MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
'అలనాటి' మధురాలు
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు | శ్రీనివాస్ పెండ్యాల
భరత పక్షి
[రచయిత్రి చాగంటి తులసి గారు ఐదవతరగతిలోనున్నపుడు 1946 లో "బాల" పత్రికలో ప్రచురించబడిన తన కథని madhuravani.com పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ తరం పిల్లలకీ వినిపించేందుకు ఈ అలనాటి కథ -
బాల పత్రిక ముఖచిత్రం, అందులో ప్రచురించబడిన చాగంటి తులసి గారి చిత్రం చూడవచ్చు.]
-సేకరణ: మెడికో శ్యాం
ఒక ఊళ్లో ఒక బీదపిల్ల ఉండేది. ఏ ఊళ్లో అయినా బీదపిల్లలు జాస్తీగా ఉంటారు. గొప్పవాళ్ల పిల్లలు తక్కువమంది ఉంటారు కదూ. అంచేత అ అమ్మాయి కూడా అందరి పిల్లల్లాగే బడికి వెళ్ళుతూ ఉండేది. స్కూల్లో పిల్లలు బడికి వచ్చేటప్పుడు మంచి బట్టలు కట్టుకొని, నగలు పెట్టుకొని, చక్కగా వచ్చేవారు. పాపం ఈ అమ్మాయి మాసిపోయినవి చింకిబట్టలు వేసుకొని విచారంగా వెళ్లేది.
ఇంటిదగ్గర కడుపునిండా తినడానికి తిండైనా ఉండేది కాదు. వేసంగికాలములో పాపము బడి నుండి వచ్చేసరికి చల్లగా కడుపు నిండా తాగేందికి తరవాణి కూడా ఉండేది కాదు. అంతమంది అమ్మాయిలు ఎంచక్కా హాయిగా ఉంటే, తను మాత్రము ఇలాగ ఉండడము ఎందుకు. ఇంతకన్నా చచ్చిపోవడమే మేలు అనుకుంది.
ఒకనాడు స్కూల్లో ఎంతో కష్టపడి ఎంతో ఆకలితో ఇంటికొచ్చి వాళ్లమ్మని అన్నము పెట్టమంది. పాపం వాళ్లమ్మ "ఇంట్లో ఏమీ లేదు. రాత్రి అయినా పెడతా. ఇప్పటికి బడికి వెళ్లిపో" అని బ్రతిమాలింది. ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ “అలాగే అమ్మా” అని బయలుదేరింది.
ఇన్ని బాధలు పడుతూ బ్రతికి ఉండడముకంటే చచ్చిపోవడమే మేలు అనుకొని నిశ్చయించుకొంది. బడికి వెళ్ళేదారి మానేసి మరో దారిని ఊరు అవతలికి పోయింది. అక్కడ భూములన్నీ ఎండిపోయి కనిపించాయి. మళ్ల గట్ల మీంచి ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టు క్రింద కూర్చుని గట్టిగా ఏడవడము మొదలెట్టింది.
ఏడుపు వినేందికి ఎవరు ఉంటారు అక్కడ? కాని ఆ మామిడిచెట్టు మీదనున్న ఒక భరతపక్షి ఆ అమ్మాయి ఏడుపు విని క్రిందకి వచ్చి "ఏవమ్మా! ఏడుస్తున్నావు వెక్కివెక్కి?" అని అడిగింది.
ఆ అమ్మాయి "మా బడిలో పిల్లలు మంచి బట్టలు వేసుకొని వస్తారు. నగలు పెట్టుకొంటారు. నేనీ మాసిన బట్టలతో వాళ్ల దగ్గర కూర్చోడానికి సిగ్గు వేస్తుంది. పోనీ కడుపునిండా తిండానికైనా తిండి లేదు. ఇవాళ అన్నం లేకుండానే మా అమ్మ బడికి వెళ్లమంది. ఎందుకు ఈ బీద బ్రతుకు బతకడం? చచిపోవడమే మేలు అనుకొని ఇలా వచ్చాను" అని చెప్పింది.
ఆ భరతపక్షి అంది: "నీకు దేశము ఎలాగ ఉందో తెలియదు. నీవొక్కదానివే ఇలా బాధలు పడుతున్నావు అనుకున్నావు గదా! నా మీద కూర్చో. నిన్ను ఆకాశము మీదకి తీసుకువెళ్ళి ఒక వింత చూపెడతాను" అని అంది. ఆ అమ్మాయి "అమ్మో పడిపోనూ! నాకు భయం వేస్తుంది. నే రాను" అంది.
"భయపడకమ్మాయి. నా రెక్కల క్రింద దాస్తాను. నీకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు," అని చెప్పి తన రెక్కల క్రిందనుంచి ఒక విబూది తీసి "ఈ విబూది నీ ముఖమున పెట్టుకో. నాకింత పెట్టు. ఇది అలా పెట్టుకుంటే మనము ఇతరులకు కనిపించము. మనకు ఇతరులు కనిపిస్తారు"అని చెప్పింది.
ఆ అమ్మాయి ఆ విబూది తన ముఖమున పెట్టుకొని ఆ పక్షి ముఖమున ఇంత రాసి ఆ పక్షి రెక్కలో దూరింది. ఆ పక్షి విమానములాగా లేచిపోయి ఆకాశము మీద ఎగరడము ప్రారంభించింది. ఎన్నో రోజులు దేశమంతా తిప్పింది.
దేశములో ఎక్కడ చూచినా భూములు పండలేదని పెద్దవాళ్లు, తినేందికి అన్నము లేదని పిల్లలు, కట్టుకొనేందికి బట్టలు లేవని ఆడవాళ్లు మొఱ్ఱపెట్టి ఏడవడము ఆ అమ్మాయి చూచి, విన్నది.
“నీ కళ్లతోటి నీవే చూసేవు కదా దేశము ఎలాగ ఉందో. నలుగురితోపాటు నారాయణా అని కొద్ది రోజులు ఓరిస్తే తినేందికి అన్నము, కట్టుకొనేందికి బట్టలు దొరుకుతాయి. చచ్చిపోతే ఏమి లాభము” అని చెప్పి, “మనము బయలుదేరి చాలా రోజులయింది. నీవు ఏమైపోయావో అని మీ అమ్మా, నాన్నా బెంగపెట్టుకొంటారు” అని చెప్పి ఆ అమ్మాయిని మామిడిచెట్టు దగ్గర దింపేసింది భరతపక్షి.
ఆ అమ్మాయి ఇంటికెళ్ళేసరికి వాళ్ల అమ్మా, నాన్నా బెంగపెట్టుకొని ఏడుస్తున్నారు. ఆ అమ్మాయిని చూచి వాళ్లమ్మా, నాన్నా సంతోషించారు. ఆ భరతపక్షి చూపించినవి అన్నీ వాళ్లమ్మా నాన్నతో చెప్పిందా అమ్మాయి.
ఆ రోజునుంచీ ఉన్నా, లేకపోయినా ఆ అమ్మాయి బుద్ధిగా చదువుకొని గొప్ప పరీక్షలు ప్యాసయింది. మనము కూడా అలా చెయ్యాలి. చేస్తారు కదూ.
భరతపక్షి చెప్పిన నీతి మన భారతదేశములో చిన్నపిల్లలకోసమే. "మనకు కరువు వచ్చినా కొద్ది రోజులు ఓర్చాలి."
********