top of page

వ్యాస​ మధురాలు

అప్పిచ్చి'వాడు -వైద్యుడు- 6
 

ఇది మాయా సంసారం తమ్ముడూ!

girja sankar.JPG

 చింతపల్లి గిరిజా శంకర్

manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

ఒక జైలు భోగికి ఉత్తరం వచ్చింది. వాడు ఆ వుత్తరాన్ని చదివి అందరికీ దిగ్భ్రమ కలిగేలాగా వికటంగా నవ్వి అట్టహాసం చేశాడు. అందరూ వింతగా చూశారు. అప్పుడు వాడు చెప్పినదిది. "నాకొక కవల తమ్ముడున్నాడు. చిన్నప్పట్నుంచీ అందరూ వాణ్ణే మెచ్చుకునేవారు. వాణ్ణి,  నన్నూ కనుక్కోలేకపోయేవారు. వాడు తప్పుచేస్తే, నన్ను కొట్టేవాళ్ళు. వాడు ఎవరితోనో దెబ్బలాడితే, నన్ను కొట్టేవాళ్ళు. నేను ప్రేమించినమ్మాయిని వాడు పెళ్ళి చేసుకున్నాడు. వాడు మర్డర్ చేస్తే నన్ను జైల్లో పెట్టారు.  ఇప్పుడు భగవంతుడు న్యాయం చేశాడు. నేను చచ్చిపోతే వాణ్ణి పాతిపెట్టారు" 

 

మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది. "అపూర్వ సహోదరులు." దాన్లొ హీరో డబల్ రోల్. ఇద్దరూ ఒకమ్మాయినే ప్రేమిస్తారు. ఒకణ్ణి కొడుతుంటే రెండొవాడికి నొప్పి పుట్టేది. బాగా డబ్బులు చేసుకుంది. ఆ తరవాత  అటువంటి సినిమాలు చాలా వచ్చాయనుకొండీ,  ఇద్దరు మిత్రులు, రాముడు భీముడు వగైరా. నా స్నేహితు డొకాయనకి కవల పిల్లలున్నారు. ఇ ద్దరూ ఇంజనీరింగ్ చేశారు. ఒకడు  తరవాత MD చేసాడు. తమాషా ఏమిటంటే ఒకడు డాక్టర్, ఒకడు ఇంజినీర్ అయినా ఇద్దరూ ఒకే పేరుగల వూళ్ళో ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నాళ్ళు Rochester MN  లో ఉన్నారు. ఆ తరవాత Phoenix లొ. వాళ్ళ పెళ్ళిళ్ళు గూడా దగ్గరిఊర్ల పిల్లల్నే పెళ్ళి చేసుకున్నారు.  భార్యల పేర్లు గూడా బంగారమే, ఒకామె హేమశ్రీ,   ఇంకొకమ్మాయి స్వర్ణ.

 

ఇది కవలపిల్లల కథ  కాని నేను చెప్పబోయే జబ్బుకి కవలపిల్లలకి సంబంధం లేదు. కానీ, ఒక మనిషి, తనకి రెండు నించి, 30, 40 విడి విడి గా personalities  ఉన్నాయి అని చెప్పుకోవడం మానసిక శాస్త్రంలో జరుగుతూ ఉంటుంది.   అదొక సైకియాట్రిక్  జబ్బు.  చాలా పేర్లున్నాయి గానీ మనమిక్కడ అందరికీ పరిచయమయిన Multiple personality Disorder" ని వాడదాం. మొట్టమొదట ఒక శతాబ్దం కింద ఈ జబ్బుని గుర్తించారు. 1886 లొ Robert Louis Stevenson రాసిన Dr. Jekyll and Mr. Hyde ఈ జబ్బుగురించి కథలాగా రాశాడు. అందులో Dr. Jekyll వూళ్ళో పేరుగాంచిన డాక్టర్. అయితే అతనికి ఆరోజుల్లో బాగా ప్రచారంలోవున్న మత్తు పదార్థం ఓపియం వాడాలని,  ఆ గాంగ్స్ తో తిరగాలనీ విపరీతమయిన కోరిక ఉండేది. పరువు ప్రతిష్ఠ ఒక పక్క , మరొక పక్క విపరీతమయిన మానసిక దురద. అందుకని, రాత్రిపూట, తన్ని డాక్టర్ గా గుర్తించలేని , ఇంకో ఇల్లూ వాకిలీ లేని పాంధుడు లాగా,  పానశాలలకి వెళ్ళి తన కుతి తీర్చుకునేవాడు. దాన్ని సైకియాట్రిస్ట్స్ Dissociative  Identity Disorder అని పేరు పెట్టారు. అంటే మన మెదడుకిఒక గొప్ప సృజనాత్మక శక్తి ఉందన్నమాట.  ఎలాగయితే రామకృష్ణ పరమహింస, తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పార్వతీదేవిని చూడగలిగేవాడో,  అదేవిధంగా మానవుడు "under extreme psychological stress"  ఆ బాధని తప్పించుకోవటానికి, ఇంకొక identity ని సృజించుకొని ఆ బాధని తప్పించుకుంటారు. ఇలా మానసికంగా కాకుండా, ఆ stress ని తనకి అధీనంలో ఉన్న శరీరభాగాలకి ఆపాదించుకుంటే, దాన్ని Hysteria with conversion అంటారు. ఉదాహరణకి ఒక ఉద్యోగికి, బాస్ మీద అపరిమిత కోపం వచ్చింది. బాస్ ని పీక పిసికి చంపేద్దామన్నంత కోపం వచ్చింది. దాని వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయి గాబట్టి, ఆ కోపాన్ని ఒక అవయవంలో క్రోడీకరించి, ఆ అవయవం పనికి రాకుండా చేస్తాడు. ఇక్కడ తన రెండు చేతులూ పక్షవాతం తో పడిపోతాయి.  అప్పుడు తను వాడి పీక పిసకలేడు గదా! ఆవిధంగా తన కోపాన్ని దాచుకోగలడు.  చేతులు పక్షవాతం వచ్చి, పీక పిసకలేడు. తన కోపం తగ్గింది. ఉద్యోగం బతికింది.  ఇంకా గమ్మత్తేమంటే, తనకి బాహుపక్షపాతం వచ్చిందని దుః ఖపడడు  సరిగదా, దానికి సంతోషిస్తాడు. అంటే తనకి పక్షవాతం వచ్చిందని సంతోషపడతాడన్నమాట. అంటే చేతులు బాగుంటే అతని కోపం వల్ల  , బాస్ గొంతు పిసకడం, అతడు చచ్చిపోవడం, దరిమిలా తను జైలుకి వెళ్ళడం ఇవన్నీ ఆగిపోయాయి అని సంతోషిస్తాడన్నమాట  దీనికి Labelle indifferans అని పేరు పెట్టారు. జబ్బుని నిర్లక్ష్యం చెయ్యడమే కాకుండా ఆ జబ్బుని గురించి ఆనoదిస్తాడన్నమాట!   

 

Hysteria అనే పదం తెలుగులో "అపస్మారము" అని చెబుతూంటారు. అయితే దీనిలో రెండురకాలున్నాయి. ఇందాకా చెప్పిన ఉదంతం [బాస్ మీద కోపం వచ్చి చేతులకి పక్షవాతం వచ్చిన ఘటనని,Conversion disorder అంటారు. దీన్ని గురించి ఇంకోసారి విపులంగా చర్చిద్దాము. ప్రస్తుతం ఈ Hysteria చేతులకి, కాళ్ళకి, ఇంకా మన అధీనంలో ఉండే అవయవాలకి కాకుండా, మెదడుకి సంబంధించిన జాడ్యం గురించి మాట్లాడదాము.  ఆ జబ్బుని Dissociative identity    disorder  అంటారు.  అంటే ఆ బాధలు భరించలేక ఆ మనిషి ఇంకొక మనిషి లాగా ప్రవర్తిస్తాడన్నమాట. ఈ జబ్బు ఎక్కువగా ఆడవాళ్ళల్లో ఒస్తుందని hysteria  అన్నారు. Latin  లో Uterus ని Hystero అంటారు. అదీ దాని కథ. అయితే నిజమయిన జబ్బులో అసలు మనిషికి ఆ రెండో మనిషి [లేక మూడూ నాలుగూ---30-40 ] identity ఉన్నట్టు తెలియగూడదు. ఉదాహరణకి డాక్టర్ జెకిల్ కి మిస్టర్ హైడ్ ఉన్నట్టు తెలియగూడదు. తెలిస్తే అది "దొంగనాటకం లేదా దొంగాటకం" అవుతుంది. నేను చూసిన ఒకరిద్దరు రోగులగురించి ప్రస్తావిస్తాను  ఆ తరవాత విశదంగా చర్చ చేద్దాము.

 

***

1.     జాన్ అనే రోగి, తరచూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవాడు. వాడికి నేనిచ్చిన డియాగ్నోసిస్ స్కిజొఫ్రేనియ. ఇచ్చిన మందులు వేసుకునేవాడు కాదు. ప్రతీ అడ్మిషన్ కి వాడి మూత్ర పరీక్షలో డ్రగ్స్ పాసిటివ్ మారిజువానా, కొకేయిన్ .  వాణ్ణి అడిగితే "అది నేను కాదు డాక్టర్, నా అదర్ పర్సనాలిటీ  Jim"   అని బుకాయించేవాడు. ఇలా కొన్నిమార్లు అయ్యాక, ఒకరోజు నేను వాడితో ఇలా అన్నాను. " ఒరే అబ్బాయీ, జిం  వాడినా, జాన్ వాడినా, ఇంకో గన్నాయి గాడు వాడినా, నీ లివర్, నీ కిడ్నీ నీ ఆర్గన్స్ ని వాడుకుంటున్నాడు. ఇప్పుడు నీ ముడ్డిమీద నేను గట్టిగా తన్ని నిన్ను కాదురా, జిమ్ము గాణ్ణి తన్నాను అంటాననుకో, అ తన్ను నీకు తగులుతుందా జిమ్ముకి తగులుతుందా?"  దాంతో వాడు దిగ్భ్రమ చెందాడు. దీన్ని Direct therapy, confrontation therapy" అంటారు. అన్నిచోట్లా పనిచెయ్యదనుకోండి. కాని వీడి కి అది పంజేసింది. ఆ తరవాత నించి మందు సక్రమంగా వేసుకుని, హాస్పిటల్ కి రావడం మానేశాడు.

 

2.     ఇంకొకసారి ఒక ఆక్టివ్ సోల్ద్యర్ ని పంపించారు పక్కనే ఉన్న ఆర్మీ బేస్ నించి. ఆబ్సర్వేషన్ కి . వాడు ఆర్మీ లో మెకానిక్ గా పనిచేశేవాడు. అయితే కొన్నాళ్ళకి పై ఆఫీసర్లు వాడి షాప్ నించి పనిముట్లు మాయమవ్వడం ఆరా తీశారు. కొన్నాళ్ళకి పెద్ద పెద్ద పనిముట్లు మాయమవుతుంటే ఆర్మీ వాళ్ళు సూక్ష్మ బుద్ధితో పసిగట్టి, అన్నీ వాడింట్లో దొరకడంతో, వాడిమీద దొంగతనం ఆరోపణ చేసి కోర్ట్ మార్షల్ కి పిలిచారు. దానితో వాడు, వాడి లాయర్ కలిసి వాడికి MPD [multiple personality disorder]  ఉందనీ, ఆ దొంగతనం చేసినవాడు ఈ సోముడు కాదనీ, ఇంకో భీముడనీ, మేము వాణ్ణి పరీక్షలు అన్నీ చేసి వాడికి ఆ ఫలానా జబ్బు లేదనీ, వాడు "తెలిసే" ఈ అబద్ధమాడుతున్నాడనీ నిర్థారించాము. వాడికి  శిక్ష పడింది. ఇలా తెలిసి చేస్తే  దొంగాటకమౌతుంది.  దీన్ని టెక్నికల్ గా, "Malingering" అంటారు ముఖ్యంగా workmen's compensation కేసుల్లో ఇల్లాంటి ప్రవర్తన కనిపిస్తుంటుంది. 

 

చాలావరకూ ఈ జబ్బుని ఇలాటికారణాలుగా వుపయోగించుకునే రోగులే ఎక్కువ అని మా నమ్మకం. మన ఊళ్ళల్లో దయ్యం పట్టిందని భూతవైద్యులు పేషంట్లని వేపమండలాలతో బాదడం ఇవన్నీ ఈ కోవకి చెందినవే. ఈ జబ్బుకు power of suggestion ఎక్కువుంటుందిగాబట్టి, మన పల్లెటూళ్ళల్లో ఈ జబ్బు ఎక్కువ కనబడేది. చాలాసంవత్సరాల కిందట 3 Faces of eve అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా రెలీజ్ అయిన సమయంలో, చాలామంది ఈ జబ్బుతో బాధపడ్డారట. తరవాత ఒక టి వి  సీరియల్  వచ్చినప్పుడు ["సిబిల్" ] ఇలాగే జరిగింది. ఇండియా లో పెరిగిన వాళ్ళెవరికయినా ఒక సీను గుర్తుంటుంది. నడి ఎండాకాలంలో, రోడ్డు మీద ఒకడు పడిపోయి గిలగిలా కొట్టునుంటాడు. బిందెలకొద్దీ నీళ్ళు పోస్తారు. ఒక 15 నిమిషాల తర్వాత వాడు లేస్తాడు.  వింతగా చూశేవాళ్ళం. "మూర్చరోగి" అని రోగనిర్థారణ చేసేవారు చూపరులు.

 

ఇక్కడ నా ప్రత్యేకమయిన అనుభవం చెప్పాలి. నేను గుంటూర్ జనరల్ హాస్పిటల్లో పని చేస్తున్నప్పుడు, ఒక్కోసారి ఒక బీదవాడు [సహజంగా బక్కజిక్కిన రిక్షావాడు ] భార్యని భుజాలమీద వేసుకుని తెల్లవారుజామున 4 గంటలకి బయలుదేరి, 7 గంటలకల్లా గేట్ ఓపెన్ చెయ్యగానే దూసుకుని లొపలికి జొరబడి, outpatient exam  బల్లమీద పడుకోబెట్టి ఏడుస్తూ పక్కన కూచునేవాడు. "3 రోజుల్నించీ ఇంతేనయ్యా. లెగవదు. కళ్ళు తెరవదు". పరీక్ష చేస్తూ, ఎంత నెప్పి తో పొడిచినా, గిచ్చినా, పిన్నీసు తో పొడిచినా, కళ్ళు తెరవదు. చివరికి, మాట్లాడుతూ, చీరె నెమ్మదిగా మోకాలిమీదికి తీ ...సి...కె..ల్తుంటే... ఆ      అప్పుడే మెలుకువొచ్చినట్టు లేచేది ఆ సదరు సత్యభామ!!!

ఇలాగా ప్రతీ నెలకి ఒక భర్త ఇలా భార్యని మోసుకుని రావడం జరిగేది. దాదాపు అన్నీ ఇలాగే hysteria with conversion disorder భర్తలు పెట్టే బాధలు భరించలేక, అత్తలు పెట్టే చీవాట్లు భరించలేక. ఏం చేస్తారు పాపం. పదిరోజులయినా రెస్ట్ ఇద్దామని నేను అందర్నీ అడ్మిట్ చేసి భర్త కి చెప్పేవాణ్ణి "ఇది చాలా ప్రమాదం. ఈమెకి ఇంటికి వెళ్ళాక గూడా  చాలా రెస్ట్ కావాలి. మీ అమ్మనో, మీ చెల్లెల్నో సహాయం చెయ్యమని చెప్పు.ఇంకోసారి ఇలా జరిగితే నీ భార్య నీకు దక్కదు"  అని వాణ్ణి భయపెట్టి, ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఒక 10-15 రోజులు మంచి ఆహారం పెట్టి పంపేవాణ్ణి.  [This is a clear example of the fact that some psychiatric illnesses are related to the local culture and beliefs and the treatments also should follow that logic]

 

 ఈ రోజుల్లో ఈ MPD అంత ఎక్కువగా కనబట్టంలేదనే చెప్పాలి.  ఒకసారి  60 minutes లో ఒక పేషంట్ ని చూపించారు.  వాడికి 58 personalities ఉన్నాయని చెప్పాడు. చాలామంది అభిప్రాయంలో, అట్లా అన్ని personalities  గా జీవించడం అసంభవమనీ, దానికీ schizophrenia కి తేడా లేదనీ పలువురి అభిప్రాయం 

 

"Culture bound psychiatric conditions " అని ఒక చాప్టర్ ఉన్నది. ఇందులో ముఖ్యంగా గమనించదగిన విషయం, ఏదయినా విపరీతమయిన మానసిక వ్యధకి గురి అయినప్పుడు మన మెదడు రకరకాల పరిణామాలను చెంది, మన ఎరికలోంచి ఆబాధని తొలగచేయడానికి వేసే హావభావాలివన్నీ. మనకి సరిగ్గా కనబడనప్పుడు, వింత వింత దృశ్యాలు కనిపిస్తూంటాయి. రజ్జు సర్ప భ్రాంతి దగ్గర్నించీ, మన ఇష్టదైవ సాక్షాత్కారం.. ఇవన్నీ మన మెదడు మన పై  చేసే ఇంద్రజాలం. ఈ సందర్భంగా మీకు రెండు మాటల గురించి చెప్పాలి.  వాటికి తెలుగు పదాలు నాకు తెలియదు గాబట్టి, శాస్త్రీయ పదాల్నే వాడతాను.

1. Hypersensitive agency detection device [HADD]

2. Theory of mind.   

 

ఇందులో రెండవది, మనం ఏది చూసినా దాన్ని మనకి తెలిసిన జ్ఞానం పరిథిలోనే బిగించి చూస్తాము. మన ధైర్య స్థైర్యాలని బట్టి. ఉదా: తాడుని చూసి పామనుకోవడం; చెట్టుని చూసి భూతం అనుకోవడం. మొదటిది HADD ఏమాత్రం అపాయం  అని తెలిసినా, మన మెదడు, మనల్నింకోచోటికి తీసిలెళ్ళడమో లేకపోతే మనకనుకూలమయిన సందర్భాలు సృజించడమో జరుగుతుంది.

ఉదా : ఎవరెస్ట్ శిఖరారోహణ చేసేవాళ్ళు కొందరు అనుభవిస్తుంటారు. కొంతకాలం కిందట ఇద్దరు ఎవరెస్ట్ ఆరోహణకి వెళ్ళారు. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అవలాంచ్ వచ్చి అందులో ఒకడు కొట్టుకుపోతాడు. రెండోవాడు 16 గంటలు నానా అవస్థలు పడుతూ తిరుగుప్రయాణం చేసి, చావుదప్పి కన్నులొట్టబోయి దిగుతాడు. కానీ ఆ 16 గంటలూ తన పక్క ఇంకో మనిషి ఉన్నాడని అతనికి అనుభూతి కలుగుతుంది. నిజం తెలుసు కానీ ఆ దుర్గతిలో అతడిమనసు అతనికి సహకారం చేయడానికి ఇంకో మనిషి పక్కన నడుస్తున్న భ్రమ కలిగించి, అతనికి ధైర్యం ఇచ్చింది. దీన్నే Third Man Syndrome అంటారు. చాలామంది mountaineers కి ఈ అనుభూతి ఉంటుంది. 

 

 

మన బ్రెయిన్ లో భగవంతుణ్ణి చూడగలిగే  శక్తి ఉంది. బ్రహ్మానందం అనుభవించే శక్తి ఉంది. ముల్లోకాల్లోని దయ్యాలనీ, భూతాలని సృజించే శక్తి గూడా వుంది

 

ఆత్మైఇ వ హ్యాత్మనో బంధుహు ఆత్మైవరిపురాత్మనహ [Bhagavadgeeta]

 

 మన మనస్సే మన బంధువు, మన మనస్సే మన శత్రువు [ఇక్కడ ఆత్మ అనేమాటకి "మనస్" అని అర్థం చెప్పారు పెద్దలు.]

 

*****

 

పార్కు బెంచి మీద పడుకున్న ఒక యువకుణ్ణి పోలీసువాడు లేపి "ఇక్కడ ఉండకూడదు. ఇంటికెళ్ళి పడుకో" వాడు "ఆఫీసర్. నాకు ఇల్లు లేదు. వాటర్ ఎక్కువ వాడుతున్నానని మా ఓనర్ వెళ్ళగొట్టాడు. "    ఏమిటీ జబ్బు? వాటర్ ఎందుకు ఎక్కువ వాడుతున్నాడు?  ఈ కథ వచ్చే సంచికలో.

bottom of page