా తెలిసేది కాదు" అని వివరించి చెప్పాడు సుధీర్ అభయకి. "పోనీలెండి. విమానంలో వున్న వారందరి ప్రాణాలు గట్టివి. ఆ పరమాత్మ మనందరినీ కాపాడాడు" అంది అభయ.
ఇద్దరు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. అభయకి నిద్ర ముంచుకు వస్తోంది. సుధీర్ కి కూడా చాలా అలసటగా వుంది. ఇన్ని గంటల నుండి పడిన భయంకర మరణ యాతన నుండి విముక్తి లభించిందన్న రిలీఫ్ తో వారి మనసులు తేలికగా వున్నాయి. శరీరం విమానం లో లేకపోయినా గాలిలో తేలిపోతోంది. ఇద్దరూ వాళ్ళ గేట్ దగ్గర కుర్చీల్లో కూర్చుని కునికిపాట్లు పడసాగారు. ఇంతలో వాళ్ళ అట్లాంటా ఫ్లయిట్ కి బోర్డింగ్ మొదలైంది. ఉలిక్కిపడి ఇద్దరూ లేచారు. నిద్ర పోయింది కొంతసేపే అయినా చాలా హాయిగా వుంది ఇద్దరికీ. లోపల కూర్చోగానే "అమ్మయ్య. మన ప్రయాణం లో చివరి మజిలీకి వచ్చాం. దేవుడి దయ వలన మన గమ్యస్థానానికి త్వరలోనే చేరుకుంటాం" అన్నాడు సుధీర్ సీటు బెల్ట్ పెట్టుకుంటూ. అభయ మనస్ఫూర్తిగా నవ్వింది ఆ మాటలు వింటూ. ప్రాణ భీతి పోయి నెమ్మదిగా ఇద్దరూ మళ్లీ మామూలు మనుషులవుతున్నారు. పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ తిరిగి వస్తోంది. కనులకు కనిపించకుండా కాపాడే ఆ అంతర్యామిని మనోదృష్టితో చూడటానికి ప్రయత్నిస్తూ మనసులోనే వేయి నమస్కారాలు చేసింది అభయ.
అది పగలవటం వలన అందరూ మెలకువగా వున్నారు. అభయ కిటికీ లోంచి బయటికి చూస్తోంది. ఈసారి ఆమెకి ఏమీ భయంగా అనిపించలేదు. ఇందాక పడ్డ భయంతో పోల్చుకుంటే ఏదీ ఆపద లాగా అనిపించడంలేదు ఆమెకు. ఒక్కసారి కొన్ని గంటల క్రితం జరిగినదంతా గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించింది. తాము ప్రయాణం చేస్తున్న విమానంలో ఏదో ప్రోబ్లెం రావటం, అసలు సంగతి తెలియక తాము ఏవేవో ఊహించుకుని భయపడటం, చావుబతుకుల మధ్యలో తాము కొట్టుమిట్టాడటం, ఇవన్నీ మెల్లిగా గుర్తు వచ్చాయి. వెన్నులో ఏదో పాకినట్లయి ఒక్కసారి ఒళ్ళు ఝల్లుమన్నట్లయింది. ఇంతలో భయంతో తను సుధీర్ ని గట్టిగా పట్టుకుని బేలగా ఏడవటం హఠాత్తుగా గుర్తొచ్చి ఒక్కసారి గట్టిగా ఉలిక్కిపడింది. పరాయి మగవాడు అన్న ధ్యాసన్నా లేకుండా సుధీర్ కి తను ఎంత దగ్గరగా వున్నది మెల్లిగా గుర్తు వస్తోంది. ప్రాణం మీద వున్న తీపి అంతా అతని ముందు అవివేకంతో ఒలకపోసుకుంది. ఎవరితోనూ ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడి ఎరగని తను పిచ్చెక్కినట్లు తన మనసులోని భయాలన్నీ ఏ సంకోచం లేకుండా అతనితో చెప్పేసింది. అసలు ఇంతకు ముందు ఏ పరిచయము లేని పూర్తి అపరిచితుడు అతను. అయినా అతనితో ఎంతో సన్నిహితంగా ప్రవర్తించింది. ఛీ, ఛీ, అతనేమనుకున్నాడో తన గురించి? విమానం దిగిన తర్వాత కూడా అతన్ని పట్టుకుని ఒకపట్టాన వదలలేదు తను. పరాయివాడు అన్న జంకు కూడా ఏ కోశానా లేకపోయింది తనకు.. పక్క సీటు లో వున్న సుధీర్ కి తగలకుండా తన సీటు లో ముడుచుకుని కూర్చుంది అభయ.
సుధీర్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే వుంది. పరాయివాయి దగ్గర తన వ్యక్తిగత బాధనంతా వెళ్ళబోసుకున్నాడు. తోటి ప్రయాణికులతో చెప్పే కులాసా కబుర్ల పరిధి దాటి తన కష్టసుఖాలు, ఇష్టాయిష్టాలు అన్ని చెప్పుకున్నాడు. ముక్కు, మొగం తెలీని ఒక అపరిచిత, పరాయి ఆడపిల్లతో తమ కుటుంబ కలహాలన్నీ బట్టబయలు చేసాడు. ప్రాణభయంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఛీ, తన గురించి ఏమనుకుందో అభయ? ఇలా ఏడ్చాడేమిటి? నిబ్బరం, ధీరత్వం కాసింతయినా లేవేమిటీ అనుకుంది కాబోలు. ఈ ఆలోచన అతన్ని చాలా అశాంతి పాలు చేస్తోంది. సిగ్గు పడేట్లు చేస్తోంది.
విమానం అట్లాంటా చేరింది. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ లాంటి ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని అభయ, సుధీర్ బయటకు వచ్చేసరికి అక్కడ వారి కొరకు సుధీర్ తల్లిదండ్రులు, అభయ భర్త ఎదురుచూస్తున్నారు. ప్రయాణం మధ్యలో వీళ్ళ విమానానికి ఇంజను ట్రబుల్ వచ్చిందని న్యూస్ లో విని చాలా ఆందోళన చెందారట. పరస్పర పరిచయాలైన తర్వాత "అట్లాంటా లోనే ఉంటారుగా! ఇదిగో, నా కార్డు తీసుకోండి. దయచేసి టచ్ లో వుండండి. మా ఇంటికి తప్పకుండా రండి" అన్నాడు అభయ భర్త సుధీర్ తో, అతని తల్లితండ్రులతో. "అలాగే, మీరు కూడా తప్పకుండా రండి" అంది సుధీర్ తల్లి అభయతో. చివరి వీడ్కోలుగా చేతులు జోడించి మనస్ఫూర్తిగా సుధీర్ కి నమస్కరించింది అభయ. సుధీర్ కూడా అభయ వైపు చూస్తూ బై బై అంటూ చేయి వూపాడు. తను బేలగా ఏడవటం, గుర్తొచ్చింది అతనికి. మౌనంగా, ఇబ్బందిగా ఒకరి వైపు ఒకరు చూస్తూ ఏదో సంకోచంతో వారిద్దరూ వీడ్కోలు నవ్వు నవ్వారు. మిగిలినవారు మాత్రం తమవారిని క్షేమంగా చూసుకున్న ఆనందంతో ఒకరికొకరు పరస్పరం వీడ్కోలు చెప్పుకుని ఎవరి కారు వైపు వారు నడిచారు.
*****