top of page

బూస్ట్  యువర్  బేబి ఐ.క్యూ!

Ramanuja Turlapati

ఆహ్వానిత మధురాలు

రామానుజరావు తుర్లపాటి

Bio

రామానుజరావు తుర్లపాటి

వృత్తి రీత్యా బ్యాంకర్ని. రాయడం, లెక్క వెయ్యడం జీర్ణించుకు పోయిన లక్షణాలు.  అప్పుడప్పుడు మాత్రమే రాస్తుండడం, రాసినవి అచ్చుకు, లేదా వెబ్ మ్యాగజైన్లకు పంపక పోవడం చాలా రోజులుగా అలవాటు. నా మొదటి కథ “దోమాయణం” (హాస్య కధ)1989 జ్యోతి (మంత్లీ) దీపావళి  స్పెషల్ ఇష్యూలో ప్రచురింపబడింది. అ తర్వాత కొన్ని కథలు అప్పుడప్పుడూ ఆంధ్ర భూమి, అరుణతార, విపుల మొదలైన పత్రికల్లో ప్రచురితమైనా, ఆ తర్వాత ఎక్కువగా కవితల మీద, అనువాదాలు చెయ్యడం పైన దృష్టి పెట్టాను. పియర్సన్ ఎడ్యుకేషన్ వారి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు (5), అపూర్వ పురోహిత్ (సీఈఓ, ఎఫ్.ఎం.రేడియో) రాసిన “లేడి యు ఆర్ నాట్ ఎ మాన్” అనే నవలకూ,  నిర్మలతో కలిసి తెలుగు అనువాదం చేశాను. టెక్నికల్ వ్యాసాలూ అనువాదం  చేశాను. గత రెండు మూడేళ్ళుగా  “హిందూ” పేపర్లో పడ్డ చిన్న ఆర్టికల్ తీసుకుని,  మరింత సమాచారాన్ని జోడించి వ్యాసాలను రాసి,  విహంగ మ్యాగజైనుకు పంపుతున్నాను. తమిళ రచయిత్రి శివ శంకరి నవల "The  Betrayal” తెలుగులోకి అనువాదం చేశాను. విహంగ మాగజైనులో సీరియల్ గా ప్రచురింపబడింది. ఇప్పుడు అదే వెబ్ మ్యాగజైనులో “సహజీవనం” అనే సీరియల్ రాస్తున్నాను. ఇప్పటి వరకు 16 కధలు రాస్తే అందులో సగం ప్రచురించబడ్డాయి. నా హాస్య కధ “కంప్యుటర్ కవిత” “NATS 2015 సంబరాల పోటిలో” బహుమతి గెలుచుకుంది. ఇప్పటి దాకా సుమారు 25  తెలుగు కవితలు, 12 దాకా ఇంగ్లీష్ లో కవితలు, ఒక 4 ఇంగ్లీష్ కవితల అనువాదాలు చేశాను. త్వరలో నా కవిత్వం  ఇ పుస్తకంగా వెయ్యాలని సంకల్పం.

 

***

 

Nirmala Kondepud

“నెక్స్ట్ “ పిలిచింది  సుస్మిత  వాచీ చూసుకుంటూ. తొమ్మిది గంటలయ్యింది. ఇప్పటికే  భర్త రమేష్, రెండు సార్లు ఫోను చేశాడు. ఇవాళ చాలా కేసులు రావడంతో ఆలశ్యం అయ్యింది. ఇదే లాస్టు కేసు. తొందరగా చూసి పంపించేస్తే, ఇంటికి వెళ్ళిపోవచ్చు.

బయట స్టూల్  మీద కూర్చున్న  నరసింహం  తలుపు తెరిచి, సహజను లోపలికి పంపించాడు. సహజ లోపలికి వస్తూనే  డాక్టర్  వంక చూసింది.  సుస్మితకు  సుమారు ముఫై  అయిదేళ్ళు వుండవచ్చు. మంచి అందమైన విగ్రహం. సాయంత్రం  నాలుగు గంటల నుంచి, ఒకొక్క పేషంటునీ  చూసి పంపిస్తున్నా, ఆమెలో అలసిపోయిన  ఆనవాలు ఎక్కడా లేదు.

సుస్మిత తలెత్తి ఆమె  వంక చూసింది. సహజకు సుమారు ముఫై  ఏళ్లు వుంటాయేమో.  కట్టు బొట్టూ చూస్తే  మధ్య తరగతి కుటుంబానికి చెందినట్లు వుంది.  ఆమె ఒక్కతే వచ్చింది.. సాధారణంగా ఇలాంటి కేసుల్లో భార్యా,భర్తలు ఇద్దరూ కలిసి వస్తారు. మరి ఈమె ఒక్కతే రావడానికి  కారణం ఏమిటో.  ఒక వేళ భర్త వూళ్ళో లేడేమో. లేకపోతే వంటరిగా వుంటోందో. అలా అయితే ఈమె  తన ఫీజులు భరించ గలదా? ఆలోచిస్తూ ఆమె వంకే చూసింది సుస్మిత. 

 

“ నమస్తే డాక్టర్, నా పేరు సహజ “  పరీక్షగా తననే చూస్తున్న సుస్మిత చూపులకు ఇబ్బంది పడుతూ చెప్పింది.

ఆమె  స్థిమితంగా కూర్చున్నాక, “ ఇప్పుడు చెప్పండి?” అంది సుస్మిత.

“నా  పేరు సహజ, నేనొక టీచర్ని.  ఈ మధ్యే నా భర్త నుంచి  విడాకులు తీసుకుని విడిగా వుంటున్నాను.”

“అలా అయితే మీరు మా ఫీజులు భరించలేరేమో?” అడిగింది సుస్మిత, కుదరని బేరం కోసం తన సమయం ఎందుకు వృధా చేసుకోవడం అన్న ఆలోచనతో.

“మీ ఫీజు  వివరాలు  తెలుసుకునే వచ్చాను డాక్టర్. అయితే నాకు మరి కొన్ని వివరాలు కావాలి. మీ క్లినిక్ లో  గర్భస్థ శిశువుకు శిక్షణ  ఏ రకంగా ఇస్తారు?” అడిగింది సహజ.

“మీకు ఇచ్చిన పాంప్లేట్ లో ఆ వివరాలు అన్నీ ఉన్నాయి. చదవ లేదా?” అడిగింది సుస్మిత విసుగ్గా.

“ఎస్ డాక్టర్,  ఇక్కడ మీరిచ్చిన  పాంప్లేట్ కు, నేను  వూహించిన దానికి తేడా వుంది. మీరు డెలివరి తేలికగా అవడానికి కొన్ని ఎక్సర్సైజులు చెబుతున్నారు. పుట్టబోయే పిల్లల ఐ.క్యూ. పెరగడానికి కొన్ని కేసెట్లు వినిపిస్తున్నారు. అవునా?” అడిగింది.  

సుస్మితకు ఇంటి  దగ్గర ఎదురు చూసే  రమేష్ , బాబు గుర్తుకు వచ్చారు.

“అవును, మీరు ఇంతకీ విషయం చెప్పడం లేదు. మీకిప్పుడు ఎన్నో నెల? మీ బిడ్డ ఏం కావాలని మీరు కోరుతున్నారు? మనం ఇవి మాట్లాడుకుంటే బాగుంటుంది. మీ సమయం, నా సమయం కూడా   వృధా కావు” కొంచెం కరుకుగా  చెప్పింది  సుస్మిత. 

“సారీ డాక్టర్, ఈ సమయంలో నేను మిమ్మల్ని విసిగిస్తున్నానేమో. ఎప్పుడో నాలుగు గంటలకే వచ్చాను. చివర దాకా ఆగితే మీతో తీరుబడిగా మాట్లాడవచ్చని ఇప్పటి దాకా ఆగాను. మీకు తొందరగా వుంటే, నేను మళ్లీ వస్తాను” చెప్పింది సహజ.

ఆమె దాదాపు అయిదు గంటలు వేచి వున్నదని వినగానే  సుస్మిత నొచ్చుకుంది.

 

“అరే, ఇంత సేపు ఆగారా? అప్పుడే వచ్చేస్తే  సరిపోయేది. నాకోసం ఇంటి దగ్గర బాబు ఎదురు చూస్తుంటాడు, లేకపోతే తొందరేం లేదు” అంది సుస్మిత.

“అలా అయితే నేను మళ్లీ వస్తాను“ అంటూ లేచింది సహజ.

 

“పర్లేదు, కూర్చోండి.” అంటూ ఫోన్ తీసి, “రమేష్, ఒక్క పదిహేను నిముషాలు! బాబుకు ఆకలేస్తే కాస్త అన్నం పెట్టేయ్. ఇక్కడొక ముఖ్యమైన కేసు ఉంది, అవడం ఆలశ్యం వచ్చేస్తాను.” అంటూ భర్తకు చెప్పి,”ఇప్పుడు చెప్పండి వివరంగా” అడిగింది సుస్మిత.

“థాంక్స్, డాక్టర్! నా  కోసం  కొంత సమయం కేటాయించినందుకు చాలా థాంక్స్. నా  విషయానికి వస్తే, నేనొక అనాధను. అనాధ శరణాలయంలో వుంటూ కొందరు పుణ్యాత్ముల దయ వల్ల   డిగ్రీ, బి.ఎడ్., చేసి, మావూళ్ళో స్కూల్లో  సైన్సు టిచర్ గా పని చేస్తున్నాను. గత అయిదు  సంవత్సరాల నుంచి నాకు, మాస్కూల్లోనే పని చేస్తున్న మరొక లెక్కల టిచర్ కు స్నేహం కలిసింది. అది ప్రేమగా మారి మేము  మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాము. వాళ్ళ పెద్ద వాళ్ళకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎక్కువ కట్నం తెచ్చే సంబంధాన్ని కాదని నన్ను చేసుకున్నాడని నా  మీద పగ  బట్టి, అతనికి రోజు నా  మీద చాడీలు చెబుతుండే వారు.  మొదట్లో అతను వాళ్ళ మాటలు నమ్మక పోయినా, రాన్రాను వాళ్ళు ఏం చెప్పినా నమ్మడమే కాదు, నన్ను తిట్టడం, చివరకు  తాగొచ్చి కొట్టడం కూడా మొదలు పెట్టాడు. అది రోజు వారీ కార్యక్రమం అయిపోయింది. చివరికి నన్ను అనుమానించి, నిందలు వేసే  స్థాయికి వెళ్ళడంతో, ఈ మధ్యనే  విడాకులు తీసుకున్నాను. అతను నేను పని చేస్తున్న స్కూల్లోనే తనూ  వుండడం ఇష్టం లేక, ట్రాన్సఫర్ చేయించుకుని  తన  వూరు వెళ్ళిపోయాడు. ఇదీ నా  బాక్ గ్రౌండ్ కధ.” అంటూ వూపిరి పీల్చుకుంది.

 

“అలాంటప్పుడు,  మీ పాపనో, బాబునో  మీరొక్కరే పెంచ గలరా?  అది మీకు అదనపు భారం కాదా? ఆ తర్వాత అతను పుట్టిన బిడ్డ తనకు కావాలని కోర్టు కెక్కితే ఏం చేస్తారు ?” అడిగింది సుస్మిత.

 

“మీ ప్రశ్న నాకు అర్ధ అయ్యింది. అతను నాపై మోపిన అభియోగమే, విడాకులు తీసుకోవడానికి  కారణం. నాకు గర్భం  తన వల్ల  రాలేదనే నింద  మోపాడు.  అప్పుడే  నేను అతన్ని అసహ్యించుకుని దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల  అతను ఏ కారణంగా అయితే విడాకులకు అప్లై చేసాడో, ఆ కారణాలేవీ నేను  కోర్టులో కంటెస్ట్  చెయ్యలేదు. అతని పీడ వదిలితే చాలని విడాకులకు ఒప్పుకున్నాను. రేపు మళ్లీ ఈ సంతానం నాదేనని నా  దగ్గరకు రాలేడు. వచ్చినా, కాదనడానికి నాకొక రీజన్  వుంది.”

సుస్మిత ఆమె చెప్పిన విషయం అర్ధమైనట్లు తల వూపింది.

 

“ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. మీరు  ఇచ్చే ఈ ప్రీ నాటల్ ట్రైనింగ్ లో  గర్భస్థ శిశువుకు  ఐ.క్యూ. పెరిగే  ట్రైనింగ్  ఇస్తున్నారు. అది మంచిదే. ఒప్పుకుంటాను. కానీ నాకు  అలాంటి మేధావులు అక్కర్లేదు డాక్టర్!” అంది సహజ.

ఒక్క క్షణం తెల్లబోయింది సుస్మిత. “అలాంటప్పుడు నా  దగ్గరకు ఎందుకు వచ్చినట్లు?” అడిగింది అసహనంగా.

“నాకు పుట్టబోయే సంతానం ఏ రామానుజమో, ఐన్ స్టినో కావాలని అనుకోవడం లేదు. దానికి బదులు ఒక మంచి వ్యక్తిత్వం వున్న మనిషిగా వుండాలి. ఒక ఉత్తమ పౌరుడిగా  రూపు దిద్దుకోవాలి. తల్లి తండ్రి మీద ప్రేమ, పెద్ద వాళ్ళ పట్ల గౌరవం, కష్టాల నెదుర్కొనే ధైర్యం, సమాజం పట్ల బాధ్యత, దేశ భక్తి, కష్టపడి పైకి రావాలన్న తపన- ఇవన్నీ వున్న ఒక ఉన్నత వ్యక్తిత్వం కల మనిషిగా పెరగాలి” ఆవేశంగా చెప్పింది సహజ.

“అందరికన్నా విచిత్రంగా ఆలోచిస్తున్నావు” ఆశ్చర్యపోయింది సుస్మిత.

“నేను విచిత్రంగా ఆలోచించడం లేదు డాక్టర్! మీ చుట్టూ వున్న వాళ్ళు అలా వున్నారు. వాళ్ళకు తగ్గట్టుగా మీరంతా అలాగే మారుతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి. అందరూ తమ పిల్లలు మేధావులో, గొప్ప విద్వాంసులో కావాలనుకోవడం మీకు సహజంగా కనిపించ వచ్చు. కానీ, అందరూ మేధావులే అయితే ఏమిటి ప్రయోజనం? ఎవరికి  వారు మేము గొప్పంటే మేము గొప్పని తన్నుకు చావడాని తప్ప ఏమీ వుండదు. ఒక చిన్న ఉదాహరణ. ఒకప్పుడు ఇంజనీర్ అంటే చాలా గొప్ప. ఇప్పుడు ఇంటికి కనీసం ఇద్దరు ఇంజనీర్లు. ఇంజనీర్ అని తప్ప  తెలివితేటలూ, మేధో సంపత్తి అసలు మనం ఒక అర్హతగా గుర్తిస్తున్నామా? ఈ  పోటీ ప్రపంచంలో ఇప్పుడే ఒకరికొకరికి పడక, , చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో, పదవుల కోసమో కులాలు, మతాలు, ప్రాంతాలుగా చీలిపోయి తన్నుకుంటున్నాము. నైతికవిలువలు  పతనమై సమాజంలో  లంచగొండులు, స్వార్దపరులు పెరిగిపోయారు. తల్లి తండ్రులను ముసలితనంలో వదిలివేసేవారు, ఆస్తి కోసం చంపేసే వారు,కట్నం డబ్బు చాలక భార్యను చంపేసేవాళ్ళు, చివరికి దేశ భక్తి వదిలేసి శత్రు దేశాలకు మన రహస్యాలను అమ్మేసే వారు –ఇవన్నీ మనం చూస్తూనే వున్నాం. హత్యలు, అత్యాచారాలు సాధారణమైపోయాయి.  మనిషి మంచి వాడు కానప్పుడు ఎంత  మేధావి అయినా అది అతని  స్వార్థానికే ఉపయోగ పడుతుంది తప్ప  సమాజానికి కాదు.  పుట్టేది ఆడ పిల్ల అయినా , మగ పిల్లవాడైనా ఒక మంచి మనిషిగా, మానవత్వం వున్న మనీషి గా పెంచాలని నా కోరిక. మీరు ఇచ్చే ఈ ట్రైనింగ్ వల్ల, పుట్టబోయే పిల్లలు  ఏదో ఒక రంగంలో గొప్ప వారుగా ఎదగ వచ్చు. కానీ, నాకు కావాల్సింది, ఆ మాట కొస్తే  నాకే కాదు, ఈ నాటి సమాజానికి కావాల్సింది మేథో సంపత్తి ఒక్కటే  కాదు డాక్టర్! మనిషి మనిషిగా, నిజాయితీగా,  నిస్వార్ధంగా బతకడం మనం నేర్పాలి. కాదంటారా?” గబగబా మాట్లాడి సహజ ఆయాస పడింది.

సుస్మిత  తన ముందున్న మంచి నీళ్ళ  గ్లాసు సహజ ముందుకు తోసి వాచీ చూసుకుంది. సమయం తొమ్మిదిన్నర!

సహజ ఆమె వాచీ చూడడం చూసి,” సారీ డాక్టర్, మీకు చాలా లేటయ్యింది, నా  మూలంగా “ అంది సిగ్గు పడుతూ.

“లేదు, సహజా,  నిన్ను కలుసుకోవడం చాలా మంచిదయ్యింది.  ఈ వూళ్ళో మీ వాళ్ళెవరైనా ఉన్నారా? నువ్వెక్కడ  దిగావో చెబితే, నిన్ను అక్కడ  దింపేసి  వెడతాను” అంటూ లేచింది.

“థాంక్స్ డాక్టర్, ఇంతకీ నా  విషయంలో మీ నిర్ణయం చెప్పలేదు.” నెమ్మదిగా అడిగింది సహజ.

“నీ పేరు సార్ధకత చేసుకున్నావు. నీకు గురు దక్షణ ఇవ్వాల్సిందే” అంటూ నవ్వుతూ లేచింది  సుస్మిత.          

 

ఇంటికి రాగానే విసుక్కున్నాడు రమేష్.”ఏంటిది, సుస్మితా! ఇంత లేటు చేస్తే ఎలా? చూడు, బాబు నీ కోసం చూసి చూసి నిద్ర పోయాడు.”

“ఇవాళ లేటుకు ఒక అర్ధముంది. ముందు బట్టలు  మార్చుకు వస్తాను. అన్నం తినేద్దాం, ఆకలేస్తోంది. తర్వాత నీకు అంతా వివరంగా చెబుతాను” అంటూ గబగబా గదిలోకి వెళ్ళింది సుస్మిత.

భోజనం చేసాక ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. రమేష్ టి.వి. ఆన్ చేస్తూ, “ఇప్పుడు చెప్పు, ఆ విషయమేమిటో” అన్నాడు. “ నేను చెప్పేది విని నిదానంగా ఆలోచించు” అంటూ  సుస్మిత అతని చేతిలో రిమోట్ తీసుకుని టి.వి.కట్టేసింది.

“మనం ఇచ్చే ఈ ప్రీ నాటల్ ట్రైనింగ్  ప్రయోజనం ఏమిటంటావు?” ప్రశ్నించింది.

“అదేం ప్రశ్న? పుట్టబోయే పిల్లలు మంచి ఐ.క్యూ.తో పుడతారు. పెరిగి పెద్ద వారై మేధావులవుతారు.  సమాజానికి, దేశానికి కావల్సిన రేపటి పౌరులను ఏదో ఒక రంగంలో  మేధావులుగా తయారు చేస్తున్నాము. ఇంతకంటే కావాల్సింది ఏముంది?” అన్నాడు రమేష్.

“అందరం అదే భావనలో వున్నాం. కానీ ఇందాక ఒక టీచర్ వచ్చింది. ఆమె చెప్పింది వింటే ఆశ్చర్య పోతావు, ఎంత బాగా ఆలోచించిందనీ” అంటూ సుస్మిత తమ సంభాషణ అంతా వివరంగా చెప్పింది.

“ఆవిడ చెప్పింది నిజమే కావచ్చు. కానీ, నువ్వు ఒక్క విషయం ఆలోచించడం లేదు. ప్రతి వాడు తన పిల్లలు ఒక  ఐన్ స్టీన్,  ఒక రామానుజం లాంటి  గొప్ప వాళ్ళుగా తయారవ్వాలని  కోరుకుంటారు గానీ, మానవత్వం వున్న గొప్ప వ్యక్తులు అయితే చాలని ఎంతమంది అనుకుంటారు? నువ్వు మేధావులుగా పెరిగేందుకు ట్రైనింగ్  ఇస్తావంటేనే  నీ దగ్గరకు నలుగురూ వస్తారు. అంతేకాని, ఉత్తమ పౌరులను  సృష్టిస్తానంటే ఎవరూ రారు.  చివరికి అది మన వృత్తికి  దెబ్బకొడుతుంది ” అన్నాడు రమేష్.

“లేదు, రమేష్! ఆమె చెప్పింది జాగ్రతగా ఆలోచిస్తే, నిజంగా మనం చెయ్యాల్సింది చాలా  వుందనిపించింది.  మనం ఐ.క్యూ. పెరగడమే మాత్రమే చూస్తున్నాం. అలా  కాకుండా  ఈ సమాజంలో  ఒక మంచి పౌరుడిగా ఎదిగేందుకు అవసరమైన సామాజిక ధర్మాలు కూడా మన ట్రైనింగు లో ఎందుకు చేర్చకూడదు?” అడిగింది సుస్మిత.

“అంటే, ఎలా చేద్దామని?” అడిగాడు రమేష్.

“ఉదాహరణకు వేమన, సుమతీ నీతిశతకాలు  చేరుస్తాము. ఏ యుగానికైనా పనికి వచ్చే నీతి సూత్రాలు అవి. అలాగే కొన్ని భర్తృహరి  సుభాషితాలు ఏరి కుర్చుతాము. ఇవే  కాక క్రీస్తు చెప్పిన బోధలు, ఖురాన్ సుభాషితాలు – ఇలా అన్ని మతాలూ బోధించే సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని నేర్పుదాము. పుట్టే  పిల్లలందరూ  ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు  అవసరమైనవన్నీ, మన ట్రైనింగ్ లో చేరుద్దాము. దీనికి అవసరం అయిన కోర్సు లాంటిది తయారు చేద్దాము. సమాజంలో ఉన్నత వ్యక్తుల అభిప్రాయాలు,అనుభవాలు  తీసుకుందాము. ఇందువల్ల మనకు ఎటువంటి నష్టము లేదు. సమాజం పట్ల మన బాధ్యత నెరవేర్చిన వాళ్ళం అవుతాము” అంటూ ముగించింది సుస్మిత.

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
 

Comments
bottom of page