MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
భలే మంచి రోజు
రమాకాంత్ రెడ్డి
ఈ సువిశాల వసుధైక కుటుంబంలో నేను ప్రప్రథమంగా, మౌలికాతిమౌలికంగా తెలుగువాణ్ణి. పదహారణాల అనను కానీ పది పన్నెండణాల తెలుగు వాణ్ని.
రాయలోరిసీమలో చిత్రావతి నది ఒడ్డున జన్మించిన వాణ్ని. ఒక మట్టిపలక మధ్యలో సుద్దబలపంతో మా తాత దిద్దించిన చిన్న 'అ'ని ఆ పలక నిండిపోయేలా దిద్దుకున్నవాణ్ణి.
అదే 'అ'తో నేర్చుకున్న మొదటి పదంతోనే 'అమ్మ' అనే అమృతభాండాన్ని రుచిచూసినవాణ్ని.
బుద్ధి, లోకజ్ఞానం ఇంకా ఏర్పడి ఏర్పడని దశలోనే
అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి అనీ
కని కల్ల నిజము తెలిసిన మనుజుడే నీతిపరుడనీ
నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అనీ
పురుషులందు పుణ్యపురుషులు వేరనీ
సాధనమున పనులు సమకూరు ధరలోననీ
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగదనీ
ప్రగాఢంగా నా అంతరంగంలో ముద్రించుకున్న వాణ్ని.
ఇంటికొచ్చిన పెద్దలు ఏదైనా పద్యం చెప్పమని అడిగితే అమాయకంగా
ఎప్పుడు సంపద గల్గిన
అప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
తెప్పలుగ జెఱువు నిండిన
కప్పలు పదివేలు జేరు కదరా సుమతీ! అని చెప్పినవాణ్ణి.
కారుమబ్బులు కమ్మి, మిలమిలా మెరుపు మెరిసి ధడధడా ఉరుము ఉరిమితే పిడుగు మాకు దూరంగా పడాలని
అర్జున, ఫాల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన
భీభత్స, విజయః, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయః అని స్మరించినవాణ్ణి
ఇప్పటికీ తొలిసందెలోనో మలిసందెలోనో గగనవీధిలో రంగవల్లులు చూసి బయటికి 'వావ్, అమేజింగ్' అన్నప్పటికీ లోలోపల 'అబ్బ! అద్భుతం' అనుకునేవాణ్ణి.
ఇంటిపనిలోనో వంటపనిలోనో చేతికో కాలికో చిన్నదో పెద్దదో ఏదైనా దెబ్బ తగిలితే లోపలా బయటా కూడా 'అమ్మా!' అనేవాణ్ణి.
పానుగంటివారు స్వభాష అనే వ్యాసంలో చెప్పినట్టు
మకరంద బిందుబృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే
మహానంద కందళ సందోహ సంధాన తుందిలమగు మాతృభాషయే
క్రమతకు క్రమత వదలునకు వదలుబిగికి బిగి జోరునకు జోరు
ఎదురెక్కున కెదురెక్కు మద్రతకు మంద్రత ధాటికి ధాటియు
అన్ని వన్నెలు అన్ని చిన్నెలు అన్ని వగలు అన్ని ఒద్దికలు
అన్ని తళుకులు అన్ని బెళుకులు అన్ని హొయలు అన్ని ఒయ్యారములు
గల మన మాతృభాషయే అని మురుసిపోయేవాణ్ణి.
గురులఘువుల గురించి, ఛందస్సు గురించీ తెలియని వయసులో ఎం.ఎస్. రామారావు గారి సుందరకాండ విని అలా ఒకటే లయలో అన్ని మాటలు కుదరడం చూసి ఎదో చెప్పలేని ఆనందం పొందినవాణ్ణి.
అలాగే విశ్వవిఖ్యాతనటసార్వభౌముడు దుర్యోధనుడి వేషంలో
'నేనీ సకలమహాజనమధ్యమున పండిత పరిషన్మధ్యమున సర్వదా సర్వథా శతథా సహస్రథా ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెద'
అని ముగించినప్పుడు ఒక తెలుగువాడికి మాత్రమే కలిగే గగుర్పాటుని సంపుర్ణముగా ఆస్వాదించినవాణ్ని.
దూరదర్శన్ లో 'మిలే సూర్ మేర తుమ్హారా' అని మొదవలాగానే ' నీ స్వరమూ నా స్వరమూ సంగమమై మన స్వరంగా అవతరించ' అనే వాక్యం కోసం ఎదురు చూసినవాణ్ని.
అలాగే 'బజే సర్గమ్ హర్ తరఫ్ సే' అన్న పాటలో బాలమురళికృష్ణ గారి నోట
నలుదెసల రాగము ధ్వనించెను
గజ్జెలు ఘల్లన లయగ పలికెను
గొంతులెల్ల భావముగా పాడెను
ఇది దేశరాగభావ సమ్మేళనం'
అన్న మాటలు వినాలని పరితపించిన వాణ్ని.
అలాగే ప్రతి శుక్రవారం చిత్రలహరిలో 'మా తెలుగు తల్లికీ మాల్లెపూదండ..' అన్న పాట వేస్తారేమోనని వేచి చూసినవాణ్ణి.
క్లుప్తమైన పాదాల కూనలమ్మ పదాలలోని కమ్మదనం గ్రోలినవాణ్ని
వెన్నెలలో ఆదుకునే అందమైన ఆడపిల్లలవంటి అక్షరాలతో కబుర్లాడినవాణ్ని.
పక్షినై చిన్ని ఋక్షమునై
మధుపమునై చందమామనై
మేఘమునై వింతమెరపునై
పాటనై కొండవాగునై
పవనమై వార్ధిభంగమునై
ఏలోకో ఎప్పుడో ఎటులనో
మాయమైనవాణ్ణి మారిపోయినవాణ్ణి
విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోయినవాణ్ణి
ప్రపంచాబ్జపుతెల్లరేకై పల్లవించినవాణ్ణి
తెలుగు ఉచ్వాసలో గలవాణ్ణి
తెలుగునిశ్వాసలో గలవాణ్ణి
తెలుగు నరనరాన గలవాణ్ణి
తెలుగు గుండెసడిలో గలవాణ్ణి
తెలుగు గుండెతడిలో గలవాణ్ణి
ఈ సువిశాల వసుధైకకుటుంబంలో ప్రప్రథమంగా మౌలికాతిమౌలికంగా నేను తెలుగువాణ్ణి.
పది పన్నెండణాల తెలుగువాణ్ని!
****