top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

అమ్మ దొంగా !

Oleti Sasikala

ఓలేటి శశికళ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కథ

" కిర్ " కిర్" ... కిర్ కిర్......" 

 

దాదాపు ఇరవై నిమిషాలనుండి చెవిలో జోరీగలా దూరి పిచ్చెక్కించేస్తోంది శబ్ధం. 

 

హరిహర బ్రహ్మాదులొచ్చి నా మధ్యాహ్నం నిద్ర పాడుచేస్తే ఊరుకోను నేను. అలాంటిది, వారం నుండీ చంపుకు తినేస్తున్నారు. ఈరోజు ఒదిలే ప్రసక్తి లేదు. పని పట్టాల్సిందే! కోపంగా లేచి గది బయటకొచ్చాను. 

 

ఏసీ నుండి బయటకు రాగానే వేడిగా మొహానికి కొట్టింది గాడుపు! అయినా ఇంత ఎండలో బుద్ధి లేకుండా...

వీధి తలుపు తీసి వరండాలో కెళ్లానో లేదో,

 

ఓ... అంటూ అరుచుకుంటూ పారిపోయారు! నాలుగేళ్ల నుండి ఎనిమిదేళ్ల వరకూ వుంటారు , ఆడపిల్లలూ, మగపిల్లలూ అంత మండుటెండలో జారిపోతున్న చడ్డీలతో, చాలీచాలని బట్టలేసుకుని , కాళ్లకి చెప్పులేనా లేకుండా మా ఇంటి పెద్ద ఇనప గేట్లు ఎక్కి, గడియలు తీసి , గేటు తాలూకు గ్రిల్ లో కాళ్లు పెట్టి నిలబడతారు అటూఇటూ! 

 

కాస్త పెద్దపిల్లలు వీళ్లను ఆ మూలనుంచీ ఈ మూల వరకూ ఝూలా ఊపుతారు! పెద్దగా నవ్వులూ, కిలకిలలూ, అరుపులతో ఇదిగో ఈ కిర్రూ కిర్రూ అంటూ గేట్ చేసే సంగీతం ఒకటి. 

 

నేను లేచి బయటకు రాగానే పారిపోయి, నేను లోపలికి పోగానే మళ్లీ ఒచ్చి చేరతారు! మళ్లీ మామూలే! 

 

మా శునకరాజాలు రెండూ మిన్ను విరిగి మీద పడ్డా వాటి మధ్యాహ్ననిద్ర నొదిలి ఏసీ. లోంచి వూడిపడవు. 

అయినా వచ్చినా ఏం లాభం? రెండురోజులరిచాకా, ఆ పిల్లలతో స్నేహం చేసేసాయి. సాయంత్రమయితే గేటు దగ్గర వాళ్లకోసం వెయిటింగ్ కూడా! 

 

ఎండలో నడుచుకెళ్లి , " వెధవ పిల్లలు! కాల్చుకు తినేస్తున్నారు", అని తిట్టుకుంటూ, ఈసురోమంటూ గేట్ బంద్ చేసి నిట్టూర్చా. 

 

తాళమేద్దామంటే, వేసినప్పటినుంచీ కొరియరో, పనమ్మాయో, పాలవాడో బయటనుంచి బెల్! పడలేక ఒదిలేసాను.                                                          

 

దినమంతా సూర్యప్రతాపానికి వేడెక్కిన భూమి రాత్రికి చల్లారి , తొమ్మిది గంటలకు ఈదురుగాలులు మొదలయి, పదింటికల్లా కుండపోత వాన! 

 

చల్లగాలి కోసం కిటికీలు తెరుచుకుని పడుకున్నాం. పన్నెండవుతుందేమో! మా కుక్కలు రెండూ హాలులో అరుపు. బయ్యిమని ఆగకుండా కాలింగ్ బెల్ ! 

 

లైట్లు వేసి, తలుపుగుండా చూస్తే వరండాలో ఎవరూ లేరు. 

వీధి బెల్ అనుకుంటా! ఎవరై ఉంటారు? 

 

ఈయన పేషంట్లెవరయినానా? అయినా డెభ్భైఏళ్ల వయసులో ప్రాక్టీసు బాగా తగ్గించేసుకున్న ఈయనకు ఇంటికొచ్చే పేషంట్లెవరూ లేరు! 

 

ఈయనప్పుడే గార్డెన్ లోని లైట్లన్నీ వేసి, చెప్పులేసుకుని బయటకెళ్లడానికి సిద్ధమైపోయారు! 

నేను భయం భయంగా ఆయన్ననుసరించాను. ఇద్దరం బయటకు చూద్దుం కదా ఎవ్వరూ లేరు!  

 

మేము ఏదో కీడు శంకించి లోపలికి పోబోయాం. 

 

" నేనే"....... వానహోరులో చిన్నగొంతుకు !!!

ఏడేళ్ల బుడ్డిది, వానలో తడుస్తూ....! 

చెప్పద్దూ.... చచ్చేంత కోపం ఒచ్చింది. ఇదేం ఆట? ఈ పిల్లలకు? గట్టిగా అదిలించబోయా!

 

" అమ్మ... మా యమ్మ! సచ్చిపోతంది... అంటూ వేలు చూపిస్తోంది! 

 

ఈయన గబగబా తాళం తీసారు. అప్పటికే మా పక్కింటి ముందు  చిన్నగుంపు. 

 

పిల్లతండ్రనుకుంటా... భార్యని చేతుల్లోకి తీసుకుని , మా పక్కింటి వాళ్లబ్బాయి కారాపి బతిమాలుతున్నాడు. 

 

ఆ అబ్బాయి అప్పుడే ఒచ్చినట్టున్నాడు. తాగి ఉన్నాడేమో! బూతులు తిడుతూ వాళ్లను అడ్డు లెమ్మంటున్నాడు. వాళ్లు పాపం ఏదో బతిమాలుతున్నారు! 

 

నేనూ, మావారూ ఆ పిల్లతో అక్కడికి వెళ్లాం! రక్తాలోడుతూ ఆ పిల్లతల్లి. 

 

వానలో బహిర్భూమికెళితే, కొండమీంచి బండరాయి దొర్లుకుంటూ వచ్చి, గట్టిగా దెబ్బలు తగిలాయి. 

 

మేమున్న కాలనీకి పెద్దాసుపత్రి చాలా దూరం. అందుకే కారులో తీసుకెళ్లడానికి అడుగుతున్నారు!

 

పక్కింటి పిల్లాడు దుడుగ్గా కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చి, ఇంచుమించు గుద్దుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు. వాళ్ళ వాచ్ మేన్ తలుపేసేసాడు. 

 

మావారు కారు తీయడానికి సిద్ధమైపోయారు. ఆయన అలాంటి వానలో, చీకటిలో డ్రైవ్ చెయ్యడం నాకిష్టం లేదు. 

కానీ ఆయన వినలేదు. 

గబగబా వాళ్లనీ, సాయంగా మరిద్దరినీ ఎక్కించుకుని కేజీహెచ్ కు తీసుకెళ్లారు. 

 

ఆ రోజు ఆ బుడ్డిది నాకేసి చూసి నవ్విన నవ్వు నా జన్మలో మర్చిపోలేను. అంటే అది డిసైడ్ అయిపోయిందన్నమాట వీళ్లింట్లో వాళ్లు తప్పకుండా తీసుకెళ్తారని! 

 

మావారు ఎక్స్ సూపరింటెండెంట్ అవడం వలన ఆ అమ్మాయికి వెంటనే వైద్యసహాయం దొరికింది. నెలరోజుల్లో మామూలు మనిషై తిరిగొచ్చింది. అన్నిరోజులూ ఆ బుడ్డది, దానిపేరు "సుబ్బరావమ్మ "... పూర్తిగా కాకపోయినా చాలావరకూ దాని కస్టడీ అదే మాకప్పగిచ్చేసింది. 

 

వాళ్ల నాన్న రోజూ ఒక గంట మా తోటపని చెయ్యడం మొదలుపెట్టాడు. ఒక్క మాట మాట్లాడేవాడు కాదు. 

 

వారం రోజుల్లో పిచ్చిమొక్కలూ, తుప్పలతో ఉండే తోటంతా నందనంలా తయారయింది. 

 

చెట్ల చుట్టూ గొప్పులు తవ్వి మూలపడున్న గెత్తమంతా తెచ్చి వేసాడు. 

పిచ్చిగా లేచిన తీగలకు పాదులు కట్టాడు. దిక్కూదివాణం లేనట్టు పెరిగిపోయిన జాజి , రాధామాధవాలను డాబా మీదకెక్కించాడు. బయటనుంచి మంచి రేగడితెచ్చి కుండీల్లో మట్టిమార్చాడు. 

నెల తిరిగేసరికి తోటంతా నిండుగా , పూలతో, చెట్లన్నీ పిందెలేసి ఫలవంతంగా తయారయింది. సాయంత్రమొచ్చి నీళ్లు పెట్టి వెళ్ళిపోయేవాడు. 

 

భార్య ఆసుపత్రినుండి తిరిగిరాగానే ఇద్దరూ కనబడ్డానికొచ్చారు పళ్లు పట్టుకుని. 

 

ఆ పళ్లు మాకన్నా ఆమెకెక్కువ అవసరం అనుకుని రెండు తీసుకుని మిగిలినవి " రామి", అదే… బుడ్డిదాని చేతిలో పెట్టేసాం. 

 

అతని చేతిలో తోటపనికి  కొంత డబ్బు పెట్టబోయారు కానీ, మహా బాధపడిపోయాడు. సరేలే ఏదోరూపంలో ఇవ్వచ్చని ఊరుకున్నాం. 

 

ఈ రామి మాత్రం మా ఇంటికొచ్చి గేటుదగ్గర అల్లరి చేసే పిల్లలకి పెద్ద లీడరయిపోయింది. 

 

వాళ్లని అరవకుండా గేటు ఎక్కించడం, కాలింగ్ బెల్లులు కొట్టకుండా కంట్రోల్ చెయ్యడం, తోటలో చిలక్కొట్టుడు సపోటాలూ, మామిడి కాయలూ వాళ్లనాన్న పోగులు పెట్టి వెళ్లిపోయేవాడు. మేమేం చేసుకుంటామవి? అందుకు అదే పిల్లలందరికీ న్యాయంగా పంచేసేది. 

అందరూ బయటున్న పెద్ద గుల్ మొహర్ కింద కూర్చుని తింటూ డే వారు.

 

ఒక రోజెందుకో దాని అరుపులు విని వరండాలో కెళ్లా! చిన్న కర్రపుల్ల పట్టుకుని అందరికీ తలోదెబ్బా  వేస్తోంది. 

 

చూద్దును కదా! నెత్తిలో మా తోటలోని మందారాలూ, గులాబీలూ, రామబాణం గుత్తులు అన్నీ కోసి, తగిలించుకుని ఆడపిల్లలు. 

 

నాకు వాళ్లనలా చూసి ఎంత నవ్వొచ్చిందో! రామి నేరం చేసిన దానిలా చూసింది నాకేసి. 

కానీ నా నవ్వు చూసి దానికీ ధైర్యమొచ్చి, అదికూడా ఒక రాధామాధవం గుత్తొకటి కొసి తల్లోపెట్టుకుని పారిపోయింది. 

 

అన్నిటికన్నా ఆశ్చర్యం మా వారిలో మార్పు. 

 

ఆరోజుల్లో అంత సీరియస్ పీడియాట్రిక్ డాక్టర్ ఈయనొక్కరే అనుకునేవారు. 

మా పిల్లలకు కూడా తండ్రితో చనువు తక్కువే. నేనే కెరియర్ గైడన్స్ , సమస్తం చూసుకునేదాన్ని. కాస్త మా అమ్మాయి పరవాలేదు. 

తండ్రిని బలవంతంగా ఆడించేది కానీ మావాడెందుకో ముడుచుకుపోయేవాడు. ప్రేమలేదని కాదు. 

కానీ ఆయనకు టైం ఉండేది కాదు. 

అందుకే చనువు పెరగలేదు. 

 

అలాంటిది ఇప్పుడు రోజూ క్లినిక్ కు వెళ్లి వస్తూ బేకరీనుండి రకరకాల తినుబండారాలూ, బన్నులూ, బ్రెడ్లూ తేవడం, వరండాలో పేముసోఫాలో కూర్చుని రామి కిచ్చి ఆ పిల్లలకు పంచడం. 

 

ఇక. మా చెట్లకు కాసిన పళ్లన్నీ వీళ్ల పరమే! వీళ్లు ఇంకొంచెం మందిని తెచ్చేవారు పంపకాల రోజున. 

 

నాకేమో ఉసూరుమనేది. ఊళ్లో చుట్టాలకూ , స్నేహితులకూ పంపుదామంటే ఒక్క పండు మిగల్చట్లేదు. 

ఏమన్నా అంటే , "మన వరకూ ఎంత కావాలో అన్ని వాడుకో.  

వాళ్లంతా లక్షణంగా కొనుక్కుని తినగలరు"... అనడం. 

ఇంక నేనూ మెల్లగా అలవాటయిపోయా ఈ కొత్త దాతృత్వానికి! 

 

ఎవరితో ఇన్ఫ్లూయెన్స్ చేయించారో తెలీదు, మా ఇంటికి  కొంత దూరంలో కొత్తగా అంగన్వాడీ పెట్టారు. 

ఈ పిల్లలంతా ఒకపూట అక్కడ కూర్చుని చదువునేర్చుకునేట్టు! 

 

మా సేవలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వాళ్ల వైద్యాలు అదనం. నేనేమైనా అందామన్నా, ఆయనంత ఆనందంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు.  బహుశా ప్రతీ వైద్యుడూ ప్రమాణం తీసుకోగానే మానవాళికి తన వైద్యం ద్వారా సేవచెయ్యాలనే ఉవ్విళ్లూరుతారు. కానీ వాస్తవానికి వారికా పరిస్థితులుండవు. బహుశా ఈయనకి ఇన్నాళ్లకి ఈమాత్రం అవకాశం దొరికిందనుకుంటున్నారేమో! 

 

అసలు అక్కడ అంగన్వాడీ పెట్టించడానికి అతి బలమయిన కారణం మా పొరుగింటివారు, కొంత వరకూ మా వీధిలో వారు. 

 

ప్రశాంతంగా , ఊరికి కోసంత దూరంలో ఉండే మా ప్రాంతంలో మావారితో సహా కొందరు డాక్టర్లూ, కొందరు ధనికులూ వెయ్యేసి గజాల చొప్పున పాతికేళ్ల క్రితమే కొనుక్కని, ఎవరి వీలూ స్థోమతూ బట్టీ ఇళ్లు కట్టుకున్నాం. 

 

చాలా మంచి కోట్లు విలువచేసే అత్యంత ఆధునికంగా కట్టుకున్నారు. అలాంటి వారే మా పొరుగు డాక్టర్ సోమయ్యగారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా రిటయిరయిన ఆయన సంపాదనకు లెక్కలు కట్టగలిగితే, శివుడి ఆత్మలింగం తుది మొదళ్లు దొరికినట్టే! 

 

అలాగే మా వీధిలో ఇంచుమించు అందరూ ఆ కోవే. మా సారొక్కరే అక్కడ మడికట్టుకున్న మధ్యతరగతాయన!! 

 

మా కాలనీకి కొంత దూరంలో కొండలకానుకున్న ప్రదేశమంతా చాలా పెద్ద ఇన్ ఫ్రా కంపెనీ హౌసింగ్ ప్రోజెక్ట్ గా డెవలప్ చేస్తున్నారు. 

 

అందుకే దాని చుట్టూ పనిచెయ్యడానికి ఎక్కడెక్కడి నుండో వచ్చిన కూలీలంతా చిన్నచిన్న గుడిసెలేసుకుని తలోచోట సెటిల్ అయ్యారు. 

 

ఈ పిల్లలంతా మా కాలనీ గోడకానుకున్న లేబర్ కాలనీ వాళ్ల పిల్లలు. వీళ్లంతా అలా దిసమొలలతో మా వీధిలో తిరగడం, మా గుల్ మొహర్ చెట్టుకింద కూచోడం , ఆటలాడుకోవడం మా చెడ్డ కష్టంగా ఉంది మా కాలనీ మారాజులకి. 

ముఖ్యంగా సోమయ్యగారి భార్య లక్ష్మిగారికి!

 

లక్ష్మీదేవిని ఇల్లువిడవకుండా తనింట్లోనే ఉంచుకునే ఎన్నో మార్గాలూ, పూజలూ, పద్ధతులూ తెలిసిన లక్ష్మిగారు అలగా జనాలు మన ఇంటికేసి చూసినా దారిద్ర్యపవనాలు మనపై వీస్తాయని గుర్తెరిగిన వారై నన్ను పదేపదే హెచ్చరించడమే కాకుండా, పిల్లల్ని వాచ్ మేన్తో కొట్టించడం, జర్మన్ షెపర్డ్ కుక్కలను వదలడం లాంటి సత్కర్మలు చేసి, ఆ దరిద్రులెవరూ ఆవైపు కూడా తొంగి చూడకుండా చేయగలిగారు. 

 

మాకు పెద్దగా వెళ్లిపోయే లక్ష్మిలేదు కనుక నాకు చీమకుట్టినట్టు లేదు. 

అయితే లక్ష్మిగారు మొత్తం కాలనీ జనాలని కూడగట్టి ఆ పాకలెత్తించే ప్రయత్నాలు మొదలు పెట్టడంతో, మావారు పూనుకుని ఒక తాత్కాలిక అంగన్వాడీ ఏర్పాటు చేయించారు. 

 

కాస్త పిల్లల రద్దీ తగ్గింది. కానీ మా ఇంటిముందు మామూలే! 

 

రోజులన్నీ మనవి కానట్టే, పనిమనషుల కొరత వొస్తే మనకి ఈ అలగా జనమే దిక్కని మా కాలనీ వాసులం తెలుసుకుని, కొన్నాళ్లకు వీరిలో కొందరిని పనిమనుషులుగా, తోటమాలులుగా, వాచ్ మెన్ గా పెట్టుకుని పరస్పర సహకార ఉపకారాలు సాధించుకుంటున్నాం. 

 

లక్ష్మిగారికీ, నాకూ రామి వాళ్ల అమ్మ పనిచేస్తోంది. మా ఇంటి పెరటి వరండాలో చంటి పిల్లాడికి ఉయ్యాలేసి, రామిని కాపలా పెట్టి పనులు చేసేది. 

 

ఒకే జీతానికి నాది గంటపని, ఆమెది ఐదుగంటల పని. మానేస్తానంటే నేనే స్నేహం పోతుందని వారించేదాన్ని.

 

మరుసటేడు శ్రావణమాసానికి కూతురూ, కోడలూ కూడా అమెరికా నుండి రావడంతో , సరదాగా మనవరాళ్ల చేత బొమ్మలకొలువు పెట్టించి, వరలక్ష్మీ వ్రతం చేయించి , మూడురోజుల పేరంటం పెట్టా. 

 

లాకర్లనుండి పూర్వోత్రపు నగలూ, వెండిసామానూ  తీసాము. 

లక్ష్మిగారికి సరదాలెక్కువ. 

రోజూ నాలుగింటికే ఒచ్చేసి, ఇదెక్కడిదీ, అదెక్కడదీ అని తెగప్రశ్నలు. మా అత్తవారిది జమీందారీ కుటుంబం. అప్పటి వస్తువులన్నీ  మంచి దిట్టంగా ఉండేవి. 

 

కొలువు తీసేస్తున్న నాలుగో రోజు అక్కడ రెండు పెద్దపెద్ద వెండి నెమళ్లు మిస్సింగ్. 

 

అవి ఎంతో సుందరమైన నగిషీలతో, ఎనామిల్, కెంపులూ, పచ్చలూ పొదిగిన పించాలతో చేయబడ్డ ఏంటిక్ పీస్ లు. 

 

అతిథులందరూ అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నవి. 

 

నాకయితే పిచ్చెక్కిపోయింది. 

మాకోడలు సన్నగా , "అలా అందరినీ రానిచ్చేయకూడదేమో ఇళ్లల్లోకి, అత్తయ్యా",  అంటూ చురకేసింది. 

 

మనసొప్పకపోయినా రామి తల్లినడిగా! 

 

ఆ పిల్ల గజగజలాడిపోయింది భయంతో! 

 

ఈయన రచ్చ చేయొద్దనడంతో నోరుమూసుకున్నా! 

 

ఆ మర్నాడు లక్ష్మిగారు ఫోన్ చేసి, తను ఆ నెమళ్లు ఫోటో తీసుకుని, అచ్చం అలాగే చెయ్యమనే పురమాయించేనని, పోయినందుకు తీవ్రసంతాపాన్ని ప్రకటిస్తున్నానని చెప్పి పెట్టేసింది. 

 

ఎందుకో నాకు రామి తల్లి మీద ముందుండే సానుభూతి పోయింది. 

మాటిమాటికీ విసుక్కోడం చేస్తున్నా. 

 

ఆ పిల్లలొస్తున్నా " వెధవ పిల్లలు! కాల్చుకు తినేస్తున్నారు" అంటూ తలుపులకి తాళాలేసాసా. 

 

మనసంతా కకావికలం అయిపోయింది. 

 

మా పిల్లలు మూడు వారాలవగానే వెళ్లేపోయారు! 

 

వినాయక చవితి వచ్చింది. 

మా కాలనీలో చాలా పెద్దవినాయకుడిని ప్రతిష్టించారు. 

 

రెండవరోజు ప్రముఖ గ్రూప్ యొక్క సినీ, లలిత సంగీత విభావరి నిర్వహించారు. మొత్తం అందరం వెళ్లాం వినడానికి. 

 

అది మంచి అదునయ్యింది. 

 

కాలనీలో ఎనిమిదిళ్లు మొత్తం దోచేసారు దొంగలు. సోమయ్యగారి ఇంటితో సహా! ఎక్కడా ఆనవాళ్లు దొరకలేదు! వేలుముద్రలు లేవు. 

 

కుక్కలరిచిన దాఖలాలు లేవు. పోలీసులు మోడస్ ఆపరాండీ ప్రకారం స్టూవర్ట్ పురం గేంగ్ కానీ, కలకత్తా గేంగ్ కానీ, గంజాం గేంగ్ కానీ అయ్యుండచ్చని భావిస్తున్నారు. 

 

చుట్టుపక్కల లేబర్ కాలనీలన్నీ బోర్లించేసారు. 

 

వాళ్లందరినీ నిష్కారణంగా కొడుతుంటే , నాకు మనసు కలిచేసింది. 

 

రామి తల్లినీ, తండ్రినీ , వాళ్లతోపాటూ ఉండేవారినీ కూడా రక్తాలొచ్చేట్లు కొట్టారు. 

 

రోజూ స్టేషనుకు తీసుకుపోయి, కుళ్లపొడిచి ఇంటరాగేట్ చెయ్యడం! 

 

ఏమీ దొరకలేదు. అలాగే పాపం అందరిళ్లల్లో పనివారినందరినీ! 

 

నాకు రామితల్లిమీద సానుభూతి పుట్టింది. 

 

కాస్త ఆ పిల్లలిద్దరికీ తినడానికి పెట్టడం, అదీ చేస్తున్నాను. 

 

మావారు మాత్రం వాళ్లవేపు నిలబడ్డారు. 

వాళ్ల ప్రమేయం ఉండదని హామీలిచ్చి విడిపించారు. 

ఆరునెలలు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో లేబర్ కాలనీ వాళ్లమీద జులుం తగ్గించారు. 

 

మహా అయితే ఇంకో మూడు నెలలున్నారో ఏమో వాళ్లు, పాపం తట్టా బుట్టా సద్దుకుని, పిల్లాపాపలతో ఓ డజన్ కుటుంబాలు ఏదో లారీ ఎక్కి వెళ్లిపోయారు! 

 

రామి కుటుంబం వచ్చారు కనిపించడానికి. దాని అమ్మ ఎప్పుడూ ఒక్క మాట మట్లాడేది కాదు. అలాంటిది" అమ్మా! నేను మీ సొమ్ము తియ్యలేదమ్మా" అంది. 

 

నాకు సిగ్గుతో ఒళ్లు చచ్చిపోయింది. 

 

అయినా పాపం వాళ్లేమి చేసుకుంటారు వాటిని! ... అని మనసులోనే బాధపడ్డా! 

 

నా మనసుకు లీలగా తెలుసు అది ఎవరు తీసుంటారో! కానీ ఆ మాట నా పెదవి దాటించే ధైర్యం నాకెప్పటికీ రాదు. దాని వలన ఎన్నో స్నేహాలు కోల్పోతాం. శత్రువులుగా మిగులుతాం! 

 

కొన్ని పాతచీరలూ, అతనికి ఈయన బట్టలూ, పిల్లలకు తలో వెయ్యి రూపాయిలూ ఇచ్చి సాగనంపా! 

 

మా కాలనీ చుట్టూ ఎత్తుగోడలు కట్టేసారు. 

 

ఇప్పుడు మాకు లేబర్ పిల్లల బెడద లేదు. 

 

మా ఇళ్ల కుక్కలకు మాత్రం వారంతా గుర్తే! సేవలు చేసిన వారు కదా!!

 

ఈలోపు మా ఇంట్లో ఓ అద్భుతం జరిగింది. 

 

నాలుగునెల్ల తరవాత, వాటర్ టేంక్ క్లీన్ చేయిద్దామని డాబా మీదకెళ్లా. 

 

క్లీనర్ సడన్ గా " అమ్మా! ఇదేదో ఉంది ", అంటూ ఓ చందనా కవర్ తీసాడు. 

 

బరువుగా ఉంది. తీసి చూద్దును కదా, మా వెండి జోడు నెమళ్లు. 

 

ఆనందం పట్టలేకపోయా! వెంటనే ఎవరికయినా చెప్పాలనిపించింది. 

 

పక్కింట్లోకి సాలోచనగా చూసా! 

 

ఇంచుమించు మా టేంకుకి రెండుచేతుల  దూరాన లక్ష్మి గారి బాల్కనీ! మరి చెప్పాలనిపించలేదు నాకు!! 

ఎవరితోనూ కూడా!!

 

ఐదేళ్లకి నా డెభ్భైవ పుట్టినరోజునే వయసు దుడుకునాపుతూ,  జారిపడి ఎడమచేతి ఎముక పుటుక్కుమంది. 

సర్జరీలు, ఫిజియోలయినా చెయ్యి బాగుపడలేదు. నరకయాతన అనుభవిస్తున్నా! 

 

మా అమ్మాయి అత్తారిది తిరుపతి . 

 

"మీరు రండి!  పుత్తూరు వైద్యం చేయిస్తా", అంటూ మా వియ్యపురాలు పదేపదే చెప్పడంతో దీని సంగతీ చూద్దామని ఇద్దరం బయలుదేరి వెళ్లాం! 

 

తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందని, మేము దిగిన మరునాటి రాత్రే మా వియ్యంకుడుగారు మాసివ్ హార్ట్ అటాక్ ఒచ్చి విష్ణుసాయుజ్యం పొందారు. 

 

ఎటూ వెళ్లే దారిలేక మేము హోటల్ కు మారాము. 

 

ఎస్ ఆర్ ఎమ్ రీజెన్సీ!! మూడునక్షత్రాల హోటల్. చాలా సౌకర్యంగా ఉంటుందని వాళ్ల డ్రయివర్ తెచ్చి దింపాడు! రూములవీ చాలా బావున్నాయి. ఆంబియన్స్, రూంసర్వీస్, ఫుడ్ సంగతి చెప్పనే అక్కరలేదు! అంత బాగున్నాయి! 

 

మర్నాడు పొద్దున్న రూంసర్వీస్ వాడకుండా కిందకొచ్చాం బ్రేక్ ఫాస్ట్ తినడానికి! 

 

మావారు ఉండుండి, " రామి" ! అన్నారు.

" ఏంటంటున్నారు"?

" రామి! రామి అదుగో! " అంటూ కొన్ని బల్లలవతల ఎవరితోనో మాట్లాడుతున్న టీనేజర్ ను చూపించి. 

 

ఆయనకీ మధ్య మతిమరుపు కొద్దిగా మొదలైంది. పేర్లు మర్చిపోతున్నారు కాస్త. 

 

రామి ఎవరో నాకు రిజిస్టర్ అయ్యేప్పటికి రెండు నిమిషాలు పట్టింది. 

 

ఈలోపున ఆ అమ్మాయి, ఆమెతో తెల్లని పంచె పైకికట్టి, శిల్క్ చొక్కా, మెడలో పులిగోరుపతకం, వేళ్లకి ఉంగరాలు, మండగొలుసులూ వేసుకున్న స్ఫురద్రూపి మా వేపుకే వస్తున్నారు! 

 

మాదగ్గర ఆగారు! 

 

" అమ్మా! బావుండారా? నేను సుబ్బరావమ్మని” అంటూ చెయ్యిపట్టుకుని అడుగుతోంది. 

నిజమే " రామి" యే! 

 

రామి తండ్రి సుబ్బరామయ్యనుకుంటా, మావారికి భక్తితో నమస్కారం చేసి, వినయంగా కుర్చీలో కూర్చోపెట్టాడు. ఇవీ, అవీ తెమ్మనమని పురమాయిస్తున్నాడు! 

 

రామి తెగ హడావిడి పడిపోతోంది. ఏదో చేసేయాలని మాకు ఓ తాపత్రయం. దాన్ని చూసి కళ్లు తిప్పుకోలేకపోయా! అసలే కళయిన మొహానికి సంపద తెచ్చే సోయగాలన్నీ వచ్చాయి! 

 

కానీ మా ఇద్దరికీ ముద్ద దిగడం లేదు. అంతా అయోమయం. అక్కడ తిరుగుతున్న ఇద్దరి ముగ్గురి రూపాలు కూడా చాలా చిరపరిచితంగా ఉంది! ఎన్నో అడగాలని ఉంది! కానీ అడగడానికి నోరు పెగలడం లేదు! ఈ కూలీలేంటి? వీరికి ఈ హోటలేంటి? 

 

మాటల్లో ఇలా పుత్తూరువైద్యానికి వచ్చామని చెప్పా! 

 

వెంటనే కారు కట్టించి , సుబ్బరావమ్మని సాయమిచ్చి మరీ పుత్తూరు పంపారు! 

 

ముప్పావుగంటలో రాచపాలెం అనే వూర్లో క్రిష్ణంరాజు గారి ఆసుపత్రి ఫేమస్ అని తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్ రేలు చూసి, చెయ్యి పరీక్షిస్తుంటే నొప్పికి భగవంతుడు కనిపించాడు. ఏవో తైలాలతో మర్దనా చేసి, చేతికి వెదురుబద్దల సపోర్టిచ్చి, ఆకు పసర్లు పూసి, కట్టుకట్టారు. తైలమిచ్చి, కట్టుని తడుపుతూ ఉండాలని చెప్పి, మళ్లీ పదిహేనురోజుల తరవాత రమ్మన్నారు. 

 

 ఇరవైరోజులున్నాము  తిరుపతిలో! 

 

మా అమ్మాయి, పిల్లలతో, రామి, దాని తమ్ముడు మురళితో ఇట్టే కాలం గడిచిపోయింది. 

 

కొండ పైకి వెళ్లి దైవదర్శనం చేసుకున్నాం. కాణిపాకం, కాళహస్తి, విల్లిపుత్తూరు అన్నీ తిరిగాం కట్టుతోనే. 

అన్ని చోట్లకు రామియే మాకు ఎస్కార్ట్. స్కూలు సెలవలట. గడగడా యాస తెలుగూ, ఇంగ్లీషూ మాట్లాడుతోంది.

 

మావగారి కార్యక్రమాలయ్యాకా మా అమ్మాయి వెళ్లిపోయింది. 

నేను మరోసారి పుత్తూరు కట్టేయించుకుని, ఇంక వూరు వెళ్లడానికి సంసిద్ధులమయ్యాం. 

 

మరునాడు మధ్యాహ్నం అనగా ముందురోజు రాత్రి సుబ్బరామయ్య, భార్య వెంకటి, రామి, మురళితో 

వచ్చాడు. 

 

అప్పటి వరకూ వెంకటీని నేను చూడలేదు. వస్తూనే నా కాళ్కు దణ్ణం పెట్టి ఒద్దికగా నిల్చుంది. ఐశ్వర్యం ఆమె సహజంగా ఎంత అందమైనదో తెలియజేస్తోంది. 

 

రెండు స్వీట్లపేకెట్లు, పెద్దజరీతో తేలికపాటి వెంకటగిరి పట్టుచీర, ఆయనకి పట్టుబట్టలూ తెచ్చి పెట్టారు. 

 

చెప్పొద్దూ, అవి తీసుకోడానికి నాకు ఒళ్లు చచ్చిపోయింది. 

 

వాళ్లకి ఎంత కురచచేతితో పెట్టేదాన్నో గుర్తొచ్చింది. 

 

అన్ని రోజుల స్టేకూ పదివేలు బిల్లేసి, తీసుకున్నారు. అదయినా ఆయన ఒప్పుకోరని!!

 

మా మనసుల్లో వీళ్ల గురించిన  ప్రశ్నార్ధకాలకు అంతులేదు! ఆన్సర్లూ లేవు! 

 

రేణిగుంట ఎయిర్ పోర్టు చేరాం! సుబ్బరామయ్యే  డ్రైవ్ చేసి తీసుకెళ్లాడు . 

 

పోర్టర్ చేత సామాను పట్టించి ఆయన ముందుకు నడుస్తున్నారు. 

 

పార్కింగ్ దగ్గర కారు దిగి నా వెనకాల వస్తూ సుబ్బరామయ్య , "అమ్మా!" అని పిలిచాడు. 

 

నేను ఆగి వెనక్కు తిరిగాను! 

 

" నీ వెండి నెమళ్లు తీసుకున్నావామ్మా నీళ్ల టేంకు లోంచి?"

 

నేనొక్కసారి కొయ్యబారిపోయా!

 

"నేనే పడేసానమ్మా ఆరోజు సోమయ్య గారి బాల్కనీ నుండి. 

వాళ్ల ఇనప్పెట్టెలో దొరికాయవి. 

వెంకటి పదేపదే బాధపడేది. 

అందుకే గుర్తుపట్టా. 

మీ సొమ్ము ముట్టుకుంటే భస్మమయిపోమా అమ్మా! 

మీకు తెచ్చి ఇచ్చే ధైర్యం లేదు. 

అందుకే టేంకులోకి విసిరేసా!  ఎక్కువ ఆలోచించకమ్మా! వాళ్లెవరూ గొప్పోళ్లు కాదు. మాకన్నా పెద్ద దొంగల్నే ఎంచుకున్నాం. అదే మా ఆఖరి మజిలీ. ఎందుకో తెలీదు సారు మంచితనమే మమ్మల్ని మార్చింది. మర్చిపో తల్లీ. ఆయనగారికి చెప్పమాకు! దండాలు మీకు"..... నెల్లూరు యాసలో అతను చెప్తున్నది నా బుర్రలో ఎంత వరకూ వెళ్లిందో తెలీదు. 

 

స్థబ్దుగా అయిపోయా! అతనెళ్లిపోయాడు!

 

ఫ్లయిట్ ఎక్కడంతోనే ఆయనని నిద్ర ఆవరించింది. అదృష్టవంతులు. అందరి మంచీ కోరుకుంటారు. అందుకే చింతలుండవు. చింతనలుండవు!

 

నేను బయటకి చూస్తంటే సడన్ గా బుర్రలో మెరిసింది.

 

"అవునూ! మా ఇంటికి కొంత దూరంలో, ఇసక బస్తాలతో ఉండే పాతలారీ! అది మళ్లీ కనపడలేదు నాకు వీళ్లు వెళ్లిపోయాక!" 

 

" అమ్మ దొంగా!!" ..... ఉలిక్కిపడ్డా! 

ఎవరో అమ్మాయి తన పాపని ఆడిస్తోంది. అవును అంతా ఆటే!! అందరూ ఆటగాళ్లే!!

.

OOO

Bio

ఓలేటి ( భావరాజు) శశికళ:

ఓలేటి ( భావరాజు) శశికళ: విశాఖపట్టణ వాస్తవ్యులైన వీరు ఆంధ్రాయూనివర్శిటీలో ఎం.ఎస్.సీ చేసారు.

స్వంత బీ.పీ.ఓ (మెడికల్ ట్రాన్స్క్రిప్షన్) బాధ్యతలు చూసుకునే వీరికి ఇష్టమైన వ్యాపకాలు- పద్యాలు రాయటం, కథలు రాయటం, పాడటం, చదవటం.

నేటి పిల్లలు అందరూ మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలి. అందరికీ చదువు, ఆహారం, వనరులు , ప్రేమ సరిపాళ్లలో దొరకాలి అన్న దిశగా ఆలోచనలు సాగుతుంటాయి.

వీరికి ఇష్టమైన రచయిత/ రచయిత్రులు: అడవిబాపిరాజుగారు, రావిశాస్త్రిగారూ, యద్దనపూడి! ఓల్గా, బీ. వీ. పట్టాభిరాం(బాబాయ్).​​

***

Oleti Sasikala
bottom of page