top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  4

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

అందాల రాముడు

Venugopal.jpg

గుమ్మడిదల వేణుగోపాల్ రావు

                                     

'శ్రీరాముని దయచేతను' అంటూ ప్రారంభించి తెలుగులో మొదటి నీతి శతకం వ్రాసిన పదమూడవ శతాబ్దపు బద్దెన భూపాలుడు ఆ 'శ్రీరామ' ఒరవడికి ఆద్యుడు కాకపోవచ్చు.

 

 అది ఎప్పుడు ఆరంభమైనదో సరిగ్గా తెలియదు కానీ తెలుగు వారు మాత్రం ఏదైనా వ్రాసేముందు 'శ్రీ రామ' తోనే ఆరంభిస్తారు. దశరథమహారాజ సుతునిగా జన్మించిన శ్రీ రాముడు ఆదర్శ మానవుడుగా-  శిష్యుడుగా, పుతృనిగా, భర్తగా, సోదరునిగా, “దుష్టశిక్షక-శిష్టరక్షక” మరియు న్యాయపాలనా దక్షుడైన మహారాజుగా – జీవించి,  అందరిచేత  "రామో విగ్రహవాన్ ధర్మః”  లేక  'ధర్మో విగ్రహవాన్ రామః '" అని కీర్తించబడ్డాడు. రాముడు తాను అవతార పురుషునిగా ఎక్కడా ప్రకటించలేదు కానీ తెలుగు వాళ్ళు చాలా ఊళ్ళల్లో ఆ దేవుని కి గుడి కట్టి ఆరాధిస్తున్నారు. మనిషి మనుగడ లో దైనందినం ఎదుర్కునే సమస్యల ఆటుపోట్లలో మనస్థైర్యాన్ని కలిగించేందుకు ఎవరో ఒకరి మానసిక ఆలంబన అవసరమవుతుంది. అది సన్నిహితులైన పెద్దలుగా గానో, ఆత్మబంధువులు గానో ఉంటే మంచిదే. కానీ వారు  అవసరమైనప్పుడల్లా లభించరు గనుక తన అంతరదృష్టితో చూసి అర్ధించుకో గలిగే దైవ శక్తిని ఆలంబనగా కోరుకుంటాము. క్లిష్ట పరిస్థితులలో దానికై తపన మరీ బలంగా వేధిస్తుంది. ఆ సమయంలో మనం కోరుకునేది ధర్మమైన మార్గంలో నమ్మకంగా నడిపించగలిగే శక్తి. 

 

ఉన్నతుడు, ఆదర్శమూర్తి అయి మానవ జీవన విధానానికి దగ్గరలో జీవించి తన లాగే దైనందిన సమస్యలకి పరిష్కారం వెదుక్కుంటూ గడపిన దైవాన్ని అత్యంత ప్రీతికరమైన వ్యక్తిగా ప్రేమిస్తూ ఆరాధిస్తాడు మానవుడు. శ్రీ రాముడు ఆ అంచనాల పరిధిలోనే ఉంటాడుకావున భగవంతుని అవతారాలలో జనావళికి అది అతి ప్రీతికరమైన అవతారమైంది. అందుకే తల్లులు పిల్లలకి 'శ్రీరామరక్ష' పెట్టడము మనం చూస్తూనే ఉన్నాము. రాముణ్ణి  బలంగా నమ్మే జనం రామ కోటి వ్రాస్తూనో,  దుర్వార్త వినడం సంభవిస్తే 'రామ రామ' అనుకుంటూనో,  లేక అనుకోని సమస్య ఎదురైతే 'అయ్యో రామచంద్రా' అంటూనో, అనుకోని కష్టం వస్తే 'ఎందుకయ్యా రామా నాకీ కష్టాన్ని ఇచ్చావు' అంటూనో, లేదా పండగ సమయాల్లో ఏ గుడిలోనైనా రామ భజన చేస్తూనో, లేక రామాయణ సంబంధిత పుణ్యక్షేత్రాలని దర్శిస్తూనో కనిసిస్తుంటారు. ఆ జనావళిలో కళాతృష్ణ గల వాళ్లకి కొదువలేదు.  ఆంధ్ర జనాలకి ఆరాధ్యదైవమైన రాముడ్ని ఎందరో భక్తులు తమ కవితావైభవంతోటి, గాన మాధుర్యాలతోటి, చిత్ర లేఖనా సౌందర్య పటిమలతోటి, నాట్య కళా వైదుష్యంతోటి పూజించి అలరించారు. సాహిత్యంలో తిక్కన, గోన బుద్దారెడ్డి, బొమ్మెర పోతన, ఆతుకూరి మొల్ల, విశ్వనాథ సత్యనారాయణ, సంగీతంలోవాగ్గేయకారులు -అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, బాలమురళి;  చిత్రలేఖనం లో వడ్డాది పాపయ్య,  బాపు, కె వి భీమారావు; చలనచిత్రాలలో కళా సృష్టికి బాపు మొదలైన వారెందరో ఆదేవుణ్ణి 'ఓ రామ నీ నామమేమి రుచిరా' అనీ 'ఏలా నీ దయరాదు, శ్రీ రామ', 'తక్కువేమిమనకు రాముండొక్కడుండు వరకు' అనీ ‘పలుకే బంగార మాయనా' అంటూ ఆర్తి తో గానంచేస్తూ ఆరాధించి అయన ఆశీస్సులని, ప్రజల మెప్పుని పొంది, అందులో కొందరు తుదకు కైవల్యాన్నీ  పొందారు. తెలుగు నేల పై గల రాముణ్ణి కొలిచే పుణ్య స్థలాలు దాదాపు ప్రతి ఊళ్ళో ఉన్నా, ప్రసిద్ధ క్షేత్రాలు మాత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయం, భద్రాచల రామాలయం, హంపిలోని కోదండ రామాలయం.  

శ్రీ కోదండ రామాలయం, ఒంటిమిట్ట: విజయనగర ఆలయ నిర్మాణ పద్ధతిన పదహారోవ శతాబ్దంలో పునరుద్ధరింపబడిన ఈఆలయం కడప జిల్లాలో రాజంపేట తాలూకా ఒంటిమిట్ట లోఉంది. ఒంటెడు, మిట్టడు అనే ఇరువురు గజ దొంగలకి రాముడు కలలో కనబడి తాను దగ్గర అడవిలో ఒకచోట కప్పబడి ఉన్నానని తనని వెదకి ఒక గుడి కట్టించమని చెప్పాడట. వాళ్ళు అక్కడ వెదకగా నిజంగానే ఆ విగ్రహాలు దొరకగా, వాళ్ళకి ఆ దైవంపై గురి కుదిరి వాళ్ళు మారిపోయి సాధు జీవనం చేస్తూ, ఆగుడి కట్టించారట. 32 స్తంభాలపై సుందరమైన అప్సరసలశిల్పాలతో తీర్చిదిద్దబడ్డ ‘మధ్యమండపం’ ఆలయాని కే మకుటాయమానమై నిలుస్తోంది.

 

పోతన ఇక్కడ ఉంటున్న కాలంలోనే కోదండరాముడు కలలో కనబడి వేదవ్యాసుని భాగవతాన్ని ఆంధ్రీకరించమని ఆఙ్ఞాపించాడట. 'పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేల? ' అంటూ పోతన తన “శ్రీమదాంధ్ర మహా భాగవత” ముగ్ధ కవితా కన్యని ఆ రామునికే అంకితమిచ్చాడు. ఇక్కడి రాముని ప్రోద్బలంతో నే తాళ్ళపాక అన్నమయ్య రాముని పై కీర్తనలు వ్రాసాడట. భావనాసి మాల ఓబన్న అనే భక్తుడు తానురాసిన భక్తి గీతాలు పాడుకుంటూ ఇక్కడే గతించాడట. అతని పేర ఒక మండపం తూర్పు గోపురం వద్ద కనిపిస్తుంది. 'ఆంధ్ర వాల్మీకి' గా పేరొందిన వావిలకొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని యధాతధం గా 24 వేల పద్యాలతో అలంకరించి "శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణ క్షీరార్ణవ మందరము" గా తెలుగు చేసి ఒంటిమిట్ట లోని కోదండ రామునికి అంకితం ఇచ్చారు. అయన ఆలయాన్ని తనవంతుగా పునరుద్ధరణకు కృషి చేసారు. ఈ మహదాలయం కడపనుంచి తిరుపతి వెళ్లే మార్గ మధ్యంలో కడపకు 25 కి .మీ. దూరంలో రహదారి పక్కనే కనిపిస్తుంది.

శ్రీ రామచంద్రస్వామి ఆలయం, భద్రాచలం: త్రేతాయుగంలో భద్రునికి రాముడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ద్వాపరయుగంలో చేసిన అతని ఘోర తపస్సుకి మెచ్చి, దర్శనమివ్వడానికి వచ్చే తొందరలో అపసవ్యంగా  అస్త్రాలు ధరించి  ప్రత్యక్షమైన విష్ణువు భద్రుని కోరిక మేరకు శిలామూర్తి గా అక్కడే గోదావరీ తీరాన్న  వెలిస్తే, ఆ విగ్రహం కాలగర్భంలో చీమల పుట్టలతో కప్పబడి పోయి, కలియుగంలో (17వ శతాబ్దం చివరలో)  గోదావరి వరదలలో బయటపడినదట. దగ్గరలో నివసిస్తుండే పోకల దమ్మక్క ఆ రాముడికి మొదట్లో ఒక గూడు ఏర్పాటు చేస్తే, కంచర్ల గోపన్న ఆప్రాంతపు తాసిల్దారుగా పని చేస్తూ ఆ రాముని దీన స్థితి చూసి, శిస్తు గా వచ్చిన డబ్బు తో గుడి కట్టించడానికి ప్రయత్నించి అది సరిపోక భక్తజనావళి ఇచ్చిన ధనంతో గుడిని పూర్తి చేసాడట. శిస్తుగా వసూలు చేసిన ధనాన్నినిజాము ఖజానాకు కట్టకుండా గుడికి అక్రమంగా వాడినందుకు శిక్షగా నిజాము కారాగారంలో వేసి పన్నెండు ఏళ్లపాటు హింసలు పెడితే, అప్పుడు గోపన్న వ్రాసిన ‘నిందాస్తుతి’ కీర్తనలు అన్ని ప్రాంతాల ప్రజలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి. అవి కబీరు చే గోపన్నని 'రామదాసు’ ని చేసి అతడికి అఖండ కీర్తినార్జించి పెట్టాయి. రాముడు లక్ష్మణుని తో సహా వచ్చి నిజాముకి శిస్తు మొత్తం ఆరు లక్షల బంగారు నాణాలు ఇచ్చి రసీదు తీసుకుని గోపన్నను రుణ విముక్తుణ్ణి, చెరసాల విముక్తుణ్ణి చేసాడట. ఆబంగారు నాణాలలో కొన్ని నిజాము ఆగుడికి బహుకరించగా వాటిని ఇప్పటికి ఆ గుడి లోనే  భద్ర పరచి. వాటిని ప్రతి శ్రీరామ నవమికి భక్త జనాలకి చూపించి వారిలో భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు, ఆ కోదండరామాలయం అర్చకులు. 

శ్రీ కోదండరామాలయం, హంపి: రాముడు వాలిని చంపిన తరువాత అదేస్థలంలో సుగ్రీవుని సింహాసనాధీశుని చేసిన పిమ్మట సుగ్రీవుడు ప్రతిష్టించిన రామ, లక్ష్మణ, సీత విగ్రహాలివేనని  ప్రచారంలో ఉంది. ఈ ఆలయం కిష్కింధ లో ఉంది. హనుమంతుడు జన్మించిన స్థలం దీనికి దగ్గరలోనే ఉంది.

అ. తమ సాహితీ సంపదతో రాముణ్ణి కొలుచుకున్న శారదాపుత్రులు:

తిక్కన సోమయాజి (1205-1288): మహాభారతాన్ని తెలుగించిన కవిత్రయంలో తిక్కన రెండోవాడు. నెల్లూరు రాజు మనుమసిద్ధి వద్ద ప్రధాన మంత్రి గా వుంటూ అటు రాజకీయ సేవలు, ఇటు సాహిత్య  స్రవంతులు అందిస్తూ అప్పట్లో ఉధృతంగా ఉన్న శైవ వైష్ణవ మతపర వివాదాలని ఒక తీరున పరిష్కరిస్తూ చరిత్ర లోనే అసామాన్య స్థానాన్నిఆక్రమించాడు. అయన వ్రాసిన మరో ఉత్కృష్ట కావ్యం 'నిర్వచనోత్తమ రామాయణం'. దానిలో ఎనిమిదవ ఆశ్వాసంలో  రావణ సంహారం, సీతారాములు పట్టాభిషేకానంతరం ఉద్యానవన విహారములో వారి  ఆనంద కేళి తిక్కన హృద్యం గా ఆవిష్కరించిన తీరు తెలుగు సాహిత్యంలోనే ఒక మచ్చు తునక. 

చం.  అలరులఁ గోయుచున్ మధుకరావళిఁ జోపుచుఁ గీరపోతకం

      బుల పలువాఱు మాటలకు బొంచుచుఁ సంచలఁ బట్టఁ దారుచున్ 

      లలితమయూర నర్తన విలాసముఁ జూచుచు బోటిపిండుతోఁ

      గలయు చుఁ బాయుచున్ బహుల కౌతుక వృత్తి రమించి రెల్లడన్.     29

సీ.  తీగెయుయ్యల లెక్కి తూగియాడుచుఁ గూడి పాడెడు మత్తాళి బాలికలను

     బలుకులతోడన యలవడఁ దొడగియు నేరని కీరకుమారికలను

     నింపారు లేఁ దూఁడు లేఱి పిల్లలకుఁ బెట్టుచు నున్న హంసకుటుంబినులను

     ఫలరస మొండొంటి కెలమిఁ జంచుల నించు తఱిఁ జొక్కుకోకిల దంపతులను    

తే.  జూచి చూచి యొండొరులకుఁ జూపి చూపి చెలుల కెఱిఁగించి కొనియాడి చెప్పి చెప్పి

     చిత్తహారి విహారసంసేవఁ దగిలి, యుల్లసిల్లిరి వనితయు వల్లభుండు.   30

  ఉ.  అల్ల వె లెస్స పువ్వులని యందని గుత్తుల దిక్కు సూపి తా 

        నల్లన చేరి నేను నెగయన్నిను నెత్తెడఁ గోయు మంచు భూ 

        వల్లభుఁ డాదటం బొదవి వామవిలోచన నెత్తెఁ ద త్తనూ 

        వల్లికతోన మైఁ బులక వర్గము కాముడు నారు వోయఁగన్.                          31 

 

గోన బుద్ధారెడ్డి (౧౩౦౦): వాల్మీకి రామాయణాన్ని అక్కడక్కడ విశిదీకరిస్తూ, మెరుగులు దిద్దుతూ తండ్రిపేర "శ్రీ రంగనాథ రామాయణం” ద్విపద కావ్యంగా సరళమైన తెలుగులో ప్రజారంజకంగా మలచినయది మొదటి రామాయణ గ్రంథమని చెప్పొచ్చు. యితడు యుద్ధ కాండ వరుకు వ్రాయగా మిగిలిన భాగం ఆయన కుమారులు పూర్తి చేశారట. సుందరకాండలో హనుమంతుడు సముద్ర లంఘనం చేసి, అక్కడ అయన కాంచిన లంక ని ఎలా వివరించాడో చూడండి:

"శ్రీరామ కార్యంబు సేయంగ బూని - వారధి పిల్లకాల్వయుబోలె దాటి; 

చారు శ్రుంగంబుల సానుదేశముల - భూరిభూరుహలతాపుంజకుంజముల 

గలిమిచే నొప్పు లంకా సమీపమున- వేలాయుసు వేలాద్రి వేడ్కమై నెక్కి

యంత నాహనుమంతు డాయాద్రి మీద - నెంతయు గడకతో నేపుమైనిలిచి 

యట దక్షిణము చూచి యప్పుడిట్లనియె- నట ద్రికూటాద్రిపై నెమరెడుదాని

నమరావతీపురం బబ్ధిమధ్యమున- గమనీయగతి నొప్పు గల్గినదాని 

నలక కుబేరుతో నాలుకమైనచట -నెలకొన్న కైవడి నెగడెడుదాని

 గలకాలమును నధోగతి నుండలేక - తెలివిమై భోగవతీనగరంబు 

జలరాశి వెలువడి సరి త్రికూటమున - వెలసినకైవడి విలసిల్లుదాని 

నంబుధి యావరణాంబువు ల్గగా - బండిన ప్రభనొప్పు బంగారుకోట 

నళినసంభవు గేహ మననొప్పునట్టి-లలితమై నొప్పెడు లంకాపురంబు ; 

కని చాల వెఱగంది కనురెప్ప బెట్ట - కానీ లతనుభవం డందంద జూచి

యెల్లోకంబులు నెక్కట గెలిచి -బల్లిదుడై పేర్చు పంక్తికంధరుడు;  

ఇట్టిసంపదలచే నేనయు నీ లంక- పట్టాభిషిక్తుడై బ్రతికి పాలేది 

సకలేశుడగు రామచంద్రుని దేవి- వికలుడై కొనివచ్చే వీడేల పొలిసె? 

యని వాని దూషించి యాలంక చొరగ- ననువు విచారించి యా సత్వధనుడు    ….”    అల్లాగ సాగుతుందాద్విపద కావ్యం. 

బమ్మెర పోతన (1450-1510) : సహజకవిగా ప్రసిద్ధిగాంచి దశావతారాలని మధురమైన తెలుగులో 'శ్రీమద్భాగవతం' గా గ్రంధస్తం చేసి పండిత పామరుల మెప్పును పొందిన పోతన,  శ్రీనాధ కవి సార్వభౌమునికి సమకాలికుడు. పోతన భాగవత గ్రంధాన్ని శ్రీ రామునికి అంకితమిచ్చి, "నిన్ను నాకటికిం గొనిపోయి యల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ" అని తాను వాణికి చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకున్నాడు. పోతన భాగవతంలోని కొన్ని మచ్చుతునకలు.

 “కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ , కలడందురన్ని దిశలను" అని, "ఒకపరి జగముల వెలినిడి  యొకపరి లోపలి గొనుచు, నుభయము గనుచున్, సకలార్ధ సాక్షి నాగు నయ్యకలంకుని నాత్మమయుని" అని , "లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన దుదిన లోకంబగు పెంజీకటి నెవ్వడు వెలిగేడు నేకాకృతితోడ" అని, " విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్ , శాశ్వతునగు బ్రహ్మ ప్రభు నీశ్వరునిన్ "అని,  "ఎవ్వనిచే జనించు జగమెవ్వని  లోపలనుండు లీనమై, యవ్వని యందుడిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణంబెవ్వఁడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానె అయినవాడెవ్వడు, వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్", అని సకల వేదాంత సార మాకళింపుతో ఆ పరమాత్ముని శరణువేడిన గజేంద్రుని తనలో ప్రతిబింబిస్తూ ఆ మొర వినిపించిన పోతన ధన్యుడు. రామ భక్తునిగా ద్వైతుడై వుండి కూడా అద్వైత వేదాంతతత్వాన్ని సులభరీతి లో గజేంద్రుని ద్వారా వెలుగొందించిన ధీశాలి. గజేంద్రుని ఆక్రందన వెలుగొందిన సమయంలో వైకుంఠపురంలోని విష్ణుని స్థితిని వర్ణించబోయి  "ఆల వైకుంఠ పురంబులో .." అని పద్యమారంభించి అక్కడి స్థితి ఊహకందక కావేరీ నదీ తీరాన దిక్కుగానక ఆలోచనలతో సతమతమౌతున్న సమయాన, ఆరామచంద్రుడే పోతన రూపముతో వచ్చి కూతురు వద్ద సగము వ్రాసిన పద్యభాగాన్ని తీసుకుని "నగరిలో నామూల  సౌధంబు దాపల మందార వనాన్తరామృత సరః  ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది యగునాపన్న ప్రసన్నుండు, విహ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభి యై" అని పూరించి వారింట భుజించి, పోతన కవీంద్రునేకాదు మనలని కూడా పులకాంకితులని చేసాడు. వామనావతార ఘట్టాన్ని ఆవిర్భవిస్తూ పోతన వామనుడు బలి చక్రవర్తి యజ్ఞ మంటపాన్ని చేరుకుంటున్న విధాన్ని ఈ విధంగా అందంగా కందంలో వివరించాడు: "వెడ వెడ నడకలు నడచుచు, నెడనెడ నడుగిడగ నడరి యిల దిగబడగా, బుడి బుడి నొడవులు నొడువుచు జిడిముడి తడబడగ వడుగు సేరెన్  రాజన్".  బుడి బుడి నడకల బుడుగు వటువుని చూసి బలి చక్రవర్తి  'ఎవ్వరివాడవు, ఎక్కడనించి వచ్చితివి' అన్నదానికి సమాధానంగా " ఇది నాకు నిలవని ఏరీతి బలుకుదు? ఒకచోటనక యందుండనేర్తు, నెవ్వనివాడనంచేమని పలుకుదు? నాయంతవాడనై నడవనేర్తు, నీ నడవడి యని యెట్లు వక్కాణింతు బూని ముప్పోకల బోవనేర్తు, నది నేర్తు నిది నేర్తు నని ఏల చెప్పంగ ? నేరుపులన్నియు నేనె నేర్తు; ఒరులుగారు నాకు నొరులకు నేనౌదు నొంటివాడ జుట్ట మొకడు లేడు, సిరియు దొల్లి గలదు చెప్పెద నాటెంకి, సుజనులందు దఱచు జొచ్చియుందు" అని భావయుక్తంగా పలికిస్తాడు పోతన. భాగవత గ్రంధమంతా ఈవిధంగా రసమూరుతూ భావుకుని సాహిత్యరస పిపాసలని తీరుస్తుంది. 

ఆతుకూరి మొల్ల (1440-1530): గోపవరం లో కుమ్మరివృత్తిలో జీవనము సాగిస్తున్న కేసన శెట్టి     శ్రీశైల మల్లన్న భక్తుడిగా తన కూతురికి ఆదేవునికి ఇష్టమైన మొల్లపువ్వు పేరుపెట్టుకుని పిలుచుకుంటూ ఆనందించాడట. ఆమె సాహిత్య సీమలో పంటలు పండిస్తుంటే పరవశించాడట. ఆమె బమ్మెర పోతన రచనలనాదర్శంగా తెలుగించిన వాల్మీకి రామాయణం విని సమకాలీకుడైన శ్రీ కృష్ణదేవరాయలు తన ఆస్థానానికి సపరివార రాచ మర్యాదలతో ఆహ్వానించాడట. అక్కడి అష్టదిగ్గజ కవులు స్త్రీ అయిన కుమ్మరి రచయిత్రిని నిమ్నదృష్టి తో చూసి ఆమెకు పరీక్షగా -ఒక ఏనుగు తనకంటే బలవంతుడైన మొసలినుండి ఏవిధంగా రక్షింపబడినదో- తాముచెప్పిన వృత్తంలో ఒక్కనిముషకాలంలో చెప్పని పరీక్ష చేయబోతే సమాధానంగా  ఆమె అదే గడువు లో రెండు పద్యాలని వారడిగిన వృత్తంలోనే పాడి వారిని అబ్బురపరచినదట. వారి సలహామేరకే శ్రీ కృష్ణ దేవరాయ లు ఆమెను 'కవిరత్న' బిరుదు తోను, కనకాభిషేకం తోనూ సత్కరించాడట.                            

                            

ఆమె కవితా విపంచి పలికిన కొన్ని పద్యాలు: తన పూర్వకవులు వారి కావ్యాలలో విరివిగా వాడిన సంస్కృత పదాలని మెచ్చుకోలేక వ్రాసిన వ్యంగ్య పద్యం:

“గీ. తేనె సోక నోరు తీయన అగురీతి ; తోడ నర్ధమెల్ల దోచకుండ; గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము;  మూగచెవిటివారి ముచ్చటగును.

హనుమంతుడు సీత దేవికి తాను రామునివద్దనుండి తెచ్చిన ఉంగరము ఇచ్చి, శ్రీ రామునికి తాను సీతా మాతను కలిసిన సంగతి నమ్మకము పుట్టటకు ఆమెను ఒక ఆనవాలు యిమ్మని కోరగా సీత దేవి:

' క. నానాధు క్షేమ మంతయు; ధీనిధి ! నీచేత వింటి దెలియఁగనైనన్

     నీ నిజరూపము చూడక నేనారత్నంబు నమ్మి నీ కీయాజుమీ. 

వ. అనుటయు నా హనుమంతుడు, 

క. చుక్కలు తలపూవులుగా నక్కజముగా మేను వెంచి అంబరవీధిన్ 

    వెక్కస మై చూపట్టిన నాక్కోమలి ముదము నొందె నాత్మస్థితికిన్.

వ. ఇట్లు తన మహోన్నత రూపంబు చూసి ఎప్పటి యట్ల మరల సూక్ష్మ రూపంబు గైకొని నమస్కరించిన నా హనుమంతునకు నద్దేవి తన శిరోరత్నంబనుగ్రహించి యిట్లనియె 

చం. రవికులవార్ధి చంద్రు డగు రాముని సేమము చాలవింటి నా వివిధములైన పాట్లు పృథివీపతికిన్ దగజెప్ప గల్గె నే,

      దవిరళభంగి నీవలన నచ్చుగ నే నుపకారము మేమియున్ దివిలి యొనర్ప లేను వసుధాస్థలి వర్ధిలు బ్రహ్మకల్పముల్ "

అని తేట తెలుగులో వ్రాసిన ఆమె రచనా తీరు శ్లాఘనీయం.

కంకంటి పాపరాజు (1575-1632): నరసంబ, అప్పయ్యమాత్యుల కుమారుడు, నెల్లూరు జిల్లావాసి. 'శ్రీ మదుత్తర రామాయణం' ప్రబంధ కావ్యాన్ని చెంపు శైలిలోను, విష్ణు మాయావిలాసం యక్ష గాన రూపంగాను వ్రాసి వాసి కెక్కాడు. యీయన శైలితో  ప్రభావితులై దాని ననుసరించి తరువాతి కాలంలో ప్రసిద్ధి గాంచిన కవి శేఖరులు తిరుపతి -వెంకట కవులు, పింగళి-కాటూరి కవులు, జాషువా, మరియు కరుణశ్రీ.

శ్రీ రామ అవతారము ముగించు ఘట్టాన్ని ఈ విధము గా వివరించాడు పాపారాజు: 

సీ.  పండు వెన్నెలడాలు  బైటవేయగ జాలు ప్రవిమల  క్షౌమాంబరములు గట్టి        `

     గరుడపచ్చలయేవు పరిహసింపగ నోపు దర్భాంకురములు హస్తముల దాల్చి

     హరినీలములరంగు నపహరింప దొడంగు ఘనకేశబంధంబు వెనుక జేర్చి 

    తమ్మి రేకులజోక తలగ జేయువిలోకనములు స్వనాసికాగ్రముననుంచి      

తే. శాంతలక్ష్మి వసించుకంజాత మనగ ; మొగము దులకించ బటుమౌనముద్ర మించ

     నేవికారంబు లేక యయ్యిన కులేంద్రు; డల్లనల్లన నాత్మ గృహంబు వెడలె. 

 

అంటూ హనుమంతుడు సూర్యుని శిష్యరికంలో సర్వశాస్త్రాలు అభ్యసించడం వర్ణించాడు పాపరాజు.

 

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (1895-1976): ఈయన చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారి అసమాన శిష్యుడు, విశేష శాస్త్రీయ తెలుగు కవి. ఆయన వ్రాసిన పద్యాలు, నవలలు, నాటికలు, కథలు, గేయాలు, వ్యాసాలు వివిధ సాహిత్య, సామాజిక, పౌరాణిక, చారిత్రిక, మానసిక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక విషయాలని స్పృశిస్తూ వాటి పై సమగ్ర ఆకళింపుతో వివిధ కోణాల్లో పరిశీలించి సామాన్య పాఠకులనే కాక పండితులని మేధావులని కూడా మెప్పించే గ్రంధాలుగా సుప్రసిద్ధములు. ఆయనకి అత్యంత ఉన్నత సాహిత్య గ్రంథ కర్తలకి మాత్రమే యిచ్చే విలువైన 'జ్ఞానపీఠ' సత్కారముతోను (1970), 'భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' (1970) బిరుదంతోను సత్కరించి వాటి ప్రతిష్టని పెంచుకున్నాయి. 'పురాణ వైర గ్రంథమాల' గా పన్నెండు నవలలు, 'నేపాల రాజ వంశ చరిత్ర' గా ఆరు నవలలు (చార్వాక ఆలోచనాక్రమాన్ని, సమాజంపై దాని ఫలితాలని విశదీకరిస్తూ), 'కాశ్మీర్ రాజ వంశ చరిత్ర' ఆరు నవలల రూపంలోను, 'వేయిపడగలు' అనే ఉత్కృష్ట నవలారాజమేకాక దాదాపు 200 ఖండకావ్యాలు, 50 నవలలు, 30 పద్యకావ్యాలు, 20 నాటికలు, 'విశ్వనాథ మధ్యాక్కరలు' అనే నీతి శతకము, ఇంకా చాలా లిఖించి తెలుగు సాహిత్య సీమ లోనే చరిత్ర సృష్టించిన మహోన్నతుడు. ఆయన వ్రాసిన 'రామాయణ కల్పవృక్షము' వాల్మీకి వ్రాసిన రామాయణానికి స్వేచ్చానువాదమే అయినా తెలుగులోనే ఒక చారిత్రక సృష్టి.  అందులోని కొన్ని ఉదాహరణలు:   

రాముని బాల్యక్రీడలు వర్ణిస్తూ

 

‘పాల్ద్రావు రామచంద్రుండు పాల్ద్రావుచు రాఘవుండు పరువెత్తి మరిన్ ; 

పాల్ద్రావువచ్చి యాతడు పాల్ద్రావఁగ దల్లియడద పాలకడలియౌ’.

విశ్వామిత్రుడు దశరథుడిని రాముని యాగరక్షణ కు పంపని కోరగా దశరధుడు :

'రాముడు నాకు స్నానమగు రాముడు నాకు జపంబు ధ్యానమున్

రాముడెయెల్ల నాబ్రతుకు రాముడు నన్నునుగన్న తండ్రి యీ

రామువైనా నిమేషమవురా మనజాలను గాదనియేనినీ 

రామునివీడి ఈ యఖిల రాజ్యము గాధిసుతా! గ్రహింపవే!'

అంటూ తన కుమారుని పట్ల గల భావ బంధాన్ని తెలియజెప్పాడు.

విశ్వనాథ వారి గిరి కుమారుని ప్రేమగీతాలలో 

' అస్మదీయకంఠమునయం దాడుచుండె; నొక యెదోగీతి బయటికి నుబికిరాదు 

చొచ్చుకొని లోనికింబోదు వ్రచ్చిపోయె; నాహృదయ మీ మహా ప్రయత్నమునందు.'

మరొక ఉదాహరణ, ఒకే  పద్యంలో ఆయన ఏర్చి గుచ్చిన సామెతల సమాహారం:

'అయినవారికేమొ యాకుల యందున; గానివారి కైన గంచములను

ఇంటిలోన దించు నింటివాసంబులు; లెక్క పెట్టునట్టి లెక్కగాఁగఁ. ‘    

 

ఆ. మధుర సంగీతంతో రాముణ్ణి కొలుచుకున్న వాగ్గేయకారులు: 

తాళ్ళపాక అన్నమాచార్య (1408- 1503): ఆంధ్ర పద కవితామహుడైన అన్నమయ్య అలవోకగా కూర్చిన 32,000 కీర్తనలలో మనకి దక్కినవి పన్నెండు వేలే అయినా ప్రతిఒక్కటి ఆణిముత్యమై శ్రీవేంకటేశ్వరుని పాదపద్మాలను అలరించాయి. వాటిలో  800 కి  సంగీత కళానిధి మంగళంపల్లి బాలమురళికృష్ణ, 600 కి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, బాణినికట్టి సాధారణ ప్రజలు పాడుకునేటట్లు చేసారు. అన్నమయ్య అత్యధికంగా శ్రీ వేంకటేశ్వరుని పొగడుతూ, ఆరాధిస్తూ, అర్థిస్తూ, పదాలు వ్రాసినా వాటిలో కొన్ని ఆ దేవుని అవతారమూర్తి అయిన శ్రీ రాముణ్ణి కొలుస్తూ పాడినవీ ఉన్నాయి. రాముని కీర్తించే బహుళ జనాదరణ పొందిన పాటలు:

రామచంద్రుడితడు రఘువీరుడు; రాజీవనేత్రాయ రాఘవాయ నమో;  రామ దశరథ రామ; రామభద్ర రఘువీర; రామ మిందీవర 

రామ రామచంద్ర; రాముడు రాఘవు ; రాముడు లోకాభిరాముడందరికి ; రాముడు లికాభిరాముడు త్రైలోక్య ;  రాజీవనేత్రాయ 

అవధారు రఘుపతి అందరిని చిత్తగించు.

భక్త రామదాసు (1620-1680) : నెలకొండపల్లిలో కామాంబ, లింగన్న మంత్రులకు జన్మించి, కంచెర్ల గోపన్న గా పెరిగి పాలవంచ పరగణాలకి నిజాము ఆధీనంలో శిస్తు వసూలు అధికారిగా పనిచేస్తూ, కడుబీదరాలు దమ్మక్క పోషణలో ఎండకుఎండి వానకుతడుస్తూ భద్రునికి సాక్షాత్కరించి అక్కడే వెలసిన రామ సీతా లక్ష్మణులవిగ్రహాలని ఒక జాతరలో చూసి, గుడి కట్టించాలనే నిర్ణయంతో తనవద్ద శిస్తు గా వసూలు చేసి ఉన్న మొత్తము సరిపోక భక్తజనుల ఆర్ధిక సహాయంతో పూర్తి చేశాడట.  తానీషా అది అప్పుగా నిర్ణయించి తీర్చలేకపోయిన గోపన్నను చెరసాల లో వేసి, పన్నెండు ఏళ్ళు చెరసాలలో ఉంచగా రామ లక్ష్మణులు ఆరు లక్షల బంగారు నాణాలను తానీషాకి ఇచ్చి అప్పు తీర్చి అతనిని విడిపించాడట.  చెరసాలలో ఉండగాను తరువాత బయటికి వచ్చిన తరువాత గోపన్న పాడిన 'నిందా స్తుతి' గీతాలు చాలామందిని కదిలించినట్లే కబీరునీ కదిలించి అతనిచే ‘రామదాసు’ బిరుదాంకితుడిని చేశాయి. వాటిని పాడి వాగ్గేయకారుడైన రామదాసు ధన్యుడు. ఆతని కీర్తనలు విన్నవారి తనువులు భక్తి రసాన్ని చిప్పిలించి పారవశ్యంతో పులకింపచేస్తాయి. 

'నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి; ననుబ్రోవమనిచెప్పు నారీ శిరోమణి; జనకుని కూతురా జనని జానికమ్మ|

అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు;  నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి;  నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి||

అంతా రామమయం బీజగమంతా రామమయం;  

అంతరంగమున ఆత్మారాముడ ;నంతరూపముల వింతలు సలుపఁగ |

సోమసూర్యులును సురలు తారలను ; ఆ మహాంబుధుల అవనీజంబులు       ||అంతా||

అండాండంబులు పిండాండంబులు ;  బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ |

నదులు వనంబులు నానా మృగములు; విదిత కర్మములు వేద శాస్త్రములు         ||అంతా||

ఆష్టదిక్కులును ఆదిశేషుడును ;  అష్టవసువులును అరిషద్వర్గము |

ధీరుడు భద్రాద్రి రామదాసుని ;కోరిక లొసగెడు తారక నామము             ||అంతా||

కీర్తనలే కాకుండా 'దాశరథీ కరుణాపయోనిధీ' అనే మకుటంతో వ్రాసిన దాశరథీ శతకం ఈ నాటికి తెలుగు వాళ్ళచే ఉదాహరించబడుతొంది. మచ్చుకు:

హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ.

చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటంచు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధీ. 

 

త్యాగరాజు (కాకర్ల త్యాగబ్రహ్మం) (1767-1847): రామబ్రహ్మమం సీతమ్మలకు మూడవ సంతతి గా తిరువారూర్ లో జన్మించి చిన్నతనంనుంచి సంగీతం పై మక్కువ పెంచుకుని తాతగారి వద్ద లభించిన తాళపత్రగ్రంధాలలో నారదముని గురించి చదివి, ఆతనినినే మానసిక గురువు గా ఎంచుకుని శొంఠి వేంకటరమణయ్య గారి శిష్యరికంలో సంగీతకళానిధి గా ఎదిగి సంగీత ప్రపంచములోనే ఉన్నత స్థితిని సాధించిన వాగ్గేయకారుడు. త్యాగయ్య వ్రాసి పాడిన పాటలు ముఖ్యంగా తెలుగులోనే అయినా కొన్ని సంస్కృతంలోను రాణించాయి. అయన తెలుగు ఎంత భావ గర్భితమైనది,   ఉత్కృష్టమైనదంటే ఏ ఒక్క పదాన్ని మార్చ వీలుకాదు. అయన వ్రాసిన వేల కృతులలో ఉదాహరణకు కొన్ని: 

' ఎందరో మహానుభావులు అందరికి వందనములు' -శ్రీ రాగం, అది తాళం

'రాగసుధారస పానము జేసి రాజిల్లవే ఓ మనసా' ఆందోళిక, అది

'నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా పల్కు మనసా '- కళ్యాణి, మిశ్ర చాపు 

'తెర తీయగరాదా' -గౌళి పంతు రాగం, అది  

'వందనము రఘునందన సేతు బంధన భక్తచందన, రామా' -సహన రాగం అది 

'హెచ్చరికగా రారా, హే రామచంద్ర' - యదుకుల కాంభోజి రాగం ఖండ చాపు 

'నగుమోము గనలేని నాజాలి తెలిసి ననుబ్రోవగరాదా శ్రీ రఘువర నీ' - ఆభేరి అది  

'రార మాఇంటిదాక రఘువీరా సుకుమార మ్రొక్కెదరా' - అసావేరి రాగం అది 

'బంటురీతి కొలు' - హంస నాదంరాగం, అది 

చక్కని రాజమార్గములుండగఁ సందులదూఱనేల ఓ మనసా' - ఖరహర ప్రియా రాగం, అది 

'దైవము సుఖమా అద్వైతము సుఖమా' - రీతి గౌళ రాగం, అది 

'ఏమని పొగడుదురా శ్రీరామ నిన్నేమని ' - వీరవసంత రాగం, అది 

'మరుగేలరా ఓ రాఘవ ' -జనతా శ్రీ రాగం, అది; 'మోక్షముగలదా భువిలోన జీవన్ముక్తులు కాని వారలకు' - సారమతి రాగం, అది    త్యాగయ్య తెలుగు వాడై పుట్టడం తెలుగుభాష చేసుకున్న సుకృత ఫలం.

 

మంగళంపల్లి బాలమురళీకృష్ణ (1930-2016): సంగీత కుటుంబంలో జన్మించి ఆరవ ఏటనే బాలమేధావిగా కీర్తింపబడి కర్ణాటక సంగీతంలో ఉన్నత శిఖరాల నధిరోహించి, అసమాన సృజనాత్మకతో,  అయన తెలుగు లోనే కాక కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ భాషలలో సంగీతాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చి, వాటికి ఒక ప్రత్యేక సౌరభాన్ని యొనగూర్చాడు. రవీంద్రుని 'గీతాంజలి' బెంగాలీ లో పాడి భవితవ్యానికి రబీన్ద్రసంగీతానికి నిధిని సమకూర్చాడు. ఆయన పాడిన రామదాసు కీర్తనలు విశేష ఆధారణని పొందాయి. తన గాన సంపదతో భారతీయ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన దురంధరుడు. గణపతి, సర్వశ్రీ (త్రిశతి), మహతి, లవంగి, సిద్ధి, సుముఖం, ఓంకారము , రోహిణి , మోహనగన్ధి , మురళి మనోరమ, జనసమ్మోదిని , వల్లభి, ప్రతిమధ్యావతి, మోహనాంగి మొదలుగాఁగఁల స్వయంకృత రాగాలతో  మరియు 72 మేళకర్త రాగాలలో దాదాపు 400 కొంగ్రొత్త కృతి, వర్ణ , తిల్లాన , భావగీతాల  కూర్పులని మూడు మరియు నాలుగు స్వరాలలో సరికొత్త తాళ పద్దతిని మలచిన ఘనుడు. సంగీత కళానిధి, సంగీత కళాశిఖామణి గా భాసించిన బలమురళీకృష్ణని భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' బిరుదు తో  ఆ సంగీత సామ్రాట్టుని సత్కరించి తనను తాను గౌరవించుకుంది.

సంగీతాకాశంలో మెరిసిన తారలలో నేదునూరి కృష్ణమూర్తి , గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కూడా చిరస్థానాన్ని పొందిన తెలుగు వారే. 

ఇ. చిత్రలేఖనం: 

దామెర్ల రామా రావు (1897-1925): రాజమహేంద్రవరం లో వైద్యకుటుంబంలో పుట్టి చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శించి 28 ఏళ్లకాలమే జీవించిన గొప్ప కళాకారుడు. అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావు 'గోదావరి అఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ' అనే రంగుల చిత్రాన్ని చూసి మెచ్చుకొని కొనుక్కున్నాడట. రాజమండ్రి లోనే 'చిత్ర కళాశాల' అనే చిత్రలేఖనా పాఠశాల ప్రారంభించి చాలామంది కి ఆ కళలో తర్ఫీదు ఇచ్చాడు. అక్కడే 'భారత దేశ చిత్ర ప్రదర్శనం' నిర్వహించాడు. ఆయన రామాయణ ఆధార చిత్రాలు దొరక్కపోయినా, 'సిధార్థ రాగోదయం', 'కార్తీకపూర్ణమి’,' 'పుష్పాఅలంకరణ', ‘ఋష్య శృఙ్గభంగం', ‘తూర్పు కనుమల్లో గోదావరి' చిత్రాలు చాలాప్రసిద్ధములయ్యాయి.                                               పేరంటాళ్ళు⇒                                                         .                                                                                                                                  

వడ్డాది పాపయ్య:(1921-1992) శ్రీకాకుళంలో పుట్టిన వడ్డాది పాపయ్య చాలా విచిత్ర వ్యక్తిత్వం గల మితభాషట.  తన పరిచయస్తుల మధ్యనే ఆయనతో అంతగా కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు లేరట. అయన నైపుణ్యం ఎక్కువగా తన చిత్రాలద్వారా ‘యువ’, ‘చందమామ’ , ‘స్వాతి’ పత్రికలకి, వాటి ద్వారా ప్రజలకు అందించారు. చాలారోజులు మదరాసులోను చివరి కొద్ది ఏళ్ళు వారఅమ్మాయి దగ్గర అనకాపల్లి వద్ద కశింకోటలో గడిపారట. ఆయన పోయిన తరువాత ఆయన కోరిక ప్రకారం ఎవరికి తెలియకుండానే చివరి సంస్కారాలు జరిగిపోయాయట.

బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) (1933- 2014): అందమైన అమ్మాయి కనిపిస్తే 'బాపు బొమ్మలా' ఉందని అనడం ఇటీవల కాలపు ఆనవాయితీ.  బాపు బొమ్మ , బుడుగు రెండుజెళ్ళ సీతలని వినని తెలుగు వాడు బహుశాఉండరేమో. అయన దర్శకత్వంలో తీసిన సినిమాలు - సాక్షి, సీతాకళ్యాణం, త్యాగయ్య, శ్రీనాధ కవిసార్వభౌమ, పెళ్ళిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీరామరాజ్యం, సంపూర్ణ రామాయణం, ముత్యాలముగ్గు వంటి కళాత్మక చిత్రాలకి ప్రత్యేకత ఉండి అనేక బహుమతుల గెలుచుకున్నాయి. చిత్రకారుడిగా, కార్టూనిస్ట్ గా, చలనచిత్ర స్క్రీన్ ప్లే రైటర్ గా దర్శకుడి గా, పుస్తక రచయితగా అనేక  దేశ  విదేశ బహుమానాలని సంపాదించుకున్నాడు. ఫోర్డ్ ఆర్ట్ ఫౌండేషన్ కి సలహాదారుగా, పిల్లల పుస్తకాలకి యునెస్కో డెలిగేట్ గాను చాలా సమర్ధవంతం గా నిర్వహించి ఖ్యాతి నార్జించాడు. చిత్రలేఖనా, కళాత్మకచిత్ర ప్రపంచంలోనూ మకుటంలేని మహరాజులా వెలిగిన 'బాపు' తెలుగు వాళ్లలో చిరస్మరణీయుడు. చిన్నప్పటినుంచి  స్నేహితుడు, అతి సన్నిహితుడైన ప్రఖ్యాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణతో కలిసి ద్వంద కళాకారులుగానెనలేని ఖ్యాతి నార్జించారు.  

భీమారావు ఖరీడేహాల్ (1941 -): ఇప్పటితరం చిత్రకారులలో గొప్ప ప్రతిభని చూపించిన కళాకారుడు. పార్వతీపురంలో జన్మించి విజయనగరంలో చదువుకుని BARC లోను, ECIL లోను సాంకేతిక రంగంలో ప్రతిభావంతం గా పని చేసి, పదవి విరమణ తరువాత ‘బాపు’ స్ఫూర్తి తో అంతకుముందే నిబిడీకృతంగా యున్న కార్టూన్లు గీయగల సామర్ధ్యం,  ఆసక్తి పెరగగా చిత్రలేఖనాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి, ఆ నైపుణ్యానికి పదునుపెట్టి, ఉన్నత శిఖరాలు అధిరోహించిన మేధావి. "సచిత్ర త్యాగరాజ కీర్తనామృతం" లో కల్లూరి సత్యరామప్రసాద్ గారు 400 త్యాగరాయ కీర్తనలకు వ్రాసిన భావ విశ్లేషణాలకి అనుబంధంగా వంద రంగుల చిత్రాలతో కళాభాష్యాన్నిచ్చి అలంకరించిన కళామూర్తి. ఆయన 'రామాయణ గాధలు', 'భగవద్గీత', 'భజగోవిందం', 'శ్రీ విష్ణు సహస్ర నామము', 'ఆదిత్య హృదయం', ‘శ్రీ దక్షిణామూర్తి’, ‘హనుమాన్ చాలీసా' వంటి ఇంకా అనేక శీర్షికలతో గీసిన చిత్ర సంపుటాలని అందించి పాఠకులలో వాటి అవగాహనని, భావ ఔన్నత్యాన్ని పెంచారు. బాపు ఆదర్శంతో అయన గీసిన చిత్రాలలో ప్రతిగీత లోని మెలిక ‘బాపు’ ని తలపింపచేస్తాయని జన వాక్కు. 'శ్రీ విష్ణు సహస్రనామము' ని అలరించిన చిత్రాలకి శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, మంత్రాలయం వారు, ఇతర వ్యావృత్తులకి శ్రీ కందుకూరి శివానంద మూర్తి గారి 'సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్’ వారు, గుర్తింపుగా విలువైన నగదు బహుమానాలతో సత్కరించారు. వయసుతోబాటు అనేకంగా పెరుగుతూ  విరబూస్తున్న చిత్ర రచనలే అయన చిత్ర రచనాసక్తికి, భావ పరిపక్వతకు, కళా కౌశలానికి నిదర్శన.

           ఆంధ్రులంతా కొలిచే సీతాపతి, హనుమదాశ్రితుడు, ఆయోధ్య రాముడు, అందాల దేముడు, రఘుకులాన్వయ సోముడు భారతీయజీవనానికి ఆదర్శ పురుషుడు. 

            అగణిత జన్మకర్మదురి తాంబుధిలో బహుదుఃఖవీచికల్
            దెగిపడవీడలేక జగతీధర నీపదభక్తి నావచే
            దగిలి తరింపగోరితి బదంపబడి నదు భయంభు మాంపవే
            తగదని చిత్తమం దిడక దాశరథీ కరుణాపయోనిధీ

 “శ్రీరామ జయరామ జయజయ రామ” అని అందరి తెలుగు వాళ్లతోను మనమూ గళాలని కలుపుదాము.

 *****

damerla.jpg
bapu.jpg
vaddadi.jpg
bottom of page