MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
అదన్నమాట సంగతి
పిలువు వినగలేవా...
జ్యోతి వలబోజు
“ఆంటీ!!!” అంటూ మా పైనింటావిడ మార్వాడి అమ్మాయి వచ్చి పిలిచింది. అమ్మాయంటే అమ్మాయేం కాదు. ఉద్యోగం చేస్తున్న ఒక కొడుకు, చదువుకుంటున్న ఇంకొక కొడుకు ఉన్నారు. వయసు అంచనా వేసారు కదా. ఓ నలభై ఏళ్ల దాపుల్లో ఉండొచ్చు. తలుపు తీసి లోపలికి రమ్మన్నాను.
“క్యాహై బోలో సప్నా!” అడిగాను.
మా ఇంట్లో పూజ, భజన ఉంది రండి అని చెప్పెళ్లిపోయింది. సరే అని పనంతా ముగించుకుని కాస్సేపు పడుకుని లేచి , టీ తాగేసి పైకెళ్లా. ఆగండాగండి అపార్ధం చేసుకోకండి. మా పైన ఫ్లోర్ కి వెళ్లా. లోపలికి వెళ్లగానే సప్న అత్తగారు వచ్చి “ఆయియే ఆంటీ! కైసే హో?” అని పిలిచింది. ఒక్క క్షణం పళ్లు కొరుక్కున్నా. ఇంకా ఎక్కువ సేపు కొరుక్కుంటే అరిగిపోయేది, కరిగిపోయేది నా పళ్లే కాబట్టి సైలెంటుగా వెళ్లి కూర్చున్నా.
కొద్దిసేపయ్యాక సప్న కొడుకు వచ్చి “ఆంటీ! షర్భత్ లీజియే!”అన్నాడు.
నో రియాక్షన్.. సరేలే అని పూజ అయ్యాక భజనలో కాస్సేపు కూర్చుని మధ్యలో ఇచ్చిన ప్రసాదం తినేసి, కాఫీ తాగేసి ఇంటికెళతానని చెప్పా..
“బహుత్ షుక్రియా ఆంటీ! ఆప్ ఆగయే.. నమస్తే!” అన్నదెవరూ అంటే సప్న భర్త మనోజ్. ఇతను నా వయసువాడే.
పూజలో పాల్గొని ప్రసాదం తిని వెళుతూ నో కోపం అనుకుంటూ ఇంటికొచ్చేసా.. కాని తలుచుకున్నప్పుడల్లా, ఆలోచించినప్పుడల్లా కాస్త కోపం, కాస్త నవ్వు వస్తుంది. ఏమీ చేయలేము కాబట్టి నవ్వేసుకుంటా..
సంగతేంటో మీకు అర్ధమైనట్టు లేదు. కదా.. ఏంటంటే.. కొడుకు, కోడలు. అత్త, మనవళ్లు అందరూ నన్ను ఆంటీ అంటారు. నాకంటే చిన్నవాళ్లు ఓకే. నా ఈడువాళ్లు, నా తల్లి వయసువారు కూడా నన్ను ఆంటీ అంటున్నారని గమనించారా?
ఈ ఆంటీకి ఒక వావి వరుస ఉందా? మగవాళ్లైతే అంకుల్. కాస్త పెళ్లయి ఒక పిల్లవాడు ఉంటే చాలు ఆంటీస్, అంకుల్స్. .. కాదు కాదు. ఏమని వరుసపెట్ట పిలవాలో తెలీక గంప గుత్తగా ఆడాళ్లను ఆంటీసూ, మగవాళ్లను అంకుల్సూ అనేస్తున్నారు నేటితరం వారు. నేటిలో కలసిన నిన్నటి తరంవారు కూడానూ.
ఇన్నేళ్లు బానే ఉన్నారుగా. ఇప్పుడేం మాయరోగమొచ్చింది. నా చిన్నప్పుడు నాన్న ఫ్రెండ్స్ , వాళ్ల భార్యలను తప్ప ఆంటీ, అంకుల్ అనేవాళ్లం కాదు. ఎందుకంటే వాళ్లు కుటుంబ సభ్యులు కాదు కాబట్టి అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయి, అన్నా తమ్మి, అక్కా చెల్లీ అనేవాళ్లు కాదు. బయటివాళ్లకు మాత్రమే ఆ పిలుపులు. నా చిన్నప్పుడు అంటే మరీ మాటలు రాని వయసు కాదులెండి. స్కూలులో ఉన్నప్పడు ఏవరైనా కొత్తవాళ్లు వస్తే అమ్మను అడిగేదాన్ని “ఎవరు వాళ్లు. ఏమని పిలవాలి” అని. వాళ్లతో చుట్టరికం లెక్కలు వేసి పెదనాన్న, చిన్నాన్న, అన్నా, బావా, అక్కా, వదిన, పెద్దమ్మ, చిన్నమ్మ అని చెప్పేవారు. కాని ఇప్పుడు అన్నింటికీ ఆంటీ లేదా అంకుల్.. మరీ టూ మచ్ కదా. పిల్లలకు పలకడం కష్టం అని పెద్దలే నిర్ణయించేసుకుని అలా నేర్పిస్తారు.
పెద్దవాళ్లని అన్నా, అక్కా అని పిలవాలన్న సంస్కారంతో పెరిగాం. ఇప్పుడు వయసులో పెద్ద అయినా అలా పిలవడానికి జంకుతున్నారు. ఆఖరుకి పనిమనిషి, చెత్త తీసుకెళ్లేవాడు ఇంకా చాలామంది అమ్మా అనకుండా ఆంటీ అంటున్నారు. చెత్తాంటీ అంటూ వస్తాడో అబ్బాయి. ఖంగారు పడకండి. ఆంటీని తిట్టడం లేదు. చెత్త తీసుకెళ్లడానికి వచ్చాను ఆంటీ అని వాడనుకున్న అర్ధం. మనమేమో వేరేలా డిసైడ్ అయిపోతాం. ఇలా చాలా చోట్ల చాలాసార్లు ఖంగుతిన్నవారెందరో మహానుభావులు. ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరగడమేమో కాని జనాలు మరీ ఒళ్లొంగకుండా తయారవుతున్నారు. అన్నింటికి చేతిలో ఫోన్ మీదే ఆధారపడుతున్నారు. తిండికి కూడా. అలాగే పిలుపులను కూడా మాడర్నైజ్ చేసేసి ఒకటి రెండు లేదా నాలుగు మాత్రమే పాపులర్ చేస్తూ వావి వరసా చూడకుండా పిలిచేస్తున్నారు. నాలాటి పాతకాలం వాళ్లకి ఇలాటి పిలుపులు వింటే చిర్రెత్తుకొస్తున్నా, చాలామంది పర్లేదులే ఇంకా నయం అమెరికాలోలా పేర్లు పెట్టి పిలవట్లేదు అని చెట్టు లేని చోట ఆముదం చెట్టే అన్నట్టు సంతోషపడిపోతున్నారు.
తెలంగాణ ప్రాంతంలో ఉపాద్యాయుడిని పంతులు అని పిలుస్తారు ఆంధ్రలో మాస్టారు అంటారు. కాని ఇప్పుడంతా సార్‍లు అంటున్నారు. పంతులుగారు, మాస్టారుగారు అన్నది కూడా కుదించేయబడి సార్ గా మారిపోయింది. ఇందులో అవసరానికి ఏర్పడ్డ పొడిపొడి సంబంధమే తప్ప ఆత్మీయత కన్పించదు. పిలుపు పిలుపులో అనురాగం కనిపిస్తుంది. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఏర్పడటానికి, పెంపొందటానికి ఒకరినొకరు పిల్చుకునే పిలుపులు కూడా ఎక్కువగా కారణమవుతాయి. ఒకరితో మరొకరికి ఉండే బాంధవ్యాన్ని తెలియజేస్తాయి. అనురాగాన్ని అభివృద్ధి చేస్తాయి. పూర్వకాలంలో బంధువుల వరుసలు తెలుసుకుని, వరుసలు కలుపుకుని మరీ పిలుచుకునేవారు. ఆ పిలుపులలో ఆప్యాయత వెల్లివిరిసేది. ఇప్పుడు పేర్లు మారినా అప్పటి మాధుర్యం మాత్రం కనబడకుండా పోతుందేమో అనిపిస్తుది. ఇక పెద్దమ్మ, పిన్ని, బాబాయి, అమ్మమ్మ, నాన్నమ్మ, బామ్మ, తాతయ్య, అత్తయ్య, మామయ్య, బావ, అక్క, చెల్లి అంటూ పిలుచుకునేవారు రాను రాను తగ్గిపోతున్నారు. గ్రాండ్ మా, గ్రాండ్ పా, నానీ, అంటున్నారు. పిల్లలకు మాటలు రాకముందే ఈ తెలుగు పదాల కంటే ఇంగ్లీషు పదాలే నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లలు ముద్దుముద్దుగా ఇంగ్లీషులో మాట్లాడుతుంటే వీళ్లు మురిసిపోతుంటారు. మేము చాలా మాడర్న్ అని ఫీలైపోతుంటారు. స్కూలులో ఎలాగూ ఇంగ్లీషు తప్పదు, ఇంట్లో కూడా తల్లిదండ్రులు తమకు వచ్చిన తెలుగును ఎలాగూ తగ్గించేసుకున్నారు. పిల్లలకైతే అసలు నేర్పించడం లేదు. ఆ పిల్లలకోసం అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడక తప్పదు. అందుకే ఈ కాలం పిల్లలకు చాలామందికి వావివరుసలు తెలియవు. ఆ పిలుపులు, వాటిలోని మాధుర్యం అసలే తెలియదు. అది వాళ్ళ తప్పు కాదు. పెద్దలు చెప్పటం మానేస్తున్నారు.
ఈ ఫేస్బుక్ లో చూస్తుంటే మాత్రం అయోమయంగా ఉంటుంది. హాయిగా పేరు పక్కన గారు పెట్టి మాట్లాడొచ్చు కదా. ముక్కు తెలీదు. మూతి తెలీదు మామయ్యా అన్నాడంట. మనం ఏదో రాస్తాం. ఒకరొచ్చి అక్కా అనేస్తారు. సరే బానే ఉంది అనిపిస్తుంది . కాని మరికొందరుంటారు. అసలు మాట పరిచయమే ఉండదు. ఎన్నో ఏళ్ల క్రింద పరిచయం ఉన్నట్టు డియర్, నువ్వు అనేస్తారు.తెలుగువారికి ఇలా కొత్తవాళ్లని, పెద్దవాళ్లని నువ్వు అనడం నచ్చదు. వరస పెట్టకున్నా గారు అనమంటారు. మనకంటే చాలా చిన్నవాళ్లు ఉంటే, వాళ్లతో మనకున్న పరిచయం వయసు ఎక్కువైతే నువ్వు అనొచ్చు అది కూడా వాళ్ల అనుమతి తీసుకుని. కొన్నేళ్ల క్రితం బ్లాగుల్లో ఉన్నప్పుడు నాకు పరిచయం ఉండి వాళ్ల కోరిక మీద నా పిల్లల వయసున్నవాళ్లని పబ్లిక్ గా కామెంట్స్ నువ్వు అని మాట్లాడానని పెద్ద గోల చేసారు . నాకు కోపం కన్నా చిరాకు నవ్వు వచ్చింది. వాళ్లకు , నాకు లేని అభ్యంతరం మధ్యలో చదివినవారికి ఎందుకంట అర్ధం కాలేదు.. కాని కొందరి వయసు చిన్నదైనా వారి వృత్తి , ప్రవృత్తి మూలంగా మీరు అనక తప్పదు. అది వారి వయసుకు కాదు వారి ప్రవృత్తికి, పదవికి ఇచ్చే గౌరవం. కాని ఎవరైనా కొత్తగా పరిచయమైనప్పుడు మీరు అన్నా, ఆ పరిచయం స్నేహంగా మారాక నువ్వు అనడం వారిని మరింత దగ్గరగా ఉంచుతుంది అని నా నమ్మకం.
మీకు గుర్తుందా. ఎన్.టి.ఆర్ , ఏ. ఎన్.ఆర్ , కృష్ణ, శోభన్ బాబు మొదలైనవారు సినీరంగాన్ని ఏలుతున్నప్పుడు అభిమానులు వాళ్లను ఎన్టీవోడు, నాగేస్వర్రావ్, కిట్టిగాడు అంటూ పిలిచేవారు. మాట్లాడుకునేవారు. అది వారిని తక్కువ చేసి మాట్లాడ్డం కాదు. అభిమానమే. హైదరాబాదు ఓల్డ్ సిటీకి వెళితే మాత్రం అచ్చంగా ఉర్దూలో ఎన్ని వరుసలో, ఎన్ని తిట్లో... ప్రేమగానే తిట్టుకుంటారు.. బేగం! ఓ తుమ్హారే చాచాకే చోటే బేటేకి షాదీ మే ఆయేతే దేఖో . ...
సంవత్సరమంతా పట్టించుకోరు కాని మాతృభాషా దినోత్సవం రోజు మాత్రం అందరికీ భాషాభిమానం పెళ్లుబికుతుంది. రేడియోలో, టీవీలో, బయట ప్రోగ్రాముల్లో, ఫేస్బుక్ లో తెలుగుభాషాభిమానాన్ని, ఈ వావి వరసలు గురించి ఎన్ని ప్రోగ్రాములో, పాటలో..
తెల్లవారిందంటే.... హరిలో రంగ హరి.
*****