top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

'అలనాటి' మధురాలు

నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com 

మాతృదర్శనమ్

మునిపల్లె రాజు

సేకరణ - శ్యామ్ చిర్రావూరి​

"తత్ దినమ్  అంటే ఆ రోజు స్మృతించవలసిన ఆ దినము. తద్దినము అని మనం అనాలోచితంగా అంటాము.

ఆబ్దీకమ్ అంటే అబ్దానికి అనగా సంవత్సరం సంవత్సరం ఆచరించవలసింది.

శ్రాద్ధం అనగా శ్రద్ధతో నిర్వహించవలసినది.

"మానవుల కాలమానంలో సంవత్సరం- పితృదేవతలకు ఒక రోజు కింద లెక్క. అనగా మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న శ్రాద్ధకర్మ ద్వారా మన పితృదేవతలు ప్రతి దినమూ భుజిస్తున్నారన్నమాట. ఒక్క అబ్దీకం మానితే పితృదేవతలకు ఆ దినం ఉపవాసమే నన్నమాట."

గరుడపురాణంలోని కొన్ని అంశాలను, స్వల్ప కన్నడ యాసతో తెలుగులో వివరించి చెబుతున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మడు. రాఘవేంద్రస్వామి మఠం మేడ మెట్ల మీద, ధోవతి సరిగా మడుచుకోవటం రాని ఒక యువకుడు ఆ మాటలు వింటున్నాడు.

ఉదయం తొమ్మిది గంటలయింది. హైదరాబాదులోని బర్కత్‌పురా అంచున వున్న రాఘవేంద్రస్వామి మఠం ధనుర్మాసంలో అయితే తెల్లవారుఝామునుంచీ భక్తబృందంతో కిక్కిరిసి ఉండేది. ఇప్పుడు ధనుర్మాసం గడిచిపోయింది. స్వామివారి బృందావనం ముందు కొద్దిమంది భక్తులు తీర్థం తీసుకొంటున్నారు. కాని మఠం  పై అంతస్తు శ్రాద్ధకర్మలు నిర్వర్తించటానికే వేచి ఉన్న పాతిక, ముప్పయిమంది శిష్టాచారులతో నిండుగా ఉంది.

అట్లా వేచి ఉన్నవారిలో చాలామంది ఉద్యోగస్తులు. కొందరు పెన్షన్‌దారులు. గరుడపురాణం గాని, మార్కండేయ పురాణం గాని వారికి పట్టినట్లు లేదు. ఆఫీసుల మీది ధ్యాసతో చేతి గడియారాలు చూసుకొంటూ, ఉబుసుపోకకు రాజకీయాలు, లోకాభిరామాయణాలు మాట్లాడుకొంటూ ఎవరి ఆధిక్యాన్ని వారు చాటుకుంటూ ఇతరులను ఖండిస్తే గాని తమకు తృప్తి లేదనుకొనేవారే అధిక సంఖ్యలో ఉన్నట్టున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు అందరిమీదా రుద్దితే గాని వాళ్ల పితరుల ఆత్మలు శాంతించవు కాబోలు అని ఒకరిద్దరు జిజ్ఞాసువులు అంతరంగికంగా తలపోస్తున్నారు.

సుశీల రెండుసార్లు మెట్లు దిగింది. రెండుసార్లు ఎక్కింది. మేడమీది మూడు హాళ్లను పరికించి వచ్చింది. అపరకర్మలు నడిపించే మఠం తాలూకు బ్రహ్మవేత్త కూడా పెద్ద దర్భల చుట్ట  పట్టుకొని పైకి వచ్చి, అక్కడి ఏర్పాట్లన్నీ ఒకసారి పరికించి చూసి, వంట బ్రాహ్మడితో కన్నడంలో మాట్లాడుతూ "ఇదుగో అయిదు నిమిషాల్లో ప్రారంభిద్దాం. యజుర్వేదులంతా అటు కూచోండి. బుగ్వేదులు ఇక్కడ" అని శ్రాద్ధకర్మలకు స్థలాలు నిర్దేశించాడు. నీళ్ల చెంబు, హరివేణం, ఉద్దరణి, చిన్న గిన్నెలో నువ్వులు, మరో చిన్న గిన్నెలో బియ్యపు గింజలూ, అన్నపు గిన్నె , పాయసపు పాత్ర, కణకణలాడుతున్న బొగ్గులతో ఒక్కొక్క కుంపటి, వాటితోపాటు ఆకు దొప్పలు, ఒక్కొక్కరి ముందు ఇవన్నీ ఉన్నాయి గాని, మరిచిపోయిన తులసిదళాలు, గంధం ఆకు, బెల్లం ముక్క, పెరుగు గిన్నె, నేతి దొన్నెలు తెచ్చి వంట బ్రాహ్మడు సర్దుతుంటే సుశీలకు మరింత ఆత్రత కమ్ముకొన్నది.

ఆ తోజు ఆమె తల్లి ఆబ్దీకం. కర్తగా కుదుర్చుకొన్న బ్రాహ్మడింకా రాలేదు. సామూహిక శ్రాద్ధ కాండ ప్రారంభించ బోతున్నారు.

కళ్లలో, మాటల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా ఆమె మంత్రోచ్చారణకు నోరు విప్పబోతున్న బ్రాహ్మణ్ణి సమీపించి "ఏమండీ.." అంది.

రాజకన్యలా ఉన్న ఆమె ఠీవినీ, అందాన్నీ, కొట్టవస్తున్నట్లున్న ఆమె ఐశ్వర్యమూర్తిని ఎవరు గౌరవించకుండా ఉండగలరు?

"ఫరవాలేదమ్మా. కింద ఆఫీసుకు పోయి చూడండి. బీదబ్రాహ్మలెవరైనా దొరుకుతారు"

సుశీల గబగబా మెట్లు దిగిపోతున్నది. రెండు చేతుల నిండా బంగారు గాజులు, కళ్లకు రోల్డుగోల్డు ఫ్రేము అద్దాలు, బంగారు రంగు బెంగుళూరు పట్టుచీర, చేతిలో ధోవతుల జత ఉన్న పాకెట్టు, భుజాల నిండుగా కప్పుకొన్న మీగడ తెలుపు కాశ్మీరు శాలువా. అందర్నీ అంటే సామాన్యులందర్నీ కిటికీ దగ్గరకు వచ్చి మాట్లాడమనే మఠం మేనేజర్లు కూడా ఆమె చొరబడి లోనికి వస్తుంటే లేచి నుంచొని మర్యాదగా సానుభూతిగా మాట్లాడుతున్నా అక్కడ మనిషెవరూ కనిపించక మళ్లీ ఆవేదనతో మెట్ల ముందుకు సాగింది.

అప్పుడు కనపడ్డా యువకుదు. సన్నగా, దృఢంగా పాత ధోవతి నలిగిన లాల్చీ, పైన టవలు, రెండు రోజుల గడ్డం, ఆకలిగా ఉన్నట్లు లోతుకుపోయిన కళ్ళు, చామనచాయ దేహవర్ణం.. ఇదీ అతని ఆకారం. మఠంలో మధ్యాహ్నం భోజనం టిక్కెట్టుకు ఇట్లాంటి వాళ్లు ప్రతి రోజూ ఒకరిద్దరైనా తగులుతుంటారు. ముఖ్యంగా పేద కన్నడ బ్రాహ్మలు. సుశీల అతన్ని నిలవేసింది.

"ఏమండీ. మీరు .. మీరు బ్రాహ్మలేగా?"

అతను ఆమెను పూర్తిగా చూడకుండానే తల ఊపాడు.

"చూడండి. ఈ రోజు మా అమ్మగారి శ్రాద్ధకర్మ ఉంది. నాకు అన్నదమ్ములెవరూ లేరు. కుదుర్చుకున్న బ్రాహ్మడు ఇంతవరకూ అయిపు లేడు. భోక్తలున్నారు పైన. మీరు కూర్చుంటారా ఇబ్బంది లేకపోతే. పాతిక రూపాయలిస్తాను దక్షిణ. ఇదుగో ధోవతుల జత. ఉత్తరీయాలు. మీకు పుణ్యముంటుంది. మా అమ్మ తద్దినం ఎప్పుడూ మానలేదు."

అంతా విన్నాడో లేదో అతను. "పదండి" అని మాత్రం ముందుకడుగేశాడు. మొదటిసారిగా ఆమె ముఖం పరికించినట్లుంది. "నాకేమీ అక్కర్లేదు.మాతృయగ్నం చాలా పవిత్రమైనది" అన్నాడు.

నాలుగైదు నిముషాల్లో అతను చన్నీళ్ల స్నానం ముగించి, గుడ్డలు పిండుకుంటూ హాల్లోకి వచ్చాడు. ఆమె అతనికి చోటు చూపిస్తూ "కృష్ణయజుర్వేదులం. ఈ చీటీ మీద మా గోత్రపురుషుల ప్రవర, మా అమ్మగారి పేరు, మా నాయనమ్మల పేర్లు ఉన్నాయి. శ్రమ అనుకోకుండా శ్రద్ధగా.." అని చీటీ అందించింది.

అతను చీటీ ఒకసారి చూసుకున్నాడు. భారద్వాజస గోత్రం. మొదటి పేరు "శారదాంబ" ఉలిక్కిపడి ఆమె వంక చూసి తల పంకించాడు. అతని తల్లి పేరు కూడా శారదాంబే.

సుశీల అనిర్వచనీయమైన తృప్తితో అతని వంక మరోసారి చూసింది. తడి టవల్ మొలకు గట్టిగా చుట్టుకున్నాడు. మెడలో మూడు పోగుల జందెం, నిమీలిత నేత్రాలతో గాయత్రిని జపిస్తూ, ఏదో కూలికి కాకుండా తల్లి శ్రాద్ధకర్మనే నిర్వర్తిస్తున్నట్లుగా దీక్ష పూనిన యువపరివ్రాజకుడిలా గోచరిస్తున్నాడు.

పరివ్రాజకుడు అన్న శబ్దం హృదయక్షేత్రంలో ప్రతిధ్వనించి సుశీల ఉలిక్కిపడ్డది. వెన్నుపూసమీద హిమవర్షం కురిసినట్లయింది. "ఏమయిందమ్మా? ఏమయింది?" అని ఆమె పక్కనే నిలబడి ఉన్న ఇద్దరు ముత్తయిదువులు ప్రశ్నిస్తున్నారు.

"ఏం లేదండి. మా నాన్న అమ్మా జ్ఞాపకం వచ్చారు" అని గోడకానుకుని నిలబడింది.

దాదాపు అతని వయసులోనే తన తండ్రి సన్యాశ్రమం స్వీకరించాడు. ఎవరి అనుమతీ తీసుకోలేదు. ఎవరినీ సంప్రదించలేదు. "శాంతమూర్తి" అని అమ్మ ఒకే ఒక మాటలో ఆయన్ని గురించి ప్రస్తావించేది. తన మేడ, ఐశ్వర్యం, అనుకూలవతి అయిన భార్య, రెండు నెలల పసికందయిన తాను.. ఇవన్నీ విడిచి ఆ ముష్మికలోకాల్ని వెతుకుతూ, అంత అకస్మాత్తుగా ఏ దిక్కున పయనించాడో ఈనాటికీ అగమ్యమే.

ఒక్కసారి మాత్రం తల్లితో ఒకే ఒక వాక్యంతో తన మనోవేదన చెప్పుకొన్నాడట. "ఈ జీవితం అబద్ధమైనది" అని. అమ్మ ఏమని ఏడ్చిందో, ఏ దేవతల్ని ప్రార్ధించిందో తనకెట్టా తెలుస్తుంది? మొసలి కన్నీరు కారుస్తూనే ఆస్తికోసం వింత వింత ఉచ్చులు పన్నిన బంధువుల నుంచి, జ్ఞాతి వైషమ్యాల నుంచి స్వీయరక్షణ చేసుకొంటూ, తనను కంటిరెప్పగా సాకిన తల్లి మాత్రమే తనకు గుర్తు. ఎవరు రూపమో, ఎవరు నీడో తెలీకుండా పెంచిన సౌజన్య స్వరూపమొక్కటే తన ఆరాధ్యదేవి అయింది. ఆ కారుణ్యమూర్తి కోర్కెతోనే పెద్ద చదువులు చదివిందీ, ఆడిందీ, పాడిందీ.

మూడేళ్ళ క్రితం అనాయాసంగా తన అసిధారావ్రతాన్ని ముగించి తనువు చాలించింది. ఒక్కటే కోరిక. "తల్లీ.. మంచివాన్ని చూసి పెళ్ళాడు" తుది కోరిక. ఎవరా మంచివాడు? తన ఆస్తిని చూసి భ్రమించేవాడా? అంతస్తుకు విభ్రమం పొందేవాడా? తన తల్లిని గౌరవించేవాడే తనకు మంచివాడు. తులసికోటలాంటి తల్లి ప్రశాంతతే తన అవ్యక్తావేదన. ఎవరితో ముచ్చటించినా తీరని ఆ ఆవేదనకు అక్షరరూపమే ఆమె ఈ నాలుగేళ్ళ నుంచీ రాస్తున్న "మాతృ స్మృతి" పద్యాలూ, పాటలూ, సాంప్రదాయబద్ధమైనవీ, పాశ్చాత్యరీతులవీ. విశ్వవిద్యాలయంలో తను చదువుతున్నప్పుడు ఆకళించుకొన్న ప్రాక్పశ్చిక ప్రాకరాల మధ్య ఉన్న స్మృతుల రవళి. ఎవరికీ చూపలేదు. ప్రశంసల ప్రస్తావనే లేకుండా తన ఆత్మతృప్తికీ, వేదనోపశమనానికీ వేలు వెచ్చింది అచ్చు వేయించింది. వానిటీ బ్యాగు నుంచి తీసి చదువుకుంటున్నది.

కింద స్వామి బృందావనం నుంచి హస్తోదకం గంట వినవచ్చి సుశీల పుస్తకం మూసింది. అక్కడ శ్రాద్ధ కర్మకాండ కూడా ముగిసినట్లుంది.

“ఆ వాయన పిండాన్ని దొన్నెలో వేసుకుని పైకి వెళ్లి కాకులకి పెట్టండి" అని వశిష్టులవారు నిర్దేశిస్తున్నారు.

అతను దొన్నె రెండు అరచేతుల మధ్య ఉంచుకొని డాబా మీదికి నడుస్తున్నాడు. తను కూడా అతని వెనకనే వెళ్ళింది. పిట్టగోడ అంచున దొన్నెను ఉంచి కళ్లు మూసుకొని నమస్కరిస్తున్నాడో లేదో, కాకి వచ్చి పిండాన్ని అమాంతం నోట కరచుకుంది. ఆమె కళ్లు చెమ్మగిల్లి వందనం చేస్తూ రెండు క్షణాలు నిలబడిపోయింది. వాయస రూపంలో వచ్చిన పితృ మాతృదేవతలు తృప్తి పడ్డారు గదా. ఎప్పుడూ, ఈ మూడు, నాలుగేళ్ల నుంచి తనకంత ఆనందం కలగలేదు.

అతను మళ్ళీ మెట్లు దిగి తడిపొడిగా ఉన్న ధోవతిమీదనే  గోడవొరన ఉంచిన చొక్కా తొడుక్కొని తువాలును ఒకసారి నిశ్శబ్దంగా దులుపుకొని ఆమెకోసం కాబోలు కలయజూస్తున్నాడు. సుశీల అతని ఎదుటనే ఉన్నది.

"అదేమిటీ? భోజనం చేయరా?" అని విస్తుపోయి అడిగింది.

శ్రాద్ధకర్మ వారికి మఠం వారు మూడు భోజనం టికెట్లు  కూడా ఇస్తారు. మిగతావారు అన్న పాయస శేషాన్ని ప్రసాదంగా భావించి గాని,  యజ్ఞశేషమనుకొని గాని భోజనశాలకు తమతో తీసుకుపోతారు.

"లేదండి. నేను వెళ్లాలి. భోక్తలింకా ఉన్నారు కదా?"

సుశీల గబగబా పర్సు తీసి చూసింది. పది రూపాయల నోటు ఒక్కటే ఉంది. మిగతావి ఏభైలు, వంద నోట్లు. ధోవతుల పాకెట్టు విప్పి ఒక ఏభై నోటు ఉత్తరీయల జత మీద పెట్టి "చాలా థాంక్సండి. సమయానికి మీరు కనిపించకపోతే చాలా ఇబ్బందయేది" అంటూ ఇవ్వబోయింది.

"నాకేమీ అక్కర్లేదన్నాను ఇందాక. మళ్లీ అదే మాట. మీ తృప్తికి శాస్త్రార్ధం రూపాయి పావలా దక్షిణ ఇస్తే చాలు"

"మరి ఇవి.." అవి ధోవతులు.

"ఇక్కడ బ్రాహ్మల కెవరికైనా ఇవ్వండి. బయట పేదవాళ్లు బారులు తీర్చి కనపడతారు. వాళ్లకు దానం చేయండి. మంచిది కూడా."

పర్సాంతా వెతికినా రూపాయి నోటు కనిపించలేదు. పావలా దొరికింది. తను పేదవాడని తెలుస్తూనే ఉంది. కాని దానం గ్రహించడు.

"ఒక్క క్షణం ఉండండి. కిందకు పోయి చిల్లర తెస్తాను."

ఆమె వెనకనే అతను మెట్లు దిగుతూ " ఆ పావలా బిళ్ల చాలు కదండీ. శ్రమ పడవద్దు" అంటూ చెయ్యి చాపాడు.

"అయితే ఉండండి. ఆటో చార్జీలన్నా తీసుకోరా ఏమిటీ?" అంటూ పది నోటూ, పావలా బిళ్లా అందించబోయింది.

"ఆటో అక్కర్లేదు. చాలా దగ్గిర" అని పావలా కాసు చేతిలో తీసుకుని "వస్తానండి" అంటూనే విసవిసా నడిచిపోయాడు. మట్టి అంటుకున్న పాత తడిపొడి ధోవతీ, అదే పాత నలిగిన లాల్చీ, వెలిసినదైనా నిండుతనం ఇస్తున్న భుజం మీది టవలూ, కాళ్లకు చెప్పులైనా ఉన్నాయా? దానగ్రహీత లెందరినో చూసిన తను, ఈ అపరిగ్రహీతుడి వింతధోరణినీ, వినయసంపత్తినీ ఆశ్చర్యంగా ఆలోచిస్తూ, అసంతృప్తి ఆవహిస్తుండగా గేటు దాకా వచ్చి "ఏమండీ!" అని పిలిచి ఆగిపోయింది.

"నాకేమీ బాగోలేదు. ఏమీ  తీసుకోలేదు. ఇదిగో ఈ పుస్తకమ్మన్నా పుచ్చుకోండి. మా అమ్మగారి.."

నిస్సంకోచంగా గ్రంథాన్నందుకొని వెంటనే పుటలు తిప్పుతూ ఆగిపోయి, మొదటిసారిగా ఆమె ముఖాన్ని తిలకిస్తూ "మా అమ్మ పేరు కూడా శారదాంబే. మాతృ స్మృతి అంటే మాతృస్తవమే. ఆమె ధన్యురాలే. స్తోత్రం రాసినవారూ ధన్యులే" అంటూ పేజీలు తిరగేస్తూనే ఉన్నాడు. అతను కదలిపోవటం కూడా సుశీల గమనించలేదు. భోజనానికి ఆమె మఠంలోకి వెనుదిరిగిపోయింది.

*****

దాదాపు సంవత్సరం నుంచి శ్రీనివాస శర్మ వ్యాకుల పడుతూనే ఉన్నాడు. బొంబాయిలో ఉన్న మూడేళ్ళూ తల్లి తద్దినం పెట్టడానికి నానాయాతనలూ పడవలసి వచ్చింది. ఒక ఏడు మాత్రం నాసిక్ దగ్గర త్రయంబకేశ్వరం వెళ్ళి జరిపించగలిగాడు. రెండేళ్ళు అన్నదాన సమాజం వారికి కొంత డబ్బు కట్టి శ్రాద్ధకర్మ నిర్వర్తించాననుకొన్న అర్ధభాగం తృప్తితో మసిలాడు. నిరుడు హైదరాబాద్ బదిలీ కాగానే మాతృయజ్ఞానికి ఆటంకాలు తొలగిపోయాయనుకుని వంటమనిషినీ, బ్రాహ్మణ్ణీ, భోక్తల్నీ ముందే కుదుర్చుకుని ఆఫీసులో తన తోటివాళ్లందర్నీ భోజనాలకు పిలిచాదు. తీరా పెద్ద ఎత్తున వంట పూర్తయి నిరీక్షిస్తూ, అపర్ణాహం కూడా గడుస్తున్నా బ్రాహ్మలు రాకపోయేసరికి చిరాకు పడి, నరసింహాన్ని పంపించాడు. ఆరా తీయగా ఆ నలుగురు విప్రులూ అయిదు వందల రూపాయలకు ఆశపడి సైనిక్‌పురిలో ఒక మిలిటరీ ఆఫీసరు తండ్రి చావుకు తరలిపోయారని భోగట్టా దొరికింది. ఇక ఆ వంట బ్రాహ్మడే ఎవరో ఇద్దరు బ్రహ్మచారుల్తో తతంగం అయిందనిపించాదు. శర్మ ఖిన్నుడైపోయాడు. నిజానికి తన జీవితమంతా వ్యాకులమే కదా అనుకున్నాడు.

పుట్టింది పేదగా, మారిన శిష్ట కుటుంబంలో. బాల్యంలోనే, తనకు జ్ఞానం స్ఫురించకముందే తండ్రి చావు. అష్టకష్టాలు పడి, ప్లీడర్ల ఇళ్ళల్లో వంటలు చేసి , తనకు వారాలు కుదిర్చిన అమ్మవల్ల తన చదువు ముందుకు సాగింది. కాలేజీ నుంచి స్కాలరుషిప్పులు అంచెలంచెలుగా అయినా, నిరాఘాటంగా తన చదువు ఈడేరుతున్నది. కాని పూలమ్మిన ఊళ్ళోనే కట్టెలమ్ముతూ, కొవ్వొత్తిలా కరిగిపోతూ, తన కోసమే బతికిన తల్లి సంగతి తన చదువు మత్తులో మరిచి పోయాడేమో? నేడో రేపో తనకు ఉద్యోగప్రాప్తి అని తలపోస్తుండగా ఆమెకు అవసానకాలం. తను స్కాలర్‌షిప్పులో మిగిల్చి పంపిన మొదటి సంపాదన తల్లి దహన క్రియలకు మాత్రమే ఉపయోగపడింది. ఎవరికోసం ఈ చదువు. ఎవరి కోసం బ్రతుకిక? ఎవరి నుద్ధరించదానికి తన ఉద్యోగ ప్రయత్నం? మేనమామ ఎవరెవరినో అర్ధించి తెచ్చిన అప్పుతో నిత్యకర్మ ప్రారంభించాడు. కులం పట్టింపులు, క్రియారూపక మతకర్మలు, వీటిలో ఏమీ విశేషం గోచరించని నమ్మకం, తన సంస్కారం, చదువు, కర్మ చేస్తున్నప్పుడు మొదటిసరి గరుడపురాణం విన్నాడు. పితృదేవతలు పైశాచిక ప్రేతరూపం విసర్జించి చంద్రలోకం దాకా పయనించడానికి పదహారు మాసాల కాలం. మాసికాలు, ఏడూరు అనబడే సాంవత్సరీకం నిర్వర్తించేసరికి ఈ ప్రథమ ప్రయాణం ముగుస్తుంది. మన కాలమానం నెల పితృదేవతలకు అప్పటివరకూ ఒక దినమే. నమ్మకం లేకుండానే విని తనకింత ఉపశమనం ఎందుకు కలిగిందో విమర్శించుకున్నాడు. అమ్మ చివరి మాటలు తను వినలేకపోయినా, మేనమామ నోటి నుంచి విని శ్రాద్ధకర్మలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాడు. ప్రతి శిశువులోనూ ఎదగబోయే వృద్ధుడి రూపాన్ని చూసే నిస్పృహ ధోరణి నుంచి, మరణం పొందనున్న ప్రతి మానవ స్వరూపంలోనూ గుప్తమైన శాశ్వత స్థితి ఇమిడి ఉన్నదన్న బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకుని, తన తల్లి వంటి దైన్యుల కందరికీ ఒక శరణాలయం స్థాపించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. అది లక్షలతోనే సాధ్యమయ్యే సంకల్పం. అందుకే తన అర్జనంతా వినియోగిస్తున్నాడు.

రాఘవేంద్రస్వామి మఠం అతనికి చాలా నచ్చింది. కన్నడ ఆంధ్ర సంప్రదాయాల్లో అభేదం, శిష్టులకు, ఆధునికులకు కూడా అనుకూల వాతావరణం. నరసింహం చెప్పిన మీదట అక్కడి ఏర్పాట్లు చూసి, తల్లి శ్రాద్ధానికి అనుకూల స్థితి ఉందని తృప్తి పడి, తిథి, వారం, తేది నిశ్చయం చేసుకోవడానికే ఆనాడు వచ్చింది. తల్లి ఎంత దీనురాలిగా ప్రపంచయాత్ర ముగించుకుందోగాని, ఆంత నిరాడంబరంగానే అతనక్కడకు వెళ్ళాడు. అది అలవాటు. సుశీల అప్పుడే అతన్ని నిలవేసింది.

 

*****

 

తీరా సుశీల ఇంటిని చేరిన తరువాత గాని తన వానిటీ బ్యాగ్‌లో ఒక కొత్త  మనీపర్సు ఉన్నట్లు తెలుసుకోలేదు. ఎంతటి మతిమరపు? తనదా? తను స్నానం చేయబోతూ చేతికందించి, చివరకు తిరిగి తీసుకోకుండానే నిర్గమించిన ఆ పేద యువకుడిదా? అయ్యో ఎంత పొరపాటు జరిగింది అని విస్తుబోయి, పదిసార్లు దాన్ని తెరిచి మూసింది సుశీల.

ఎస్.ఎస్.ఖణ్వన. పి.హెచ్.డి అన్న లేబిల్ మాత్రం టైప్ చేసిన అక్షరాలతో సగం మాసిపోయి కనబడుతున్నది. లోపల మూడు వంద రూపాయల నోట్లు, ఏడు పది రూపాయల నోట్ల్లు, రూపాయి లోపు చిల్లర, కొత్తగా ఉన్న రెండు చిన్న తాళపు చెవులు. వాటిని చూడగానే మొదట స్కూటర్‌వేమోనన్న అనుమానం తగిలి పరీక్షగా పరిశీలించింది. అవును. అయితే అతను స్కూటరు మీద వచ్చి ఉంటాడా? లేక.. లేక.. దొంగ పర్సా? చీ, పాపం. మరి ఎట్లా వెళ్లగలిగాడు? స్కూటర్‌ని లాక్ చేయకుండానే వచ్చి, ఆపి, తిరిగిపోయి ఉంటాడా? ఏ దృష్టినుంచి ఆలోచించినా పశ్చాత్తాపం చుట్టుముడుతూనే ఉంది.

మర్నాడు బ్యాంకులో తన కాబిన్‌లో కూచున్న తక్షణమే టెలిఫోన్ డైరెక్టరీ తీసి పేరు వెతికింది. ఎస్.ఎస్.ఖణ్వన లేదు. పోనీ, ఖణ్వన ఎస్.ఎస్ . అదీ లేదు. ఎక్సేంజికి ఫోన్ చేసి ఎంక్వయిరీ చేసింది. ఊహూ! నిజంగా దొంగ పర్సేనేమో అని భయం పట్టుకున్నది. సబ్ మేనేజర్ పురుషోత్తంగారిని పిలిచి సలహా అడిగింది.

"ఇదేదో ఉత్తరాది పేరు~" అన్నాడాయన.

దాంతో సుశీల సందేహాలు పెచ్చుపెరిగాయి గాని పరిష్కారం గోచరించక, సిటీ వార్తాపత్రికలో చిన్న ప్రకటన ఇద్దామనుకుని మళ్లీ ఆయన సలహా అర్ధించింది.

"కొరివితో తల గోక్కోవడం అవుతుంది. దొంగ పర్సే అయితె, వాడో పిక్ పాకెట్ అయి ఉంటాడు గదా? వాడితో మీ పరిచయమేమిటి? ఎట్లా, ఎక్కడ, ఎందుకు? ఇన్ని ప్రశ్నలొస్తాయి.  లక్షా, తొంభై.. పోలీసుల్తో వ్యవహారం.

'దొంగ' అన్న పదం కర్ణకఠోరంగా ఉన్నది. అతని అమాయకమైన ముఖానికి గానీ, అతని తదుపరి ప్రవర్తనకు గానీ ఆ పదంతో పొంతన కుదరలేదు. చేసేది లేక దాన్నో కవర్లో వేసి సీలు చేయించింది. కాని మరిచిపోవడం సాధ్యమా? సాధ్యం కాకుండా చేసిన ఇంకో సంఘటన కూడా జరిగింది.

ఆ నెలలోనే సుశీలకు ప్రమోషన్ వచ్చింది. రీజినల్ ఆఫీసులో ఫారిన్ ఎక్సేంజి డిపార్టుమెంట్ హెడ్‌గా. ఆ హడావిడి పార్టీలు, తన కాగితాలన్నీ సర్దుకోవటాలు, కొత్త బ్రాంచి మేనేజర్‌కు అప్పగించటాలు. స్త్రీ సహజమైన తన జాగ్రత్తను క్షణం మరిచిపోయిందేమో? సీల్డు కవరు కిందపడి ఆ పర్సు విడిపోయి, అందులో ఏ మూల దాగి ఉందో ఒక చిన్న పాస్‌పోర్టు సైజు ఫోటో జారి వచ్చింది. ఒక మధ్యవయస్కురాలైన వితంతు స్త్రీది. ఆమెకు ఫోటోగ్రఫీ హాబీ. ఇంట్లో వంటగది పక్కనే ఉన్న పాంట్రీ గదిని డార్క్ రూంగా మార్చి అక్కడే ఫోటోలు డెవలప్ చేయడం. అందులో ఎన్లార్జిమెంటంటే ఆమెకు మహా ఇష్టం. ఇంటీనిండా తల్లి ఫోటోల ఎన్లార్జిమెంట్లు పది పన్నెండు దాకా ఉన్నాయి. ఈ ఫోటోను కూడా నాలుగైదు రోజుల్లో పెద్ద సైజుకు ఎన్లార్జ్ చేసి చూసింది. నలుపు తెలుపు  ఫోటో, అక్కడక్కడ టచింగ్ చేస్తూ పరీక్షగా చూసింది. నిస్సందేహంగా ఆ బొమ్మలో ఆ రోజు తను చూసిన పేద యువకుడి పోలికలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా ముక్కూ, కళ్లూ, నుదురు. అతని తల్లి ఫోటోలా ఉంది. హమ్మయ్యా? ఇది దొంగపర్సని పురుషోత్తంగరు రేకెత్తించిన అనుమానం పటాపంచలయిపోయింది. తన నవనాగరిక ఆలోచనలకు మళ్లీ పశ్చాత్తాపపడి వార్తాపత్రికలో ప్రకటన ఇవ్వాలనే నిశ్చయించుకుని ఫోన్ చెయ్యాలని డైరీలో గుర్తు రాసుకున్నది. కాని, ఆ మరుసటి రోజూ, ఆ మరునాడు, ఆవలి ఎల్లుండి పూర్తిగా తీరికలేని పని. పెద్ద బాధ్యత. రీజినల్ మేనేజర్ తరువాత పెద్ద పదవి గల సీటు. కొత్తగా అమర్చిన రెండు కంప్యూటర్లతో తను ఇప్పుడే అలవాటు పడుతున్నది. పెండింగ్‌లో ఉన్న  యాభై, అరవై అప్లికేషన్లూ, తను చార్జి తీసుకోకముందే బ్రాంచి ఆఫీసులనుంచి వచ్చినవి. సగం పైనే డిస్పోజు చేసి తిరిగి వాపసు చేసినా, పెద్ద మొత్తాలవి మాత్రం అలాగే ఉన్నాయి. ఈ ఇంపోర్టు లైసెన్సులతో విదేశీ మారకం అప్లికేషన్లు ఒక్కోసారి పెద్ద తలనొప్పి. రిజర్వు బ్యాంకుతో, కంప్యూటర్లతో, క్లయింట్లతో, బ్రాంచి మేనేజర్ల ఒత్తిడితో వారానికి పది రూపాలతో పంపవలసిన ఒకే రిపోర్టు. వంటి వాటితో తన చదువుకు పూర్తిగా చాలెంజ్ అనిపించుకునే పదవికి తనెందుకు ఎదిగిపోవాలి అని కూడా ఒకో క్షణంలో అనుకునేది.

తెలుగు సినిమాల్లో కథా సరళత కోసం, దర్శకుడి ఆలోచన, భావుకత్వ లోపం వల్ల అనేక యాదృచ్చిక సంఘటనలు ఒకే కాలంలో జరిగిపోతుంటాయి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లు ఇటువంటి లీలల్ని తమ అనుభవంగా పేర్కొంటుంటారు. ఆ మధ్యాహ్నం కాఫీ టైములో ఒక విజిటింగ్ కార్డు సుశీల ముందుంచిన ఎకౌంట్స్ అసిస్టెంటు "రీజినల్ బాస్‌గారు వీరి ఫైల్‌ను చూడమంటున్నారు" అని ఆ కార్డు క్లయింట్‌ను ప్రవేశపెట్టి వెళ్లిపోయాడు.

"ఖణ్వన కంప్యూటర్ కన్సల్తెన్సీ సర్వీసెస్: డా. కె. శ్రీనివాస శర్మ. ఎం.డి"

తేలిక రంగు ఉలెన్ సూటు. తేలిక తేనెరంగు చలవ కళ్లజోడు . చేతిలో ఎగ్జిక్యూటివ్ బ్రీఫ్‌కేస్.

"ఎక్స్యూజ్ మీ"

అతనే? తన టేబిల్ మీది నేమ్ ప్లేట్ చూస్తూ నిలబడిపోయాడు. 'మిస్ ఎస్.సుశీల. ఎం.కాం. సి.ఏ. ఐ.ఐ.బి.'

కుర్చీ చూపకుండానే "మీరా?" అన్నది.

కళ్లజోడు తీశాడు. ఆమె లేచి నుంచొని నమస్కారం చేసి, "గుర్తుపట్టారా? అని ప్రశ్నించింది.

చేతి రుమాలుతో ముఖం తుడుచుకుని "కొంచెం మారిపోయారు. గుర్తు పట్టాను. కూర్చోవచ్చా?" అని చిరునవ్వు నవ్వాడు.

"క్షమించాలి నుంచొనే ఉన్నారు."

కూచుని బ్రీఫ్‌కేస్ తెరచి ఆమె పుస్తకం  "మాతృస్మృతి" తీసి "మంచి కవిత్వాన్ని మరిచిపోయేవాళ్లు మూర్ఖులు" అంటూ అందించాదు.

సుశీలకు అశ్రుజలం మసకలో పుస్తకంలో అతను అండర్‌లైన్ చేసిన పంక్తులూ, మార్జిన్‌లో రాసిన పెన్సిల్ అక్షరాలూ అస్పష్టంగా కనిపిస్తున్నాయి.

"నన్ను క్షమిస్తానంటే ఇంకో మాట చెబుతాను. మీ పర్సు నా దగ్గరే ఉంది. స్కూటరు తాళం చెవులు కూడా . చాలా అపోహ పడ్డాను" అని అన్నది.

"అట్లాగా? ఎక్కడో పోయాయనుకున్నాను. మా అమ్మ స్వప్నంలో కన్పించి పోలేదని చెప్పింది. మీ పద్యంలో ఒక చోట జారవిడిచిన తాళపుగుత్తిని గురించిన ప్రస్తావన ఉంది" అని సౌమ్యమైన కృతగ్నతలు.

ఆమె కుతూహలంగా, ఆశ్చర్యంగా అతని వంక తేరిపార చూసి "ఎప్పుడొచ్చింది ఆ కల?" అని అడిగింది.

"పోయిన .. అంటే కిందటి గురువారం నాడు"

సుశీల ఆ రోజునే అతని మాతృమూర్తిని ఎన్లార్జ్ చేసింది. "మీ అమ్మగారిని నేను చూశాను"

"మా అమ్మనా? ఎప్పుడు? ఎక్కడ?"

"మా ఇంటికి ఒకసారి రాగలరా?"

అతను నవ్వి, "మరి మా అప్లికేషను సంగతి అంతేనంటారా?" అన్నాడు.

"సారీ!" ఆమె కాబినెట్ తెరిచి వెతికి ఖణ్వన కన్సల్టెన్సీ సర్వీసెస్ వారి పోర్టుఫోలియో తీసింది.

"ఒక్కమాటలో చెప్పమంటారా? మీ బ్యాంకు వారి అభ్యంతరాలను కొల్లేటరల్ లేదని రాశారు. ఇరవై ఒకటో శతాబ్దానికి పదమంటున్నారు. కాని అంతా డబ్బుతో ముడిపెడితే ఆ ప్రయాణం సాగదు. మానవ మేధకు డబ్బు కన్నా ఎక్కువ విలువ ఉంది."

ఆమె కాయితాలు చదువుతూనే "అయిదు లక్షలా?" అని స్వగతంగానే పైకి అన్నది.

"అవును."

"డన్. మీ కోల్లేటరల్ నేను" అని సుశీల లేచింది.

బయట అతని కారు డ్రైవర్ ముందుకు వచ్చి బ్రీఫ్‌కేసు అందుకున్నాడు. తనే డ్రైవర్ సీట్లో కూర్చుని "డైరెక్షన్లు చెప్పండి" అని అన్నాడు.

సుశీల మేనత్త వేడిగా వడ్డించిన భోజనం తిన్నాడు. తల్లి ఫోటో తీసుకుని సెలవు తీసుకుంటూ "మా అమ్మ ఆత్మ ఈ చిత్రంలో ఉందనిపిస్తున్నది. చాలా శ్రమ తీసుకున్నారు" అన్నాదు.

"మళ్లీ పర్సు మరిచిపోయి పోతున్నారు"

అతను వెనక్కి వచ్చి "ఆ ఫోటోగ్రాఫర్‌కు ఇవ్వండి. అందులో డబ్బు, కీస్ మాత్రం ఇచ్చేయండి" అంటూనే సాగిపోయాడు.

మళ్లీ వస్తాడని సుశీలకు తెలుసు. మళ్లీ టెలిఫోన్‌లో పిలుపు వస్తుందని అతనికీ తెలుసు. మాతృస్తవం తరువాత మాతృదర్శనమ్. తల్లులు దీవించిన ఏ బంధమైనా శాశ్వత బంధమేనని, మంగళప్రదమేనని వాళ్లిద్దరికీ తెలుసు.

***

ప్రముఖ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత మునిపల్లె రాజు గారికి ఆత్మీయ నివాళి గా మెడికో శ్యాం గారి జ్ఞాపకాలు- వ్యాసమధురాలలో! “అది కథకి నా డ్యూటీ

bottom of page