MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
అప్పిచ్చి’వాడు -వైద్యుడు
సైకియాట్రీలో వింత కథలు - 1
డా. గిరిజా శంకర్ చింతపల్లి
గిరిజా శంకర్ చింతపల్లి గారు అమెరికాలో మానసిక వైద్యనిపుణులుగా వృత్తిపరంగా వారు చూసిన కొన్ని మానసిక వైరుధ్యాలు, వాటి గురించి పూర్వాపరాల విశ్లేషణ, వివరణ ని మన madhuravani.com పాఠకుల కోసం ప్రత్యేకంగా “ అప్పిచ్చి’ వాడు - వైద్యుడు" పేరిట ఇవ్వనున్నారు. వ్యాసమధురాలలో వచ్చే ఈ వినూత్న శీర్షిక ఒక్కో సంచికలో ఒక్కో విషయం సమగ్రంగా వివరిస్తూ, ఆసక్తికరమైన సంఘటనలతో పాఠకులని అలరించనుంది.
దయ్యాలున్నాయా?
అకస్మాత్తుగా క్లాస్ అంతా నిశ్శబ్దంగా, నిర్ఘాంతపడి కళ్ళప్పగించి చూస్తున్నారు ప్రొఫెసర్ రాబర్ట్స్ ని.
ఆయన పాఠం చెబుతూ, ఒక్కసారి వాక్యం మధ్యలో ఆపేసి, ఒక వియత్నామీస్ స్టూడెంట్ వేపు అదేపనిగా చూస్తూ, పోడియం దిగి నడిచి వచ్చాడు. తిన్నగా ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఛెళ్ళు మని చంప మీద కొట్టాడు. క్లాస్ లో ఉన్న 40 మంది స్టూడెంట్ లు నిర్ఘాంతపోయారు ఈ హఠాత్పరిణామానికి.
రెండు నిమిషాలలాగే సూటిగా ఆ స్టూడెంట్ వేపే చూసి, తలదించుకొని క్లాస్ వదిలి వెళ్ళిపోయాడు, రాబర్ట్స్. క్లాసంతా పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఈ సీను చూసి, మాటలు రాక చేష్టలుడిగి అలాగే స్తబ్ధులై కళ్ళప్పగించారు. ఆ సాయంత్రానికి యూనివర్సిటీ అంతా తెలిసింది వార్త, ప్రొఫెసర్ రాబర్ట్స్ రాజీనామా చేశాడని.
ప్రొఫ్. రాబర్ట్స్ 5 సంవత్సరాలుగా, ఆ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పాఠాలు చెబుతున్నాడు. మంచి పేరు గడించాడు. స్టూడెంట్స్ తో చాలా సరదాగా కలుపుగోలుగా ఉండేవాడు. చాలామంది విద్యార్థులు సాయంత్రాలు అతనింటికి వెళ్ళేవారు, సందేహ నివృత్తికే కాకుండా అతని సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని కోరుతూ. ఆయన ఇంట్లో ఒక్కడే ఉండేవాడు.
**
రాబర్ట్స్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లో కాలేజి స్టేషన్ లో పుట్టాడు. అక్కడే బి.ఎస్ పూర్తిచేస్తూండగా, ఆర్మీ లోకి డ్రా ఫ్ట్ చేశారు. వియత్నాంలో ఒక సంవత్సరం యుద్ధం లో పాల్గొన్నాడు. అక్కడ ఫ్రంట్ లైన్ లో తుపాకి దెబ్బలు తిని కొన్నాళ్ళు ఆర్మీ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నాడు. అంతవరకూ అతని మిలిటరీ సర్వీస్ గురించి ఎవరికైనా తెలిస్తే. అదిగూడా చాలా కొద్దిమందికే. ఆ తరవాత అదే యూనివర్సిటీ లో Ph.D చేసి టీచర్ గా చేరాడు
**
ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన తర్వాత అతను ఎక్కడున్నాడో, ఏంచేస్తున్నాడో ఎవరికీ తెలియదు. అతని కి దగ్గిర బంధువులు ఎవ్వరూ ఆ వూళ్ళో లేరు. ఒక తమ్ముడు మిలిటరీలో ఉన్నాడు, యూరప్ లో. తల్లిదండ్రులు చనిపోయారు. అతను పెళ్ళిచేసుకోలేదని తెలిసింది.
ఈ సంఘటన జరిగిన 4 సంవత్సరాలకి మళ్ళీ అతను టెక్సాస్ వచ్చాడు. టెంపుల్ అనే వూళ్ళో వెటరన్స్ హాస్పిటల్ ఉందని ఆ వూళ్ళో ఇల్లు కొనుక్కున్నాడు. అప్పుడు మా సైకియాట్రీ క్లినిక్ కి వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారిగా చూశాను. ఆ నాలుగు సంవత్సరాల్లో ఏమి జరిగిందో, అతను చెప్పిన కథ సారాంశం ఇది. యూనివర్సిటీ లో ఆ సంఘటన జరిగినతర్వాత, కొన్నాళ్ళు అతను కొన్ని రోజులు"ఆమ్నీసియ" [మతి మరపు] తో ఎక్కడెక్కడ తిరిగాడో గూడా తెలియదు. కొన్నిచోట్ల దొంగనుకొని, కొన్నిచోట్ల డ్రగ్ యూసర్ అని, కొన్నిచోట్ల పార్కుల్లో గట్రా పడుకుంటుంటే "లొయిటరింగ్" అని, జైళ్ళలో, హాస్పిటల్స్ లో, ఇంకా నర్సింగ్ హోంస్ లో, గడిపాడు. చివరికి అతని వాలకం, బిహేవియర్ చూసి, అతను మెంటల్ పేషంట్ అయ్యుంటాడని ఫ్లారిడాలో ఒక వెటరన్స్ హాస్పిటల్లో జడ్జి ద్వారా "కమిట్' చేశారు. అక్కడ అన్నిరకాల టెస్ట్స్ అవ్వీ చేసి అతనికి PTSD [Post Traumatic Stress Disorder] అని డయాగ్నోస్ చేసి , ట్రీట్ మెంట్ ఇచ్చారు. మామూలుగా తన పని తను చేసుకోవడం మొదలెట్టాడు. మూడ్ మారటం, కోపతాపాలు, పిచ్చి గా మాటలాట్టo ఇత్యాది చాలా సింప్టంస్ తగ్గిపోయాయి. అతనికి యుద్ధం లో జరిగిన సంఘటనలవల్ల మతి స్థిమితం తప్పింది గాబట్టి అతనికి ప్రభుత్వం డిసెబిలిటీ ఇచ్చింది. అందుకని అతను ఒక అపార్ట్మెంట్ తీసుకొని, ఇచ్చిన మందులు వేసుకుంటూ పెద్ద ఒడిదొడుకుల్లేకుండా నెట్టుకొస్తున్నాడు.
అతను వియత్నాం లో యుద్ధం చేస్తున్నప్పుడు, తన ప్రాణ సంరక్షణార్థం చాలామంది శత్రువులనీ, కొంతమంది అమాయక ప్రజల్నీ కూడా చంపాడు. చాలాకాలం అవి బయటకు రాకుండా తనలోనే ఉంచుకున్నాడు . ఆరోజు యూనివర్సిటీలో ఆ వియత్నమీస్ స్టుడెంట్ ని చూసినప్పుడు, అకస్మాత్తుగా మళ్ళీ యుద్ధరంగంలో ఉన్నట్టు అనిపించింది. అందుకని శత్రువుని చంపేయాలని చెంప దెబ్బ కొట్టాడు.
ప్రస్తుతం ఇంకా సైకొతెరపీ తీసుకుంటాడు, మందులేసుకుంటాడు. ఎక్కువగా ఎవరినీ కలవడు. యుద్ధం గుర్తుకువచ్చే సినిమాలు, పుస్తకాలకి , సంఘటనలకీ దూరంగా ఉంటాడు. అంతకుముందున్న, మనుషుల మీది అపనమ్మకం, హలూసినేషన్స్, [లేనివి ఉన్నట్టు కనబట్టం, లేనివి ఉన్నట్టు వినబట్టం, పీడకలలు,] రాత్రిపూట అకస్మాత్తుగా మళ్ళీ యుద్ధభూమిలో ఉన్నట్టు లేచి సామగ్రిని పగలగొట్తడం, ...ఇవన్నీ చాలావరకు నిమ్మళించాయి.
నాలుగు, ఐదు సార్లు నాతో మాట్లాడాక, ఒక రోజు "డాక్టర్! మీకు దెయ్యాలమీద నమ్మకముందా?" అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, "తనకి రోజూ రాత్రి నిద్రపోదామని పక్కమీదకి వెళ్ళినప్పుడు, ఒక ముసలి తాతా, అతని 6-7యేళ్ళ మనమడూ, [వియత్నమీస్] బెడ్ రూం లోకి నడిచి వస్తారు. తన పక్కమీద కూచుంటాడు ముసలాయన. మనమడు పక్కన నించుంటాడు. తాత తన కళ్ళలోకి చూస్తూ కూచుంటాడు" ఇది ప్రతి రోజూ జరుగుతుంది. ఎన్ని మందులు వేసుకున్నా ఈ ఒక్క అనుభవం మటుకు పోలేదు. వాళ్ళిద్దరూ తనకి తెలుసు. వియత్నాం లో చిన్న పిల్లలు, అడవాళ్ళు, పెద్దవాళ్ళు గూడా శరీరంలో బాంబులు పెట్టుకొని సైనికుల్ని కావలించుకొని చంపేసిన సందర్భాలు చాలా ఉండేవి.అలాటివాళ్ళేననుకొని, ఇతడు వాళ్ళిద్దర్నీ చంపేశాడు. తీరా చూస్తే, వాళ్ళు నిరాయుధులు. ఆ మెమొరీ అతన్ని గత 30సంవత్సరాలుగా వేధిస్తున్నది. మొదటిరోజుల్లో గాభరాపడి, పక్కమీంచి పారిపోయి, ఆ రాత్రి నిద్దరపోక మరునాడు మూడీ గావుండి...చాలా బాధపడ్డాడు. కానీ గత 6 నెలలగా అతను భయపడటం మానేశాడు. కానీ ఆ దృశ్యం మాత్రం ఎడతెరిపి లేకుండా ప్రతీ రాత్రీ కనిపిస్తుంది.
నా మెడికల్ స్టూడెంట్స్ ని, రెసిడెంట్స్ ని ఆడిగాను వాళ్ళేమంటారో కనుక్కుందామని.వాళ్ళు దయ్యాలమీద నమ్మకం లేదన్నారు. మరి రాబర్ట్స్ కి రోజూ కనిపించేదేమిటి? దేముడున్నాడని నమ్మితే దయ్యముందనిగూడా నమ్మాలని అన్నాడు, స్వామీ వివేకానందుడు.
**
మనకి కలలొచ్చినప్పుడు ఒక్కోసారి చాలా విపులంగా, నిజంగా జరిగినట్ట్లు కలలొస్తాయిగదా. మళ్ళీ పొద్దున్న నిద్రలేవగానే, "అమ్మయ్య! అది కలే" అని స్థిమిత పడతాము. మరివన్నీ ఎక్కడనుండి వస్తున్నాయి? ప్రఖ్యాత మానసిక వేత్త, సిగ్మండ్ ఫ్రాయిడ్ [Sigmund Freud] ఒక పెద్ద పుస్తకమే రాశాడు, కలలమీద, {The Interpretation of Dreams"] అని. ఈ రోజుల్లో అతను చెప్పిన సిద్ధాంతం చాలామంది నమ్మరు. ఫ్రాయిడ్ తన సిద్ధాంతాలు చాలావరకు మన ఉపనిషత్తులు ప్రతిపాదించిన విషయాలే కొంచెం మార్చి చెప్పాడు. కాపీ కొట్టాడని చెప్పలేము గానీ, ఉపనిషత్తులు చదివుంటాడని అనుకోవచ్చు. "విశ్వరూపా జాగరిణీ, స్వపంతీ తైజసాత్మికా, సుప్తా ప్రాజ్ఞాత్మికా, తుర్యా సర్వావస్థ వివర్జితా" అని లలితా సహస్రనామాల్లో ఉన్నది. అంటే మన మనస్సులోనే ఉన్న మన జీవ చైతన్యం పగలూ, రాత్రి, నిద్రా అవస్థల్లో ఒక్కొకరకంగా ప్రస్ఫుటమౌతుందన్నమాట.
తుర్యావస్థలో మనసు దాదాపు నిద్రపోతున్నదన్నమాట. అంటే ఏమీ ఆలోచనలు లేకుండా, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు EEG [బ్రెయిన్ వేవ్ టెస్ట్] తీస్తే బ్రెయిన్ వేవ్స్ చాలా అరుదుగా [సెకనికి 3-4] ఉంటాయి. ప్రాణం ఉండి, ఆ బ్రెయిన్ వేవ్స్ సున్నకొస్తే అదే "సమాధి".
మన బ్రెయిన్ లో కోటానుకోట్ల జీవకణాలున్నాయి. మెదడులో వున్న కణాల్ని న్యూరాన్స్ [neurons] అంటారు. మళ్ళీ ఒక్కొక్క న్యూరోన్ అనేక కోట్ల న్యూరాన్లతో డెండ్రైడ్, ఆక్సాన్ అనే తీగెలద్వారా కొన్ని కోటానుకోటానుకోట్ల న్యూరాన్స్ తో సంబంధం పెట్టుకుంటాయి. అందుకనే మనకి ఒక పనిచేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఆ పని కి సంబంధించిన[మనకి గుర్తులేకపోయినా] చాలా విషయాలు మనకి గుర్తుకొస్తాయి.రోజూ పొద్దున్నే చూసే భర్త మొహం గానీ, భార్య మొహం గానీ, మన వాలెట్ గానీ మనం వెంటనే గుర్తుపడతాము కదా. వాల్మార్ట్ కి వెళ్ళి అక్కడ పార్కింగ్ లాట్ లో మనం కారుపార్క్ చేసి 2 గంటలతరవాత అన్ని కార్లలోనూ మన కారు వెంటనే గుర్తుపడతాం. దీన్ని "అభిజ్ఞ" అంటారు. ఒక ఫ్రెండ్ ని 40 యేళ్ళ తరవాత రైల్వే స్టేషన్ లో కలుసుకున్నామనుకోండి. ఈ 40 యేళ్ళు అతని గురించి ఆలోచించలేదు. అయినా ఇంతకాలం తరవాత అతన్ని గుర్తు పట్టి, పాత విషయాలన్నీ చాలా మాట్లాడతాము కదా. అంటే ఆ మెమొరీస్ అన్నీ మెదడులో మెమొరీస్ లాగా ఎక్కడో ఉన్నాయన్నమాట. ఒకానొక స్టిమ్యులస్ వల్ల అవన్నీ మళ్ళీ బయటికి వచ్చాయి. దీన్ని "ప్రత్యభిజ్ఞ" అంటారు.
మనం చెప్పుకుంటున్న రాబర్ట్స్ విషయం లో, అతను చంపిన ఆ ముసలి తాత, మనవడు దృశ్యం మెదడులో గాఢంగా నాటుకు పోయిందన్నమాట. [Indelible] కాబట్టి రాత్రి ఒక్కడే ఉన్నప్పుడు పక్కన ఏమీ అవాంతరాలు లేనప్పుడు, [sensory deprivation] అతడికి ఆ మెమొరీ అలా దృశ్యరూపంగా కనిపిస్తుంది దీన్ని దృశ్య హలూసినేషన్ అంటారు. మనకి కనబడకపోయినా అతనికి అది నిజం. మనయోగులు, యోగబలంతో చాలా విషయాలు చూస్తారు గదా. కొన్ని "మాయలు" చూపిస్తారు.
యోగబలం తోటి, మెడిటేషన్ ద్వారా, కొన్ని ఆహార వ్యవహార నియమాల [యమ, నియమ, ప్రత్యాహార...ఇత్యాది] మన మెదడులోని కేంద్రాల్ని బాగా అభివృద్ధి చేసి కొన్ని శక్తులు సంపాదించవచ్చు. వంద సంవత్సరాల కిందట పెంఫీల్డ్ [Penfield] అనే న్యూరాలజిస్ట్, బ్రెయిన్ మాప్ తయారుచేశాడు. జీవించి ఉన్న మెదడుని, ఒక్కొక్క చోట ప్రేరేపిస్తే ఒక్కొక్క రకమయిన మార్పు వస్తుందని నిరూపించాడు. ఉదాహరణకి మెదడు వెనక భాగం [occipital lobe] ని ఉద్రేకపరిస్తే కళ్ళముందు రకరకాలయిన దృశ్యాలు కనబడతాయి. అదే మన వినికిడి సెంటర్ [Auditory] ని ప్రేరేపిస్తే రకరకాలయిన మాటలు, పాటలు వినిపిస్తాయి
మన రాబర్ట్స్ విషయానికొస్తే, అతడు వియత్నాం లో చూసినవి చేసినవి అనుభవాల్లాగా, మెదడులో శాశ్వతంగా ముద్రింపబడ్డాయి. మామూలుగా మనం ఎలాగయితే మన విషాద స్మృతుల్ని కొంతకాలానికి మర్చిపోతామో [కుటుంబ సభ్యులెవరయినా చనిపోతే మొదట్లో కొంత భరించరాని దుః ఖం వస్తుంది. రాను రాను మరుపొస్తుంది కదా.] రాబర్ట్స్ విషయంలో కొన్ని భయంకరమయిన అనుభవాల్ని అతను పూర్తిగా మెదడులోని లోతు ప్రదేశాలకి అణగదొక్కలేక పోయాడు.అవి దాచి ఉన్న నిప్పుకణికలా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ బయటికి వచ్చి బాధపెడతాయన్నమాట. మొదట్నించీ సైకోతెరపీ, మందులువేసుకుంటె తరవాత ఇలా బాధించవు.
దీనికి Post Traumatic Stress Disorder [PTSD] అని పేరుపెట్టారు. రాత్రిపూట సినిమాకెళ్ళొస్తుంటే, ఎవడో దుండగుడు ఒకమ్మాయిని బలాత్కారం చేశాడనుకోండి. మళ్ళీ ఆ వీధిలోకిపోవడానికీ ఆ అమ్మాయి జంకుతుంది. అల్లాంటి సీన్లు టివి లో వస్తే కళ్ళు మూసుకుంటుంది, లేదా చెమటలు పట్టి వణికిపోతుంది. PTSD కి ఇది ఒక చిన్న ఉదాహరణ.
**
మనసుకి జరిగే ఆ దుర్ఘటన, కార్ ఆక్సిడెంట్, స్త్రీలపై బలాత్కార చర్యలు, తల్లిదండ్రులు కొందరు పిల్లల పెంపకంలో ఉపయోగించే అతి దారుణమైన క్రమశిక్షణ, ఎంతో ఆశతో కష్టపడి చదివిన పరీక్షలో నెగ్గకపోవడం, సరే యుద్ధాలూ... ఇలాగా ఆ దుర్ఘటన ఏదైనా కావచ్చు. అది మీకూ నాకూ పెద్ద దెబ్బ అనిపించకపోవచ్చు...కానీ ఆ సమయంలో ఆ వ్యక్తికి అది దుర్భరంగా ఉండవచ్చు. ఆ తరవాత ఆ సంఘటనని గుర్తుకుతెచ్చే విషయం గానీ, దృశ్యంగానీ ఏది వచ్చినా ఆ వ్యక్తికి ఆ సింటంస్ మళ్ళీ కనబడతాయి. ఆ భయంతో వాళ్ళు అటువంటి సంఘటనలు జరిగే ప్రదేశాలనీ, పరిస్థితులనీ తప్పించుకు తిరుగుతారు. ఎప్పుడైనా అటువంటి పరిస్థితి తారస పడితే మళ్ళీ జబ్బు తిరగబెడుతుంది.
అటువంటి దుర్ఘటలనెదురుకున్నవాళ్ళందరికీ ఈ వ్యాధి రాదు. కొన్ని అంచనాల ప్రకారం నూటికి పాతిక మందికి వ్యాధి లక్షణాలొస్తాయి. వ్యాధి కలిగినవారిలో సరిగా సమయానికి ట్రీట్ మెంట్ తీసుకున్న వాళ్ళలో నూటికి 80 మందికి నయమయ్యి మామూలు జీవితం సాగించగలుగుతారు.
మరి మన రాబర్ట్స్ కి అలా వదలకుండా పీడిస్తున్న "తాతా,,,మనవడు" దృశ్యమేమిటి? మెదడులో ఉన్న కోటానుకోట్ల న్యూరాన్స్ [నెర్వ్ సెల్ల్స్] మిగిలిన న్యూరాన్స్ తో ఎంత దట్టంగా అల్లుకుపోయి సహవాసం చేస్తాయంటే, ఆ కనెక్షన్ల లెక్క "మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల" సంఖ్య కన్న ఎక్కువ. అయితే మరి ఆలోచనారహితంగా ఉండటం ఎలాగ? పల్లెటూళ్ళల్లో ఎద్దుబండి పోతుందే మట్టి రోడ్డు మీద, అప్పుడొక గాడి పడుతుంది గదా! అదే బాటమీద చాలా బళ్ళు చాలా సార్లు వెళితే, ఆ గాడు లోతుగా తయారవుతుంది. ఆ తరవాత బండి పొరపాటున, "గాడి తప్పినా" మళ్ళీ చక్రం ఆ లోతులో కే పోతుంది. అలాగే మన మెదడులో ఉన్న [Brain sulci] సన్నని గాట్లు మన మనస్సుని కొన్ని [తనకిష్టమైన] గాట్లలోకి తీసికెళ్ళి, ఆ గాడి బాగా లోతుగా, వెడల్పుగా తయారయేలాగా చేస్తుంది. అంటే మనసుకి "ప్రియమైనవి". "శ్రేయమైనవి కావు". అందుచేతనే దురలవాట్లు తొందరగా మనకి నచ్చి ఆ బాటలో పోవడం సుగమం చేస్తుంది మనసు. క్రమశిక్షణ, మితాహారం, మంచి అలవాట్లు, [మన వేదాంతం లొ చెప్పే యమ, నియమ, ప్రత్యాహార, తితీక్ష ,బ్రహ్మచర్యం, వైరాగ్య... ఇత్యాది]సుగుణాలు మనసుకిష్టముండవు అందుకని వాటికి "గాళ్ళు" పట్టం కష్టం. అదేవిధంగా కొన్ని స్మృతులు [మెమొరీస్] [మన కథ లో తాతా...మనవడు ] లాగా అలా గాడిలో పడి శాశ్వతత్వాన్ని పొందుతాయి. అదృష్టం అందలమెక్కిస్తే బుద్ధి బురదలోకీడ్చింటారుగదా ఇదే!. అభ్యాసం కూసు విద్య అన్నట్టు,మొదట్నించీ మంచి ఆలోచనలే, మంచిపనులే, మంచి సంబంధాలే అలవరచుకుంటే అవే మెదడులో పెద్ద గాడి ని చేస్తాయి. చిట్టిబాబుకి వీణ లో అంత నైపుణ్యం ఒక్క రోజు రాలేదు కదా! ఎం. ఎస్ సుబ్బులక్ష్మి రోజుకి 3 గంటలు సాధన చేసేది. రామకృష్ణ పరమహంస 12 సంవత్సారాలు సాధన [తపస్సు] చేస్తే అమ్మ కరుణించింది.
“మనసు ఒక కోతి” అనేవారు మన వేదాంతులు. అయితే అది అన్నమయ జీవి. 21 రోజులు ఆహారం పెట్టకపోతే ఆలోచనలు రావు. అందుకనే మన ఋషులు,బయటి ఆకర్షణలు లేకుండా, కందమూలాలు తింటూ, మనసుని అరికట్టి తత్వశోధన చేసేవారు.
**
ఇంతకీ దయ్యాలున్నాయా ? లేవా? రమణ మహర్షి చెప్పినట్లు, "మీరున్నాయనుకుంటే ఉన్నాయి. లేవనుకుంటే లేవు" అంతా మనసు మీద ఆధారపడి ఉంటుంది.
Shakespeare 17 వ శతాబ్దం లో Measure for Measure అనే నాటకంలో ఇలా చెబుతారు
The lunatic, the lover, and the poet
Are of imagination all compact:--
One sees more devils than vast hell can hold,--
That is the madman: the lover, all as frantic,
Sees Helen's beauty in a brow of Egypt:
The poet's eye, in a fine frenzy rolling,
Doth glance from heaven to earth, from earth to heaven;
And, as imagination bodies forth
The forms of things unknown, the poet's pen
Turns them to shapes, and gives to airy nothing
A local habitation and a name.
దీనికి నా సామాన్య ఉదాహరణ:
నల్లని మేఘం లో తెల్లని మెరుపు చూసి:
ప్రియురాలి నీలవేణిలో తెల్లనిమల్లెచెండు, [- ఒక ప్రేమికుడి స్పందన]
కృష్ణపరమాత్మ వెదజల్లే చిరు దరహాసం [ - ఒక కవి స్పందన ]
శత్రువుల నిశీధాస్త్రపు దమ్ష్ట్రాకరాలు. [ - ఒక పిచ్చివాడి స్పందన ]
సరస్వతీ కఛ్ఛపి మధుర వీణానాదం విని:
ప్రియురాలు పంపిన మేఘసందేశం [- ఒక ప్రేమికుడి స్పందన]]
ప్రకృతిమాత వసంతంలో పకపక నవ్వులు [- ఒక కవి స్పందన]
శతృవిగత సానిక్ బాంబ్ [ - ఒక పిచ్చివాడి స్పందన ]
అందుకే ఒకానొక మహానుభావుడు, "సృష్ఠి లో ఎన్ని లోకాలున్నాయి? మూడా, పధ్నాలుగా, ముప్పై ఆరా" అన్న ప్రశ్నకి, "సృష్ఠి లో ఎవడిలోకం వాడిది. ఎన్ని తలకాయలుంటే అన్ని లోకాలు" అని చెప్పాడు. నిజమే కదా.
వచ్చే సంచికలో మరో ఆసక్తికరమైన అంశం తో కలుద్దాము.
*****
ఒక మనిషికి మోకాలుకిందనించీ కాలు తీసేయాల్సి వచ్చింది. అయినా అతనికి తీశేసిన కాలిదగ్గర నెప్పి ఉంది. దురద ఉంది. ఎలా తొలగించడం? పై పెదవి మీద గోకితే ఆ కాలి దురద తగ్గింది. అది ఎలా సాధ్యమో తెలుసుకోవాలని ఉందా? వచ్చే సంచికకోసం ఎదురుచూడండి.
--
రచయిత పరిచయం: గుంటూరు లో MD చేసి, 1974 లో అమెరికా వచ్చిన గిరిజాశంకర్ గారు అమెరికాలోనే సైకియాట్రీ చేసారు. 2012 లో రిటైర్ అయ్యారు. భార్య లక్ష్మి. ఒక కొడుకు షుగర్ ల్యాండ్, టెక్సస్ లో వైద్యులు. ప్రస్తుతం పుస్తకపఠనం, సత్సంగ్, ఈశ్వరచింతన, సాహిత్య గోష్టులలో పాల్గొనడం వారికి ఇష్టమైన వ్యాపకాలు. ఇప్పటివరకూ కదంబము, సూర్యకాంతం కథలు అనే రెండు కథల పుస్తకాలు ప్రచురించారు.