MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
'అలనాటి' మధురాలు
సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు | శ్రీనివాస్ పెండ్యాల
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
పూలదండ
మూలం: ఆర్. చూడామణి
అనువాదం: ఆర్.సుందరేశన్
ప్రియమైన రమ్యా:
నీ ఉత్తరం చదివి నాకు చాలా విచారం కలిగింది. నువ్వు నీ మనోవ్యధ, అంగలార్పు గాఢంగా తెలియజేసావ్. నా విచారం నీ దుఃఖం గురించి కాదు; నువ్వు ఇలాంటి అవస్థలో పడిపోయావనే...
ఇంతకీ నీ దుఃఖం ఏమిటి? చిన్నవయస్సులో నీ పిన్ని నిన్ను హింసపెట్టింది. మీ నాన్నగారు నీ దగ్గర ఒంటరిగా వచ్చి “రమీ, నాకోసం నువ్వు భరించాలమ్మా! నాన్నగారికి నువ్వంటే చాలా ప్రేమ! కాని పిన్నిని నేను తప్పుపెట్టలేను! నేనేమైనా అంటే, అంతే! ప్రళయం ముంచుకొని వస్తుంది! నాకోసం సహించుకో!” అని అన్నారేకాని నిన్ను నీ పిన్ని దౌర్జన్యంనుంచి రక్షించాలని అతను ఏమీ చెయ్యలేదు. నీకు నాలుగేళ్ళు నిండేవరకూ మీ అమ్మగారు ప్రాణంతో ఉన్నారు. అప్యాయంగా మైమరపించేలా నిన్ను కౌగిలించుకొని ఆవిడ నీ అరచెయ్యిలో ముద్దు పెట్టుకున్నది ఇప్పుడు నీకు ఏదో ఒక కలలాగ గుర్తుకి వస్తోంది. అవునా? ఆ
చేతిలోనే మీ పిన్ని నీకు వాతలు పెట్టిందనే జ్ఞాపకం నిన్ను కాల్చుతోంది. పెళ్ళయి, రెండు సంవత్సరాలవరకూ నీ జుత్తుని చిన్ని కృష్ణుడి శిఖలాగ అలంకరించి లాలించిన అదే పిన్ని తనకొక కొడుకు పుట్టగానే నిన్ను చిత్రహింస చెయ్యడం ఆరంభించింది! అవన్నీ మరిచిపోవడం ఎలా సాధ్యం?
ఆ తరువాత మీ ఆయన . . .
కాలేజీ వాదోపవాదాల్లో నీ వాచాలత్వం చూసి, ఆశ్చర్యపడి, నిన్ను పెళ్ళాడాలని అతను నిశ్చయించారు. అతను నిన్ను చూడడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ పిన్ని అన్న మాటలన్నీ నాకు చెప్పావ్.
“మీ అబ్బాయికి రమ్యా నచ్చిందన్న మాట! . . . నిశ్చయంగా మా ఇంటి రమ్యావేనా మీరంటున్నారు?”
“అవును.”
“అమ్మాయికి చామన ఛాయ . . . మీ అబ్బాయి దాన్ని దగ్గరగా చూసారా?”
“కాలేజీలో, వేదికలో రమ్య అందరిముందూ మాటాడడం విని వాడికి అదంటే బాగా పిచ్చి పట్టుకుందట!”
“కాపురం చేసే పిల్లకి చదువూ, మాటలమారితనం ఎందుకండీ? మొగుడుతో జగడమాడాలా ఏమిటి?”
“చూడ్డానికి అమ్మాయి చాలా అందంగా ఉందే!”
“వయసులోవున్న గాడిదకూడా అందంగా కనిపిస్తుంది.”
ఇవన్నీ నీకింకా బాగా గుర్తున్నాయి. నీ పిన్ని మూలంగా నువ్వెన్ని నిష్ఠురతలు అనుభవించావ్! ఆ తలవంపు, అవమానం నిన్ను ఇంకా వదల్లేదు . . . నీకిప్పుడు యాభై నిండాయి . . .
నాలుగు మాసాలముందు, నీకు యాభైయెళ్ళు నిండినప్పుడు మీ ఆయన నీకు మల్లెపువ్వు మొగ్గ డిసైన్ లో ఒక బంగారు హారం బహుమతిగా ఇచ్చారు.
“ఇవాళ నీకూ, మన దేశానికీ స్వర్ణోత్సవం. నా రమ్యాదేవికి ప్రియమైన అభివందనలు!”
అతని మొహంలో కాంతి, చిరునవ్వు, చోటు చేసుకున్నాయి; చాలా సంవత్సరాలకి ముందు మొట్టమొదట నిన్ను చూసి అతను అనుభవించిన అదే ఆకర్షణ ఇప్పుడూ కనిపిస్తోంది!
నువ్వు మొహం ముడుచుకున్నావని నాకు రాసావ్.
“అవునులెండి! మీరు బంగారు నెక్లస్ ఇస్తే నేనేం మోసపోను! ‘ఇది’, ‘అది’ అని మీ గారాబం ఎవరికి కావాలి? మాటల్లో పలికే ప్రేమ మనసులో ఉండాలి! మీ కళ్ళు అల్లాడడం నేను చూస్తున్నానుగా?”
అతని మనసులో ఏముందోగాని, నీ మనసులో ఊటి సంఘటన ఇంకా గుర్తు ఉంది.
అప్పుడు నీకు వయస్సు ఇరవైఐదు; నళిణి మూడేళ్ళ పిల్ల; నీ ఒడిలో నళిణి. నీ చుట్టూ ఉదకమండల శీతల వాతావరణం. దూరంలో అత్యుచ్చమైన యూకలిప్టస్ చెట్లు కనిపిస్తున్నాయి. నువ్వు Ooty Botanical Gardens లో ఉన్నావ్; అక్కడున్న పూలనీ, రంగులనీ, పేర్లనీ - Dahlia, Petunia, Gladiolus, చామంతి, గులాబి, Larkspur - అని వర్ణించుకుంటూ పోతే మనసుకి సంతోషం కొట్టుకొని వస్తుందని కాదు! సంతోషంకి కావలిసినది పరిపూర్ణత. కూర్చడం, తగ్గించడం దానికిలోబడవు.
అది ఎంత ఉల్లాసమైన అనుభవం! ఆ మిట్టలమీదున్న పొడుగాటి చెట్ల ఆకులమధ్య సూర్యకిరణాలు; ఆ పచ్చిక మైదానంలో పిల్లలు రంగు రంగుల చలితొడుగులతో, గులాబీరంగు బుగ్గలతో ఆడుకుంటున్నారు. వాళ్ళు పకపకమని నవ్వడం వినడానికి ఎంత హాయిగా ఉంది!
ఆ ముచ్చటలమధ్య నువ్వు కూర్చొనివున్నావ్; వన భోజనం సాగుతోంది.
మీ ఆయన బుట్టలోనున్న ఫ్లాస్కునుంచి వేడి తేనీరు ఒక కప్పులో నీకు నవ్వుతూ అందించారు:
“రమీ, నువ్వు బాగా అలసిపోయావ్! . . . Snacks తరువాత తిందాం . . . ముందు టీ తాగు.”
నువ్వు నీ చెయి చాపావ్. నిన్ను ఆరసించే అతని కళ్ళు ఒక క్షణం కదిలాయి. అతని చూపు ఎక్కడుంది? నువ్వూ నీ తల కొంచెం తిప్పి దిమ్ము పట్టే ఆ స్వరూపం చూసావ్. పచ్చని చీరలో ఆమె ఒక సౌందర్య యువతి; మల్లెపువ్వు వికసించినట్టు ఒక చిరునవ్వు; పక్కనున్నవారితో ఏదో మాటాడుతోంది; ఇంత దూరంలో ఆమె మాటలు వినిపించకపోయినా, ఆ మాటలూ మనోహరంగా ఉంటాయి అని అనిపించే వాలకం.
నీ మొహంలో నవ్వు మాయమై పట్టరాని కోపం చోటుచేసుకుంది. “నాకు టీ వద్దు, ఏ వల్లకాడూ వద్దు!” అని నీ బిడ్డని నేలమీద పోనిచ్చి గబగబమని వెళ్ళిపోయావ్.
నీ మనసులో ఆ ఊటి సంఘటన బాగా పాతుకుపోయింది. అందువలనే మీవారు నీ యాభైయో పుట్టినరోజు ఇచ్చిన బహుమతి గురించి మాటాడుతున్నప్పుడు “అతని మాటల్లో వినిపించే ప్రేమ అసలు అతని మనసులో ఉందా?” అని నీకు అడగాలనిపిస్తోంది.
అబ్బబ్బా, ఈ పాత జ్ఞాపకాలు నిన్ను ఎంత తీవ్రంగా నొప్పించాయి! ‘గోడని చూసి ఏడ్చి ముఖం కడుక్కున్నట్టు,’ అనే సామెతకి తగినట్టు నీకు నాదగ్గఱ మొఱపెట్టుకొని ఏడవాలని ఉంది. కాని, రమ్యా, నేనేం గోడ కాదు! నేను నీలో ఉన్న అద్దం! నువ్వు నిన్ను నాలో ఆనవాలుపట్టవచ్చు!
ఈ ఏడ్పు ఒక అవతారికలాగ; అవును, ఇది మరింత తీవ్రంగా పెరుగుతుంది . . .
నీ పిన్నికొడుకు నీకు ఉత్తరం రాసాడు; ఒక కొత్తమనిషిలాగవుంది అతని ధోరణి.
“అక్కయ్యా! గతకాలంలో ఏవేవో ఘటనలు చోటుచేసుకున్నాయి. అవన్నీ దయ చేసి జ్ఞాపకం చేసుకోవద్దు! నన్ను క్షమించు! నేను నీ తమ్ముడనే నా హక్కుని తీసి పారేయకు! ఆ హక్కుతోనే ఈ దీనుడు నీ ముందు ఈ నా కోరికని మనవి చేస్తున్నాను:
అమ్మకి అపాయకరమైన గుండె జబ్బు. కొన్ని సంవత్సరాలుగా మేం చేసిన చికిత్స ఇక లాభంలేదనిపిస్తోంది. “Valve లో దోషం ఉంది, ఆపరేషన్ తప్పితే మరేం మార్గం లేదు!” అని డాక్టర్లు ఏకవాక్యంగా అనేసారు . . .
నా ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నం అని నేను అనను; కాని నేను ధనవంతుడు కాను, పేదా కాను. పట్టుబట్ట మూసిన, పంటపాలలో కనిపించే దిష్టిబొమ్మలాగ మధ్యతరగతికి చెందిన ఒక కుటుంబంలో నేనొక సభ్యుడు. నాకు వచ్చే జీతంలో మినహాయింపు ఎక్కువగా లేదు. నిరంతర వైద్యసంబంధమైన ఖర్చులు భరించడానికి తప్పకుండా నావల్ల కాదు. ఐతే అందువలన నా వితంతు తల్లిని నేను కాపాడవద్దా? ఎలాగో ఇక్కడా అక్కడా అప్పులుచేసి డబ్బు పోగుచేసాను. కాని ఇంకా సుమారు 30,000 రూపాయలు కావాలి. దయచేసి నువ్వు ఆ రొక్కం ఇవ్వగలవా? నీ భర్త పెద్ద వ్యాపారి, ధనవంతుడని విన్నాను. ఈ రొక్కం నీకేం ఎక్కువకాదు. అడగడానికి నాకు హక్కులేదని నువ్వు అనవచ్చు. కాని నా తల్లి ప్రాణం కాపాడడానికి - ఒక మనిషిని కాపాడడానికి - ఈ అగత్యంలో - నువ్వు సాయం చేస్తావా, అక్కా?”
‘ఎంత సాహసం, పొగరుపోతుతనం!’ అని నువ్వు మండిపడ్డావ్. ‘ఇన్ని సంవత్సరాల తరువాత ‘అక్కయ్య’ అనే నెపంతో వీడికి నా సాయం కావాలట! ఏం, ఎందుకు? నా భర్త ధనవంతుడైతే నా సవతితల్లి చికిత్సకి అతని సొమ్ము ఖర్చు చెయ్యాలా?’
నిన్ను పీడించిన పిన్ని మరణావస్థలో ఉందనే వార్త విని నీ చెవులకి ఇంపుగా ఉంది. ‘చావనీ!’ అని పగ తీర్చుకునే ధోరణిలో అది మ్రోగుతోంది. అవును, నీకేం ప్రశ్నా లేదే? “డబ్బు ఇవ్వను!” అని తమ్ముడికి రాసేసి ఊరుకుంటే సరిపోను. దానికి బదులు నీ జీవితంలోని కొరతలన్నీ జాబితా పట్టి, నువ్వు పడుతున్న రోగాలు - రక్తపోటు, diabetes, menopause, గురించి వాపోవుతూ, “నేను పడిన కష్టాలు ఎన్ని! ఇప్పుడూ నేను బాధపడుతూనేవున్నాను. ఈ వెధవ డబ్బు కావాలని నన్ను తొందరపెటుతున్నాడు! ఇదేం న్యాయం?” అని నాకు ఉత్తరం రాసావ్. ఏం, ఎందుకు? నీ ఆలోచనలకి నా సమ్మతి కావాలనా? నా సమ్మతి నీకు అంత ముఖ్యమా?
కాని, రమ్యా, ఇవన్నీ వింటే నాకు రోతగా ఉంది. ఇన్ని సంవత్సరాలూ నువ్వు చెత్తాచెదరం పోగుచేసావనిపిస్తోంది. వీటితో నీ సహవాసం ఎలా సాగుతుందో నాకు అర్ధం కావటం లేదు. ఈ కంపు నీకు అసహ్యంగా లేదూ?
కటువు, ద్వేషం వలన వచ్చే ఆలోచనలన్నీ చెత్తతో సమానం. నీ మనసుని అలంకరించడానికి నీకు మరేం పువ్వులు దొరకనేలేదా? నీ జీవితంలో తీయని ఘటనలు, జ్ఞాపకాలు లేనేలేవా?
నీ అమ్మ ముద్దాడిన అరచెయిలో పిన్ని వాతలు పెట్టిందని రాసావ్. నీకు యాభై నిండినా నువ్వది గుర్తుచేసుకొని వాపోతున్నావ్. ఆ వరుస కొంచెం మార్చుకొని ఆలోచించు: నీ పిన్ని కాల్చిన అరచెయిని మీ అమ్మ ముద్దుపెట్టుకుంది; ఆ జ్ఞాపకం ఎంత మధురంగా ఉంది! చెత్తని తోసిపారేయ్! పువ్వుని ఎంచుకో!
తనకని ఒక కొడుకు పుట్టినంతవరకూ పిన్ని నిన్ను హింసించిందని ఎందుకు బాధపడుతున్నావ్? ఆ పిల్లవాడు పుట్టినంతవరకూ పిన్ని నిన్ను గారాబంగా చూసుకుందని గుర్తుచేసుకో! అది ఇంకొక పువ్వు . . .
పిన్నికి నువ్వంటే కటువు. కాని ఎడతెగకుండా మీ నాన్నగారు తన ప్రేమానురాగాలు నీమీద కురిపించారని గుర్తుచేసుకో. అతను రాత్రివేళ నీ దగ్గఱకి వచ్చి, నిన్ను ఎత్తుకోని, నీ కళ్ళు తుడిచి “అమ్మాయీ, నీ కళ్ళు తడిసిపోతే నా హృదయంలో రక్తం కారుతుంది!” అని ఆవేశంతో పాడి, నీకు కధలు చెప్పి, ఊరడించేవారు. అవన్నీ ఇప్పుడు భద్రపఱచుకో . . . అవును. “నాన్నగారు పిన్ని ఉరవడినుంచి నన్ను కాపాడలేదు!” అని బాగా గుర్తుచేసుకొని రాసావ్, కాని అతనిగురించి ఈ తీయని జ్ఞాపకం మరిచిపోయావ్.
నీ పిన్ని గాలిమాటలవలన నీ పెళ్ళి ఆగలేదే? నీ వాచాలత్వం చూసి నిన్ను మెచ్చుకున్నవారు ఇప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నారు. అతని చూపు అందమైన ఒక యువతిమీద పొరపడిందని రాసావ్. నీకేం పిచ్చా? అందం అని వస్తే దాన్ని ఎటువంటి సందర్భంలోనూ శ్లాఘించడం మానవుల స్వభావం. ఆ రోజు ఊటీలో, ఆ సమయంలో. పచ్చికబయళ్ళో, పచ్చని చీరలో కనిపించిన యువతి ఆ సౌందర్యంకి పరిసమాప్తిగా అతనికి కనిపించిదేమో? ఐనాకూడా, అతనికి నీమీదున్న చనువు, అన్యోన్యత మారలేదే? భ్రాంతిలేని అతని చూపు చూసి నువ్వు మొహం ముడుచుకున్నావ్. అందుకు బదులు ఆనాటి తీయని అనుభవం - అందమైన పరిసరాలు, వాతావరణం - నీ మనసులో కొంచెంసేపు నిలిచివుంటే ఎంత బాగున్ను! అప్పుడు నీ ఒడిలో పాపతో నువ్వు ఆనందమయమైన ధ్యానంలో ఉన్నావని నీ మనసుకి అనిపించనేలేదు! ఆ అనుభవంలో మీవారు అపేక్షతో అందించిన టీ ఒక అంశం అని నువ్వు గుర్తించలేకపోయావ్. పాపం, అతని కళ్ళు అల్లాడడమే నీకొక కటువైన జ్ఞప్తిగా నిలిచిపోయింది!
తీయని జ్ఞాపకాలనే మాట వస్తే ఇంకా ఎన్నో సందర్భాలున్నాయి. టైఫాయిడు జ్వరంతో నువ్వు మంచం ఎక్కినప్పుడు మీ ఆయన రాత్రీ, పగలూ, నీకు సేవ చేసారు; నువ్వడిగన ఒక పుస్తకంకోసం కుంభవర్షంలో ఊరంతా తిరిగి, ఎక్కడో, బజారులో, ఒక సందులో దాన్ని కొనితెచ్చి, నీ చెయిలో పెట్టి నీ చిరునవ్వు చూసి . . . ఇవన్నీ నీకు గుర్తు లేవు. ఊటిలోని ఆ కటువైన ఘటనే ఇన్ని సంవత్సరాలుగా నిన్ను ఆకట్టుకుంది! చెత్త పోగుచెయ్యడమంటే నీకెంత ఆపేక్ష!
రమ్యా, విను, నీకు ఏ కొరతా లేదు! వర్ధిల్లే జీవితం, ప్రియమైన భర్త, M.Sc., M.C.A. చదువు ముగించి, విదేశంలో Computer Engineer గా ఉద్యోగం చేస్తున్న కూతురు . . . ఎన్ని పువ్వులో, చూసావా?
కాని నువ్వు వాపోతున్నావ్. ఇప్పుడు నీ బాధ అంతా నిన్ను హింసించిన పిన్ని చికిత్సకోసం ఆమె కొడుకు నీ ఆర్ధిక సహాయం కోరుతున్నది నీమీద మోపిన ఒక అన్యాయం అనే నిందారోపణ. అవును, ఆమె ప్రాణం కాపాడాలంటే నువ్వెందుకు సాయం చెయ్యాలి? పిన్ని చస్తే నీకేం? నిజం చెప్పాలంటే అది నీకు శుభవార్త కదా?
ఐనా, వెంటనే నీ తమ్ముడికి నీ తిరస్కరణ తెలియజేయకుండా, నా ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలని నువ్వు ఆలస్యం చేస్తున్నావ్. అంటే నీ తీర్పుగురించి నీకే ఏదో చిన్న శంక ఉందన్నమాట. అవునా?
ఆపత్కాలం అని వస్తే మనం సాయం చెయ్యకపోతే అది మనసుని పీడిస్తూనే ఉంటుంది. ‘పిన్ని కన్ను మూస్తే నువ్వు సంతోషిస్తావు!’ అనే భావనకంటే ఆ బాధే నీకు హానికరంగా ఉందేమో?
“అలాగేం కాదు! నేను డబ్బు పంపించకూడదని నిశ్చయించాను!” అని కేకపెడుతూ నువ్వు కాగితం, కలంతో అతనికి ఉత్తరం రాయడానికి సిద్ధంగా ఉన్నావు.
రమ్యా, ఒక నిమిషం ఆగు! నేను చెప్పవలసినదేదో విన్నతరువాత ఆ ఉత్తరం రాయి . . . ప్లీజ్ . . . నాకోసం . . .
“సరేలే . . . చెప్పు”
“మనకి కొందరంటే ద్వేషం. వాళ్ళతో మనకి సహవాసం సాధ్యమా?”
“కాదు; ఎన్నడూ సాధ్యం కాదు.”
“రమ్యా, మనం మన తుదిశ్వాస విడిచేవరకూ మనతోనే జీవించాలి. అవునా?”
“అవును.”
“అంటే మనకి మనమీద విశ్వాసం ఎంత ముఖ్యం?”
“నువ్వేమంటున్నావ్?”
“నీ సంరక్షణ లేకపోవడం వలన ఒక మనిషి మరణించాడంటే, ఆ తరువాత నీ స్వాభిమానం దెబ్బతిన్నట్టేకదా? నీతో సహవాసం సాగడం ఎలాగ?”
కొంచెం సమయం నీ నోటినుంచి ఏ మాటా పెగల్లేదు. గోడని చూస్తూ కూర్చున్నావ్. ఆ తరువా కలంని మూసేసావ్. నుదుటని చెయితో తాకుతూ ఏదో ఆలోచిస్తున్నావ్.
రమ్యా, నిన్ను ద్వేషించే స్త్రీకి నువ్వు సాయం చేసావంటే అందులో నీకూ లాభం ఉంది: నీ మనసులో నువ్వు పోగుచేసుకున్న చెత్తాచెదరం అంతా ఒక తుడుపులో శూన్యమౌతాయి. ఆ పరిశుద్ధ జాగాలో నువ్వు ఇంతవరకూ తిరస్కరించిన పువ్వులు - మనోహరమైన జ్ఞాపకాలు - పదిలం చెయ్యవచ్చు. వాటిని ఒక పూలదండగా కూర్చవచ్చు. పిన్నికి అభయం ఇవ్వడంవలన నీ మనసులోని కటువు పోయి, నువ్వు అనుభవించే విముక్తి, ఆ పూలదండలో ప్రధాన అంశంగా - ఒక పారిజాత పుష్పంగా - శోభించుతుంది. నాకూ, ఈ అఘోరమైన దుర్గంధం పోయి నీ పరిమళ హృదయంలో కాపురముండడం కొంచెం వసతిగా ఉంటుంది.
నువ్వు మళ్ళీ కలం చెయిలో అందుకున్నావ్. కళ్ళద్దాలు సర్దుకుంటున్నావ్. ఏమిటి రాయబోతున్నావ్?
నీకు నా జవాబు చెప్పడంతో నా పని పూర్తయింది. ఇక నీ ఇష్టం. నేను సెలవు తీసుకుంటాను. రమ్యా, వస్తాను!
ఇలాగ,
నీ ప్రియురాలు,
రమ్య
********