MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
'అలనాటి' మధురాలు
సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు | శ్రీనివాస్ పెండ్యాల
మతము -విమతము
గురజాడ వెంకట అప్పారావు
(ఈ కథ ‘పెద్ద మసీదు’ అనే మరో పేరుతో ప్రసిద్ధి పొందిన ఆణిముత్యం)
(గోలకొండ పాదుషాహి పర్మానుల సీలు ఇచ్చట విప్పబడుటంజేసి దీనికి చికాకోల్ అను పేరు కలిగెనని యిచ్చటి వారందురు గాని అది నిజము కాదు. ఈ పట్టణము బహు ప్రాచీనమైనది. దీని పేరు శ్రీకాకుళం. ఒకప్పుడిందు శ్రీకాకుళేశ్వరుని క్షేత్రముండెను. దానిని పడగొట్టి షేరు మహమ్మదు పెద్ద మసీదును కట్టెను. నిజమిది)
ఒక సంవత్సరమున కార్తీక శుక్లపక్ష దశమి నాటి సాయంత్రము ఇద్దరు బ్రాహ్మలు ముప్పది యేండ్ల ప్రాయపుటతడొకడూను, ఇరువది యేండ్ల లోపు వయస్సు గల యతడొకడును తూర్పున నుండి పట్టణము దరియ వచ్చుచుండిరి.
నారాయణ భట్టు మోము అత్యంత సంతోషముతో వికసితమై యుండెను.
“పుల్లా, మా వూరొచ్చాంరా, యిట్టి వూరు భూ ప్రపంచంలో ఉండబోదురా”
కాళిదాసు అవంతి ని ఉద్దేశించి చెప్పిన మాటలు దీని యందు వర్తిస్తున్నాయిరా. యేమి నది! యేమి ఊరు! యేమి పాడిపంటలు! ఇక శ్రీకాకుళేశ్వరుడి క్షేత్రము. ఎట్టి క్షేత్రమని చెప్పను, అదుగో”
నారాయణ భట్టు నిశ్చేష్టుడై నిలిచి కొంత తడవు మాటాడకుండెను.
“యేమి స్వామీ, యేమి స్వామీ!” అని పుల్లం భొట్లు అడుగ “యేమి చెప్పనురా, పుల్లా! కోవెల మాయమయిపోయిందిరా! అని నేలపై కూలబడెను.
“చెట్ల చాటున ఉందేమో స్వామీ?”
“యే చెట్లు కమ్మగలవురా, పుల్లా! ఆకాశానికి నెత్తంటిన ఆ మహా గోపురాన్ని! మనస్సు చివుక్కుమని పోయిందిరా పుల్లా. యీ పట్నానికి, మనకీ రుణస్య ఇక చెల్లిపోయింది. రా తిరిగి కాశీకి పోదాం”
“గోపురం కోసవా ఇక్కడికి వచ్చాం స్వామీ? ఎడతెగని మార్గాయాసం పడి ఈ నాటికి దేశం చేరాం కదా. మళ్ళీ వెంటనే కాశీ పోడానికి యినప కాళ్ళు కావు గదా! లెండి. నా మాట వినండి! దాని సిగ్గోసిన గోపురం. గోపురవన్నదే మీకు కావలసి ఉంటే మా వూరు రండి.”
“ఓరి వెర్రివాడా, మీ వూరి గోపురం యెవరిక్కావాలిరా! నీకు బోధ పడదు. చిన్నతనంలో యెన్నడూ ఆ గోపురం మీదే ఎందుకా తీపులు. మా గోపురం కథా విశేషవైనది”
లేచి “శివ శివ! ఒరే, మీ వూరి గోపురం కూడా యీ మ్లేఛ్చులు పడగొట్టి ఉంటాఱ్ఱా!”
“మీకు యేమి ఉపద్రవం వచ్చింది. పడగొడితే ఆ పాపం వాళ్ళకే కొడుతుంది. ఆకలేస్తూంది. పెందరాళే వూరు చేరుదాం. లేచి అడుగెయ్యండి.”
“ఏం ఊరు- యేం చావడం! ఆకలంతా పోయిందిరా”
నారాయణ భట్టు లేచి మౌనం వహించి కొంత తడవు నడచెను. అంతట తలయెత్తి చూడ సంజ చీకటిలో నెలి వెలుగు కమ్మిన పడమటి ఆకాశమును దూసి రెండు మసీదు స్తంభములు కాళ్ళ యెదుట నిలిచెను. నారాయణ భట్టు మరల నిలిచి పోయి స్తంభముల పరికించుచు
“కాళేశ్వరుడి గుడి పగుల గొట్టి, మ్లేఛ్చుడు మసీదు కట్టాడు” అనుకొనెను.
“దేవుడెందుకూరకున్నాడు స్వామీ?”
“ఆ మాటే యే శాస్త్రంలోనూ కనపడదురా పుల్లా. మసీదు వేపూ పోదాం పద”.
“మసీదు సత్రం గానీ సత్రం అనుకున్నారా యేమిటి? పెందరాళే భోజనం మాట ఆలోచించుకోక పోతే ఉపవాసం తటస్థిస్తుంది.”
“అంత మహాక్షేత్రం పోయిన తరువాత తిండి లేక పోతే వచ్చిన లోటేమిటి?”
కాలుకు కొత్త సత్తువ పుట్టి గురువును, కాలీడ్చుచు శిష్యుడును గట్లంట, పుట్టలంట బడి మసీదు ద్వారం చేరిరి.
“ఏమి తీరుగా కట్టాడు స్వామీ, మసీదు”
“వాడి శ్రాద్దం కట్టాడు”
గడ్డము పెంచి యాబది సంవత్సరముల ప్రాయము గల ఒక తురక చిలుము పీల్చుచు కూర్చునియుండ నారాయణ భట్టు ‘సలా’ మని ఇట్లడిగెను. “భాయి, ఇక్కడే కదా పూర్వం శివాలయం వుంటూ వచ్చింది”. తురక ఒక నిముషమూరుకుని నోటితో పొగ నెగనూది “హా, సైతాన్కా ఘర్” అని యుత్తర మిచ్చెను.
“ఏం పాట్లొచ్చాయీ దేవుళ్ళకి!”
“దేవుళ్ళకి యే పాట్లూ లేవు. మన సాపాటు ఆలోచించరేం?”
కుఱ్ఱవాళ్లకి ఆకలి లావు సాయిబు గారూ! యీ వూళ్ళో చేబ్రోలు వారుండాలి; వారున్నారా? యీ దేవాలయం దగ్గరే వారి బస వుండేది. అనగా మీ మసీద్దగ్గిరే!”
ముసల్మాను స్వఛ్చమగు తెలుగు నవలంబించి “లేద” నెను.
“అయ్యో, మా పెదమావ రామావధాన్లూ, చిన మావ లక్ష్మణ భట్టు దేశాంతరగతులైనారా? మృతులైనారా?”
సాయిబు చేత నుండి చిలుము నేలరాలి ముక్కలై నిప్పులు నలుదెసల చెదర “నారాయణ” అని సఖేదముగా పిలిచెను.
“అయ్యో, నువ్వా మావా!”
(మరొక ప్రతిలో అవసరాల సూర్యా రావు గారి పాద పీఠికలో “కథ మధ్యలో ఆగిపోయింది” అనీ “రాసి కొట్టి వేసిన దాన్ని బట్టి నారాయణ భట్టు చిన మామ లక్ష్మణ భట్టు -లచ్చన్న- లేచి మేనల్లుణ్ణి కౌగలించుకో బోతాడు. కాని వద్దు వద్దంటూ నారాయణ భట్టు దూరం తొలుగు తాడు” అని ఉంది. పై కథలో ఆఖరి పంక్తి విశాలాంధ్ర వారి 1955 ముద్రణ లో ఉంది.