top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

అమ్మ కడుపు చల్లగా...

srinidhi-yellala_edited.jpg

శ్రీనిధి యెల్లల 

దూరంగా  ఎక్కడినుండో తెరలుతెరలుగా వస్తోంది ఏడుపు.

కాస్త జాగ్రత్తగా వింది ప్రణవి. అనుమానం లేదు అది పసిబిడ్డ ఏడుపే.

 

“ఏమైంది ఆ పాపకి? ఎవరు ఆ పాపా? నా పాపే నా? పాపా పాపా!” అంటూ చీకట్లో ఆ ఏడుపు ఎటు వినిపిస్తే అటు పరిగెడుతోంది ప్రణవి.

"ఎక్కడ పాప, నా పాప ఏది. అయ్యో !కనపడదేం ! పాపా ! పాపా!." అంతుతెలీని దారిలో, ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న నిధి కోసం వెర్రిగా వెతుకుతున్నట్లు పరిగెడుతోంది. అలసిపోతోంది, పరిగెట్టలేక పోతోంది.

కానీ తనకోసమే వేచి చూస్తున్నట్లుగా వినిపిస్తోన్న పాప గొంతు నిలవనీయడం లేదు.

ఇంక పరిగెట్టే ఓపిక లేక కళ్ళు తిరిగి పడిపోయింది ప్రణవి. "పాపా , పాపా!," అంటూ కలవరిస్తున్న తనని మెత్తని చెయ్యి ఒకటి వచ్చి ఓదారుస్తోంది. ఒక పసిప్రాణం కోసం ఎదురుచూస్తోన్నతనని, చంటిబిడ్డలా అక్కున చేర్చుకుని ఓదారుస్తోంది ఆ మనిషి. అంతవరకు ఉన్న ఉద్వేగం తగ్గి , నెమ్మదిస్తోంది ప్రణవి ప్రాణం. చెప్పలేని నిశ్చింత. శత్రు దుర్బేధ్యమైన కోటలోకి వచ్చేసిన ధీమా.

ఎవరది? ఇంకెవరు అమ్మ. "అమ్మా !" అంటూ  చుట్టేసుకుంది. మరి "పాప?".

ఒక్కసారి మెలకువ రావడంతో నిద్రలోంచి దిగ్గున లేచింది ప్రణవి. అప్రయత్నంగా చేతులని ఎత్తుగా వున్న కడుపుపైన వేసుకుని, అపురూపమైన వస్తువుని, జాగ్రత్తగా పట్టుకున్నట్టు ఉంచింది. "ఎంత పిచ్చి కల !" అనుకుని దేవునికి దణ్ణం పెట్టుకుని మంచి నీళ్లు తాగి పడుకుంది మళ్లీ.

తెలతెలవారుతోంది. ఉదయపు లేత కిరణాలకి, రాత్రి కురిసిన మంచు, బిందువులుగా కరిగి, నెమ్మదిగా జారుతూ, కిటికీ అద్దాలపై పల్లెపు దారిని వెతుక్కుంటోంది.

"హలో, ఆ అమ్మా! ఏంచేస్తున్నావు. వీసా పనులు అన్ని అయిపోయాయిగా? తొమ్మిదో నెల పడగానే టికెట్స్ బుక్ చేస్తానన్నాడు హరి. నాన్నని కూడా రమ్మనమ్మా, కొన్ని రోజులకైనా!" తల్లితో కాసేపైనా రోజూ మాట్లాడడం అలవాటు ప్రణవికి . ​

"ఎం చేస్తామే. తిన్నాము, ఇక నిద్రపోవాలి. రోజూ ఏముంటాయి తల్లీ వింతలు ఇక్కడ! వాకింగ్ చేస్తున్నావు గా ? "

"ఆ చేస్తున్నా. అమ్మా కుడివైపుకి తిరిగి పడుకోవాలా లేక ఎడమవైపు తిరిగి పడుకోవాలా? "

"ఏంటే రోజుకో వెర్రి ప్రశ్న వేస్తావూ. పడుకునేటప్పుడు ఏ సందేహాలూ పెట్టుకోకుండా  పడుకో చాలు. మాకు రాని ప్రశ్నలన్నీ వస్తాయేమే  మీకు? ముందా  ఐపాడ్ ని అవతల పడేయ్ పడుకునే ముందు! అదే వస్తుంది నిద్ర! బయటకి వెళ్లి కాస్త నడువు. మనుషుల్లో పడు. ఎదురింట్లో వాళ్ళ అత్తగారు వచ్చింది అన్నావు కదా! మాట్లాడిస్తూ ఉండు. ఒక్కదానివే తలుపులు బిడాయించుకోకు! హాయిగా, సరదాగా ఉండాలి!"

"అబ్బా అమ్మా , నువ్వు రా , అలాగే వుంటాను. " గొంతులో జీర అడ్డురాగా తమాయించుకుని మాట్డాడుతోంది ప్రణవి .

"ఎందుకమ్మా దిగులు! నువ్వే అమ్మవవుతున్నావు! ఇంకా బేలగా ఉంటే ఎలా? దిగులుపడకూడదు. నా తల్లివి కదూ!..." అంటున్న అమ్మ గొంతు విని తట్టుకునే శక్తిలేక, తర్వాత చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది.

ఎత్తు తక్కువ కావడం వల్ల, ఎనిమిదో నెలలో పడినప్పటి నుండి, కాస్త కష్టం గానే వుంది ప్రణవికి. పైగా తొలి కానుపు. తల్లికే కాదు, మాతృదేశానికి కూడా దూరంగా ఉండడం ఈ సమయంలో చెప్పలేని బాధ . చేసుకోలేక, చేసుకున్నవి రుచించక, నానా అవస్థలు పడుతోంది. ఇంకా నెలన్నర గడువు ఉంది అనుకున్నప్పుడల్లా ఉసూరుమంటోంది ప్రాణం. తన పాపాయిని ఎత్తుకుంటాను అనే ఆనందంతో పాటూ, అమ్మని చూడొచ్చనే కోరిక కూడా పోటీ పడుతోండగా రోజులు లెక్కబెట్టుకుంటోంది.

తాగిన పాల కప్పుని సింకులో వేస్తూ, ఎదురుగా మోకాలిపై వంగి చిలిపి గా నవ్వుతున్న చిన్ని కృష్ణుని ఫోటో చూసి, పెదవులపై హాసంగా చేరింది , అమ్మనవుతున్నానే గర్వం. తాను ఏ గదిలో ఎలా కూర్చున్నా, నవ్వుతూ పలకరించే పాపాయి బొమ్మలు కనపడేలా పెట్టాడు హరి.

స్వతహాగా కాస్త "రిజర్వ్డ్ " గా ఉండే ప్రణవి, ఎక్కువ స్నేహితులని కూడా చేసుకోలేకపోయింది. పైగా తమ అపార్టుమెంట్లో ఎక్కువగా చదువుకునే పిల్లల తల్లులు, లేదా ఉద్యోగాలకెళ్ళే వాళ్ళు. అమ్మ మాట విని మొదట్లో ఇంట్లో ఉండే అమ్మలతో పరిచయం పెంచుకుందామని అనుకుంది కానీ, వాళ్ళ కిట్టీ పార్టీలతో, పిల్లల గోలతో, ఎప్పుడూ అయితే వంటలు లేకపోతే పిల్లలు తప్ప ఇంకో టాపిక్ లేక ఊపిరాడనట్లు ఉండేది తనకి. ఇక ఉద్యోగాలకెళ్ళే వాళ్ళ సంగతి సరే సరి. చూపులు కలిపినా, ఒక నవ్వు నవ్వాల్సి వస్తుందేమో, అరక్షణం వేస్ట్ అయిపొతుందేమో అన్నట్లు కాళ్ళకి చక్రాలు కట్టుకుని, ఒకచేత్తో ఇంటినీ, ఒక చేత్తో ఉద్యోగాన్నీ బ్యాలెన్స్ చేస్తూ పరుగులు పెడ్తూ ఉంటారు. ఇలా ఎటు వైపూ ఇమడలేక ఇంట్లోనే ఉండడం అలవాటు చేసుకుంది.

ఈ మధ్యన మరీ దిగులుగా ఉంటోంది ప్రణవికి, డెలివరీకి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ, ఎంత ధైర్యంగా వుందామన్నా చెప్పలేని దిగులు, నిసత్తువా ఆవరించుకుంటున్నాయి. పూర్తిగా తన మీదే ఆధారపడే పసి ప్రాణం ఇంకొన్ని రోజుల్లో తన ఒడిలోకి చేరబోతోంది అనుకున్నప్పుడల్లా, ఆనందంతో పాటు భయం కూడా కలుగుతోంది ప్రణవికి. అమ్మ అవుతున్నాననే ఆలోచన వచ్చినప్పుడల్లా ఆ భాద్యతని తాను సరిగ్గా నిర్వర్తించగలదా అనే సందేహం కలుగుతోంది. “అమ్మ నన్ను చూసుకున్నట్లు పాపని నేను చూసుకోగలనా? తెలీకుండా నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఎలా?” ఒంటరిగా ఉండటంతో ఇలా రకరకాల ప్రశ్నలు ప్రణవిని చుట్టుముడుతున్నాయి. భర్త మరీ బిజీ అయిపోవడంతో ఇంకాస్త ఒంటరితనం ఎక్కువైపోయినట్లుగా ఉంది .

రైస్ కుక్కర్ లో ఇంత బియ్యం పడేసి, బెడ్రూం లోకెళ్ళి కాస్త నడుం వాల్చింది. కాసేపలా కూర్చుందో లేదో, కాలింగ్ బెల్ మూడు సార్లు వినపడింది. ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు మోగిందంటే కచ్చితంగా మనవాళ్లే అనుకుంటూ భారంగా వెళ్లి తలుపు తెరిచింది. ఎదురింటి సుష్మ గారి అత్తగారు. వచ్చిన రోజునుంచి ఎదో ఒక సాకుతో పలకరిస్తూనే ఉంటుంది. అంత భారీకాయాన్ని మోయలేక మోస్తూ ఒక్క ఫ్లోర్ దిగి, ఒక ఫ్లోర్ ఎక్కి ప్రణవి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆపసోపాలు పడుతోందావిడ. ఈవిడకెందుకింత కష్టం అనుకుంటూనే,"రండి ఆంటీ" అంటూ లోనికి దారి తీసింది.

సోఫాలో భారంగా కూర్చుంటూ , అలుపు తగ్గగానే  "అమ్మడూ, ఈ సంగతి తెలుసా నీకు?", అంటూ చెప్పడం ఆపింది ఆంటీ . తన నుండి ఆశ్చర్యం , ఉబలాటం వగైరా ఆశిస్తోందని తెలిసి, అవి ప్రదర్శించే దాకా తన స్క్రీన్ ప్లే ముందుకి సాగదని, "ఏం జరిగింది ఆంటీ ?" అని అడిగింది ప్రణవి.

“ఏం జరిగింది అని మెల్లగా అడుగుతావేంటి! నిన్న సాయంత్రం ఫ్లోరిడాలో ఒక పార్కులో ఒక నల్లవాడు, మన ఇండియన్ ఒకావిడ వాకింగ్ కెళ్తే గన్ చూపించి మెళ్ళో తాళిబొట్టు తీస్కెళ్లిపోయాడంట!" టీవీ లో రిపోర్టర్ చెప్పినట్టు చెప్పుకుపోతోంది.

" ఈ విషయం మా కోడలికి చెప్తే బయటికి వెళ్ళేటప్పుడు తాళిబొట్టు తీసెయ్యమంది. మీకేం, ఈకాలం పిల్లలు కాబట్టి తేలిగ్గా చెప్పేస్తారు. మాకెంత కష్టంగా ఉంటుందో తెలుసా? రోజూ డాక్టర్ వాకింగ్ చెయ్యాల్సిందే అని చెప్పాడు. ఇప్పుడేమో ఈ సంగతి తెలిసి ఒకటే దడ పెరిగిపోయింది. మా రెండో వాడు "మినియాపోలిస్ " లో వున్నాడా , అక్కడ ఇంత భయమేమీ లేదమ్మాయ్. ఇంతకీ కూరేమి ఒండుకున్నావ్? ఇందా, గోంగూర పచ్చడి తెచ్చా తీసుకో," అంటూ  తన కూడా తెచ్చిన డబ్బా ఇచ్చింది. ఆవిడకి తోచనప్పుడల్లా ప్రణవి దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పేస్తూ ఉంటుంది, ప్రణవి వింటుందా లేదా అని కూడా పట్టించుకోకుండా!

"ఇంతకీ నే వచ్చిన సంగతి చెప్పనేలేదు కదూ. నీ దగ్గర పసుపు తాడు ఉందా అమ్మడూ? అదైనా వేసుకుంటాను కనీసం. వాకింగ్ కెళ్లకపోతే నాకేమీ తోచదు. పైగా ఇక్కడ ఎవరిని చూసినా భయంగానే ఉంటుంది! మన జాగ్రత్తలో మనం ఉంటే  పోలా? తెల్ల వెధవలు కూడా ఏమన్నా తక్కువ తిన్నారా ఏంటి? ఈ నల్ల వాళ్లకన్నా, రెండు ఆకులు  ఎక్కువే వాళ్ళకి, ఉన్మాదం. కొందరు కనీసం డబ్బులు ఇస్తే వదిలేస్తారు, కొందరు ఏదో  సరదాకి  పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు కదే తల్లీ . దీపావళీ తుపాకుల్లా అంగట్లో అమ్ముతారటగా ఇక్కడ తుపాకులూ? మా అబ్బాయ్ చెప్పాడు. నువ్వు కూడా, వాకింగ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్త అమ్మాయి, వెలుతురుండగానే వచ్చేయ్  ఏ ?ఎంతైనా మినియాపోలిసులో ..... " ఎదుటి వారి సమాధానం గురించి అస్సలు పట్టింపులేని ఆవిడ వాగ్దాటి అంతటితో ఆగదనీ, "ఒక్క నిమిషం ఆంటీ , మీరు పసుపు తాడు అడిగారు కదూ, చూసి వస్తా” అని దేవుని దగ్గరకి వెళ్లి, చెక్కపెట్టిలో ఉన్న నైలాన్ పసుపు దారం తెచ్చిచ్చింది. మొన్నెవరో వరలక్ష్మి వ్రతం వాయినాల్లో ఇచ్చారు ప్రణవికి .

అది తీస్కుని, "రక్షించావు తల్లీ . ఏదైతే ఏంటి ఆపద్ధర్మానికి! వస్తాను. మొన్న టొమోటా  పచ్చడి వేసిచ్చిన గిన్ని ఇటు పడేయ్ తల్లీ. మా కోడలికి అన్ని గుర్తే! అన్నిటికి పద్దు చెప్పాలిగా " అంటూ గిన్ని తీస్కుని వెళ్ళిపోయింది.

ఆవిడ చాదస్తానికి కాస్త విసుగు పుట్టినా, ఆవిడ అప్పుడప్పుడూ తెచ్చే కూరలూ, పచ్చళ్లకోసమైనా భరిస్తుంది. వాకింగ్ కి  తోడు వస్తానంటే మాత్రం తప్పించుకుంటూ ఉంటుంది. ఎనిమిదో నెలలో కూడా ఆవిడకన్నా తొమ్మిది అడుగులు ముందే ఉంటుంది ప్రణవి. అంత నిదానం మనిషి. పైగా ఏకపాత్రాభినయం లాగా ఆవిడ చెప్పేదే కానీ  తనని ఏమి మాట్లాడనీయదనీ ఆవిడతో వాకింగ్ కి వెళ్ళదు . అయినా గానీ ఎందుకో అప్పుడప్పుడూ ఆంటీ వస్తే బాగుండు అనుకుంటూ ఉంటుంది ప్రణవి. ఒంటరిగా ఉండే తనకి ఆవిడ వస్తే అదో నిశ్చింత.  ఆవిడ గల గలా మాట్లాడుతుంటే ఎందుకో అర్ధం కాదు గానీ ఎంతో ధైర్యంగా ఉంటుంది.

ఆంటీ ఇచ్చిన పచ్చడి వేసుకుని అన్నం తిని కౌచ్ లో ఒరిగింది. అక్కడి నుండి కిటికీలోంచి బయట వీధి అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆంటీ చెప్పిన సంగతులతో, ఆన్ లైన్ లో వచ్చిన వార్తలతో బుర్ర వేడెక్కి పోయింది ప్రణవికి. ఏమైందీ ఈ మనుషులకి? మనిషికీ మనిషికీ ఎందుకింత ద్వేషం, పగ?  ఏ  ప్రాణి జాతిలో లేని స్వజాతి వైరం మనుషులకి మాత్రమే ఎందుకు? నిజమే ఏ జాతిలో లేని భిన్నత్వాలన్నీ మన మానవ జాతిలోనే ఉంచాడు దేవుడు. ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రంగులు. నలుపు, తెలుపు, ఎరుపు,పసుపు అబ్బబ్బబ్బా ... కొట్టుకు చావడానికి ఏ కారణమైతే ఏంటి. అందరూ మనుషులే కదా! వివిధ వర్ణాల మనుషుల మధ్య ఈ దూరాన్ని పూడ్చలేమా?. దేవుడు మనుషుల్లో ఎందుకిన్ని రంగులని తయారు చేసాడో ఏంటో? అనుకుంటూ ఆలోచనల్లో పడిపోయి అలాగే మగతగా నిద్రలోకి జారుకుంది ప్రణవి.

సాయంత్రం హరి రాగానే పొద్దున్న జరిగిందంతా చెప్పబోయింది ప్రణవి. ప్రతిసారి లాగే సాంతం వినకుండానే,"జానూ … ఎందుకీ క్రాప్  అంతా బుర్రలో పెట్టుకుంటావు.  ఎక్కడో జరిగినవి విని  భయపడుతూ ఉంటే అసలు ఈ దేశంలోనే కాదు ఏ దేశం లోనూ ఉండలేము. డిన్నర్ చేసేసి వెళ్లి హాయిగా రిలాక్స్ అవ్వు. యూ నీడ్ టు బి హ్యాపీ నౌ !" అని హడావిడిగా నుదుటిపై ఒక ముద్దు పెట్టేసి లాప్టాప్ ముందు కూర్చున్నాడు. ఇక పది గంటల దాకా లేవడని తెలిసి అడిగి లాభం లేదని తినేసి ఐపాడ్ తీస్కుని బెడ్రూంలోకి వెళ్ళిపోయింది.

హరి కూడా తనతో కలిసి నడవాలనీ, కలిసి భోంచెయ్యలని తన కోరిక. హరికి ఇవేమి పట్టింపు లేదు! ఫ్రిడ్జ్ నిండా పళ్ళు, పాలు, కావలసినవన్నీ చేతికి ఇస్తున్నా కదా, ఇంతకన్నా బాగా ఎవరు చూసుకుంటారు అనుకుంటాడు. అదే తను చూపగలిగే ప్రేమ. తనకేం కావాలో చెప్పినా హరికి అర్ధం కాదని తనే ఒంటరితనాన్ని అలవాటు చేసేసుకుంది ప్రణవి.

"త్వరగా ఈ అమ్మకి తోడు కోసం రా కన్నా," అంటూ బొజ్జలోని పాపాయికి కబుర్లు చెప్తూ నిద్రలోకి జారింది! పాపాయి, అమ్మ నిజంగా తనని త్వరగా రమ్మని అంటోంది అనుకుందేమో!

తెల్లవారుజామున 5 గంటలకి వెచ్చని నీరు ఒక్కసారిగా బయటికి రావడంతో, హఠాత్తుగా మెలకువ వచ్చేసింది. "హరి హరీ,"అంటూ బాత్రూం లోకి పరుగు తీసింది. ఇద్దరికీ కొత్తే. ఒక్క నిమిషం ఎం జరుగుతుందో అర్ధం కాలేదు. వెంటనే అమ్మకి ఫోన్ చేసింది ప్రణవి. వేళ కాని వేళలో కూతురి నుండి ఫోన్ రావడంతో కలవర పడుతూనే ఫోన్ తీసింది ప్రణవి వాళ్ళ అమ్మ.

"అమ్మా !" అంటూ వచ్చే దుఃఖాన్ని, భయాన్నీ ఆపుకుంటూ జరిగింది చెప్పింది.

కూతురి పరిస్థితి అర్ధం చేస్కుని, బిడ్డ త్వరగా లోకం లోకి రావాలకుంటోందని తెలిసి, వెంటనే ఆలస్యం చెయ్యకుండా హాస్పిటల్ వెళ్ళమంది ప్రణవి వాళ్ళ అమ్మ!

సరే అని ఫోన్ పెట్టే లోపు, వెన్నులోంచి మెల్లగా పోటు. బాధను మరిపించిన భయంతో హరిని చూసి, 911 కి కాల్ చెయ్యమంది. 911 కి కాల్ చెయ్యడం, అంబులెన్సు, ఫైర్ ఇంజిన్ రావడం ఒకేసారి జరిగాయి. ఆరడుగుల పైనే ఎత్తు ఉన్న ఇద్దరు ఆఫీసర్లు తన అవస్థ చూసి వెంటనే అంబులెన్సులోకి ఎక్కించారు. పది నిమిషాల్లో హాస్పిటల్లో ఉన్నారు ప్రణవి వాళ్ళు.

"బిడ్డ జాగ్రత్త. బిడ్డ కోసం నువ్వు ధైర్యంగా ఉండాలి," అన్న అమ్మ మాటలే చెవిలో మారు మోగుతుండగా హఠాత్తుగా వచ్చిన సంఘటనని ఎలా హేండిల్ చెయ్యాలో తెలీక అయోమయంగా ఉన్న హరి చెయ్యి పట్టుకుని, తానే తీసుకుని వెళ్లి రిసెప్షన్ లో ఇన్ఫోర్మ్ చేసింది ప్రణవి. డీటెయిల్స్ చెక్ చేసి ఎనిమిదో నెలే కాబట్టి ఫాల్స్ పైన్స్ అనుకుని అప్పటిదాకా తీరిగ్గా ఉన్న నర్సు, 15నిమిషాలకోసారి వస్తున్న నొప్పులు మూడో సారి రాగా "అమ్మా," అని అరుస్తూ నిలబడలేక పోతున్న ప్రణవిని చూసి వెంటనే రూమ్ లో అడ్మిట్ చేసేసింది. డ్యూటీ నర్స్ ని పిలిచి చెక్ చేసి, ప్రణవి ఆక్టివ్ లేబర్ లో ఉందని రౌండ్స్ లో ఉన్న డాక్టర్ ని పిలుచుకుని వచ్చి  ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి లేబర్ రూంలోకి షిఫ్ట్ చేసారు.

అంతా కలలో లాగా జరిగిపోతున్న పనులని చూస్తూ నమ్మలేక పోతోంది ప్రణవి. హాస్పిటల్ కి వచ్చేసాం అన్న ధైర్యంతో హరి కూడా తేరుకుని ప్రణవికి ధైర్యం చెప్తూ ఉన్నాడు. డ్యూటీ నర్స్ తన షిఫ్ట్ అయిపోయిందని వెళ్తూ, డ్యూటీలోకి వచ్చిన ఆఫ్రికన్ అమెరికన్ నర్సుకి ప్రణవి కేసుని అప్పగించి వెళ్ళిపోయింది. కొత్త నర్స్ ని చూస్తూనే, ఉసూరుమనిపించింది ప్రణవికి. కారణం లేకుండా అనాదిగా ఏర్పడిన భావాల వల్ల అంత హడావిడిలో కూడా ఈవిడ కాకుండా వేరే ఎవరైనా వస్తే బాగుండు అనుకుంది. అసలే కాన్పు సమయంలో కొందరు నర్సులు ఎలా విసుక్కుంటారో కధలు కధలుగా వినడం వల్ల, అదో భయం కూడా ఉంది మనసులో.

ఇనీషియల్ చెక్ చేసేసి డాక్టర్ వెళ్ళిపోయింది. నర్స్ మధ్య మధ్యలో వచ్చి తనని చెక్ చేస్తూ నొప్పులు మరీ ఎక్కువైతే చెప్పమని వెళ్తోంది. ఆగాగి వస్తున్న సన్నని నొప్పులను భరిస్తూ హరి చెయ్యి పట్టుకుని పడుకుంది ప్రణవి.

క్షేమంగా హాస్పిటల్ కి వచ్చేసింది కాబట్టి, కళ్ళు మూస్తే చాలు మగత... ఎప్పటివో జ్ఞాపకాలు చుట్టుముట్టుతున్నాయి. ఇంటర్ హాలిడేస్ లో అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు పొలంలోనే దూడను కనేసింది తమ కర్రావు. జీతగాడు పరిగెత్తుకు వచ్చి ఈ విషయం చెపుతున్నాడు. అమ్మమ్మ చేస్తున్న హడావిడి అంతా  ఇంతా కాదు. దూడకి ఏమీ కాకూడదని తనకి తెలిసిన దేవుళ్లందరికీ మొక్కేస్తోంది. అమ్మని, అత్తనీ  హడావిడి పెట్టించి పెద్ద గంగాళంతో వేడి నీళ్లు పెట్టిస్తోంది. కొట్టం అంతా  శుభ్రం చేసి, కళ్ళల్లో నీటి పొర మాటి మాటికీ ఊరుతుంటే , కొంగుతో అద్దుకుంటూ,గుర్తొచ్చిన దేవుళ్లందరిని మొక్కేస్తూ  వీధిమలుపునే తన దృష్టి అంతా పెట్టి ఎదురుచూస్తోంది.

"దూడ కోసమే మొక్కుతుందే అమ్మమ్మా? అవుకు మొక్కదే!?'" అని అడుగుతోంది తను.

"బిడ్డ బతికితేనేగా తల్లి ప్రాణం నిలబడేది !" అంది అమ్మ . అక్కడున్న అమ్మలందరి కళ్ళల్లో తడి. అంత మగతలో కూడా తన చెయ్యి కడుపు పైకి వెళ్లడం, తెలుస్తోంది ప్రణవికి.

"ముగ్గురు కలిసి మోసుకొస్తున్న దూడను నాకుతూ, నడవనివ్వకుండా వాళ్ళ కాళ్ళకి అడ్డుపడుతూ, మెల్లిగా వస్తున్న కర్రావును చూడగానే, "వెంకటరమణా!!," అని గాల్లోనే దండాలు పెట్టేసి, వేణ్ణీళ్ళు తెమ్మని అత్తకి చెప్పి, కొంగు దోపి, ఆవుని చావిట్లో కట్టేసి , వేడి వేడి నీళ్లు పోసి, పాలేరు సాయంతో తోమి తోమి కడుగుతోంది అమ్మమ్మ .

"ఎందుకమ్మా ! " అని అడుగుతోంది తను.

"కష్టపడి వచ్చింది కదమ్మా , మనకి దూడని ఇచ్చింది కదా! అందుకు," అంది అమ్మ! ఆనందంగా తోక ఊపుతూ, తన దూడని నాకుతూ అందరి దగ్గరా సేవలు చేయించుకుంటోంది కర్రావు .

“మరి నాకు, నాకెవ్వరున్నారు? అమ్మమ్మ లేదు, అమ్మ రాలేదు! నేను ధైర్యంగా ఉండగలనా? ఉండాలి!  పాప కోసమైనా ఉండాలి. నన్ను ఒంటరిగా ఇలా చూస్తే అమ్మమ్మ ఏమంటుంది? అమ్మ తట్టుకోగలదా? అమ్మ! అమ్మమ్మా !.. పాపా !" అంటూ కలవరిస్తున్న ప్రణవిని ఒక మెత్తని చెయ్యి దగ్గరికి తీస్కుంది. నుదిటిపై పట్టిన చెమటని తుడుస్తూ, "ఇట్స్ ఓకే మై చైల్డ్ !," అంటోంది కరుణ నిండిన నర్స్ గొంతు. ఆమాత్రం సానుభూతి అప్పటివరకు ఎరుగని ప్రణవికి, దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒక్కపెట్టున ఏడవబోయింది.

"నో నో మై చైల్డ్, ఏడిస్తే బిడ్డకి మంచిది కాదు," అన్న నర్స్ మాటకి మంత్రం వేసినట్టు ఆగిపోయింది.

"మేమంతా ఉన్నాం కదా!  భయపడాల్సిందేమీ లేదు! పాపాయి త్వరగా అమ్మని చూడాలి అనుకుంది.అందుకే నెల ముందే వచ్చేస్తోంది. నీకేమి కాదు. ధైర్యంగా ఉండు," అంటున్న నర్స్ ని చూస్తుంటే అమ్మే తన పక్కన ఉన్నట్లనిపించింది.

కొండంత ధైర్యం వచ్చినట్లు అనిపించింది. క్షణం క్రితం దాకా ఆమె రంగుని చూసి తన మదిలో మెదిలిన అనుమానాలేవీ ఇప్పుడు లేవు ప్రణవికి. సాటి మనిషి ఒకరు తోడు ఉన్నారన్న ధైర్యం తప్ప.

అయోమయంగా భయంగా తననే బేలగా చూస్తున్న హరిని చూసి నవ్వి, "వి  కాన్ డు ఇట్ !" అంది. ఇంతలో నొప్పులు ఎక్కువయ్యాయి. తట్టుకోలేకపోతోంది ప్రణవి. భరించలేని బాధ, చచ్చిపోతానేమో అనుకుంది. ఆ చీకటిలో చిరుదీపంలా ఉన్న నర్స్ ని క్షణం కూడా విడువట్లేదు . తనని వదిలితే తుఫానులో చుక్కానిని దూరం చేస్కుంటుందేమోననే భయం. బాధని, భయాన్ని తన చల్లని చేతుల్లో ఉన్న ఆ నల్లని చేతులమీదే బిగిస్తోంది.

ఓపిగ్గా పసిబిడ్డని పొదివి పట్టుకున్నట్లు పట్టుకుని, ధైర్యం చెబుతోంది నర్స్ ప్రణవికి. ఆవిడ నోటినుండి వచ్చే ఏ  ఆజ్ఞ ఐనా మారుమాట్లాడకుండా వింటోంది. ఇక వల్ల కాదు అని తాను ఓపికలేక పడిపోయినప్పుడల్లా తన మాటలతో ధైర్యం నూరిపోస్తోంది.

 

ఇంతలో ఇక అసలు ఏమాత్రం భరించలేని నొప్పి రావడం, అసిస్టెంట్ నర్స్ డాక్టర్ ని పిలుచుకు రావడం, పాపాయి ఏడుపుతో అందరి మొహాల్లో, ముఖ్యంగా హరి మొహం లో ఏ మతాబులతో పోల్చలేని వెలుగు నిండడం జరిగిపోయింది.

శుభ్రం చేసిన పాపాయిని ప్రణవి చేతిలో పెట్టింది నర్సు.  పొత్తిళ్లలో “కూ కూ,” అంటున్న పాపాయిని సంభ్రమాశ్చర్యాలతో చూసుకుంటోంది. తొలిపాలు పాపాయికి పట్టడంలో ప్రణవికి సాయం పడుతోంది నర్సు. పాపని హత్తుకున్న మరు నిమిషం గుండెల్లో సుళ్ళు తిరుగుతోన్న జీవధార. పాప స్పర్శకి తన శరీరం ప్రతిస్పందనకి చకితురాలయింది ప్రణవి. ఇన్ని రోజుల తన ప్రశ్నలకి జవాబు చెబుతున్నట్లుగా కళ్ళు మూసుకునే నవ్వుతున్న పాపాయి, అన్నీ తానై నేర్పిస్తాలే అన్నట్టు అభయం ఇస్తున్నట్టుగా వుంది. తన ఎదపై హాయిగా నిద్రపోతున్న పాపాయిని చూడగానే అర్ధం అయింది ప్రణవికి , అమ్మ అవ్వడం అంటే నేనున్నానే ఒక ధైర్యాన్ని ఇవ్వడం అని. అమ్మంటే ఒక నిశ్చింత. అమ్మంటే ఒక భరోసా. తన బిడ్డలోనే కాదు, ప్రతి బిడ్డలోనూ తన బిడ్డను చూడగలగడమే అమ్మతనమని. అమ్మ, ఆంటీ, నర్సు ... అందరిలోనూ తనకి అనేక రూపాల్లో ఉన్నఅమ్మతనం కనిపించింది.

 

అమ్మ అవడం అంటే ఏంటో తెలిసి రాగా, నల్లని ఆకాశం లో పున్నమి వెన్నెలలా నవ్వుతున్న నర్స్ ని చూస్తూ, నిశ్చింతగా, నిద్రలోకి జారుకుంది ప్రణవి.

 

                                      *****

OOO

bottom of page