top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

అప్పిచ్చి'వాడు -వైద్యుడు- 7
 

ఐ సీ! ఓ సీ డీ!!

girja sankar.JPG

 చింతపల్లి గిరిజా శంకర్

       అప్పిచ్చివాడు వైద్యుడు...అప్పిచ్చ్హివాడు వైద్యుడు...అప్పిచ్చివాడు వైద్యుడు 

 

రచన రచన రచన   చింతపల్లి గిరిజా శంకర్. చింతపల్లి గిరిజా శంకర్...చింత...వగైరా.

-------------------------------------------------ఏమిరా ఇది? రాసినవాడికి పిచ్చికాదుకదా అనుకుంటున్నారు కదూ? లేదా వాడికి నత్తి ఏమైనా ఉందా? అన్న సందేహం కలగవచ్చు. మా చిన్నతనంలో "పెళ్ళిచేసి చూడు" అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక చిన్న పిల్లవాడు పరీక్షరోజు బడి ఎగ్గొట్టడానికి ప్లాన్ వేస్తాడు. కడుపునొప్పి అని వంకపెట్టి ఒక పాటపాడుతాడు, "ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుదామని, పట్టుబట్టి నే  పాఠాల్ చదివితే...పాఠాల్ చదివితే..." 

 

ఈవిధంగా ఒక మాటగాని, ఒక క్రియ గాని  అస్తమానం చేస్తూ ఉండి, అది చేయలేకపోతే anxiety  వచ్చే  జబ్బుని obsessive compulsive disorder అంటారు. నేను  మాటకింతని రాయడంలేదుగనక, దాన్ని టూకీగా OCD అని ఉదహరిద్దాము. వీటికి అనువైన తెలుగు పదాలు లేవు. ప్రయత్నం చేస్తే Necktie ని "కంఠ లంగోటీ" అన్నట్లుంటుంది. కాబట్టి, OCD అంటే ఈ జబ్బని అనుకుందాము.   ఇందులో మళ్ళీ obsessions  అంటే, మెదడులో ఒకే ఆలోచన మాటిమాటికీ వస్తుంటుంది. అది మరిచిపోదామంటే, anxiety వస్తుంది. ఇది ఒక పాటగానీ, లేక ఒంట్లుగానీ, లేక ఒకానొక సమాసంగానీ పదే పదే మనసుని తొలిచివేస్తుంది.  ఇక compulsion  అంటే ఒక క్రియ: అంటే ముక్కుని తాకడం, మాటిమాటికీ చెయ్యి  కడుక్కోవడం, [ఇక్కడ చెయ్యి మలినంగావుందని ఒక obesession  వల్ల చెయ్యి కడుక్కోవడం అనే compulsion ఏర్పడుతుంది]

 

గణనకెక్కిన  ప్రభృతులు  కొందరికి ఈ జబ్బు ఉండేదని పుస్తకాల్లో వర్ణించారు. Samuel Johnson [1709-1784] ఇంగ్లండ్ లో ఒక మహా కవి "తన ఇంటినించి బయటికి వెళ్ళాలంటే, నిశ్చిత అడుగులు మాత్రమే వేశేవాట్ట. ఒక వేళ లెక్క తప్పయితే, మళ్ళీ వెనక్కివెళ్ళి ప్రయత్నం. అవతల ఎంత అర్జంట్ పని ఉన్నా సరే ఈ లెక్క సరిపోయేదాకా, ఆయన ఇంటి బయటకి వెళ్ళడు. అమెరికా దేశస్థుడు Howard Hughes, Germophobia తొ చివరికి తిండిగూడా తినకుండా ఆకలితో చచ్చిపోయాడు. ఏది తెచ్చినా, అందులో పురుగులుంటాయని , ఉష్ణోగ్రత సరిగ్గా లేదనీ, gloves లేకుండా తెచ్చారనీ, సేవకుల్ని విసిగించి, తిండితినకుండా, అనుమనాలతో, భయపడి చచ్చిపోయాడు. అంత డబ్బు ఉండీ ఆకలితో అలమటించాడు.

మరి మనం చిన్నప్పుడు చదువుకున్న Around the world in 80 days నాయకుడు, Phyllias Fogg గూడా ఇల్లాంటి కల్పనేగదా అని మీరడగవచ్చు. Fogg విషయం లో అతను, అతని  పరివర్తనవల్లా, అలవాట్లు అతనికి హాని కలుగ చేయలేదు.  అదీ psychiatry లో అసలు కిటుకు. ఎవరైనా సరే, వాళ్ళ, అలవాట్లవల్లగానీ, ఆలోచనలవల్లగానీ, ప్రవర్తనవల్లగానీ తనకూ, ఇతరులకూ హాని చేయనంతవరకూ వాళ్ళు జబ్బుతో బాధపడుతున్నట్లు కాదు. ఉదాహరణకి, మనం అన్నం తినేముందు చేతులు [ఇండియలోనైతే కాళ్ళుగూడా ] కడుక్కుంటాముగదా, ఆ కడుక్కోవడం సాయంత్రం దాకా కడుక్కుంటే, అంటే లంచ్ కి వచ్చినవాడు డిన్నర్ దాకా అదే పనిలో వుంటే వాడికి వైద్యం అవసరం.

 

సైకియాట్రీ లో  కీలక ఆదర్శం "అతి సర్వత్ర వర్జయేత్"

 

ఒకసారి నాకొక ఆడ పేషంట్ వచ్చింది, ఆఫీసుకి. "డాక్టర్ నేను భరించలేకపోతున్నాను, నా సంసారాన్ని. నా మొగుడు తాగుబోతు. నా కొడుకుని గూడా పాడుచేస్తున్నాడు. పని అయిపోయాక ఇంటికి రాడు. లేక్ దగ్గిర ఇంకొక చిన్న ఇల్లు తీసుకున్నాడు. వర్క్ అయిపోయాక అక్కడికే వెళ్తారు ఇద్దరూ. శని ఆదివారాలు గూడా ఇంటికి రారు. నేను ఆత్మ హత్య చేసుకుందామని అనుకుంటున్నాను. నా మొగుడుకి  వేరే affair ఉందని నా ధృఢమైన అభిప్రాయం" సరే ఆసుపత్రి లో  ఎడ్మిట్ చేశాను. భర్త, కొడుకుతో మాట్లాడితే తెలిసిన కథ ఇలాగుంది." భార్యకి OCD ఉంది. ఎంత తీవ్రం అంటే, ఆమె లాండ్రీ చేస్తున్నప్పుడు అన్ని గుడ్డలూ ఆరోజే చెయ్యాలి. అందులో మళ్ళీ, మామూలు దుస్తులు వేరే, బ్లూ జీన్స్ వేరే.  ఆమె బూ జీన్స్ చేస్తున్నప్పుడు, వీళ్ళు వేసుకున్న జీన్స్ గూడా వస్త్రాపహరణం చేసి తీరవలిసిందే! అదే విధంగా తెలుపువి, మిగిలిన కాటన్ ఇత్యాది... ఇంక ఇంటిలో అంతా ఆమె చెప్పినట్టు చేయకపోతే, అంటే గ్లాస్ ఎక్కడపెట్టాలి, ఎలా తీయాలి, సోఫా లో ఎలా కూచోవాలీ,  ఎన్ని గంటలకి తినాలీ ఇలా సవాలక్ష ఆంక్షలతో ఇది భరించలేక, విడాకులు ఇవ్వడం ఇష్టం లేక భర్త [అతనితోపాటు కొడుక్కి గూడా కంటకమయి] వాళ్ళు లేక్ హౌస్ లో ఊపిరి తీసుకుంటున్నారు.  కుర్రాడు స్కూల్ లో బాగా చదువుతున్నాడు.

 

సైకియాట్రీ లో  ఇదొక మయసభ. కంప్లెయిన్ చేసిన వాళ్ళు కాకుండా ఇంకొకరుంటారు రుగ్మతతో. అందుకని ఫామిలీ హిస్టరీ చాలా ముఖ్యం. ఫామిలీ మొత్తానికి సలహాలివ్వాల్సి ఒస్తుంది.

 

ఇంకొక మహిళ ఇలాగే తన భర్తని తీసుకొచ్చి, "ఇతడికి పిచ్చి. ఎడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వు" అని మొదలెట్టింది.  ఎందుకూ, ఏమిటీ అంటే, “He is driving me crazy. He makes me nervous"  భర్త ఏమీ మాట్లాడడు.   నేను చూసినప్పుడు, అతనికి 45 వయసుంటుందేమో. చాలా handsome గా  వున్నాడు. ఒక కాలు లేదు రెండవ ప్రపంచయుద్ధంలో కాలు పోయింది. Disability ఇస్తుంది ప్రభుత్వం. నా పరీక్షలో అతనికి గూడా ఏమీ జబ్బులేదు. మతం మీద నమ్మకం తో విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. యోగి లాగా, detachment అలవరచుకొని కొనసాగిస్తున్నాడు జీవితం. అప్పుడు నేను, "నీ భర్త నిన్ను nervous  గా చేస్తుంటే, అతన్ని ఎందుకు ఎడ్మిట్ చేయడం. నిన్ను చేస్తాను, నువ్వు గదా బాధపడుతున్నది?" అంతే తోక తొక్కిన తాచులాగా కయ్యిమని నా మీద విరుచుకుపడ్డది. "నాకు ఇల్లూ వాకిలీ, పిల్లలూ ఉన్నారు. నేనెలాగ రాగలనూ?" అన్నది. పోనీ మందు ఇస్తానన్నాను. "నేను ఇప్పటికే   10  మందులు మింగుతున్నాను" అన్నది. "పది మందులు మింగేదానివి, ఇంకొక మందు మింగలేవా?" అన్నాను. ఆ తరవాతేం  జరిగిందో మీరూహించుకొండి. Social worker ని ఇంటికి పంపించాను, house visit కి. వాడు వెనక్కొచ్చి, "మళ్ళీ చస్తే ఆ యింటికి పోను?" అని శపధం చేశాడు. ఏమిరా అంటే, వాడు చెప్పిన సమాచారం, ఇందాక లాండ్రీ లో ఉతికిన భార్య కంటే వేయి రెట్లు కనాకష్టంగా వాళ్ళింట్లో rules . బయటే చెప్పులు విడవడం దగ్గర్నించీ, ఎంత దూరంలో కూచోవాలి ఇత్యాది కోట్లకొద్దీ ఆంక్షలు.

ఇప్పుడు ఉటంకించిన రెండు కథలూ, మామూలుగా శుభ్రత కోసం చేసే పనులే అతి చేస్తే, వాళ్ళకి, వాళ్ళ వాళ్ళకి వచ్చే కష్టాలగురించి చెబుతున్నాయి.

 

వచ్చే సంచికలో- అసలు చిన్నప్పట్నించి కొన్ని లక్షణాలవల్ల వాళ్ళ జీవితాన్నే మార్చేసే సన్నివేశాలు చెప్పుకుందాము. 

ఒకానొక లాయర్ న్యూ యార్క్ నగరం పార్క్ లో పడుకున్నాడు. పోలీసువాడు  వచ్చి "ఇక్కడ పడుకోగూడదు. "

"నా అపార్ట్మెంట్ ఇక్కడికి దగ్గరే"

"మరి ఇక్కడెందుకు పడుకున్నావ్?"

"మా మానేజర్ నన్ను వెళ్ళగొట్టాడు"

"అద్దె బకాయా"

"కాదు నీళ్ళు ఎక్కువ వాడతానని" 

 

 

అప్పుడా పోలీసువాడేం చేశాడు? అతనికి పార్క్ లో పడుకోవలసిన గతి ఎందుకొచ్చింది? అతను లాయరు కదా?  ఏమిటీ కమామిషు?  వచ్చే సంచికలో

 

*****

   . 

bottom of page