MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
అప్పిచ్చివాడు వైద్యుడు-13
నిద్రాభావ, నిద్రాలశ్య జాడ్యం
చింతపల్లి గిరిజా శంకర్
నిద్రాభావ, నిద్రాలశ్య జాడ్యం - Narcolepsy కి నాపైత్యం
ప్రతీ మనిషి కి నిద్ర చాలా అవసరమని వేరే చెప్పక్కరలేదు కదా. ఒక రాత్రి నిద్ర లేకపోతే మనం పడే కష్టాలు ఎన్నో. మర్నాడు అలసట, ఆవలింతలూ, మతిమరుపూ, ఆలోచనలు తట్టకపోవడం ఇలాగాఎన్నో. jet lag లో గూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడప్పుడు రాత్రి సరిగా నిద్ర పోకపోతేనే ఇన్ని కష్టాలొస్తే, ఇక రోజువారీగా నిద్ర క్వాలిటీ పడిపోతే వచ్చే కష్టాలే ఈ వ్యాధి లక్షణాలు.
ఈ జబ్బులో 4 లక్షణాలుంటాయి ముఖ్యంగా. 1. రాత్రి నిద్రాభంగం. మామూలుగా మనకి రాత్రి పూట 4 దశల నిద్రావస్థలుంటాయి. నిద్రలోకి జారుకోవడం, గాఢ నిద్ర, కొంచెం తెరిపిగా నిద్ర, స్వప్న జగత్. సగటు మనిషి 8 గంటలు నిద్రపోతాడనుకొండి. అందులో 4 గంటలు
[అన్నీ సుమారుగానే] గాఢ నిద్ర [సుషుప్తి] ఇదే మనస్సు అలసటనించి కోలుకునే దశ. మన వేదాంతులు చెప్పే సుషుప్తి ఇదే. మనం భగవత్సాన్నిధ్యంలో ఉంటాముట.
విశ్వరూపా జాగరిణీ , స్వపంతీ తైజసాత్మికా, సుప్తా ప్రాజ్ఞాత్మికా
ఇంకో రెండు దశలు నిద్రపట్టేటప్పుడు, మేలుకునేటప్పుడూ, అంత గాఢ నిద్ర ఉండదు. మధ్యే మధ్యే కలల రాజ్యంలోకి జారుకుంటాము. ఆరోగ్యకరమయిన నిద్రలో నూటికి పాతిక భాగం ఈ స్వప్నలోకంలో విహరిస్తాము. ఇది చాలా అవసరం ఆరోగ్యానికి. చాలావరకు మనకి కలలు గుర్తుండవు [పీడకలలయితే తప్ప] ఇప్పుడు మన తర్కించే జబ్బులో ముఖ్యంగా ఈ స్వప్న జగత్తు లో మార్పులొస్తాయి. రకరకాలు. దీన్నే Rapid Eye Movemets [REM] sleep అంటారు. మనకి తెలియకుండా మన కళ్ళు [కలలవల్ల కావచ్చు] వేగంగా తిరుగుతాయన్నమాట.ఈ వ్యాధి కలవాళ్ళకి ఈ సమయంలో చాలా మార్పులొస్తాయి. [EEG shows increased density..non restorative sleep] యుద్ధాల్లో పాల్గొన్న వీరులు, ఇంటికొచ్చాక ఈ దశలో నిద్రాభంగం వల్ల చాలా బాధలు పడతారు [PTSD అంటారు]
కలలు అందరికీ వస్తాయి. [రమణమహర్షి గూడా తనకి కలలు వస్తాయనీ, అయితే కలలో ఆలయాలూ గోపురాలూ కనిపిస్తాయని ఒకానొక సందర్భంలో చెప్పాడు] పీడ కలలు కొన్ని గుర్తుంటాయి అయితే నిరంతరం ఒకే రకమయిన పీడకల వస్తే, అది వేరే జబ్బుకి లక్షణం . ఉదా: PTSD. కొంతమంది మన పూర్వ జన్మల స్మృతులే మనకి కలలరూపంలో వస్తాయని చెప్తారు. [మన చిత్తం అంటారే] `Freud “Interpretation of dreams” అనే ఉద్గ్రంథం లో అన్నిటికీ సమాధానాలు రాశాడు. ఇప్పుడవన్నీ ఎవరూ నమ్మరు. ఆయన గూడా ఒక మూసలో అన్నిటికీ చెప్పాడు. చాలా డబ్బు చేసుకున్నాడు.
2. రాత్రి ఇలా నిద్రాభంగం వల్ల, మర్నాడు మత్తుగా ఉండటం: ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలోకి అకస్మాత్తుగా పడిపోవడం [జారుకోవడం కాదు]
దాని వల్ల క్లాసులో కష్టాలు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమయినా జరగవచ్చు, రోడ్దు మీద నడుస్తూ కుప్పకూలిపోవడం ఇత్యాది అనేక బాధలు. వీటివల్ల వచ్చే అనేక ఉద్యోగ, సాంసారిక, సాంస్కృతిక బాధలూ ఊహించుకోవచ్చు]
3. ఇంకో లక్షణం Cataplexy. అంటే అకస్మాత్తుగా టివి చూస్తూనో, రోడ్డు మీద నడుస్తూనో, మాట్లాడుతూ మాట్లాడుతూ మూర్ఛ వచ్చినట్టు స్పృహతప్పి పడిపోవడం ఇందులో ఒక వింత ఏమిటంటే ఈ episodes ఏదయినా మానసిక ఆందోళన [excitement] వచ్చినప్పుడు వస్తాయి. అందరూ సరదాగా స్నేహితులు చర్చిస్తూ, ఎవరయినా మంచి జోకు చెప్పాడనుకోండి. చాలా నవ్వొస్తుంది. నవ్వుతూ, నవ్వుతూ మూర్చపోతాడు. టివి లో గుండెలు పిండే ట్రాజిక్ సీన్ వచ్చినా, లేక మంచి నవ్వొచ్చే సన్నివేశం వచ్చినా మూర్చ పోతాడు. రోడ్దు మీద నడుస్తూ ఎవరన్నా కారు హార్న్ కొడితే గూడా మూర్చ పోతాడు. [ఇలాంటి కేసు జరిగింది నా ఎరుకలో. కోర్టులో ఈ జబ్బుని నిర్ధారించేదాకా పాపం ఆ డ్రైవర్ గతి... పాపం!]
3. నిద్రలోకి జారుతున్నప్పుడు గానీ, లేస్తూ సొమ్మసిల్లుతున్నప్పుడు గానీ hallucinations అంటే ఎవరో మాటలాడినట్టు ఒక్కోసారి లేనివి చూడటం
ఇది sleep apnea కాదు అది వేరే రుగ్మత. దాని కారణాలు, వైద్యం భేదం.
4. మీలో తెలిసిన వారికెవరయినా , "రాత్రి బెడ్రూం లో పడుకుని, తెల్లారేసరికి వంటింట్లో గురకపెట్టి నిద్ర పోతూ కనిపించిన మిత్రుడున్నాడా?] దీన్నే sleep walking, or somnambulism] అంటారు.
పైన చెప్పిన నాలుగు లక్షణాల్లో అన్నీ ఉండక్కర్లేదు 1,2,3,4 అన్ని రకాల మిశ్రమాలు ఉండచ్చు. అందుకని ఈ జబ్బు కనుక్కోడం చాల కష్టం. మంచి వైద్యుడైతే తనకి అంతుబట్టని వ్యాధి అంతు తెలుసుకొని వైద్యం చెయ్యాలి. అంతేగానీ అన్ని జబ్బులూ తన మిడిమిడిజ్ఞాన చట్రంలో బిగించి, అందులో దొరక్కపోతే, "ఇది మాయరోగం అండీ, hysteria, psychiatrist కి చూపించండి ] అని కొట్టిపారేయకూడదు. ప్రస్తుతం 50 యేళ్ళు దాటిన ఎవరయినా మీ డాక్టర్ విజిట్ అనుభవం గుర్తుకుతెచ్చుకోండి. పెద్ద రూం లోంచి చిన్న గదిలోకి, ఆ తర్వాత ఇంకా చిన్న గదిలోకి రోగిని క్షుణ్ణంగా పరీక్ష చేసేదెవరు? హిస్టరీ అంతా మన చేతే రాయిస్తారు [ చదువుకునేటప్పుడు మేము స్టూడెంట్లుగా ఈ పని చేసే వాళ్ళము] ఏ స్పెషలిస్ట్ అయినా వాడి అంగం(విభాగ అంశం) మాత్రం చూస్తాడు. ఎడం చేతికి, కుడి చేయికి ఏం జరిగిందో తెలీదు. నేను కిందటి సంచికలో చెప్పిన పానిక్ డిసార్డర్ లాగానే ఈ జబ్బుకి గూడా, రకరకాల ప్రెజెంటేషన్ ఉంటుంది.అన్నీ కలిపి చూస్తేనే గానీ ఈ జబ్బు ఎరికలోకి రాదు. లేకపోతే తీర్థానికి, తీర్థం, ప్రసాదానికి ప్రసాదం తంతు అవుతుంది
చాలా మంది పిల్లలకి, ADHD అని పొరపాటు పడతారు. అన్ని వయసుల్లోనూ, depression, hysteria, epilepsy, psychosomatic diseases అని తప్పుగా అనుకుంటారు.
EEG, Brain scan CT scan వగైరా ఆయుధాలొచ్చాక, ఈ జబ్బుని మిస్ అవకూడదు.ముఖ్యంగా దీన్ని మందు ద్వారా నయం చేయొచ్చు గాబట్టి.
మొట్టమొదట FDA approve చేసిన మందు పేరు Provigil [modfinil]. మందొకటే కాదనుకొండి. వైద్యం అంటే మందులతో పాటు, ఆరోగ్య సూత్రాలు గూడా పాటించాలి. సుఖమయిన నిద్రలోకి జారుకోవడానికి తగ్గ క్రమశిక్షణ, పథ్యం అన్నీ పాటించాలి. ఉదాహరణకి, ఆల్కహాల్ మానివేయటం, కాఫీ మానివేయటం లేక తగ్గించడం. చాలా మందికి తెలియని విషయం [ నా స్టూడెంట్స్ ని ఎప్పుడూ అడిగి సంతోషపడే ప్రశ్న] మన సొసయిటీ లో ఎక్కువగా abuse చేసే drug??? కాఫీ.
నేను ఈ జబ్బుగలవాళ్ళని నలుగురిని చూసి వైద్యం చేశాను.
*****
ఒకసారి ఒక పేషంట్ ని అడ్మిట్ చేసారు. వాడు ఆజానుబాహుడు. కండలు తిరిగిన వస్తాదు లాగున్నాడు. అస్సలు కదలకుండా పడుకోవడమే వాడి జబ్బు లక్షణం. ఒక కండరం గూడా కదల్చడు. బతికే ఉన్నాడు. కోమాలో లేడు. దీని భావమేమి తిరుమలేశా?
వచ్చే సంచికలో.