top of page

కథా​ మధురాలు

ఆత్మ దర్శనం

 

తమిళ మూలం : జయకాంతన్
తెలుగు అనువాదం : రంగన్ సుందరేశన్.

Rangan Sudareshan.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

ఆ వార పత్రిక కార్యాలయంలో తనొక ఉప సంపాదకుడుగా ఉద్యోగం చేసేది గొప్పగా చెప్పుకుంటూ - రోజూవారీ ప్రచురణకి వచ్చే కధలు పంపినవారి అడ్రసులు గుర్తు చేసిన తరువాత తిరిగి పంపవలసిన కధలకి స్టాంపు అందించి - అడ్రసులు రాసి పంపే శివరామన్ కి - ఇవాళ, అతని పేరుకే ఒక పెద్ద పార్సల్ వచ్చింది. ఆ కవరుమీద ‘శివరామన్, ఉప సంపాదకుడు’ అని చదవగానే అతనిలో కొంచెం గర్వం కూడా లేచింది. ఆ పొడుగాటి కవరు చివరిని తన రెండు వేళ్ళతో పట్టుకొని, వంకర వంకరగా మలుపుతూ, అతను లాఘవంగా చింపాడు. అందులోని కాగితాలు ఒక కట్టగా ఉన్నా, ఒక కాగితం మాత్రం నేల వాలింది.  అదే తను చదవవలసిన ఉత్తరం అని గ్రహించి, దాన్ని తీసుకొని చదవసాగాడు.

“ప్రియమైన శివరామన్:

దేవుడు దయవలన నీకు సకల భాగ్యములు కలగాలని నా ప్రార్దన. మీరందరినీ నేరుగా కలుసుకోకుండా ఇలా వచ్చేసినందుకు నాకు బాధగా ఉంది. కాని ఆలోచించి చూస్తే ప్రేమానురాగాలు మనసులో లోతుగా పాతుకొనివుంటే, మాటలు కొఱతగా కనిపించవు. కాని అలాంటి ఆలోచన వలన నేను మీతో చెప్పకుండా రాలేదు.   అది నాకు తెలుసు.   నిజం చెప్పాలంటే నాకు ధైర్యం లేదు, అందుకే మరేం చెప్పకుండా వచ్చేసాను.   అవును, ఏదైనా చెయ్యాలంటే మనిషికి ధైర్యం కావాలి.   నా అనుభవంలో ఒక పని చెయ్యడం సులభం, దానిగురించి చెప్పడం కష్టం.   మనం ఎన్నో పనులు - మంచివీ, చెడ్డవీ చేస్తాం - కాని వాటిగురించి ఆరసించి, వివరంగా చెప్పాలంటే సాధ్యమా? నాకు ఊరునుంచి పారిపోవాలనే ఆలోచన రాగానే మీరందరికీ చెప్పాలనుకున్నాను, కాని ఆఖరికి ఏమీ చెయ్యకుండా అక్కడే కూర్చుంటానేమో అనే అనుమానమూ కలిగింది.   నాకు తెలుసు, నేను వెళ్తానంటే మీరెవరూ ఏడవరు.   కాని నేను ఏడుస్తానే? నీ భార్య మాటలు నా చెవుల్లో వినిపిస్తున్నాయి: ‘అతనొక జడ్డి బ్రాహ్మణుడు!’   అవును. నిజం, అందుకే ఇప్పుడు వచ్చేసాను.

నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అని మీకందరికీ ఆతురతగా ఉంటుంది.   నాకు తెలుసు. ఈ ఉత్తరంతోబాటు  ఒక కట్ట కాగితాలు గిలికిరాసినవి ఉన్నాయి. నీకు అవకాశం అన్నప్పుడు చదివిచూడు, నీకు నా మనస్సాక్షి బోధపడుతుంది. నీకు బోధపడుతుందని నా నమ్మకం. నీకు బోధపడినా, లేకపోయినా నాకు విచారం లేదు. ఒక నెలగా నీకు రాయాలని నేను ఆలోచిస్తున్నాను.  నిజం చెప్పాలంటే ఈ ఉత్తరం తప్పిస్తే  ఆ కట్టలో ఉన్నదేదీ నేను నీకోసం రాయలేదు.  నాకు తోచినవన్నీ - ఎందుకని తెలియకుండానే - నా కోసమే రాసాను, ఇంకా రాస్తూనే ఉన్నాను.  ఇదంతా నా చూపు - ఆత్మ విమర్శన - కాదు, ఆత్మ దర్శనం! హఠాత్తుగా ఒక రోజు ఆలోచన రాగానే, ఇంతవరకూ రాసినది నోటుబుక్కునుంచి చింపి నీకు పంపుతున్నాను.  ఇదీ పిచ్చితనమేమో, ఎవరికి తెలుసు? కాని ఒకటి.  నీ పెళ్ళాంకి చెప్పు.  ‘జడ్డి బ్రాహ్మణుడుగా ఎవరూ ఉండకూడదు.  జడ్డిగా ఉంటే వాడు బ్రాహ్మణుడు కాదు! బ్రాహ్మణుడు అంటే ప్రతిభావంతుడు, మేధావి.  ఆ కులంలో పుట్టి, పెద్దలు పెట్టిన నేను   గణపతి అనే పేరుని పోగొట్టుకొని జడ్డి బ్రాహ్మణుడుగానే  అరవై సంవత్సరాలు గడిపేసాను. 

సరేలే, అవన్నీ పోనీ.  ఇప్పుడు నేను సంతోషంగా, గౌరవంగా - అరవై సంవత్సరాల తరునాత - సంతోషంగా, గౌరవంగా ఉన్నాను. ప్రాప్తం ఉంటే మనం మళ్ళీ కలుసుకుందాం.  మీరందరూ నన్ను మరచిపోయారేమో - నాకెదీ మరవడం సాధ్యం కాదు.  ” -  ఇలాగ, నీ తండ్రి, గణపతి శాస్త్రి.   

‘గణపతి శాస్త్రి’ అనే సంతకంలో ‘శాస్త్రి’ అనే పదం కొట్టేసి ఉంది.

కవరులోని కట్ట కాగితాలని చేతిలోకి తీసుకొని, సంపాదకుడు అనే ధోరణిలో శివరామన్ అందులో ఎన్ని పేజీలున్నాయని పరిశీలించాడు. పేజీలలో సంఖ్యలు లేవు. అవన్నీ ఒక నోటుబుక్కునుంచి చింపిన కాగితాలు కాబట్టి కొనలో అనియమితంగా తునకలు కనిపించాయి. కొన్ని పేజీలలో పెన్సిల్ తోనూ, కొన్ని పేజీలలో కలంతోనూ రాసినవి దీర్ఘమైన చింతనతో, చాలా రోజులుగా మనసులో పాతుకుపోయిన స్పష్టమైన ఆలోచనలు - దిద్దబాటులు, తప్పులు లేకుండా - కనిపించాయి. అన్ని పేజీలు ఒకేసారి పూర్తిగా చదివేయాలని అతనికి ఆతురత, కాని అందుకు సమయం లేదు, ఇతర ఆఫీసు పనులున్నాయి. శివరామన్ ఆ కట్టని భద్రంగా తన సంచిలో తీసి ఉంచాడు.  అది ఎక్కడ నుంచి వచ్చిందని మళ్ళీ మళ్ళీ కవరుని తిప్పి చూసాడు.

పంపినవారి పేరూ, అడ్రసు అందులో లేదు. తపాలు ముద్ర చూసి అది డిల్లీనుంచి వచ్చిందని తెలియగానే శివరామన్ నివ్వెఱపోయాడు. ‘ఎంత ధైర్యంతో నాన్నగారు మనకి చెప్పకుండా ఇంత దూరం పారిపోయారు!’ అని అతను ఆశ్చర్య పడినప్పుడు, కపటం, మోసం ఎరుగని ఆ తండ్రి మనసు ఎంత తీవ్రంగా బాధపడిందని అతని కళ్ళు తడిసిపోయాయి.  ఆ క్షణం తన తండ్రిని - ఆ జడ్డి బ్రాహ్మణుడుని - క్షవరం చేసుకోకుండా, నెరసిన గడ్డంతో, ముందు వరుసలో పళ్ళు పోగొట్టుకొని, గాట్లు పడిన మొహంని - గుర్తుచేసుకున్నాడు.

**

ముందటి మాసం, గణపతి శాస్త్రి, అమావాస్యకి మరుదినం, హఠాత్తుగా కనిపించలేదు.

మొదటి రెండు రోజులూ అతని కుటుంబ సభ్యులు - కుటుంబ సభ్యులంటే మరెవరు? - అతని ఇద్దరు కొడుకులు - శివరామన్, మణి - ఎక్కువగా బాధపడలేదు.

నలుగైదుగురు శాస్త్రులతో అతను కాంచీపురం వెళ్ళారని ఎవరో చెప్పడం విన్నతరువాత అతని కోడలు రాజం “ఇతనేం మనిషి! వెళ్ళినప్పుడు ఇంట్లో చెప్పి వెళ్ళకూడదా? ఇతనుండేది ఇల్లా, సత్రమా?” అని చిరచిరలాడింది. కాని కొన్ని రోజుల తరువాత ఆ నాలుగైదు శాస్త్రులు గణపతి శాస్త్రి తమలో రాలేదని చెప్పిన నిమిషం రాజం ఒక క్షణం నివ్వెఱపోయి వెంటనే అతన్ని తిట్టడం ఆపేసింది.

‘ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు?’ అని ఆమె తనలో తనే వాపోయింది.  మరే కూతురో, అతన్ని ఆదరించే బంధువులెవరూ లేరని మామగారి అవస్థని గుర్తు చేసుకొని నిట్టూర్పు వదిలింది. శివరామన్ మనసులోనూ అలజడి చోటుచేసుకుంది.  

రోజూ సాయంకాలం ఆఫీసునుంచి ఇంటికి తిరిగివచ్చినప్పుడు  శివరామన్ కళ్ళు దారిలో కోవెల పక్కన ఉన్న చెరువు గట్టుదగ్గర గూమివున్న శాస్త్రులలో  తన తండ్రికోసం వెదికి వెదికి విఫలమయ్యాయి.

అతనికి తెలుసునా? ఊరులో ఉన్నప్పుడు కూడా అతను ఈ గుంపుకి విడిగానే నిలబడేవారు. అవును మరి - ఎవరికి కావాలి ఈ జడ్డి బ్రాహ్మణుడు సహవాసం?

రానూరానూ తన తండ్రిగురించి ‘అతనికేమైందో, అతను ఎక్కడ ఉన్నారో, లేకపోతే మరేమైనా.  ’ అనే బెంగ, తన మనసుని రహస్యంగా ఆవరించుకుందని శివరామన్ గ్రహించాడు. కాని దాని గురించి బాహాటంగా మాట్లాడడానికి అతను జంకాడు. తన భార్య రాజం “ఈ ప్రపంచంలో ఇంతవరకూ కనిపించని నాన్నగారికి మీరు పుట్టారు, ఊరికే ఏడవకండి!” అని మండిపడుతుందని భయం.  తన తమ్ముడుకూడా తనలాగే మనసులో నాన్నగారికోసం బాధ పడుతున్నాడా లేక ‘ఈ ముసలివాడు పోతే మనకేం?’ అనే నిరాపేక్షతో ఉన్నాడా అని తెలియక శివరామన్ చిత్రవధ అనుభవించాడు. అలాగైతే అది మహాపాపమనిపించింది. బాల్యంలో - బాల్యమెందుకు -  ఇప్పుడుకూడా అతన్ని నాన్నగారు అని  చెప్పుకోడానికి తనూ, తమ్ముడూ సిగ్గుపడిన కొన్ని ఘటనలు అతనికి జ్ఞాపకంలో వచ్చాయి.

గణపతి శాస్త్రిలాంటి వికారమైన నల్ల బ్రాహ్మణుడు జడ్డి నవ్వు, లొట్ట కన్నుతో వచ్చి నిలబడితే ఎవరి మనసులోనూ మెచ్చుకోలు కనిపించదు. కొందరికి అతన్ని చూస్తే జాలిగా ఉంటుంది. కొందరికి  పరిహాసంగా ఉంటుంది. అతను నోరు తెరచి, బోసి నవ్వుతో, పాపలాగ ఏమేమో చెప్తారు. మాటల్లోని అర్ధం ఎవరు వింటారు? అది చాలామందికి ‘బోర్’ గానే ఉంటుంది. హేళన, పరితాపంకి వశమైన తన్ను ‘తండ్రి’ అని చెప్పుకోడానికి తన పుత్రులు సిగ్గుపడడంలో న్యాయముందని గణపతి శాస్త్రి మనసులోనూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే గణపతి శాస్త్రికి ఊరులో  మర్యాద చూపేవారు ఎవరూ లేరు.  కొన్ని సమయాల్లో అతన్ని అవమానించారు కూడా.

ఏదైనా చెప్పి అతన్ని ఈసడించడం ఇతరులకి సరదాగా ఉంటుంది. ఇంటిలో అతని కొడుకులకి అతనంటే సిగ్గు, అవమానం.  అతని కోడలుకి అతనంటే ద్వేషం.

రాజంకి అతనంటే ప్రత్యేకంగా  పగ లేదు. ఇతరులని నిత్యమూ తప్పులెన్నడం, తిట్టడం ఆమెకున్న సహజ గుణాలు. ఆ ఏవగింపులో అతను చిక్కుకుకున్నారంటే అది రాజం పొరబాటు కాదే?

ఇలాగ ఎవరికీ అక్కరలేని గణపతి శాస్త్రి ఎక్కడికో పారిపోతే ఎవరికి నష్టం?

“ఇవాళతో పది రోజులు,  ఇరవై రోజులు.  అని లెక్కపెడుతూ వాళ్ళెందుకు ఇంటిలో రోజులు గడుపుతున్నారు?

“నామీద పగ తీర్చుకోవాలని అతను చేసిన కుట్ర ఇది.  ఊరులో అందరూ నన్నేకదా తిట్టుతారు? ఇంటిలో ఉన్నప్పుడు అతను నా ప్రాణం తీసారు, ఇప్పుడు లేకుండానే నా ప్రాణం తీస్తున్నారు ” అని రోజంతా రాజం నొచ్చుకుంటోంది.  తన మామగారు లేకపోవడం ఆమెకూ బాధగా ఉంది.

‘అతను ఉన్నప్పుడు నేను ఒకసారి కూడా అతన్ని గట్టిగా మందలించి మాటాడలేదు’ అనే భావన నిజంగానే రాజం మనసులో ఉంది.

ఈ ఒక నెల ఎడబాటు తరువాత అతను ఎక్కడైనా బతికి ఉన్నారా అనే ఆతురత వలన ఆ కుటుంబ సభ్యులకి అతనిమీద సానుభూతి, అభిమానం కలిగాయి. అతనెక్కడో అనాధగా వెళ్ళిపోయారనే భావనతో రాజం మనసులో అతని మృత దేహం గురించి భయకరమైన ఆలోచనలు లేచాయి. ‘ఈ పాపానికి నేనే కారణమా?’ అని లోలోపల బెదురుతూ రాజం రహస్యంగా కన్నీరు కార్చుతోంది.  ఆ సంగతి శివరామన్, మణి ఎరుగరు. 

**

పదిరోజుల ముందు ఆఫీసునుంచి తిరిగివస్తున్నప్పుడు కోవెల చెరువుగట్టు దగ్గర ఉన్న శాస్త్రుల గుంపులో -  పొట్టిగా, పుష్టిగా, నల్లగా కనిపించే తన తండ్రిని శివరామన్ వెతికినప్పుడు - అతన్ని వెంకిట్టువయ్యర్ చూసేసారు. వెంకిట్టువయ్యర్ అతన్ని వెంటపడుతూ బజారు వీధికి వచ్చారు. పరిసరాలు చూసిన తరువాత, తన వెంట ఎవరూ రాలేదని నిశ్చయం చేసుకొని “శివరామా, ఎలాగున్నావు??” అని పిలిచారు.

శివరామన్ తిరిగి చూసాడు.

“మీ నాన్నగారి గురించి ఏమైనా తెలిసిందా?” అని దగ్గరకి రాగానే అడిగారు వెంకిట్టువయ్యర్. అతను గణపతి శాస్త్రికి బాల్య మిత్రుడు. అదే వయస్సు.

శివరామన్ తనేదో పెద్ద పొరబాటు చేసినట్టు తపించిపోయాడు. తల వంచుకొని “ఏ కబురూ లేదు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని తెలీదు. ఇంటిలోనూ ఏ గడబిడా లేదు. మీకు తెలుసుగా మేం అతన్ని ఎలా చూసుకున్నాం అని.” అని మాటలు మింగాడు.  అతని కంఠధ్వనిలో అపరాధభావం మ్రోగింది.

“బాగుంది, అందుకు నువ్వేం చేస్తావ్? అలాగున్నా తండ్రి, కొడుకు మధ్య ఎన్నో సమస్యలుంటాయి.  అందుకని ఎవరైనా ఇల్లు వదిలి పారిపోతారా? సరేలే, నీకసలు  ఏం జరిగిందో తెలీదన్నమాట” అని వెంకిట్టువయ్యర్ చుట్టుపక్కల చూసారు. తరువాత కంఠస్వరం తగ్గించి “ఇలా రా, చెప్తాను. ” అని వీధికి ఓరగా ఉన్న భజన మఠంకి వాడితో నడిచారు.

గణపతి శాస్త్రి ఊరునుంచి పారిపోవడానికి ముందు రోజు కోవెల చెరువుగట్టు దగ్గర జరిగిన ఘటన అతను గుర్తుచేసుకున్నారు.

ఇద్దరూ వీధి మూల వచ్చి  నిలబడిన తరువాత వెంకిట్టువయ్యర్ మాటాడారు: “వాడి మనసు చితికిపోయిందిరా.  వాడిని అంత ఘాటుగా అతను అవమానించేసారు.   మరెవరు, మన సుందర ఘనాపాఠిగారు.  ” అని అంటూ ఒక చిట్కా ముక్కుపొడి పీల్చారు.

శివరామన్ ఏమీ బోధపడక అయోమయంగా చూసాడు. సుందర ఘనాపాఠి తన నాన్నగారిని అవమానించారా? ఏం, ఎందుకు?

సుందర ఘనాపాఠి అంటే శివరామన్ కి, అతని కుటుంబ సభ్యులకి చాలా గౌరవం, భక్తి. అతనే గణపతి శాస్త్రికి గురువు.  ఆ రోజుల్లో పేరు మోసిన పండితుడు, గణపతి శాస్త్రి తండ్రి - పరమేశ్వర  ఘనాపాఠిగారి ప్రియమైన శిష్యుడు. అతని దగ్గరే గణపతి శాస్త్రి వేద శాస్త్రాలు చదివారు. డెభ్బైయైదేళ్ళు నిండిన ఆ పండిత శిఖామణిని చూస్తే చాలు, అందరూ చేతులెత్తి మొక్కుతారు. ‘అతను తన తండ్రిని ఎందుకు  అవమానించాలి? ఘనాపాఠి ముక్కోపి అని అందరికీ తెలుసు.z

కాని అలాగేమైనా జరిగినా ఎవరు ఏం చెప్పినా దాన్ని లెక్క చెయ్యని పరబ్రహ్మమైన తన తండ్రి అందుకోసం ఊరు వదిలి పారిపోతారా?’ ఇలాంటి ఆలోచనలలో పడి, కలవరపడుతూ  “మీరేమంటున్నారు?” అని శివరామన్ అడిగాడు.

“నేను చూసినదే చెప్తున్నాను.  నాకేం భయం? వాళ్ళందరూ ఒక పక్షం లాగ, ఈ అన్యాయంగురించి ఏమీ మాటాడరేం? సుందర ఘనాపాఠి పెద్దవారు.  నేను కాదనను, కాని అతనికి ఈ వయస్సులో ఇలాంటి కోపం కూడదు.  అతను ఇంత మోటుగా మాటాడకూడదు.  ఆ దినం అతను తన  హోదాకి తగని మాటలంటూ ఎత్తిపొడిచారు.” విసుక్కుంటూ వెంకిట్టువయ్యర్ అంతకు మించి శివరామన్ ఆతురత ఏ స్థాయిలో ఉందని  పరికిస్తూ శివరామన్ మొహంలోకి పరీక్షగా చూసారు. “అసలు ఏం జరిగిందో నాకు తెలీదే.” అని శివరామన్ ప్రశ్నార్థకంగా చూస్తూ బదులు కోరాడు.

“నాకూ తెలీదు.  నేను కోవెలనుంచి వస్తున్నాను.  చెరువుగట్టుదగ్గర ఒకటే సందడి.  చూస్తే, మీ నాన్న దిమ్ముపట్టినట్టు నిల్చొని ఉన్నాడు. ఘనాపాఠి వాడిని కొట్టవచ్చినట్టు చేయి ఊపుతూ ఆవేశంతో గెంతుతున్నారు. వాడిని బాదడానికి అతనికి హక్కు ఉంది - కాని నోటికి వచ్చినట్టు.  ఛీ, ఛీ - అవేం ఒక బ్రాహ్మణుడు పలికే మాటలా? - అంత అసభ్యంగా అతను వాడిని తిట్టారు! గణపతి తలవంచుకొని అలాగే ఉన్నాడు. ఆఖరికి - వాడూ ఒక మనిషే కదా? - నాకూ ఆనిపించింది - తాళలేక అడిగేసాడు.  ‘మీరింత అసహ్యంగా  మాట్లాడుతున్నారు, మీరు బ్రాహ్మణులా?’ అని.  అవును, మొరటుగా అడిగేసాడు! అంతే, ఇక ఆ ముసలాయన ఏంచేసారో తెలుసా? తన కండువాని లాగి  గణపతి మెడలో  ఉరిలాగ వేసి మెలిపెట్టారు. ఆవేశం వచ్చినట్టు గాయత్రీ మంత్రం వల్లించారు.  “చెప్పరా, దీనికి అర్ధం చెప్పు, నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టావంటే చెప్పు.  నన్నే అడుగుతున్నావా నేను బ్రాహ్మణుడా అని?  మీరందరూ వీడిని బ్రాహ్మణుడా అని అడగండి!  ” అని వాడిని మోటుగా తిట్టారు.  జనం గుంపుగా కలిసిపోయారు, నేను వెళ్ళి దాన్ని చెదరగొట్టాలని చూసాను, కాని ముసలాయనకి ఎంత బలం! నన్ను పట్టుకొని అతను ఒక తోపు తోసారు, అంతే, నేను ఆ కోవెల చెరువు గోడమీద వాలాను!.  అతను ఇంకా అరుస్తూనే ఉన్నారు, అతనికి పిచ్చి ఆవేశం! ‘ఈ మంత్రంకి అర్ధం చెప్పు, లేకపోతే నువ్వు బ్రాహ్మణుడు కాదని ఒప్పుకో! నన్ను అడుగుతున్నావా, నీకెంత ధైర్యం!’ అని గర్జించారు.  అతని పట్టులో గణపతి దేహమంతా వొణుకుతోంది.  మాకు తెలుసు, మేమెవరూ ఘనాపాఠిని సముదాయించలేం.  అతని మూర్ఖత్యం గుర్తుచేసుకొని గణపతితో బతిమాలాడాం.  ‘చెప్పవయ్యా గాయత్రీ మంత్రం.  మొండితనం వద్దు.’ అని నేనూ చెప్పాను.  గణపతి నన్ను తేరిపాఱ చూసాడు, ఒక పసివాడిలాగా ఏడ్చాడు.

“నాకు మంత్రం మాత్రం తెలుసు, అర్ధం తెలీదు.” అని వాడు ఏడ్చినప్పుడు యాభై సంవత్సరాలముందు నేనూ, వాడూ కలిసి చదివినది గుర్తు చేసుకొని నేనూ ఏడ్చేసాను.

హఠాత్తుగా గణపతి ఘనాపాఠి చేతిని దులుపుకున్నాడు. ఇక ఏం జరుగబోతుందో అని మేం నిర్ఘాంతపోయి చూస్తున్నాం. పళ్లు కొరుకుతూ దేహంపైని తన జందెంని తీసేసి ఘనాపాఠి మొహంలో విసిరేసి గణపతి “ సరేలేండి, నేను బ్రాహ్మణుడు కాను!  నేను బ్రాహ్మణుడు కాను.  ” అని అరుస్తూ నాలుగు వీధులూ తిరుగుతూ ఎక్కడికో వెళ్ళిపోయాడు.  ఆ తరువాత వాడు కనిపించనేలేదు. దానిగురించే నిన్నడగాలని నేను అనుకున్నాను. కాని నీకు ఈ సంగతి తెలీదన్నమాట.” అని తనకి సంబంధంలేని - తమవంటి ఈ తరం బ్రాహ్మణులతో పొత్తులేని గణపతి శాస్త్రి అనే వ్యక్తి గురించి ఒక ఘటన  వెంకిట్టువయ్యర్ వివరంగా తెలియజేసారు.

వెంకిట్టువయ్యర్ వర్ణించిన వృత్తాంతంలో పాదుకున్న సామాజిక వ్యాకులత గ్రహించిన  శివరామన్ మరేం అనక నోరు మూసుకున్నాడు. అతనిదగ్గర శెలవు తీసుకోకుండా, తల వంచి, చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి నడిచాడు.

ఇల్లు చేరగానే ఒక మూల బోర్లపడి ఏడవాలని అతను దారంతా ఆలోచిస్తూ నడిచాడు.

కాని  ఇల్లు చేరినవెంటనే అతను అలాగేం చెయ్యలేదు. నాన్నగారి ఎడబాటు గురించి తను ఏడవడం చూసి ‘ఆమె’ చిరచిరలాడుతుందనే భయంతో ఆ ‘ఆశ’ వదులుకున్నాడు. 

**

ఇవాళ ఆఫీసునుంచి తిరిగివస్తున్నప్పుడు దారిలో కోవెల చెరువుగట్టుదగ్గర కనిపించే శాస్త్రుల గుంపులో శివరామన్ ఎవరినీ వెతకలేదు. తిన్నగా ఇంటికి వెళ్లి, తపాలలో వచ్చిన ఆ కాగితాల కట్టలో పెన్సిల్ తోనూ, కలంతోనూ రాసివున్న వార్తలు, చాలా కాలం తరువాత ఒక వయోజన హృదయం నుంచి బహిర్గతమైన రక్త బిందువుల అర్ధం తెలుసుకోవాలని అతను గబగబ నడిచినప్పుడు ఏ గుంపునీ చూడలేదు.

శివరామన్ ఇల్లు చేరుకున్నప్పుడు రాజం వంటగదిలో ఉంది. మణి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. వాడికి మౌంట్ రోడ్డులో ఒక పెద్ద చెప్పుల దుకాణంలో పని కాబట్టి రాత్రి ఎనిమిది గంటల తరువాత దుకాణం మూసిన తరువాతే వస్తాడు.

తన గదికి వెళ్ళి బట్టలు మార్చుకొని మొదటి పనిగా ఆ సంచినుంచి ఆ పొడుగాటి కవరులోని కట్టను తీసి  శివరామన్ చదవసాగాడు.

అతను చదివిన మొదటి వాక్యమే ఒక మహత్తైన చరిత్ర ఆరంభ వాచకంలాగుంది.

**        

“ఇదిగో, నా కళ్ళముందు లెక్కలేనన్ని జనులు సంచరించుతున్నారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకం. ఒకేలాగ ఇంకొకతను లేడు. అబ్బబ్బా, వెయ్యి రూపాల్లో వెయ్యిమంది! ఈ మైదానంలో నాకు ముందూ నా తరువాత లక్షలమంది మనుషులు నడుస్తున్నారు - బాల్యంలో మొట్టమొదట రంగుల రాట్నంలో ఆడినప్పుడు నేను అనుభవించినది - మూర్చపోయిన స్థితి - నాకు జ్ఞాపకం వస్తోంది. నాకంతా భ్రమగా ఉంది,  గుంపులో చిక్కుకున్న పాపలాగ తికమకలు పడుతున్నాను. ఈ లక్షలమంది జనుల్లో నాకెవరూ తెలిసినవారు లేరు. నన్నెవరూ లెక్క చెయ్యడం లేదు.  అదే నాకు హాయిగా ఉంది. 

ఈ డిల్లీ ఉందే, ఇది చాలా పురాతనమైన నగరం.  అశోక మహారాజు, మొగలాయ రాజులు, తెల్లదొరలు ఈ దేశాన్ని పాలించిన రోజులనుంచీ దీనికి ఖ్యాతి ఉంది. ఇప్పుడు ఇది మన దేశం అంటున్నాం. తరతరలుగా ఈ వినోదం  లోకంలో జరుగుతూనే ఉంది! ఈ నిమిషం జీవించే ఏ ప్రాణీ రెండు వందల సంవత్సరాలముందు లేదు.  రెండు వందల సంవత్సరాలముందున్న ఏ జీవీ ఇప్పుడు లేదు. అదొక విభాగం, ఇదొక వేరే విభాగం - ఆ విభాగం పోయి ఈ విభాగం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని ఎవరికి తెలుసు? కాని ఇది మాత్రం సత్యం: అది యావత్తూ పోయింది, ఇది పూర్తిగా వచ్చేసింది. లోతుగా ఆలోచించకుండా చూస్తే ఈ ప్రపంచంలో అన్నీ వింతగానే కనిపిస్తాయి - ఈ సంగతీ అలాగే - రెండు వందల సంవత్సరాలముందున్నవారు పోవడం, ఇప్పుడున్నవారు సమగ్రంగా రావడం ఆశ్చర్యంగా ఎంత ఉంది! వాళ్ళు కొంచెం మెల్లగా వెళ్ళారు, వీళ్ళూ మెల్లగానే వచ్చారు.  ఈ రాకపోకలు ఈశ్వర ధర్మం  అనుసరించి, ఆటంకం లేకుండా జరుగుతున్నాయి.  మానవ ధర్మంలోనూ అవి అలాగే పని చేస్తాయి, చెయ్యాలి కూడా.  ”

“ప్రకృతిలో ఏ చిక్కూ లేదు.  ఏ చిక్కూ లేదంటే అది  మనుష్యకృతం కాదన్న మాట.  నేనలాంటి కృత్రిమ చిక్కులో చిక్కుకున్నాను.  అలాంటి చిక్కుకే జీవితం అని పేరు.  ఆ చిక్కునుంచి తప్పించుకోడం మన బాధ్యత.  ”

ఆ కాగితాల్లో ఇంతవరకూ పెన్సిల్ తో రాసివుంది. ఆ తరువాతి కాగితాల్లో కలంతో రాసివుంది. ఈ భేదం ఒక అధ్యాయంలో కనిపించే ఒక తెంపులాగ భావించి శివరామన్ తానింతవరకూ చదివిన సరసమైన విషయాల గురించి  ఆలోచించాడు. అతని భావనలు ఎదిరించుకొని ‘ఈ జడ్డి బ్రాహ్మణుడు మనసులో ఇటువంటి తలంపులా?’ అని అతనికి గొప్పగా ఆశ్చర్యం కలిగింది.

ఆ క్షణమే అతను తన తండ్రిని, ఆ జడ్డి బ్రాహ్మణుడుని - క్షవరం చేసుకోకుండా, ముందు వరుసలో పళ్ళు పోగొట్టుకొని, గాట్లు పడిన నల్ల వికార మొహంని - గుర్తుచేసుకున్నాడు. 

తన ఉద్యోగంకి తన రచనా నైపుణ్యం దోహదం చేస్తుందనే నమ్మకంతో శివరామన్ సంపాదకుడుగా పని చేస్తున్నాడు. కాని ‘నాకు తోచని చింతనలు, నాకు చేతకాని రచనా విశేషం నా  అమాయక తండ్రికి ఎలా సాధ్యమయ్యాయి?’ అనే భ్రమతో పుట్టిన భయంతో అతను ఆ మిగిలిన కాగితాలు చదవసాగాడు: 

** 

“నాకు నాన్నగారి మొహంకూడా గుర్తు లేదు. అతను పోయినప్పుడు నాకు వయస్సు తొమ్మిది. అది తప్పకుండా జ్ఞాపకం ఉండాలి, కాని నేను జడ్డికదా, మరిచిపోయాను! కాని అందరూ అతనిగురించి చెప్పేవి విని అతనిగురించి తెలుసుకున్నాను. అతను గొప్ప పండితుడు. సంస్కృతం, తమిళం రెండు భాషల్లోనూ అతనికి పాండిత్యం ఉంది. సుందర ఘనాపాటి వంటి విద్వాంసులు అతని దగ్గర చదువుకున్నారు. నాకా భాగ్యం లేదు. మా అమ్మ చెప్పేది, ‘నువ్వూ నాన్నగారులాగ  పండితుడు అవాలి’ అని. అదే మా నాన్నగారి ఆశ కూడా.  అవన్నీ ఆ రోజుల్లో బ్రాహ్మణ దంపతుల అభిలాష.  ఐతే తన కొడుకు బ్రాహ్మణ ధర్మం ఉద్దరించాలని ఈ రోజుల్లో ఎవరికైనా ఉందా? అంత ఎందుకు? అటువంటి దంపతులకి నేను పుట్టాను, కాని నేను వాళ్ళలాగ ఉన్నానా?

“నేను ఎన్ని సార్లు మణికి చెప్పాను - ఆ చెప్పుల దుకాణంలో పని చెయ్యవద్దని? వాడు విన్నాడా? ‘నీకు తెలీదు, దీనికే నేను ఎంత కష్టపడ్డానో తెలుసా.  నెలా 250 రూపాయల జీతం, సంవత్సరంలో మూడు నెలల బోనసు ఇస్తారు. ఈ పనికి ఏం తక్కవ? అక్కడ నేను ఆవులని హత్యచేసి చెప్పులు కుట్టడం లేదు. డబ్బాలో వచ్చే చెప్పులు తీసి అమ్మడం - అదే నా పని! ఊరుకో, నువ్వు పాతకాలపు మనిషి!’ అని నా నోరు మూసేసి ఆ పనిలో చేరాడు.

“అదేం వాడి పొరబాటా? లేదు.  ‘అదొక పొరబాటా?’ అని ఆలోచిస్తే ఈ కలియుగంలో ఎది చేసినా సరే అనిపిస్తోంది.  నా పిల్లలు నాలాగ పిలక పెట్టుకొని, చొక్కాయి, పాదరక్ష లేకుండా - ఈ రోజుల్లో అందరూ చూసి ఎగతాళి చేసే గుంపుగా జీవించడం - నాకిష్టం లేదు. అందుకే వాళ్ళకి ఇంగ్లీషు చదువు చదివించాను. కోసిన జుత్తుకి సరే అన్నాను. అంటే నాకెలా సాధ్యంకాదో అలా అన్ని విధాలా వాళ్ళు జీవించడం చూసి అదే నాకు తృప్తిగా ఉంది.  అవును,  బొత్తిగా వాళ్ళ జీవిత శైలికి నేను దూరమైపోయాను.    ఒక జాతి నీచం అని అంటే అది ఎంత అబద్ధమో అంత అబధ్ధం ఇంకొక జాతి  గొప్పతనం. ఇదెప్పుడు నాకు బోధపడిందంటే నీచమైన జాతిలాగే ఆ గొప్ప జాతికూడా కష్టాలు పడినప్పుడే. నా పిల్లలు ‘మేం పుట్టినది పెద్ద జాతి’ అని చెప్పుకున్నా, జందెం ధరించినా - మంచి వేళ - నాలాగ బ్రాహ్మణ జాతితో సంబంధం మానుకోలేదు.  కాని వాళ్ళుకూడా నా ఉనికి మరచిపోయారే!.  నన్ను ‘నాన్న’ అని చెప్పుకోడానికి వాళ్ళకి ఎంత సిగ్గని నాకు తెలుసు, నేను చాలాసార్లు చూసివున్నాను. 

మొహం ఎరుగని నాన్నగారిని గుర్తుచేసుకొని నేను గర్వపడుతున్నాను.  కళ్ళెదుట కనిపించే నాన్నని చూసి వీళ్ళకి సిగ్గు! అవును, నాకే నాగురించి సిగ్గుగా ఉంది, మరి వీళ్ళు చేస్తే అది పొరబాటా?”

- ఇక్కడనుంచి మళ్ళీ పెన్సిలో అక్షరాలు ఆరంభమయ్యాయి. తడిసిన కళ్ళకి అవి కనిపించలేదు. కొన్ని నిమిషాలు శివరామన్ తన కండువాతో మొహం మూసుకున్నాడు. అతను ఏడుస్తున్నాడా? తరువాత ఒక నిట్టూర్పు వదిలి, ఎఱ్ఱ కళ్ళతో, వొణుకుతున్న పెదిమలతో  మళ్ళీ చదవసాగాడు:

       **

“భారతియార్  చాలా కోపంతోనే కఠినంగా చెప్పారు: ‘అర్ధం తెలియక మంత్రాలు వల్లించడం కంటే ఆపేస్తే మేలు’ అని. పది సంవత్సరాలముందు నేనది చదివినది జ్ఞాపకం ఉంది. ‘నేను వల్లించే మంత్రాలకన్నీ నాకు అర్ధం తెలుసా?’ అని నేను  ఆలోచించాను. ఆ రోజంతా మొహమెరుగని నాన్నగారిని, ఆ గొప్ప పండితుడిని గుర్తుచేసుకొని ఏడ్చాను. ఆ గొప్ప పండితుడు దగ్గర - నా నాన్నగారు దగ్గర - చదివిన సుందర ఘనపాటి కూడా గొప్ప పండితులే. అతని దగ్గర నేను చదివాను. కాని నాకు అతనంటే  గురువు అనే భక్తి కంటే అతను నన్ను వాయించుతారేమో ఆనే భయం ఎక్కువగా ఉండేది. వొకమాటు మించి అడుగుతే అతనికి పట్టరాని కోపం వస్తుంది. ఆ భయంలో అతను వొకమాటు చెప్పినదీ నేను సరిగ్గా నేర్చుకోలేదు. నేను చిలుకలాగ పాఠం చదివాను. అప్పుడు అదేం పొరబాటని నాకనిపించలేదు. 

“మంత్రాలలో దైవికంగా, పుణ్యంగా, పవిత్రంగా ఎన్నో విషయాలున్నాయనే నమ్మకంతో నేను అవన్నీ కంఠస్తం చేసేసాను. ‘తల్లి పాలులో ఏ ఏ విటమిన్లు ఉన్నాయని శిశువుకి తెలియాలా? రొగికి కావలసినది మందు, ఒక్కొక్క మాత్రలో ఏముందనే జ్ఞానం అతనికి ముఖ్యం కాదు.  అలాగే మంత్రం కూడా.  ‘నీకది కావాలి, దాన్ని వల్లించుతే నీకు అన్ని ఫలితాలు వచ్చి చేరుతాయి’ అని ఎవరో ఒక మేధావి రాసారు. అది చదివిన తరువాత నాకు ఊరట కలిగింది. కాని ఆ జ్ఞాని వాదం తగిన సమయంలో నాకు దోహదం చెయ్యలేదు. 

ఒకసారి వకీలు రాఘవయ్యరు ఇంటికి తర్పణం చేసిపెట్టాలని వెళ్ళాను. అతను చాలా పెద్దవారు. మా నాన్నగారిపై అతనికున్న భక్తి నామీదనూ ఉంది. నలభై సంవత్సరాలుగా మాకు పరిచయం ఉంది. నేను వెళ్ళినప్పుడు అతని అల్లుడు వైద్యనాధ అయ్యర్ డిల్లీనుంచి వచ్చారు. ఆ రోజు అతనికీ తర్పణం చేసిబెట్టాలన్నారు. అతన్ని చూస్తే తెల్లదొరల్లా ఉన్నారు. అతను కట్టుకొనివున్న పట్టు పంచె చూడగానే అతనికి పంచెతో అలవాటు లేదని తెలుసుకున్నాను. అతను మెట్లు దిగి - పాదరక్షతో వచ్చినప్పుడే - నాకు తెలిసిపోయంది! అవును మరి, ఇది కలియుగం కదా?

“నేను మొహం ముడుచుకొని ‘తర్పణం చేస్తున్నప్పుడు దాన్ని తీసేయాలి’ అన్నాను. ‘Oh, I am sorry!’ అని అతనికి ఒకటే సిగ్గు! నేనుకూడా ‘It’s all right’ అన్నాను.  అప్పడప్పుడు నేనూ ఇంగ్లీషులో ఏమైనా రెండు మాటలు మాటాడతాను. 

“ఆ రోజు నేను చాలా ఇళ్ళలకి వెళ్ళవలసి ఉంది.  తొందర తొందరగా నా బాధ్యత పూర్తిచేసి లేచినప్పుడు చూస్తే దక్షిణ తక్కువగా ఉంది. ‘ఇతనికి ఏమీ తెలీదు’ అనే ఉపేక్షతో ‘ఏమిటండీ, దక్షిణ తక్కువగా ఉందే?’ అని అడిగాను. అతను నన్ను చూసి నవ్వుతూ ‘మీరూ మంత్రాలు తగ్గించేసారుగా?’ అని అన్నారు. ఆ రోజులాగ అంతకుముందు నేనెప్పుడూ అవమానం అనుభవించలేదు. తరువాతే తెలిసింది అతను డిల్లీలో పెద్ద సంస్కృత ప్రోఫెసరు అని. 

“అతను నన్ను అడిగారు ‘మాకు మీ పీఠంకున్న ఖ్యాతి, ప్రతిష్ట బాగా తెలుసు. దాన్ని కాపాడడం మీ బాధ్యత కాదా? అర్ధం తెలియకుండా మంత్రాలు వల్లించుతే ఎలాగ?’ నేను చెప్పాను: ‘మందు తాగితే చాలు, ఫలం దొరుకుతుంది. మందులో ఏముందో రోగికి తెలిసినా, తెలియకపోయినా ఒకటే!’ అని ఎప్పుడో నేను చదివినది వల్లించాను.  అతను మళ్ళీ నవ్వారు. ‘మందు తాగేవాడికి తెలియకపోతే ఏ బాధా లేదు. కాని మందు ఇచ్చేవాడికి తెలియాలికదూ?’ అన్నారు. అంతే,  ఒక నిమిషం ఆలోచించాను, నాకేం చెప్పాలో తెలియక  ‘స్వామీ, క్షమించండి!’ అని ఒక దండం పెట్టి సైకిల్ పై ఇంటికి తిరిగి వచ్చేసాను.

ఎనిమిది గంటలయింది. రాజం వంటగదినుంచి బయటకి వచ్చి శివరామన్ వీపుని ఆనుకొని అతను చదువుతున్న కాగితాలు - అవేమో ఆఫీసు కాగితాలు అనే ఉపేక్షతో - చూస్తోంది.

“ఇంకా ఎంత సేపు? భోజనంకి వస్తారా?” ఆమె పిలుపు విని శివరామన్ తిరిగి చూసాడు.

“మణి రానీ.  ” అని భయంతో నవ్వుతూ ఆమెను బతిమాలాడు.

“ఈ ఆఫీసు చెత్త అంతా మన ఇంటిలో ఎందుకు?” అని విసుగ్గుంటూ రాజం మేజామీదున్న  ఒక వార పత్రికని తీసుకొని గోడకి ఒక మూల కూర్చొని చదువుతోంది.

శివరామన్ ఇంకొక పేజీ తిరగేసాడు.

**

“అరవై సంవత్సరాలుగా  అర్ధశూన్యంగా నేను వాగుతూనే జీవించాను. నాలాంటి మనుషులవలనే బ్రాహ్మణ కుల ధర్మంకి అవమానం కలుగుతోంది. ప్రతీ రోజూ, ఏ వేళలో సంధ్యావందనం చేసినా నా మనసులోని అపరాధ భావం వలన నా జీవితమంతా అబద్ధం అనే భావన కలుగుతోంది. ఈ రోజుల్లో మన వేదశాస్త్రాలకీ ప్రతిష్ట పోయిందని నేను అనను. వాటి కీర్తి, ప్రతిష్ట, నేను గ్రహించలేదని ఇప్పుడే తెలుసుకున్నాను. ఒక నెలగా నేనూ ఒక మనిషి అనే భావన నాకుంది. అంతకుముందు నాటకాల్లో వచ్చినట్టు నేను వేషాలు వేసుకొని ఎవరో రాసి ఇచ్చిన వచనాలు చదువుతున్నట్టు మంత్రాలు వల్లించాను.

“నాకు పరిచయం ఉన్నవారు ఎవరైనా ఇప్పుడు నన్ను చూస్తే  ‘నేను గణపతి శాస్త్రి’ అని చెప్తే నమ్మరు!.  ఎప్పడైనా నేను అద్దంలో నా మొహం చూస్తే నాకే వింతగా ఉంది!.  అవును, నా మనసులోని ఆకారంకి పిలక ఉంది, జందెం ఉంది, అరవై సంవత్సరాల జ్ఞాపకం తొలగడం అంత సులభంగా సాధ్యం కాదే? అదంతా మనసులోనే.

“ఇప్పుడు నేను బ్రాహ్మణుడు కాదు, శాస్త్రి కాదు. నా మనస్సాక్షికి ద్రోహం చెయ్యని ఒక నిష్కపటమైన మనిషి.  నేను పుట్టిన కులం పైన నాకు గౌరవం ఉంది.  మహనీయులు చెయ్యవలసిన పనులన్నీ నేను కపటంగా చేసానంటే నాకు వారిపట్ల మర్యాద లేదన్నమాట.  అందరూ నన్ను జడ్డి అని పిలుస్తారు, పిలవనీ.   ఆ రోజు చెరువుగట్టులో నన్ను చూసినవారందరూ నాకు పిచ్చి పట్టుకుందని అనుకున్నారు.  సుందర ఘనాపాఠిలాంటివారికి పౌరోహిత్యం ఒక గౌరవమైన జీవితం. అతను నన్ను ఎంత తిట్టినా అతన్ని తలచుకొని నేను నమస్కరించుతాను. అతనే నా కళ్ళు తెరచిన గురువు. ఈ లోకం అతని రూపంలో వచ్చి, నన్ను పట్టుకొని ‘నువ్వు బ్రాహ్మణుడంటే ఈ మంత్రంకి అర్ధం చెప్పు!” అని గదమాయించింది. అతనే నాకు బ్రహ్మోపదేశం చేసి జందెం తొడిగించారు. అతను నాకు నేర్పినదే నేను ఇన్నిరోజులు చెప్తూ ఉన్నాను. అది తప్పని అతనే అంటున్నారు. ఏది ఏమైనా అతనే నాకు గురువు. అతనికి నా నమస్కారం. 

“ఇప్పుడు నాకు కోసిన జుట్టు ఉంది.   చొక్కాయి తొడుక్కున్నాను.   చెప్పులు ఉన్నాయి.  ఇవన్నీ బాగానే ఉన్నాయి.  నాకు నవ్వాలనిపిస్తోంది! శాస్త్రులకి చెప్పులు నిషేధమట, కాని సైకిల్ పై వెళ్ళవచ్చు అంటున్నారు!  నా సైకిలు శివరామన్ నలభై రూపాయలకి కొన్నాడు.  అప్పుడే అది చాలా పాతది.  ఇప్పుడు దాన్ని ఎవరు వాడుతున్నారో - శివరామనా లేక మణియా? పాతదైనా  అదీ చాలా రోజులు పనికి వస్తుంది.  ”

చదువుతున్న శివరామన్ తలెత్తి, మూలనున్న సైకిల్ చూసాడు. అతని చూపుని అనుసరించిన రాజం మొహం తిప్పి తనూ గణపతి శాస్త్రిగారి సైకిల్ చూసింది. ఒక నిమిషం ఇద్దరూ ఏమీ మాటాడకుండా ఆ మౌనంలోనే తమ మానసిక అలజడిని గ్రహించి  పరివర్తన చేసుకున్నారు. హఠాత్తుగా రాజం  వెక్కుతూ ఏడ్చింది.

“ఈ బ్రాహ్మణుడు  ఎందుకిలా చేసారు! ఇన్ని రోజుల తరువాత కూడా అతని గురించి మనకేమీ తెలీదే? నాకెలాగో ఉంది.  మీ దగ్గర నా మనసు విప్పి చెప్తున్నాను.  అతను లేకుండా ఈ ఇల్లు శూన్యంగా ఉంది.  కొండలాగ ఇద్దరు కొడుకులున్నారు, అతనికెందుకు ఈ కర్మ!” అని అంటూ ఆ వారపత్రికతో తన మొహం కప్పుకొని ఏడ్చింది.

ఏమీ ఎరుగని జడ్డి అని తను నిశ్చయించిన తన తండ్రి మనసుని తెలుసుకొని నిర్ఘాంతపోయినట్టు, అతనంటే పగ, ద్వేషం తప్ప రాజం మనసులో మరేం లేదు అని ఇంతవరకూ తనకున్న అవగాహన పొరబాటని శివరామన్ ఆ నిమిషం గ్రహించాడు. మనకి తెలియకుండా అన్నిటిలోనూ ఒక మహత్వం ఉందని తెలియగానే అతని మనసులో ఎంత ఆహ్లాదం! మేజామీదున్న, తను చదివిన కాగితాలు తీసి మౌనంగా ఆమెకు అందించాడు.

అప్పుడే అతని కళ్ళనుంచి ధైర్యంగా రెండు బొట్లు హఠాత్తుగా కింద రాలాయి.

“ఏంటి, ఇదేం ఉత్తరమా? అతను రాసారా?” అని అతను ఎక్కడో బతికి ఉన్నారని రాజం సంతోషించి అది చదువుతోంది.

అప్పుడే ఇంటికి తిరిగివచ్చిన మణి ఆమె మాటలు అస్పష్టంగా విన్నాడు. “నాన్నగారు రాసారా? అతనెక్కడ ఉన్నారు?” అని అడుగుతూ, రాజం పక్కనే కూర్చొని ఆ ఉత్తరం చదవడానికి సిద్ధమయ్యాడు.

మధ్య ఒక పేజీలో ఉన్నదేదో చదివి “Well done, father!” అని మణి చప్పట్లు కొట్టాడు.

సమయం తొమ్మిది గంటలయింది. కాని వాళ్లెవరూ భోజనంకి వెళ్ళలేదు. ఆ కట్ట కాగితాలు చదవడానికి చాలా సమయం పట్టుతుంది.

తమని వదిలి, వెళ్ళి ఎక్కడో దూరంలో ఉన్న అతన్ని పూర్తిగా తెలుసుకోవాలని వాళ్ళందరూ ఆ కట్టలో తలా ఒక కాగితం చదువుతున్నారు.

ఆ కాగితాలలో వాళ్ళు తెలుసుకున్నవి, వాళ్ళ కళ్ళకి కనిపించినవి, వాళ్ళు దర్శించినవి, ఆ కుటుంబంకి చెందిన, ఈ ఇరవైయ్యో  శతాబ్దంలో జీవించిన గణపతి శాస్త్రి అనే ఒక ప్రత్యేక వ్యక్తి గురించే అని చెప్తే సరిపోతుందా?

********

bottom of page