top of page
Anchor 1

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

భారతీయులు కాని వారితో మన బాంధవ్యాలు

Sivuni Rajeswari

ఎస్. నారాయణస్వామి

అమెరికాకి కొద్ది రోజుల పాటు చుట్టపు చూపుగా వచ్చి పోయేవారికీ, కొన్నేళ్ళు నివాసం ఉన్న వారికీ, ఇక్కడే స్థిరనివారం ఏర్పరుచుకున్న వారికీ - ఈ మూడు వర్గాల భారతీయులకీ - ఈ సమాజాన్ని చూసే దృక్కోణంలో, ఈ సమాజంతో మెలిగే పద్ధతిలో కొన్ని మౌలికమైన భేదాలు ఉన్నాయి. ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్న భారతీయులకి, అందునా తెలుగు వారికి, వాళ్ళవి మాత్రమే అయిన అనుభవాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ అనుభవాల కథలని వాళ్ళే చెప్పుకోవాలి, రాసుకోవాలి అని ఒక కచ్చితమైన అభిప్రాయంతో కలం పట్టిన వాణ్ణి నేను. అంచేత నేను రాసుకునే కథలను బట్టే కాక నా తోటి అమెరికా తెలుగు రచయితలు ఏం రాస్తున్నారు అని కూడా ఆసక్తిగా గమనిస్తున్నాను గత ఇరవయ్యేళ్ళుగా.

 

కథలంటే పైపైని ఉన్నాయనుకున్నావేమో - అంటూ మొదలు పెట్టి, మార్గదర్శి కథలో కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు కథ రాయడానికి అవసరమైన వనరులని చెప్పుకొచ్చారు. తాను నేరుగా అనుభవించిన విషయాలనే గాక, తాను చూసిన, విన్న, చదివిన విషయ పరిజ్ఞానాన్ని ఊహాశక్తితో పండించి కథలని సృష్టిస్తాడు రచయిత. రచయిత చుట్టూతా ఉన్న సమాజం ఈ విషయ పరిజ్ఞానంలో ఒక భాగం. అమెరికా అంటే వలసదారుల దేశం. ప్రపంచంలోని ప్రతీ దేశాన్నించీ మనుషులు ఇక్కడికి వలస వచ్చి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా ఇతర తెలుగు రచయితలకి లేనిది, అమెరికా తెలుగు రచయితకి మాత్రమే లభ్యమైనది ఈ గొప్ప వనరు - ఈ సర్వమానవ వలస సమాజంలో భాగమై ఉండడం. ఇటువంటి వైవిధ్యమైన సమాజంతో మనవారి సంబంధాలు మన కథల్లో ఎలా చిత్రించారు అని పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశం.

 

నలభయ్యేళ్ళుగా అమెరికాలో తెలుగు కథలు వర్ధిల్లుతూ ఉన్నా, ఇప్పటికీ మన కథల్లో వస్తువు - కనీసం సగానికి సగం కథల్లో - భారత దేశంలోని విషయాలమీదనే. ఇతరత్రా కూడా మనవారి ఆలోచనలూ, వైఖరీ ఈ ట్రెండ్ ని బలపరుస్తున్నాయి. భారతదేశపు సినిమాలూ, అక్కడి ఎన్నికలూ మనవారిని కదిలించినంతగా ఇక్కడ జరుగుతున్న సంఘటనలు కదిలించడం లేదు.  దీనికి నాకు తోచిన వివరణ ఏంటంటే - మన వాళ్ళు వలస వస్తున్నప్పుడు ఇదేదో తాత్కాలికం మాత్రమే అనుకుంటూ రావడం. తీరా వచ్చినాక, ఉద్యోగం, పిల్లలూ, వాళ్ళ భవిష్యత్తూ మెల్ల మెల్లగా అంచెలంచెలుగా సెటిలవుతున్నారు తప్ప ఎవరూ కూడా మొదణ్ణించీ - ఇక మీదట నా భవిష్యత్తు అమెరికాలోనే - అనే స్థిర నిశ్చయంతో రావడం లేదు. మొదటి ఏళ్ళలో నాస్టాల్జియాతో విడిచివచ్చిన మాతృదేశాన్ని మన వాళ్ళనీ తలుచుకుంటూ ఇటువంటి కథలు రాసుకున్నారంటే అర్ధం చేసుకోవచ్చు గానీ సుమారు రెండు తరాల వలసలు జరిగినాక కూడా ఇదే పరిస్థితి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే.

 

అదలా ఉండగా, అమెరికా భూభాగం మీద జరిగినట్టుగా రాస్తున్న యాభై శాతం కథల్లో కూడా చాలా మట్టుకు మన కుటుంబాలలో, మన వాళ్ళ సమాజంలో జరుగుతున్న కథలే. మన ఇళ్ళు, మన బంధు మిత్రులు, మహా అయితే మన గుళ్ళు, తెలుగు సమితులు - ఇంత వరకే మన కథల పరిధి. ఉపాధి కోసమే మనందరం ఇక్కడ స్థిరపడినా, రకరకాల వృత్తుల్లో వ్యాపారాల్లో మనవాళ్ళు రాణిస్తున్నా అవేవీ మన కథల్లో చోటు చేసుకోవడం లేదు. ఇంతకు మునుపు జరిగిన సదస్సులో - బహుశా హ్యూస్టన్ సదస్సులో కావచ్చు, వక్తల్లో ఒకరన్నారు, వృత్తి పరమైన ఇతివృత్తాలతో మన రచనలు రావలసిన అవసరం ఉందని. ఇది నిజం. ఇదంతా ఒక పరిశోధకుడిగా, పాఠకుడిగా నన్ను కాస్త నిరుత్సాహ పరుస్తున్నా గత ఐదారేళ్ళలో  ఈ పరిధుల్ని దాటి, భారతీయులు కాని వారితో మన సంబంధాలను చిత్రిస్తూ సముచితమైన భావోద్రేకాలతో చక్కటి శిల్పంతో కొన్ని మంచి కథలు వెలువడినాయి, నాకు ఆశ కలిగించాయి. ఈ కథల్లో ఇటువంటి సార్వత్రిక మానవ సంబంధాలను ఎలా చిత్రించారో ఇక్కడ టూకీగా ఉదహరించి చర్చిద్దాము.

 

చిరకాల మిత్రుడూ, కవీ అయిన విన్నకోట రవిశంకర్ "తోడు" అని చక్కని కథ రాశారు. ఇది వాకిలి జాల పత్రికలో ప్రచురితమైంది. లెబనీస్ అమెరికన్ అయిన తన తోటి ఉద్యోగస్తుడి ద్వారా వృద్ధుడైన అతని పెదనాన్నతో పరిచయం పెంచుకుని తద్వారా ప్రభావితుడైన ఒక తెలుగు యువకుడి కథ ఇది. ఉత్తమ కథల రచయితగా గట్టి పేరు సంపాయించుకున్న గొర్తి సాయి బ్రహ్మానందం రాసిన కథ "ఆ ఇంట్లో ఒక రోజు." ఇది ఆటా 2016 ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. ఇందులో పని మీద పొరుగూరు వెళ్ళిన ఒక తెలుగు యువకుడు తన కొలీగ్ (శ్వేతజాతి వారు) తల్లి దండ్రుల్ని విజిట్ చేసి ఒక రోజంతా గడిపి వచ్చిన సందర్భాన్ని చిత్రించారు. కౌముది జాల పత్రిక 2015 లో ప్రచురించిన కథ ఇనుపతెర , వర్ధమాన రచయిత పెమ్మరాజు మధు రచన. ఇందులో కాంట్రాక్ట్ మీద ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న తెలుగు యువకుడు అదే పద్ధతి మీద అనేక కష్టాలకోర్చి పని చేస్తున్న ఒక శ్వేత వనిత పట్ల మానవతా దృక్పధంతో సౌహార్ద్రంగా స్పందించడాన్ని ఆర్ద్రంగా చిత్రించారు. అనేక రచనా ప్రక్రియల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్న రెంటాల కల్పన రచన ది కప్లెట్ ఇద్దరు యువతుల మధ్య (తెలుగు అమెరికన్, మెక్సికన్ అమెరికన్) సమాజం ఆమోదించని స్వలింగ ప్రేమ కథని, తద్వారా ఆ లేత హృదయాల్లో చెలరేగిన అలజడిని సమర్ధవంతంగా చిత్రించారు. ఇప్పటికే కొన్ని మంచి కథలు రాసిన విజయ కర్రా రచన - విండో షాపింగ్, తానా పత్రిక 2015 మే నెల సంచికలో ప్రచురితమైంది. ఇందులో తండ్రి లేని ఒక టీనేజ్ యువకుడు లాటీనో జాతీయుడైన తన స్నేహితుడి ప్రోద్బలంతో షాప్ లిఫ్టింగ్, చిన్న చిన్న దొంగతనాలు మరిగి, అంతలోనే జరిగిన ఒక అనుభవం వల్ల అతని వివేచన మేల్కొని ఆ సావాసం తనకి మంచిది కాదని వీడ్కోలు చెప్పేసి బయటపడతాడు.

 

కథల నిర్మాణ విశేషాలను చూస్తే కల్పన రాసిన కప్లెట్ తప్ప మిగతా కథలన్నీ నేను అంటూ కథ చెప్పే ఉత్తమ పురుష కథనంలో నడిచాయి. ఆ కథ చెప్పే నేను కథలోని భారతీయ (తెలుగు) వ్యక్తి అని మీరు గ్రహించేశారంటే మీ తెలివికి మీరు నూటికి నూరు మార్కులు వేసేసుకోవచ్చు. తోడు, ఆ ఇంట్లో ఒక రోజు కథల మధ్య కొన్ని ఆసక్తి కరమైన పోలికలున్నాయి. ఈ రెండు కథలూ ప్రధానంగా వృద్ధులైన ముందటి తరం వారిని గురించి, వారు అనుభవించ వలసి వస్తున్న ఒంటరితనాన్ని గురించి. రెండు కథల్లోనూ నేను అని కథ చెబుతున్న భారతీయ కథకుడు ముఖ్యంగా ప్రేక్షక పాత్ర వహిస్తాడు. అతనికి కథలో జరుగుతున్న విషయాల్లో నేరుగా ఏమీ ప్రమేయం ఉండదు. కథలోని ఇతర పాత్రలకి జరుగుత్న్న పరిణామాల వల్ల ఇతనికి ఒరిగేదీ లేదు, తరిగేదీ లేదు. అంచేత ఒక సాక్షిగా, ఒక డాక్యుమెంటరీ నేరేటర్ గా ఇతని కథనం నిజాయితీగా ఉంటుంది, పాఠకులకు ఇది నిజాయితీతో కూడిన కథనం అనిపిస్తుంది.

 

అందులోనూ రెండు కథల్లో కొన్ని తేడాలూ లేకపోలేదు. రవిశంకర్ కథలో కథకుడు ఆ కుటుంబం పట్ల పెంచుకున్న సుహృద్భావం వల్ల తనకు నేరుగా కనబడని విషయాలు సంఘటనలు కూడా తెలుసుకుని కథలో చెబుతుంటాడు. తద్వారా అతనికి కథలోని వృద్ధుని పట్ల పెరుగుతున్న ఒక అభిమానం, ఒక గౌరవం పాఠకులకి స్పష్టమౌతాయి. చివరిగా తానే ఆ వృద్ధుణ్ణి అప్పుడప్పుడూ కలుస్తూ ఒక బంధువులా చూసుకుంటూ తన మానవత పునాదుల్ని గట్టి చేసుకుంటాడతను. గొర్తిగారి కథలో వృద్ధ దంపతుల పట్ల కథకుడి ఆలోచన ఒకింత చిరాకుతో కూడిన జాలితో ఉన్నట్టుగా మనకు తోస్తుంది. పనిలో పనిగా ఈ అమెరికా వాళ్ళకి ప్రేమలూ అభిమానాలూ ఉండవు, లేకపోతే వీళ్ళబ్బాయి పాపం ఇన్నేళ్ళుగా తల్లిదండ్రుల్ని విజిట్ చెయ్యకుండా ఉండడం ఏవిటి? అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు అతను. తీరా, వారికి బైబై చెప్పి బయటికి వచ్చి తన కారెక్కుతూ ఉంటే, తన స్వగ్రామంలో పదివేల మైళ్ళ అవతల తాను వదిలేసి వచ్చిన తన తల్లిదండ్రులు గుర్తొచ్చి ఒక్కసారిగా మనసు బరువెక్కుతుంది. ఆ స్పందన ద్వారా అతని మానవత్వం దృఢపడుతుంది.

 

 

మధు గారి ఐరన్ కర్టెన్ కథలో ఈనాడు అమెరికాలో సర్వసాధారణమైన సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ల ఉద్యోగ జీవితాల ఒత్తిడులను చాలా సహజంగా చిత్రించారు. ఇందులో నేను అని కథ చెబుతున్న భారతీయుడు సగం సాక్షి, సగం చైతన్యవంతుడైన పాత్ర.  ఒక వూరిలో నివాసం, కుటుంబం. ఎక్కడో మరో వూరిలో క్లయంటు ఆఫీసులు ఉండే చోట కొలువు. ఆ కొలువు కాంట్రాక్టు - మూణ్ణెల్లో, ఆర్నెల్లో, ఏణ్ణర్ధమో! మారి పోతూ ఉంటుంది. ఈ కొలువుండే చోటు ఇంటికి ఐదు మైళ్ళ దూరంలో కావచ్చు, ఆరొందల మైళ్ళ దూరం కావచ్చు, పూర్తిగా దేశానికి అవతలి మూల కావచ్చు. వారమంతా కొలువులో గడిపి ప్రతీ వారాంతానికీ అయినా కచ్చితంగా ఇల్లు చేరతామని గేరంటీ లేదు. వారానికోసారైనా జీవిత భాగస్వామినీ పిల్లల్నీ చూసుకుంటామనే గేరంటీ లేదు. తాను స్వయంగా కాంట్రాక్టరు అవడం వల్ల ఈ పచ్చి నిజాలన్నీ అనుభవానికి వచ్చి ఉన్నవాడు మన శశాంక్. ఎందుకు ఈ బాధలన్నీ పడటం అంటే - చాలా నిక్కచ్చిగా నిజాయితీగా జవాబు తనే చెబుతాడు. కెరీర్ అనే సోపానంలో పైకెదుగుతూ ఒక స్థాయికి చేరుకున్న తరవాత, తనకూ కుటుంబానికి సమాజంలో ఒక ఆర్ధిక స్థాయిని ఏర్పరుచుకున్న తరవాత, వెనుదిరిగే ఛాన్సు లేదు. ఆ పరిధిని విస్తరించుకుంటూ పైకి ఎదగాల్సిందే తప్ప పరిధిని కుచించుకుని నేను సింపుల్ గా బతుకుతా అంటే కుదరదు. 

 

మేరీ పనితనం కుంటుపడుతుండటం గమనించి ఏవిటి విషయం అని అడగాలన్నా నేరుగా చొరవగా అడగలేడు. వ్యక్తిగత విషయాలు ఆఫీసులో చర్చించ కూడదు. పైగా జాత్యంతర భేదం ఒకటి. ఈ సున్నితమైన, జటిలమైన అంశాలని కథలో సమర్ధవంతంగా ఉపయోగించారు రచయిత. ఇంట్లో పరిస్థితుల వలన ఇబ్బంది పడుతున్న మేరీ స్థితిని అర్ధం చేసుకుని, క్లయంట్ యాజమాన్యం ఆమె పట్ల కఠినంగా వ్యవహిరించాలని వత్తిడి తెస్తుంటే - రేపు తన కుటుంబానికి ఏదైనా ఐతే తన పరిస్థితీ ఇంతే కదా అనే గుర్తింపుతో, మేరీ పరిస్థితితో మమేకం (ఎంపతీ) చెంది ఒక కాంట్రాక్టు ఉద్యోగిగా కాక ఒక మనిషిగా శశాంక్ మేలుకోవడంతో కథకి చక్కని ముగింపు ఇచ్చారు. శశాంక్ ఇంట్లో వాతావరణాన్నీ, ఆ భార్యాభర్తల మధ్య ప్రవహిస్తున్న చైతన్య స్రవంతినీ, కాంట్రాక్టు ఉద్యోగ నేపథ్యంలో ఉండే వత్తిడి పరిస్థితులనీ చాలా సహజంగా సూటిగా చిత్రించారు. ఉద్యోగ నేపథ్యాలతో కూడిన ఇటువంటి కథలు ఇంకా రావాలి.

 

విజయగారి కథ విండో షాపింగ్ లో, పంతొమ్మిది దాటి ఇరవైలోకి ప్రవేశిస్తున్నా ఇంకా పదహారేళ్ళ పిల్లాడిలా అమాయకంగా కనబడే శ్యామకృష్ణ - స్నేహితులకి శేం - తండ్రిలేని పిల్లాడు. నడివయసు దాటిన శ్వేత జాతి దంపతులు ఫోస్టర్ పేరెంట్స్ గా వారింట్లో ఉంటున్న లాటీనో జాతీయుడు టోనీ. ఇప్పుడిప్పుడే బలపడుతున్న తన రెక్కల్ని విప్పార్చి ఈ అమెరికన్ ఆకాశంలో ఎత్తుకి ఎగరాలని ఆరాటపడుతున్న యవ్వనోత్సాహం. తన సావాసగాడు టోనీ ప్రోద్బలంతో షాప్ లిఫ్టింగ్ వంటి చిన్న చిన్న దొంగతనాలకి అలవాటు పడి, పట్టుబడకుండా తప్పించుకున్న ప్రతిసారీ అది తన ప్రతిభకి, చొరవకి పడిన ఆమోద ముద్రగా భ్రమ పడుతూ, ఎప్పటికప్పుడు తన పరిధి సరిహద్దుల్ని కొంచెం కొంచెమే అధిగమిస్తున్న శేం. ఈ కథా గమనంలో టోనీ కుటుంబ నేపథ్య చిత్రణ కూడా ఆసక్తికరంగా ఉంది.  ఈ టీనేజి ద్వయం చేస్తున్న పనుల్లో భాగస్వామ్యం చెరిసగమైనా ప్రోద్బలం టోనీది అన్నట్టు చెప్పడంలో కొంత స్టీరియోటైపింగ్ జరిగింది, కాదనలేము. ఆ ఒక్క అంశాన్ని మినహాయిస్తే, వారి మనస్తత్వాలు, తద్వారా వారి ప్రవర్తన ఎలా పరిణమించాయి అని చాలా సహజంగా చిత్రించారు. 

 

 శేంకి ఒకేసారి రెండు విరుద్ధమైన అనుభవాలు ఎదురౌతాయి. ఆ అనుభవాలను బేరీజు వేసుకుని అతను సరైన నిర్ణయం తీసుకోవడంతో కథ ముగిసింది. భారతీయుల ఇళ్ళల్లో ఇలాంటి పరిస్థితులుంటాయా, ఇలాంటి కథలు జరుగుతాయా అంటే - విపులాచ పృథ్వీ. మనవాళ్ళు అందరూ రెండు మూడు లక్షల డాలర్లు జీతాలు సంపాయిస్తూ, మిలియన్ డాలర్ భవంతుల్లో నివాసం ఉంటూ, పిల్లల్ని ఖరీదైన ప్రైవేటు బడుల్లో చదివిస్తూ ఉండరు. తండ్రి సంపాదన వల్ల ఒక ఎగువ మధ్య తరగతి జీవితాన్ని గడుపుతూ హాయిగా ఉన్న చిన్న కుటుంబానికి అకస్మాత్తుగా ఆ తండ్రి అకాల మరణం వల్ల అతని జీతం అనే పునాది కూలిపోతే ఏమవుతుంది అనే ప్రశ్నకి ఒక సమాధానం ఈ కథ.

 

ఇప్పటివరకూ చర్చించిన కథలన్నిటికీ భిన్నమైనది కల్పన గారి రచన, కప్లెట్ కథ. ఇద్దరు యువతులు, కాలేజి కేంపస్ నివాసం.  తలిదండ్రుల రక్షణాయుత చట్రంలోనించి బయట పడి స్వేఛ్ఛగా అప్పుడే విచ్చుకుంటున్న రెక్కల్ని విప్పార్చి నింగిని అందుకోవాలనే ఆరాటం, ముందటి కథలో శేం కి లాగానే. లైంగికత అంటే ఇంకా పూర్తిగా తెలిసీ తెలియకుండానే పరస్పరం బలపడిన ఆకర్షణ. అది కూడా సమాజం ఆమోదించని ప్రేమ. ఎంత తెంచేసుకోవాలని బలంగా ఉన్నా లోపల బలంగా వేళ్ళూనుకుని ఉన్న సమాజపు కట్టుబాట్లు. ఈ పరస్పర విరుద్ధమైన బలాల మధ్య నలిగిపోతున్న రెండు లేత మనసులు. యాభయ్యేళ్ళ కిందట కుల, మత, జాతి వైరుధ్యాల వల్లనైతేనేమి, ఈ పూట లైంగికత మూలంగా నైతే నేమి. సమాజం ఆమోదించని ప్రేమ ఆ ప్రేమికులకి మానసిక యాతనే. అసలీ కథలో చర్చనీయాంశం ఏమిటీ అని బోలెడు చర్చ జరిగింది. ఇదొక్కటే చర్చనీయాంశం అని చెప్పడానికీ లేదు. ఒక పక్కన భారతీయ కుటుంబాల్లో ఉండే సాంప్రదాయం. మరో పక్క అమెరికను సమాజంలో బలపడి ఉన్న సాంప్రదాయ భావాలు. ఈ రెండిటి మధ్యలో ఇంకా వికసిస్తున్న వ్యక్తిత్వాలు. జాతి, లైంగికత, సాంప్రదాయం, వ్యక్తిగత స్వేఛ్ఛ, వీటన్నిటినీ చర్చకు తెస్తోంది ఈ కథ.  ఈ సందర్భాన్నంతా, ఆ రెండు మనసుల లోపలి క్షోభతో సహా, సున్నితంగా చిత్రించారు కల్పన.

 

ఈ కథలని చదివాక ఒక విషయం స్పష్టమవుతోంది. బయటి సమాజంతో, భారతీయులు కాని వారితో మనకి కొన్ని సంబంధ బాంధవ్యాలు ఉన్నా, చాలా మట్టుకి మనం ఆయా పరిస్థితుల్లో సాక్షీభూతంగా ఉండిపోతున్నాము తప్ప మమేకం కావడం లేదు. కనీసం ఆ అవసరం మనవారికి ఇంకా ఏర్పడలేదు. ఈ సమాజపు సాధక బాధకాలు మనవి కావు, మన సాధక బాధకాలు ఈ సమాజానికి పట్టవు అనే ధోరణిలో ఉన్నాం ఇంకా. కానీ ఈ సాక్షి ధోరణి ఎంతో కాలం చెల్లదు. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభాలు, తద్వారా తలెత్తే జాతి వివక్ష, వైవాహికంగా ఇతర జాతులవారితో సంబంధాలు, మొదలైన అంశాలు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. మొత్తమ్మీద మన కథకుల దృష్టి ఇప్పుడిప్పుడే మన కుటుంబ పరిధుల్ని దాటి సమాజంలోకి ప్రసరిస్తోంది. ఈ విషయంలో నిజ జీవిత అనుభవాలు, పరిణామాలకంటే మన రచనల్లో చిత్రణలు వెనుకబడే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక్కడ చర్చించిన కథల వంటివి ఇంకా విరివిగా రావాలి. అన్ని కోణాల నించీ భారతీయ అమెరికన్ సమాజపు అనుభవాలని మన కథలు రికార్డు చేసుకోవాలి.

 

ఈ వ్యాసంలో చర్చించిన కథలు

తోడు - విన్నకోట రవిశంకర్

ఆ ఇంట్లో ఒక రోజు - సాయి బ్రహ్మానందం గొర్తి

ఇనుపతెర - మధు పెమ్మరాజు

విండో షాపింగ్ - విజయ కర్రా

ది కప్లెట్ - కల్పన రెంటాల

OOO

bottom of page